మగ వారి ఫిర్యాదులు..కొన్ని సరదాగా..కొన్ని నిజంగా..

ఈ ఫిర్యాదులు అందరి మగవారివీ కావండీ. నాలాంటి మధ్య తరగతి,లేక ఎగువ మధ్య తరగతి కుటుంబ రావులవీ, అందులోనూ పట్టణాలలో ఉండే వారివీ..

1.కుటుంబ రావు ఈ మధ్యే ఉద్యోగం మారాడు. హాఫ్ హ్యండ్స్ షర్ట్ వేసుకొని,మొదటి రోజు కొత్త గా మారిన ఆఫీసులోకి ఎంటరవబోయాడు. సెక్యూరిటీ వాడు కు.రా ని ఆపి “డ్రెస్ కోడ్ వయొలేషన్”, అని ఒక పుస్తకం లో కు.రా, చేత సంతకం చేయించాడు. కు. రా జీతం లోంచీ అప్పుడే కొంత కోత పడిపోయింది. పక్కనుంచే స్లీవ్-లెస్ లు వేసుకొన్న అమ్మాయిలు తమ లో తాము జోకులేసుకొంటూ నిరాటంకం గా ఆఫీసు లోకి వెళ్తున్నారు.

2.కుటుంబ రావు ని ఆఫీసులో బాసు పిలిచాడు. కుటుంబ రావు తో పాటు అతని సహోద్యోగిని అయిన వనిత ను కూడా పిలిచాడు.బాసు కి ఇద్దరి తోనూ పెద్ద చనువు లేదు. కుటుంబ రావు తో,” ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకూ వచ్చిందోయ్ కుటుంబ రావ్?”, అన్నాడు. అదే వనిత తో మాత్రం, “ఆ చెప్పండి “మేడం”, స్టేటస్ ఏమిటి?”, అన్నాడు. …మగ పురుషులారా, ఈ వివక్షని ఖండించండి. ఆడ స్త్రీలు కూడా ఖండిస్తే సంతోషిస్తాం.

3.కుటుంబ రావ్ సాయంత్రం ఇంటికి వచ్చి తెలుగు పేపర్ తిరగవేయటం మొదలుపెట్టాడు.”రేప్ చేసిన మగ పశువు”, హెడింగ్.
యాసిడ్ పోసిన, “మృగాడు”.  రాసిన రిపోర్టర్ మగాడే… పేరు..రామా రావు.
పేజీ తిప్పాడు కుటుంబ రావు. ఒకామె తన ప్రియుడి తో కలిసి తన భర్త ని హత మార్చింది. ఆమె పేరుని శోభా దేవి గానే రాశాడు సదరు రిపోర్టర్. “ఆడ *%$” అని రాయలేదు.

4.కు.రా కొడుకు యశ్వంత్ గదిలోంచీ బయట కి రావటం లేదు. కు.రా తెలుసుకొంటే తేలిందేమంటే,”వారం రోజుల కిందటి ఎంసెట్ సీట్ రాని షాక్ నుంచీ వాడింకా తేరుకోలేదు.” కు.రావు గది లోకి వెళ్ళి కొడుకు తో అన్నాడు, “ఎంసెట్ రాక పోతే ఎడ్-సెట్ రాద్దువు గాని లే!”.
దానికి వాడు,” కిందటి సంవత్సరం అక్క కి నాకంటే నాలుగు వేలు పైన నాసి రాంకు వచ్చింది.మరి అక్కకెందుకు సీట్ వచ్చింది?”.
కు.రా తన కి తెలిసి చదివించటం లో కూతురి పట్ల ఎన్నడూ వివక్ష చూపించలేదు.పై గా కురా కి సహజం గా తండ్రి కి కూతురి పట్ల ఉండే ప్రేమ ఎక్కువ.

5.కు.రావు స్నేహితుడి కూతురు కి అమెరికా సంబంధం కుదిరి, పెళ్ళయాక డిపెండెంట్ వీసా మీద టెక్సాస్ వెళ్ళిపోయింది. భర్త ఆఫీసు కి వెళ్తే, తను ఇండియా లో తల్లితండ్రుల తో ఫోన్ లో కబుర్లు చెబుతూ, ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేది.భర్త కి ఏదో ఓ మాదిరి కంపెనీ లో కాంట్రక్టర్ గా ఉద్యోగం. అక్కడికి వెళ్ళిన నెలరోజుల నుంచీ జంట మధ్య తేడాలు మొదలయ్యాయి. కు.రావు ఫ్రెండు వాళ్ళింటికెళ్ళినపుడు, ఫ్రెండూ భార్యా జరిగిన కథ చెప్పటం మొదలుపట్టారు.”ఆ అబ్బాయి ఒట్టి పీనాసి వాడండీ. రెస్టారెంట్ కి తీసుకెళ్ళడంట. ఇంట్లోనే వండమంటాడంట!”
“అమెరికా లో ప్రతి రోజూ రెస్టారెంటంటే చాలా ఖర్చవుతుంది అనుకొంటా..ఇంట్లో వండక తప్పదేమో!”, అన్నాడు సందేహం గా కు రావు.
“అమ్మాయికి వంట రాదు. కాలేజీ రోజుల్లో హాస్టల్లోనే ఉండేది. ఇంకా మా చిన్నూ గాడైనా చదువుకొనే తపుడు రూముల్లో ఉండి చెయ్యి కాల్చుకొన్నాడు, కానీ అమ్మాయికి అసలు అలవాటు లేదు. మా ఆవిడ కూడా దాని చేత ఎప్పుడూ వంట చేయించలేదు”, అన్నాడు కు.రా. మిత్రుడు.
కురా కి ఏమి సలహా ఇవాలో అర్ధం కాక ఉండిపోయాడు.

6.కురావు పక్కింటాయన బాల్కనీ లో కూర్చొని పేపర్ ముందేసుకొని ఆవేశం తో ఊగి పోతున్నాడు, ” ఈ జంతువులని ఉరి తీసేయాలి. వీళ్ళకి కోర్ట్లూ, విచారణా అనవసరం!”.
“మీరు ఢిల్లీ రేపిస్టుల గురించి ఆవేశపడుతున్నారనుకొంటా!?”, అన్నాడు, కు రా.
“అలాంటి వెధవలు లక్షల్లో ఒకరు ఉంటారు. ఇలాంటి దుస్సంఘటనలు జరిగినపుడల్లా మగవాళ్ళ కి వ్యతిరేకం గా వ్యవస్థీకృతమైన చట్టాల పదును పెంచుతూ పోతే, నా లాంటి అమాయకుల కి ముందు ముందు ఏమౌతుందో. ఓ రకం గా,టెర్రరిస్ట్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ అనే కర్ర తో ఇండియన్ ముస్లిం ల ని కొడుతున్నారు. అలానే హై ప్రొఫైల్ అత్యాచారాలు జరిగినపుడల్లా, వాటిని సాకు గా చూపించి ఇండియన్ మేల్ ని చట్టాలనే కర్ర తో కొడుతున్నారు.”, అనుకొన్నాడు కు.రావు.

7.కురావు కుర్రాడిగా ఉన్నపుడు గృహ హింస గురించీ, వరకంట్న చావు ల గురించీ పత్రిక ల కి వ్యాసాలు ఆవేశం గా రాసేవాడు. కానీ ఈ మధ్య కురావు అనుభవం లోనే ఆ రెండు చట్టాలూ దుర్వినియోగం మూడు సార్లు తటస్థించింది.ఒక కేసు లో బంధువు ల అబ్బాయి జెయిలుకి పోవలసి వస్తే, ఇంకో కేసు లో సహోద్యోగి ని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఆఫీస్ కే నేరు గా వచ్చారు. ఇంకో కేసు స్నేహితుడి బంధువుది. మూడు కేసులూ తప్పుడు కేసులేనని కు.రావు కి ఖచ్చితం గా తెలుసు. మూడు కేసులలోనూ డబ్బు గుంజటం అనేది ప్రధాన ఉద్దేశం. కురావు పేపరు చదవటం తగ్గించి, మారిన సమాజాన్ని అనుమానం గా చూడటం మొదలు పెట్టాదు.

8.కురావూ అతని భార్యా ఇద్దరూ ఉద్యోగస్తులే. కు.రావు భార్య, ఫెమినాలూ గట్రా చదివి ఈకెండు బయటే ఒటేళ్ళలో తిందామని మొరాయించింది. ఈక్-డేస్ ఎలానూ కర్రీ పాయింట్ల కర్రీల తో కడుపు చెడి పో ఉన్న కు.రా.,
తను కూడా మొరాయించాడు, “ఈకెండ్లలో డ్రైవింగ్ చేయననీ, వెచ్చాలు పట్రాననీ, బిల్లులు కట్టననీ”.
కొన్నాళ్ళ కి కురా భార్య కి వేరే ఊరు ట్రాన్స్-ఫర్ అయింది, కురా స్నేహితులు “పలానా మంత్రి గారిని కలవక పోయావా? ట్రాన్స్-ఫర్ ఆపుతారు.”, అని ఉచిత సలహాలు పారేయటం మొదలు పెట్టారు.
కురా,” ఎవరి ట్రాన్స్-ఫర్ వారే ఆపుకోవాలి”, అన్నాడు.
స్నేహితులు, “అదేమిటి? మగ వాళ్ళ పని ఆడ వాళ్ళు ఎలా చేస్తారు?”, అన్నారు.
“పనులలో ఆడ పనులనీ, మగ పనులనీ ఉండవు”, అన్నాడు కురా.

9. సిటీ లో పోష్ ఏరియాలో ఫ్రెండ్ తో కలిసి రోడ్డు పై నడుస్తూంటే, “పక్కనే ఓ యాభై యేళ్ళావిడ బట్టలు తక్కువ గానూ, లిప్-స్టిక్ ఎక్కువ గానూ నడుస్తోంది. కురా గుడ్లు మిటకరించి ఆమె వైపుకి చూశాడు. కురా ఫ్రెండ్, “అలా చూస్తావేమిటి? సంస్కారం లేకుండా!”, అన్నాడు.”
“సంస్కారం లేకుండా బట్టలు వేసుకొంటే లేదు గానీ, చూస్తే తప్పా!”, అన్నాడు కురా.

10.పిల్లలు బయటికి వెళ్ళిన సమయం చూసి, ఇంట్లో ఫ్యాషన్ టీవీ పెట్టాడు కురా. పక్క గది లో,చీరలూనగలూ,అప్పటికే ఎన్నో సార్లు మురిపెం గా ధరించి చూసుకొన్న తన నగలని బీరువా లో పెట్టి, హాల్ లోకి వచ్చింది కురా భార్య.
కురా ఫ్యాషన్ టీవీ చూడటం గమనించి, “చీ, చాలా వల్గర్ గా ఉంది, చానల్ మార్చు”, అంది కురా భార్య.
“ఇప్పటి దాకా నీకు ఇష్టమైన పని నీవు చేశావు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, తప్పేమిటి?”, అన్నాదు కురా.
“ఇంట్లో ఇలాంటివి చేస్తారా ఎక్కడైనా?” అందామె.
“ఎవరికి నచ్చింది వారు  చేయకూడదంటే, ఇంటి విలువలలోనే పక్షపాతముందన్న మాట!”, అన్నాడు కురా.

11.  కురా కంటే అతని భార్యకే జీతం ఎక్కువ వస్తుంది. వారికి ఏ ఇతర ఆస్తులూ పెద్ద గా లేవు.ఓ సుముహూర్తాన కురా ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచీ భార్యాభర్త ల మధ్య కీచులాటలు ఎక్కువయాయి. అప్పటిదాకా కురా ఫ్యామిలీ కోసం పెట్టిన ఖర్చును తను పెట్టటానికి కురా భార్య నిరాకరించింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు, ఇరువురూ విడాకుల వైపుకి ఆలోచించటం మొదలుపట్టారు. ఈలోపు కురా మళ్ళీ ఓ చిన్న ఉద్యోగం లో మునుపటి కంటే బాగా తక్కువ జీతానికి కుదురుకొన్నాడు.విడాకుల గురించి కురా ఓ లాయర్ ని సంప్రదిస్తే, “భార్య కి భరణం ఎంత ఇవ్వాలో చెప్పాడు”, లాయర్. “ఓరి నాయనా, మూలిగే నక్క మీద తాటి పండు పడింది!”

12. కురా కొడుకు కి ఓ గర్ల్-ఫ్రెండ్ ఉంది. ఆమె వాడిని చేతుల తో సున్నితం గా కొడుతూ మురిపెం గా, “స్టుపిడ్”, అని పిలుస్తుంది. ఓ రోజు వాళ్ళిద్దరూ పోట్లాడుకొన్నారు. అదేసమయం లో వాడి మగ ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. వారి లో ఒకడు, “ఏంట్రా మూడ్ బాగున్నట్లు లేదు, నిన్ను మళ్ళీ మూడ్లోకి తెస్తా చూడు!”, అని ఓ “Off the color jOke”, చెప్పాడు. కొంచెం దూరం లో ఉండి ఆ జోక్ విన్న ఉన్న వాడి గర్ల్-ఫ్రెండ్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేసింది, “వాడూ వాడి , మిత్ర బృందం తనను హరాస్ చేస్తున్నారని”. ప్రిన్సిపాల్ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేశాడు.

13.కురా అక్క కొడుకు ఈ మధ్యే పెళ్ళి అయింది.అతనూ, అతని భార్య ఫామిలీ ప్లానింగ్ కొంతకాలం పాటించి తరువాత పిల్లలను కనాలని నిర్ణయించుకొన్నారు. అతని భార్య కి మూడో నెల ఉన్నపుడు అతని తో గొడవ పడింది. తరువాత అతని తో చెప్పకుండా అబార్షన్ చేయించుకొంది.అతని బాధ కి అవధులు లేవు. తాళాలు ఎవరి దగ్గర ఉంటే వారే గదిని మూస్తారు. గర్భధారణ ప్రకృతి ఇచ్చిన ఓ కష్టమైన విషయమైనా, ఆధునిక వైద్యం వలన అది ఓ ఆడవారికే పరిమితమైన హక్కుగా మారింది.

మనలో దాగున్న రేపిస్ట్

నాకు ఓ ఐదేళ్ళ వయసున్నపుడు, ఓ పల్లెటూరి సినిమా హాలు కి వెళ్ళే వాడిని. సినిమా లో, ఏ గిరిబాబో, సత్యనారాయణో హీరో గారి చెల్లిని రేప్ చెసే వాళ్ళు. రేప్ మొదలవ్వగానే హాల్ అంతా ఈలల తో మారు మోగేది. నాకు ఆ వయసు లో, జనాలు ఎందుకు ఈలలు వేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. పాపం విలన్ హీరోయిన్ ని ఆ విధం గా హింసిస్తుంటే, ఈలలు వేసే జనాల మీద కోపం వచ్చేది. అదే జనం,  క్లైమాక్స్ లో విలన్ ని హీరో గారు చితక కొడుతుంటే కూడా ఈలలు వేసే వారు.
సెక్స్ కి ముఖం వాచిన జనాలు అలా చేసే వారా?
ఇంకో సంఘటన. ఓ ఐదేళ్ళ తరువాత ఏదో పట్నం నుంచీ వచ్చిన ఒకావిడ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని వెళ్తోంది. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఆమె శీలం మీద కామెంట్ చేశారు. కానీ వారికి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం తెలియదు.ఆ సమాజం లో అలాంటి జాకెట్ మామూలు ఆడవారు వేసుకోవక పోవటం వలన ఆ కామెంట్ వచ్చిందా?
ఓ ఇరవై యేళ్ళ కిందట మన సమాజం లో వయసొచ్చిన ఆడ  మగ మధ్య స్నేహాలు ఉండేవి కావు. ఇప్పటికీ పల్లెలలో వారికి ఆడ మగా మధ్య “ప్రణయ సంబంధం కాని స్నేహమంటే”, ఏమిటో తెలియదు. వారికి అటువంటి స్నేహం గురించి వివరిస్తే intellectual గా అర్ధం చేసుకోగలరేమో , కానీ అటువంటి స్నేహం లోని భావోద్వేగాల కు వారు relate చేసుకోలేరు. అది వారి తప్పు కాదు.

ఆడ మగా మధ్య interaction తక్కువ గా ఉండటం, ఇంట్లో ఆడ వారు తక్కువ గా ఉండటం వంటి కారణాల వలన, మగ వాళ్ళ కు ఆడ వారి ఆలోచనలూ, భావోద్వేగాలూ తక్కువ గా తెలిసి, ఆడ వారిని సెక్స్ పరం గా objectify చేయటం జరుగుతుంది. మన సినిమాలు కూడా ఒక ఆడ మగా మధ్య సంబంధం లో ఉండే, “పరిచయం, స్నేహం, భావోద్వేగ సంబంధాలూ” మొదలైన స్థాయి లను వదిలి, నేరు గా తడి చీరల పాటలను చూపెట్టటం వలన, ఆడవారిని objectify చేయటం మరింత పెరుగుతుంది.

మిస్సమ్మ సినిమా కాలం నుంచీ కూడా హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. “ఆడ వారి మాటల కి అర్ధాలే వేరులే!”, అంటాడు. పాత కాలం లో స్త్రీల కి స్వాతంత్ర్యం లేనపుడు, మనసు లోని మాట పై కి నేరు గా వ్యక్తీకరించే వారు కాదేమో! కానీ నేడు ఓ ఆడ పిల్ల, “నో” అన్నదంటే, “కాదనే” అర్ధం. ఈ విషయాన్ని wishful thinking చేసే మగవాళ్ళ కు అర్ధమయ్యేలా చెప్పాలి.
రేప్ అనేది learned behavior అని ఈ మధ్య హిందూ లొ వచ్చిన ఈ ఆర్టికల్ చెప్తుంది:
http://www.thehindu.com/opinion/lead/the-danger-to-women-lurks-within-us/article4242142.ece?homepage=true

ఇది చాలా వరకూ కరక్ట్ కూడా. నేర్చుకొన్న ప్రవర్తనను సరిగ్గా educate చేయటం ద్వారా మార్చ వచ్చు. కానీ కొంతవరకూ రేప్ అనేది బయలాజికల్ గా సంక్రమించిన రోగం కూడా. అనేక జంతువులు రేప్ చేస్తాయి. అలానే కొందరి జీన్స్ లో హింసా, సెక్స్ ఎక్కువ గా ఉంటాయి. అలా అని రేప్ పాపం అలాంటి వారికి అంటకుండా పోదు. తాను బలవంతుడనని పక్క వాడిని కొడితే జైల్లో పెడతారు కదా!

మన దేశం లో “ఆడ మగా మధ్య interaction లేక పోవటం” రేప్ కి ఓ కారణం అయితే(మన దేశం లో ఆడపిల్లల తో మాట్లడ గలిగే సోషల్ స్కిల్ల్స్ ఉన్న మగ వాళ్ళు రేప్ కు తెగబడే అవకాశం తక్కువ), అమెరికా లాంటి దేశాలలో ఈ interaction ఎక్కువై, లవ్ లో రిజెక్ట్ కా బడ్డ వారు కూడా స్త్రీ ద్వేషులు గా మారి రేప్ లు చేస్తున్నారు. బూతు సినిమాలు చూసే వారి వలన కూడా రేప్ లు ఎక్కువవ్తాయని పాశ్చాత్య దేశాలలోని సర్వే లు బయటపెట్టాయి.ఏదేమైనా, ఈ విషయం లో సరైన ప్రవర్తన ఏమిటి (ఆడ మగా ఇరు వైపుల నుండీ) అనేదానికి విస్తృతమైన ప్రచారం కలిపించవలసిన అవసరం ఉంది. అలానే మీడియా, సినిమాలు ప్రచారం చేసే sexist myths లోని డొల్ల తనాన్ని బయట పెట్టాలి.

ఓ మగ వాడు, ఆడ వాళ్ళకి రేప్ గురించి జాగ్రత్తలు చెప్పటం లో ఓ ప్రమాదం ఉంది. ఆడ వారు ముందే అతని ఉద్దేశాలను అనుమానిస్తారు. నమ్మకం లేని చోట మంచి చెప్పినా చెడు అవుతుంది.అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.బహుశా అలాతప్పుపట్టటం, “తమ లో అంతర్లీనం గా ఉండే instincts ను రేపిస్టుల instincts తో ఇడెంటిఫై చేసుకోవటం వలన కూడా అవ్వవచ్చును”. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే విషయం లో మగ వారి స్వరం, ఆడ వారి శ్రేయోభిలాషులు గా ఉంటే పరవాలేదు. “నే చెప్పింది విన్నారా? ఇప్పుడు అనుభవించండి”, అనే విధం గా ఉన్నపుడే సమస్య. రేప్ జరిగిన పరిస్థితుల కి అతీతం గా రేప్ శిక్షార్హమే! అందులో సందేహం లేదు. అయితే రేప్ కి మరణ శిక్ష వేయాలా వద్దా అనేది, అనేక పరిస్థితులనూ, మోటివ్స్ నీ పరిగణన లోకి తీసుకొని నిర్ణయించాలి.
రోడ్ మీద పోయే జనాలలో అన్ని రకాల వారూ ఉంటారు. అందులో మూర్ఖులు ఓ రకం. యువత డేటింగ్ చేయవచ్చు. కానీ public display of affection ని తగ్గించటం మంచిది. ఏ పల్లెటూరి బైతో, “అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చూపించే playful behavior ని తన పై ఎందుకు చూపించదు?”, అనుకోవచ్చు. ఏ కరడు గట్టిన సాంప్రదాయ వాదికో వారి ప్రవర్తన చూసి ఒళ్ళు మండ వచ్చు. వారిలో ని విలువలు వారి లోని జంతుప్రవృత్తి  ని నియంత్రించినంత వరకూ పరవా లేదు. అలా కాకపోతే నే సమస్య. చేసే వెధవ పనుల పర్యవసానాన్ని గురించీ, చట్టమూ శిక్షల గురించీ ఆలోచించని మగవాళ్ళు చాలా మందే ఉంటారు. అందని ద్రాక్షల మీద కసి పెంచుకొనే వారు చాలామందే ఉంటారు. కసి అంటే గుర్తుకొచ్చింది, తెలుగు రొమాంటిక్ పాటలలో ఈ పదం చాలానే ఉపయోగిస్తారు. కానీ కసి అనే పదం లో హింస అనేది కూడా ఉందని ఆయా రచయితలకి తట్టిందో లేదో!

రేప్ ఎంత ఆటవికమో, జనాలు గుంపులు గుంపులు గా రోడ్ పైకి వచ్చి, రేపిస్టులని విచారణ లేకుండా ఉరి తీయాలనటం కూడా అంత ఆటవికమే. శిక్షించటానికి నిపుణులు ఉన్న న్యాయవ్యవస్థ ఉంది.వారే అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఈ విషయం లో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్య సరైనదైతే, ఆయన కొడుకు చేసిన వ్యాఖ్య దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ప్రజల ఆందోళన చాలా వరకూ సమర్ధించతగ్గదే! అలా అని ఆందోళన కారులంతా holy cows కాదు.తమ లోని అరాచకాత్వాన్ని బయట పెట్టటానికి ఈ సంఘటనను ఓ సాకు గా ఉపయోగించుకొనే వారూ, vested interests, భోగస్ స్త్రీ వాదులు,సమస్య ల కోసం కాసుకొని కూర్చునే వామ పక్ష వాదులూ కూడా ఉండవచ్చు. ఏదేమైనా, ఈ ఆందోళనల వలన ప్రభుత్వమూ, అది నియమించిన కమీషన్ సరైన ప్రతిపాదనల తో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

ఢిల్లీ ఘాతుకం లో మరణించిన ఆ యువతి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

బురదగుంట – రేప్ ప్రపంచం..

ఢిల్లీ రేప్ సంఘటన సమాజం లో కావలసిన కదలికనే తెచ్చింది. రేపిస్టులను శిక్షించాల్సిందే. బురదగుంటలొంచీ దోమ వచ్చి కుడితే వెంటనే చంపేస్తాం కదా! అయితే ఆ సంఘటన గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా, రాజకీయ ప్రముఖులను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.
ఆ బురద గుంత ఏర్పడటానికి ఓ ముఖ్య కారణమే ఈ మీడియా, సామాజిక ప్రముఖులు. రేప్ కి సంబంధించిన behavior patterns సమాజం లొ బలపడటానికి ఈ ప్రముఖులు కూడా ఓ కారణం.
ఈ బురద గుంట కి ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది?

తెలుగు లో “ఓలమ్మీ తిమ్మిరెక్కిందా? అని హీరోయిన్ పిల్ల పిర్ర మీద ఓటిచ్చినపుడు” దానితో మొదలైందేమో!

లేకపోతే,”లే లే లే..నా రాజా!” తో మొదలైందేమో! లేక ఇంకా ముందే మొదలైందేమో! నాకు తెలియదు.
“ఓ సీన్ లో ఆకతాయిల కు క్లాస్ పీకి, మరో ఐదు నిమిషాలలో హీరో గారు బూతు పాటలు పాడినపుడు”, ఈ బురద గుంట కంపు అందరికీ అలవాటైపోయి, వాసన గుర్తు తెలీటం లేదని తెలిసింది.
“హీరోయిన్ ని సినిమా మొత్తం, రేప్ చేయటం మినహా, అన్నిరకాల వేధింపులూ చేసిన హీరో గారు”, మాస్ రాజా అయినపుడు, ఈ గుంటకి జనామోదం కూడా లభించిందని తెలిసింది.

సినిమా ఫంక్షన్లలో,”అర్ధ నగ్న ఐటం డాన్సర్ చుట్టూ, పది మంది మగ డాన్సర్లు చొంగ కారుస్తుంటే”, వేదిక కింద కూర్చొన్న హీరో గారు నిర్వికారం గా చప్పట్లు కొడితే తెలిసింది, “మురుగు గుంట ఓ అభినందించవలసిన విషయం” అని

“సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు”, అని ఓ డైరెక్టర్ గారు బుకాయిస్తూంటే తెలిసింది, మురికి గుంట చాలా నిరపాయకరం అని. 

“దిగి దిగు నాగా..” వంటి పాటలు ప్రొడ్యూస్ చేసిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ద్లు లభించినపుడు, ఈ మురికి గుంటకి మానసరోవరం గా అధికారిక శాంక్షన్ కూడా వచ్చేసింది.

ముందు పేజీలలో తాము ఎడమపక్క పత్రికలమని కోడై కూసే పత్రికలు, వెనుక పేజీలలో సీ గ్రేడ్ సినిమా యాడ్స్ వేసుకొన్నపుడు, మురికి గుంట కంపు పూదోట కంపుని మింగేసింది.

మెరుగైన సమాజం కోసం పాటుపడే చానళ్ళు, బూతు సినిమాల పై ప్రత్యేక కార్య క్రమాలను ప్రసారం చేసినపుడు, మెరుగైన సమాజం బురద గుంట ఉండగానే వస్తుందని తెలిసింది.

“బూతుసినిమాలూ, సైట్లూ సాధారణమని”, డోకు భాష తార పిల్ల చెప్పినపుడు, “ఓ, మురికి వాసన చూసినపుడు, వమనం చేసికోకూడదని”, తెలిసింది.

రాష్ట్ర స్థాయి నాయకుడు అధినేత్రి మైకం లో, “ఇదో చిన్నవిషయం” అన్నప్పుడు, కొన్నాళ్ళకి మురికి గుంటలో పొర్లిన వాడే నాయకత్వానికి అర్హుడేమో అన్న సందేహం వచ్చింది. అప్పుడు “అదో పెద్ద విషయం” అవుతుంది.

ఊళ్ళోని పెద్ద పెద్ద ఇళ్ళలోంచీ డబ్బు అనే పిల్ల కాలువల ద్వారా ఈ మురుగు గుంట నింపబడుతోంది. జీవిక కోసం ఈ పిల్ల కాలువలను నిర్వహించే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మందిమి చేస్తాం. జీవిక కోసం మనం మౌనం గా ఉంటాం. ఈ మురికి గుంటని పూడ్చి వేయాలని గట్టి గా అడగం. అడిగితే మన జీవిక పోతుంది.

కాబట్టీ ప్రముఖులారా, ధర్మాగ్రహం వ్యక్తం చేయకండి. మీరిచ్చే వినోదం వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ని సెలబ్రేట్ చేసుకోండి.

వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.

వినాయక చవితి..అప్పుడూ ..ఇప్పుడూ..

నా చిన్నపుడు వినాయక చవితి అంటే కొంత ఆసక్తీ, కొంత భయమూ.. పొద్దున్నే స్నానమైన తరువాత, పత్రి కోసం పిల్లలందరమూ పెరట్లమీదా, దొడ్ల మీదా పడే వారం. మారేడాకు శివాలయం వెనుక దొరుకుతుంది. శివుడికి ప్రీతి పాత్రమైనది కాబట్టీ ఆయన కొడుకు కి కూడా ఇష్టం, జమ్మి ఆకులు బడి గ్రౌండ్ వెనుక పొదల దగ్గర ఉన్న జమ్మి చెట్టు కొమ్మలను విరగదీస్తే వస్తాయి, వెలగ పళ్ళ కోసం ఆ పక్కనే ఉన్న వెలగ చెట్టు ఎక్కాలి. కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టీ ఒక గడ కర్ర తో కొట్ట వలెను.లేక రాళ్ళు రువ్వవలెను. మాలో శీను గాడికి ఆత్ర మెక్కువ. వాడు ఓ పది కాయల పడగొట్టి కానీ ఊరుకొనే వాడు కాదు. కామేశం గాడు వాడిని మందలించే వాడు, “ఒరేయ్, ఈ పళ్ళన్నీ శాస్త్రానికి ఒకటో రెండో అయితే చాలు రా, పండగ ఉద్దేశం ముఖ్యం గా “ఈ పళ్ళూ ఈ ఆకులూ ఉంటాయని తెలవటానికని” మన తెలుగు మాస్టారు చెప్పలా?” అనేవాడు.
ఇలా పత్రి మొత్తం ఓ పైసా కూడా ఖర్చు పెట్టకుండానే సేకరించేవారం. పైసలు ఖర్చు పెట్టేది మాత్రం వినాయకుడి బొమ్మకీ, ఆయన గొడుగుకీ. అప్పట్లో పర్యావరణ స్పృహ ఇప్పటి లా లేదు, కాబట్టీ బజార్లో రంగు గణేశులే దొరికే వారు. వినాయకుడి పాదాల దగ్గర ఎలుక లేకుంటే, ఆ బొమ్మ కొనకూడదు! వినాయకుడికి పైన చతురస్రాకారం లో ఉండే ఒక చక్క ఫ్రేం వేలాడదీసే వాళ్ళం (దీనిని ఏమంటారో మరిచి పోయాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి). దానికి,  కరకట్ట కింది మొక్క జొన్న తోటలలోంచీ తెచ్చిన కండులను కట్టే వాళ్ళం. ఇంకా ఆకులను గుచ్చే వాళ్ళం.
వినాయకుడి కోసం ఇంట్లో శాశ్వతం గా ఒక పీట ఉండేది.
వంటింట్లో కుడుములూ ఉండ్రాళ్ళూ తయారవుతూ ఉండేవి. కానీ వాటిని తినటానికి లేదు. పూజ అయేదాకా ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదని పెద్దవారి ఆజ్ఞ.  “ఊరికినే వంట గది చుట్టూ తిరగకపోతే, పుస్తకాలకి కాస్త పసుపు రాసి, “ఓం” రాసుకోవచ్చు గా!”, అని ఓ కేక. “అవును, పుస్తకాలు పూజ దగ్గర పెడితే ఆ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి. పూజ దగ్గర పుస్తకాలు పెట్టాలంటే వాటికి పసుపు రాయాలి. “ఓం” అని తెలుగు లో రాయాలి, అప్పటికి సంస్కృతం “ఓం” ఎలా రాయాలో తెలియదు మరి!
పూజ మొదలవుతుంది. కడుపులో వినాయకుడి వాహనాలు పరుగెడుతున్నా, శ్రధ్ధగా మంత్రాలు వినేవాడిని. వినాయక వ్రత కల్పం కధ పుస్తకం ఓ “యాంటిక్”. అది పది సంవత్సరాల నుండీ వస్తున్న ఓ వారసత్వ సంపద.  ముందు స్తోత్రం. తరువాత పూజ..
బిళ్వ పత్రం..ఆ మారేడాకు ఇలా ఇయ్..
సరే..ఆ శమీ పత్రం ..జమ్మి ఆకు..
కదళీ ఫలం..అరటి పండు ఏదీ..?
దర్భ..గడ్డిపోచ..ఇంకా..బదరీ పత్రం..రేగు ఆకు..
ఇలా పూజ చేసే పెద్దలకి అందిస్తూ ఉండే వాళ్ళం. దానితో ఏ పత్రం అంటే ఏమిటో, సంస్కృతం అప్పటికి చదవక పోయినా, కొంత అర్ధమయేది. మరుసటి సంవత్సరానికి కొంత గుర్తుండేది. మధ్య మధ్య లో ఇంట్లో పిల్లలకి ఏదో ఒక అల్లరి పని కి తిట్లు పడేవి. తరువాత పెద్ద వాళ్ళ సమర్ధన, “ఈ రోజు తిట్టించుకొంటే మంచిదే లేవే!”, అని.

“ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ తద్ది కీ..”
అంటూ తెలుగు లో పద్యాలు కూడా ఉండేవి..మధ్యాహ్నం ఏ రెండింటికో వ్రతం పూర్తి అయ్యేది. కడుపు నక నక లాడుతూ ఉంటే ఉండ్రాళ్ళూ, కుడుములూ లాగించి, గారెల పైన పడే వాళ్ళం.
ఓ సంవత్సరం వ్రత కల్పం పుస్తకం పోయింది. కొత్త వ్రత కల్పం పుస్తకం మార్కెట్ లో కొంటే, చాలా చిన్నదైపోయింది. అంతా షార్ట్-కట్..అంతేనా?, కథ మారిపోయింది. అంతకు ముందు ఉండే మూల కథ  మారకపోయినా, కొన్ని చిన్న మార్పులు వచ్చాయి.

సాయంత్రం వినాయక చవితి పందిళ్ళ లో ఘంటసాల భక్తి పాటలు పెట్టే వారు. హరి కథా కాలక్షేపం జరిగేది. హరి కధ చెప్పే ఆయన(భారతం చెప్పే భాగవతార్) పద్యాలు చదువుతూ మధ్య మధ్య లో అనేక (సంబంధం ఉండీ ఉండని) పిట్ట కథలలోకి దిగుతూ అలరించే వాడు. అసలు కథ భారతమైనా, అసలు కథ కంటే ఆ పిట్ట కథలే బాగుండేవి. ఉదాహరణ కి శల్యుడు మేకపోతు గాంభీర్యం చూపించాడు అని, మేకపోతు గాంభీర్యమంటే ఏమిటొ వివరించటానికి పులీ, మేకా, గుహా..కథ వినిపించే వారు. మధ్య మధ్య న పద్యాలు పాడుతూ, చేతి లో చిడతలు(?) వాయిస్తూ చిన్న పాటి చిందులు కూడ వేసే వారు.   ఇప్పుడు హరి కధ చెప్పే వారు రాష్ట్రం లో ఎంత మంది మిగిలి ఉన్నారో!

********************

కాలం తో పాటు వినాయక వ్రతం లోనూ, నా లోనూ కూడా మార్పులు వచ్చాయి.
నేను సాంప్రదాయక దేవుడిని నమ్మటం మానేశాను. పట్టణాలకు చేరాను. ఇప్పుడు బజారుకెళ్ళటం ఇంత పత్రి కొనుక్కొని రావటం. ఆ పత్రి లో ఏముందో కూడా ఒక్కోసారి తెలియదు.(మన సంచి లో తక్కువా, రోడ్డు పై కాళ్ళకింద నలుగుతూ ఎక్కువా ఉంటోంది పత్రి ఈ మధ్యన ). ఐదు నిమిషాలలో చదివి పారేయగల వినాయక వ్రత కల్పాలు వచ్చాయి.
వ్రతానికి కూర్చొంటే ( :-( పాపం నేను), ఇంగ్లీషు మీడియం లో చదివిన పట్నపు శ్రీమతి చదివే స్తోత్రం కర్ణ కఠోరం గా వినపడి, ఆగలేక నేనే సరిగా చదివి దాని అర్ధాన్ని వివరించటం. పిల్లలకి వినాయక కథ ని “టాం అండ్ జెర్రీ” తరహా లో వినిపించటం. కావలసిన ఫల పత్రాల లో ఒకటీ పత్రి లో కనిపించదు (ఏక వింశతి పత్రాణి). అన్నీ కలిపి వినాయకుడి ముందు పెట్టి, శ్లోకం చదవటం.  ..ఇదీ పరిస్థితి.నాస్తికులు కూడా త్యాగరాయ కృతిని విని ఆనందించినట్లు, నేను కూడ వినాయక పూజను చేసి సంతోషించటం నేర్చుకొన్నాను.

పిల్లలు ఆకలి కి తట్టుకోలేరు కాబట్టీ వాళ్ళకి పొదున్నే బొజ్జ నింపేయటం మంచిది. ఇక వాళ్ళ బొజ్జ నిండా ప్రశ్నలే!
“డాడీ! గణేశా ని అంత చిన్న జెర్రీ ఎలా మోయగలుగుతుంది?”, లాంటి ప్రశ్న లకి సమధానం ఇవ్వటం.

ఇక ముందు ముందు ఎలా మారబోతోందో ఈ వ్రతం..ఇంటర్నెట్ సైట్లు పెట్టుకొని అయిందనిపించటం, మాల్స్ లో పత్రి విక్రయించటం, పత్రి వేసే యంత్రాలూ, మంత్రాలు చదివే యంత్రాలూ వగైరా వస్తాయేమో!కెల్లాగ్స్ కుడుముల పాక్ నీ, ఎంటీ ఆర్ ఉండ్రాళ్ళ రీఫిల్ నీ వాడవలసి వస్తుందేమో!
…ఆ పూజకి వేళయినట్లుంది, “వ్రతానికి రండీ..” అని వినిపిస్తోంది దేవుడి గది లోనుంచీ.
ఇక ఉంటానండీ. నండ్రి. ధన్యవాదగళు!

నాకు తెలిసిన ఒక దొం.క. (దొంగ కమ్యూనిస్టు) కథ

మొన్నామధ్య య.రమణ గారి బ్లాగు లో దొంగ కమ్యూనిస్టుల గురించి కొంత చర్చ నడిచింది. నాకు నిజ జీవితం లో చాలా మంది ఇటువంటి దొంగ కమ్యూనిస్టులు తారసపడ్డారు. అలాంటి  ప్రొఫైల్ ఒకటి ఇక్కడ. ఇది ప్రత్యేకం గా ఎవరో ఒకరి గురించి మాత్రం కాదు.అంటే, ఈ టపా కేక. (కేవలం కల్పితం).
****************
కా|| శేషగిరి రావు గారు మధ్య కోస్తా లోని ఒక చిన్న రైతు కుటుంబం లో జన్మించారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం లో కమ్యూనిస్టు ఉద్యమం బలం గా ఉండేది. ఆ జిల్లాలో కమ్యూనిస్టులు అందరూ కా|| కోటయ్య గారి అనుచరులే. కాశే గారి నాన్న “కోటయ్య గారి నాన్న గారి కి” అనుచరుడు.అందు వలన కాశే కూడా కాకో గారి నాయకత్వం లో పార్టీ లో చేరి పని చేయటం మొదలు పెట్టాడు.  కాశే నాన్న ఒక బక్క రైతు. ఆయన అరెకరం వాడు.
కాశే అనతి కాలం లోనే తాలూకా స్థాయి నాయకుడయ్యాడు. ముఖ్యం గా దళితుల్లో ఆయన పలుకుబడి ఎక్కువ. కాకపోతే ఆయన ఇంటికి వచ్చిన దళితులు మాత్రం వరండాలో కింద కూర్చోవాల్సి వచ్చేది. దళితులకి వేరే ఇత్తడి చెంబు లో మంచి నీరు ఎత్తి పోసి వారికి మర్యాద చేసే వాడు. ఆ రోజుల్లో స్టీలు గ్లాసులను ఇంట్లోని వారికి మాత్రమే ఉపయోగించేవారు.
కాశే అక్కడి ఒక జమీందారుకి వ్యతిరేకం గా పోరాడి తదుపరి భూ సంస్కరణలలో తాను కూడా కొంత భూమి సంపాదించగలిగాడు. పార్టీ లో తనకున్న పలుకుబడి అందుకు ఉపకరించిందనుకోండి!
కొంత కాలానికి తెలంగాణ సాయుధపోరాటం ఊపందుకుంది.  పార్టీ అతనిని నైజాముకు పంపింది. అయితే కాశే కార్య రంగం తెలంగాణ పల్లెల లో లేదు. ఆయన అనతి కాలం లోనే హైదరాబాదు కు మారాడు.
కాశే అక్కడి రోజుకూలి కార్మికులకి చేబదుళ్ళిచ్చి సహాయ పడేవాడు. కాశే మంచి మాటకారీ, ఉత్సాహవంతుడు. పార్టీ లో క్షేత్ర స్థాయి లో జనాలను సమీకరించటం లో ఆయనకున్న ప్రతిభ గొప్పది.  పార్టీ లో ఆయనకున్న అనుభవం ఆయనకు తరువాత చాలా ఉపయోగ పడింది.
త్వరలోనే ఒక ఫైనాన్స్ కంపెనీ మొదలుపట్టిన కాశే, సమాంతరం గా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ని కూడా ప్రారంభించాడు. అ సంస్థ ని విస్తరించటం లో అతని పార్టీ అనుభవం ఎంతైనా ఉపయోగ పడింది.
తన వ్యాపారాల్తో సమయం చిక్కక కాశే పార్టీ కి దూరమయ్యాడు. అంతే గానీ పార్టీ మీది వ్యతిరేకత తో కాదు.
కాశే వ్యక్తిగతం గా చాలా సరదా మనిషి. ఆయనకు అక్కినేని నాగేశ్వర రావంటే మక్కువ ఎక్కువ. తెలిసిన మిత్రులు ఎవరన్నా, “బాగానే సంపాదించినట్లున్నావే?!”, అంటే.
సంపాదించకపోతే ఎలా?, అక్కినేని నాగేశ్వరరావంతటి వాడు ఓ ఇంటర్వ్యూలో, “డబ్బులేక పోతే నీ మొహం ఎవడు చూస్తాడు?”, అన్నాడు..అని చెప్తాడు.
కాశే కి రష్యా అంటే చాలా ఇష్టం (సినీ హీరో ల అభిమానులకి వారి హీరో అంటే ఇష్టమున్నట్లు). అమెరికా కుట్ర వలననే అక్కడి కమ్యూ నిజం పడిపోయిందని కాశే నమ్ముతాడు. ఇప్పటికీ  కాశే విశాలాంధ్ర, ప్రజాశక్తి పేపర్లని క్రమం తప్పకుండా వేయించుకొంటాదు. ఆ పేపర్లకి ఆయన, తన “ఓం సాయి రియల్ ఎస్టేట్”, ప్రకటనలు కూడా ఇస్తాడు. ప్రైవేట్ గా, “ఆ..ఏదో, పార్టీ అంటే అభిమానం కొద్దీ ఈ ప్రకటనలను ఇస్తాను, కానీ ఈ పేపర్లను ఎవరు చదువుతున్నారు?”, అంటాడు.
కాశే కి వయసు పైబడింది. ఆధ్యాత్మికత ఎక్కువయింది. ఆయన దృష్టి లో లెనిన్ స్టాలిన్ లు దేవుళ్ళే.వారిని పూజించటం వ్యక్తి పూజ కాదు. ఈ మధ్య కొత్త దేవుళ్ళు కూడా ఆయన లిస్టులో చేరారు. వారి లో బెంగళూరు బాబా కూడా ఒకరు. బెంగళూరంటే గుర్తుకొచ్చింది, మొన్నో రోజు ఆయన, చిన్నకొడుకుకి కర్నాటక లో ఓ మూడొందల ఎకరాలూ రెండో మనవడికి ఒరిస్సా లో ఓ రెండొందల ఎకరాలూ,  రాసిచ్చాడు.

కాశే దగ్గర ఒకరిద్దరు రచయితలు కూడా తచ్చాడుతున్నారు. ఒక రచయిత ఆయన షష్టి పూర్తికి మంచి స్థుతినే రాసి పెట్టాడు:

వామ పక్షమున పుట్టిన భావ విప్లవ వాది
లక్ష్మీ పుత్రుడైన భూమి పుత్రుండు
పేదవారి పట్ల పెద్ద చేయి
అపర కుబేరుడే ఈ శేష గిరి.

ఈ కవిత ని ఫ్రేము కట్టించి వరండా లో పెట్టించాడు కాశే. తన ఇంటికి వచ్చిన పాత మిత్రులకు ఆ ఫ్రేం ని గర్వం గా చూపిస్తూ ఉంటాడు.

వ్యక్తిత్వం (personality), శీలం (character), దార్శనికత్వం(visionary) గట్రా..!

ఈ రోజు టీవీ ఛానల్స్ ను తిప్పుతూ కూర్చొంటే, ఓ ఛానల్ లో personality development కోర్స్ గురించిన ప్రకటన వస్తోంది. “వార్నీ! వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, కానీ, దానిని అభివృధ్ధి కూడా చేసుకోవచ్చునన్న మాట. అదీ… , ఏదో కోర్స్ లో చేరి”, అనుకొంటూ ఉండగా, అదే చానల్ లో అబ్రహాం లింకన్, గాంధీజీ వంటి వారి గుణగణా లను మనం ఎలా పొందవచ్చు అనే విషయం మీద ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రాం మొదలైంది.
నాకు, “గాంధీ గారికీ, లింకన్ గారికీ, వీరి కోర్స్ కి వెళ్ళకుండానే ఆయా లక్షణాలు వచ్చాయి కదా!”, అనే ఆలోచన వచ్చింది.
“ఈ కోర్స్ ల లో ఉపయోగకరమైన మాటలు చెప్తారు. వాటిని ఆచరించాలా లేదా అనేది వ్యక్తి యొక్క ఇష్టం.ఏదేమైనా గుర్రాన్ని నీళ్ళ వద్దకు గైకొని(?) పోగలం, దీనికి నీటిని త్రాపలేము. నీటి వద్దకు తీసికొని పోవటం పెద్ద విద్య కాదు. దానికి త్రాపటమే కష్టమైన విద్య. (మార్క్స్ గారి ప్రకారం, ఉన్నటువంటి సమాజ వ్యవస్థ ఎలా ఉంది అని తెలుకోగలగటం పెద్ద విద్యకాదు. దానిని మార్చటమే అసలు విషయం. . కానీ ఈ రెండో విషయం లోనే విఫలమైంది ఆయన సిధ్ధాంతం ). ఆ బాధ్యతను ఈ కోర్స్ లు తీసుకోలేవు కదా!”, అనుకొని చానల్ మార్చాను.
ఈ చానల్ లో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్, తన తదుపరి తెలుగు చిత్ర రాజమునందు తాను పోషించబోవు “కారెక్టర్” గురించి విశదీకరించుచున్నాడు.
“సినిమాలలో హీరో, హీరోయిన్ ల పక్కన ఉండే పాత్రలనే కారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎందుకంటారో! హీరో, హీరోయిన్ ల కు కారెక్టర్ ఉండదా?! దాని అవసరం నేటి హీరో, హీరోయిన్ ల కు లేదా?” ఈ రీతిన పరిపరి విధముల నా తలంపులు (తల వంపులు కాదని మనవి!) పోవుచుండ నా మది లో ఓ ప్రశ్న తటిల్లత వోలె మెరిసినది.
“అసలు వ్యక్తిత్వమునకూ, శీలమునకూ వ్యత్యాసం ఏమి? నీటి వద్దకు తీసుకొనిపోబడిన అశ్వమునకు శీలము ఉండిన చో దానికి నీటిని త్రాగించుటకు కష్టపడవలసిన అవసరము ఉన్నదా?”

వేరొక చానల్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా బోసు బాబు నాయకత్వ లక్షణాల గురించి చూపిస్తున్నాడు. అటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు లేరు? నాయకులు కూడా కొన్ని పరిస్థితులలో,అవసరాన్ని బట్టి కొన్ని కాలాల లోనే తయారౌతారా?  ఏ కాలానికి తగ్గ నాయకుడు ఆ కాలానుగుణం గా వస్తారా? అన్ని కాలాలకూ వర్తించే సర్వకాలీన నాయకుడు అంటూ ఉండదా?
*************
వ్యక్తిత్వము అను మాట వ్యక్తి నుంచీ వచ్చింది. వ్యక్తం అయిన వాడు వ్యక్తి. అంటే బయటికి వ్యక్త పరచబడని ఆలోచనలు, ఆవేశాలు వ్యక్తిత్వం లో భాగం కావు.personality అనే ఇంగ్లీషు ముక్క కు మూలం కూడా mask అని అర్ధం వచ్చే లాటిన్ ముక్కలో ఉంది.

సాధారణం గా మనం వ్యక్తిత్వాన్ని, కారెక్టర్నీ మనం పాజిటివ్ సెన్స్ లోనే వాడుతాం. మనమొక మనిషికి వ్యక్తిత్వం ఉంది అంటే, అతనికి మంచి వ్యక్తిత్వం ఉంది అనేఅర్ధం లో ఉపయోగిస్తాం. అలానే, కారెక్టర్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాం.

ఒక మనిషి మాటా, అతని పాండిత్యమూ, హాస్య చతురతా,అందం, ఒడ్డూ పొడుగూ మున్నగునవన్నీ అతని వ్యక్తిత్వం లో ని భాగాలు. అలానే పదుగురికీ తెలిసేటట్లు అతను చేసే మంచి పనులూ, చెడ్డపనులూ, దానాలూ, మోసాలూ ఇవికూడా అతని వ్యక్తిత్వం లోని అంశాలే. వ్యక్తిత్వం లోనే సకారాత్మక వ్యక్తిత్వమూ, నకారాత్మక వ్యక్తిత్వమూ ఉంటాయి. ఏ మనిషి వ్యక్తిత్వం లోనూ అన్నీ మంచి విషయాలే ఉండవనేది తెలిన విషయమే. (ఏది మంచి? ఏది కాదు? అనే దానిని తేల్చటం ఓ బ్రహ్మ విద్య అనుకోండి!).
వ్యక్తిత్వం అనేది చాలా వరకూ, “మనుషుల మధ్య అస్థిత్వం లోకి వచ్చే”, విషయం (interpersonal issue). మనకు పక్క వాడి తో పరిచయం లేనపుడు, వాడి వ్యక్తిత్వం ఏదైతే మనకెందుకు? అయితే, దీనికి సెలబ్రిటీ ల వ్యక్తిత్వం ఒక మినహాయింపు. అది one way traffic లాంటిది. వాళ్ళ ని మన జీవితం లో కలిసే అవకాశం లేక పోయినా, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనకి ఆసక్తి ఉంటుంది.

బయటికి కనపడని మనుషుల చెడు ఆలోచనలూ, వారు చాటు మాటు గా చేసే చెడు పనులూ, లేక మంచి పనులూ వారి వ్యక్తిత్వం లో భాగమవ్వాలంటే, అవి బయట పడి నలుగురికీ తెలవాలి. వ్యక్తిత్వం అనే సులువైన విషయాన్ని, మన self అనే విషయం చాలా సంక్లిష్టం చేస్తుంది.
మనం నలుగురికీ మన గురించిన మంచి మాత్రమే తెలియాలనుకొంటాం. దానితో తగిన ఇమేజ్ చూపించటానికి ప్రయత్నిస్తాం. మన గురించిన చెడుని దాచుకొని, మంచి నలుగురుకీ తెలిసే లా ప్రవర్తిస్తాం. ఇది పరిణామ శాస్త్రం ప్రకారం మన వ్యక్తిగత మనుగడ కి అవసరం కూడా.ఎందుకంటే, చెడ్డ పేరు ఉన్నవారిని సమాజం కష్టపెడుతుంది కనుక.
ఒక్కోసారి మనం లోకానికి, మన గురించిన చెడు ని కూడా తెలియ చేస్తాం. మనం మంచి అనుకొన్న విషయాన్ని లోకం చెడు అనుకొన్నపుడు ఇది జరుగుతుంది.  ఒక్కోసారి మనం కప్పెట్టిన చెడు ని లోకం కనిపెట్టి బయటకు లాగుతుంది.
మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి ముఖ్య కారణాలన్నీ లౌకిక మైనవి (డబ్బూ, అధికారమూ, పేరూ వగైరాలు).
ఇక శీలం (character) అనేది  స్వభావ సిధ్ధమైన గుణాన్ని తెలియ చేస్తుంది. మనిషి “ముసుగు వేసుకోని” స్వరూపమే అతని శీలం.(ఒక మనిషి తన మనసు లోపల రహస్యం గా చేసే ఆలోచనలు కూడా అతని కారెక్టర్ లో భాగమే. ఈ రహస్య ఆలోచనలు ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. కానీ ఆ మనిషి దీర్ఘకాలిక బాహ్య ప్రవర్తన ద్వారా అతని ఆలోచనలను కొంత వరకూ అంచనా వేయగలం.   ఆలోచనలు కూడా మనిషి శీలం లో భాగం కాబట్టీ, మనిషి కారెక్టర్ పూర్తి గా ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. ఎందుకంటే, మనిషి తన ఆప్త మితౄలకు కూడా చెప్పుకోలేని కొన్ని రహస్య అలోచనలను కలిగి ఉండగలడు.రహస్యమైన పనులు చేయగలడు. ఆ ఆలోచనలను బహిర్గతం చేయటానికి అతని అంతరాత్మా, విలువలూ అంగీకరించకపోవచ్చు.మనిషి అచేతన(unconscious) లో అతనికే తెలియని భావాలుండవచ్చు.  ఇంకా, మానసిక వ్యాధి గ్రస్తుల ప్రవర్తనా, ఆలోచనలూ ఒక మిస్టరీనే! )

శీలం బయటి వత్తిడులని తట్టుకొనే resilience ని కూడా కలిగి ఉంటుంది.కారెక్టర్ ఉన్నవ్యక్తి తాను నమ్మిన విలువలను ఎన్ని కష్టాలకైనా ఓర్చి నెగ్గించుకొంటాడు. అలా అని మొండి పంతం పట్టే వారంతా కారెక్టర్ ఉన్న వారు కాదు. వ్యక్తిగతగా తన మాటే నెగ్గాలనుకొనే వారు మంకు మనుషులు మాత్రమే!    నీతీ , నిజాయితీ ధైర్యం లాంటివి ఒక మనిషి లో ఉంటే ఉంటాయి. లేక పోతే లేదు. వీటిని core characteristics అనుకొందాం.  వీటిని పెంపొందించుకోవటం చాల కష్టం. ఈ కాలం లో ఏ మనిషీ వీటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించటం కుదరదు. ఎందుకంటే మన సమాజం లో వీటి వలన ఒరిగేది ఏమీ లేదు. ఒక్కోసారి మనిషి ఈ లక్షణాలని నటించటం ద్వారా లబ్ధి పొందటానికి ప్రయత్నించ వచ్చు. నటించినంత మాత్రాన ఆ లక్షణాన్ని కలిగిఉన్నట్లు కాదు.

కారెక్టర్ లో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక మాఫియా డాన్ చెడు కారెక్టర్ ని కలిగి ఉంటే, ఒక స్టేట్స్-మాన్ మంచి కారెక్టర్ ని కలిగి ఉంటాడు.
వ్యక్తిత్వ వికాసం కోర్స్ లు ఏతా వాతా చెప్పేదేమంటే, మనం వ్యక్త పరిచే బాహ్య (superficial) ప్రవర్తనను సాధ్యమైనంత లాభదాయకం గా మార్చుకొమ్మని. ఇది చాల వరకూ కుదిరే విషయమే! ఒక ప్రవర్తననను చాలా కాలం వ్యక్తపరచగ , వ్యక్త పరచగా, కొంత కాలానికి అది మన నిజ స్వభావం లో ఒక భాగమైపోతుంది(internalization). నాకు “థాంక్స్” అని చెప్పటం కొత్తలో చాలా ఇబ్బంది గా ఉండేది. కానీ ఓ నాలుగైదేళ్ళ కు అలవాటైపోయి, థాంక్స్ చెప్పకుండా ఉంటే ఇబ్బంది గా అనిపిస్తోంది.
వ్యక్తిత్వ కోర్స్ ల తో ఇబ్బందేమిటంటే, ఇవి సమాజానికి మొత్తం గా ఉపయోగ పడే compassion వంటి లక్షణాలని internalize చేసుకోమని చెప్పవు. వ్యక్తి కి ఉపయోగ పడే  “చొరవ” వాటి లక్షణాల గిరించి మాత్రమే చెబుతాయి.ఒక ఇంటర్వ్యూ కి ఎవరూ వ్యక్తిత్వ కోర్స్ తీసుకోకుండా హాజరయారనుకొందాం. అప్పుడు ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X అనుకొందాం. కొన్నాళ్ళకు ఆ ఇంటర్వ్యూ కి అందరూ ఆ పర్సనాలిటీ కోర్స్ చదివి, తరువాత అటెండ్ అయారనుకొందాం. అప్పుడు కూడ ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X గానే ఉంటుంది. అంటె ఇలాంటి కోర్స్ ల వలన వచ్చే మొత్తం ప్రయోజనం సున్నా! కోర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాడి జేబు లోనికి మాత్రం పైసలు వచ్చాయి. వాడికి ఉపాధి దొరికింది. ఉద్యోగాల సంఖ్య పెరగనంత వరకూ ఇలాంటి కోర్స్ ల వలన వ్యవస్థ స్థాయి లో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంచే కోర్స్ లు ఈ లాజిక్ కి మినహాయింపు. వాటి వలన కనీసం నైపుణ్యం పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది.

ఒక మనిషికి గొప్ప కారెక్టర్ ఉండి, సరైన వ్యక్తిత్వం ఉండక పోవచ్చు. మన పల్లెల లోని రైతులు చాలా మంది ఈ కోవకే వస్తారు. (ఈ విషయం లో నాకు చార్లెస్ డికెన్స్ great expectations నవల లోని పిప్ పాత్ర గుర్తుకు వస్తుంది.) వీరు సరిగా మాట్లాడటం నేర్చుకొంటే వీరు మంచి వ్యక్తిత్వం కలవారౌతారు .
మరి కొంత మందికి గొప్ప వ్యక్తిత్వం ఉండి, మంచి శీలం లేక పోవచ్చు. బిల్ క్లింటన్లూ, రిసెషన్లను కొని తెచ్చిన హెడ్జ్ ఫండ్ మానేజర్లూ ఈ కోవ కి చెందిన వారే! గొప్ప నెగటివ్ కారెక్టర్ అంటే గాడ్-ఫాదర్ పాత్ర గుర్తుకు వస్తుంది.గొప్ప నెగటివ్ వ్యక్తిత్వం అంటే , ప్రతి విషయానికీ బూతులు తిట్టే ఆటగాళ్ళు (భజ్జీ లాంటి వారు, మెకన్రో లాంటి వారు) గుర్తుకు వస్తారు.  జార్జ్ బుష్ కి మంచి కారెక్టర్ ఉంది కానీ, వ్యక్తిత్వం లేదని నా అనుమానం.
గొప్ప వ్యక్తిత్వమూ శీలమూ ఉన్న వారు చాలా అరుదు. నాకు ఈ విషయం లో ఛత్రపతి  శివాజీ గుర్తుకొస్తాడు. “గడ్ ఆలా, పరూ సిమ్హ్ గేలా!”, అన్న ఆయన వ్యక్తీ కరణా, యుధ్ధాలలో చిక్కిన ముస్లిం స్త్రీలను ఆయన గౌరవించిన విధానం ఆయన వ్యక్తిత్వాని కి సూచికలైతే, ఔరంగజేబుని ఎదిరించి నిలుపుకొన్న సార్వ భౌమత్వం ఆయన సమరశీలతకు ఒక తార్కాణం.

నెగటివ్ కారక్టరూ, నెగటివ్ పెర్సనాలిటీ రెండూ కలిగి ఉన్న వ్యక్తికి ఒక ఉదాహరణ  హిట్లర్ అని అనిపిస్తుంది . దీనికి వివరణ అవసరమా!
వ్యక్తిత్వమూ శీలమూ లేని faceless people  సమాజం నిండా ఉంటారు కదా?వారి ప్రవర్తనా ఇష్టాఇష్టాలూ పరిస్థితుల ప్రకారం, స్వప్రయోజనం ప్రకారం మారిపోతూ ఉంటాయి.చదువుకొన్న, అభివృధ్ధి చెందిన మానవ సమూహాలలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. అలానే, కష్టాలు పడుతున్న, వెనుకబడిన సమూహాలలో కారెక్టర్ ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండవచ్చు.వెనుకబడిన సమూహాలలో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు వారి స్థాయికి మించిన జనాదరణ లభిస్తుంది, మన ఒలింపిక్ మెడల్ విజేతలకు లభించినట్లు గా.   అమెరికా వంటి దేశాలలో ఒలింపిక్ విన్నర్స్ కి లభించే గుర్తింపు కంటే, మన దేశం లో మన విన్నర్స్ కి లభించే ఆదరణ చాలా రెట్లు ఎక్కువ కదా? ఏ చెట్టూ లేని చోట ఆముదం చెత్టే మహా వృక్షం. అలానే వెనుకబడిన వర్గాలలోని వ్యక్తిత్వమున్న నాయకులూ, కరిష్మా ఉన్న నాయకులూ ఆయా వర్గాల అస్థిత్వం (identity) లో ఒక భాగమైపోయి, ఆయా వర్గాలలో ఎక్కువ జనాదరణని పొందుతారు.ఇదే సూత్రం ప్రకారం, అభివృధ్ధి చెందిన వర్గాలలోని కారెక్టర్ ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ ఆదరణ ని పొందాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే, కారెక్టర్ అనేది నలుగురికీ సులువు గా తెలిసే వ్యక్తమైన విషయం కాదు కాబట్టీ.

నాయకునికి గొప్ప శీలమూ, వ్యక్తిత్వమూ తప్పని సరి. ఇంకా నాయకుడనే వాడు గొప్ప దార్శనికుడై ఉండాలి. అతనికి ఆవేశమూ ఆలోచనా సమపాళ్ళ లో ఉండటమే కాకుండా, తన ఆలోచనలనూ, కలలనూ “నిజం” గా మలచుకొనే క్రియాశీలత ఉండాలి(ఈ లెక్క ప్రకారం thought leadership అనేది ఒక పెద్ద మిధ్య). సమాజపు విలువల కన్నా ఒక మెట్టు పైన ఉన్న విలువలను ప్రతిపాదించి కూడ వాటిని నిజం గా మలచగల సమర్ధత ఉండాలి. (conceptual గా ఈ విలువల స్థాయి కి ఒక అంతం అంటూ ఉందదు. ఒక విలువ కన్నా పైస్థాయి లో వేరొక విలువ ఉంటుంది. ఏ స్థాయి విలువ సమాజానికి సరిపోతుందనేదీ, అవసరమనేదీ, ఆచరణీయమనేదీ నాయకుడు నిర్ణయించుకోవాలి. అలానే కింది స్థాయి విలువల పై “చలం” గారి లా చిన్న చూపు తగదు. కింది స్థాయి విలువలు ఏర్పడిన పరిస్థితులనూ, అనివార్యతను సానుభూతి తో అర్ధం చేసుకోవాలి. నాయకుడు, తన విలువలను, ఒంటరి ఉలిపి కట్టె లా తాను మాత్రం పాటిస్తే చాలదు. తాను మాత్రమే పాటిస్తే అతనికి గొప్ప కారెక్టర్ ఉండవచ్చు. కానీ ఆ విలువలను సమాజం లో చెలామణి లోనికి తే గలిగినపుడే అతను అసలైన నాయకుడవుతాడు.)
ఈ రోజుల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఎక్కడన్నా ఒకరు తగులుతారు (నాకు గుర్తుకు వచ్చే వారు జైపాల్ రెడ్డి, జై రాం రమేష్ , సుబ్రమణ్య స్వామి ). గొప్ప శీలం ఉన్న నాయకులు చాలా  తక్కువ (అన్నా హజారే గుర్తుకు వస్తున్నాడు.ఇది నా నమ్మకం మాత్రమే! ఒక మనిషి కారెక్టర్ దీర్ఘకాలం లోనే బయటపడుతుంది). నాయకత్వానికి కావలసిన క్రియాశీలత చాలామంది లో ఉంటుంది. ముఖ్యం గా కార్పొరేట్ నాయకులలో ఇది మెండు. కానీ, కారెక్టర్ విషయం లో సందేహాలుంటున్నాయి. cultivated personality చాలా మందికి ఉంటుంది. కానీ అసలైన వ్యక్తిత్వం ఉండేది ఎందరికి?
“శీలం అనేది కష్టాల వలన పెంపొందుతుంద”నేది ఒక బలమైన నమ్మకం. resilience అనేది శీలానికి ఉండే ఒక ముఖ్య లక్షణం.వ్యక్తిత్వాన్ని ఒక కుండ తో పోల్చవచ్చు. కోర్స్ ల ద్వారా నేర్చుకొనే వ్యక్తిత్వం ఏ కుండ లో పోస్తే ఆ కుండ ఆకారం తీసుకొనే నీటి లాంటిదైతే, అ కుండ కు ఇనుముతో చేసినట్లు గట్టితనాన్ని ప్రసాదించేదే మంచి కారెక్టర్. కానీ ఈ ఆధునిక సమాజం లో జనాలు మరీ కష్టాలు పడే రోజులు పోయాయి. నాయకులు జనాల లోంచే వస్తారు. జనాలు తిరుగుబాట్లు చేయకుండా ఉండటానికి , లేక ఓట్ల కోసం, ప్రజాస్వామ్య నాయకులు జనాలకు కావలసిన కనీసావసరాలను కొంతైనా కల్పిస్తున్నారు. దీని వలన కావచ్చు, గొప్ప కష్టాలలోంచీ వచ్చే, సమ్మెట దెబ్బలు పడిన ఇనుము లాంటి కారెక్టర్ ఉన్న నాయకులు రావటం లేదు.

మన వ్యవస్థలకు ఎటువంటి నాయకులు అవసరం?రాజకీయాలలో ఓట్లు పట్టే వాడే నిజమైన నాయకుడు. వచ్చే ఎన్నికలను గెలవ లేని వాడికి ఎంత గొప్ప కారెక్టర్ ఉన్నా ఏమి లాభం? కార్పొరేట్ వ్యవస్థ లో మదుపరుల డబ్బుని పెంచే నాయకుడు కావాలి.అది ఏ మార్గం ద్వారా పెరిగిందనేది అనవసరం. కొత్త కొత్త సృజనాత్మక ఉత్పత్తులు తయారు చేసే, రిస్క్ చేసే నాయకుడు మనకు అవసరం లేదు. మనకు తెలిసిన, అలవాటైన సేవల ద్వారా నాలుగు రాళ్ళూ సంపాదించగలిగితే చాలు. దీనికి ఒక కారెక్టర్ ఉన్న నాయకుడు అవసరం లేదు. స్వంత నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడే వాడు ఈ వ్యవస్థ లో చాలా ప్రమాద కరం. ఒక cultivated personality ఉన్న నాయకుడు చాలు. భారతీయ కార్పొరేట్ వ్యవస్థ లో, బాస్ నిర్ణయమే చివరికి శిరోధార్యం.flexibility ఉన్న వాళ్ళు కావాలి. అంటే కారెక్టర్ అనవసరం. ఐ టీ సేవల రంగం లో అయితే, ఈ రోజు జావా నేర్చుకొమ్మంటే నేర్చుకోవాలి, రేపు సీ నేర్చుకొమ్మంటే నేర్షుకోవాలి అంటే సర్దుకుపోయే తత్వం ప్రధానం. సర్దుకుపోయే తత్వం వ్యక్తిగత మనుగడ కి ఉపయోగమేమో కానీ, అది ఒక నాయకత్వ లక్షణం కాదు. నాయకుడు బలమైన సంకల్పం కలవాడై, తాను అనుకొన్నదానికోసం మనసు మారకుండా నిలబడే దృఢ చిత్తుడై ఉండాలి. కానీ ఇలాంటి  గుణాలు ఏ రంగం లోనూ ప్రోత్సహించబడటం లేదు.  ఇటువంటి వాతావరణం లో నాయకుడి అవసరం ఎందుకు ఉంటుంది?  సినిమాలలో జనం తమని identify చేసుకొన గలిగిన కారెక్టర్ ఉన్నవాడే హీరో. వాడికి సున్నితమైన లక్షణాలు ఎలా అబ్బుతాయి? మన సమాజానికి నాయకుల అవసరం ఉన్నట్లు కనపడదు. స్వతంత్రం రావటం తోనే ఆ అవసరం తీరిపోయిందేమో!

బ్లాగుల లో కొత్త వారి తో ఎందుకు కబుర్లు చెప్తాం?

ప్ర: మనం రోడ్డు మీద నడుస్తున్నామనుకోండి, ఎదురు గా ఒక కొత్త మనిషి వస్తే అతని తో మాట్లాడం. మరి బ్లాగుల్లో కొత్త మనుషుల తో ఎందుకు మాట్లాడుతాం?
జ: రోడ్డు మీద పోయే ఎదుటి మనిషి ఆలోచనలు మనకు తెలియవు కనుకా, బ్లాగుల్లో బ్లాగరులు తమ ఆలోచనలను చెప్తారు కనుకా..
ప్ర: RF ID ల ద్వారా షాపింగ్ బుట్ట లో వస్తువుల విషయాలు తెలిసినట్లు గా, రోడ్ మీద పోయే వ్యక్తి ఆలోచనలు తెలీపతీ  ద్వారా తెలిసినవనుకోండి, అప్పుడు వెళ్ళి రోడ్ మీది వ్యక్తి తో గల గలా మాట్లాడేస్తామా?
జ: బ్లాగ్ రాసిన వ్యక్తి, లేక కామెంటిన వ్యక్తీ నలుగురూ తను రాసినది చదివి తనకి సమాధానం చెప్పాలని రాస్తాడు. రోడ్డు మీద పోయే వ్యక్తి నిన్నేమైనా బొట్టూ కాటుక పెట్టి తనతో మాట్లాడ మన్నాడా?
ప్ర: అంటే, సదరు బ్లాగ్ స్వంత దారులు దారే పోయే వారిని బొట్టు పెట్టి పిలిచి మాట్లాడిస్తున్నారా?  బ్లాగులు రాసే వారు మాట్లాడే వారి కోసం మొఖం వాచిపోయి ఉన్నారా?
జ: ఒక రకం గా అంతే! నిజ జీవితం లో హాయి గా జనాల్తో కబుర్లు చెప్పుకొంటూ సంతోషం గా ఉన్న వాడికి (ఆ స్టేజ్ లో), బ్లాగులు రాయటానికి ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఒక పల్లెటూరి అరుగులపై ఊళ్ళోవారి తో హాయిగా కబుర్లు చెప్పుకొనే వ్యక్తి ని బ్లాగులు రాయమనండి. “అదేంటబ్బాయ్, కొత్తోళ్ళ తో ఆలోచన ఎలా చేస్తాం?”, అని అనకపోతే నన్నడగండి. నిజ జీవితం లో కబుర్లు చెప్పుకోవటానికీ, తమ ఆలోచనలు పంచుకోవటానికీ అవకాశం లేని వారూ, గుర్తింపు కరువైన వారు బ్లాగులు రాసే అవకాశం మెండు.
ప్ర: మరి సెలబ్రిటీలు గుర్తింపు కోసం మొఖం వాచి పోయి ఉన్నారంటావా? వాళ్ళెందుకు బ్లాగుతారు?
జ: వాళ్ళు రాసేది మామూలు గుర్తింపు కోసం కాదు. ఒకటి తమ ఆలోచనలని జనాల మీదికి వదలటానికి, రెండు తమ ఆలోచనలు గుర్తింపు పొందటానికి. ఒక నటుడి గా గుర్తింపు తెచ్చుకొన్న వాడి ఆలోచనలకి గుర్తింపు ఉండక పోవచ్చు. బ్లాగుల ద్వారా ఆ లోపం తీరుతుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది one sided గా ఉంటుంది. చదువరుల అమోదం కోసం సెలబ్రిటీ లు ఎదురు చూడరు.వారికి ఆ ఆమోదం అప్పటికే తమ తమ రంగాలలో వచ్చి ఉంటుంది. చదువరుల స్పందన కోసం అసలే పట్టించుకోరు. కామెంటరుల కామెంట్లకి సెలబ్రిటీలు స్పందించటం చాలా తక్కువ. కారణం, ఒకటి, కామెంటిన వారు తమ గోటికి సరి కారనే పరోక్ష భావం (inherent attitude) అయితే, రెండోది తమ గుర్తింపు కోరిక అప్పటికే తీరి పోయి ఉండటం.  ఇక సెలబ్రిటీ బ్లాగ్ లకి ఎక్కువ గా కామెంట్స్ రావటం వలన అందరి కామెంట్ల కీ స్పందించటం కుదరదు కూడా!
ప్ర: మొత్తానికి బ్లాగులు రాయటం ఒక ఆధునిక లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి అంటావ్?
జ: అంతే! సైకాలజిస్టుల కాడినుంచీ మారేజ్ కౌన్సిలర్ల దాకా అందరూ ఈ కోవలోకే వస్తారు. బ్లాగుల ద్వారా వ్యక్తి గత జీవితం గురించి రాసే వారికి వాటి అవసరం ఎక్కువ.ఆ లోపాన్ని బ్లాగులు తీరుస్తున్నాయి.  రోడ్డున పోయే వాడి తో తమ వ్యక్తి గత జీవితం గురించి చర్చించే వాడిని ఏమనాలి?
ప్ర: మరీ కోస్తున్నావ్. నిజ జీవితానికీ బ్లాగు జీవితానికీ తేడా లేదా? నిజ జీవితం లో అలా చర్చిస్తే చాలా రిస్కు కదా. కొత్త వారు మన జీవితాలతో ఆడుకొంటారు. బ్లాగుల్లో ఊరూ పేరూ లేకుండా చర్చిస్తే మనకొచ్చే నష్టమేమిటి? ఊరూ పేరూ తెలిసినా, ఎక్కడెక్కడో ఉండే బ్లాగరులు చేయగలిగేదేమిటి?ఓ.., తెగ చెప్పటం కాదు. మరి, నువ్వు బ్లాగు ఎందుకు నడుపుతున్నా..?
జ: నేనూ ఇప్పటి దాకా చెప్పిన వాటికి అతీతుడిని కాదు. అయిన నా గుర్తింపు కుతి కొంతవరకూ తీరిపోయినట్లుంది, పైగా చెప్పటానికి బుర్రలో ఏమీ మిగల లా..అప్పుడప్పుడూ పనిలేక బోర్ పోవటం కోసం రాస్తున్నా.ఇక,దుకాణం మూసేద్దా మనుకొంటున్నా..

ప్ర: అందరూ నీ లాంటి పనిలేని వాళ్ళు కాదు. ఏదో ఒక ఆశయం తో, లేక ఒక ఐడియాలజీ కోసమో సైట్లు నడిపే వారూ ఉంటారు. ప్రత్యేక మైన ఆడియన్స్ కోసం, రైతులకోసం, సైన్స్ కోసం ఇలా ఒక కారణం కోసం బ్లాగులు నడిపే వారు ఉంటారు.ఒక ఊరి విషయాలు తెలుపుతూ, సినిమా విషయాల కోసం ఇలా నడిపే వారూ ఉంటారు. మరి వారిని గురించి ఏమంటావు?
జ: వారు ధన్య జీవులు. వారిని నడిపించమంటాను.

నాకు నచ్చిన మనుషులూ, విషయాలూ, వంటలూ..

ఈ మధ్య సమాజం గురించీ, వ్యవస్థా ఇజమూ అదీ ఇదీ అని వాగి వాగి బోర్ కొట్టింది. సమాజానికి మనుగడ సాగించే సత్తా ఉంటే, అది ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంది, లేక పోతే, చంకనాకి పోతుంది. సమాజం గురించి ఓ తెగ అర్ధం చేసుకొని, వ్యక్తిగతం గా గానీ , సామూహికం గా గానీ సాధించేది ప్రస్తుతానికి నాకు కనపడటం లా..
కాబట్టీ, సమాజమూ వ్యవస్థా వగైరాలను కాసేపు పక్కనపెట్టి, నాకు ఇష్టమైన విషయాల గురించి మీతో పంచుకొంటే, రోజు గడిచే సరికి, నాకు కాస్త ఆనందమైనా మిగులుతుంది. అందుకే, నాకు ఇష్టమైన విషయాల గురించి ఈ టపాలో రాస్తాను. మీకు ఇష్టమైన వారి గురించీ, విషయాల గురించీ మీరు టపా కామెంట్లలో తెలుపండేం? ఇవి ఎక్కువ గా తెలుగు ప్రపంచం నుంచే అయి ఉంటాయి. వీరు మీకు ఎందుకు నచ్చారు అని అడిగితే, నేను ఆటే సమాధానం చెప్పలేను. కానీ, కొంచెం వివరించటానికి ప్రయత్నిస్తాను.
నాకు నచ్చిన వ్యక్తులు:

1. గాయకుడు : బాల మురళి
ఆ గొంతు లోని లోతూ గాంభీర్యం వేరెవరికి ఉన్నాయి?
2. సినిమా గాయకుడు: ఘంటసాల, బాలు
ఘంటసాల గారి గాత్రం ఎవరికి ఇష్టముండదు? కానీ, కొన్ని రకాల పాటలు పాడటం లో ఆయనకు పరిమితులు ఉన్నాయనుకొంటాను.

బాలు గారు తెలుగు సినిమా పాటలలో సాహిత్యానికీ, సంగీతానికీ ఉన్న చివరి గౌరవప్రదమైన లంకె.

జేసు దాసు స్వరం బానే ఉటుంది గానీ, అయన పట్టి పట్టి పాడటం, ఉఛ్ఛారణా దోషాలూ నాకు పట్టివేస్తాయి!
3. గాయని : సుబ్బులక్ష్మి
భజగోవిందం విని ఇంకా ఆవిడ అభిమాని గా మారక పోతే ఎలా?  ఆమె గొంతు లో ఉన్న “అతెంటిసిటీ”. ఒక్కో సారి ఆమె గొంతు గయ్యాళి గా వినపడటానికి నాది బాధ్యతా?
4. సినిమా గాయని
చిత్ర: ఎప్పుడన్నా ఒక్క పదం మలయాళం వాసన వచ్చినా, చిత్ర స్వరం అంటే మక్కువే!
అడవి రాముడు, యమగోల కాలం లో సుశీల “కై ,కై ” గొంతు వింటే చాలా కంపరం. జానకి పరవాలా! కానీ, ఆమె కొంచెం కైపు పాటలూ, చిన్న పిల్లల పాటలూ పాడేది. (వైరుధ్యం చూడండి). తరువాత “నా గొంతు శృతిలోనా..” అంటూ మొదలైన చిత్ర గొంతుకి నేను దాసోహం!

లతా మంగేష్కర్ పాత పాటలు బానే పాడేది. కానీ ఇప్పటి 18 యేళ్ళ హీరోయిన్లకు పాడితే, ఆమె స్వరం లోని వయసు మీరిన లక్షణం బయటపడుతోంది!
5. రాజకీయ నాయకుడు : సుందయయ్య, చంద్ర బాబు నాయుడు.
సుందరయ్య: అధికారపక్షం వారి నుంచీ కూడా గౌరవాన్ని పొందిన ఏకైక నాయకుడు. అలా గౌరవం ఇచ్చే వారు ఈ రోజులలో లేరనుకోండి.
చంద్ర బాబు: దీర్ఘకాలిక పధకాలు పెట్టటం, సంస్థలు నెలకొల్పటం, పార్టీకీ ప్రభుత్వానికీ మధ్య కొంత విభజన పాటించటం. మిగిలిన అన్ని విషయాలలో ఈయన కూడా సగటు రాజకీయ నాయకుడే!

పీ వీ ఒక నిజాయితీ దూరదృష్టీ కల తెలుగు ప్రధాన మంత్రి గా ఇష్టమే కానీ, ఆయనను ఒక గొప్ప నాయకుడనవచ్చునా?
6. నటుడు : N.T.R., చిరంజీవి.
నాకు ఊహ తెలిసేటప్పటికి నాటకాలు అటకెక్కాయి. అవి అప్పుడప్పుడూ మూలిగే మూలుగు వినపడేది. కాబట్టీ నాటకాలలో ఎవరు గొప్ప నటుడో చెప్పలేను. సినిమాలలో రామారావు చివరి సినిమాలు ఆడుతున్నాయి. అవి ఇప్పుడు చూస్తే కామెడీ గా ఉంటాయి . కానీ, ఆయన నటించిన పౌరాణికాలు చూసినపుడు అనిపించింది, “న భూతో న భవిష్యతి”. N.T.R. లాంటి నటుడు ఇక ముందు పుట్టబోడు. అది ఆయన గొప్ప కాదు. తెలుగు భాషా సంస్కృతీ అడుగంటి పోతున్న దశలో, మళ్ళీ అలాంటి నటన ఇక సంభవం కాదు.
చిరంజీవి మొదటి సినిమాలూ, బాపూ, విశ్వనాధ్, బాలచందర్ వంటి వారి దర్శకత్వం లో ఆయన నటన చూసినపుడు, చాలా సులువు గా అర్ధమౌతుంది, “ఆయనకున్న ప్రతిభేమిటో”. కానీ, ఎక్కడా..! మన వీరాభిమానులూ, వ్యాపార సూత్రాలూ ఆయనని ఒక మెగా స్టార్ ని చేసి, ఆయనలోని నటుడిని నొక్కేశాయి.
7. కవి: శ్రీ, శ్రీ, ఆత్రేయ
నాకు అర్ధమయ్యే సామాన్యమైన భాష లో అసామాన్యమైన భావాలను వ్యక్తీకరించిన మహా కవి. N.T.R లానే మరో శ్రీ శ్రీ పుట్టబోడు, అవే కారణాల వలన.

శ్రీ శ్రీ గొప్పదనానికి భాషమీద ఆయనకు ఉన్న పట్టు ఒక కారణమైతే, అత్రేయ “సినిమనసు” పాటలకు, కారణం భాష లో ఆయనకు ఉన్న పొదుపు. ఆయన పాటలు రాసినా వాటిలో కవిత్వం ఉంది కాబట్టీ, నా దృష్టి లో ఆయన కూడ కవే!

8. నటి: సావిత్రి
ఇప్పటి నటీమణుల లా శరీర కదలికల ద్వారా కాకుండా, ముఖ కవళికల ద్వారా నటన చేసినందుకు.
9. రచయిత: కొడవటిగంటి. కుటుంబ రావు, రా.వి. శాస్త్రి.
కొ.కు: రచనకి సంబంధించిన అనేకానేక ప్రక్రియలలో సాధికారమైన ఆధునిక రచనలు చేయటమే కాకుండా, అనేక తాత్విక, శాస్త్ర సంబంధమైన వ్యాసాలు రాసినందుకు.
రావి శాస్త్రి: రావిశాస్త్రి లా రాయాలంటే ఆయన మళ్ళీ పుట్టాలిసిందే. అనితరసాధ్యమైన, ప్రవాహసదృశమైన, కవితాత్మకమైన ఆయన శైలి.  ఆయన రచనలలో అట్టడుగు లోకపు వాస్తవ చిత్రణ ఉంటుంది. ఈ అట్టడుగు స్థాయి వారి (మెజారిటీ ప్రజల) జీవిత వాస్తవ చిత్రణ ఎర్ర రచయితల(కారా మేస్టారు ఇంకొక ఉదహరణ) రచనలలోనే ఎక్కువ గా ఎందుకు ఉంటుంది? మార్క్సిస్టు వాస్తవాన్ని చూపించాలంటే, ముందు వాస్తవాన్ని చూపించాలి, తరువాత దానికి ఎర్ర రంగు అద్దాలి. కానీ మిగిలిన నిబధ్ధత లేని రచయితలకి వాస్తవాన్ని చూపించవలసిన ఆగత్యం కూడా ఉండదనుకొంటా!

10. సినిమా దర్శకుడు : విశ్వనాధ్, బాలచందర్
కొంచెం డీసెంట్ గా సినిమాలు తీసే దర్శకులని మన చిత్రసీమా, ప్రేక్షకులూ బతకనివ్వరు. ఎప్పుడన్నా విశ్వనాధ్ వంటి వారినీ, అప్పుడప్పుడూ బాలచందర్ వంటి వారినీ బతకనిస్తుంది. బాలచందర్ వి చాల వరకూ డబ్బింగ్ లూ, రీమేక్ లే. కానీ వాటిలో విషయం ఉంటుంది. లోతు ఉంటుంది. మరో చరిత్ర వంటి సినిమాలకి ఒక surreal aura ఉంది. మన మనసు లోలోపలి భావాలను, ఉద్వేగాలనూ, రహస్య వాంఛలనూ, తాత్కాలికం గా నైనా, బయట పడేటట్లు చేసే శక్తి బాలచందర్ సినిమాలకు ఉంది.

తమిళం లో భాగ్య రాజా సినిమాలు కూడా బానే ఉంటాయి. బాలచందర్ సినిమా లు చూస్తే వాటిలోని ఇష్యూస్ ఈ రోజు కి కూడా రిలవెంట్ గానే ఉంటాయి. కానీ భాగ్య రాజా సినిమాలు  ఇప్పుడు చూస్తే, కాలదోషం పట్టినట్లు కనిపిస్తాయి. భాగ్య రాజా సినిమా ల లో ఒక రకమైన వెకిలి తనం కూడా ఉంటుంది.

11. సినిమా: మిస్సమ్మ
సునిసితమైన హాస్యం. ఆ హాస్యం, మరి, ఎవరి  మానస పుత్రికో! మిస్సమ్మ దర్శకుడు LV ప్రసాద్ అని మాత్రమే తెలుసు. ఇది కాక బాలచందర్ సినిమాలు చాలా వరకూ నచ్చుతాయి.

12. అధ్యాత్మిక వ్యక్తి: U.G. కృష్ణమూర్తి.
అధ్యాత్మిక వ్యాపారం చేయని ఒక అరుదైన ఆధునిక మనిషి.
13. ఊరు:  మా ఊరు.
కృష్ణ పక్కన ఉంది. మన మహా నగరాలను, వాటిలోని మనుషులనూ చూశాక, మా ఊరంటే ఇష్టం ఇంకా ఎక్కువైంది. విదేశాలా..అవి మనుషులున్న ఎడారులు!
14. ఆహారం : ఆవకాయ ముక్క, పెరుగు.
ఫైవ్ స్టార్ హోటల్లో వంటకాలన్నీ దీని ముందు దిగదుడుపే!

15. కూర: చిక్కుడు కాయ
గోరుచిక్కుడు కాయ అంటే మాత్రం అయిష్టం.

మా నాయనమ్మ వండుతూ ఉండే సీమతుమ్మ(సీమ చింత?) పప్పుల కూర.  వగరు పప్పులు వాడితే కూర మరింత బాగుండేది.

16.పండు : రసం మామిడి కాయ, లిచీ

పళ్ళన్నీ ఇష్టమే! ముఖ్యం గా పైవి. ఒక్క బొప్పాయ కాయ తప్ప అన్నీ ఇష్టమే!

ఏవిటో! నేను అభిమానిద్దామన్నా, తెలుగు వారిలో నాకు శాస్త్రవేత్తలూ,సాంకేతికులూ దొరకటం లేదు. K.L. రావు, యెల్లాప్రగడ సుబ్బా రావు, నాయుడమ్మా వంటి వారి పేర్లు తెలుసు గానీ, వారిని ఎందుకు అభిమానించాలో ఇక్కడ ఓ రెండు ముక్కలు కూడా రాయలేను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఓ రెండు ముక్కలు రాయగలను . కానీ ఆయన పూర్తి గా తెలుగు వాడు కాదనుకొంటా!   వై వీ రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు, విజయ రామా రావూ, KLN ప్రసాద్  వంటి బ్యూరోక్రాట్ల గురించి నేను రాసే దాని కన్నా గూగుల్ చేస్తే బాగుంటుంది. నాకు వారి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొనేంత పరిజ్ఞానం లేదు.

కూచిపూడి నృత్యం వంటివి చూడటానికి బాగుంటుంటాయి, కానీ వాటి గురించీ, ఆయా కళా కారుల గురించీ నా అభిప్రాయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు.  వెంపటి చిన సత్యం గారి నాట్యం గురించి నా అభిప్రాయం వినటానికి ఎంత తప్పు గా ఉంటుందో!

———————————————————————————————

ఇంగ్లీష్, హిందీ సినిమాలు నేను చూసేది తక్కువ. నేను చూసినంతలో.. నాకు తెలిసినంత లో…

హిందీ నటుదు: సంజీవ్ కుమార్
సహజ నటుడు. ఆయన భాషా, డిక్షన్ గురించి మనం ఎక్కువ గా మాట్లాడలేం కదా?
హిందీ నటి:స్మితా పాటిల్
ఇంకోసారి..సహజనటి. మామూలు నిజ జీవితం లోని మనిషి లా కనపడటం.

హిందీ సినిమ: షోలే
ఇంతకంటే గొప్ప సినిమాలు చూసినట్లు గుర్తు లేదు. నసీరుద్దీన్ షా ఆర్ట్ సినిమాలు సగం సగం చూశాను. రిత్విక్ ఘటక్ సినిమాలూ, మృణాల్ సేన్ సినిమాలూ కొంచెం, కొంచెం చూశాను. ప్యాసా కొంచెం చూశాను.నాకు ఈ విషయం లో అర్హత లేదు.

ఇంగ్లీష్ రచయిత: మాం, డికెన్స్, చెకోవ్
డికెన్స్ great expectation చదివి ఆయన అభిమానినయాను. అందులో హీరోయిన్ హృదయాన్ని ఆయన మలిచిన తీరు అద్భుతం.

నిన్న మొన్నటి దాకా మన సమాజపు విలువలు, ముప్పైవ నలభైవ దశకం లో పాశ్చాత్య సమాజపు మొరాలిటీనీ వాతావరణాన్ని పోలి ఉన్నదనుకొంటా. అందు వలననే  నాకు “మాం” రచనలలోని పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి.

చెకోవ్ రచనలలో ఉన్న pathos చాలా ఇష్టం.

సరేనండీ , ఇప్పటికే చాలా బోర్ కొట్టించేసి ఉంటాను. మళ్ళీ తరువాత…. మీరు తేరుకొన్న తరువాత బోర్ కొట్టిస్తాను.ధన్యవాదాలు.

కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )

ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.

1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు :-) )
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది.  మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ,  భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది.  కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది.  .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు.  ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.

ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm)  దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition  లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత  నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.

10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.

ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework),  తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి  కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో!  వ్యక్తులు  కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు.  నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!

అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.

10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.

డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ  ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు.  డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు  ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా  కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.

11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).

12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి  సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.

13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది.  ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?

అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.

కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!

14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి  సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది.  అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.

మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.

15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.

16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు.  సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.

17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ)  ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )

18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన  ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.

మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.

19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు,  ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?

ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా?  OK . Then, have a nice weekend.

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers