ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-20

శ్రీధర్ ఇంటర్మీడియేట్ పరీక్షల లో క్లాస్ ఫస్ట్ లేదా సెకండ్ గా వస్తున్నాడు. శ్రీధర్ కి పోటీగా క్లాస్ లో చంద్రహాస్ అనే కుర్రాడు ఒకతను ఉంటున్నాడు. అయితే వాళ్ళిద్దరికీ పోటీ చదువు విషయంలోనే. మిగిలిన అన్ని విషయాలలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. చంద్రహాస్ ది విజయవాడే కావటం తో రోజూ ఇంటినుండే కాలేజీ కి వచ్చేవాడు. అప్పుడప్పుడూ శ్రీధర్ ని చంద్రహాస్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. చంద్రహాస్ వాళ్ళ అమ్మా నాన్నా గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్లు. చంద్రహాస్ అన్న ఇంగినీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు.
ఓ రోజు చంద్రహాస్ క్లాస్ లో ఉండగా కరస్పాండెంట్ అతనిని పిలిచాడు. చంద్రహాస్ తిరిగి క్లాస్ లోకి వచ్చిన తరవాత,”ఏంటి విషయం?” అని అడిగాడు శ్రీధర్. తనకి ‘ఎస్ సీ’ స్కాలర్ షిప్ వచ్చిందని చెప్పాడు చంద్రహాస్.
శ్రీధర్ వాళ్ళ క్లాస్ లో నే రామ్మూర్తి అనే అతను ఉండేవాడు. వాడు కూడా మెరిట్ స్తూడెంటే. వాడో రోజు శ్రీధర్ ని పిలిచి వాడి చేతి మీది పచ్చబొట్టు చూపించాడు. “సుస్మిత” అని ఇంగ్లీషు లో రాసి ఉంది, వాడి మణికట్టు కింద. సుస్మిత అంటే క్లాస్ లో కల్లా అందం గా ఉండే అమ్మాయి.
“ఎందుకు రా, ఆ అమ్మాయి పేరు రాయించుకున్నావ్?” అన్నాడు శ్రీధర్.
“సుస్మిత ని ప్రేమిస్తున్నా రా!”, అన్నాడు రామ్మూర్తి.
నిజ జీవితం లో “ఎవరైనా ప్రెమిస్తున్నాను” అని చెబితే వినటం అదే మొదటి సారి శ్రీధర్ కి.
ఆ రాత్రి స్టడీ అవర్ లో కాన్సంట్రేషన్ అస్సలు కుదర లేదు,శ్రీధర్ కి. వాడి మనోఫలకం మీద ‘సుస్మిత ను ప్రేమిస్తున్నాను ‘ అని రామ్మూర్తి  చెప్పిన మాటలూ ఆ  తర్వాత సుస్మిత మొహమూ రిపీట్ అవ్వసాగాయి. వాడికి ఆ క్షణం లో చదువుకోవాలని ఉంది. కానీ లోపల్నించీ ఏ శక్తో వాడిని డిస్టర్బ్ చేస్తోంది. శ్రీధర్ కి భయం వేసింది. రెండు రోజుల తరవాత పరీక్షలు. “ఈ డిస్టర్బన్స్ ఇలాగే కొనసాగితే..ఎక్జాంస్ లో కూడా కాన్సంట్రేషన్ కుదరక పోతే?” ఈ ఆలోచన వచ్చింది వాడి మైండ్ లో కి. ఈ ఆలోచన  తో సుస్మిత గురించిన సంచలనం మరింత ఎక్కువైంది వాడి మైండ్ లో.
“ఏంటి?…సుస్మిత ని గానీ నేను కూడా ప్రేమిస్తున్నానా? “ఒరేయ్! పొరపాటున కూడా అలాంటి పని చెయ్యొద్దు. నువ్వు ప్రేమా దోమా అంటే చదువు చంకనాకి పోతుంది. ఇక ఎంసెట్ గురించి మర్చి పోవటమే. నాన్న నిన్ను కష్టపడి చదివిస్తున్నాడు. నాన్న నమ్మకాన్ని వమ్ముచేయొద్దు.”, తన కి తానే చెప్పుకొన్నాడు శ్రీధర్. “అయినా ప్రేమించి ఏమి చేస్తావు? పదిహేడేళ్ళ కే పెల్లిచేసుకోలేవు కదా? ఒక వేళ నాలుగైదేళ్ళు ఆగుదామను కొన్నా, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?”,ఇలా మధన పడ్డాడు వాడు.
మరుసటి రోజు క్లాస్ కి వెళ్తే సుస్మితా రామ్మూర్తీ బాగానే ఉన్నారు,లెక్చరర్ చెప్పే లెసన్ వింటూ. వాడిని మాత్రం ఆలోచనలు  చికాకు పరచ సగాయి, ప్రశాంతమైన చెరువు లో దుంగని ఎత్తి వేసినట్లు గా. దీంతో వాడికి తన మీద తనకే కోపం వచ్చింది. సుస్మితా రామ్మూర్తి ల మీద, వాళ్ళు ఏమీపట్టనట్లు గా లెసన్ వింటున్నందుకు, ఇంకా ఎక్కువ కోపం వచ్చింది.
ఈ ఆలోచనలతో కుస్తీ పడుతూనే వాడు పరీక్షలు రాశాడు. పరీక్షల్లో ఏకాగ్రత కుదర్లేదు వాడికి. కానీ తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది . క్లాస్ ఫస్ట్ మాత్రం ఈ సారికి చంద్రహాసే! సుస్మితను ప్రేమిస్తున్నాను అనే ఆలోచన వాడి బుర్రలోకి వచ్చినప్పుడు మాత్రం వాడి మనసూ శరీరమూ ఏకమై దూది పింజలా గాలి లో తేలియాడిన అనుభూతి కలిగేది.

