ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే..ఇక ఏమీ లేదు!
05 మార్చి 2012 అభిప్రాయములు
in అవర్గీకృతం
ఓ రెండేళ్ళ క్రితం, రోజూ ఆఫీస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. జీవితపు బండి ని ఇష్టం లేని ఎద్దులా రొటీన్ గా లాగుతూ ఉండేవాడిని. జీవితం, “రసం పీలిచిన తరువాతి చెరుకు పిప్పిలా, ధాన్యపు మిల్లు గొట్టం నుంచీ బయటకు వచ్చే ఊక లా” ఉండేది. కుక్క, మాంసం లేని ఎముక ని పదే పదే కొరికినట్లు, నేను కూడా జీవితాన్ని ఏదో ఓ తెలియని ఆశ తో జీవించేవాడిని. ఆంధ్ర లో గడచిపోయిన మంచి కాలేజీ రోజులని గుర్తుకు తెచ్చుకొంటూ ఉండేవాడిని. అప్పుడప్పుడూ బెంగళూరు లో తెలుగు పత్రికలు కొని డల్ గా ఉండే జీవితం లో కొంచెం తెలుగు తనం నింపటానికి ప్రయత్నించే వాడిని.
ఓ రోజు ఓ స్నేహితుడి ద్వారా తెలుగు బ్లాగులు పరిచయమయ్యాయి. దానితో, జీవితపుబండి మళ్ళీ “వోల్వో” బస్సులా పరిగెత్తడం మొదలు పెట్టింది. అంతకు ముందు ఎద్దుల బండి రోజుల్లో, బోర్ పోగొట్టుకోవటానికి, నేను ఒక కథ రాసుకొన్నాను. దానిని అప్పుడప్పుడూ నేనే చదువు కొని, “నేను రచయితనై పోయానోచ్!!” అనుకొని మురుసు కొని, మళ్ళీ ఆ ఠావులను అల్మైరా లో పెట్టేస్తుండేవాడిని. బ్లాగులు పరిచయమైనాక ఓ రోజు, “నా కథ ని బ్లాగు లో పెట్టి ఎందుకు జనాలని భయపెట్టకూడదు?” అనిపించింది. కానీ, “నేను మాయల మరాఠీని చూపెట్టబోతే, జనాలకి లంబూ జంబూ లు కనపడతారేమో ననిపించి”, కొంత కాలం ఆగాను. ఈ అగిన కాలం లో కొన్ని శాంపుల్ బ్లాగులు చూసిన తరువాత ధైర్యం వచ్చేసింది, నా కథ చేత కూడా స్టేజ్ షో ఇప్పించవచ్చని.
కథ డ్రాఫ్ట్ ని తయారు చేసి పబ్లిష్ బటన్ నొక్కబోతూండగా ఒకటే పీకుడు మనసులో, “నువ్వు ఎందుకు నీ బ్లాగు ని పబ్లిష్ చేయాలనుకొంటున్నావు?”, అని.
“ఎందుకో ఒక అందుకు లేవాయ్!”, అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పటికి పబ్లిష్ బటన్ నొక్కేశాను.
కానీ కొన్ని రోజులు బ్లాగిన తరువాత నాకు అర్ధమైంది ఏమిటంటే, “మనిషి ఇతర మనుషుల మనసుల్లో, ఆలోచనల లో జీవించాలనుకొంటాడు. ఒక మనిషి జీవితం లో, ఇతర మనుషుల మనసుల్లో (దృష్టిలో) జీవించని భాగానికి అతి తక్కువ విలువ ఇచ్చుకొంటాడు. జీవితాన్ని మనం మన ఇంటి కుర్చీలోనూ, ఆఫీసు సీటులోనూ, ఇంటికీ ఆఫీసుకీ పోయే కారులోనూ జీవించం…కాదు కాదు జీవించమా అంటే జీవిస్తాం. కానీ మన మానసిక జీవితాన్ని మాత్రం ఎక్కువ భాగం ఇతరుల దృష్టి అనే రంగస్థలం పై జీవిస్తాం. “పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా!” అని వేమన అన్నాడంటే దానర్ధం చెదలు భౌతికం గా జీవించలేదని కాదు. అవి మన మానసిక జీవితం పై ఏవిధమైన ప్రభావాన్నీ చూపించలేక పోయాయనే! తన బంధువుల యొక్కా, స్నేహితుల యొక్కా, చుట్టు పక్కల వారి యొక్కా మానసిక ప్రపంచం లో చోటు లేని వాడు జీవించనట్లే లెక్క.
అంటే.. దీనర్ధం ఏమిటంటే, ప్రతీ మనిషి కీ “గుర్తింపు” కావాలనే “కోరిక” ఉంటుంది. కానీ అ గుర్తింపును ఇచ్చేవారు మాత్రం ఇతరులే! గుర్తింపు థియేటర్ కి తళం చెవి మాత్రం మనచేతిలో లేదు. అది జనాల చేతిలో ఉంది. ఆ గుర్తింపు పాజిటివ్ అయితే మంచిది., నెగటివ్ అయినా పరవాలేదు. కానీ ఏ గుర్తింపైనా పరవాలేదు. మా కాలేజీ రోజుల్లో కొందరు మంచి మార్కులు తెచ్చుకొని క్లాసులోని అమ్మాయిల దృష్టి లో పడేవారు, మార్కులు తెచ్చుకోలేని కొందరు జులాయి పనులు చేసో, రౌడీలు గానో అమ్మాయిల దృష్టి లో పడాలని ప్రయత్నించే వారు. అలానే బ్లాగులు కూడా! ఎవరూ పట్టించుకోని బ్లాగు చనిపోయినట్లే లెక్క!
“ఘటం చిద్యాత్
పటం బిద్యాత్
ఏనకే ప్రకారేణ
ప్రసిధ్ధః పురుషా భవేత్!”
అంటే, సెంటర్లో కుండ పగుల కొట్టికానీ, పోస్టర్ ని చింపి ఐనా సరే అందరి దృష్టి లో పడమని చెప్పినాడండీ పద్య కారుడు!
అవుతే, గుర్తింపు ని ఒక్కొకరూ ఒక్కో మార్గం లో కోరుకొంటారు. ఒకరు గొప్ప క్రీడా కారుడవ్వాలనుకొంటే, ఇంకొకరు పాపులర్ సినేమా స్టారు కావాలనుకొంటారు, ఇంకొకరు పేద్ద రచయిత కావాలనుకొంటారు. వీరికి ఆయా మార్గాలు ముఖ్యమా, లేక లక్ష్యమైన గుర్తింపు ముఖ్యమా?
ఆయా మార్గాలలో ఎందుకు గుర్తింపు కోరుకొంటారంటే, ఆ మార్గాలు వారికి ఇష్టమైనవి కాబట్టీ. ఆ మార్గాలలో గుర్తింపు వస్తే, వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, పెద్ద కష్ట పడనవసరం లేకుండా గుర్తింపు సాధించవచ్చు. క్రికెట్ క్రీడాకరుడవాలనుకొన్నవాడు రచయిత గా గుర్తింపు సాధించాలంటే అందుకు మానసికం గా అతను చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అదే క్రికెట్ ఆటగాడు గా ఆడుతూ పాడుతూ శ్రమ పడుతాడు.
ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. జీవితంలోని మార్గాలు అన్నీ, ఒక మెట్టు కింది స్థాయిలో లక్ష్యాలే. క్రికెట్ క్రీడాకారుడి గా గుర్తింపు అనేది ఒక లక్ష్యమైతే, అందుకు మార్గమైన క్రికెట్ ప్రాక్టీస్ కూడా, ఒక మెట్టు దిగువ స్థాయి లో, ఒక లక్ష్యమే! క్రికెట్ ప్రాక్టీస్ అనే లక్ష్యం చేరే మార్గం లో మళ్ళీ “బధ్ధకం లేకపోవటం”, “ఫిట్నెస్ మెయింటేన్ చేయటం” అనే విషయాలు ఉంటాయి. ఏ మనిషికైనా ఒక గమ్యా నికి అన్ని స్థాయి మెట్లలోనూ అనందకరమైన విషయాలే ఉండవు. ఏదో ఒక స్థాయి లో ఆ మనిషి ఇష్టం లేని విషయం కూడా ఉంటుంది. కానీ గమ్యం పై మక్కువ తో ఆ ఇష్టం లేని కష్టమైన విషయాన్ని కూడా అతను భరించగలుగుతాడు.
పై విషయాలన్నీ ఏ కెరీర్ కౌన్సిలర్ అయినా పుంఖాను పుంఖాలు గా చెప్తాడు. వీళ్ళు చెప్పని విషయాన్ని ఒక దాన్ని చెప్ప దలచుకొన్నాను. చదవండి….
ఒక నిజాయితీ కల రాజకీయ నాయకుడు ఉన్నాడనుకొందాం. అతను, ఉదాహరణకి ఒక లక్ష్యాన్ని సాధించే ఉద్దేశం తో ఒక పార్టీ పెట్టాడనుకొందాం. ఆ లక్ష్యం, “రాజకీయాధికారం ద్వారా, ఒక సమాజం లోని 70% మందికి ఉద్యోగాలు ఇవ్వటం” అనుకొందాం ఆ పార్టీ పెట్టే ముందు, తన లక్ష్యం పూర్తి అయేంతవరకే తాను రాజకీయాలలో ఉంటానని అతను ప్రకటించాడనుకొందాం. ఎందుకంటే అతనికి రాజకీయాధికారం కంటే, 70 శాతం మందికి ఉద్యోగాలివ్వటమే ముఖ్యం. తన లక్ష్యం నెరవేరాక అతనికి అధికారం తో సంబంధం లేదు. కానీ నిజ జీవితం లో చాలా మంది మంచి రాజకీయ నాయకులు తమ మొదటి రాజకీయ లక్ష్యాలు నెరవేరాక కూడా తమ అధికారాన్ని వదులుకోలేరు. అంటే, రాజకీయాధికారమే అసలు లక్ష్యమైపోతుందన్నమాట! ఇది అన్ని రంగాలకీ వర్తిస్తుంది. అధికారమూ, గుర్తింపూ, డబ్బు సంపాదనా (ఈ మూడిటికీ అవినాభావ సంబంధం ఉంది అనేది తెలిసిన విషయమే కదా!) మొదలైనవి ముందు కొన్ని మార్గాలద్వారానే వస్తే రుచిస్తాయి. కానీ వాటి రుచి మరిగిన తరువాత వాటిని వదులుకోవటం కష్టమైపోతుంది. వాటికి వ్యసనం లాంటి నైజం ఉంది.
ముందు మన ఆలోచనలను పదుగురితో పంచుకోవటం కోసం బ్లాగు మొదలెడతాం. కానీ మన ఆలోచనలన్నీ మన అనుభవాలలోంచీ వస్తాయి. మన అనుభవాలేమో పరిమితం. కాబట్టీ, మన ఆలోచనలూ పరిమితం . ఒక స్థాయి తరువాత మన ఆలోచనలు పునరుక్తి అవుతాయి. అది మన స్వప్రేమ వలన మన కి బోర్ కలిగించక పోవచ్చు . కానీ చదివే వారికి విసుగు తెప్పిస్తాయి. ముఖ్యం గా రచయితలూ కళా కారుల విషయం లో ఇది మరీ వర్తిస్తుంది. కళాకారులు తమ తొలి సృజనలలో, తమ వ్యక్తిత్వం లోని వైవిధ్యాన్నీ, ఆలోచనలలోని కొత్తదనాన్నీ ప్రతిఫ్లిస్తారు. కానీ వారి వ్యక్తిత్వపు పెరామీటర్స్ మారేవి కావు. కాబట్టీ, వారి రచనలలో ఒకే పాటర్న్ వచ్చి పునరుక్తి ఉంటుంది.(శాస్త్రవేత్త లకీ, ఇంజినీర్లకీ ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారి పాటర్న్ వారి వ్యక్తిత్వానికి బాహ్యం గా వస్తువులలో ఉంటుంది. బుర్రలో సమాచారాన్ని వారు ఎల్లప్పుడూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.) ఒకే రచయిత రాసిన కథల సంపుటు ల లో మనం అతని/ఆవిడ పాటర్న్ ని సులువు గా పట్టేయగలం కదా! కనీసం ఈ కళాకారులు వేరు వేరు ప్రదేశాలు చూడటం, కొత్త పుస్తకాలు చదవటం, అనేక కొత్త అనుభవాలను ఆహ్వానించటం చేసే వారైతే,(వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారి కళలోని పాటర్న్ రిపీట్ అయినా), కంటెంట్ వైవిధ్యం గా ఉంటుంది.ఈ “వ్యక్తిత్వ ఆధారమైన పాటర్న్ రిపీట్ అవటం”, మనకు కమర్షియల్ సినిమాలూ వగైరా ల లో కనిపించదు. ఎందుకంటే, అక్కడ డబ్బు రాలటానికి వైవిధ్యాన్ని చూపించాలి. కాకపోతే, వాటి లో కమర్షియల్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. ఈ ఫార్మాట్ కాలాన్ని బట్టి పరిణామం చెందుతూ ఉంటుంది. కానీ, నిజ జీవితం లో అనేక ప్రదేశాలు చూడాలన్నా, వైవిధ్యమైన అనుభవాలు పొందాలన్నా డబ్బు చాలా అవసరం. మన తెలుగు మధ్య తరగతి జీవితం లో అంత డబ్బు ఎందుకు ఉంటుంది?
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, బ్లాగు రచయితల బుర్రలలో కొంతకాలం వరకూ సరుకు ఉంటుంది. ఆ సరుకు అయిపోయిన తరువాత మళ్ళీ దానిని నింపుకోవటానికి ప్రయత్నించాలి. ఇది నిజజీవితానుభవాల ద్వారా కావచ్చు, పుస్తక పఠనం ద్వారా కావచ్చు. అలా నింపుకోలేక పోతే, వారు “చెప్పినదే చెప్పటానికి” అవకాశం ఎక్కువ ఉంటుంది. సరుకు అయిపోయినపుడు మనం ఎందుకు బ్లాగటాన్ని ఆపం? రాజకీయ నాయకుడు అసలు లక్ష్యం కంటే అధికారానికి అలవాటు పడిపోయినట్లు, మనం కూడా తోటి బ్లాగరులు ఇచ్చే గుర్తింపుకీ, వారి కామెంట్లకీ, రేటింగ్లకీ, మెచ్చుకోళ్ళకీ, నొచ్చుకోళ్ళకీ అలవాటుపడిపోయి ఉంటాం.ఆ అలవాటు మానటం కష్టమైపోతుంది. ఒక స్థాయి తరువాత, ఏదో ఒకటి బ్లాగటమే ముఖ్యం అవుతుంది. ఏమి బ్లాగాం అన్నది ముఖ్యం కాదు. నా గత నాలుగైదు నెలల టపాలలో నేను దీనిని విస్పష్టం గా గమనించాను. నాకు నా బుర్ర ని మళ్ళీ రీచార్జ్ చేసుకొనే తీరిక కానీ, అవకాశం కానీ, ఓపిక కానీ కనపడటం లేదు. కాబట్టీ ప్రస్తుతానికి బ్లాగ్లోకానికి బై.
బ్లాగ్లోకం లో నాకు పరిచయమైన,అవ్వని, నన్ను ప్రోత్సహించిన, ప్రోత్సహించని, పట్టించుకొన్న, పట్టించుకోని అందరు బ్లాగరులకూ, కామెంటరులకూ, తుంటరులకూ, ఒంటరులకూ, బుధ్ధిమంతులకూ “ఐపీ ఐపీ” కీ నా ధన్యవాదాలు!
బ్లాగుల లో కొత్త వారి తో ఎందుకు కబుర్లు చెప్తాం?
03 మార్చి 2012 అభిప్రాయములు
in అవర్గీకృతం
ప్ర: మనం రోడ్డు మీద నడుస్తున్నామనుకోండి, ఎదురు గా ఒక కొత్త మనిషి వస్తే అతని తో మాట్లాడం. మరి బ్లాగుల్లో కొత్త మనుషుల తో ఎందుకు మాట్లాడుతాం?
జ: రోడ్డు మీద పోయే ఎదుటి మనిషి ఆలోచనలు మనకు తెలియవు కనుకా, బ్లాగుల్లో బ్లాగరులు తమ ఆలోచనలను చెప్తారు కనుకా..
ప్ర: RF ID ల ద్వారా షాపింగ్ బుట్ట లో వస్తువుల విషయాలు తెలిసినట్లు గా, రోడ్ మీద పోయే వ్యక్తి ఆలోచనలు తెలీపతీ ద్వారా తెలిసినవనుకోండి, అప్పుడు వెళ్ళి రోడ్ మీది వ్యక్తి తో గల గలా మాట్లాడేస్తామా?
జ: బ్లాగ్ రాసిన వ్యక్తి, లేక కామెంటిన వ్యక్తీ నలుగురూ తను రాసినది చదివి తనకి సమాధానం చెప్పాలని రాస్తాడు. రోడ్డు మీద పోయే వ్యక్తి నిన్నేమైనా బొట్టూ కాటుక పెట్టి తనతో మాట్లాడ మన్నాడా?
ప్ర: అంటే, సదరు బ్లాగ్ స్వంత దారులు దారే పోయే వారిని బొట్టు పెట్టి పిలిచి మాట్లాడిస్తున్నారా? బ్లాగులు రాసే వారు మాట్లాడే వారి కోసం మొఖం వాచిపోయి ఉన్నారా?
జ: ఒక రకం గా అంతే! నిజ జీవితం లో హాయి గా జనాల్తో కబుర్లు చెప్పుకొంటూ సంతోషం గా ఉన్న వాడికి (ఆ స్టేజ్ లో), బ్లాగులు రాయటానికి ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఒక పల్లెటూరి అరుగులపై ఊళ్ళోవారి తో హాయిగా కబుర్లు చెప్పుకొనే వ్యక్తి ని బ్లాగులు రాయమనండి. “అదేంటబ్బాయ్, కొత్తోళ్ళ తో ఆలోచన ఎలా చేస్తాం?”, అని అనకపోతే నన్నడగండి. నిజ జీవితం లో కబుర్లు చెప్పుకోవటానికీ, తమ ఆలోచనలు పంచుకోవటానికీ అవకాశం లేని వారూ, గుర్తింపు కరువైన వారు బ్లాగులు రాసే అవకాశం మెండు.
ప్ర: మరి సెలబ్రిటీలు గుర్తింపు కోసం మొఖం వాచి పోయి ఉన్నారంటావా? వాళ్ళెందుకు బ్లాగుతారు?
జ: వాళ్ళు రాసేది మామూలు గుర్తింపు కోసం కాదు. ఒకటి తమ ఆలోచనలని జనాల మీదికి వదలటానికి, రెండు తమ ఆలోచనలు గుర్తింపు పొందటానికి. ఒక నటుడి గా గుర్తింపు తెచ్చుకొన్న వాడి ఆలోచనలకి గుర్తింపు ఉండక పోవచ్చు. బ్లాగుల ద్వారా ఆ లోపం తీరుతుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది one sided గా ఉంటుంది. చదువరుల అమోదం కోసం సెలబ్రిటీ లు ఎదురు చూడరు.వారికి ఆ ఆమోదం అప్పటికే తమ తమ రంగాలలో వచ్చి ఉంటుంది. చదువరుల స్పందన కోసం అసలే పట్టించుకోరు. కామెంటరుల కామెంట్లకి సెలబ్రిటీలు స్పందించటం చాలా తక్కువ. కారణం, ఒకటి, కామెంటిన వారు తమ గోటికి సరి కారనే పరోక్ష భావం (inherent attitude) అయితే, రెండోది తమ గుర్తింపు కోరిక అప్పటికే తీరి పోయి ఉండటం. ఇక సెలబ్రిటీ బ్లాగ్ లకి ఎక్కువ గా కామెంట్స్ రావటం వలన అందరి కామెంట్ల కీ స్పందించటం కుదరదు కూడా!
ప్ర: మొత్తానికి బ్లాగులు రాయటం ఒక ఆధునిక లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి అంటావ్?
జ: అంతే! సైకాలజిస్టుల కాడినుంచీ మారేజ్ కౌన్సిలర్ల దాకా అందరూ ఈ కోవలోకే వస్తారు. బ్లాగుల ద్వారా వ్యక్తి గత జీవితం గురించి రాసే వారికి వాటి అవసరం ఎక్కువ.ఆ లోపాన్ని బ్లాగులు తీరుస్తున్నాయి. రోడ్డున పోయే వాడి తో తమ వ్యక్తి గత జీవితం గురించి చర్చించే వాడిని ఏమనాలి?
ప్ర: మరీ కోస్తున్నావ్. నిజ జీవితానికీ బ్లాగు జీవితానికీ తేడా లేదా? నిజ జీవితం లో అలా చర్చిస్తే చాలా రిస్కు కదా. కొత్త వారు మన జీవితాలతో ఆడుకొంటారు. బ్లాగుల్లో ఊరూ పేరూ లేకుండా చర్చిస్తే మనకొచ్చే నష్టమేమిటి? ఊరూ పేరూ తెలిసినా, ఎక్కడెక్కడో ఉండే బ్లాగరులు చేయగలిగేదేమిటి?ఓ.., తెగ చెప్పటం కాదు. మరి, నువ్వు బ్లాగు ఎందుకు నడుపుతున్నా..?
జ: నేనూ ఇప్పటి దాకా చెప్పిన వాటికి అతీతుడిని కాదు. అయిన నా గుర్తింపు కుతి కొంతవరకూ తీరిపోయినట్లుంది, పైగా చెప్పటానికి బుర్రలో ఏమీ మిగల లా..అప్పుడప్పుడూ పనిలేక బోర్ పోవటం కోసం రాస్తున్నా.ఇక,దుకాణం మూసేద్దా మనుకొంటున్నా..
ప్ర: అందరూ నీ లాంటి పనిలేని వాళ్ళు కాదు. ఏదో ఒక ఆశయం తో, లేక ఒక ఐడియాలజీ కోసమో సైట్లు నడిపే వారూ ఉంటారు. ప్రత్యేక మైన ఆడియన్స్ కోసం, రైతులకోసం, సైన్స్ కోసం ఇలా ఒక కారణం కోసం బ్లాగులు నడిపే వారు ఉంటారు.ఒక ఊరి విషయాలు తెలుపుతూ, సినిమా విషయాల కోసం ఇలా నడిపే వారూ ఉంటారు. మరి వారిని గురించి ఏమంటావు?
జ: వారు ధన్య జీవులు. వారిని నడిపించమంటాను.
మీకు మహదేవన్ ఇష్టమా..? ఇళయరాజా ఇష్టమా..?
02 మార్చి 2012 అభిప్రాయములు
in అవర్గీకృతం
సంగీతం గురించి నాకు పెద్ద గా తెలియదు, కానీ, సినీ సంగీతం లో (ఇప్పటిది కాదండోయ్, ఓ పదీ పదిహేనేళ్ళ కిందటిది..) నాకు ఇద్దరు దర్శకులు నచ్చుతారు. ఒకరు మామ మహదేవన్, రెండవ వారు ఇళయ రాజా. సినిమాల లో పాటలు సందర్భాని (situation)కి అనుగుణం గా తయారవుతాయి (ఇప్పటి సినిమాలలో అలా కాదనుకోండి). సినిమా దర్శకుడు ఒక సన్నివేశం, ఆ సన్నివేశం లోని భావోద్వేగ వాతావరణాన్ని పాట రచయితకీ, సంగీత దర్శకుడికీ వివరిస్తే, ఆ మూడ్ రక్తి కట్టేటట్లు గా పాట తయారవాలి.
ఇక్కడ పాటల రచయిత ముందు పాట రాస్తే, తరువాత ఆ పాటకి సంగీత దర్శకుడు బాణీ కట్ట వచ్చు. రెండవ పధ్ధతి, “సంగీత దర్శకుడు బాణీ ని కుదిరిస్తే రచయిత దానికి పాట రాసి ఇవ్వటం.”
సినిమా డైరెక్టర్ సన్నివేశాన్ని చెప్పినపుడు, సంగీత దర్శకుడు అందులో అంతర్లీనం గా ఉండే మూడ్ ని మాత్రమే తన బాణీ తో సృష్టించగలడు. మూడ్ ఒక రూపం రంగూ రుచీ లేకుండా ఉండి, ఇతమిధ్ధం గా ఉండదు.ఉత్సాహమైన మూడో, విషాదమైన విషయమో, భక్తి వాతావరణమో..ఇలా ఒక మూడ్ ఉంటుంది..అంతే! ఆ మూడ్ ని ఎలివేట్ చేసి, దానికి ఒక భావాన్ని ఇచ్చి, దానికి గుణ గణాలనీ లక్షణాలనీ ఇచ్చి, సొబగులు అద్దేది సాహిత్యం. మబ్బు చినుకు అయినట్లు, సాహిత్యం వలన సన్నివేశం లోని మూడ్, ఒక ప్రత్యేక భావావేశం అవుతుంది. ఆ మూడ్ కి ఒక అస్థిత్వం వస్తుంది. ఒక రేంజ్ వస్తుంది.
అయితే బాణీ కి పాటను రాస్తే బాగుంటుందా? సాహిత్యానికి బాణీ కడితే బాగుంటుందా? ఏది మంచిది?
ఇళయరాజా బాణీ ని ముందు ఇచ్చి దానికి సాహిత్యం రాయించుకొనే వారు. మహదేవన్ సాహిత్యాన్ని తెచ్చుకొని దానికి బాణీ ని సమకూర్చే వారు. బాణీ కి సాహిత్యాన్ని సమకూర్చటం లో భావానికి పరిధులు ఎక్కువ ఉన్నాయి . ఎందుకంటే, ఆ బాణీ కి సరిపోయిన పదాలనే రచయిత వేయాలి. ఇందువలనే అనుకొంటా ఇళయ రాజ పాటలలో మూడ్ బాగా రిచ్ గా ఉంటుంది. కానీ వాటి వలన “ఇదీ అని మనం వేలు పెట్టి స్పృశించదగ్గ”, భావోద్వేగం రాదు. బాణీ కి రాసి మెప్పించాలంటే రచయిత కష్ట పడాలి. (సరళత కోసం కాసేపు వేటూరి వంటి రచయితలు రాయలేదనుకొందాం. వేటూరి వంటి వారు బాణీ ఇచ్చినా సమర్ధవంతం గా పాట రాయగలరు.అనువాద చిత్రాలలో నటీ నటుల పెదాల కదలికల కి అనుగుణం గా పాట ఉండాలి కాబట్టీ, వాటిలో పరిమితులు ఇంకా ఎక్కువ. ఏ శ్రీ శ్రీ లాంటి వారో అటువంటి పాటలకు కొంత న్యాయం చేయగలిగారు. )
ఉదాహరణ కు ఈ ఇళయ రాజా పాట వినండి.మూడ్ బానే ఉంటుంది. దానికి ఇళయ రాజా అనేక వన్నె చిన్నెలను అద్దారు. కానీ, ‘భావో’ద్వేగం లేదు.
శ్రీ శ్రీ కవిత్వాన్నైనా ఒక పాఠం లా చదువుతూ పోతే దాని లో పెద్ద మూడ్ ఉండదు. కానీ దానికి ఒక బాణీ ని సమకూర్చితే దానిలోని భావానికి ఒక మూడ్ వచ్చి ఉద్వేగం వస్తుంది. మహదేవన్, వార్తాపత్రిక సంపాదకీయానికి కి కూడా బాణీ కట్టగల సమర్ధుడని ప్రతీతి. రాసిన పాట కు దానిలోని భావానికి, ఆ భావాలలోని nuances కి తగిన మూడ్ ని సృష్టిస్తూ బాణీ కట్టాలంటే సంగీత దర్శకుడు కష్టపడాలి. అందుకే నాకు ఇళయ రాజా, మహదేవన్ ల లో మహదేవన్ అంటే ఎక్కువ గౌరవం. మహదేవన్ సాహిత్యానికి న్యాయం చేకూర్చిన పాట ఇక్కడ ఒకటి .
సినిమా చూడకుండా ఈ పాట వింటే, “కమల మృదులమైన ఆమె చరణాలూ,… రసవేదాలైన ఆ పాదాలూ,….మన హృదయలోలకాన్ని ఉర్రూతలూగిస్తాయి కదా..!” (అన్నట్లు, ఎప్పుడూ అలనల్లని తెలుగు పదాలతో పాటలు రాసే ఆత్రేయ , ఈ పాటలో కొంచెం ఎక్కువే సంస్కృతం వాడారు మరి ఎందుకో..! ఇది ఆయన చివరి రోజులలో రాసిన పాట.)
మామా, రాజా ఇద్దరూ సంగీత పరికరాలను తక్కువ గానే వాడే వారు. వారివాయిద్యాలలో ఎక్కువగా దేశీవే ఉండేవి. ఇద్దరి పాటలలోనూ శబ్ధం సాహిత్యాన్ని మింగేసేది కాదు.అయినా, ఎవరి గొప్పవారిదే!
మామ మహదేవన్ మలయాళీ అయినా భావం తెలుసుకొని బాణీ కట్టే వాడు. ఆయన చేసిన శంకరాభరణం లాంటి కొన్ని ప్రయోగాలని పక్కన పెడితే, ఆయనవి ఎక్కువ గా పల్లెటూరి పాటలు ఉంటాయి. ఆ పాటలు వింటూ ఉంటే అచ్చం గా ఒక తెలుగు పల్లెకు వెళ్ళొచ్చిన అనుభూతి కలుగుతుంది.
మరి మీకు మహదేవన్ అంటే ఇష్టమా? లేక ఇళయరాజా అంటే ఇష్టమా?..అదేనండీ ఎవరి పాటలు ఇష్టం?
నాకు నచ్చిన మనుషులూ, విషయాలూ, వంటలూ..
26 Feb 2012 అభిప్రాయములు
in అవర్గీకృతం
ఈ మధ్య సమాజం గురించీ, వ్యవస్థా ఇజమూ అదీ ఇదీ అని వాగి వాగి బోర్ కొట్టింది. సమాజానికి మనుగడ సాగించే సత్తా ఉంటే, అది ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంది, లేక పోతే, చంకనాకి పోతుంది. సమాజం గురించి ఓ తెగ అర్ధం చేసుకొని, వ్యక్తిగతం గా గానీ , సామూహికం గా గానీ సాధించేది ప్రస్తుతానికి నాకు కనపడటం లా..
కాబట్టీ, సమాజమూ వ్యవస్థా వగైరాలను కాసేపు పక్కనపెట్టి, నాకు ఇష్టమైన విషయాల గురించి మీతో పంచుకొంటే, రోజు గడిచే సరికి, నాకు కాస్త ఆనందమైనా మిగులుతుంది. అందుకే, నాకు ఇష్టమైన విషయాల గురించి ఈ టపాలో రాస్తాను. మీకు ఇష్టమైన వారి గురించీ, విషయాల గురించీ మీరు టపా కామెంట్లలో తెలుపండేం? ఇవి ఎక్కువ గా తెలుగు ప్రపంచం నుంచే అయి ఉంటాయి. వీరు మీకు ఎందుకు నచ్చారు అని అడిగితే, నేను ఆటే సమాధానం చెప్పలేను. కానీ, కొంచెం వివరించటానికి ప్రయత్నిస్తాను.
నాకు నచ్చిన వ్యక్తులు:
1. గాయకుడు : బాల మురళి
ఆ గొంతు లోని లోతూ గాంభీర్యం వేరెవరికి ఉన్నాయి?
2. సినిమా గాయకుడు: ఘంటసాల, బాలు
ఘంటసాల గారి గాత్రం ఎవరికి ఇష్టముండదు? కానీ, కొన్ని రకాల పాటలు పాడటం లో ఆయనకు పరిమితులు ఉన్నాయనుకొంటాను.
బాలు గారు తెలుగు సినిమా పాటలలో సాహిత్యానికీ, సంగీతానికీ ఉన్న చివరి గౌరవప్రదమైన లంకె.
జేసు దాసు స్వరం బానే ఉటుంది గానీ, అయన పట్టి పట్టి పాడటం, ఉఛ్ఛారణా దోషాలూ నాకు పట్టివేస్తాయి!
3. గాయని : సుబ్బులక్ష్మి
భజగోవిందం విని ఇంకా ఆవిడ అభిమాని గా మారక పోతే ఎలా? ఆమె గొంతు లో ఉన్న “అతెంటిసిటీ”. ఒక్కో సారి ఆమె గొంతు గయ్యాళి గా వినపడటానికి నాది బాధ్యతా?
4. సినిమా గాయని
చిత్ర: ఎప్పుడన్నా ఒక్క పదం మలయాళం వాసన వచ్చినా, చిత్ర స్వరం అంటే మక్కువే!
అడవి రాముడు, యమగోల కాలం లో సుశీల “కై ,కై ” గొంతు వింటే చాలా కంపరం. జానకి పరవాలా! కానీ, ఆమె కొంచెం కైపు పాటలూ, చిన్న పిల్లల పాటలూ పాడేది. (వైరుధ్యం చూడండి). తరువాత “నా గొంతు శృతిలోనా..” అంటూ మొదలైన చిత్ర గొంతుకి నేను దాసోహం!
లతా మంగేష్కర్ పాత పాటలు బానే పాడేది. కానీ ఇప్పటి 18 యేళ్ళ హీరోయిన్లకు పాడితే, ఆమె స్వరం లోని వయసు మీరిన లక్షణం బయటపడుతోంది!
5. రాజకీయ నాయకుడు : సుందయయ్య, చంద్ర బాబు నాయుడు.
సుందరయ్య: అధికారపక్షం వారి నుంచీ కూడా గౌరవాన్ని పొందిన ఏకైక నాయకుడు. అలా గౌరవం ఇచ్చే వారు ఈ రోజులలో లేరనుకోండి.
చంద్ర బాబు: దీర్ఘకాలిక పధకాలు పెట్టటం, సంస్థలు నెలకొల్పటం, పార్టీకీ ప్రభుత్వానికీ మధ్య కొంత విభజన పాటించటం. మిగిలిన అన్ని విషయాలలో ఈయన కూడా సగటు రాజకీయ నాయకుడే!
పీ వీ ఒక నిజాయితీ దూరదృష్టీ కల తెలుగు ప్రధాన మంత్రి గా ఇష్టమే కానీ, ఆయనను ఒక గొప్ప నాయకుడనవచ్చునా?
6. నటుడు : N.T.R., చిరంజీవి.
నాకు ఊహ తెలిసేటప్పటికి నాటకాలు అటకెక్కాయి. అవి అప్పుడప్పుడూ మూలిగే మూలుగు వినపడేది. కాబట్టీ నాటకాలలో ఎవరు గొప్ప నటుడో చెప్పలేను. సినిమాలలో రామారావు చివరి సినిమాలు ఆడుతున్నాయి. అవి ఇప్పుడు చూస్తే కామెడీ గా ఉంటాయి . కానీ, ఆయన నటించిన పౌరాణికాలు చూసినపుడు అనిపించింది, “న భూతో న భవిష్యతి”. N.T.R. లాంటి నటుడు ఇక ముందు పుట్టబోడు. అది ఆయన గొప్ప కాదు. తెలుగు భాషా సంస్కృతీ అడుగంటి పోతున్న దశలో, మళ్ళీ అలాంటి నటన ఇక సంభవం కాదు.
చిరంజీవి మొదటి సినిమాలూ, బాపూ, విశ్వనాధ్, బాలచందర్ వంటి వారి దర్శకత్వం లో ఆయన నటన చూసినపుడు, చాలా సులువు గా అర్ధమౌతుంది, “ఆయనకున్న ప్రతిభేమిటో”. కానీ, ఎక్కడా..! మన వీరాభిమానులూ, వ్యాపార సూత్రాలూ ఆయనని ఒక మెగా స్టార్ ని చేసి, ఆయనలోని నటుడిని నొక్కేశాయి.
7. కవి: శ్రీ, శ్రీ, ఆత్రేయ
నాకు అర్ధమయ్యే సామాన్యమైన భాష లో అసామాన్యమైన భావాలను వ్యక్తీకరించిన మహా కవి. N.T.R లానే మరో శ్రీ శ్రీ పుట్టబోడు, అవే కారణాల వలన.
శ్రీ శ్రీ గొప్పదనానికి భాషమీద ఆయనకు ఉన్న పట్టు ఒక కారణమైతే, అత్రేయ “సినిమనసు” పాటలకు, కారణం భాష లో ఆయనకు ఉన్న పొదుపు. ఆయన పాటలు రాసినా వాటిలో కవిత్వం ఉంది కాబట్టీ, నా దృష్టి లో ఆయన కూడ కవే!
8. నటి: సావిత్రి
ఇప్పటి నటీమణుల లా శరీర కదలికల ద్వారా కాకుండా, ముఖ కవళికల ద్వారా నటన చేసినందుకు.
9. రచయిత: కొడవటిగంటి. కుటుంబ రావు, రా.వి. శాస్త్రి.
కొ.కు: రచనకి సంబంధించిన అనేకానేక ప్రక్రియలలో సాధికారమైన ఆధునిక రచనలు చేయటమే కాకుండా, అనేక తాత్విక, శాస్త్ర సంబంధమైన వ్యాసాలు రాసినందుకు.
రావి శాస్త్రి: రావిశాస్త్రి లా రాయాలంటే ఆయన మళ్ళీ పుట్టాలిసిందే. అనితరసాధ్యమైన, ప్రవాహసదృశమైన, కవితాత్మకమైన ఆయన శైలి. ఆయన రచనలలో అట్టడుగు లోకపు వాస్తవ చిత్రణ ఉంటుంది. ఈ అట్టడుగు స్థాయి వారి (మెజారిటీ ప్రజల) జీవిత వాస్తవ చిత్రణ ఎర్ర రచయితల(కారా మేస్టారు ఇంకొక ఉదహరణ) రచనలలోనే ఎక్కువ గా ఎందుకు ఉంటుంది? మార్క్సిస్టు వాస్తవాన్ని చూపించాలంటే, ముందు వాస్తవాన్ని చూపించాలి, తరువాత దానికి ఎర్ర రంగు అద్దాలి. కానీ మిగిలిన నిబధ్ధత లేని రచయితలకి వాస్తవాన్ని చూపించవలసిన ఆగత్యం కూడా ఉండదనుకొంటా!
10. సినిమా దర్శకుడు : విశ్వనాధ్, బాలచందర్
కొంచెం డీసెంట్ గా సినిమాలు తీసే దర్శకులని మన చిత్రసీమా, ప్రేక్షకులూ బతకనివ్వరు. ఎప్పుడన్నా విశ్వనాధ్ వంటి వారినీ, అప్పుడప్పుడూ బాలచందర్ వంటి వారినీ బతకనిస్తుంది. బాలచందర్ వి చాల వరకూ డబ్బింగ్ లూ, రీమేక్ లే. కానీ వాటిలో విషయం ఉంటుంది. లోతు ఉంటుంది. మరో చరిత్ర వంటి సినిమాలకి ఒక surreal aura ఉంది. మన మనసు లోలోపలి భావాలను, ఉద్వేగాలనూ, రహస్య వాంఛలనూ, తాత్కాలికం గా నైనా, బయట పడేటట్లు చేసే శక్తి బాలచందర్ సినిమాలకు ఉంది.
తమిళం లో భాగ్య రాజా సినిమాలు కూడా బానే ఉంటాయి. బాలచందర్ సినిమా లు చూస్తే వాటిలోని ఇష్యూస్ ఈ రోజు కి కూడా రిలవెంట్ గానే ఉంటాయి. కానీ భాగ్య రాజా సినిమాలు ఇప్పుడు చూస్తే, కాలదోషం పట్టినట్లు కనిపిస్తాయి. భాగ్య రాజా సినిమా ల లో ఒక రకమైన వెకిలి తనం కూడా ఉంటుంది.
11. సినిమా: మిస్సమ్మ
సునిసితమైన హాస్యం. ఆ హాస్యం, మరి, ఎవరి మానస పుత్రికో! మిస్సమ్మ దర్శకుడు LV ప్రసాద్ అని మాత్రమే తెలుసు. ఇది కాక బాలచందర్ సినిమాలు చాలా వరకూ నచ్చుతాయి.
12. అధ్యాత్మిక వ్యక్తి: U.G. కృష్ణమూర్తి.
అధ్యాత్మిక వ్యాపారం చేయని ఒక అరుదైన ఆధునిక మనిషి.
13. ఊరు: మా ఊరు.
కృష్ణ పక్కన ఉంది. మన మహా నగరాలను, వాటిలోని మనుషులనూ చూశాక, మా ఊరంటే ఇష్టం ఇంకా ఎక్కువైంది. విదేశాలా..అవి మనుషులున్న ఎడారులు!
14. ఆహారం : ఆవకాయ ముక్క, పెరుగు.
ఫైవ్ స్టార్ హోటల్లో వంటకాలన్నీ దీని ముందు దిగదుడుపే!
15. కూర: చిక్కుడు కాయ
గోరుచిక్కుడు కాయ అంటే మాత్రం అయిష్టం.
మా నాయనమ్మ వండుతూ ఉండే సీమతుమ్మ(సీమ చింత?) పప్పుల కూర. వగరు పప్పులు వాడితే కూర మరింత బాగుండేది.
16.పండు : రసం మామిడి కాయ, లిచీ
పళ్ళన్నీ ఇష్టమే! ముఖ్యం గా పైవి. ఒక్క బొప్పాయ కాయ తప్ప అన్నీ ఇష్టమే!
ఏవిటో! నేను అభిమానిద్దామన్నా, తెలుగు వారిలో నాకు శాస్త్రవేత్తలూ,సాంకేతికులూ దొరకటం లేదు. K.L. రావు, యెల్లాప్రగడ సుబ్బా రావు, నాయుడమ్మా వంటి వారి పేర్లు తెలుసు గానీ, వారిని ఎందుకు అభిమానించాలో ఇక్కడ ఓ రెండు ముక్కలు కూడా రాయలేను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఓ రెండు ముక్కలు రాయగలను . కానీ ఆయన పూర్తి గా తెలుగు వాడు కాదనుకొంటా! వై వీ రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు, విజయ రామా రావూ, KLN ప్రసాద్ వంటి బ్యూరోక్రాట్ల గురించి నేను రాసే దాని కన్నా గూగుల్ చేస్తే బాగుంటుంది. నాకు వారి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొనేంత పరిజ్ఞానం లేదు.
కూచిపూడి నృత్యం వంటివి చూడటానికి బాగుంటుంటాయి, కానీ వాటి గురించీ, ఆయా కళా కారుల గురించీ నా అభిప్రాయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు. వెంపటి చిన సత్యం గారి నాట్యం గురించి నా అభిప్రాయం వినటానికి ఎంత తప్పు గా ఉంటుందో!
———————————————————————————————
ఇంగ్లీష్, హిందీ సినిమాలు నేను చూసేది తక్కువ. నేను చూసినంతలో.. నాకు తెలిసినంత లో…
హిందీ నటుదు: సంజీవ్ కుమార్
సహజ నటుడు. ఆయన భాషా, డిక్షన్ గురించి మనం ఎక్కువ గా మాట్లాడలేం కదా?
హిందీ నటి:స్మితా పాటిల్
ఇంకోసారి..సహజనటి. మామూలు నిజ జీవితం లోని మనిషి లా కనపడటం.
హిందీ సినిమ: షోలే
ఇంతకంటే గొప్ప సినిమాలు చూసినట్లు గుర్తు లేదు. నసీరుద్దీన్ షా ఆర్ట్ సినిమాలు సగం సగం చూశాను. రిత్విక్ ఘటక్ సినిమాలూ, మృణాల్ సేన్ సినిమాలూ కొంచెం, కొంచెం చూశాను. ప్యాసా కొంచెం చూశాను.నాకు ఈ విషయం లో అర్హత లేదు.
ఇంగ్లీష్ రచయిత: మాం, డికెన్స్, చెకోవ్
డికెన్స్ great expectation చదివి ఆయన అభిమానినయాను. అందులో హీరోయిన్ హృదయాన్ని ఆయన మలిచిన తీరు అద్భుతం.
నిన్న మొన్నటి దాకా మన సమాజపు విలువలు, ముప్పైవ నలభైవ దశకం లో పాశ్చాత్య సమాజపు మొరాలిటీనీ వాతావరణాన్ని పోలి ఉన్నదనుకొంటా. అందు వలననే నాకు “మాం” రచనలలోని పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి.
చెకోవ్ రచనలలో ఉన్న pathos చాలా ఇష్టం.
సరేనండీ , ఇప్పటికే చాలా బోర్ కొట్టించేసి ఉంటాను. మళ్ళీ తరువాత…. మీరు తేరుకొన్న తరువాత బోర్ కొట్టిస్తాను.ధన్యవాదాలు.
వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ
11 Feb 2012 అభిప్రాయములు
in కథలు
సామాజిక వ్యవస్థ వ్యక్తిని ప్రభావితం చేస్తే వ్యక్తి “సామాజిక వ్యవస్థ” ని ప్రభావితం చేస్తాడు. ఇవి ఇలా సైక్లికల్ గా కొనసాగుతాయనేది పాత చింత కాయ పచ్చడి. రష్యా లో కమ్యూనిజం పడిపోవటానికి కారణాల్లో అక్కడ అధికారం లో ఉన్న వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటం ఒకటి. “వారికి ప్రత్యేక మైన దుకాణాలు తెరవటం, తక్కువ రేట్లకి అమ్మటం”, జరిగిందనే విషయం ఆ కాలంలో అక్కడ ఉండి వచ్చిన వారు చెప్పారు.
ప్రజాస్వామ్యం లో అధికారం లో ఉన్న వారి తప్పులను ఎత్తి చూపటానికి ప్రతిపక్షపార్టీలు ఉంటాయి. ఏక పార్టీ పాలన లో, దిగువున ఉండే తమ పార్టీ సభ్యులకి కొన్ని తాయిలాలు వేస్తే తాము అధికారం లో ఉండవచ్చు. తరువాత వారిని ప్రశ్నించేవారే ఉండరు. వారి పైఅదుపు ఉండదు. వారికి బాధ్యతలూ , జవాబుదారీ తనమూ ఉండవు. అధికార స్థాయి లో నైతిక విలువలు లేని వారు ఉంటే దానిని దుర్వినియోగ పరుస్తారు. రష్యాలో కూడా ఇదే జరిగింది. విలువలు ఉన్న వారు అధికార స్థాయి లో కొన్ని వందల యేళ్ళు నిరాటంకం గా ఉంటే అప్పుడు సమాజ వ్యవస్థ (నా దృష్టి లో మంచిదైన కమ్యూనిస్టు వ్యవస్థ) కూడా వ్యక్తులందరినీ విలువలు కలవారి గా మార్చేదేమో! కానీ దురదృష్ట వశాత్తూ అలా జరుగలేదు.
వ్యక్తులలో విలువలు ఎలా పెరుగుతాయి? వ్యక్తులలో విలువలు అక్కడి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థల వలన ప్రభావితం చేయబడతాయి. విద్యా వ్యవస్థ అన్ని రంగాలనుంచీ మంచి విలువలను గ్రహించి, వాటిని మనసులో నాటుతుంది. ఏవి మంచి విలువలు? సమాజ దీర్ఘకాలిక మనుగడ కి ఉపయోగ పడేవి మంచి విలువలు. విద్యా వ్యవస్థ నాటిన విలువలకి సమాజం లో రివార్డ్ ఉండేటట్లు అక్కడి రాజకీయ నాయకత్వం చూడాలి. ఈ విధం గా క్రమానుగతం గా మనుషుల నైతిక స్థాయి పెరగాలి. కొన్ని కొన్ని సార్లు తాత్కాలికం గా ఈ నైతిక స్థాయి తగ్గినా, దీర్ఘకాలికం గా ఈ నైతిక స్థాయి పెరగాలి. ఎందుకంటే, ఈ నైతిక విలువల మూలాలు మనుగడ లో ఉన్నాయి. ఒక వేళ వ్యక్తుల ఈ నైతిక విలువలు ఎక్కువ కాలం దిగజారుతూ పోతే, మనిషి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.
మనుషులకి తగిన నైతిక స్థాయి రాకుండా, వారి భావజాలం లో ఔన్నత్యం రాకుండా, వారి కోపాన్నీ ద్వేషాన్నీ ఒక అస్త్రం గా ఉపయోగించుకొని, సోషలిస్టు వ్యవస్థని తీసుకొని వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఒక సారి ఆ వ్యవస్థ శోష వచ్చి పడిపోయిందంటే, ప్రజలకి దాని మీద అపనమ్మకం ఏర్పడుతుంది. రష్యా పతనం తరువాత జరిగినది అదే! దీని వలన వారి ఆదర్శ రాజ్య స్థాపన మరింత వెనుకకి పోయింది. అది నెమ్మది గా పరిణామం చెందుతూ రావాలే కానీ, హింస తో బలవంతం గా రుద్దబడకూడదు.
ఇక ఈ టపా కి ప్రేరేపించినది శ్రీకాంత్ గారి బ్లాగు లో కుమార్ గారు ఇచ్చిన ఒక లింక్: http://www.telegraph.co.uk/news/politics/9061328/The-lessons-of-the-fall-of-communism-have-still-not-been-learnt.html
ఈ లింకు లో జానెట్ గారు ఏమి చెబుతోందంటే, “విలువలు అనేవి వ్యక్తులలో ఉంటాయి. అవి ఆర్ధిక వ్యవస్థలో ఉంటాయని కమ్యూనిజం తప్పుగా అనుకొంది. కమ్యూనిస్ట్ సమాజం లో (అధికారం లో ఉన్న వ్యక్తులకు విలువలు లేక పోవటం వలన అక్కడి వ్యవస్థ కుప్ప కూలింది”, అని. ఈ వాదన లో సగం నిజం ఉంది. అదేమిటంటే, విలువలు వ్యక్తుల ద్వారానే operate అవుతాయి, వ్యక్తుల విలువల లేమి వలన వ్యవస్థలు పడతాయి. అది కమ్యూనిజమైనా, కాపిటలిజమైనా సరే! కూలిన తరువాత అన్నివ్యవస్థలూ సమానమే! అందమైన బిల్డింగ్ కూలినా, మామూలు బిల్డింగ్ కూలినా,.. కూలిన తరువాత అంతా సమానమే కదా!
ఆవిడ వాదన లో లోపం “నైతికత అనేది వ్యవస్థలో లేదనుకోవటం” లో ఉంది. వ్యవస్థ యొక్క మెకానిజం లో కూడా నైతికత ఉంటుంది. “తయారు చేసిన దానిని లాభాపేక్ష లేకుండా పంచుకోవాలి”, అనే వ్యవస్థ తో పోలిస్తే, “డిమాండ్ పెరిగితే రేటు పెంచే వ్యవస్థ లో” నైతికత తక్కువే కదా? విలువలు ఉన్న వ్యవస్థ మేలిమి ఎప్పుడు తెలుస్తుంది?వ్యక్తులు అందరూ మంచి వారైనపుడు తెలుస్తుంది.
ఒక సమాజం లోని వ్యక్తులు దాదాపు అందరూ మంచి వారనుకొందాం. సగం మంది కాపిటలిజాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నారనుకొందాం. ఇంకొక సగం నిజాయితీగా కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నారనుకొందాం. అసలైన కాపిటలిజం లో కంపెనీలు డిమాండ్ ని బట్టి ధరను పెంచుతూ పోవచ్చు. వినియోగదారుడు భరించలేక కొనటం తగ్గించినపుడే ధరల పెరుగుదల అనేది తగ్గుతుంది. ఈ లోపు కంపెనీలు డబ్బు చాలా వెనుకేసుకొంటాయి. నష్టాలొస్తే కంపెనీ ని మూసివేస్తారు. లాభాలు వస్తే దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. కంపెనీ పెద్దదై “మోనోపొలీ” సాధిస్తుంది. చిన్న చిన్న కంపెనీలను కలుపుకొంటుంది. అసలు సిసలైన పెట్టుబడిదారీ లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.రెగ్యులేషన్స్ ఉండవు. మార్కెట్ డైనమిక్సే ధరలని నిర్ణయిస్తాయి. కాబట్టీ “మోనోపొలీ” అనేది నేరం కాదు. డబ్బు సంపాదించిన కంపెనీలూ వ్యక్తులూ డబ్బు విరివి గా ఖర్చుపెట్టి ద్రవ్యోల్బణం పెంచుతారు. సామాన్య మానవుడి బతుకు కష్టమౌతుంది. కానీ నిజాయితీ గా కాపిటలిజాన్ని నమ్మి అమలు చేస్తున్న వ్యక్తులకు ఇందులో తప్పేమీ కనిపించదు.
నిజాయితీ పరులైన వ్యక్తులు కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నపుడు, అక్కడ జనాల మౌలిక అవసరాలు తీరతాయి. ప్రజలు అవసరానికి మించి కష్టాలు పడనవసరం లేదు. కంపెనీలు పెట్టలేరు కాబట్టీ ఆవిధమైన దోపిడీ, ద్రవ్యోల్బణమూ ఉండవు. సమాజం లో డబ్బు చలామణి అవసరమైనంత వరకే ఉంటుంది. కష్టపడి పని చేసెవాడికి ఎక్కువ జీతం ఉంటుంది. కానీ వాడు డబ్బు కూడబెట్టి దానిని వారసులకి ఇవ్వలేడు. ఎందుకంటే వారసత్వం రద్దు చేయబడుతుంది. పరిపూర్ణ సమానత్వం ఉండదు. వృత్తిని బట్టి డబ్బులు ఎక్కువో తక్కువో వస్తాయి. కానీ సంపద ఒకే చోట కొండలు గా పోగుపడదు.
ఈ రెండూ పోల్చి చూసినపుడు, “వ్యవస్థ మెకానిజం” లో కూడ ఎక్కువ నీతివంతమైన వ్యవస్థలు ఉంటాయని బోధపడుతుంది. కమ్యూనిజం ఎక్కువ నైతిక మైనదని అర్ధమౌతుంది.
కొంతమంది కమ్యూనిస్టు వాదులు “కాపిటలిస్ట్ సమర్ధకులు కాపిటల్, మనిఫెస్టో చదవటం లేదు కాబట్టీ, కాపిటలిస్ట్ సమర్ధుకులకి కమ్యూనిజం సరిగా అర్ధం కాలేదు”, అంటారు. వెంటనే కాపిటలిస్టుల వాదన ఏమిటంటే, కమ్యూనిస్టు సమర్ధకులకు కాపిటలిజం అర్ధం కావటం లేదని. కానీ మార్క్స్ తన పుస్తకాలు రాసినది కాపిటలిస్ట్ వ్యవస్థలోనే. ఆయన పుస్తకాల నిండా కాపిటలిజం విశ్లేషణే ఉంటుంది. ఆయనకు కాపిటలిజంగురించి తెలియదని చెప్పటం సాహసమే!
కమ్యూనిజం ఒక మతం వంటిదే, అంటారు ఇంకొందరు. దానికి లేని గొప్పదనాన్ని ఎందుకు ఆపాదించాలి? నాకు అది సామాజిక రాజకీయ సిధ్ధాంతం మాత్రమే అనిపిస్తుంది. ఆ సిధ్ధాంతం లో తప్పులుండవచ్చు, ఒప్పులుండవచ్చు. అది వేరే విషయం.
శ్రీరాం గారు, “పాశ్చాత్య మేధావులకి, ఒకప్పుడు వారి ప్రభుత్వాలు మనలని దోచుకొన్నది గుర్తుకు రాలేదా?”, అని అడిగారు. ఒక్కసారి మానిఫెస్టో, లో india అని సెర్చ్ కొట్టంది, తెలుస్తుంది . ఆ చిన్న పుస్తకం లోనే “అక్కడి పెట్టుబడి దారులు మన దేశాలని దోచుకొంటున్నారని మార్క్స్ చెప్పాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా, “నువ్వు అన్నీ మార్క్సిజం లోనే ఉన్నాయి అంటున్నావంటే”, ఇక నేను చెప్పేదేమీ లేదు!
అలానే స్పెషలైజేషన్ పెరిగే కొద్దీ,ఉద్యోగుల జీవితం సుఖప్రదమవ్వక పోగా, వారి కష్టాలు పెరుగుతాయనీ అన్నాడు. టెక్నాలజీ పెరిగినపుడు, సహజ వనరులను సంపద గా మార్చే ప్రక్రియ వేగవంతమై, మెజారిటీ జనాలు సుఖ పడాలి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగుల, జనాల కష్టాలు పెరుగుతున్నాయనేది నిజం. జీవన వ్యయం పెరిగి చాలా మంది మధ్య తరగతి లోంచీ దిగువ మధ్య తరగతికి తోసి వేయబడుతున్నారు (ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కూడా!) అలానే “ఐటీ” రంగం లోని వారు అది వచ్చిన కొత్తలో ఎగువ మధ్య తరగతి లో ఉండే వారు. ఇప్పుడు మామూలు మధ్యతరగతి గా తయారయ్యారు.
శ్రీకాంత్ గారు, “రష్యా పతమమైనపుడు చాల చర్చలు జరిగాయి, ఇక ఇప్పుడు అనవసరం అన్నారు. “, అయితే, “చచ్చిన కుక్కను ఎందుకు తన్నుతున్నారు?”
చివరి గా నేనేమీ కమ్యూనిస్ట్ ని కాదు. “దానిలోని లోపాలు” అని నేననుకొన్న వాటిని గురించి చాలా టపాలలో రాశాను. అందుకనే నా మీదకి దండెత్తి రాకుండా, రాజు గారు చెప్పినట్లు, “వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ”, వచ్చేటట్లు చర్చిస్తే బాగుంటుంది. అసలు చర్చే అవసరం లేదంటారా, ఇక సెలవు!
Covert Powden: My primary value is “Truth as perceived by me”. At times if the Truth is in favor of communism, I support communism. At some other time if the Truth is in favor of capitalism , then I do not hesitate to support capitalism. It’s my subjective Truth. I do not have access to absolute Truth, after all
చింత చెట్టు మీద కాకుల సమావేశం
05 Feb 2012 అభిప్రాయములు
in రాజకీయం
“కావ్ ..కావ్..ఈ కాకేదో తేడాగా ఉంది..అందరూ రండీ..”, అని కూసింది హెడ్ కాకి.
వెంటనే ఆ చుట్టు పక్కల ఊళ్ళలోని కాకులన్నీ వచ్చి ఆ ఊరి బయటి చింత చెట్టు మీద వాలిపోయాయి.
“ఏమిటి విషయం?”, అంది ఒక “గుంపులో గోవిందయ్య” కాకి.
“చూడండి. దీని కూత తేడా గా ఉంది. పైగా ఇది ఏమందో తెలుసా..? “కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది హెడ్ కాకి.
“వార్నీ! అయితే దీనిని పొడవాలిసిందే..!తన్నాల్సిందే..!తన్నండి..తన్నండి”, కాకులన్నీ తమ ఇనప గోళ్ళతో ఆ ఎర్ర కాకిని ఎగిరి తన్న సాగాయి.
“ఇంకా ఏమందో తెలుసా? మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ, కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.
“తప్పు రా ఎర్ర కాకీ. వేదాలలో అంతా మంచే ఉంది. వేదాలూ గీతా అన్ని వర్ణాలూ సమానమనే చెప్పాయి. ఆచరణలో విఫలమైతే వేదాలదా బాధ్యతా..? వాటిలో అనేక కనిపెట్టబడని నిగూఢార్ధాలున్నాయి.గురజాడ వంటి మహా కవి, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, అని చెప్పలేదా? అయినా వేదాల ను ప్రశ్నించటానికి నువ్వెంతా నీ అనుభవమెంతా? పిల్ల కాకీ!” అని , మిగిలిన కాకులతో, ” వీడిని మళ్ళీ మీ వాడి ముక్కులతో పొడవండి…కావ్..కావ్..వీడు “ఐ ఎస్ ఐ” ఏజంటైనా ఉండాలి లేక చైనా ఏజంటైనా ఉండాలి,” అంది గుంపులో గోవిందయ్య కాకి.
హెడ్ కాకి: విమానాలూ, అణు బాంబులూ గట్రా మన వేద కాలం లోనే ఉన్నాయని నేనంటే, “అప్పటి డిజైన్లు మొన్నీ మధ్య పరీక్షిస్తే ఫెయిలయ్యాయని” చెప్తోంది. ఇంకా..”మన వాళ్ళ ఫేక్ రెజ్యూం లలా, అవి ఫేక్ డిజైన్లా?” అని వెక్కిరిస్తోంది. పైపెచ్చు. “విమానాలు ఆ కాలం లోనే ఉంటే వాటి అవశేషాలు పురావస్తు తవ్వకాలలో ఎందుకు బయట పడలేదు?” అంటోంది. నేనన్నాను, “పురావస్తు తవ్వకాలలో బయట పడటానికి అవేమన్నా భౌతిక వస్తువులా? మన రుషుల మంత్ర శక్తి తో ఉద్భవించిన అధిభౌతిక వస్తువులు కదా?” …. దానికి ఈ పిల్ల వెధవ ఏమందో తెలుసా?..” మీ వాదనలకి ,మీ వ్యక్తిగత నమ్మకాల ఆధారం లేని ఏదైనా నిరూపణ చూపించండి!”.
“అదేమి కూసినా, నువ్వు బాగా సమధానం చెప్పావు. వీడు మన పూర్వీకుల ఈకలు పీకుతున్నాడు , కాబట్టీ, వీడి ఈకలు పీకండి,” అని మిగిలిన కాకులకి పిలుపునిచ్చింది గు.గో. కాకి.
హెడ్ కాకి మళ్ళీ కావ్ భాష లో చెప్పింది, “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం”, అని కూడా అంది.
“ఇది దీనికి వచ్చిన ఆలోచన కాదు. ఆ తమిళ రామస్వామో, లేక తెలుగు రామస్వామో చెప్పిన మాటలను విని చెడిపోయింది. ఆ రామ స్వాములను లోకమంతా మరిచిపోయింది. కానీ, ఇది మరిచిపోలేదు. ఇంకా నయం.. దీనికి కొ.కు, శ్రీ శ్రీ లాంటి వారి ఆలోచనలు తెలియవనుకొంటాను. తెలిస్తే కొంప మునుగుతుంది. ఈ లోపే, తన్నండి, పొడవండి.”
” ఇది ఈ మధ్య “కాకిత్వ వాదం” అదీ ఇదీ అని పేలుతోంది”
గు.గో కాకి పెద్ద గా అరిచింది, “అయితే దీనికి ఇన్నయ్య జబ్బు అయినా పట్టి ఉండాలి, లేక రాయో రప్పో తగిలి ఉండాలి. ముక్కులకి పదును పెట్టి మరీ దీనిని పొడవండి”
“అంతే కాదు, అప్పుడప్పుడూ దళిత-బహుజనులు అనే పదం వాడుతోంది”
“అమ్మో! అయితే అయిలయ్య రోగం పట్టుకొంది దీనికి. దీనిని చీరాల్సిందే! ఇంకా నయం “జై తెలంగాణా..” అని పాట పాడటం లేదు!”
“”జై తెలంగాణ..”, అని పాట పాడటం లేదు . కానీ, “చీ కొట్టినా పోవేరా ఆంధ్రోడా?”, అంటోంది.”, అంది హెడ్ కాకి.
“ఇది చాలా డేంజర్. దీనిని చెట్టుమీదినుంచీ తోసేయండి!, కాదు..కాదు..కానీ మనం సమైక్య వాదులం కదా! కాబట్టీ, చెట్టు మీదే ఉంచి ముక్కు తో పొడవండి”
“ఇది తనకు “అమెరికా పురం” లో ఎద్దు ను పొడవటానికి చాన్స్ వచ్చినా వెళ్ళలేదంట. అమెరికా పురం వెళ్ళిన కాకులన్నిటికీ కొంచెం స్వార్ధం ఎక్కువ అంటోంది”
గు. గో కాకి, వెటకారం గా ఎర్ర కాకి కళ్ళలోకి చూసి, ” ఛా.! మీ ఊరు కాకవరం లో ఎవరూ స్వార్ధపరులు లేరా?” అని ఎగిరి తన్నింది ఎర్ర కాకిని.
ఇంతలో ఒక అమాయకపు కాకి మెత్త గా గొంతు సవరించుకొని, “దాని పైత్యమేదో అది కూస్తుంది. ఇంతోటి దానికి దానిని ఎగిరి తన్నటం అవసరమా?”, అంది.
“దాని పైత్యం కూయటం లో ఉంటే, మా పైత్యం దానిని ఎగిరి తన్నటం లో ఉంది”, అని కాకులన్నీ అమాయకపు కాకిని ఎగిరి తన్నాయి. అమాయకపు కాకి కి “ఉలిపి కట్టె” అని పేరు పెట్టాయి. అమాయకపు కాకి మిగిలిన కాకులను intolerant bunch అని తిట్టుకొంటూ ఎగిరిపోయింది.
ఇంతలో అక్కడ గొర్రెలను కాసుకొంటున్న కాపరి ఒకడు ఓ రాయి తీసుకొని, “ఛీ, కాకి గోల!”, అని చింత చెట్టు మీదికి విసిరాడు. ఆ రాయి కాకులకి తగలకుండా దూరం గా పోయింది. కాకులన్నీ ఒక్కొక్కటీ జారుకోవటం మొదలు పెట్టాయి.
“మా పిల్లల కి దొండ పండు తేవాలి”, అని ఓకాకి అంటే, “మా ఆయనకి ఎద్దు పుండు చూపెట్టాలి “, అని ఇంకొక కాకి అంది.
గొర్రెల బుడ్డోడు ఈ సారి గురి తప్పకుండా విసిరాడు. అప్పటికే కాకులన్నీ జారుకున్నాయి.
“కుహూ, కుహూ”, అంటూ ఓ నల్లటి సన్నటి పక్షి బయట పడింది చింత చెట్టులోంచీ!
కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )
09 జన 2012 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:capitalism, communism, etc
ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.
1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు
)
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది. మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ, భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది. కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది. .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు. ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.
ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm) దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.
10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.
ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework), తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో! వ్యక్తులు కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు. నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!
అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.
10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.
డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు. డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.
11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).
12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.
13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?
అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.
కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!
14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది. అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.
మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.
15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.
16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు. సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.
17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ) ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )
18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.
మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.
19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు, ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?
ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా? OK . Then, have a nice weekend.
ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..
05 జన 2012 అభిప్రాయములు
in సమాజం
కథలు రాయాలనే బులపాటం చాలా మందికి ఉంటుంది. అచ్చు లో తమ పేరు చూసుకోవాలనో, పేరు తెచ్చుకోవాలనో, తమ భావాలనూ ఆలోచనలను పంచు కోవాలనో రాస్తారు.
నేనేమీ గొప్ప కథకుడిని కాదు. కనీసం చిన్న కథకుడిని కూడా కాదు. కథలు రాయాలని ఒకప్పుడు ఆశపడిన ఔత్సాహికుడిని మాత్రమే!
కథలు రాసే క్రమం లో నేను తెలుసుకొన్న విషయాలు, నా లాంటి కొత్త ఔత్సాహికులకు ఉపయోగపడతాయని, ఇక్కడ:
1. మీరు మీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథ రాయాలనుకొంటే, మరొక్క సారి ఆలోచించుకోండి. అభిప్రాయాలను వ్యాసాల ద్వారా సూటి గా చాల తక్కువ మాటలలో చెప్పవచ్చు. ఒక ఇరవై పేజీల కథ ద్వారా చెప్పే అభిప్రాయాన్ని , ఓ వాక్యం ద్వారా వ్యాసం లో చెప్పవచ్చు.కథ, రచయిత అభిప్రాయాలను ఏదో ఒక స్థాయి లో ప్రతిబింబిస్తుంది. కానీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథను రాయనవసరం లేదు.
2. కథలు రాయటం చిత్రాలు గీయటం లాంటిది, మట్టి తో బొమ్మలు చేయటం లాంటిది. ఉదాహరణ కి ఒక స్త్రీ బొమ్మ ఎంత నిజమైన స్త్రీలా కనపడితే అంత ఆ బొమ్మ గొప్పది అవుతుంది. అలా అని బొమ్మ నిజం కాదు. బొమ్మ బొమ్మే. అది వాస్తవ భ్రమ ను కలుగజేస్తుంది. ఈ సూత్రం కథలకు కూడా వర్తిస్తుంది.కథ అనేది నిజం లా అనిపించే “అందమైన” అబధ్ధం. దీనినే శిల్పం అంటారు. కథ రాసే వారికి అందమైన కల్పనలు చేసే ఆసక్తి ఉండాలి. వాస్తవం లో ఉన్న చెత్త అంతా కథల లోకి ఎక్కటం బాగుండదు. కథలు ముఖ్యం గా మనిషి మానసికప్రపంచం లో చోటున్న విషయాల గురించి రాస్తాము. మన మానసిక ప్రపంచం లో ఏ విషయాలకి చోటు ఉంటుంది అనేది మన విలువలూ ప్రాముఖ్యతలూ నిర్ణయిస్తాయి.మన చేతన లో చోటు లేని విషయాలకి అంతశ్చేతన లో చోటుంది. (ఉదా: నిషిధ్ధమైన సెక్స్) . వాస్తవాన్నే కొలబద్ద గా పెట్టుకొంటే, మన మానసిక ప్రపంచం లో స్థానం లేని అనేక విషయాలు (కాల కృత్యాలు తీర్చుకోవటం లాంటివి) కథలలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ వాస్తవ విషయాల ఆధారం గా కథలు రాస్తే అవి మళ్ళీ మన మానసిక ప్రపంచం లోనీ విషయాల గురించే ఏదో ఒక పాయింట్ చెప్పేవై ఉండాలి. వాస్తవ విషయాలను వాటి యధాతధ నిడివి తో కథలలో ప్రస్తావిస్తే అది వాస్తవికత కాజాలదు. ఒక వ్యక్తి పది నిమిషాలు పళ్ళుతోముకొంటే, కథలో ఆ వర్ణన పది నిమిషాల పాటు ఉండజాలదు కదా!
వ్యాసాలు నేరు గా పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తే, కథలు సబ్-కాన్షస్ గా ప్రభావితం చేస్తాయి.
3. కథకు ఒక ఇన్స్పిరేషన్ ఉండవచ్చు. ఆ ఇన్స్పిరేషన్ తో సంఘటనలూ, సన్నివేశాలూ అల్లటం లో కథకుడి ప్రతిభ బహిర్గతమౌతుంది. కథ ద్వారా ఒక భావోద్వేగ పరమైనా, లేక ఆలోచనా పరమైన సత్యాన్ని కథకుడు చెప్పగలగాలి.అంటే కథ చదివే వారి లో భావోద్వేగాలనైనా కలిగించగలగాలి, లేక ఆలోచనలనైనా రేపగలగాలి. సన్నివేశాలు అల్లటం కోసం కష్టపడే వారు, “ఇంకా కథలు అల్లటం నేర్చుకోవాలి” అని అర్ధం.పాత్రలకి “నిజ జీవితం లో వ్యక్తులకి ఉన్న multi-dimesionality”, ఎంత ఎక్కువ గా ఉంటే అవి అంత సజీవం గా కనపడుతాయి
4.పరిభావనల స్థాయి లోనే ఆలోచనలు చిక్కుకు పోయి, వివరాలంటే పడని వారు కథలు రాయటం కష్టం.
5. తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవటానికి కథలు రాయవచ్చు. ఆ అనుభవాలూ, కథకుడి ఆలోచనా సరైనవైతే, పాఠకుడికి ఆ కథ ద్వారా నాణ్యమైన అనుభూతే దొరుకుతుంది. అయితే, నిజ జీవితం లోని సంఘటనల ఆధారం గా కథలల్లటం లో ఉన్న ప్రతిభ, పూర్తి కాల్పనిక కథలల్లటం లో ఉన్న ప్రతిభ కన్నా తక్కువ అనే విషయాన్ని కథకుడు అంగీకరించాల్సిందే!
6. కథలు చదివి ఆనందించే చాల మంది కథలు రాయటానికి ఉత్సాహపడతారు. కానీ రాయటం చదవటం కంటే భిన్నమైన ప్రక్రియ. ఇతరులు రాసిన కథలను చదివేటపుడు, కథకుడు చెప్పే పరిధిలోని విషయాలు మాత్రమే మన మనో ఫలకం పై ఆడతాయి. కానీ కథ రాసేటపుడు మన అనేక ఇష్టాఇష్టాలు priority ప్రకారం మనో ఫలకం పై ముందుకు వస్తాయి. ఉదాహరణ కు ఇతరులు రాసిన వర్ణనలు చదివి ఆనందించే మనం, రాసేటపుడు వర్ణనలు రాయలేక పోవచ్చు. కారణం వర్ణనలు మనకు ఇష్టమైనప్పటికీ, వాటికంటే మనకు వ్యక్తి గతం గా ముఖ్యమైన పరిభావనలూ మానవ సంబంధాలూ మన మనోఫలకం పైకి రావచ్చు.
మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే, వంట తిని ఆనందించే వాళ్ళందరూ వంట చేయటం ఇష్టపడనవసరం లేదని.చాలా సార్లు కథలు రాయటం లోని ఆనందం కంటే వేరే వాళ్ళు రాసిన కథలు చదవటం లోని ఆనందమే ఎక్కువ గా ఉంటుంది.
7. కథ కి సాంఘిక ప్రయోజనం ఉండాలా వద్దా? అని పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడను , కానీ, “కథ కు అంత సీన్ ఉందా?” అనేది నా సందేహం. రా.వి శాస్త్రి లాంటి వారు చివరి రోజులలో పెన్ను పక్కన పెట్టి, గన్ను పట్టాలన్నారు. కొ.కు(కొడవటిగంటి . కుటుంబ రావు) చివరికి కథలు రాయటం అపేశారు. చా.సో(చాగంటి సోమయాజులు) ముందే విరమించారు. ఫ్రెంచ్ విప్లవం నాటి పరిస్థితులు ఈ రోజున లేవు.
తెలుగు సమాజం లో, టాల్ స్టాయ్, హెమింగ్వే ల లా గన్ను పట్టి ఆ పై పెన్ను పట్టిన రచయితలెవరూ లేరు. ప్రముఖ రచయితలందరూ పట్నాలలోని తమ మధ్యతరగతి వాలు కుర్చీలలో సుఖం గా కూర్చొని పెన్ను పట్టి, ఇతరులను గన్నుపట్టమని ప్రోత్సహించినవారే!
శ్రీ శ్రీ మహాప్రస్థానం వంటి సులభమైన కావ్యమే, పాటక జనాలకు అర్ధం కాదు. పేద వారి గురించి రాసే కథలన్నీ, నాకు “పేద వారిని ముడి పదార్ధం గా తీసుకొని మధ్య తరగతి చేసుకొనే రస సృష్టి గా కనిపిస్తాయి.”
8. ఈ రోజుల్లో, తెలుగు కథలు రాసి డబ్బులు చేసుకోవాలనుకోవటం, “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అనేదాన్ని గుర్తు చేస్తుంది. యండమూరులూ, మల్లాదులూ మానేశారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.
9. కథలు ప్రధానం గా మానవ సమాజం లోని సంబంధాల ను చిత్రిస్తాయి. కానీ ఈ పరిధికి ఆవల ఉండే సైన్స్, టెక్నాలజీ, తత్వం, కాస్మాలజీ వంటి అనేక విషయాలపై కథలు చదివి వాటి పై అవగాహన పెంచుకోవటం కంటే, ఆయా విషయాలను నేరు గా చదివి అవగాహన పెంచుకోవటం సులువు. అందుకే కథలకు ఉండే ప్రభావం ఈ విషయలలో చాల పరిమితం.జీవితం లో ఉండే సవా లక్ష రంగాలలో, సాహిత్యం అనే ఒక చిన్న రంగం లో, ఒక కొత్త చిన్న ప్రక్రియ మాత్రమే కథ. దానికి ఉన్న పరిమితులు అనేకం.
10. మీకు అందమైన రసన కంటే ఆచరణ ఇష్టమైతే, కథలు రాయటం శుధ్ధ దండుగ.
11. సాహిత్యానికి సమాజం లో ఉండే స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని, ఊహలతో రాసిపారేయటం చాలా సులువు. దానికి కావలసింది కథలు రాసే ప్రతిభ మాత్రమే. పీపాడు ఆలోచనల కంటే, చెంచాడు ఆచరణ కొండంత మెరుగు. బయటకు వచ్చి సమాజం తో తలపడి పోరాడి సాధించటం చాలా కష్టం. వ్యక్తి గతం గా రచయితలు ఆచరించని ఆదర్శాలను ప్రబోధిస్తూ రచనలు చేసే హక్కు, రచయితలకు లేదు కాక లేదు.అత్యున్నత ఆదర్శాలూ, నీతులూ ప్రవచించే రచయితలు, ఏ ఆదర్శాలూ విలువలూ లేని రాజకీయ మీడియా సంస్థలు విసిరే కుక్క బిస్కట్లకూ ఉద్యోగాలకూ ఆశపడటం ఆ రచయితల ఆదర్శాల పైపూతలను తెలియజేస్తోంది. ఒక వేళ పొట్టకూటి కోసం ఆయా సంస్థలకు పనిచేస్తోన్నట్లైతే, ఆ విషయాలను నిజాయితీ గా, బహిరంగం గా ఒప్పుకోవటం మంచిది(శ్రీ శ్రీ లా).తన దాకా వస్తే గానీ తెలియదంటారు కదా మరి!
రచయిత ఓ ఆదర్శాన్ని పాటించాడని, అలా పాటించని వారిని తప్పుపట్టే హక్కు అతనికి లేదు. ఇతరులకి ఆ ఆదర్శాన్ని పాటించటం “రచయితకి అయినంత convenient” కాక పోవచ్చు. లేక, ఆ ఆదర్శం గురించి ఇతరులు convince అయి ఉండక పోవచ్చు. కాకపోతే ఇతరులకి ఆ ఆదర్శం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు.రచయిత కి ఆ ఆదర్శం పాటించటానికి ఎంత హక్కు ఉందో ఇతరులకి “పాటించక పోవటానికి” అంతే హక్కు ఉంటుంది.
12. మన వ్యక్తి గత గోడునూ, ఉద్వేగాలనూ,అనుభూతులనూ పంచుకోవటానికి కవిత్వం సరైన సాధనం అనుకొంటా.!
13. అసలు విషయం ఉంటే ఎవరైనా రాస్తారు. విషయం లేనప్పుడు కూడా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా వంటి విషయాలపై పేజీలకు పేజీలు రాసి జనాలను మెప్పించటం( జనాలకు వినోదాన్ని పంచటం) ఒక గొప్ప కళే. అలాంటి రాత గాళ్ళకు నా “సెల్యూట్”.
14. భాష పై పట్టు లేని వారు కథలకి దూరం గా ఉండటం మంచిది. కవిత్వం సంగతి చెప్పనవసరం లేదు.
15. గొప్ప రచయితల రచనలు చదివి, వాటి తో స్ఫూర్తిని పొంది రాయాలనుకొని కలం పట్టే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. ఎందుకంటే, గొప్ప రచయితలకు అప్పటికే జీవితం సగం అయిపోయి ఉంటుంది. లేక పూర్తి గా అయిపోయి ఉంటుంది. వారి వ్యక్తిత్వం వారి అనుభవాల సారం గా ఏర్పడి ఉంటుంది. వారి రచనలు వారి వ్యక్తిత్వం లోంచీ పుట్టుకొని వస్తాయి. వారి జీవితం లోని వయసు,దశలను బట్టి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మన లాంటి వారు వేరే స్థల కాలాల్లో ఉంటాం. అంటే మన వ్యక్తిత్వం వారి కంటే చాలా భిన్నం గా ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మెరుగ్గా, ఇంకొన్నిటిలో నాసి గా. కాబట్టీ వారి స్థాయి లో కథలల్లటం కష్టమే. అనుకరణ మాత్రం కుదరవచ్చు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అవసరమా?
16.విశాల సమాజం లో లానే రచయితల సమాజం లో కూడా కుల ప్రాంత మతాల కుమ్ములాటలూ, భావజాలపు పీకులాటలూ, రాజకీయాలూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!
17. ఈ రొజుల్లో తెలుగు రచయితకొచ్చే పాపులారిటీ కొన్ని వేల పాఠకుల సంఖ్యను మించకపోవచ్చు. అచ్చు లో మీ పేరు చూసుకోవాలంటే (పుస్తకం వేసుకోవాలంటే), మీ చేతి చమురు వదలవచ్చు.
18.తెలుగు రచనలకి భవిష్యత్తు లేదు. పీరియడ్. ఇంకో పదేళ్ళ లో, బళ్ళో తెలుగు మీడియం చదివే వారు దాదాపు మృగ్యమవుతారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి తెలుగు చదవటం నేర్చుకొన్న వారికి (అసలు నేర్చుకొంటే) తెలుగు చదివే ఫ్లూయెన్సీ చాలా తక్కువ గా ఉంటుంది (కాలేజి వరకూ తెలుగు మీడియం లో చదివిన నాకే, ఇంగ్లీషు మాటలు లేకుండా రాయటం కుదరటం లేదు). ఇక తెలుగు రచనలు చదివేది ఎవరు? చేసేది ఎవరు?తెలుగు లో రాయటం అనేది శిల్ప కళ లా “ఒకప్పుడు విలసిల్లిన కళ” కావటానికి ఎన్నో రోజులు పట్టదు.
19. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి. మీరు ఎప్పుడూ పుస్తకాలలో మునిగి తేలేటట్లైతే మీ పిల్లల మీద మీ ప్రభావం కంటే మీ భార్య ప్రభావం ఎక్కువ ఉంటుంది (వారి తో ఎక్కువ సమయం గడపటం వలన). శ్రీ శ్రీ గారు తన నాస్తికతను ఆయన ఇద్దరు భార్యలూ కొడుకు చేత కూడా ఆచరింప చేయలేకపోయారు. అలానే అనేక వామపక్ష మేధావుల పిల్లలు ఇప్పుడు అమెరికా లో ఉంటూ, తమ పెద్ద వారివి ఛాదస్తపు ఆలోచనలు గా భావిస్తున్నారు. ఇంట్లోనే మీ భావాలకు గొప్ప విలువ లేని పరిస్థితి దాపురించ వచ్చు. ఇంట్లో వారిని తమ ఆదర్శాల తో ఒప్పించలేని వారి భావాలను సమాజం ఒప్పుకోవాలనుకోవటం అత్యాశ కదా?
20. మీరు రాజకీయ సవ్యత ఉన్న తెలంగాణ వాదం, స్త్రీ వాదం, దళిత వాదం వంటి వాటికి వ్యతిరేకం గా కథలు రాసేటట్లైతే ఇంకొక సారి ఆలోచించుకోండి. పత్రికలు మిమ్మల్ని చూసి జడుసు కొంటాయి. మిమ్మల్ని ఆమడ దూరం లో పెడతాయి. ఎవరి సర్క్యులేషన్ వారికి ముఖ్యం కదా! అలానే పత్రికల పోకడల గురించి వ్యంగ్యం గా రాస్తే వాటిని ప్రచురించేంత విశాల హృదయం పత్రికలకు ఉండదని గుర్తుంచుకోండి.లౌక్యం అనేది కథలు రాసేవారికి కూడా అవసరం మరి.
21. పబ్లిషర్లూ, పత్రికలలో ఉండే ఉద్యోగులతో స్నేహాలూ, నెట్వర్కింగూ లేని వారు,తమ కథలను పబ్లి ష్ చేసుకోవటం గురించి పునరాలోచించుకోవలి.
22. జీవితం లో రచయిత ఉండే మూడ్ ని బట్టీ, జీవిత దశ ని బట్టీ కూడా అతని రచనలు ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న రచయిత హాస్య రచనలు రాయటం కష్టం.అంతర్ముఖుడైన రచయిత సంభాషణలు రాయటానికి కష్టపడవచ్చు. డెబ్బై యేళ్ళ రచయిత రొమాన్స్ రచించటం అరుదు (ఆ రచయిత మనసు కవి ఆత్రేయ లాంటి వాడైతే తప్ప).
పాపులర్ తెలుగు టపాలు రాయటం ఎలా? : కొన్ని సూత్రీకరణలు
31 డిసెం 2011 అభిప్రాయములు
in తెలుగు ట్యాగులు:how to write popular posts
ఈ కింది సూత్రీకరణలు మీకు ఇంతకు ముందే తెలిస్తే, ఈ టపా ని skip చేసేయండి. “చదవకుండా ఎలా తెలుస్తాయి?” అంటారా? తీరా చదివిన తరువాత..”అబ్బే! ఇవన్నీ మాకు ముందే తెలుసు”, అనొద్దు మరి.. ..
1. తెలుగు బ్లాగులను ఒక సీరియస్ సబ్జెక్ట్ లా చదివే వారు చాలా తక్కువ ఉంటారు. “ఆఫీస్ లో బోర్ కొట్టినపుడో, ఇంట్లో ఉబుసు పోకో, బ్లాగులు ఫాలో అవ్వటం అలవాటయ్యో, ఉద్యోగాలలోంచీ రిటైర్ అయ్యో, ప్రభుత్వోద్యోగాల్లో ఉండో, పెద్దతనం లో తమ పిల్లల తో పాటు అమెరికా చేరో,” ఈ బ్లాగులను చదివే వారే ఎక్కువ. సీరియస్ సబ్జెక్ట్ లు(ఫిలాసఫీ, సైన్సూ, టెక్నాలజీ, ఇంజినీరింగూ, సామాజిక శాస్త్రం, మన్నూమశానం.. ) నేర్చుకోవాలంటే అందుకు కాలేజీలూ, యూనివర్సిటీలూ ఉన్నాయి. బ్లాగులు దానికి వేదిక కాదు. కాబట్టీ, టపాలు సరదా గా వీలైనంత మందిని అలరించేవి గా, లైట్ రీడింగ్ కి ఉపయోగపడేవి గా , కాలక్షేపానికి పనికి వచ్చేవి గా ఉంటే ఎక్కువ మంది చదువుతారు.
ఒక వేళ ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి వచ్చినా దానిని sugar coated pill లా సరదా గా చెప్పాలి.
2. ఏ భాషా బ్లాగులలో అయినా sex sells. నేరు గా సెక్స్ రాస్తే సంకలినులు బ్లాగులను పీకేస్తాయి. కాబట్టీ, ఇండైరెక్ట్ గా సెక్స్ “గురించి” రాసిన ఏ టపా ని అయినా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
3. controversial విషయాల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు. తెలుగు సమాజం లో caste అనేది ఒక incendiary thing. అలానే తెలంగాణా, రిజర్వేషన్లూ, హిందూత్వ ల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు.
4. నలుగురి imagination లోనూ నానుతున్న current event గురించి కూడా చదువుతారు. ఉదా: డర్టీ పిక్చర్.
5. ఎక్కువ మంది పాఠకుల కి సంబంధించిన విషయాలని కూడా పాఠకులు చూస్తారు. స్త్రీ పురుష సంబంధాలు సమాజం లో దాదాపు నూరు శాతం జనాలని కవర్ చేస్తాయి. కాబట్టీ వీటిని గురించి కూడా చదువుతారు.
6. పాపులర్ బ్లాగర్ గా పేరు తెచ్చుకొన్న వారి టపాలకి minimum guarantee ఉంటుంది, సూపర్ స్టార్ ల సినిమాల కి మినిమం కలెక్షన్లు వచ్చినట్లు గా (సూపర్ స్టార్ బ్లాగర్ ల కి , ఈ టపా లో చెప్పిన మెజారిటీ విషయాలను పాటించటం వలన ఆ స్టార్-డం వస్తుంది.)
7.తెలుగు బ్లాగ్లోకం అసలు తెలుగు లోకానికి ఒక sample లాంటిది. ఐతే, ఇక్కడ చదువు కొన్నవారు ఎక్కువ. కాబట్టీ, అసలు తెలుగు లోకం లో జనాదరణ ఉన్న చాలా విషయాలకి బ్లాగ్ లోకం లో కూడా జనాదరణ ఉండే అవకాశం ఎక్కువ. ఉదహరణకి సినిమా గాసిప్పులూ, క్రికెట్ కబుర్లూ,రాజకీయాలు. కాకపోతే, కొంచెం క్లాస్ సినిమాలూ, క్రికెట్ గురించి కొంచెంలోతైన విశ్లేషణలూ.
8. అసలు విషయం ఉన్న కథలూ, టపాలకి కూడా ఆదరణ ఎక్కువ.
9. రేటింగ్స్ ఎక్కువ వచ్చిన టపా కి కామెంట్సూ, హిట్సూ ఎక్కువ వస్తాయని చెప్పనవసరం లేదు కదా?
10. అమ్మాయిల బ్లాగులకి (వయసు మళ్ళిన అమ్మాయిలు కాదండీ) అబ్బాయిల బ్లాగుల కన్నా కొంచెం రద్దీ ఎక్కువ. ఎందుకో చెప్పనవసరం లేదు.
11. నాలా “వేసినటపానే జనాలు చదివే వరకూ మళ్ళీ వేయటం” వలన వాటిని ఎక్కువ మంది చదివే అవకాశం ఎక్కువ.
12. తెలుగు బ్లాగులు చదివే వారిలో చాలా మంది తమ సొంత బ్లాగులు కూడా నడుపుతారు. దీనిలో నాకు కొంత conflict of interest కనపడుతుంది. దీని వలన పక్కవాడి టపా బాగున్నపటికినీ, మన మొదటి అభినందన కొంత ఆలశ్యం అవ్వవచ్చు.
13. పై పాయింట్ వలన, ఒక్క సారి పక్కవాడి టపా ని మెచ్చుకొంటే, తరువాత అతను మన టపా ని మెచ్చుకొంటాడు. ఈ రకం గా పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు. ఇక సామాజిక వర్గాల పరం గా, అభిప్రాయాలూ, సిధ్ధాంతాల పరం గా,లింగపరం గా, ప్రాంతపరం గా,ఊరి పరం గా,వయసు పరం గా ఏర్పడే గ్రూప్ ల సంగతి చెప్పనవసరం లేదు. ఈ గ్రూపుల్లో ఉంటే కామెంట్స్ వలన బ్లాగ్ పాపులారిటీ పెరుగుతుంది.
14.టపా వేసే టైం ని బట్టి కూడా టపా కి స్పందనలు ఉంటాయి. ఏ అర్ధ రాత్రో, సంకురాత్రి రోజో వేసే టపా ని ఎవరు చదువుతారు, చెప్పండి?
ఇక కామెంట్లూ, హిట్స్ విషయానికి వద్దాం.
1.టపా పేరు ఆసక్తికరం గా ఉంటే, హిట్స్ ఎక్కువగా ఉంటాయి.
2. టపా లో జనాలను ఆకట్టుకొనే విషయం ఉంటే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి.
3. వారాంతాలలో కామెంట్స్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పాఠకులకి తీరిక ఎక్కువ గా ఉండటం వలన అనుకొంటా!
4. ఇతరుల టపాలకి కామెంట్స్ పెట్టని వాళ్ళ టపాలకి కామెంట్స్ వచ్చే అవకాశం తక్కువ కదా!
5. కామెంట్స్ ఎక్కువ వచ్చిన టపాకి ఇంకా ఎక్కువ కామెంట్సూ, హిట్సూ వస్తాయి (courtesy: maalika,koodali comments section), హిట్ టాక్ వచ్చిన సినిమాకే ప్రేక్షకులు వెళ్ళినట్లు. (కాకి రెట్టేసినట్లు “good”, “interesting” అని కామెంటేసి మళ్ళీ తిరిగి చూడని వారి కామెంట్లు దీనికి మినహాయింపు.)
6. కొన్ని niche బ్లాగులు చదవటానికి ఆయా విషయాలలో పాండిత్యం అవసరం. వాటికి, సత్యజిత్ రే, సినిమాలకి ఉన్నట్లు, niche రీడర్స్ ఉంటారు.
7. కామెంట్లు రాసిన వారికి కొంచెం మర్యాద చేస్తే వాళ్ళు మళ్ళీ కామెంటుతారు. మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి. దానికి response రాదు. ఎందు కంటారు? బడుగు జీవుల మాటలను ఎవరైనా పట్టించుకొంటారా?
పైన చెప్పిన సూత్రాలు కాకుండా మీకు ఏమైనా తోస్తే, కామెంటండేం? పైన చెప్పిన విషయాలు తప్పయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అలా భావిస్తే నిర్మొహమాటం గా చెప్పేయండి.
PS: బ్లాగు చర్చల్లోని అభిప్రాయాలనూ, వాదాలనూ, రాతలనూ, ఆవేశ కావేశాలనూ సీరియస్ గా తీసుకొను వాడు “దున్నపోతై పుట్టున్!”. ఎందుకంటారా? చూడుడు: ఈ టపా లో మొదటి పాయింట్.బ్లాగర్లకు రాజకీయ నాయకులకు ఉన్నంత విశ్వసనీయత కూడా ఉండదు.రాజకీయ నాయకులైతే వారి పేర్లు తెలుస్తాయి. వారి ఊరు ఏమిటో తెలుస్తుంది. దీని వలన వారు కొంచెం (చాలా కొంచెం)బాధ్యత గా ఉండాల్సి వస్తుంది. మారు పేర్ల వెనుక దాకునే ఊరు లేని బ్లాగర్లకి ఈ మాత్రం విశ్వసనీయత కూడా ఉండదు.
విశ్లేషణలు అక్కరలేని సందర్భాలు..
30 డిసెం 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చొన్నాం.
హఠాత్తుగా మా స్నేహితుడి నాలుగేళ్ళ చిన్న క్యూట్ పాప “షేం, షేం” అంది.
తల తిప్పి చూస్తే ఆ పాప తన చూపుడు వేలూ మధ్య వేలూ కలిపి టీవీ వైపు చూపిస్తూ మళ్ళీ అంది, “షేం షేం”.
టీవీ లో ఏమి వస్తుందా అని చూస్తే అక్కడ ఒక న్యూస్ చానల్ లో డర్టీ పిక్చర్ గురించి విద్యా బాలన్ ఎక్స్-పోజింగ్ చూపించే ప్రోగ్రాం నడుస్తోంది.
ఏది సభ్యత, ఏది అసభ్యత,అసభ్యత చూసే వాళ్ళ కళ్ళలో ఉందా? చేసే వాళ్ళ చేష్టలలో ఉందా? అని పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరమా?
************
నా చిన్నపుడు..మా పల్లెటూరి స్కూల్ కి ఫర్నీచర్ సప్లై చేయటానికి హైదరాబాద్ నుంచీ ఓ ఇద్దరు వచ్చారు. ఒకాయన పూల పూల చొక్కా వేసుకొని, దాని మీదకి చిల్లులు ఉన్న జీన్స్ వేసుకొన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొన్నాడు. పిల్లి గడ్డం కూడా ఉంది. .
అతనిని చూసి,”ఏందబ్బా పగటి వేషగాడిలా ఉన్నాడు. మన ఊరి కుక్కలు చూస్తే వెంటబడతాయి”, అన్నాడు నా ఫ్రెండ్.
అది ఆ సాయంత్రానికి కన్-ఫం అయింది. మా ఊరి ధర్మాసుపత్రికి కుక్క కాటు వైద్యం కోసం ఆ “ఒకాయన” వచ్చాడని అక్కడ పని చేసే ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ద్వారా తెలిసింది.
********************
ఆ రోజుల్లో ఉత్తర భారతం లోని ఒక కాలేజీ హాస్టల్లో ఉండే వాళ్ళం. హాస్టల్ మెస్ లో రోటీలు పెట్టేవారు. ఆ రోటీలు చాలా చెత్తగా ఉంటున్నాయనీ. మెస్ సెక్రటరీ వార్డెనూ కలిసి డబ్బులు మింగి కల్తీ రొట్టెలు పెడుతున్నారనీ విద్యార్ధులందరం సమ్మె చేశాం.
వార్డెన్ మా అందరినీ చర్చలకు పిలిచాడు.
“రోటీల క్వాలిటీ బాగోలేదని ఎలా చెప్పగలరు? మనం ఏవిషయాన్నైనా సాపేక్షం గా చూడాలి. ఒక కోణం నుంచీ చూస్తే అవి చాలా మంచి రొట్టెలు. ఈ రొట్టెలు లేకే దేశం లో చాలా మంది బాధ పడుతున్నారు”, అని తన “చాతుర్రిం” చూపటం మొదలు పెట్టాడు వార్డెన్. చర్చల సందర్భం లొ మాటా మాటా పెరిగి మా లో ఒకతను “మెస్ లో పెట్టే రొట్టె లను కుక్కలు కూడా ముట్టవు “, అన్నాడు.దానికి మెస్ సెక్రటరీ ఆవేశం గా, “మరీ అన్యాయం గా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కుక్కలకు రొట్టెలు వేసి చూద్దాం”, అన్నాడు.
సరే అంటే సరే అన్నారంతా. మెస్ కుర్రాడిని పిలిపించి, మా క్యాంపస్ లో విరివి గా ఉండే కుక్కల చెట్టుకింది కుక్కలకి ఆ ఉదయం చేసిన రొటీ లు వేయించారు. అవి, ఆ రోటీలను మూచూసి, వెనక్కి తిరిగి, వెనక కాళ్ళ తో ఆ రొట్టెల పై కి దుమ్ము చిమ్మి కప్పి పెట్టాయి. దానితో వాదనలు బంద్! రోటీలు మాత్రం మెరుగయ్యాయి.
**********
చట్ట సభలలో ప్రభుత్వాలు అనేక పధకాల గురించిన చర్చలు చేస్తాయి. విశ్లేషణలూ వాదోపవాదాలకు కొదవ లేదు. రాజు గారికి బట్టలు లేవని ఒక చిన్న పిల్ల వాడు చెప్పవలసి వచ్చింది.
మన నాయకులూ,అధికారులూ రచించే పధకాలు ఉపయోగ పడ్డాయా లేదా అనేది, “విశ్లేషణలూ, మేధావిత్వాలూ లేని సామాన్య మానవుడు”, “తన రిపేరు కి నోచుకోని ఏ సైకిల్నో” చూపించి క్షణం లో తేల్చేస్తాడు, నాయకుల హామీలకి సంబంధించిన బట్టలు అసలు లేనే లేవని. ఈ లోపు మేతావులూ, నాయకులూ మల్ల గుల్లాలు పడుతూనే ఉంటారు “మనం వెనక్కి పోతున్నామా.., ముందుకు పోతున్నామా?”, అని.