పరీక్షలైన తరువాత, వాళ్ళ ఊరెళ్ళాడు శ్రీధర్. ఒక రోజు కాలవ లో ఈత కొట్టి వస్తుంటే,హఠాత్తు గా సుస్మిత గుర్తొచ్చింది. వెంటనే వాడికి ఇన్ని రోజులూ సుస్మిత గురించి మరిచిపోయిన విషయం కూడా అర్ధమైంది. దాంతో వాడు  చాలా సంతోష పడ్డాడు, సుస్మిత తన మైండ్ లో నుంచీ వెళ్ళిపోయినందుకు. వాడికే గనుక ఒక ముప్పై యేళ్ళు వుండి వుంటే తెలిసేది, “తను ఇన్-ఫాట్యుయేషన్ నుంచీ బయట పడ్డానని”. వాడికి మనసు కి పట్టిన ముసురు తొలకరి కురియ కుండానే తొలగి పోయింది. దానికి కారణం వాడి అమ్మ ప్రేమ అనే చిరు గాలి కావచ్చు, వాడి నాన్న లో ప్రకాసించే ప్రశాంతత కావచ్చు.
సెలవలయ్యి కాలేజీ కి మళ్ళీ శ్రీధర్ వెళ్ళే సరికి, మండల్ కమీషన్ గొడవలు మొదలయ్యాయి. దేశం లో కుల రాజకీయాలు ఊపందుకున్నాయి.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-19

నాకు ఆఫీస్ లో పని ఎక్కువవ్వసాగింది.  రాత్రి ఇంటికొచ్చే సరికి పన్నెండు దాటుతోంది. సరళ ని ఆ టైం లో లేపటం ఇష్టం లేక నేనే నా దగ్గరున్న డూప్లికేట్ కీ తో తలుపు తెరుస్తాను. స్నానం చేసి భోజనం చేసి పడుకొనేటప్పటికి  రాత్రి రెండవుతుంది. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలి. ఒక్కో సారి వీకెండ్స్ లోకూడా ఆఫీస్ కి వెళ్ళవలసి వస్తోంది.
సరళా నేనూ ఇప్పుడు వేరే వేరే ప్రాజెక్టు ల లో పని చేస్తున్నాం. సరళ వాళ్ళ ప్రాజెక్టు లో పని తక్కువ. నేనెంత కష్టపడ్డా మా ప్రాజెక్టు పై కస్టమర్ నుంచీ కంప్లెయింట్స్ వచ్చాయి. దానితో ప్రాజెక్ట్ లో అందరికీ అప్రైజల్ లో రేటింగ్స్ తక్కువ  వచ్చాయి. మా ప్రాజెక్ట్ సరళ వాళ్ళ ప్రాజెక్ట్ కంటే కష్టం అన్నది వేరే విషయం. సరళ కు మాత్రం మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆమె కు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
సరళా నేనూ సాలిగ్రామం లో లోన్ మీద ఒక అపార్ట్ మెంట్ కొన్నాం. నెల కి పద్నాలుగు వేల ఈ ఎం ఐ. నా జీతం లోంచీ కట్ అవుతోంది. ఒక కారు కూడా కొన్నాం. దాని ఈ ఎం ఐ. సరళ జీతం లో నుంచీ కట్ అవుతోంది.
నేను నెమ్మది గా లావెక్కసాగాను. ఎక్సర్ సైజ్ చెయ్యటానికి టైం దొరకట్లేదు. వీకెండ్స్ లో ఆ ట్రాఫిక్ లో కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్ళే కంటే ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకోమని శరీరం మారాం చేస్తుంది.  ఎప్పుడన్నా ఓ గంట బయటికి వెళ్తే ఆ  దుమ్మూ పొగా ట్రాఫిక్ చెమట ల వలన ఇంటికొచ్చిన తరవాత పూర్తిగా అలిసిపోతున్నాం.
జీవితం రొటీన్ గా సాగిపోతోంది. మా ఇద్దరికీ జీవితం లో ఏదో వెలితి కనిపిస్తోంది. సరళ పిల్లల్ని కందాం అని సజెస్ట్ చేసింది. అందుకోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాం. ఐదు నెలల తరవాత ఉపయోగం లేక ఒకగైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆమె సరళ తో ఒంటరిగా మాట్లాడుతూ మధ్యలో నన్ను పిలిచి అడిగింది,”ఎన్ని సార్లు ఇంటర్ కోర్స్ చేసుకుంటారు?” అంది.
నేను ఎన్నిసార్లో చెప్పాను.
“అదేమిటి? ఈ వయసు లో ఇంటర్ కోర్స్ అంటే ఇష్టం లేక పోతే ఎలా?” అందామె.
“ఇంటరెస్ట్ లేక కాదు మేడం,రెస్ట్ లేక”, అని గునిశాను నేను.
“అదీ విషయం అని,ఏవో విటమిన్ టాబ్లెట్లు రాసిచ్చింది,ఆ టాబ్లెట్లవలన  అలిసిపోము అన్నట్లు గా.
ఎప్పుడైన మా కొలీగ్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అది కూడా తెలుగు కొలీగ్స్ ఇంటికి మాత్రమే. సిటీ లో అంతా టచ్ మీ నాట్ వ్యవహారం.  ఎంత సేపూ రాజకీయల గురించో సినిమా ల గురించో మట్లాడుకొవటం తప్ప, జనాలు ఒకరి గురిచి ఒకరు మనసు విప్పి మాట్లాడుకొనేది తక్కువ.
వీక్ డేస్ లో చాలా వరకూ బయటి హోటల్ నుంచీ భోజనాలు  తెచ్చుకొనే వాళ్ళం, సాయంత్రం వండుకొనే ఓపిక లేక. మధ్యాహ్నం ఆఫీస్ లోనే భోజనం. సరళ కి పెళ్ళి కి ముందు వంట చేసిన అనుభవం లేదు. ఆమె వంట ట్రై చేసేది, కానీ ఆమెకి కూరలు కుదిరేవి కావు.కానీ కూర వడ్డించిన వెంటనే అడిగేది “కూర ఎలా ఉంది?” అని. నేను ఉప్పుఎక్కువైంది అనో, కారం తక్కువైంది అనో అంటే ఆమె మొహం చిన్న పోయేది. ఇక తరవాతి నుంచీ సరళ ఎప్పుడడిగినా “బాగుంది” అని చెప్పడం నేర్చుకొన్నను. ఎప్పుడన్నా ఊర్లోని అమ్మ చేతి వంట గుర్తుకు చేసుకొంటే సరళ నిష్టూరాలడేది, “మరి పల్లెటూరి అమ్మాయినే చేసుకోలేక పోయావా? నన్ను ఇష్టపడి మరీ ఎందుకు చేసుకున్నావ్” అనేది.
నాకు డిగ్రీ రోజుల నుంచీ గరిట తిరగేసిన అనుభవం ఉండతం తో, అప్పుడప్పుడూ సరళకు వంట లో సహాయ పడుతున్నాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ కంపడటంలేదు.
సరళ తో సహజీవనం వలన నేను మాట్లడే భాష లో కొంచెం అరవ యాస  వచ్చింది. అదే విధం గా సరళ తెలుగు వొకాబులరీ ఇంప్రూవ్ అయ్యింది. అయితే తెలుగు వంటలరుచి అరవ వంటలకి మాత్రం రాలేదు.  కొళంబు కి గోంగూర రుచి ఎలా వస్తుంది. కొళంబు రుచే గొప్పగా అనిపించాలంటే మాత్రం నేను అరవాడిగా పుట్టాల్సిందే!

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?

ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..

మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి  ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి.  అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి.  కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది.  వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్.  అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.

ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).

మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు  దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్.   వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!

భావోద్వేగాలు ఎన్నిరకాలు?

భావోద్వేగాల గురించి నెట్ లో వెతుకుతూ ఉంటే, నాకు కనపడిన ఒక interesting document(English) కింద నుంచీ దించుకోండి. .
నేను శోధించిన ప్రశ్న: “భావోద్వేగాలు మన జ్ఞాపకాల(memory)లో స్టోర్ అవుతాయా?”
సమాధానం: కావు. భావోద్వేగాలు వర్తమానం లోని సంఘటనలకి మన మనస్సూ శరీరం చేసే ప్రతిక్రియ మాత్రమే. అయితే భావోద్వేగాలకు సంబంధించిన సమాచారం (information) మాత్రం మన జ్ఞాపకాలలో నిక్షిప్తం(store) అవుతుంది.  అంటే అది ఏ రకమైన భావోద్వేగం..కోపమా, భయమా, సిగ్గా మొదలైన గుర్తులు (symbols) మాత్రం మన మెమరీ లో ఉంటాయి. భావోద్వేగాలు కూడా మన జ్ఞాపకం లో భాగమైతే అప్పుడు జరిగిన సంఘటనల గురించి మన మానసిక అనుభవం(జ్ఞాపకం తెచ్చుకోవటం) “వీడియో ప్లే బ్యాక్” లా ఉంటుంది. అంటే ఆటే సమాచారం మిస్ కాదు. మళ్ళీ మనకు పాత అనుభవం మానసికం గా యధాతధం గా అవుతుంది.

theoriginofemotions

Creativity -Randomness Vs Deterministic

Creativity -Randomness Vs Deterministic

Seemingly random events can have deterministic causes.

Let’s take the example of a football game. The time, at which ball hits the goal, looks random. It is almost impossible to predict how many times the ball hits the gaol on one side. Yet, we know that it will be a result of the game played by both sides of the players. So if we know the relative efficiencies and game plans of both sides the probability of guessing how many goals may hit the goal post increases. The probability of guessing goal increases as is the information about its cause increases. If we know in what direction the ball moves at each moment of the game in advance, we can predict about the goals that both sides will do. The number of goals may look random, but they can be calculated based on certain information.

Similarly an invention can be a result of seemingly random thoughts (similar to Brownian motion) striking correctly in the mind of the inventor. Alternately, it can also be a result of the external circumstances the inventor undergoes.

The trigger for creativity can be a chance event with in our understanding, like the trigger for goal that was scored.

The trigger can be from outside our understanding like the “flash out of a blue in a scientist’s mind”, which does not seem to originate from the thoughts in his mind.

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-18

శ్రీధరూ వాడి ఫ్రెండ్సూ ‘కలియుగ పాండవులు ‘ సినిమా కి వెళ్ళారు. ఆ సినిమా లో వెంకటేష్ అగ్గిపుల్ల గీసే పద్దతి వాడికి నచ్చింది. ఇంటికొచ్చిన తరువాత అలా గియ్యటం బాగా ప్రాక్టీస్ చేశాడు వాడు. వాడి ఫ్రెండ్స్ ని పిలిచి చూపించాడు గొప్పగా. తరవాత అందరూ కలిసి హై స్కూల్ గ్రౌండ్  కి వెళ్ళారు క్రికెట్ ఆడటానికి. ఆట మధ్య లో కృష్ణా రావు వచ్చి శ్రీధర్ ని ఇంటికి పిలుచుకొని పోయడు. మామూలు గా ఎంతో ప్రశాంతం గా ఉండే కృష్ణా రావు,  అప్పుడు మాత్రం కోపం తో ఊగి పోతున్నాడు. చింత బరికె ఒకటి తీసుకొని చిన్నూ గాడి చెమడాలు ఊడగొట్టడం మొదలెట్టాడు. సీతమ్మ గారు వచ్చి ఆపే దాక వాడి వళ్ళు వాతలు దేలుతూ నే ఉంది.
“చిన్నపిల్లాడు, ఆణ్ణి ఆ రకం గా కొడితే ఎలా రా అబ్బాయ్?” అని అడిగిందామె కృష్ణా రావు ని.
“వడ్ల బస్తాలు మొత్తం కాలి పోయాయి. అగ్గిపుల్లలు గీసి అడాదు..చింతపండు గాడు చెప్పబట్టీ సరిపోయింది. లేక పోతే మొత్తం మసి అయ్యిపోయేది”
“అయితే మాత్రం చిన్నపిల్లాణ్ణి అట్టా బాదితే ఎలా?” అని కృష్ణా రావు ని గదిమిందామె.
కృష్ణా రావు,” ఆ… పిల్లాడు, బడితె లా పెరగగానే సరి కాదు.జ్ఞానం ఉండాలి” అన్నాడు.
దానికి సీతమ్మ గారు,” నువ్వు ఆడి వయసు లో ఇంకా ఉలిపి పనులు చాలానే చేశావు. కాస్తంత కోపంతగ్గించుకొని ఆలోచించుకో”, అంది.
శ్రీధర్ సీతమ్మ గారి మాటలను విని ఏడుపు మరింత పెంచాడు.
సీతమ్మ గారు,”నిప్పుతో ఆటలాడితే ఎట్టా రా నాయనా?” అంది.
దానికి వాడు,”ఇంకెప్పుడూ చెయ్యనే నాయనమ్మా” అంటూ రాగం తీశాడు.
“సరే సరే.., అన్నీ తాత పోలికలే, వెంటనే ఒప్పుకున్నావు..చాలు”,అని ముద్దు పెట్టుకొంది వాడిని.
*******************
శ్రీధర్ కి టెంత్ క్లాస్ మార్కులు బాగానే వచ్చాయి. విజయవాడ లో ని ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు తక్కువ ఫీజు కే శ్రీధర్ ని చేర్చుకొన్నారు. అప్పటి దాకా ఇల్లు వదలని శ్రీధర్  అక్కడ కొన్నాళ్ళు బెంగ పడ్డాడు. అక్కడి కాలేజీ లో పిల్లలు చేసే చేష్టలు వాళ్ళ వయసుకి మించినవి గా అనిపించాయి శ్రీధర్ కి. ఇదే వెంకటాపురం లో అయితే వాళ్ళను ముదుళ్ళు అనే వాళ్ళు. “బాబాయ్ జ్యోతీ టాకీస్ లో మంచి సీనులున్న సినిమా అడుతోంది. వస్తావా?” అని వాడిని ఎవడన్నా అడిగే వాడు. కానీ వాడికి అవన్నీ తన వయసుకి మించిన పనులు గా అనిపించాయి.
శ్రీధర్ అక్క కవిత కి డిగ్రీ  పూర్తి చెయ్య  గానే పెళ్ళి అయిపోయింది. పెళ్ళికొడుకు మహీధర్ ఉయ్యూరు లో లెక్చరర్ గా పని చేస్తాడు. కృష్ణా రావు పెళ్ళయ్యే ముందే కాబోయే అల్లుడి తో చెప్పాడు, “నాకు అమ్మాయయినా అబ్బాయయినా ఒకటే. నాకున్న దాంట్లో అమ్మాయికి సగం ఇస్తాను. మిగతాది నా తదనంతరం అబ్బాయికి వెళ్తుంది”
పెళ్ళి లో శ్రీధర్ కి బాగా బోర్ కొట్టింది. లేనినవ్వు ని మొఖానికి పులుముకుని, “బాగున్నారా? ఎలా ఉన్నారు?” అని మాట్లాడే వాళ్ళని చూస్తే వాడికి కాలింది.
శ్రీధర్ వాళ్ళ బావ వాళ్ళ అక్కని బాగానే చూసుకొనే వాడు. కొన్ని రోజుల తరువాత కవిత కి కూడా టీచర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఇంట్లో ఆమె పని మాత్రం తగ్గలేదు. మహీధర్ కాలేజీ నుంచీ ఇంటికి వచ్చిన వెంటనే వాలు కుర్చీ వేసుకొని పొద్దున చదివిన పేపరే మళ్ళీ తిరగేస్తూ, “కవితా కాఫీ పెట్టవోయ్!” అనేవాడు. మన ఫెమినిస్టులు కొంచెం కిందకి దిగి కవిత లాంటి వాళ్ళ మీద దృష్టి పెడితే బాగుంటుంది.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-17

దారి లో హూవర్ డ్యాం చూసుకొని లాస్ వేగాస్ వైపు బయలుదేరాం. హూవర్ డ్యాం వేగాస్ అంతటికి నీళ్ళు సప్లై చేస్తుంది. నెవడా ఎడారి లో బడాయి గా బాగానే కట్టాడు  అమెరికా వాడు, ఈ లాస్ వేగాస్ నీ, దాని గొంతు తడారి పోకుండా ఆ హూవర్ డ్యాం నీ.
లాస్ వేగాస్  లో  ట్రోపోస్పియర్ ఫ్రీ ఫాలూ, మూజికల్ ఫౌంటైన్సూ చూడటం అయ్యాక,కాసినో కి వెళ్ళాం.నేను ముందు కొన్ని డాలర్లు గెలిచాను.తరవాత దానికి రెండు రెట్లు పోవడం తో,  బ్రతుకు జీవుడా అనుకొంటూ కాసినో నుంచీ బయటపడ్డాను.బాలా మాత్రం ఒక్కసారే ఆడి డెబ్భై ఐదు డాలర్లు గెలుచుకొన్నాడు.నాకేమో డబ్బుల తో పాటు లాస్ వేగస్ అంటే ఇంటరెస్ట్ కూడా పోయింది.
ముందు దిసమొలల ప్రదర్శనలు చూద్దాం అనుకొన్నా గానీ, బాలా గాడు ఆమాటే ఎత్తలేదు. పెళ్ళి కాని వాడు వాడే కాం  గా ఉంటే,నేను బయట పడటం బాగోదని నేనూ  కాం  గా ఉండి పోయాను. ఇక ఒక క్యూబన్ రెస్టారెంట్ లో అరటి కాయ తో చేసిన పిజ్జా తిని పాసడీనా కి బయలుదేరాం బాలా నేనూ.
*******************
నాకు అమెరికన్ ఫార్మాలిటీస్  అర్ధం కాలేదు. ప్రతి రోజూ ఆఫీస్ లో ఎంటర్ అయ్యేటప్పుడు, గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్ “హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే”,అనేవాడు. అలానే ఆఫీస్ నుండీ ఇంటికి వెళ్ళేటప్పుడు,”హౌ వజ్ యువర్ డే?” అనే వాడు. కానీ అతని ముఖం లో మాత్రం “నువ్వేం చేసినా నాకేంటి?” అనే ఒక యాంత్రికమైన భావం కనపడేది. అటువంటప్పుడు ఫార్మాలిటీ కోసం ఏదో ఒకటి అనడం ఎందుకు? నాకు ఈ విషయం అర్ధం కాలేదు.బహుశా ఈ ఫార్మాలిటీ కి మూలాలు అమెరికన్ ఇండస్ట్రియల్ కల్చర్ లో ఎక్కడో ఉండి ఉంటాయి. నాకు అర్ధం అవ్వక పోవటానికి మూలాలు మా వెంకటాపురం లో ఉండి ఉంటాయి.
అలానే మేముండే అపార్ట్మెంట్స్లో ఒక ఇండియన్ ఫ్యామిలీ ఉంది. ఎప్పుడైనా వాళ్ళు ఎదురు పడితే నాకు ప్రాణం లేచి వచ్చేది.నేను పలకరింపు గా నవ్వి, హలో చెప్పేవాడిని.  వాళ్ళిద్దరిలో భర్త మాత్రం నా ‘హలో, కి సమాధానం గా తన పెదాలను బిగించి,కిందికి వంకర తిప్పెవాడు.  “నేను పలకరిస్తుంటే వీడు నన్ను అవమానిస్తున్నాడేమిటబ్బా!” అని అనుమానం వచ్చేది నాకు. తరవాత బాలా చెప్పాడు,” అమెరికన్స్ ఫార్మల్ గా హలో అని అలా అక్నాలెడ్జ్ చేస్తారని”.  ఫార్మల్ గా అంటే “నువ్వెవరివో నాకనవసరం” అనా అర్ధం?
****************
మా సేల్స్ టీం వాళ్ళు ఇండియాలో మా టీం గురించి క్లయింట్ కి బాగానే బిల్డ్ అప్ ఇచ్చినట్లున్నాడు. క్లయింట్ ఎక్స్-పెక్టేషన్స్  ఎక్కడో ఆకాశం లో ఉన్నాయి, మా టీం ప్రతిభ మాత్రం పాతళం లో ఉంది. నాకు మేము ఇండియా లో చెయ్యబోయే ప్రాజెక్ట్ గురించి తలుచుకుంటే చెమటలు పడుతున్నాయి.
నాకు సరళ మీద బెంగ బిల్డ్-అప్ కా  సాగింది.ఫోన్లూ చాట్ లూ నా బెంగ ని తీర్చటం మానేశాయి. ఆఫీస్ లో కూడా ఇల్లు గుర్తుకొస్తోంది. ఇండియా వెళ్ళటానికి రోజులు  లెక్కపెట్టసాగాను. క్యాం కోడర్, కొన్ని పెర్ఫ్యూంసూ షాపింగ్ చేశాను.  బాలా ఎయిర్పోర్ట్ కి వచ్చి సెండ్ ఆఫ్ చేశాడు.
**********************
మద్రాస్ “యార్ పోర్ట్” కి సరళా వాళ్ళమ్మా వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు.  ప్రయాణం చాలా నీరసం గానూ,చికాకు గానూ జరిగింది.  ప్లేన్ లో ఎంత అలిసిపోయానంటే, ప్లేన్ లో ఉన్న అందమైన అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడలేదు. మరి వాళ్ళు అందమైన అమ్మాయిలని ఎలా తెలిసింది అంటారా? అది వేరే విషయం..నేను చెప్పొచ్చేదేమంటే,” నేను అందమైన అమ్మాయిలను అప్రిషియేట్ చెయ్యని ఒక అరుదైన సందర్భాలలో అది ఒకటి..     ఇంటికొచ్చాక జెట్ లాగ్  ( జెట్ లీడ్ అనాలేమో?) తీరడానికి ఒక రెండు రోజులు పట్టింది. ఇంకో మూడు రోజులు ఆఫీస్ కి సెలవుపెట్టి సరళ మీద బెంగంతా తీరిపోయేలా ఇంట్లోనే ఉన్నాను.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?

తెలుగు అంతర్జాలం లో తెలంగాణా, స్త్రీ వాదం , కులం వంటి అనేక విషయాల మీద వాదోప వాదాలూ, చర్చలూ జరుగుతుంటాయి. ఈ చర్చలలో తరచూ అభిప్రాయాలే వాస్తవాలు గా చెలామణి అవుతున్నట్లని పిస్తుంది. ఎదుటి వారి అబిప్రాయాలను గౌరవించేవారి సంఖ్య చాలా తక్కువ.
స్టాటిస్టిక్స్ లో sampling theory అని ఒక సిధ్ధాంతం ఉంది. దానిని ఇక్కడ వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి.
ఒక పెద్ద బుట్టలో నాలుగు రంగుల గోళీలు , ఒక్కో రంగు గోళీలూ 1000 సంఖ్యలో ఉన్నాయనుకొందాం.బుట్టలోని ఈ అన్ని రంగుల గోళీలనూ కలగాపులగం గా కలిపేశామనుకొందాం. ఈ బుట్ట మన సమాజం వాస్తవం గా ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది.గోళీల రంగులు సమాజం యొక్క లక్షణాలైన సమానతా, అధికారం, అభివృధ్ధీ మొదలైన లక్షణాలను ప్రతిబింబిస్తాయనుకొందాం.
మనం ఈ బుట్టలోంచీ ఒక గుప్పెడు గోళీలు తీస్తే ఆ గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉండవచ్చు. దీనిని మనం ఒక biased sample అంటాం.బుట్టలో అన్ని రంగుల గోళీలూ సమాన సంఖ్యలో ఉన్నప్పటికినీ మనం తీసిన గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉన్నాయి. మన గుప్పెడు గోళీలూ మన వ్యక్తి గత అనుభవాన్ని సూచిస్తాయి.అయితే ఈ అనుభవం లో కూడా patterns ఉంటాయి.నల్ల గోళీల బరువు మిగిలిన రంగు గోలీల బరువు కన్నా ఎక్కువ అనుకొందాం.  బుట్ట కిందికి నల్ల గోళీలు ఎక్కువ చేరుతాయి. తరువాత అక్కడ (బుట్ట అడుగు) నుంచీ తీసిన sample లో నల్ల గోళీలే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ కి, ఒక గ్రామీణ దళితుడి అనుభవం లో ‘కుల వివక్ష’ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మన పక్క వ్యక్తిని ఇంకో గుప్పెడు గోళీలు తీయమంటే అతని గుప్పెటకి తెలుపు రంగు గోళీలు ఎక్కువ రావచ్చు. అలానే ఒక పెద్ద గిన్నె తో గోళీలను తీసినట్లైతే ఆ గిన్నెలోని వివిధ రంగుల గోళీల సంఖ్య మధ్య అంతరం తగ్గుతుంది. అంటే sample పెద్దదయిన కొద్దీ అది వాస్తవ పరిస్థితికి దగ్గరవుతుందన్నమాట.  అంటే ఒక విషయం లో మన వ్యక్తిగత అనుభవం పెరిగే కొద్దీ, ఆ విషయం పై మనం వాస్తవానికి చేరువవుతున్నామన్నమాట.అయితే, ఒక attitude తొ మొదలుపెట్టి దానికి విరుధ్ధమైన విషయాలను తమ మది లోకి రాకుండా తిరస్కరిచే వారు, అ విరుధ్ధమైన విషయాలలో ముందుకు సాగరు. ఆ విషయాలలో వారికి అనుభవం ఉన్నా , ఆ విషయాలలో వారు ఎదగరు.

గుప్పెట తో గోళీల sample తీసెటపుడు, మనం తెలివిని ఉపయోగించనవసరం లేదు. కానీ అభిప్రాయాలను ఏర్పరచుకోవటానికి మన అనుభవాలను తెలివితో విశ్లేషించి more objective అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.

ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు.. ఒక విషయం పై ఎవరి అనుభవం ఎంతో మనకు తెలియదు. కొంతమంది wishful tinking తొ మాట్లాడుతారు.ఆదర్శాల , సిధ్ధాంతాల రంగు కళ్ళజోడులు పెట్టుకొని మాట్లాడుతారు.అనామకం గా దుర్బుధ్ధి తో దుర్భాషలాడతారు,వారి భౌతిక మనుగడ కి ముప్పు లేదు కా బట్టీ! వారి వారి వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు బట్టి మాట్లాడుతారు.ఇంకొందరు వారికున్న ఇతరేతర లాభ నష్టాలను(vested interests) బట్టి, చర్చలలో వాదాలు లేవ నెత్తుతారు. ఒక మనిషికున్న ఇటువంటి బలహీనతలన్నిటినీ పక్కన పెడితే, మన అభిప్రాయం అనేది మన అనుభవం అనే biased sample నుండీ పుడుతుంది. అలానే ఎదుటి వారి అభిప్రాయాలు కూడా biased అయి ఉంటాయి. ఈ అభిప్రాయాలు వాస్తవాన్ని ఎంతవరకూ ప్రతిబింబిస్తాయి అనేదానికి ఒక కొలబద్ద లేదు.

కాబట్టీ, ఒక విషయం లో మన అభిప్రాయం ఎంత కరక్టో, ఎదుటి వారి అభిప్రాయం కూడా అంతే కరక్ట్.
శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కొంత వాస్తవానికి దగ్గరగా రాగలవు. శాస్త్రం కూడా తన పరిశోధనల ఫలితాలలో కొంత bias ను అంగీకరిస్తుంది. అది వేరే విషయం.
అందుకే మనకు మన అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనిపించినా, అది కేవలం మన “అభిప్రాయం” మాత్రమే అని గుర్తెరిగి, ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించటం మంచిది.
ఈ పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే :-) . మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండేం..?

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-16

విజయవాడ లో దుండగులు ఒక ‘ఎం ఎల్ యే’ ని హత్య చేశారు. దాని వలన కృష్ణా  గుంటూరు జిల్లాల లోని రెండు సామాజిక వర్గాలు (కులాల ముద్దు పేరు) దాడికి దిగాయి. ఆ రెండు జిల్లాలూ ఓ రెండు రోజుల పటు అల్లర్ల తో అట్టుడికాయి.అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు సమాజం లోని కుల స్పృహ ని ఈ దాడులు ఒక కొత్త ఎత్తు కి తీసుకెళ్ళాయి. ఆ గాయాలు మానడానికి కొన్ని తరాలు పట్టవచ్చు.
కుల తత్వ వాదులంతా ఒకే రకం గా ఆలోచిస్తారు. మీరు ఎవరైనా కుల గజ్జి గాడిని కదపండి (మన లోపల ఉండే వాడి తో సహా).  వాడి నుంచీ ఇలాంటి భావాలు బయట పడతాయి.
నా కులం మిగిలిన కులాల కంటే గొప్పదీ లేదా ప్రత్యేకమైంది.
నా కులం పై మిగిలిన కులాల వాళ్ళు ఏడ్చి చస్తున్నారు.
మిగిలిన కులాలన్నీ మా కులాన్ని అణగదొక్కాలని చూస్తున్నాయి.
పలానా రాజకీయ నాయకుడు లేక సెలెబ్రిటీ మా కులమే.
మా కులం వాళ్ళు మిగతా కులాల లా ఒకళ్ళ కొకళ్ళు హెల్ప్ చేసుకోరు వెధవలు.
అదేంటొ గానీ, మా ఇంటి పక్క వాడికీ నాదీ ఒకటే కులం. కానీ సరిహద్దుల గురించి వాడికీ నాకూ రోజూ పోట్లాటే.
మా కులానికి ప్రభుత్వం ఇచ్చే సహాయమంతా పట్టణాలలో ఉండే వాళ్ళూ,డబ్బున్న వాళ్ళే ఎగరేసుకు పోతున్నారు.
పలానా రాజకీయ నాయకుడు బాగా అవినీతి పరుడు. అతనిది మా కులమే. కానీ మిగిలిన వాళ్ళతో పొలిస్తే చాలా బెటర్. అయినా ఈ రోజుల్లో లంచం తీసుకోని వాడు ఎక్కడ ఉన్నాడు. వచ్చే ఎలెక్షన్ ల లో ఆయనకి వోటు వెయ్యటం తప్పేటట్లు కనపడటం లేదు.
కులాన్ని మనం మతం తో, భాష తో లేక ప్రాంతం తో రీప్లేస్ చెయ్యవచ్చు.  పైన చెప్పిన ఆలోచనలు వాటన్నిటికీ వర్తిస్తాయి. ఇవన్నీ ‘నేను’ అనే దాని నుంచీ మొదలయ్యే భావాలు. నా కులం,నా ప్రంతం, నా మతం, నా దేశం… మామూలు గా దేశం కంటే  రాష్ట్రానికీ, రాష్ట్రం కంటే  ప్రాంతానికీ,ప్రాంతం కంటే కులానికీ,  కులంకంటే కుటుంబానికీ, కుటుంబం కంటే స్వార్థానికీ విలువ ఇచ్చేవాళ్ళే ఎక్కువ. మనం అన్నిటికంటే ఎక్కువ విలువ ఇచ్చే ఈ “నేను” అనేది ఒక పరస్పర విరుద్ధ భావాల సమాహారం.
కులం కంటే మానవత్వానికీ,సమాజానికీ విలువ నిచ్చే కాలం ఎప్పుడు వస్తుందో! సమాజం లో ఉండే అవలక్షణాలన్నీ మనిషి మనసు లోకి చొరబడతాయి. అలానే మనిషి మది లో ఉండేఅవలక్షణాలన్నీ సమాజం లో ప్రతిబింబిస్తాయి. ఇది ఒక విషవలయం.
కుల ప్రాతిపదికన రాజకీయాలూ, కులమాధారం  గా సినిమా హీరో లకు అభిమానులూ, కులం అధారం గానే న్యాయాన్యాయాలూ రాజ్యాంగాలూ ఉన్నంత కాలం మన సమాజానికి మోక్షం లేదు.
చివరి గా,”మా కులంలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. వీటి నుంచీ మా కులస్తులంతా బయట పడాలి”, అనేవాడు కూడా కుల ప్రేమికుడే! ఇండియా లో కమ్యూనిజం, సోషలిజం లాంటివి మట్టి గొట్టుకొని పోవడానికి కుల వ్యవస్త కూడ ఒక కారణమే.

కులాలభిమానాన్ని ఇప్పట్లో ఎలానూ రూపు మాపలేము. కులాభిమానం అధారం గా సమాజానికి మేలు చేసే అవకాసం ఏమన్నా ఉందా? సెహ్వాగ్ సిక్సులు కొడుతూంటే నట్వర్ సింగ్ అన్నాడట,”ఒక జాట్ మత్రమే అలాంటి సిక్సులు కొట్టగలడు”,అని. అలానే, “వాడు మా కులం వాడు కాబట్టే అలా కాస్ట్ ఫీలింగ్ లేకుండా నిష్పక్షపాతం గా వ్యవహరించాడు” అని గర్వం గా చెప్పుకో గలిగే ఒక విలువల వ్యవస్థ ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే, అది మన సామాజిక వ్యవస్థ లో ఒక సృజనాత్మక ఆవిష్కరణ అవుతుంది. అప్పుడు కులమే మన స్మాజనికి బలం అవుతుంది…అవుతుందా….?  లేక.. దీనికి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయా…?.

సరే! ఈ చాదస్తపు మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి వస్తే,అందరి ఊళ్ళలో లాగే శ్రీధర్ వాళ్ళ ఊరి లో కూడా కులాలు ఉన్నాయి.కాబట్టి అక్కడ కూడా కొంపలు తగలబడ్డాయి.  పారా మిలిటరీ ని ఊళ్ళో మొహరించింది ప్రభుత్వం.
పారా మిలిటరీ వాళ్ళు మెయిన్ రోడ్డు లో ఫర్లాంగు కి ఒకరు చొప్పున కాపలా కాశారు. నాలుగైదు రోజులలో ఊరు సద్దుమణిగింది.   పారా మిలిటరీ వాళ్ళు అంతా నార్త్ ఇండియన్స్. వాళ్ళలో ఎవరికీ ఒక్క ముక్క కూడా తెలుగు తెలియదు.ఊళ్ళో వాళ్ళకి హిందీ తెలియదు. వాళ్ళకి ఊరి పెద్దల ఇళ్ళ లో భోజనాలు ఏర్పాటయ్యాయి. హై స్కూళ్ళో అప్పుడే హిందీ నేర్చుకొంటూన్న పిల్లలు , వాళ్ళ హిందీ పాటవాన్ని, ఈ జవాన్ల ముందు ప్రదర్శించటానికి ఉబలాట పడేవాళ్ళు. అది తప్పితే జవాన్లకి కాలక్షేపం లేదు. అయితే ఆదివారం మాత్రం దీనికి మినహాయింపు.. ఆదివారం పొద్దున్నే టీవీ లో మహాభారత్ వస్తుంది, హిందీ లో.  ఆ సమయానికి ఊళ్ళో వాళ్ళంతా పాల కేంద్రానికి చేరే వాళ్ళు.  ఎందుకంటే ఊళ్ళో ఉండే నాలుగైదు టీవీ సెట్లలో ఒకటి అక్కడే ఉంది. జవానులు కూడా గస్తీ కట్టిపెట్టి టీవీ  దగ్గరికి చేరుకొనేవారు. భారతం చూస్తూ ఆ సన్నివేశాల గురించి  జవాన్లు ఊరి జనాలతో హిందీ లో ఏదో మాట్లడే వారు. ఊరి జనం వారికి తిరిగి తెలుగు లో సమాధానం ఇచ్చే వాళ్ళు.మహా భారతం వలన వాళ్ళు తమ మధ్యన ఉండే భాషావరోధాలను అధిగమించారు. అది తరతరాల వారసత్వం కదా.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-15

నాకు ఫ్లైట్ ఎక్కటం  అదే మొదటి సారి..అదీ డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్..నేను అంతకు ముందెపుడూ డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్క లేదు. ఫ్లైట్ ఎక్కటం తోనే ఏదో సాధించినట్లనిపించింది నాకు. మా ఫ్లైట్ సింగపూర్ నుంచీ  లాసేంజెలిస్  వెళ్తుంది. మనీషూ అతని భార్యా కూడా అదే ఫ్లైట్ లో వచ్చారు. మనీష్ వైఫ్ చెన్నై లో ని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ  లో పనిచేస్తుంది. వాళ్ళ ట్రిప్ లాంగ్ టర్మ్ అవ్వటం వలన ఆమె జాబ్ కి రిసైన్ చేసింది. ఫ్లైట్ లో వాళ్ళిద్దరూ చాలా సంతోషం గా కనిపించారు. వాళ్ళు చెన్నై లో వాళ్ళ ఇల్లు ఖాళీ చేశారు. వాళ్ళు అప్పుడే యూఎస్ లో ఏ ఏ ప్లేసులు చూడాలో ప్లాన్ చేసేసుకొంటున్నారు. ఒక మ్యాప్ చూస్తూ  వెళ్ళవలసిన  ప్లేస్ లన్నీ లెక్కపెట్టుకొంటున్నారు. యూనివర్సల్ స్టూడియో,  న్యూ యార్క్, ఫ్లోరిడా..ఇలా చెప్పుకుంటున్నారు.
లాసేంజెలిస్ ఎయిర్ పోర్ట్ నాకు బాగా నచ్చింది. దాన్ని రెండు ఫ్లోర్స్ గా కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అరైవల్స్ కి,ఫస్ట్ ఫ్లోర్ అంతా డిపార్చర్స్ కి. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కే సపరేట్ గా రెండు లెవల్స్ లో సిటీ నుంచీ రోడ్లు ఉన్నాయి.
మా కంపనీ వాళ్ళు పాసడీనా లో ఒక అపార్ట్ మెంట్ తీసుకొని ఉంచారు. మనీష్ చెయ్యి ఊపి ఒక టాక్సీ ని ఆపాడు.  అపార్ట్మెంట్ కి వెళ్ళే దారి లో అక్కడి రోడ్లూ, పార్కులూ బిల్డింగులూ చూస్తూ ఉంటే ఇది కలా నిజమా అనిపించింది. నన్ను గిల్లి చూసు కోవాలనే ప్రయత్నాన్ని ఆపుకొవాల్సి వచ్చింది. ఇంతకు ముందు సినిమాల లో తప్పిస్తే నేను ఎప్పుడూ ఫారిన్ లొకేషన్స్ చూడ లేదు.
బాలా అని మా కొలీగ్ ఒకతను నేను వెళ్ళేటప్పటికే ఉన్నాడు రూం లో. అతని తో నాకు ఈ మూడు నెలలూ రూం షేరింగ్. బాలా కి టీనేజ్ లో లవ్ ఫెయిల్ అయ్యినట్లు గ్రహించాను అతని మాటల వలన. బాలా కి ఓ కారుంది. రోజూ నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసే వాడు. గ్యాస్ డబ్బులు షేరింగ్.
బాలా ఆఫీస్ పని లో ఉండనప్పుడల్లా ఒకే పని లో ఉండేవాడు. అది ” జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదవటం.” ఆయన టీచింగ్స్ ని ప్రాక్టీస్ చేయటం లేదా జీవించటం.  బాలా తో పాటు నేను కూడా కొన్ని రోజులు జిడ్డు కృష్ణమూర్తి ని చదివే వాడిని. ఆయన చెప్పిన,” సత్యమనేది ఒక దారి లేని ప్రదేశం”, అనే సత్యం నాకు చాలా నచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి నన్ను కూడా జిడ్డు లా పట్టుకున్నాడు.అయితే కొన్నాళ్ళు మాత్రమే.
********************
ఓ రోజు ఆఫీస్ లో నాకు మనీష్ కనిపించాడు. అతని ముఖం చాలా డల్ గా ఉంది. అతని ప్రాజెక్ట్ స్క్రాప్ అయ్యిందట. కస్టమర్ గాడి కస్టమర్ ఫండింగ్ తగ్గించాడు.అందువలన అతని ప్రాజెక్ట్ కి కోత పడింది. అతను ఫ్యామిలీ తో సహా ఆ వీకెండే  ఇండియా వెళ్ళి పోవాలి. ఈ విషయమంతా మనీష్ నవ్వుతూ చెప్పటానికి ట్రై చేశాడు కనీ, అతని గొంతు మాత్రం నవ్వటం లేదు.
అతను అన్నాడు, “ఓహ్ మళ్ళీ  మొదటికే ఒచ్చింది కథ. మళ్ళీ ఆ పొల్యూషన్..మళ్ళీ ఆ జనాలూ ..ఆ దుమ్మూ.. చెన్నై లో మళ్ళీ అపార్ట్ మెంట్ కోసం తిప్పలూ మళ్ళీ…
అక్కడి జనాలు ఎందుకు తిరిగి వచ్చావ్ అని అడుగుతారు…వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఎక్స్ ప్లైన్ చెయ్యాలి ఆహ్..మళ్ళీ మా ఆవిడ ఉద్యోగం కోసం..ప్రయత్నాలు మొదలెట్టాలి”
అతను వేరే కన్సల్టంట్ దగ్గరికి జంప్ అవుదామని చూశాడట. కానీ షార్ట్ నోటీస్… అవటం వలన సాధ్యం కాలేదట. అమెరికా లో మార్కెట్ కూడా స్లో అవ్వుతోందట.  అపార్ట్ మెంట్ రెంట్ కి ఇచ్చిన అడ్వాన్స్  ని అతను ఇప్పుడు వదులు కోవాలిట. కారు అప్పు ఎలా తీర్చాలో ఇంకా ఆలోచించలేదట. బహుశా  కారు ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో వదిలిపోవాలేమో అంటున్నాడు.
********************
నాకు జిడ్డు కృష్ణమూర్తి బోర్ కొట్టడం మొదలెట్టాడు. అది నా మైండ్ కి ఉన్న లిమిటేషన్ వలన కావచ్చు. బాలా కి మట్టుకు అది ఒక పాషన్. బాలా లవ్ లో ఫెయిల్ అవ్వటం వలన ఆ పాషన్ ని జిడ్డు కృష్ణమూర్తి టీచింగ్స్ మీదికి అన్-కాన్షస్  గా మళ్ళించాడని నాలో నేను ఒక థియరీ కనిపెట్టాను. ఈ థియరీ మీద నా స్వభావం యొక్క ప్రభావం ఎంతో, ప్రభావం లేని సత్యమెంతో ఆ జిడ్డు కృష్ణ మూర్తి కే ఎరుక.
*********************
క్రిస్మస్ సెలవలు కావటం తో లాస్ వేగాస్ వెళ్దామన్నాను బాలా తో.
“లాస్ వేగాస్ లో నాకు టైం పాస్ కాదు”, అన్నాడతను. ఇంకా,”దట్స్ ఎ చైల్డిష్ సిటీ”, అని కూడా అన్నాడు. అయితే గ్రాండ్ కాన్యాన్ కైతే వస్తానన్నాడు బాలా. సరే రెండింటికీ వెళ్దామని బాలాని బయలదేర దీశాను.
బాలా కార్ లో మొదట గ్రాండ్ కాన్యాన్ కి వెళ్ళాం. మెకన్నాస్ గోల్డు లోనూ టక్కరి దొంగ లోనూ కనిపించే సైట్ ఇదే. ఎండకి ఇక్కడి కొండలు పొద్దునా సాయంత్రమూ బంగారు రంగు లో కనిపిస్తాయి..
గ్రాండ్ కేన్యాన్ చేరేటప్పటికి ఉదయం ఆరయ్యింది. అక్కడ పద్ద మంచు గడ్డలు అప్పుడే కరుగుతున్నాయి. నాకు మొదటి సారి గా జీవితం లో మంచు ఎలా ఉంటుందో తెలిసింది. జీవితంలో మొదటి సారి గా చలిని తట్టుకోలేక పోవటం అలా ఉంటుందో కూడ ఆక్కడే తెలిసింది. మొట్టమొదటి సారి మాటలకందని భావనలు ప్రకృతి ని చూస్తే కలుగుతాయనీ తెలిసింది.
గ్రాండ్ కేన్యన్ భూ ఉపరి తలానికి పడిన ఒక పాట్-హోల్  లా ఉంది. దాని అడుగున కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ భూ గోళం చరిత్ర అంతా ఒక్క సెకండ్ లో తెలిసింట్లుంటుంది.
బాలా ఆ కొండ రాళ్ళ మీద గ్రాండ్ కేన్యాన్ చేసే మ్యాజిక్ చూస్తూ చాలా సేపు కూర్చున్నాడు. అప్పుడు గ్రాండ్ కేన్యన్ గురించి జిడ్డు కృష్ణ మూర్తి ఏమన్నాడో చెప్పాడు బాలా. నాకు గుర్తు లేక పోవటం వలన ఇక్కడ కోట్ చేయలేకపోతున్నాను.
కొంచెం సేపటి తరువాత బాలా హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళాడు. నాకు ఆ రైడ్ కాస్ట్-లీ అనిపించింది.  డాలర్లని రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తే అనిపించదా, మరి? నేను మాత్రం హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళకుండా కార్లోనే కూర్చున్నాను.
బాలా హెలికాప్టర్  రైడ్ అయ్యాక హోటల్ రూం కి వెళ్ళి తిని పడుకున్నాం. మరుసటి రోజు కూడా గ్రాండ్ కెన్యాన్ మీదు గా కార్ లో వెళ్ళి, అక్కడి నుండీ లాస్ వేగాస్ వైపుకి బయలు దేరాం. కారు లో  స్టీరియో పాడుతోంది,”ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై! ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై!”
తను లాస్ వేగాస్ కి ఇష్టం లేక పోయినా వస్తున్నాడు కాబట్టి,నేను తరువాత అతనికి ఒహాయ్ లోని జిడ్డు కృష్ణమూర్తి రిట్రీట్ కి వెళ్ళటానికి కంపెనీ ఇవ్వాలని కండిషన్ పెట్టాడు బాలా.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers