చింత చెట్టు మీద కాకుల సమావేశం

“కావ్ ..కావ్..ఈ కాకేదో తేడాగా ఉంది..అందరూ రండీ..”, అని కూసింది హెడ్ కాకి.
వెంటనే ఆ చుట్టు పక్కల ఊళ్ళలోని కాకులన్నీ  వచ్చి ఆ ఊరి బయటి చింత చెట్టు మీద వాలిపోయాయి.
“ఏమిటి విషయం?”, అంది ఒక “గుంపులో గోవిందయ్య” కాకి.
“చూడండి. దీని కూత తేడా గా ఉంది. పైగా ఇది ఏమందో తెలుసా..? “కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది హెడ్ కాకి.
“వార్నీ! అయితే దీనిని పొడవాలిసిందే..!తన్నాల్సిందే..!తన్నండి..తన్నండి”, కాకులన్నీ తమ ఇనప గోళ్ళతో ఆ ఎర్ర కాకిని ఎగిరి తన్న సాగాయి.
“ఇంకా ఏమందో తెలుసా? మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ,  కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.
“తప్పు రా ఎర్ర కాకీ. వేదాలలో అంతా మంచే ఉంది. వేదాలూ గీతా అన్ని వర్ణాలూ సమానమనే చెప్పాయి. ఆచరణలో విఫలమైతే వేదాలదా బాధ్యతా..? వాటిలో అనేక కనిపెట్టబడని నిగూఢార్ధాలున్నాయి.గురజాడ వంటి మహా కవి, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, అని చెప్పలేదా? అయినా వేదాల ను ప్రశ్నించటానికి నువ్వెంతా నీ అనుభవమెంతా? పిల్ల కాకీ!” అని , మిగిలిన కాకులతో, ” వీడిని మళ్ళీ మీ వాడి ముక్కులతో పొడవండి…కావ్..కావ్..వీడు “ఐ ఎస్ ఐ” ఏజంటైనా ఉండాలి లేక చైనా ఏజంటైనా ఉండాలి,” అంది గుంపులో గోవిందయ్య కాకి.

హెడ్ కాకి: విమానాలూ, అణు బాంబులూ గట్రా మన వేద కాలం లోనే ఉన్నాయని నేనంటే, “అప్పటి డిజైన్లు మొన్నీ మధ్య పరీక్షిస్తే ఫెయిలయ్యాయని” చెప్తోంది. ఇంకా..”మన వాళ్ళ ఫేక్ రెజ్యూం లలా, అవి ఫేక్ డిజైన్లా?” అని వెక్కిరిస్తోంది. పైపెచ్చు. “విమానాలు ఆ కాలం లోనే ఉంటే వాటి అవశేషాలు పురావస్తు తవ్వకాలలో ఎందుకు బయట పడలేదు?” అంటోంది. నేనన్నాను, “పురావస్తు తవ్వకాలలో బయట పడటానికి అవేమన్నా భౌతిక వస్తువులా? మన రుషుల మంత్ర శక్తి తో ఉద్భవించిన అధిభౌతిక వస్తువులు కదా?” …. దానికి ఈ పిల్ల వెధవ ఏమందో తెలుసా?..” మీ వాదనలకి ,మీ వ్యక్తిగత నమ్మకాల ఆధారం లేని ఏదైనా నిరూపణ చూపించండి!”.
“అదేమి కూసినా, నువ్వు బాగా సమధానం చెప్పావు. వీడు మన పూర్వీకుల ఈకలు పీకుతున్నాడు , కాబట్టీ, వీడి ఈకలు పీకండి,” అని మిగిలిన కాకులకి పిలుపునిచ్చింది గు.గో. కాకి.
హెడ్ కాకి మళ్ళీ కావ్ భాష లో చెప్పింది, “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం”, అని కూడా అంది.
“ఇది దీనికి వచ్చిన ఆలోచన కాదు. ఆ తమిళ రామస్వామో, లేక తెలుగు రామస్వామో చెప్పిన మాటలను విని చెడిపోయింది. ఆ రామ స్వాములను లోకమంతా మరిచిపోయింది. కానీ, ఇది మరిచిపోలేదు. ఇంకా నయం.. దీనికి కొ.కు, శ్రీ శ్రీ లాంటి వారి ఆలోచనలు తెలియవనుకొంటాను. తెలిస్తే కొంప మునుగుతుంది. ఈ లోపే, తన్నండి, పొడవండి.”
” ఇది ఈ మధ్య “కాకిత్వ వాదం” అదీ ఇదీ అని పేలుతోంది”
గు.గో కాకి పెద్ద గా అరిచింది, “అయితే దీనికి ఇన్నయ్య జబ్బు అయినా పట్టి ఉండాలి, లేక రాయో రప్పో తగిలి ఉండాలి. ముక్కులకి పదును పెట్టి మరీ దీనిని పొడవండి”
“అంతే కాదు, అప్పుడప్పుడూ దళిత-బహుజనులు అనే పదం వాడుతోంది”
“అమ్మో! అయితే అయిలయ్య రోగం పట్టుకొంది దీనికి. దీనిని చీరాల్సిందే! ఇంకా నయం “జై తెలంగాణా..” అని పాట పాడటం లేదు!”
“”జై తెలంగాణ..”, అని పాట పాడటం లేదు . కానీ, “చీ కొట్టినా పోవేరా ఆంధ్రోడా?”, అంటోంది.”, అంది హెడ్ కాకి.
“ఇది చాలా డేంజర్. దీనిని చెట్టుమీదినుంచీ తోసేయండి!, కాదు..కాదు..కానీ మనం సమైక్య వాదులం కదా! కాబట్టీ, చెట్టు మీదే ఉంచి ముక్కు తో పొడవండి”
“ఇది తనకు “అమెరికా పురం” లో ఎద్దు ను పొడవటానికి చాన్స్ వచ్చినా వెళ్ళలేదంట. అమెరికా పురం వెళ్ళిన కాకులన్నిటికీ కొంచెం స్వార్ధం ఎక్కువ అంటోంది”
గు. గో కాకి, వెటకారం గా ఎర్ర కాకి కళ్ళలోకి చూసి, ” ఛా.! మీ ఊరు కాకవరం లో ఎవరూ స్వార్ధపరులు లేరా?” అని ఎగిరి తన్నింది ఎర్ర కాకిని.
ఇంతలో ఒక అమాయకపు కాకి మెత్త గా గొంతు సవరించుకొని, “దాని పైత్యమేదో అది కూస్తుంది. ఇంతోటి దానికి దానిని ఎగిరి తన్నటం అవసరమా?”, అంది.
“దాని పైత్యం కూయటం లో ఉంటే, మా పైత్యం దానిని ఎగిరి తన్నటం లో ఉంది”, అని కాకులన్నీ అమాయకపు కాకిని ఎగిరి తన్నాయి. అమాయకపు  కాకి కి “ఉలిపి కట్టె” అని పేరు పెట్టాయి. అమాయకపు కాకి మిగిలిన కాకులను intolerant bunch అని తిట్టుకొంటూ ఎగిరిపోయింది.
ఇంతలో అక్కడ గొర్రెలను కాసుకొంటున్న కాపరి ఒకడు ఓ రాయి తీసుకొని, “ఛీ, కాకి గోల!”, అని చింత చెట్టు మీదికి విసిరాడు. ఆ రాయి కాకులకి తగలకుండా దూరం గా పోయింది. కాకులన్నీ ఒక్కొక్కటీ జారుకోవటం మొదలు పెట్టాయి.
“మా పిల్లల కి దొండ పండు తేవాలి”, అని ఓకాకి అంటే, “మా ఆయనకి ఎద్దు పుండు చూపెట్టాలి “, అని ఇంకొక కాకి అంది.
గొర్రెల బుడ్డోడు ఈ సారి గురి తప్పకుండా విసిరాడు. అప్పటికే కాకులన్నీ జారుకున్నాయి.
“కుహూ, కుహూ”, అంటూ ఓ నల్లటి సన్నటి పక్షి బయట పడింది చింత చెట్టులోంచీ!

స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

ఒక మనిషి ఆలోచనలనూ, ప్రవర్తననూ ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థ లోని భౌతికమైన కారణాలు ప్రభావితం చేస్తాయి. ఈ భౌతికమైన కారణాలు మారినప్పుడు ఆ మనిషి ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది.అదే విధం గా ఆలోచనల వలన వ్యవస్థ మారటం కూడా జరుగుతుంది. కానీ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉన్నప్పుడే ఈ మార్పు జరుగుతుంది.

స్త్రీల మీది వివక్షకు కారణాలు మధ్య యుగాలలోని పరిస్థితులలో ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, సమాజం నిరంతర యుధ్ధాలలో మునిగి తేలుతుండటం, స్త్రీ కి శారీరకం గా సంతానాన్ని కనటం, రుతు క్రమం  మొదలైనవి స్త్రీ మీది పురుషుల ఆధిపత్యానికి మూల కారణాలు.
(తెలుగు భాష మూలాలు మధ్య యుగాలలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో స్త్రీ ని ఒక రక్షించుకొన వలసిన సంపద గా భావించే వారు. ఒక జంతువు నో, వస్తువునో, బండినో అన్నట్లు గానే స్త్రీ ని “వచ్చింది” అంటారు. అదే స్త్రీ ఏ రాజు గారి భార్యో అయితే సేవకుడు “వచ్చారు” అని పుం లింగం లొ పిలిచినట్లు గా పిలిచే వారు. ఇంగ్లీష్ లో ఈ మధ్య స్త్రీ వాదులు ఆక్ట్రెస్ అనే పదాన్ని వాడటం లేదు. వారు ఆడ వారిని ఆక్ట్రెస్  అని పిలవటం లింగ వివక్ష కు నిదర్శమ్నం అని అంటున్నారు.స్త్రీ ని కూడా ఆక్టర్ అని పిలవాలని అంటున్నారు. ఇక తెలుగు లో ఆడ వారిని కూడా “వచ్చాడు” అని పిలవమనే కాలం ఎంతో దూరం లో లేదనుకొంటా.)
ఇక అసలు విషయానికి వస్తే, భారతీయ సమాజం సమాజం లో  రాజారామమోహన రాయలు, ఆంధ్ర సమాజం లో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారి సంస్కరణల వలన స్త్రీ విధ్య తో స్త్రీ జనోధ్ధరణ మొదలైంది. తరువాత వచ్చిన స్వతంత్రం వలన ప్రజాస్వామ్యమూ, వోటు హక్కూ స్త్రీలకు వచ్చాయి.  మగాడు చేసే పని లో శారీరకమైన శ్రమ తగ్గిపోయింది. తెలివితో చేసే పని ఎక్కువయ్యింది. స్త్రీలు కూడా ఆ పని చేయటం లో ఏ విధం గానూ తక్కువ వారు కాదు.వీటన్నిటి పర్యవసానం గా స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం ఒనగూడింది.(స్త్రీలు ఉద్యోగాలు చేస్తే లేబర్ సప్లై ఎక్కువై, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టీ కాపిటలిస్టు లు కూడా స్త్రీ సమానత్వాన్ని ప్రోత్సహించారు. స్త్రీ ఇంట్లో చేసే వంట ని కమర్షియలైజ్ చేసి, మెక్డోనాల్డ్స్ వంటి వాటి తో లాభలు పండించే అవకాశం వలన కూడా కాపిటలిస్ట్ ల కి ఉపయోగమే ! )  ఆర్దిక స్వాతంత్ర్యం లేకుండా స్త్రీ వాదాన్ని ఆచరణ లో పెట్టటం స్త్రీలకు కష్టమైన పని. గర్భనిరోధక సాధనాల వలన పిల్లలను కనటం మీద స్త్రీ కి అదుపు ఏర్పడింది. దీని వలన స్త్రీ కి తన ఉద్యోగం, జీవితం పై నియంత్రణ పెరిగింది.ఈ అన్ని కారణాల వలన స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజం లో వచ్చిన ఒక పరిణామం.కానీ పాత అలవాట్లు అంత త్వరగా వదలవు కొంత మంది మగ వాళ్ళు ఇంకా మారిన పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవటం వలన,పాత అలవాట్లను ఒదులుకోలేక పోవటం వలన పురుషాధిక్య భావజాలాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది మగ వాళ్ళూ స్త్రీ పురుష సమానత్వాన్ని స్వాగతించారు. మగ వారు సమానత్వాన్ని స్వాగతించకపోతే సమానత్వం అనేది ప్రస్థుత సమాజపు ఒక విలువ గా స్థిర పడేది కాదు.
పై చెప్పిన కారణాలన్నింటి వలనా మగ వారి తో  సమానం గా విద్యావంతులైన ఆడవారు కొంత మంది మగ వాళ్ళ లో గూడు కట్టుకొన్న ఆధిపత్య భావన కు వ్యతిరేకం గా స్త్రీ వాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదే స్త్రీ వాదాన్ని ఏ మధ్య యుగాలలో నో ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ ద్రౌపది వంటి ఏ స్త్రీ వాదో కొన్ని ప్రశ్నలు అడిగినా అది అప్పటి సమాజాన్ని ఎంత మార్చగలిగిందో మనకందరికీ తెలుసు. స్త్రీ వాదం లేక పోయినా ఈ సమాజం లోని ప్రజాస్వామ్య శక్తుల దృష్ట్యా, మారిన పని స్వభావం దృష్ట్యా స్త్రీ పురుష సమానత్వం వైపుకి మన సమాజం అడుగులు వేస్తోంది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
స్త్రీ వాదం వివక్ష చూపించే పురుషుల పై పోరాటం జరిపి సమానత్వ సాధనను వేగ వంతం చేస్తుందనేదాంట్లో కూడా ఏ మాత్రం సందేహం లేదు.
కానీ స్త్రీ వాదులు రెండు గుంటలలో పడే ప్రమాదం ఎక్కువ గా కనిపిస్తోంది. ఒకటి పురుషుల నందరినీ స్త్రీ వ్యతిరేకులు గా అర్ధం చేసుకొని ఆ విధమైన ప్రచారం సాగించటం. రెండవది ఆధిపత్యం కోసం ప్రయత్నించటం. వీటి వలన స్త్రీ పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్య పోరు మొదలై అసలుకే మోసం వచ్చి, మళ్ళీ సమాజాలు మధ్య యుగాలలోకి జారి పోయే ప్రమాదం ఉంది. స్త్రీ వాదం చాలా వరకూ పట్టణాల లోని ఉన్నత తరగతి స్త్రీ ల నుంచీ వస్తోంది. వీరు పురుషాధిపత్యం ఎక్కువ గా ఉన్న గ్రామాలలోకి తమ ఉద్యమాన్ని తీసుకొని అక్కడి ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. కాని మన గ్రామాలలో స్త్రీ ల కు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని కారణం గా వారి జీవితాలలో నయా స్త్రీ వాదం ఎంతవరకూ మేలు చేస్తుందో సందేహాస్పదం.
ఇక దళిత వాదం విషయానికి వస్తే,  పోడు వ్యవసాయ వ్యవస్థలో ఎక్కువ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేసిన వాళ్ళూ భూస్వాములయ్యారు. వారికి ఎక్కువ కులం ఇచ్చి కుల వ్యవస్థ ఆదరించింది. అదేవిధం మొదటి నుంచీ ఇక్కడి వారైన దళితులు కూలీలు గా మిగిలి పోవలసి వచ్చింది. అప్పటి కుల వ్యవస్థ ను అప్పటి భాహ్మణులు రాజులూ సమర్ధించారు. కానీ ఈ వ్యవస్థ లో కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వలనా, ప్రజాస్వామ్యం వలనా అసమానతలు తగ్గాయి. కానీ ఇక్కడ చేయవలసింది చాలా ఉంది, ముఖ్యం గా గ్రామా ల లో భూమి లేని దళిత వ్యవసాయ కూలీ ల విషయం లో.
ఇక దళితవాదం ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవలసిందే. కానీ ఆ భావం లేని అగ్రకులస్థుడి  దగ్గరికి వెళ్ళి వాడికులాన్నితిట్టడం తగదు. దీని వలన ఉద్యమమే కొంతమంది సమర్ధకులనూ, సానుభూతిపరులనూ కోల్పోతుంది. ఇది ఉద్యమానికే నష్టం.ఉద్యమకారులు పోరాటాల గురించిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఈ విధమైన నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకొంటే మంచిది.
ఇక స్త్రీ వాదులు కానీ దళిత వాదులు కానీ తమ పోరాటం ఆధిపత్య భావజాలం మీద కానీ వ్యక్తుల మీద కాదు అంటారు. కానీ ఆధిపత్య భావజాలం వ్యక్తుల బుర్రలలో ఉంటుంది. కాబట్టీ చివరికి వ్యక్తులను లక్ష్యం చేసుకోవటం ఒకానొక దశ లో తప్పదు.ఇలాంటి దశ లో పైన ఉండే సిధ్ధాంత కర్తలకు ఉన్న క్లారిటీ రోడ్డు పైనా, ఊళ్ళలోనూ పోరాటాలూండే సామాన్యులకు ఇది అర్ధమయ్యే అవకాశం తక్కువ. దీనివలన క్షేత్ర స్థాయి లో ఉద్యమ లక్ష్యాలకు విరుధ్ధమైన హింస చోటుచేసుకోవచ్చు.
అదే విధం గా ఆధిపత్య పోరాటాల వలన ఒనకూడే ప్రయోజనం సున్నా. వీటి వలన ఎదుటి వారు అంతా ఏకమయ్యి మళ్ళీ తిరోగమనానికి దారి తీయవచ్చు.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన చిక్కులూ, మనిషి బుర్ర పరిమితులూ…

అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన ఇబ్బందులూ, మనిషి బుర్ర పరిమితులూ…

మీరు ‘X’ అనబడే వర్గానికి చెందిన వారనుకొందాం. మీరు Y అనే వర్గం వారిలో చాలా మంది వలన మీకు నష్టం జరిగింది అనుకొంటున్నారు. మీరు ఇలా అనుకోవటం అనేది మీ ప్రత్యక్షానుభవం వలన కావచ్చు, లేక పుస్తకాలు చదవటం వలన కావచ్చు,లేక పెద్ద వాళ్ళు మీకు చెప్పటం వలన కావచ్చు లేక మీడియా వలన కావచ్చు. అయితే అదే సమయం లో Y వర్గం కి చెందిన వాళ్ళ లో కొందరి పట్ల మీకు మంచి అభిప్రాయం కూడా ఉంది.ఎందుకంటే వాళ్ళు మీకు మంచి చేశారు. Y వర్గం లోని ఆ కొంత మందికి, మీరు “Y వర్గం వాళ్ళకు ఉంటాయి” అనుకొన్న చెడు లక్షణాలు లేవు.

కానీ మన మనిషి బుర్ర ఒక విషయం గురించిన అన్ని వివరాలనూ( డీటెయిల్స్) వాటి కి చెందిన సంక్లిష్టత (కాంప్లెక్సిటీ) లనూ  తనలో ఇముడ్చుకోలేదు. ఆ విషయానికి సంబంధించిన సారాన్ని (అబ్స్ట్రాక్ట్) మాత్రమే ఒక  చిత్రం(ఇమేజ్) గా లేక ఒక మాట గా తన లోపల ప్రాతినిధ్యం(రిప్రజంటేషన్) కల్పిస్తూ దాచుకొంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం కి సంబంధించిన కోడ్ మొత్తం మన బుర్ర లో దాచుకోం..కానీ దాని డిజైన్ కి సంబంధించిన స్థూలమైన మోడల్స్ మాత్రం మన బుర్రలోఉంటాయి కదా.ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు,”Y వర్గం లో పుల్లయ్య మంచి వాడు..ఎల్లయ్య మంచివాడు కాదు…సీతమ్మ మంచిది…. “,అని చెప్పరు.   అలానే”Y వర్గం మంచిదీ కాదు..చెడ్డదీ కాదు..అందులోనే మంచివాళ్ళూ..చెడ్డ వాళ్ళూ..మంచీ చేడూ కాని వాళ్ళూ అందరూ ఉన్నారు”, అనికూడా చెప్పరు.

కాబట్టీ, ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు మీకు Y వర్గం వలన మొత్తం(రిసల్టెంట్) గా కలిగిన భావం మాత్రమే మీరు చెప్తారు. అంటే  Y వర్గం వలన మీకు కలిగిన నష్టం లో నుంచీ,అదే వర్గం లోని తక్కువ మంది వలన మీకు కలిగిన లాభాన్ని తీసి వేస్తే మిగిలేది కొంచెం తక్కువగా నైనా నష్టమే. కాబట్టీ మీరు Y వర్గం అంటె చెడు భావాన్నే వ్యక్త పరుస్తారు. భావాలను వ్యక్త పరిచేటప్పుడు మనిషికి పెద్ద వెసులుబాటు లేదు. మీరు ఒక వర్గాన్ని ఇష్టబడతారు లేదా ద్వేషిస్తారు. వీటినే ద్వంద్వాలంటారు. ఈ రెండిటికీ మధ్య ప్రతిస్పందన మనిషికి ఈ విషయాలలో చేత కాదు. కాబట్టీ మీరు టొకున గంప గుత్త గా Y వర్గమంటే మీ అయిష్టాన్నీ ద్వేషాన్నీ వ్యక్తపరుస్తారు..అది రచనల ద్వారా కావచ్చు..చేతల ద్వారా కావచ్చు..మాటల ద్వారా కావచ్చు.
ఒక్క సారి మీ అయిష్టాన్ని విన్న తరువాత,అంతకు ముందు Y వర్గం లో మీకు మంచి చేసిన వాళ్ళూ, లేక మీరంటే ఇష్టమున్న వాళ్ళూ కూడా గాయపడతారు. వారు కూడా మీరు అంటే అయిష్టం పెంచుకొంటారు. మీ లాంటి వారు ఇంకొందరు  Y వర్గాన్ని తిడితే, వీళ్ళ అయిష్టం మీ వర్గమైన X అంతటికీ విస్తరిస్తుంది. ముందు నుంచీ Y వర్గం లో మీకు అయిష్టమైన వాళ్ళూ ఎటు తిరిగీ ఆత్మ విమర్శ చేసుకొనే రకం కాదు. వాళ్ళూ ఎటుతిరిగీ మీ వర్గానికి వ్యతిరేకమే. ఇప్పుడు Y వర్గం నూరు శాతం మీకూ మీ వర్గానికీ వ్యతిరేకమయ్యింది.  ఇలా పరస్పర ద్వేషం ఒక విష వలయం లా వర్ధిల్లుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇక్కడ ముఖ్యమైన లోపం మనిషి బుర్రకి ఉన్న పరిమితులే అనిపిస్తుంది నాకు…
X వర్గాన్ని స్త్రీ, దళిత, ప్రాంతీయ వాదుల తో ప్రతిక్షేపించండి (సబ్స్టిట్యూట్).
Y వర్గాన్ని X వర్గం యొక్క ప్రత్యర్థి వర్గం తో ప్రతి క్షేపించండి.
అలా చేస్తే మన సమాజం లో ద్వేషం రోజు రోజు కీ ఎలా  పెరుగుతోందో మీకు అర్ధమౌతుంది అని ఆశిస్తున్నాను.
ఒక్క సారి ఎదుటి వర్గాన్ని ద్వేషించటం మొదలు పెట్టిన తరువాత, వారు చెప్పే మంచి మాటలను కూడా మీరు అనుమానం తోనే చూస్తారు.ఒక సారి అనుమానం మొదలైన తరువాత,ఎదుటి వారి మాటలు ఎంత అర్ధవంతమైనవి ఐనా అవి వీరి చెవిన పడవు. ఒక వేళ పడినా అవి మెదడుని చేరవు.
కానీ X వర్గానికి చెందిన వాళ్ళు X వర్గాన్ని ద్వేషించటం చాలా చాలా తక్కువ. అలానే Y వర్గం కూడా. ఒక రకం గా వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం. మళ్ళీ ఒకే వర్గం లోని వాళ్ళు వారి వారి స్వార్థ ప్రజోజనాలకు భంగం వచ్చినప్పుడు ఒకరినొకరు ద్వేషించుకొంటారు. శాంతి కోసం మనిషి ఎప్పుడూ ఎదుటి వాడినీ లేక ఎదుటి వర్గాన్ని మారమంటాడు. కానీ సమస్య తనలో కూడా ఉందని గుర్తించడు.
కాబట్టీ, మనిషి ఎదుటి వర్గం లోని వాడిని “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వమనటం తో పాటు తాను కూడా “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వటం వలన్ ఈ సమస్యలన్నీ పోతాయి. ఇలా డీ-సెల్ఫ్ అవ్వటానికి వ్యక్తి గతం గా మనిషి తన మానసిక శక్తిని ధారపోయాలి. దానివలన మనిషి కి వ్యక్తిగతం గా ఒరిగేదేమీ ఉండదు. ఒకపల్లెటూరి కుల తత్వ వాది కష్టపడి కుల తత్వాన్ని అధిగమించి ఒక పాశ్చాత్యుడి లా ఆలోచిస్తే, సమాజానికి మంచిదేనేమో కానీ, వాడికి ఒరిగిందేమిటి?

***************************************

మీరు మెయిన్ రోడ్డు లో కారు తోలుకొంటూ పోతూ ఉంటారు. అప్పుడే పక్క రోడ్డు లో నుంచీ ఒకతను స్పీడ్ గా మెయిన్ రోడ్ మీదకు వస్తాడు. అతనిని మీరు, ” పక్క రోడ్ మీది నుంచీ వస్తున్నాడు కదా..నెమ్మది గా రావాలనే ఇంగితంలేదా వీడికి?” అని విసుక్కొంటారు.
కొంచెం ముందుకు పోయాక మీరు ఒక పక్క రోడ్ లోకి వేళ్తారు. కాసేపటికి పక్క రోడ్ లో నుంచీ మెయిన్ రోడ్ మీదికి వేళ్తుంటే,మెయిన్ రోడ్ మీద ఒక ఫర్లాంగ్ దూరం లో ఒక కారు మీ వైపుకి వస్తోంది. ఆ కారు ఇంకా చాలా దూరం లో ఉంది గదా అనుకొని మీరు మెయిన్ రోడ్ ఎక్కేస్తారు.  మెయిన్ రోడ్ మీది కారు వాడు మిమ్మల్ని చూస్తూ కోపం గా హారన్ కొడతాడు… మీరు వాడిని లెక్క చేయరు.
కానీ మీరు చేయ వలసిన పని మెయిన్ రోడ్ లో ఉన్నా , పక్క రోడ్ లో ఉన్నా రెండు సందర్భాలలోని పరిస్థితి ని కూడా అర్ధం చేసుకొని ప్రతిస్పందించటం. కానీ అస్థిత్వ వాద కవిత్వం చెప్పే వారు ఈ పని చేయరు. వారి కవిత్వమూ ఆవేశమూ పాటలూ అన్నీ తాము ఎదుటి వారి పరిస్థితి లో ఉంటే ఏమి చేస్తామో అన్న స్పృహ తో ఉండవు. ఇంతకు ముందు ఎదుటి వారి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయా కవిత్వాలు చెప్పిన వారు గొప్ప గా ఏమీ ప్రవర్తించి ఉండరు. ఎదుటి కార్ వాడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా, వాడు చేసిన తప్పులే చేస్తూ వాడిని ఆవేశం గా తిట్టటమూ,తమని సమర్ధించుకోవటమూ ఈ అస్థిత్వ వాద కవులకే చెందింది.  ఆత్మ స్థుతీ..పర నిందా..  తాము మాత్రం పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇచ్చే రక్షణ తో విమర్శలకు అతీతులమనుకొంటూ కాలం గడిపేస్తారు.ఒకడిని తిట్టటం చాలా సులువు..వాడి పరిస్థితి లో మనము ఉంటే బాధ్యత తీసుకొని పని చేయటం చాల కష్టం.. .

********************************

కొందరు ఏదో ఒక వాదాన్ని భుజాన వేసుకొంటారు. భుజాన వేసుకొన్నాక ఆ వాదం వాళ్ళది అవుతుంది. దానితో ఒక వ్యక్తి గత సంబంధం ఏర్పడుతుంది. ఇష్టం ఏర్పడుతుంది. తరువాత ఆ వాదం లో ఉన్న లోపాలు తెలిసి వస్తాయి. కానీ అప్పటికే ఆ వాదం తనది ఐపోయింది. ఆ బంధాన్ని తెంపుకోవటం కష్టమౌతుంది. ఆ వాదం సహాయం తో లోకం లో పేరు ప్రతిష్టలు వచ్చేశాయి. ఇప్పుడు దానిని దింపుకోవటం కష్టమౌతుంది.
మరి కొంతమంది వాదం మొదలెట్టిన కొత్తలో నిజాయితీ గా మొదలెడతారు. కానీ వాదం తెచ్చిన పేరు ప్రతిష్టల వలన, అధికారం డబ్బుల వలన వారికి మొదట్లో ఉన్న పరిస్థితి ఉండదు. వారికి ఆ వాదం ఇంకెంత మాత్రం అవసరం లేదు కానీ జనాలను మభ్య పెట్టతం కోసం, స్వార్థం కోసం ఇంక ఆ వాదాన్ని వదల లేరు. వాదాల ముసుగు లో వ్యక్తి గత దాహాలను తీర్చుకొనే వారు ఇంకొందరు. “మీరు లేక పోయినా వాదాల కొచ్చిన ఇబ్బంది ఏమె లేదు కదా, మీరు తప్పుకోండి”, అని వీరిని అడగండి, వీరి బండారం బయట పడుతుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

తెలంగాణ వాదానికి రూట్ కాజ్..తెలంగాణ వాదానికి మూల కారణం?

మధ్య కోస్తా లో ఉన్న మా ఊరి లో మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. మా చిన్నప్పుడు వాళ్ళ పిల్లలతో నేనూ మా తమ్ముడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా రెండు కుటుంబాల మధ్యా మంచి స్నేహమే ఉండేది. నాకు ఓ పదేళ్ళు ఉన్నపుడు మా పొరుగు కుటంబం నెల్లూరుకు వలస వెళ్ళారు. అక్కడ ఒక ఐదేళ్ళు గడిపాక, వరస కుదరక మళ్ళీ మా ఊళ్ళోని వాళ్ళ ఇంటికే వచ్చేశారు. తిరిగి వచ్చిన తరువాత వాళ్ళ కి చాలా వరకూ నెల్లూరు యాస వచ్చేసింది. అప్పటికి పదిహేనేళ్ళున్న మా తమ్ముడికి అది వింతగా అనిపించటమే కాక, తప్పుగా అనిపించింది. “ఊరంతా ఒక భాషైఏ వీళ్ళది వేరే యాసా..ఎచ్చులు పోవటం కాకపోతే!” అని వాళ్ళ పిల్లలని వెక్కిరించేవాడు. వాళ్ళూ నెల్లూరు వెళ్ళిన ఐదేళ్ళ లోనూ మా నాన్న పూరిల్లు తీసి డాబా వేశాడు. వెక్కిరించిన మా తమ్ముడికి అవతలి వాళ్ళూ దానిని ఈజీ గా తీసుకోవాలని ఉడేది. కానీ వాళ్ళు దానిని సహజం గానే పెద్ద అవమానం గా భావించేవారు. మా తమ్ముడు వెక్కిరించటం వలన మా పక్క వాళ్ళ పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా నెమ్మదిగా మా పై అసంతృప్తి పెంచుకోసాగారు. కొన్నాళ్ళకి మేము ఏ పని చేసిన వాళ్ళకి చెడ్డ గా కనిపించేది.

రాను రానూ వాళ్ళ ధొరణి చాలా అసఖ్యం గా మారింది. మా అమ్మ ఒక సారి పక్క వాళ్ళ అమ్మాయికి జామ పళ్ళు ఇవ్వబోతే, ఆ అమ్మాయి “మా అమ్మ తీసుకోవద్దని చెప్పింది”, అంది. ఇంకోసారి ఏదో పూజకి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు,”పూజకి పిలిచి మమల్ని సరిగా పలకరించలేదు” అని ఎవరితోనో చెప్పారు. కొన్ని నెలలకి మా డాబా గోడలపైన అంట్లు కడిగిన నీళ్ళూ పొయ్యటం, మా వైపు చెత్త వెయ్యటం మొదలయ్యింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఈ చిన్న చిన గొడవలు ఇరు కుటుంబాలకీ మధ్య సరిహద్దు తగాదాలకి దారితీసింది. ఈ తగాదాలలోకి ఊళ్ళోని రెండు ముఠాల నాయకులూ ప్రవేశించారు. మా పక్క వాడి ప్రవర్తన ఏ మాత్రం క్షమార్హం కాదని మా నాన్న ని సపోర్ట్ చేసిన నాయకుడు చెప్పాడు. మా నాన్న చేత కోర్ట్ కేసులు వేయించాడు. తరువాతి పంచాయతీ ఎన్నికలలో మా కుటుంబం యావత్తూ ఆ నాయకుడికే ఓట్లు వేశాం.ఈ లోపల కోర్ట్ కేసుల్లో డబ్బు వదిలి, ఓ రెండు సెక్షన్లు తెలిసి వచ్చాక మా పక్కింటి వాళ్ళూ మేమూ కాంప్రమైజ్ అయ్యాం..అలా అవటం రెండు పక్షాల నాయకులకీ ఇష్టం లేకపోయినా కూడా! అప్పటికి మా పక్కింటాయన కూడా డాబా ఇల్లు కట్టాడు. వాళ్ళ భాష మళ్ళీ మా ఊరి భాష కి మారిపోయింది.

అదే విధంగా..

యాభైలలో ఉభయ పక్షాలలోనూ, ముఖ్యం గా కమ్యూనిస్ట్లలో విశాలాంధ్ర భావన బలం గా ఉండేది. అయితే,
ఈ రాష్ట్రం ఏర్పడటానికి వ్యవహార పరం గా కారణం “తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి”, అని కాదు. ఆ రోజుల్లో తెలంగాన లో కమ్యూనిస్ట్ ల ప్రాబల్యం ఎక్కువ గా ఉండేది. ఆంధ్ర లో కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిస్ట్ల ప్రాబల్యానికి గండి కొట్టాలనుకొన్న నెహ్రూ ఆంధ్ర తెలంగాన ని కలపటం ద్వారా అది సాధిద్దామనుకొనటమే ఈ రాష్ట్రం ఏర్పడ్టానికి ప్రాక్టికల్ గా ముఖ్య కారణం.
ముస్లిం పరిపాలకుల కాలం లో తెలంగాణ ప్రాంతపు భాషా, సంస్కృతీ చాలా వరకూ ప్రత్యేకత సంతరించుకొన్నాయి. ఒకే రాష్ట్రం గా ఏర్పడినపుడు , ఆంధ్ర సమాజం చదువులోనూ, ప్రసార ప్రచార సాధనాలలోనూ,రాజకీయ సామాజిక వ్యవస్థలలొనూ కొంత ముందు ఉంది. ఆయా రంగాలలో వారి ఆధిపత్యం వలన, తమ భాషే సరైనది అనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఒక వేళ నిజాం తన రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం కంటే ముందుకు ప్రగతి పధం లో నడిపించినట్లైతే, తెలంగాన ప్రాంతపు భాషా, సంస్కృతే నిజమైనవి గా చెలామణి అయ్యేవి. ఉదాహరణకు కేరళలోని తిరువంకూరు (ట్రావంకోర్), కర్నాటక లోని మైసూరు సంస్థానాల భాషే అసలైనది గా అక్కడ చెలామణి అవుతోంది(ఆయా రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏలిన ప్రాంతాలతో పోలిస్తే). ఆయా రాజులు వారి కాలం లో తమ రాజ్యాలలో చేసిన అభివృధ్ధి వలన అది సాధ్యమయింది.

నిజాం ఏలుబడి లో దొరల కింద రైతు పని చేసినా, భూస్వాములు అంతటినీ కబళించే సంస్కృతి ఉండేది. దాని వలన రైతులు “పని చేయటం వలన ఏమి ఉపయోగం?”, అనుకొని నిరాసక్తం గా ఉండేవారు. ఇది అక్కడి సంస్కృతి లో ఒక భాగమైంది. కానీ ఈ ఆధునిక యుగం లో తెలంగాణ లోని యువకులు ఎంతో సమర్ధవంతం గా అని రంగాలలో దూసుకొని పోతున్నారు. ఈ సంస్కృతి వారికి వర్తించదు.

పైకి వెళ్ళిన పక్క వాడిని చూసి అసూయ నో ఈర్ష్యనో కలిగి ఉండటం మానవ సమూహాల్లో సహజం (ఈ విషయాన్ని ఆయా మనుషులలోని సంస్కారం ఒప్పుకోక పోయినప్పటికినీ). ఒక ఎకరమో అరో అమ్ముకొని హైదరాబాదు కి చేరి ఇక్కడ ఓ సైటు కొనుక్కొని, హడావిడి చేసే ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ  వారి లో కూడా ఇలాంటి భావావేశాలను రేకెత్తించటం కూడా అంతే సహజం.హడావిడీ, అజమాయిషీ చేసే వారికి అలా చేయటం చిన్న విషయమే. కానీ అజమాయిషీ చేయించుకొన్న వారికి (తెలంగాణ వారికి) అది సహజం గా సహించరాని విషయం, అనేదానిని ఆంధ్ర వారు గమనించలేదు.

తొంభై ల మధ్య నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం లో వచ్చిన మార్పులు, రాష్ట్ర రాజకీయ నాయకత్వం లో తెలంగాణ వారి స్థానాన్ని గణనీయం గా తగ్గించి వేశాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రులను తరచుగా మార్చే విధానానికి స్వస్తి చెప్తే, ఇంకొక పార్టీ ఏక కుటుంబ పాలన కు పరిమితమై పోయింది. దీని వలన తెలంగాన లోని నాయకులు గ్లాస్ సీలింగ్ కు గుద్దుకోవలసి వచ్చింది. కానీ ఈ అంశం మూల కారణాలలో ఒకటి కాదు.

ఈ మూల కారణాల వలన రాష్ట్రం ఏర్పడిన కొత్తలో “మనము” గా ఉన్న భావన అనతి కాలం లోనే “మీరు”, “మేము” గా విడిపోయింది. తెలంగాణ వాదానికి మూల కారణం ఇదే. ఒక్కసారి ఈ వేరు భావన ఏర్పడిన తరువాత ప్రతి విషయాన్నీ అదే ధోరణి లో అనుమానం తో చూడటం వలన (అలా చూడవలసిన పరిస్థితి లేక పోయిన విషయాలలో కూడా) ఎక్కువయింది.ఒక సమయం లో తెలంగాణ ప్రాంతీయులకి జరిగిన పొరపాట్లు (అన్యాయాలు కావు..ఎందుకంటేఅవి కావాలని ద్వేషం తో చేసినవి కావు.అలానే ఆయా పనుల పర్యవసానం దృష్టి లో పెట్టుకొని చేసినవి కావు) వేరొక సమయం లో ఆంధ్ర ప్రాంతానికీ జరిగాయి. కాకపోతే ప్రస్థుతం సమైక్యం అంటున్న ఆంధ్ర ప్రాంతీయులు ఆ పొరపాట్లను పైకి చెప్పటం లేదు. అలా చెప్పితే వాటిని భూతద్దం లో చూపించే ప్రత్యేక వాద రా.నా లు అక్కడా ఉన్నారు. ఈ విబేధాలు మొదట్లో ప్రజలలో నామ మాత్రం గా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం కోరేంత బలం గా లేవు. కానీ అవకాశం కోసం కాచుకొని కూర్చొన “దుర్బుధ్ధి రాజకీయ నాయకులు” విబేధాలకు కారణమైన విషయాలను భూతద్దం తో చూపించి తమ రాజకీయభవిష్యత్తుకు పునాది గా ఉపయోగించుకొన్నారు.మన కు అన్యాయం జరిగిపోతోంది అని మనవాడు గట్టిగా చెప్పినపుడు మనం వెంటనే  ఉత్సాహం తో నమ్మేస్తాం. అన్యాయం జరుగలేదు అని పక్కన ఉన్న ‘మనవాడు కాని వ్యక్తి, నిరూపించాలంటే వాడు దానికి రక రకాల  ప్రూఫ్ లు చూపించినా మనం నమ్మం. వాడి ప్రూఫ్ లను అనుమానం గానే చూస్తాం. కానీ మనవాడికి మాత్రం నమ్మకమనే కన్సెషన్ ఇస్తాం. అందుకనే తెలంగాన లోని విష నాయకులు చెప్పిన దోపిడీ అబధ్ధాలని అక్కడి ప్రజలు ముందూ వెనుకా చూడకుండా వెంటనే నమ్మి ఆవేశం తెచ్చుకొన్నారు. స్వప్రేమా పరద్వేషం మనిషి లక్షణమనుకొంటా!అలానే తెలంగాణ వస్తే స్వర్గం ఊడిపడుతుంది అన్న అక్కడి నేతల మాటలను కూడా ప్రజలు నమ్మినట్లు కనపడుతోంది. ఇక ఆత్మ గౌరవం వంటి మాటల సంగతి చెప్పనక్కర లేదు.

కర్నాటక, మహరాష్ట్ర ల లో ఊపందుకోని ప్రత్యేక భావనలు మన రాష్ట్రం లో ఊపందుకొనటానికి ప్రధాన కారణం, తెలంగాణ పది జిల్లాలతో పెద్దది కావటమే!  మన రాష్ట్రం లో లా, ప్రాంతీయ పరమైన అనేక రాయితీలూ ఆరక్షణలూ మహారాష్ట్ర, కర్నాటకలలో లేవు. అయినా అక్కడ వేర్పాటు వాదం తలెత్తక పోవటానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పరిమితమైన నైజాం జిల్లాలే!

నేను బెంగళూరు లో ఉన్నప్పుడు కన్నడ చానెళ్ళ లో కొన్ని సీరియళ్ళు వచ్చేవి. అవి అల్ప సంఖ్యాకులైన, వెనుకబడిన ఉత్తర కన్నడ జిల్లాల వారి సంస్కృతిని ప్రతిబింబించేవి గా ఉండేవి. అక్కడి పెద్దలు కన్నడ భావాన్ని సజీవం గా ఉంచేందుకు అటువంటి ఇముడ్చుకు పోయే తత్వాన్ని అవలంబించారని అనిపించేది. మనకు ఉన్న మీడియా చానెళ్ళ లో తెలంగాన సంస్కృతి ప్రతిబింబించేవిధం గా ఉన్న ఒక్క సీరియల్ ను కూడా చూసిన గుర్తు లేదు (ఉద్యమం ఉధృతం గా ఉన్నపుడు కూడా). ఆంధ్ర ప్రాంతపు ఆధిపత్య వర్గాల ఈ విధమైన తోలు మందం మనస్థత్వం కూడా తెలంగాన ప్రజలలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. తెలంగాన ఉద్యమ సందర్భం గా కొన్ని ప్రధాన చానళ్ళు,ప్రత్యేక ఉద్యమ కారులు ఎక్కడ తమపై గురి పెడతారో అని తమ విశ్లేషణ ను మాత్రం బంద్ చేశాయి.అంటే వీరు అందరి మంచి కోసం, కలుపుకొనిపోయే, మన సోదరుల సంస్కృతిని చూపించే పాజిటివ్ మనస్థత్వాన్ని కాక, తమ ఆస్థులను రక్షించుకొనే సంకుచితమైన వ్యూహాన్ని అనుసరిస్తారు.

ఇక ఈ విషయం లో ఆంధ్ర ప్రాంతపు రా.నా. లు తక్కువ తినలేదు. ఒక సైధ్ధాంతిక మైన స్టాండ్ తీసుకోవక పోవటం, స్వల్పకాలిక ప్రయోజనాలూ, వోట్లూ ఆశించి తాము ప్రత్యేక వాదానికి అనుకూలమని ప్రకటించుకోవటం, అస్పష్ట విధానాలతో (రెండు కళ్ళ సిధ్ధాంతం) జనాల జీవితాలతో ఆడుకొని ఆత్మహత్యల పాపాన్ని కొంతైనా మూటగట్టొకోవటం వీరి పాపాలు. ప్రత్యేక వాదం తలెత్తిన నాడే, దానికి ధీటుగా, సమైక్య వాదాన్ని ప్రజల లో జాగరూకత చేయకపోవటం,అన్యాయమేదైనా ఉంటే సరి దిద్దటం, సో కాల్డ్ సమైక్య వాదుల లోపం.ప్రత్యేక వాదులు అబధ్ధాలు చెప్పారని, తాము కూడా అబధ్ధాలు చెప్పటం (“దేశ సమగ్రత కు ముప్పు”, లాంటివి) ఇంకో చిల్లర పని. వాళ్ళు నాలుకలు కోస్తాం అంటే, మేము ఆత్మాహుతి చేస్తాం అనటం కూడా భావ్యం కాదు.ప్రత్యేక వాద నాయకులు చేసినట్లుగా, సమైక్య నాయకులు తమా సమైక్య వాదానికి మేధోపరమైన సపోర్ట్ ని కూడగట్టటం లో విఫలమయ్యారు. సమైక్య స్టాండ్ ని తీసుకోవటమే గత్యంతరం లేని పరిస్థితులలో తీసుకొన్నారు.

ఒక్కసారి అనుమానం ఏర్పడితే, ప్రతి విషయాన్నీ అనుమానం గానే చూస్తాం,. నీటి దొంగలూ, దోపిడీదారులూ, గుంటనక్కలూ ఇలాంటి ఆత్మ విమర్శ లేని ఆలోచనలన్నీ “మొదట చెడిన నమ్మకం” పునాదిగా పుడతాయి.ఇక్కడ దోపిడీ దారులనే వారు అలా అనటాన్ని ఒక చిన్నవిషయం గా చూసినా, అనిపించుకునే వారిని అది తీవ్రం గా బాధించే విషయమే! అనే వారు “మీరు దోపిడీ చేశారు కాబట్టీ, మేము అనటం లో తప్పేమిటి?” అంటారు.
అనిపించుకొన్న వారు, “మేము దోపిడీ చేయలేదు కాబట్టీ మీరు అనటం తప్పు ” అంటారు.
ఎవరైనా శ్రీకృష్ణ లాంటి మధ్యవర్తి నచ్చచెప్ప చూసినా, “అనుమానం భూతం” ముందు, అవగాహన పలాయన మంత్రం పఠించాలిసిందే! ఇక చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసే రాజకీయ నాయకులు ఎలానూ ఉన్నారు.
ఇంతకీ ఈ ప్రత్యేక వాదం భవిష్యత్తు ఏమంటారా? ఏమో దేవుడికి ఎరుక..నాకైతే మేమూ, మా పక్కింటి వాళ్ళ విషయం లో లానే ప్రత్యేకం విషయం లోకూడా అవుతుందనిపిస్తుంది.

ఇక భాష విషయం..తెలుగు భాష నెమ్మది గా ఒక కలగాపులగమైన భాష గా అవతరించబోతోంది. ఇది అన్ని ప్రాంతాల భాషవిషయం లోనూ నిజం. హిందీ ఇంగ్లీషుని కలుపుకొని, అన్ని ప్రాంతాల పదాలూ చేర్చుకొని, మీడియా సహాయంతో ఈ భాష విస్తరిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలలోని ముఖ్యమైన పట్టణాలలో నూ యువతరం టీవీ చానళ్ళ భాషనూ, సినిమాల భాషనూ ఇంచుమించు గా ఉపయోగిస్తున్నారు. ఇది హైదరాబాదు లో గత యాభై యేళ్ళు గా పుట్టి పెరిగిన నాజూకు భాష. తెలంగాణ వారు “బాబాయ్” అన్నా, కేక రా అన్నా, వెళ్తున్నారా అన్నా ఈ భాష పుణ్యమే! అలానే ఆంధ్ర ప్రాంతం వారు, “టీ వీ  బంద్ చెయ్” అన్నా, షాస్త్రం అన్నా, అనునాసికాలు లేకుండా “వం షం”, అన్నా, ఈ భాష ప్రభావమే! ఈ ప్రభావాన్ని తెలంగాణ ఏర్పడినా ఆపలేరు.

ప్ర: కేంద్ర ప్రభుత్వం లేక చిదంబరం అన్నదమ్ముల వంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారా?
జ : మనకు సిగ్గు లేక కీచులాడుకొని, పై వాడి దగ్గరికి పరిగెత్తితే, వాడి దృష్టి లో తేలిక అవమా? మనలో మనం సిగ్గులేకుండా తన్నుకొని పై వాడిని నిందించటం సరి కాదు.

ఒక సమాజాం మొత్తానికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నపుడు, ఆ ఉద్యమంలో అన్ని రకాల జనాలూ చేరుతారు. నిజాయితీ పరులూ, స్వార్థపరులూ, ఆవేశ పరులూ, కుహనా మేధావులూ, స్వార్థ నేతలూ,బూతులనే కవితలనే కవులూ, తమ బుధ్ధిని మొత్తం తమ విద్వేషాన్ని సమర్ధించటానికే ఉపయోగించే మేధావులూ,అందరూ ఉంటారు. ఏవరో కొందరు వెధవలు కారు కూతలు కూస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకం గా ఉన్న వారు ఆ కూతలు కూసిన వారిని చూపించి ఉద్యమం మొత్తాన్నీ తిడతారు. దానితో ఉద్యమం లో ఉన్న మంచివారికి కూడా కారు కూతలను సమర్ధించవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. అప్పుడు కారు కూతలు కూసిన వాడి కూతలే ఉద్యమానికి ఒక చిహ్నమౌతాయి. ఉద్యమం లోని చెడ్డ వారిని ప్రతి సారీ పేరుపేరునా వేలెత్తి చూపటం కుదరదు . చెడ్డ వారి గురించి చేసిన వ్యాఖ్యలు, మంచి వారు కూడా తమను ఉద్దేశించే అనుకొంటారు. దానితో మంచి వారి మనస్థత్వాలు కూడా బిగిసిపోయి విషపూరితమౌతాయి. ఈ ఎస్కలేషన్ ప్రక్రియ ఇంటర్నెట్ లో చాలా వేగం గా పని చేస్తుంది.అలానే తమ వాదానికి సంబంధించిన నెగటివ్ విషయాలను మరుగు పరుస్తూ లేక తేలిక పరుస్తూ, పాజిటివ్ విషయాలను పెద్దవి చేస్తూ మాట్లాడుతారు. అంటే వీరికి కావలసినది తమ ఉద్యమ వాదం గెలవటం. వాస్తవం గెలవటం కాదు. కానీ ఏ చర్చ లోనైనా వాస్తవం గెలవాలి..! ఇది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల రెండిడిటికీ వర్తిస్తుంది.  కాబట్టీ ఇంటర్నెట్ చర్చల్లో, కొన్ని అభిప్రాయాలూ ద్వేషాలతో, తామే కరక్ట్ అని నిరూపించుకోవటానికో కాకుండా, “చర్చిద్దాం,విభేదిద్దాం, మాది తప్పు అయితే ఒప్పుకొంటాం, ఇరువురం కలిసి ఒక పరిష్కారం కనుగొందాం” అనే స్ఫూర్తి తో సాగితే మంచిది.

పీ వీ నరసింహా రావు గొప్పతనం గురించి స్వామినాథన్ అయ్యర్.

మన వాడు, తెలుగు వాడు, తెలంగాణ వాడు ఐన మాజీ ప్రధాని పీ వీ నరసింహా రావు నిరాడంబరుడే కాక, పెద్ద పేరు కోరుకొనకుండా తన పని తాను చేసుకొని పోయిన కర్మ యోగి.ఆర్భాటం లేని నిరాడంబరుడు. దేశ గతిని మలుపు తిప్పిన వాడు. దేశానికి “ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్”, చేసిన వాడు.
దేశ రహస్యాలు కొన్ని తనతోనే పోతాయని (అణు పరీక్షల వ్యవహారం లో), బయటికి చెప్పని దేశ భక్తుడు.
స్వామినాథన్ అయ్యర్, గుంపు పోకడకు వ్యతిరేకం గా ఒక కౌంటర్ పాయింట్ ని బలం గా వినిపించే పాత్రికేయుడు. తన అంచనా తప్పు అయితే నిజాయితీ గా ఒప్పుకొనే ధైర్యవంతుడు.తగినంత అధ్యయనం చేసి రాసే వ్యక్తి. నేను గౌరవించే మేధావి. అటువంటి స్వామినాథన్ అయ్యర్ మన పీ వీ కి ఘటించిన స్మృత్యంజలి ..ఇక్కడ..:ఎకనమిక్ టైంస్ లో:

http://economictimes.indiatimes.com/opinion/columnists/swaminathan-s-a-aiyar/unsung-hero-of-the-india-story/articleshow/8998458.cms

ఆదర్శాలూ వగైరాల గురించి నేను రాయబోయే నవల ప్లాట్..

ఆదర్శాలూ వగైరాల గురించి నేను ఒక నవల రాద్దామనుకొంటున్నాను..ఆ నవలని ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను.దాని ప్లాట్ ని కింద ఇచ్చాను. దీని గురించి మీ అభిప్రాయాలూ సలహాలూ తెలియ చేయండి.

—————————————————————————–

ఇది ఆదర్శ రావు కథ. పేరుకు తగ్గట్టు ఆదర్శ రావు కి ఆదర్శాలు ఎక్కువ. సమాజ వ్యవస్థ లో అనేక లోపాలున్నాయి. ఈ లోపాల కారణం గానూ, ఈ లోపాలను అధిగమించాలనే ఆదర్శరావు కోరిక  వలనా ఆదర్శరావు “సమసమాజం” అనే ఒక ఆశయాన్ని ఏర్పరచుకొన్నాడు. అతను  ఈ ఆశయం ఏర్పరచుకోవటానికి కారణం సమాజ అసమానతల్లో ఉంది. అలానే సమాజం మారాలనే అతని వ్యక్తిగతమైన కోరిక లో కూడా అతని ఆశయానికి మూలాలు ఉన్నాయి. అతని కోరిక అతని వ్యక్తిత్వం నుంచీ వచ్చింది.  అంటే చిన్నప్పటి నుంచీ అతను పెరిగిన పరిస్థితుల ప్రభావం వలన ఆ కోరిక అతనికి కలిగింది. కానీ, అతని వ్యక్తిత్వం లో అతని కోరిక తో పాటు గా వాస్తవ సమాజం లో ఉన్న అనేక దుర్లక్షణాలు కూడ ఉంటాయి. ఎందుకంటే అతను ఈ ప్రస్తుత సమాజం లోనే బతుకుతున్నాడు. ఏ అడవి లోనో బతకటం లేదు కదా?  రోడ్డు పక్క ఈగలు ముసిరిన ముసలి బిచ్చగాడిని చూసి ” ఈ సమాజం ఎంత దయాహీనమైనది!!” అనుకొంటాడు, కానీ తన జేబులోంచీ ఓ రెండు రూకలు తీసేటప్పూడు మాత్రం “ఆ..నేను ఈ రెండు రూపాయలు వేసినంత మాత్రాన ఈ సమస్య సమసి పోతుందా” అనుకొంటాడు. ఒక్కోసారి ఆ రెండు రూపాయలనూ జేబులోకే తోసేస్తాడు. ఒక్కోసారి..”ఇలా దేశం లోని బిచ్చగాళ్ళందరికీ దానం చేస్తే నేనూ ఒక రోజు బిచ్చగాడి గా మారిపోతాను తప్ప ఈ దానం వలన ఉపయోగం లేదు” అనుకొంటాడు. అతను రచనలు చేస్తాడు. కానీ, ఆ రచనలలో అతని ఆశయం తో పాటు,సమాజంలోని దుర్లక్షణాలు కూడా ఉంటాయి. తన రచనలలో కూడా రిక్షా వాడిని రిక్షా వాడనే అంటాడు. “రిక్షా ఆయన” అని అనడు. సమాజం నుంచీ వచ్చిన అలవాట్లు తొందరగా వదలవు కదా? అతని ఆదర్శం వలన అతని భావోద్వేగ పరమైన అవసరాలు కూడా కొన్ని తీరాయి.
ఆదర్శరావు, అతని సహచరుడు ఒకడి తో తన సమ సమాజ ఆదర్శాల గురించి చెప్పాడు.ఆ సహచరుడు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బుకి గడ్డి తినే రకం మనిషి. ఆ సహచరుడు వెంటనే ఆదర్శరావు ని,”ఊళ్ళో నీకెంత పొలముందీ..?” అని అడిగాడు.
ఆదర్శ రావు ఎంత పొలం ఉందో చెప్పాడు. దానికి ఆదర్శరావు సహచరుడు, “ఐతే ఆ మూడు ఎకరాలు నువ్వు ఊళ్ళో రైతు కూలీలకు పంచెయ్యి..తరువాత నాకు ఆదర్శాలు చెప్పు”,అన్నాడు. ఈ విధం గా ఆదర్శ రావు ఆదర్శాలు చెప్పటం వలన తన కంటె అన్ని రకాలు గా నీచుడైన ఒక సహచరుడి కి లోకువై పోయాడు.
ఆదర్శ రావు సహచరుడు అతని వ్యక్తిత్వాన్ని అతని ఆదర్శాలలోంచీ చూసి, “గొప్ప మాటలు చెప్పటానికి ఆదర్శరావు అప్పటికే ఆదర్శం పాటించే వ్యక్తిత్వం కలవాడు అయ్యి ఉండా”లనుకొన్నాడు.

ఇక్కడే మనం ఆదర్శరావు కి ఉన్న ఇంకొక స్నేహితుడు సుబ్బారావు గురించి చెప్పుకోవాలి……..

సుబ్బారావు క్రికెట్ ఒక మాదిరి గా ఆడతాడు. కానీ అతనికి తన ఆట తో సంతృప్తి గా లేదు. సచిన్ టెండుల్కర్ లా షాట్ లు కొట్టాలని కోరిక అతనికి. ఇక్కడ సుబ్బా రావు ఆశయం టెండుల్కర్ లా షాట్ లు కొట్టటం. ఈ ఆశయం అనేది తన యొక్క వాస్తవ పరిస్థితి (టెండుల్కర్ లా షాట్లు కొట్టలేక పోవటం) నుండీ,  ఇంకా
టెండుల్కర్ లా షాట్లు కొట్టాలనే కోరిక నుంచీ వచ్చింది. సుబ్బా రావు ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేసి టెండుల్కర్ లా షాట్లు కొట్ట వచ్చు. కానీ దాని వలన ఆట లో సుబ్బా రావు వ్యక్తిత్వం టెండుల్కర్ వ్యక్తిత్వానికి సమానమవ్వదు. ఎందుకంటే టెండుల్కర్ కి షాట్లు కొట్టటం అనాయాసం గా చిన్నప్పటినుంచీ అలవడిన ఒక విద్య. సుబ్బా రావు చాలా శ్రమ పెట్టి నేర్చుకొన్న ఒక కళ. ఐతే సుబ్బా రావు తాను అనుకొన్న ఫలితం సాధించాడు. ఫలితాన్ని మాత్రమే చూసినట్లైతే సుబ్బా రావు ని టెండుల్కర్ తో సమానం గా చూడ వలసిందే

సుబ్బారావు క్రికేట్ సరిగా రాకుండా టెండుల్కర్ లా బాటింగ్ చేయాలనుకొన్నప్పుడు అందు లో జనాలకు వైరుధ్యం ఏమీ కనపడదు. అదే సుబ్బారావు తనకు బాటింగ్ సరిగా రాకుండానే పక్క వాడితో,”టెండుల్కర్ లా బాటింగ్ చెయ్యాలోయ్…. అది అంత కష్టమేమీ కాదు” అని చెప్పకూడదు కదా! ఆదర్శ రావు తన వరకూ తన ఆదర్శాలను పాటించటానికి ప్రయత్నిస్తే అతని సహచరుడి కి ఏమీ వైరుధ్యం కనపడేది కాదు. ఎప్పుడైతే ఆదర్శ రావు తనకి చెప్పటం ప్రారంభించాడో, అప్పుడు అతని సహచరుడు ఆదర్శ రావు విశ్వసనీయత ని డిమాండ్  చేశాడు. ఆ సహచరుడు తనకున్న వడ్డీ వ్యాపారం మాని  ఆదర్శాలను పాటించటానికి సిధ్ధం గా లేడనేది వేరే విషయం.
ఈ స్థితి లో ఆదర్శ రావు కి ఏ ఆదర్శాన్నైతే తాను భుజాన వేసుకొన్నాడో, ఆ ఆదర్శానికి అనుగుణం గా తన వ్యక్తిత్వమూ, చేతలూ, ఒక్కోసారి మాటలూ కూడా  లేవు అని అర్ధమయ్యింది. తన ఆదర్శ భావాలను వదలకుండానే, తన సహచరుడి లాంటి వాళ్ళ కు లోకువ కాకుండాఉండటానికి, ఆదర్శరావు కి రెండు మార్గాలున్నాయి. ఒకటి తను పూర్తి గా వ్యక్తిత్వ విప్లవాన్ని సాధించి అడవుల్లోకి పోయి ఈ సమాజం మీద పోరాడటం. ఈ పోరాటమూ దాని నైతికత గురించి తరువాత చెప్పుకొందాము.
ఇక రెండో మార్గం, తాను కూడా అందరి లాంటి వ్యక్తిత్వం కలవాడే అని అంగీకరించి,సమాజం లోని మిగిలిన వారితో, “మనలో,మన సమాజము లో ఇలాంటి లోపాలున్నాయి, వాటిని మనం ఇలా మార్చుకొంటే బాగుంటుంది” అనే స్వరంలో చెప్పటమే.  ఇదే “సిగరెట్లు కాల్చే కొడుకుకి, సిగరెట్లు కాల్చే తండ్రి చెప్పే” స్వరం అన్నమాట.
కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన వ్యక్తిత్వాన్ని తన ఆదర్శాలకు అనుగుణం గా మార్చుకొనే ప్రక్రియ లో అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరు బాట పట్టాడు. అక్కడ చాల మంది యువకులను పోగేశాడు ఈ యువకుల వ్యక్తిత్వాలు ఇంకా ఆదర్శ రావు సమసమాజ ఆదర్శాలకు అనుగుణం గా ఇంకా మార లేదు. కానీ ఆదర్శ రావుకు  తన ఆదర్శం గురించిన అవగాహన బాగానే ఉంది.
సమాజ వ్యవస్థ లో అసమానతలున్నాయి. దీని లో వ్యక్తుల పై ఆదర్శ రావు కి కోపం లేదు. కానీ వ్యవస్థ కి ప్రతినిధులు వ్యక్తులే. ఈ వ్యవస్థ అనేది వారి బుర్రలలోని ఆలోచనల లోనే ఉంది. డబ్బున్న వారు ఆ డబ్బుని వదులుకోలేరు. మంచి గా చెప్తే, అధికారం ఉన్న వారు ఆ అధికారాన్ని వదులు కోరు సరి కదా, ఆదర్శ రావు పైకి పోలీసులని పంపిస్తారు.  కాబట్టీ అసమానతలు తొలగించాలంటే అసమానతలు ఉన్నచోట చదును చేయక తప్పదు. కాబట్టీ ధనిక వర్గాన్ని మట్టుబెట్టక తప్పదు.
ఆదర్శరావు తో ఉన్న కుర్రాళ్ళ లో ఈ స్పష్టత లేదు. వాళ్ళు “తమ ఊళ్ళోని  ఖామందుల పై ద్వేషం తోనో, నిరుద్యోగం తో నో ఆదర్శరావు ఉద్యమం లో చేరిన వాళ్ళు”. ఆదర్శ రావు వాళ్ళ ఆవేశాన్ని ఒక పనిముట్టు లా వాడుకొని, ఉన్న వ్యవస్థ ని కూల్చి, కొత్త వ్యవస్థని పై నుంచీ ఇంపోజ్ చేద్దామనుకొన్నాడు. కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన ఉద్యమ కారుల సహయం తో కొంతమంది భూస్వాములను చంపి కొంత ప్రాంతాన్ని ఉద్యమ ఆధీనం లోకి తెచ్చుకొన్నాడు. ఈ భూస్వాములను చంపేటప్పుడు కొందరు మంచి భూస్వాములు కూడా చనిపోయారు.మంచి భూస్వాములంటే పేదవాళ్ళ కష్టాల పై సానుభూతి ఉన్నవాళ్ళు. మంచి భూస్వాములను చంపకపోతే ఉద్యమ నినాదాలను సంక్లిష్టం చేయవలసి వస్తుంది. “భూస్వాములను మట్టుబెట్టండి” అని కాకుండా “చెడ్డ భూస్వాములను చంపండి” అని అంటే ఉద్యమం లోని భావోధృతి తగ్గుతుంది. భూస్వాములలో కూడా మంచివారున్నారని అంగీకరించినట్లౌతుంది. ఇది సామాన్య జనాల దృష్టి లో  ఉద్యమ లక్ష్యాలకు భిన్నం గా ఉన్న నినాదం గా కనపడుతుంది. ఆదర్శ రావుకు ఉద్యమ ఉధృతి తగ్గటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే అతను, మంచి భూస్వాములు ఉన్నారని తెలిసినా వారిని చంపే సమయం లో మిన్నకున్నాడు. ఆదర్శ రావు తన అనుచరులను సిధ్ధం చేసేటప్పుడు వాళ్ళ కి ఆవేశాన్నైతే ఇవ్వగలిగాడు కానీ తన కున్న అవగాహనను వాళ్ళకి బదిలీ చేయలేక పోయాడు. అందు వలన అతని అనుచరులు మంచీ చెడూ చూడ కుండా భూస్వాముల నందరినీ మట్టుబెట్టారు. ఈ పోరాటం లో చనిపోయిన ఆదర్శ రావు అనుచరులను అమరవీరులు గా కీర్తించి వారికి స్థూపాలు కట్టారు. పోరాటం లో ఆదర్శ రావు గెలిచాడు కాబట్టీ  సరిపోయింది. ఓడి పోతే చనిపోయిన ఆదర్శరావు అనుచరులను” తరువాత గుర్తు పెట్టుకొనే వారే ఉండేవారు కాదు. ఆదర్శ రావు కి “పేద వాళ్ళు భూస్వాముల స్థితి లో ఉంటే వారి లానే ప్రవర్తిస్తారు” అనే విషయం లో ఏ మాత్రం సందేహం లేదు. ఆ విధం గా చూస్తే “భూస్వాములకంటే వ్యక్తి గతం గా ఏ మాత్రం ఉన్నతులు కాని ఆదర్శ రావు సైన్యం భూస్వాములను చంపటం” నైతికం గా సరి కాదనేది ఆదర్శ రావు కి కూడా తెలియలేదు. కొత్త వ్యవస్థ రావటం కోసం పాత వ్యవస్థ లో లబ్ది పొందిన “భూ స్వాములు ఆ మాత్రం మూల్యం చెల్లించాలి” అనుకొన్నాడు ఆదర్శ రావు.
ఆదర్శ రావు కలలు కన్న సమ సమాజం వచ్చేసింది.  పై నుంచీ వ్యవస్థ లో వచ్చిన మార్పులవలన,డబ్బు పై మనుషులు ఆధార పడవలసిన అవసరం లేక పోవటం వలనా,మనుషులకు కనీసావసరాలైనా కూడూ గుడ్డా అందటం వలన, మనుషులలో చాలా వరకూ సమాజ పరమైన అవలక్షణాలైన మోసం, నేరం తగ్గాయి. కానీ మనుషుల్లో ఆదర్శ రావు స్థాపించిన వ్యవస్థ పరిధి లోకి రాని అవలక్షణాలు చాలానే ఉన్నాయి. అధికారం కోసం తపన, పక్క మనిషి మీది అసూయా ఎక్కడికీ పోలేదు. వ్యక్తిగత లాభమూ, వైవిధ్యమూ,వ్యక్తి గత పరమార్దమూ తన జీవితం లో మనిషి వెతుకుతూనే ఉన్నాడు. వ్యక్తి గత అర్దానికి ప్రయోజనం
లేక పోవటం వలన మనుషులు కష్టించి పని చేయటం తగ్గించారు. వీటన్నిటి వలనా, మరియూ ప్రకృతి సిధ్ధమైన ప్రతిభా పాటవాలలోని తేడాల వలనా మళ్ళీ అసమానతలు  పుట్టుకొచ్చాయి. ఆదర్శ రావు తన లో సమ సమాజానికి అనుగుణం గా లేని అవలక్షణాలను అధిగమించ గలిగినా, అతని అనుచరులు అలా అధిగమించిన వారు కాదు. ఏ స్థానిక భూస్వామి మీది ప్రతీకారేచ్చ తో నో వారు ఆదర్శ రావు తో కలిశారు. ఆదర్శ రావు కి ఈ విషయం తెలుసు కనుక వారిని సరైన దారి లో పెడుతూ వచ్చాడు.

ఆదర్శరావు కి వయసు పైబడ సాగింది. ఆదర్శరావు లోని భావోద్వేగ పరమైన అవసరాలు తగ్గాయి.అప్పటి దాకా ఆ అవసరాలను తీర్చిన అతని ఆదర్శాలు ఇప్పుడు అతనికి అంత ఆకర్షణీయం గా కనపడటంలేదు. అతనికి వయసు పెరిగే కొద్దీ తను స్థాపించిన వ్యవస్థ యొక్క తాత్కాలికతా, దానిలోని లొసుగులూ అర్ధమవ్వసాగాయి. కానీ అప్పటికే ఆ వ్యవస్థను స్థాపించిన వాడిగా లోకం ఆదర్శ రావు ని దేవుడి గా కీర్తించసాగింది. తాను స్థాపించిన వ్యవస్థ అంత గొప్పదేమీ కాదని చెప్తే ఆదర్శ రావు తన తప్పు అంగీకరించినట్లే. అందువలన అతను జనాలకి తన పట్ల ఉన్న గౌరవాన్ని కోల్పోవటమే కాకుండా, తనని ఏ ఆదర్శమైతే గొప్పది చేసిందో ఆ ఆదర్శాన్నే మట్టుబెట్టిన వాడౌతాడు. అందుకనే ఆదర్శ రావు తను తీసుకొని వచ్చిన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపించలేకపోయాడు.  

ముసలి వాడైపోయిన ఆదర్శ రావు, ఒక రోజు హఠాత్తు గా గుండె పోటు తో చనిపోయాడు. ఆదర్శరావు స్థాపించిన ఆదర్శ సమాజానికి ఏమై ఉంటుందో మీరే ఊహించి చెప్పండి… ఇంతకీ ఆదర్శ రావు ఆశయాల వలన సమాజానికి మంచి జరిగిందా? చెడు జరిగిందా?

ఆంధ్ర లో కులాల గురించిన ఒక కథ..కొంచెం పెద్దది

ఓ అమెరికా వాడి రైలు బండి ప్రయాణం

chennai

chennai

chennai central lo america vaadu

chennai central lo america vaadu


ఉదయం ఎనిమిది గంటలు.చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ఉన్న పెద్ద టీవీ తెర ముందు కూర్చొని, తీరికగా ఒక ఇంగ్లీష్ నవల పేజీలు తిప్పుతున్నాడు హారీ. పక్క సీట్ లో ఉన్నతన లాప్ టాప్ బ్యాగ్ వైపు అప్పుడప్పుడూ చూస్తున్నాడు.

“ఇండియా లో దొంగతనాలెక్కువ. జాగ్రత్త గా ఉండాలి”, అని చెప్పాడు హారీ అనబడే హరికృష్ణ  కి వాళ్ళ ‘డాడ్ అనబడే నాన్న’. ఆయన అమెరికా లోని కాలిఫోర్నియా లో ఉంటాడు.

“ఎక్స్ క్యూజ్ మీ..కెన్ ఐ సిట్ హియర్?”, ఎవరో అంటే తలెత్తి చూశాడు హారీ. ఓ వ్యక్తి పక్క సీట్లో ఉన్న హారీ లాప్ టాప్ వైపు చెయ్యి చూపిస్తూ అడుగుతున్నాడు.

“హౌ కెన్ ఐ టెల్ ఇఫ్ యు కెన్ సిట్ ఆర్ నాట్..ఇఫ్ యువర్ బాక్ ఈజ్ నాట్ స్ప్రేయిండ్ యు షుడ్ బి ఏబుల్ టు సిట్”  అని పెద్దగా నవ్వేశాడు హారీ.

తన లాప్ టాప్ తీసుకొని ఒళ్ళో పెట్టుకొని పక్క సీట్ వైపుకి చేత్తో చూపిస్తూ, “అయాం కిడ్డింగ్…ప్లీజ్ సిట్” అన్నాడు ఆ మనిషి తో.  “ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్నీ యు నో. సం టైంస్ వి అమెరికన్స్ గెట్ ఇట్ రాంగ్” అన్నాడు అమెరికన్ ఆక్సెంట్ లో.

“మీరు అమెరికనా?” ఇంగ్లీష్ లో అన్నాడా వచ్చిన వ్యక్తి, పక్క సీట్లో కూర్చొంటూ.

“మా నాన్న డెబ్భై ల లో అమెరికా లో సెటిల్ అయాడు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కాబట్టీ నేను ఖచ్చితం గా అమెరికన్ నే”, అన్నాడు హారీ ఒకింత గర్వం గా . .

సంభాషణ ఇంగ్లీష్ లోనే కొనసాగుతోంది..
“నా పేరు సుబ్బారావు”, అని చేయి చాపాడు వచ్చినతను.

“హారీ …హరికృష్ణ..” అని చెయ్యి కలిపాడు హారీ.

“మీరు ఎక్కడికి వెళ్తున్నారు?”

“హైదరాబాద్”.

“ఓ..! నేనూ అక్కడికే..నేను విజయవాడ వరకూ నవజీవన్ లో వెళ్ళి అక్కడి నుంచీ కోణార్క్ పట్టుకుంటాను..మరి మీరు?” అడిగాడు సుబ్బారావు

“నేనూ అంతే “

“పగలు ప్రయాణం పెట్టుకున్నారేమిటి సార్?అయినా మీరు ట్రైన్ లో వస్తున్నారేంటండీ..ఫ్లైట్ టిక్కెట్లుదొరకలేదా?”

హారీ, “వీడికెందుకు, నోసీ ఇండియన్”, అని మనసులో అనుకొని, ఇలా అన్నాడు, “హైదరాబాద్ నుంచీ వచ్చేటప్పుడు ప్లేన్ లోనే వచ్చాను. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్లో పని ఉండి వచ్చాను. కానీ ఇప్పుడు ట్రైన్ లో వెళ్తున్నాను. దీనికి ఓ కారణం ఉంది. నేను ఒక ‘ఇండో అమెరికన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం’ లో రీసెర్చ్ చేయటానికి అమెరికా నుంచీ హైదరాబాద్ వచ్చాను. ‘ద సోషల్ గ్రూప్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’  అనే విషయం మీద పరిశోధన చేస్తున్నాను. మా నాన్న చెప్పాడు, “ఆంధ్ర లో ఉండే వివిధ వర్గాల ప్రజల గురించి కొంచెం ప్రాక్టికల్  గా తెలుసు కోవాలంటే ఓ సారి సెకండ్ క్లాస్ లో ట్రెయిన్ ప్రయాణం చెయ్యి” అని.  దీనికి పగలు ప్రయాణం అయితేనే మెరుగు…కాస్త జనాలతో మాట్లాడవచ్చు.. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.”

“మీరు జెనరల్ క్లాస్ లో వెళ్తే మీకు జనాల గురించి ఇంకా విపులం గా అర్ధమౌతుంది…కానీ మీరు జెనరల్ లో ప్రయాణం చెయ్యలేరులెండి….ఇంతకీ.. మీకు తెలుగు వచ్చా?”

“తెల్గూ అర్ధమౌతుంది..కొంచెం నెమ్మది గా మాట్లాడ గలుగుతాను”,

“కానీ మీరు ఇక్కడి సామాన్య జనాలతో మాట్లాడటం చాలా కష్టం కదా…!మీ అమెరికన్ ఆక్సెంటూ..మీ తెలుగూ వాళ్ళకి అర్ధం కాదు”,సందేహం వెలిబుచ్చాడు సుబ్బారావు.

“చెన్నై లో ఉండే తెలుగు ఫ్రెండ్ ఒకతను నా కూడా వస్తానన్నాడు.చివరి నిమిషం లో ఫోన్ చేసి రానని చెప్పాడు”, అని వాటర్ బాటిల్ ఎత్తి నీళ్ళు తాగి,”మీరేం చేస్తారు?” అన్నాడు హారీ.

“నేను గ్రాడ్యుయేట్ అయ్యింది కామర్స్ లో. ఓ ప్రైవేట్ బాంక్ లో మానేజర్ గా పని చేశాను..దాదాపు ఆంధ్రా అంతా తిరిగాను.. ఓ సంవత్సరం కిందట రిజైన్ చేసి హైదరాబాద్ లో సొంత వ్యాపారం ఒకటి పెట్టాను”, అని,  “అవునూ మీరు ఆంధ్రా లోని జాతుల గురించి అధ్యయనం చేస్తున్నారు కదా, మీ కులమేదో మీకు తెలుసా?”

“వీడేంటబ్బా..! ఇవ్వక పోయినా చనువు తీసేసుకొంటున్నాడు!”, అని మనసు లోనే అనుకొని, “నా మాతృభాష తెలుగు అని తెలుసు…ఇండియా లో కులాలు అని ఉంటాయి అని తెలుసు…కొన్ని పై కులాలు..కొన్ని కింది కులాలు…కానీ నా కులం నాకు తెలీదు…బహుశా  మా డాడ్ కి తెలిసి ఉంటుంది. ఈ సారి నాన్న తో చాట్ చేసినప్పుడు అడగాలి” అన్నాడు. ఒక్క క్షణమాగి, “మీ కులమేమిటి?” అనడిగాడు.

“నాకూ నా కులం తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ హైదరబాదు లోని ఓ అనాధాశ్రమం లోపెరిగాను. వార్డెన్ నా పేరు సుబ్బారావు అని పెట్టాడు. అది కామన్ గా ఉండే పేరు కదా? నేను నల్లగా ఉన్నాను కాబట్టీ నా ఇంటి పేరు నల్లతోలు అని రిజిస్టర్ లో రాశాడు. సో, నా పేరు నల్ల తోలు సుబ్బారావు అయ్యింది”

హారీ, “ఏమి కథలు చెప్తున్నాడు..!” అనుకొని..”ఏమైనా ఇండియన్స్ తో జాగ్రత్త గా ఉండాలి..డాడ్ చెప్పనే చెప్పాడు”, అనుకొన్నాడు.

” మీకు ఇండియా ఎలా అనిపిస్తోంది సార్ ?”

“ఇండియా నాకు కొత్తేమీ కాదు. మా డాడ్ తో పాటు వస్తూ ఉండే వాడిని..కానీ ఈ రైల్వే స్టేషన్ లో ఈ జనాలను చూసిన తరువాత ఈ ప్రయాణం ఎలా చేయగలనా అనిపిస్తోంది. దానితో పాటు జనాల తో మాట్లాడాలి..నా ఫ్రెండేమో రాలేదు.”

“మీ రీసెర్చ్ కోసం దానికి సంబనిధించిన పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది కదా?  మీరు ఈ ట్రెయిన్ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారో నాకు ఇంకా అర్ధం కావటం లేదు”

“పుస్తకాలు ఒక విషయం గురించి లాంగ్ వ్యూ ని ఇస్తాయి. అడవి లో ఉన్న ఒక కొండ ఎక్కి కిందకి చుట్టూ చూశామనుకోండి, దూరం గా పచ్చటి చెట్లు గుబురు గా కనపడతాయి. కానీ ఆ చెట్లకింద ఏమి ఉందో కనపడదు. ఏ చెట్టు ది ఏ కాయో తెలియదు. ఇదంతా తెలియాలంటే అడవి లోకి వెళ్ళి చెట్ల కింద చూడాల్సిందే కదా?”

దానికి సుబ్బారావు, “నా బ్రతుకు అంతా ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవి లో చెట్లకిందే గడిచింది. ఏ చెట్టు ఏ జాతిదో, ఏ చెట్టు కింద ఏ మొక్క పెరుగుతుందో ఇట్టే కని పెట్టేస్తాను.ఏ చెట్టు కి ఏ కాయ కాస్తుందో..ఆ కాయ రుచి ఏమిటో కూడా చెట్టుని చూసి కనిపెట్టేస్తాను. మీకు ఏమైనా సందేహాలుంటే నన్నడగండి” అన్నాడు సుబ్బారావు.
“వీడేంటబ్బా అందిస్తే అల్లుకు పోయే వాడిలా ఉన్నాడు!”, అని తనలోనే అనుకొని, “చూడండి మిస్టర్ రావ్, నాకు ఈ ఆంధ్రా లో ఉన్న సమాజం అనేది మీరు కాలేజీ లో చదివిన అకౌంటెన్సీ లాంటి ఒక సబ్జెక్ట్ లాంటిది. దీని గురించి నేను కొండ మీది నుంచీ చూసి నా బుధ్ధి మాత్రం ఉపయోగించి తెలుసుకొంటున్నాను. దీనికి నా  భావావేశాలతో ఏ మాత్రం సంబంధం లేదు. నా అంచనా ప్రకారం మీ భావావేశాలకూ లంకెలేదు. ఇక్కడి సాంఘిక వ్యవస్థ కి మీరు కూడా ఒక బయటి వ్యక్తే . కానీ మీరు ఇక్కడి పరిణామాలన్నింటినీ దగ్గర గా చూశారు. “నిజమైన వ్యక్తులూ, ఈ సమాజిక వ్యవస్థ లో వారి సాధక బాధకాలూ, ఆవేశ కావేశాలూ. ఈ ఆంధ్ర లో ఒక దళితుడి మనో భావాలేమిటి…ఒక ముస్లిం ఫీలింగ్స్ ఏమిటి…ఒక అగ్ర కులస్థుడి పరిస్థితి ఏమిటి? ఒక తెలంగాణా వాది ఆవేశం ఎందుకు?”,… ఇదీ నాకు కావలసినది. మీరు మంచి కలుపు గోలు వ్యక్తి లా ఉన్నారు. ఈ ప్రయాణం లో మీరు నాకు మామూలు జనాలతో ఒక యాంకర్ లా పనిచేస్తారా? దానికి మీకు కొంత డబ్బు కూడా ఇస్తాను” హారీ మైండ్ కి రైల్లో జనాలతో మాట్లాడటానికి ఇంతకంటే మంచి తోవ కనపడలా.

“సరే”, అనేశాడు సుబ్బారావు.”మీ సీట్ నంబర్ ఎంత సార్?” అని హారీ దగ్గరినుంచీ టికెట్ తీసుకొని చూసి,”ఓ కే సార్  టీ సీకి చెప్పి, నా సీట్ కూడా మీ సీట్ దగ్గరికి మార్పించుకొంటాను”, అన్నాడు సుబ్బారావు.

ఈ లోగా వాళ్ళ ట్రైన్ బయలుదేరుతున్నట్లు అనౌన్స్ అయ్యింది. ఇద్దరూ లేచి ట్రైన్ వైపు నడక సాగించారు.

*************************

తమిళుడి లాగా అడ్డపంచె చుట్టి ,  ఓ చేతి లో సిగరెట్ పట్టి, ఇంకో చేతిలో క్యాష్ బాగ్ తో ప్లాట్ ఫారం మీదికొచ్చాడు మాగుంట దయాకర రెడ్డి. జుట్టు అక్కడక్కడా తెల్లబడింది. ఆయనకో నలభై ఐదు ఏళ్ళు ఉండవచ్చు. తొంభయ్యవ దశకం మొదట్లో రొయ్యల చెరువులేసి బాగానే  సంపాదించాడు. మెడలో బంగారు గొలుసూ చేతిలో నాలుగు వేళ్ళకీ ఉంగరాలు.

ప్లాట్ ఫాం మీద నాటు గా ఉన్న ఓ పల్లెటూరి పడుచు కనపడింది. ఆమె ను చూస్తే కావలి లో ఉన్న తన కీప్ గుర్తుకొచ్చింది దయాకర్ రెడ్డి కి. “దీని గుడ్డలూడ దీస్తే బ్రమ్మాండం గా ఉంటది”, అనుకొన్నాడు మనసులో. ఆయన రిజర్వేషన్ చేయించుకోలేదు కానీ, “టీ సీ కి ఓ యాభయ్యో వందో కొడితే ఫైను రాసేస్తాడుగదా.. . దానికేమీ భయపడ బళ్ళా” అనుకొని కదులుతూ ఉన్నసెకండ్ క్లాస్ భోగీ లోకి ఎక్కాడు.  హారీ, సుబ్బారావూ అక్కడ కూర్చొని ఉన్నారు. దయాకర రెడ్డి సిగరెట్ బయటికి విసిరేసి బాగ్ లోంచీ ఆ రోజు సాక్షి పేపర్ తీశాడు.

Indian Train Journey

Indian Train Journey

సుబ్బారావు ఆయన్ని చూసి, “ఎక్కడికెళ్తున్నారు సార్?” అన్నాడు.
“నెల్లూరు పోవాల”,అన్నాడు రెడ్డి. “మరి మీరు?” అని ఇద్దర్నీ చూశాడు. వాళ్ళు చెప్పారు.
“నెల్లూరంటే రొయ్యల చెరువులకి ప్రసిధ్ధి కదా. ఇప్పుడెలా ఉన్నాయి సార్?”
“బాగానే ఉండాయి..కానీ ఈ మధ్య కౌంటు తగ్గుతాంది…రేటూ తగ్గింది..”, అని బాగ్ లోంచీ సాక్షి పేపర్ తీశాడు.

ట్రయిన్లో మిడ్డీ వేసుకొన్న ఓ టీనేజ్ అమ్మాయి పోతోంది. ఆ అమ్మాయి వైపు అసహనం గా చూసి, “మాధవి లా చక్క గా చుడీదార్ లు వేసుకోవచ్చు కదా..!”, అనుకొన్నాడు తన కూతుర్ని గుర్తు తెచ్చుకొంటూ. పేపర్ లో హెడింగ్స్ చదవటం మొదలెట్టాడు.

సుబ్బారావు పేపర్ లో రెండు షీట్లు అడిగి తీసుకొని చదువుతూ..”సార్, రాజశేఖర రెడ్డి చావు వెనక కుట్ర ఉందంటున్నారే ..నిజమేనంటారా..?” అన్నాడు.

వెంటనే దయాకర రెడ్డి, “నిజమేనండీ, పెద్ద లెవల్లోనే ఏదో కుట్ర జరిగి ఉంటుంది”, అన్నాడు.

అది విని, “ఈయన రెడ్డి లాగా ఉన్నాడే..అయినా కన్ ఫం చేసుకొందాం..”, అనుకొని, “నా పేరు చెప్పనే లేదు..అయాం సుబ్బారావు..ఈయన హరి కృష్ణ..అమెరికా నుంచీ వచ్చారు”, అన్నాడు.

“నా పేరు దయాకర రెడ్డి”, అని హారీ వైపుకు తిరిగి “మీరు ఏం చేస్తారండీ” అన్నాడు దయాకర రెడ్డి.

హారీ వచ్చీ రాని తెలుగు లో ఏదో చెప్పాడు.

రెడ్డి, “సార్ మీరు మాట్లాడింది ఒక్క ముక్కా అర్ధం కాలా”, అంటూ నవ్వేశాడు.

“ఏదేమైనా ‘వైఎస్సార్ ‘గొప్ప నాయకుడు సార్. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. రాష్ట్రమంతా గొడవలుగా ఉన్నాయి. అతను ఉండి ఉంటే ఈ గలటా లు వచ్చేవి కావు” అన్నాడు సుబ్బారావు.

“కరక్టే! గట్టోడే!”

“కానీ ఆయన హయాం లో కరప్షన్ కూడా ఎక్కువ గానే జరిగినట్లుంది సార్..! “

“తినేటప్పుడు తిన్నాడు, చేసే టప్పుడు చేశాడు. ఈ రోజులలో తినకుండా ఎవరు చేస్తాండారు?”, అన్నాడు దయ.

“వాళ్ళ కొడుకు జగన్ కి మైనింగ్ కుంభకోణం తో సంబంధాలున్నాయంటున్నారు కదా సార్?”

“ఆ ..,అదంతా అపోజిషనోడు చేసే గోల. కరక్టు కాదు. కుర్రోడు వాళ్ళ నాన్న లాగే స్టఫ్ఫున్నోడు”, అన్నాడు దయ.

“మీకు జగన్ వ్యక్తిగతం గా తెలుసా?” అన్నడు హారీ.

దానిని సుబ్బారావు తెలుగు లోంచీ తెలుగు లోకి అనువదించి రెడ్డి ని అడిగాడు.

“అబ్బే…, వాళ్ళెక్కడ, మనమెక్కడ సార్..! “

” మరి ఆయన స్టఫ్ ఉన్నోడని ఈయనకెలా తెలిసిందభ్భా..!” అనుకొని, “మీకు వై ఎస్సార్ వలన వ్యక్తి గతం గా ఏమన్నా లాభం కలిగిందా?” అన్నాడు హారీ.

“నాకేమి లాభం?  …..లేదు”.

“ఈ ఇండియన్స్ అంతా ఒట్టి క్లానిస్టిక్ ట్రైబల్ వెధవల్లా ఉన్నారు”, అనుకొన్నాడు హారీ.

“మద్రాస్ లో మీకు ఏం పని సార్?”, అన్నాడు సుబ్బారావు.

“లాయర్ తో పనిబడింది. నా పార్ట్ నర్ లోకేశ్వర రెడ్డి ఉళ్ళా, వాడు మొన్నటి దాకా బాగనే ఉండేవోడు. ఈమద్దెన వాడికీ నాకూ ఓ విషయం లో గలాటా అయ్యి విడిపడ్డాము. దాని గురించిన వ్యవహారాలు మాట్లాడటానికి లాయర్ దగ్గిరికి పోయినా”.

ఇంతలో దయాకర రెడ్డి టాయ్ లెట్ కి వెళ్ళాడు.

సుబ్బారావు హారీ తో, “సార్ మనం ఇలానే వచ్చే వాళ్ళతో మాట్లాడి తే సరి పోతుందా? లేక పోతే ట్రైను అంతా తిరిగి ఫ్రాంక్ గా సార్ కి ఇంటర్వ్యూ కావాలని చెప్పి జనాలతో మాట్లాడదామా?”,అన్నాడు.
“ఇంటర్వ్యూ అయితే జనాలను సహజమైన మూడ్ లో చూడ లేము. మనం తక్కువ మందిని కలుసుకో గలిగినా ఈ పధ్ధతే మెరుగు అన్నాడు”, హారీ.

దయాకర్ రెడ్డి తిరిగి వచ్చి, “ఏం సార్, పాపం అమెరికా అంతా అదేంటో రిసెషన్ లో పడినదంటే! ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఆడ?” అన్నాడు హారీ తో.

” ‘యూ ఎస్ ఏ’ కి ఏమీ పరవాలేదు..ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ సూన్..” అన్నాడు హారీ ఒకింత గర్వం గా.
సుబ్బారావు లోపల్లోపల, “ఈ అమెరికా మనిషి కి కూడా కుల పిచ్చి ఉంది..ఈయన కులం పేరు అమెరికా కులం” అనుకొని, “,  “అమెరికా మీద జాలి చూపించొద్దు. సార్ కి కోపమొస్తుంది. ఆయన అమెరికా వాడే కదా”, అన్నాడు.
ఈ విషయం దయాకర రెడ్డి కి అస్సలు అర్ధం కాలా, ” సార్ అమెరికా వాడు ఎలా అవుతాడు? వాళ్ళ నాన్న… కాదు..వాళ్ళ తాతల నుంచీ అమెరికా లో ఉన్నా, సారు ఇండియనే”, అన్నాడు.

ట్రెయిన్ ఓ దళిత బస్తీ గుండా పోతోంది. అంబేద్కర్ విగ్రహం ఒకటి కనపడుతోంది. హారీ అన్నాడు, “ఐ గెస్ థట్స్ ది బస్ట్ ఆఫ్ అంబేద్కర్. ఆయన భారత రజ్యాంగ నిర్మాత కదా?”

రెడ్డి, “అందుకొని.ఆయనే రిజర్వేషన్లు పెట్టాడు. ఈ రిజర్వేషన్ల వలన మా లాంటి వాళ్ళకి చానా నష్టం. చాలా వరకు మాలా మాదిగలు వాటి వలన బాగు పడ్డారు” అన్నాడు.

సుబ్బారావు,”ఏం బాగు పడటం లే సార్. ఇంకా చాలా చోట్ల అణచివేత కు గురౌతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న చుండూరు సంఘటనే ఒక రుజువు”,అని కీ ఇచ్చాడు.

రెడ్డి కి ఆవేశం వచ్చింది. ఆయన ఆలోచనలు ఆవేశాన్ని ఫాలో అవ్వసాగాయి. “ఆడ వాళ్ళని అల్లరి చేస్తే ఎందుకు కొట్టరు? మొన్నటి దాకా మా మోచేతి నీళ్ళూ తాగే వాళ్ళు మా ఆడ వాళ్ళని అల్లరి పెడతారా..?”, అన్నాడు.

సుబ్బారావు, “కొట్టటం కాదు సార్..చంపారు కదా?”, అన్నాడు.
దానికి రెడ్డి,”వాళ్ళూ తరవాత చంపారు కదా?”, అన్నాడు.

రెడ్డి ఆవేశం చూస్తే ఒక సంఘటన గుర్తుకొచ్చింది హారీ కి. అతను రీసెర్చ్ మొదలు పెట్టటానికి ముందు అమెరికా లో ఒక చిన్న ఐ టీ ఉద్యోగం చేశాడు. ఒక సారి హారీ, వాళ్ళ బాస్ చేసిన డిజైన్ లో ఒక లోపాన్ని కొంచెం హార్ష్ గా విమర్శించి, ఆ డిజైన్ తో ముందుకు పోవటానికి నిరాకరించాడు. తరువాతి రోజు హారీ ని వాళ్ళ బాసు ఫైర్ చేశాడు.ఒక చిన్న ధిక్కారానికి హారీ పెద్ద మూల్యం చెల్లించుకో వలసి వచ్చింది. పవర్ ఈక్వేషన్స్ అలా ఉంటాయి మరి.

సుబ్బారావు ఇచ్చిన కీ దయాకరరెడ్డికి ఏమాత్రం నచ్చలా.మనసులోసుబ్బారావుని, “లేబర్ నాకొడుకు”, అని తిట్టుకొన్నాడు. ఈలోగా ‘టీ సీ’ వచ్చి టికెట్లు చెక్ చేయటం మొదలు పెట్టాడు. రెడ్డి నుంచీ ఓ యాభై నొక్కి, ఆయనకు పక్క భోగీ లో వేరే సీట్ చూపించి, అక్కడ కూర్చోమని చెప్పి,వెళ్ళిపోయాడు. రెడ్డి పేపర్ లో షీట్స్ అక్కడే మర్చిపోయి పక్క భోగీ లోకి వెళ్ళిపోయాడు.

************************

Nellore

Nellore

ట్రెయిన్ నెల్లూరు స్టేషన్ కి వచ్చింది. హారీ సుబ్బారావు ని అడిగాడు, “మీకు పెళ్ళి అయిందా?”.

“లేదు సార్, కుటుంబ నేపధ్యమూ కులమూ మతమూ లేని వాడికి పిల్లనెవరు ఇస్తారు? నాకేమో ఆడ పిల్లలతో మాట్లాడే కలుపుగోలు తనం లేదు”

జనాలు సందడి గా ట్రెయిన్ ఎక్కుతున్నారు.
షేక్ మస్తాన్ వలి తన పద్దెనిమిదేళ్ళ కూతురు రజియా తో కలిసి భోగీ ఎక్కాడు. వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొని,”ఆడ కూర్చోమ్మా”,అని చెయ్యి చూపించి కూతుర్ని కూర్చోమన్నాడు.
“ఎక్కడి వరకూ సార్”, అన్నాడు సుబ్బారావు మస్తాన్ తో.
“ఓంగోలు దాకా సార్. కసునూరు దర్గా కి వచ్చినాము. అమ్మాయి ఎంసెట్ రాస్తా ఉంది, ఇంజనీరింగ్ కి. బాగా రాయాలని దర్గా కి పోయి వస్తన్నాము”, అన్నాడు మస్తాన్ వలి.
సుబ్బారావు తన లో, “తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు..దూదేకుల సాయిబ్బేమో…!”, అనుకొని,  ఆ అమ్మాయి వంక చూసి..”బాగానే ఉంది… బురకా వేస్కోలేదేమిటో…!” అనుకొన్నాడు.
సుబ్బారావు కి తను చదువుకొనేటప్పుడు తన దోస్తు అనే ఒక మాట గుర్తుకొచ్చింది,  “తులం బంగారమిచ్చి అయినా సరే తురకమ్మాయి పక్క కి చేరాలి…”,నవ్వుకొన్నాడు సుబ్బారావు. మస్తాన్ వలీ వైపు చూశాడు. ” ఆ గెడ్డం ఎందుకో వీడికి..! మీసాలు మాత్రం లేవు..వీడి గడ్డం తరగా..నెత్తి మీద ఆ కాప్ ఎందుకు?నేనే ముస్లిం నని పెద్ద బడాయి..జన జీవనం లో కలిసి పోవచ్చు కదా…?”

ఇంత లో ఓ ముస్లిం కొలీగ్ చెప్పింది గుర్తుకు వచ్చింది సుబ్బారావు కి. …దాని ప్రకారం..”గెడ్డం పెట్టుకొంటే ఎక్కువ పుణ్యం లాంటిది వస్తుందట…”సాయిబ్బుల గడ్డాన్ని, ఒక హిందువు బొట్టు పెట్టుకోవటం తో సమానం గా చూడు భాయీ”, అన్నాడు వాడు సుబ్బారావు తో.
సుబ్బారావు ఆలోచనల పరంపర కొన సాగుతోంది, “అయినా నాకెందుకు వీడి మీద అసహనం…? నేను కూడా ఒక సాయిబ్బు గా పుట్టానేమో ఎవరికి తెలుసు? పెరగటం మాత్రం హిందూ పధ్ధతికి దగ్గరగా పెరిగాను..ఒక వేళ ముస్లిం గా పెరిగితే ఇతనిలానే గడ్డం పెంచుకొనే వాడినేమో…! నేను అనాధని. నాకు సాంస్కృతికం గా వంశపారంపర్యం గా వచ్చింది ఏమీ లేదు”, అనుకొంటూ హారీ వైపుకి చూశాడు. ట్రెయిన్ కదిలి ఊరి బయటకు వచ్చింది. హరీ పొలాల వైపుకు చూస్తున్నాడు. సుబ్బారావు, “ఇతను కూడా సాంప్రదాయ పరం గా ఒక అనాధే.ఇతని తాతల పధ్ధతుల గురించి ఇతనికి ఏ మాత్రం అయిడియా ఉంటుంది?”, అనుకొని, “సార్ మీకు రామాయణ భారతాలు తెలుసా?”, అన్నాడు హారీ తో.
దానికి హారీ, “మా నాన్న కి భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టం. నా చేత అన్ని పురాణాలూ చదివించారు.నేను అమెరికన్ అవ్వటానికి ఎంత గర్వ పడతానో నా హిందూ మూలాల గురించి అంతే గర్వ పడతాను. మా అమ్మ అయితే ఇంకా చీరలే కడుతుంది”
సుబ్బారావు కి హఠాత్తు గా వెలిగింది మస్తాన్ వలీ గడ్డమూ నెత్తి మీదటోపీ ఎందుకు పెట్టుకున్నాడో.
“ఇక అసలు పని లోకి దిగాలి అనుకొని”, సుబ్బారావు మస్తాన్ వలీ తో పరిచయాలు చేసుకొని మాటలు మొదలెట్టాడు.

scenary

scenary

“మీరు ఏమి చేస్తారండీ?”
“ఓంగోలు స్కూల్లో సైన్స్ టీచర్ ని”, అన్నాడు మస్తాన్ వలీ.
“మీ అమ్మాయికి ఇంజనీరింగ్ లో సీట్ వస్తే తరవాత పై చదువులకి అమెరికా పంపిస్తారా?”
మస్తాన్ వలీ అవునని తలూపాడు.
“ఆశ్చర్యమే. మీ మతం ఆడ పిల్లలకి విద్య ని ఆమోదించదు కదా?”, అన్నాడు సుబ్బారావు.
“అవన్నీ మూఢ విశ్వాసాలు సార్. ఏ మతం లో అయినా అసలైన విశ్వాసాలు కొన్ని ఉంటే..సామాన్య ప్రజలు ఆచరించే మూఢ విశ్వాసాలు కొన్ని ఉంటాయి”,అని..ఇంకా ఇలా అన్నాడు,”మత స్థాపకులకు సత్య దర్శనమౌతుంది..ఆ సత్యాన్ని మిగిలిన సాధారణ మానవులు చూడటానికి వారు కొన్ని సులువైన సూత్రాలను పొందు పరుస్తారు.  కొందరు స్థాపకులు ఈ సూత్రాలను మార్చే విషయం లో ఉదారం గా ఉంటే మరి కొందరు కఠినం గా ఉంటారు. రెండు విధానాల లోనూ లాభ నష్టాలున్నాయి. మత సూత్రాలను సులువు గా మార్చ గలిగితే, స్థాపకుడి తరువాత వచ్చే సత్య దర్శనం కాని అనుచరులు వక్ర భాష్యం చెప్పటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మత స్థాపకుడి మూల సూత్రాల సారం కల్తీ కాబడుతుంది. అందుకనే మా ప్రవక్త మూల సూత్రాల విషయం లో చాలా స్థిరం గా ఉన్నాడు. అయితే దీని వలన ఒక నష్టం ఉంది. మూల సూత్రాల లో కొన్ని సామాజిక నియమాలకి సంబంధించిన సూచనలు స్థాపకుడి కాలానికి సంబంధించినవి. అవి కాలం తో పాటు మారాలి. ఇస్లాం యొక్క స్థిరమైన విధానం వలన ఈ మార వలసిన విషయాలు కూడా మారలేదు. వీటిని ఎవరికి వారు వ్యక్తిగతమైన స్థాయి లో అన్వయించుకోవాలి. “

” “మీరు దర్గా కి పోయి వస్తున్నాను”, అంటున్నారు..దర్గా ల కి పోవటం అసలైన ఇస్లాం ప్రకారం సరి కాదు గదా?
“ఆ..ఏదో మా ఆవిడ పోరు భరించలేక వెళ్ళి వస్తున్నాం..”
“ఏదేమైనా మీ మత విషయాల గురించి తెలుగు లో నాతో ఇలా విపులం గా చెప్పిన వాళ్ళు లేరు సార్”, అన్నాడు సుబ్బారావు.
“అక్కడే ఉంది సమస్య..ఇస్లాం గురించిన సాహిత్యం మన తెలుగు లో చాలా తక్కువ. ఎవరైనా పూనుకొని తెలుగులో రాయాలి”, అన్నాడు మస్తాన్.

హారీ కల్పించుకొని, “అమెరికా గురించి మీ అభిప్రాయమేమిటి?”, అన్నాడు మస్తాన్ తో… .
“నాకు అమెరికా జనాల గురించి ఎటువంటి ద్వేషం లేదు సార్. ఇస్లాం ద్వేషానికి వ్యతిరేకం..ఇస్లాం అంటేనే శాంతి అని కదా అర్ధం..నా ప్రాబ్లం బుష్ సమయం లో అమెరికా విదేశీ విధానాల గురించే. ఇప్పుడు పరిస్థితి మెరుగయ్యింది…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే ఒక ముసల్మాన్ కి పుట్టిన వాడు కదా?”

కాసేపాగి మస్తాన్ నమాజుకు లేచాడు. మస్తాన్ నుదుటి మీద అడ్డం గా నల్ల గీత పడి ఉంది. అది చూసి, “అబ్బో సాయిబ్బు గారు భక్తుడే, కోస్తా ముస్లిం ల లో సాధారణం గా ఇంత భక్తి ఉండదే..!”, అనుకొన్నాడు సుబ్బారావు. ఇంతలో అతనికి ఒక సందేహం కలిగింది. “మీరు మక్కా వైపుకి తిరిగి నమాజ్ చేయాలి కదా..ట్రెయినేమో అన్ని దిక్కులలోకీ తిరుగుతూ ప్రయాణం చేస్తోంది..మరి మీకు మక్కా దిశ ఎలా తెలుస్తుంది…ఒక్కో సారి మీరు అదిగో ఆ కనిపించే గుడి లో దేవుడి కి నమాజ్ చేసినట్లు అవుతుంది కదా..?”

మస్తాన్ కి సుబ్బారావు ఎగతాళి చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. “నేను వీళ్ళ బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ మొక్కడమేమిటి…?”,అనుకొన్నాడు. పైకి మాత్రం,”దిక్కు అనేది రయిల్లో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ మనసు లో మక్కా ని పెట్టుకొంటే చాలు…అయినా మీ హిందువులు లింగానికి మొక్కడం కంటే ఇది అన్యాయం కాదు కదా అన్నాడు”.
సుబ్బారావు కి పరిస్థితి సజావు గా లేదనిపించి మౌనం వహించి ఓంగోలు కోసం ఎదురు చూడ సాగాడు.

********************

ongole

ongole

మస్తాన్ నమాజ్ అయ్యేటప్పటికి ఒంగోలు వచ్చేసింది. కూతురి తో సహా ఆయన దిగి వెళ్ళిపోయాడు. మస్తాన్ వెళ్ళిన తరువాత సుబ్బారావు హరీ తో, “దయాకర రెడ్డీ, మస్తాన్ వలీ కేసుల వలన నాకొకటి అర్ధమయ్యింది. జనాల నిజ స్వరూపం తెలుసుకోవాలంటే ప్రైవసీ లిమిట్స్ దాటి వాళ్ళని కెలకాలి. అలా కెలికితే వాళ్ళకు చిరాకు పుట్టి కొట్టినా కొడతారు. కాబట్టీ మిస్టర్ హారీ, ఈ జనాల వలన నాకు కన్నో కాలో పొతే మీదే బాధ్యత. మీరే నష్ట పరిహారం ఇవ్వాలి” అన్నాడు.

దానికి హారీ హాయిగా నవ్వేసి,” మీకు దేహశుధ్ధి జరగకుండా చివరి నిమిషం లో తప్పించుకొనే నేర్పు ఉందని నాకు తెలుసు మిత్రమా. అందుకే ఈ పని మీకు ఇచ్చాను”,అన్నాడు.

ఇంతలో ఒకతను వచ్చి టికెట్ చేతి లో పట్టుకొని, సీట్ నంబర్ల కోసం కిందా పైనా చూస్తున్నాడు. అతని మెడలో సిలువ వేలాడుతోంది. సుబ్బారావు, “మీ సీట్ నంబర్ ఎంతమాస్టారూ?”, అన్నాడు. అతను చెప్పాడు. అతనికి సుబ్బారావు సీట్ చూపించి, “కూర్చోండి” అన్నాడు.

ఆ వచ్చినతను చొక్కా పై రెండు గుండీలూ విప్పదీసి, “అబ్బా..ఏమి ఎండ?” అనుకొంటున్నాడు.
సుబ్బారావు హారీ కేసి తిరిగి, “ఇక్కడ ఉన్న మాకే చాలా వేడి గా ఉంది..అమెరికా నుండీ వచ్చారు..మీకు చాలా ఇబ్బంది గా ఉండి ఉంటుంది”, అన్నాడు.
దీనికి హారీ స్పందించేలోగానే, “ఏమిటి సార్ మీరు అమెరికా నుంచీ వచ్చారా..!”,అన్నాడు ఆ వచ్చినతను, ఆశ్చర్యం గా.
హారీ నవ్వుతూ కిందికీ పైకీ తలూపాడు. సుబ్బారావు అందుకొని హారీ ని పరిచయం చేశాడు.
హారీ షేక్ హాండ్ ఇచ్చాడు. ఆ వచ్చినతను లేచి నుంచొని షేక్ హండ్ ఇస్తూ, “నా పేరు వెంకటరమణ సార్”, అన్నడు.
సుబ్బారావు ఆశ్చర్యం గా, “అరే మీ పేరు ఏ శామ్యూలో..డేవిడో అనుకొన్నానే..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, సుబ్బారావు మాటల వెనుక మర్మం తెలిసినట్లు నవ్వి
, ” మేము అసలు క్రిస్టియన్స్ మే నండీ. మ నాన్న గారు ‘ఎస్ సీ’ రిజర్వేషన్ రాదని,మాకు అలా పేర్లు పెట్టారు” అన్నాడు.
సుబ్బా రావు లోపల,”ఇతను చాలా నిజాయితీ పరుడల్లే ఉన్నాడే!”,అనుకొన్నాడు.
“మీరు ఏమి చేస్తారండీ”, అన్నాడు సుబ్బా రావు.
“హై స్కూల్లో టీచర్నండీ !”,అన్నాడు. “విజయవాడ లో పని ఉండి వెళ్తున్నాను”.

హారీ స్తేషన్లో దిగి బ్రెడ్డూ జామూ వాటర్ బాటిలూ తెచ్చుకున్నాడు. సుబ్బా రావు కి ఇడ్లీ వడా తెచ్చాడు.రైలు కదిలింది.
సుబ్బా రావు, “ఈయన ఎస్ సీ లో ఏ కులమో తెలియ లేదే..!”,అనుకొని, “పేపర్ లో ఒక న్యూస్ ఐటం చూపించి, సార్ ఈ మధ్య ఎస్ సీ వర్గీకరణ అని ఏవో గొడవలు జరుతున్నాయి కద సార్. దేని గురించి ఈ గలాటా…!”, అన్నాడు.
దానికి రమణ, ” ఆ… అనవసరమైన గొడవలు సార్…అంబేద్కర్ గారు ఎస్ సీ లందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు..కొద్దో గొప్పో అందరూ ముందుకు పోతున్నాము..ఇవ్వాళ వెంకట రమణ టీచర్ అయినా ఇంకో మాయావతి సీ ఎం అయినా ఆయన చలవే…ఆయన లేక పొతే ఈ రోజు వెంకట రమణ అనే టీచర్ లేడు..ఆయన దేవుడు…ఇప్పుడు దానిలోనే విభజనలు ఎందుకు సార్..ఇది అంతా అగ్రకుల రాజకీయులు ఎస్ సీ లని చీల్చటానికి చేసిన ఒక కుట్ర”, అన్నాడు.
సుబ్బా రావు, “కానీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు….,అగ్రకులాల వాళ్ళు కూడా, ఇలానే… “దేశాన్ని కులాల ఆధారం గా విడగొడుతున్నారు” అనుకొని ఉంటారు కదండీ”, అన్నాడు.
రమణ, “వీడెవడో పక్కా అగ్రకులస్థుడి లా ఉన్నాడు”, అనుకొని.
సుబ్బా రావు తో ఇలా అన్నాడు, “అది వేరండీ .. చారిత్రకం గా దళితులు అణగద్రొక్కబడ్డారన్నది తిరస్కరించలేని నిజం..దానిని సరి చేయటానికే దళితులకు ఈ రక్షణలు కల్పించారు..దళితులను పాలకులు గా నిలబెట్టాలి..”
సుబ్బా రావు మధ్య లోనే అందుకొని,” ముస్లింలు హిందువులని చాలా కాలం పాలించారు..బీ జే పీ వాళ్ళు ఇప్పుడు హిందువులు పునర్వైభవం పొందాలి అంటున్నారు. దీనిని మిగిలిన వారు నాజీయిజం అంటున్నారు..బీ జే పీ ది నాజీయిజం అయితే, మీరు చెప్పే దళితుల పాలన కూడా నాజీయిజం అవుతుంది కదా..?” అన్నాడు.
దీనికి రమణ కు చిర్రెత్తుకొచ్చింది. అతను కోపం గా, “ఈ రెండింటికీ చాలా తేడా ఉందండీ..దళితులు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు..రేపు దళితులు కూడా వాళ్ళ జనాభా కి తగినట్లు గా ఉద్యోగాలలో ఉంటే, రిజర్వేషన్లు ఎత్తేయటం వలన అగ్ర కులాలకి వచ్చే లాభం ఏమిటి..? బీ జే పీ ది మొత్తం గా వేరే వాదం. అది మైనారిటీల మీద నరమేధాలు చేస్తోంది”, అన్నాడు వెంకట రమణ.

ఇంతలో హారీ కల్పించుకొని, “ఆర్ధిక ప్రాతిపదికన రిజర్వేషలు ఇవ్వటం కరక్టు అనుకొంటా..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, “ఇది కొంతవరకూ సరియైనదే..కానీ సామాజికం గా వెనుక పడటం అనేది ఒకటి ఉంది…నెలకు ఐదు వేలు ఆదాయం ఉండే దళితుడి కొడుకు ఒక దళిత వాడ లో ఉన్నాడను కొందాం..అలానే ఐదు వేలు ఆదాయం వచ్చే బ్రాహ్మణుడి కొడుకు ఒక అగ్రహారం లో ఉన్నాడనుకొందాం.. బ్రాహ్మణుడికి అగ్రహారం లో ఉండే విలువల దృష్ట్యా..అక్కడ ఉన్న వాతావరణం..చుట్టాలూ…స్నేహితులూ..పరిచయాల దృష్ట్యా అడ్వాంటేజ్ ఉంటుంది అనటం లో సందేహం లేదు కదా..? అలానే దళితులా ఆది వాసీ ల జీవన విధానం ఆధునిక జీవన విధానం కంటే వేరు గా ఉంటుంది..అది వారికి ఒక డిజేడ్వాంటేజ్. మీరు అమెరికన్ జీవన విధానం లో పెరిగారు. మిమ్మల్ని ఒక ఆదివాసీ గూడెం లోని మనిషి తో వడిసెలు విసరటం లో పోటీ పడమంటే, మీకు ఎలా ఉంటుంది? అలానే ఆదివాసీ ని “జీ ఆర్ ఈ” రాసి అమెరికా పోవచ్చు కదా అన్నా అంతే అన్యాయం కదా..?” అన్నాడు.
అప్పటికే ట్రెయిన్ లో జనాలు ఆవేశం గా మాట్లాడుతున్న వెకటరమణ ను గమనించటం చూసి….”సార్ ఈ విషయాలు ఒక ట్రెయిన్ ప్రయాణం లో మాట్లాడుకొనేవి..కాదు…చెప్పండి సార్..అమెరికా లోజనాలు ఎలా ఉంటారు..ఇండియన్స్ అంటే ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి..?”అన్నాడు.
సుబ్బారావు, “మీరు ఒంగోలు లో దళిత వాడలో ఉంటారా..లేక వేరే ఉంటారా..?”,అన్నాడు.
“లేదు సార్,అక్కడ సౌకర్యాలుండవు..హై స్కూలు దగ్గర్లోనే ఒక ఇంట్లో ఉంటున్నాను. స్కూలు కి దగ్గర కదా..సౌకర్యం గా ఉంటుంది”

దయాకర రెడ్డి నీ మస్తాన్ వలీ నీ ఇప్పుడు వెంకట రమణ నీ చూసిన హారీ మనసు లో ఒక సత్యం రూపు దిద్దుకో సాగింది….

**********************

chirala_org

chirala_org

ట్రెయిన్ చీరాల లో ఆగగానే పంచుమర్తి రామారావు బట్టలమూట భోగీ లో పెట్టి తనూ ఎక్కాడు. ఆయనకు ఓ యాభై యేళ్ళు ఉంటాయి. ట్రెయిన్ కదులుతూనే వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొన్నాడు.

సుబ్బారావు బట్టలను మూటని చూసి “చేనేత లా ఉందే”, అన్నాడు.
రామారావు దానికి, “కాదండీ మర మగ్గం తోనే నేశాం”,అన్నాడు.
సుబ్బారావు,”ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఈ బట్టలని?”, అన్నాడు.
“విజయవాడ లో బట్టల కొట్టుకి అమ్మటానికి తీసుకెళ్తున్నా”
“చేనేత రంగం లో సంక్షోభం తగ్గినట్లేనాండీ..?”, అన్నాడు సుబ్బారావు.
“ఏమి తగ్గటమో సార్. మర మగ్గాలైతే ఇచ్చారు ..కానీ ఈ మగ్గాలు బాంబే మిల్లుల తో పోలిస్తే ఏ పాటి? పైగా వీటికి రిపేర్ లు ఎక్కువ. ఒక్క సారి రిపేర్ కి వచ్చిందంటే ఖర్చు ఎక్కువ”
హారీ ట్రెయిన్ విండో కి చేరగిలబడి సుబ్బారావు తో, “పారిశ్రామికీకరణ ఆర్ధిక సరళీకరణ ల నేపధ్యం లో కుల వృత్తుల, చేతి వృత్తుల వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కోవాలని నాకు ఆసక్తి గా ఉంది”, అన్నాడు ఇంగ్లీషు లో..
నల్ల తోలు సుబ్బారావు పంచుమర్తి రామారావు తో ఇలా అన్నాడు, ” ఈ సార్ అమెరికా నుంచీ వచ్చి ఏదో రీసెర్చ్ చేస్తున్నాడట..ఈ మధ్య మన చేతి వృత్తుల వారి స్థితి గతులు ఎలా ఉన్నాయి అంటున్నాడు”.
“ఆ ఏముంది సార్..ఎవరికైనా పట్నాలకు వలస పోతేనే కొద్దో గొప్పో పోషణ…కాక పోతే దీనిలోనే కొంచెం తరుగూ మెరుగూ..కుమ్మరి వాళ్ళపని ఎక్కడా బాగా లేదు..కుండలు ఎవరు కొంటున్నారు..కమ్మరి వాళ్ళ పనీ అంతే..పోతే వడ్రంగి వాళ్ళకి టౌన్ కి పోతే బాగానే పని ఉంది. దీనికి కారణం ఇళ్ళ నిర్మాణం. దర్జీలు కూడా పట్టణాలలో పరవాలేదు..వాళ్ళు టెక్స్ టైల్
పార్కుల్లో దూరి పోవచ్చు..ఇక పోతే మంగలి,చాకలి వారికి పట్టణాలలో పరవా లేదు..ఇస్త్రీనో డ్రై క్లీనింగో చేసుకుంటున్నారు..సెలూన్లు పెట్టుకొంటున్నారు..గొల్లలూ గవళ్ళూ వ్యవసాయం వైపుకి మళ్ళుతున్నారు..పల్లెటూళ్ళ నుంచీ వెళ్ళే అగ్రకులాల భూమిని వీళ్ళే కొని, వ్యవసాయాన్ని బ్రతికిస్తున్నారు. చేనేత పనివారికి మాత్రం గడ్డు కాలమే..! మేము నేసే బట్టల కంటే చాలా చౌకగా పైనుంచీ బట్టలువచ్చి పడుతున్నాయి..ఈ రాజకీయ నాయకులకేమో గుద్దులాడుకోవటానికే టైం చాలటల్లా..మా జనాభానేమో తక్కువ.. వోట్లు లేనిదే రాజకీయ నాయకుడెక్కడ మాట వింటాడు..?ఈ కులాలన్నీ కలిస్తే బాగానే ఉంటుంది..కానీ ఈ కులాలలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు.”
హారీ ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు, “ఎన్నికలలో ఒక అగ్ర కులస్థుడూ ఒక దళితుడూ నిల్చొంటే ఎవరికి వోటేస్తాడు ఇతను?”
సుబ్బా రావు ఈ ప్రశ్న ను అనువదించి రామారావు ని అడిగాడు.
రామా రావు ఆలోచించి, “ముందు క్యాండిడేటు ఎలాంటి వాడో చూస్తాం సార్. ఇద్దరూ ఒకే తరహా వాళ్ళైతే నేనైతే అగ్రకులస్థుడికే వేస్తా. నేనే కాదు మాలో చాలా మంది అలానే చెయ్యవచ్చు”.

ఇదంతా నిశ్శబ్దం గా వింటున్న వెంకటరమణ తను కూర్చున్న చోటనే ఇబ్బంది గా కదిలాడు.

“అగ్ర కులాల కు ఆంధ్ర రాజకీయాలలో పట్టు ఉండటానికి ఇది కూడా ఒక కారణమనుకొంటా..ఆంధ్ర లో హిందూ సామాజిక వ్యవస్థ స్వరూపం అగ్ర కులాల వైపుకి మొగ్గి ఉన్నట్లు గా ఉంది”, అన్నాడు హారీ.
సుబ్బారావు, “ఇది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఎందుకు తట్టలేదబ్బా.”,.అనుకొని. “హారీ బయటి వాడవ్వటం వలనే అతనికి ఇది అర్ధమై ఉండవచ్చు..అతనిలా మన వ్యవస్థ ని కొండ మీదెక్కి విహంగ వీక్షణం చేసే అవకాశం నాకు లేదు కదా”, అనుకొన్నాడు.
రామా రావు హారీ కూర్చొన్న తీరు చూసి, “బాగా బలిసిన వాడిలాగున్నాడు..నేను చెప్పినదంతా ఒక వినోదంలా కులాసా గా వింటున్నాడు..నాలాంటి రెక్కాడితేగానీ డొక్కాడనోడి పరిస్థితి ఇతనికి ఏమి అర్ధమౌతుంది?” అనుకొన్నాడు.

*************************

tenali

tenali

వీరమాచనేని వెంకట కృష్ణ ప్రసాద్ తెనాలి లో కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు.  అతనికి నలభై యేళ్ళు ఉంటాయి.అతనికి విజయవాడ లో ఒక చిన్న బిజినెస్ ఉంది. తెలుగు దేశం పార్టీ వచ్చిన కొత్తలో ఆవేశం గా పార్టీ జెండామోసి దానివలన ఊళ్ళో మోతుబరులకే తప్ప తనకేమీ లాభం లేదని తెలుసుకొన్నాడు. దరిమిలా ఊళ్ళో జరిగిన గొడవలతో, “కమ్మ వారి మీటింగులు కాలువలొచ్చేవరకే!” అన్న నానుడి అనుభవం లోకి వచ్చిందతనికి…అప్పటి నుంచీ రివర్స్ గేర్ లో పడ్డాడు.

పదేళ్ళకిందట ఊళ్ళో ఒకతను రెండు లక్షలిచ్చి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తానంటే, “మన వాళ్ళలోమగాడిగా పుడితే మినిమం ఐదు లక్షలు కట్నం కదా?”,అన్నాడు. దానితో ఆ సంబంధం తప్పిపోయింది. తరవాత మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని ఆడ పిల్లలు చదువులలో పైకి పోవటం, కట్నాలు కిందికి దిగటం జరిగిపోయి, కృష్ణ ప్రసాదు కి అప్పటి నుంచీ ఇప్పటి దాకా పెళ్ళి కాలేదు.
అతను వచ్చి హారీ పక్కన కూర్చొన్నాడు.

హారీ వేసుకొన్న బూట్లు చూసి “ఈ షూ అమెరికా లో మాత్రమే దొరుకుతాయి కదండీ? !”, అన్నాడు.
సుబ్బారావు,”చచ్చింది గొర్రె, దొరికింది బర్రె” అనుకొని, కృష్ణ ప్రసాద్ తో, “అవునండీ,  ఈ సార్ వచ్చింది అమెరికా నుంచే కదా”అన్నాడు.
సుబ్బారావు మళ్ళీ అందుకొని, “మీకు ఇవి అమెరికా లో మాత్రమే ఉండే బ్రాండు అని ఎలా తెలిసింది”,అన్నాడు.
కృష్ణ ప్రసాదు, “మా పెదనాన్న గారి అబ్బాయి ఒకతను అమెరికా లో ఉన్నాడు లెండి. అతను ఇండియా వచ్చినపుడు చూశాను”, అన్నాడు.
రెడ్డి గారు వదిలేసిన  పేపర్ చూస్తూ సుబ్బారావు, “ఏంటి సార్? ఈ చంద్ర బాబు తెలంగాణ గురించి ఏమీ తేల్చి చెప్పేటట్లు లేడు”, అన్నాడు.
“ఉపయోగం లేని మనిషి సార్. మా వాడైనా మా వాళ్ళకి చేసింది ఏమీ లేదు”,అన్నాడు.
సుబ్బారావు, “అదేంటి సార్,అలా అంటున్నారు?”,అని ఆశ్చర్యం నటించాడు.
“రాజశేఖర రెడ్డి చూడండి రెడ్లకి ఎలా దోచి పెట్టాడో..! మా రాజ కీయ నాయకుల వలన మా లో ఉన్న పేదోల్లకి నష్టమే ఎక్కువ జరిగింది” అన్నాడు కృష్ణ ప్రసాద్.
సుబ్బారావు: “అదెలా సార్? కాస్త వివరం గా చెప్పండి” అన్నాడు.
“ఎన్ టీ రామారావు రాజకీయాలలో కి రాక ముందు కమ్మ వాళ్ళంటే గోదావరి జిల్లాల్లో రాజుల్లా గుట్టు గా తమ పనేదో తాము చేసుకొనే వారు. రామారావు వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డారు. ఆయన ప్రవేశ పెట్టిన “రెండు రూపాయలకు కిలో బియ్యం” పధకం వలన ఊళ్ళలో లేబర్ మా మాట వినటం మానేశారు.  మిగిలిన కులాలన్నీ మమ్మల్ని చూసి ఏడుస్తున్నాయి. పెద్ద వాళ్ళు చెసే వెధవ పనుల వలన..మా లో ‘లేని వారికి’ కూడా చెడ్డ పేరు వచ్చింది. మాలో ఉన్న వాళ్ళ ఐశ్వర్యం చూసి అందరూ ఉన్న వాళ్ళే అనుకొంటున్నారు. కానీ మాలో లేని వాళ్ళకి ప్రభుత్వ పరం గా ఒక రిజర్వేషను ఇవ్వలేదు..ఒకరాయితీ ఇవ్వలేదు..ఇస్తే మా రాజకీయ నాయకులకు ప్రజలు కులతత్వమంట గడతారేమోనని భయం.”
ఇది విని హారీ,” సో ..,ఇక్కడముఖ్య సమస్య పేదరికం కదా..మీరు దళితులలో,బీ సీ ల లో ఉన్న గ్రామీణ పేదలతో కలిసి మీ హక్కుల కోసం ఉద్యమించవచ్చు గదా?”, అన్నాడు అమాయకం గా.

వెంటనే కృష్ణ ప్రసాద్, “వాళ్ళతో మేమెలా కలుస్తాం..?” అన్నాడు తనని అవమానించినట్లు గా.ఈ మాట విని రమణా రామారావూ చెరొక కిటికీ లోంచీ బయటికి చూడటం మొదలు పెట్టారు.

సుబ్బారావు కృష్ణ ప్రసాదు కి ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకొని, “ఏదేమైనా, ఒకటి నిజమే సార్, చంద్ర బాబు అంత జిత్తుల మారి నాయకుడు ఎవరూ లేరు” అన్నాడు.
కృష్ణ ప్రసాద్ తమాయించుకొని,”అందరు రాజకీయ నాయకులూ అలాంటి వాళ్ళే సార్. ఉన్నంతలో బాబే బాగా చేశాడు”, అన్నాడు.
సుబ్బారావు తన లో,” ఓర్నీ, నీ కులం వాళ్ళని తిట్టాలన్నా నువ్వే తిట్టాలా…!ఇతరులు మాత్రం తిట్టకూడదా..?” అనుకొన్నాడు.

********************

Vja-bridge

Vja-bridge

vijayawada

vijayawada

విజయవాడ ఇంకా పదినిమిషాలలో వస్తుంది. ట్రెయిన్ నెమ్మదిగా నడుస్తోంది. ఓ కుర్రాడు చెవికి ఐ-పోడ్ పెట్టుకొని హారీ ఉన్న సీట్ ను దాటి గేట్ లో నిల్చొని బయటి పచ్చటి దృశ్యాలు చూస్తున్నాడు. ఆ కుర్రాడిని చూసి హారీ ఇతనిది ఏ కులమై ఉంటుందబ్బా అనుకొని మళ్ళీ,”కులమంటే తెలియని నేను కూడా కుల స్పృహ లో పడి పోయానే!” అనుకొన్నాడు.

ఇంతలోహఠాత్తు గా, “అయ్యో ! అయ్యో! పడిపోయాడు..పడిపోయాడు..ట్రెయిన్ ఆపండి…ఆపండి!”, అన్న అరుపులు వినపడ్డాయి..సుబ్బారావు ఒక్క ఉదుటున లేచి చెయిన్ లాగాడు. ఒక ముసలామె వాష్ బేసిన్ దగ్గర నిలబడి చెప్తోంది..”ఎవరో కుర్రాడు చల్ల గాలి కొసం డోర్ దగ్గర నిలబడ్డాడు. ట్రెయిన్ కుదుపుకి డోర్ వచ్చి అతనికి గట్టిగా కొట్టుకొని కింద పడి పోయాడు..”

సుబ్బారావు, కృష్ణ ప్రసాద్, రామా రావు, రమణ తో సహా భోగీ లోని కుర్రాళ్ళు కొందరు కిందకి దిగారు. ట్రెయిన్ గేట్ దగ్గరే నిల్చొన్నాడు హారీ. కింద పొదల్లో కనపడ్డాడు ఆ కుర్ర వాడు. మూలుగుతూ ఉన్నాడు. ముళ్ళు గీరుకు పోయి రక్తం వస్తొంది. లేవలేక పోతున్నాడు..తలొక చేయీ వేసి కుర్రాణ్ణి బయటికి లాగారు. భొగీ లోకి ఎక్కించారు. రక్తం చూసి హారీ ఆ కుర్రాడి దగ్గరకే పోలేదు. “అతని రక్తం వలన ఏమి ఇన్ ఫెక్షన్స్ వస్తాయో ఏమిటో”, అనుకొన్నాడు తనలో. ముళ్ళపొదల వలన కుర్రాడికి పెద్ద గా దెబ్బలు తగలలేదు. ట్రెయిన్ నెమ్మది గా కదిలింది..కృష్ణా నది ని దాటి స్టేషన్ లో కి చేరింది. ప్రయాణికులంతా ఎవరి దారిన వారు పోతున్నారు.

సుబ్బారావు హారీ తో,”సార్,కోణార్క్ కి ఇంకా టైం ఉంది..దగ్గర్లో ఏదైనా హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేద్దామా?”, అన్నాడు.

“టిఫిన్ చెయ్యటమంటే..ఏమిటి..?”, హారీ అన్నాడు.

“అదే… ఇండియన్ స్నాక్స్ తిందాము”.

రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్ళంతా ఆటో సార్..ఆటో సార్ అనటం మొదలు పెట్టారు…ఒక ఆటో వాడు మాత్రం పది అడుగులు వీళ్ళతోనే నడిచి..”సార్ లాడ్జ్ కావాలా..?” అన్నాడు సుబ్బారావు తో.
“మేము హైదరాబాద్ వెళ్తున్నాం..మాకు లాడ్జ్ ఎందుకు?”, అన్నాడు సుబ్బారావు. ఇంక ఆ ఆటో వాడు వెళ్ళిపోతాడేమో అనుకొన్నాడు సుబ్బారావు. కానీ వాడు వదలకుండా,”సార్, మంచి అమ్మాయి సార్ రండి సార్” అన్నాడు.
సుబ్బారావు కోపం గా వాణ్ణి కసరటం తో వాడు వెళ్ళిపోయాడు.

ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న ఒక హోటల్ కి వెళ్ళారు. హోటల్ బిజీ గా ఉంది. ఓ టేబుల్ దగ్గర రెండు సీట్లు ఖాళీ గా ఉంటే వెళ్ళి కూర్చొన్నారు.

ఎదురు గా, వేదుల రామకృష్ణ శాస్త్రి కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆయన లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడు. సత్యనారాయణ పురం లో పెద్దల నాటి ఒక ఇల్లు ఉంది. ఈ మధ్య ఆయన ఆలోచనలన్నీ ఒకే విషయం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అది తన ముప్పై రెండేళ్ళ కూతురు శాంభవి కి పెళ్ళి చేయటం.

ఎర్రగా బుర్రగా ఉన్న హారీ ని చూసి శాస్త్రి, “కుర్ర వాడు బ్రామ్మలలానే ఉన్నాడు..వైదీకులో…నియోగులో…ఆ… ఈ కాలం లో ఎవరైతే ఏముందిలే”, అనుకొన్నాడు.

నల్ల తోలు సుబ్బారావు ని చూసి శాస్త్రి, “అతనెవరో నిమ్న కులస్థుడి లానే ఉన్నాడు…కొంచెం తెలివి తక్కువైనా వీళ్ళు కూడా ఈ మధ్య బాగానే చదువుతున్నారు…ఏదేమైనా శూద్రస్య శుభం నాస్తి…అయినా చూద్దాం”,అని కూడా అనుకొన్నాడు.

హరీ సుబ్బారావుని, “కోణార్క్ రైట్ టైం ఎంత?”, అని అడిగాడు. సుబ్బారావు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా రామకృష్ణ శాస్త్రి అందుకొని, “ఐదింటికండీ”,అని, “మిమ్మల్ని ఎక్కడో చూసి నట్లుంది..బై ఎనీ చాన్స్ మీ ఇల్లు సత్యనారాయణ పురం లో ఉందా..?”,అన్నాడు హారీ తో.

హారీ కి శాస్త్రి మాట్లడిన దాంట్లో ఒక్క ముక్కా అర్ధం కాలేదు. సుబ్బారావే కల్పించుకొని హారీ కి శాస్త్రి ప్రశ్న ను వివరించి, శాస్త్రి కి హారీ గురించి చెప్పాడు. శాస్త్రి కి తన సందేహం తీరే మార్గం కనపడలా.అతనికి సుబ్బారావు ఒక దుశ్శకునం లా కనపడ్డాడు. తన కాఫీ అయ్యిపోవటం తో లేచి వెళ్ళిపోయాదు.

************

కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో చాలామంది ఒరియా వాళ్ళు ఉన్నారు. చాలా వరకూ బాంబే వెళ్తున్నారు. హారీ సీట్ పక్క ఓ పాతికేళ్ళ కుర్రాడు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఒక కాల్ అయిన వెంటనే ఇంకొక కాల్ వస్తోంది. సుబ్బారావు ‘టీ సీ’ తో చెప్పి సీట్ మార్పించుకొని వచ్చాడు. ఆ కుర్రాడికి మళ్ళీ కాల్ వచ్చింది. “కొడితే కొట్టలిరా సిక్సు కొట్టాలి”, అని మొబైల్ కాలర్ ట్యూన్ ని పాడింది.

కుర్రాడు,”ఆయ్ …విజాడ వచ్చేహిందండీ..ఇంకో పది నిమిషాలలో బయల్దేరతందండీ..” అన్నాడు. ఈ కాల్ అయిన తర్వాత కుర్రాడే మళ్ళీ ఇంకో కాల్ చేసి,”ఆ.. సత్నానా…నేను ఆకుల చిట్టిబాబున్రా..అరే కొబ్బరి తోటల్కి నీళ్ళు పెట్టించావా..పెట్టించలేదా..మా అన్నియ్య కొట్టీగలడు..ఆర్యా2 మామూలు జనాలకి ఎక్కదు గానీ డాన్సులు సూపర్రా..అదర గొట్టీహాడ్రా అర్జునూ”, అని ఇంకేదో మాట్లాడుతున్నాడు. చివరికి ఎప్పటికో చిట్టిబాబు ఫోన్ కి విశ్రాంతి దొరికింది. ఫోన్ జేబులోపెట్టాడు. ఫోన్ స్క్రీన్ లో సుబ్బారావు కి పవన్ కళ్యాణ్ వాల్ పేపర్ కనపడింది.

సుబ్బారావు అతనితో సడన్ గా,”మీరు రాం చరణ్ ఫ్యాన్ కదండీ..”, అన్నాడు.

చిట్టిబాబు,”అయ్ బాబోయ్..ఎలా కని పెట్టీసీరండీ..మగ ధీర సూపర్ హిట్టుకదండీ…నాకు ముందే తెలుసండీ..”, అని సుబ్బారావు కి రాం చరణ్ నెక్స్ట్ సినిమా గురించిన విశేషాలు చెప్పనారంభించాడి చిట్టి బాబు.

“చిరంజీవి కి వోట్లేయలేదేమిటండీ మీ గోదావరి వాళ్ళు కూడానీ..”, అన్నాడు సుబ్బారావు చిట్టి బాబు ని అనుకరిస్తూ.

“కర్ణుడి చావు కి ఎన్ని కారణాలో దీనికీ అన్ని కారణాలండీ”,అన్నాడు చిట్టి బాబు.

“ఏదైనా చిరంజీవి ‘ఎన్ టీ ఆర్’ కాదుగదండీ”, అన్నాడు సుబ్బారావు.

“పెద్ద ‘ఎన్ టీ ఆర్’ వచ్చినా ఈ రోజుల్లో గెలవటం కష్టమండీ..ఆ రోజులు వేరు..ఈరోజులు వేరు..ఏమైనా లక్కు ఉండాలి లెండీ”,అన్నాడు చిట్టి.

ట్రెయిన్ బయలు దేరింది. ట్రెయిన్ లో జనాలు చాలా వరకూ “కొంచెం క్లాస్” గా ఉన్నారు.

“వీళ్ళ తో సంభాషణ కష్టం లానే ఉంది. ఇటువంటి వాళ్ళు బుర్ర లో ఉండే ఆలోచన నోటిలో మాట గా మారటానికి ముందు చాలా విషయాలు సరి చూసుకొంటారు. అందు వలన వీళ్ళతో సంభాషణ లో స్పాంటేనిటీ తక్కువ గా ఉంటుంది”, అనుకొన్నాడు సుబ్బారావు.

***********************

హారీ జేబులో మొబైల్ మోగింది. దాన్ని పట్టుకొని..”యా..డాడ్..” అని అమెరికన్ ఇంగ్లీష్ కలిసిన తెలుగు లో ఏవో వ్యక్తిగత విషయాలు బెక బెక లాడ సాగాడు.
సుబ్బారావు ఏమీ తోచక అటూ ఇటూ తిరిగే జనాలను చూస్తున్నాడు.తెలుగు వాళ్ళు చాలా మంది హైదరాబాదు లో దిగిపోయేవాళ్ళ లా కనపడుతున్నారు. సుబ్బారావు ఆలోచనల లో పడ్డాడు “ఏమైనా హైదరాబాద్ వాళ్ళు ఈ కోస్తా వాళ్ళ కంటే కొంచెం విశాల హృదయులు. కులం మతం ఏమీ పట్టించుకోరు. నా అపార్ట్ మెంట్ లో ఇంతవరకూ నా కులం గురించి ఎవరూ అడగలేదు కదా….అడిగితే నా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పాల్సి వచ్చేది….”
ఇంతలో హారీ,”హెయ్ డాడ్,మన కాస్ట్ ఏమిటి?…ఆ అదేఇండియాలో ఉంటాయి కదా కులం అని…ఏమిటి?”,అని అడిగి, “వాట్ వెలామా…ఓకే..ఓకే వెలమ…రైట్.ఓ కే..ఓ కే..బై డాడ్”అని పెట్టేశాడు.

సుబ్బారావు హారీ చివరి మాటలు వినేసి, ట్రెయిన్ లో అయిన అలవాటు తో హారీ ని ఒక సారి గోకి చూద్దాం అనుకొన్నాడు.
“మీరు వెలమ నా సార్..వెలమ దొరలు చాలా పొగరుబోతులు సార్..కే సీ ఆర్ కూడా వెలమే కదా..!” అన్నాడు.
దానికి హారీ, “నేను ఆ కాస్ట్ కి చెందినవాడిని కాదు..ఆ కాస్టే నాకు కొత్త గా వచ్చి చేరిన ఒక ట్యాగ్ లాంటిది”,అని తన బాగ్ కి ఉన్న ట్యాగ్ ని చూపించి, “కాస్ట్ అనేది అలాంటి ఒక ట్యాగ్ నాకు..ఆ ట్యాగ్ నీకు నచ్చినా నచ్చక పోయినా నాకేమీ పరవాలేదు. అయినా ఇక్కడ ఈ ట్యాగ్ లకి ఎందుకు ఇంత విలువ ఇస్తారో నాకు ఇంకా అర్ధంకాలేదు దానిని అర్ధంచేసుకోవటం కోసమే ఈ ట్రెయిన్ ప్రయాణం” అన్నాడు.
“నాకు అర్ధమయ్యింది సార్ ఇప్పుడు…పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు కులాల పరమైన సమూహ జీవనం గడుపుతారు…హైదరాబాద్ లాంటి చోట్ల నేనుండే అపాట్మెంట్లలో అలాంటిది ఉండదు..అన్ని కులాలూ ఉంటాయి..మతాలూ ఉంటాయి..అదే అమెరికా లో ఇక చెప్పనవసరం లేదు…కులాలు కు మారు గా వేరే కులాలు ఉంటాయి..మా అపార్ట్మెంటులో ఖరీదైన కారు ఉన్నోడిది ఓ కులం..అలానే బాంబే నుంచీ వచ్చిన వాళ్ళందరిదీ ఒక కులం…అమెరికా లో అయితే..అమెరికన్లదంతా ఒక కులం..”
హారీ అడ్డు తగిలి,”మీ పల్లెల లో ఉండే వాళ్ళు కులాన్ని నా లాగా ట్రీట్ చేసేటట్లు వాళ్ళని ఏడ్యుకేట్ చెయ్యవచ్చు కదా..?”, అన్నాడు.
దానికి సుబ్బారావు, ” జీవితం ముఖ్యం సార్..వాళ్ళు బతికే బతుకు లో, సమాజం లో లేని దాన్ని మనం చెప్పినా పాటించటం కష్టం..ఒక వేళ చెప్పినా, వాళ్ళు చాలా మానసిక శ్రమ పడి కుల భావనని అధిగమించాల్సి వస్తుంది. దాని వలన వాళ్ళకు ఒరిగేది ఏమిటి? మీకు కుల స్పృహ లేక పోవటం సహజం గా వచ్చింది..వాళ్ళకు అలా కాదు.”
“కానీ కులాల వలన కొట్లాటలు ఎక్కువ అవుతాయి కదా..”,అన్నాడు హారీ.

“కులాల వలన అనే కంటే డెమోక్రసీ వలన ఎక్కువ అయ్యాయి..దేశం లో వోట్లు లేనప్పుడు ప్రతి వాడికీ తన కులం పై అభిమానమూ గౌరవమూ ఉండేవి…ఈ రాజకీయ నాయకుల వలన కుల స్పర్ధలు పెరిగాయి..ఎదుటి కులాల పై అసహ్యం పెరిగింది..అయినా కులాన్ని మంచికి కూడా ఉపయోగించవచ్చు.. ఇది మన మిలిటరీ లో చూస్తూంటాం..జాట్ రెజిమెంట్ అనీ, రాజ్ పుతానా రైఫిల్స్ అనీ.ప్రజలు కూడా ఒక రెడ్డే అంత నిస్వార్ధం గా ఉండగలడు..లేక ఒక వెలమే ఇంత నిజాయితీ గా ఉండగలడు అనుకోగలిగితే దాని వలన జాతికీ సమాజానికీ ప్రయోజనమే” అన్నాడు సుబ్బు.

హారీ కరక్టే అన్నట్లు తల ఊపి, తన ల్యాప్-టాప్ తీసి ఏవో నోట్స్ రాసుకోసాగాడు.
***********
ట్రెయిన్ కదులుతూ ఉండగా ఝాన్సీ పక్క కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేసింది. జీన్స్ పాంటు వేసుకోవటం వలన పడకుండా నిల దొక్కుకుంది. ఆమె ఒక ఆడ్ కంపెనీ లో పని చేస్తోంది. పెళ్ళి అయ్యి ఓ రెండేళ్ళయ్యింది..విడాకులిచ్చి ఓ సంవత్సరం అయ్యింది. ఝాన్సి కాలేజీ రోజుల నుంచీ ఫెమినిజం పేరుతో పురుష ద్వేషాన్ని అలవరుచుకొంది. ఆమె మాజీ భర్త రఘు రాం పాత కాలపు మనిషి. ఎలానో కష్టపడి ఝాన్సీ ని ఒప్పించి, ఇద్దరికీ విజయవాడ లో అరేంజిడ్ మారేజీ చేశారు వాళ్ళ పెద్ద వాళ్ళు. ఇద్దరి ఉద్యో గాలూ హైదరాబాద్ లోనే.
శోభనం రాత్రి రఘు రాం, “ఇలా రావే” అంటే, ఝాన్సి “రాను, పోరా!”,అంది. ఈ పరిస్థితి  పెళ్ళైన నాలుగు నెలలకీ మారక పోయేసరికి రఘు రాం ఆమె ఫ్రిజిడ్ అని నిర్ధారణకి వచ్చేశాడు. డాక్టర్ కి చూపిద్దాం అంటే,”నువ్వే చూపించుకోపో..మంచం మీద అసహ్యమైన పనులన్నీ చెయ్యమంటావ్”,అంది.
ప్రతి రోజూ “సమాజమూ వ్యవస్థా ఆడవాళ్ళకి చేస్తున్న అన్యాయం” అని రఘు రాం కి ఓ గంటైనా క్లాస్ పీకేది ఝాన్సి. మధ్యాహ్నం ఇద్దరూ ఆఫీస్ల లో భోజనం చేసే వాళ్ళు. రాత్రి రఘురాం బయటి నుంచీ తెచ్చే వాడు. ఒక రోజు రాత్రి రఘురాం ఝాన్సి ని అన్నం వండమంటే, “నువ్వే వండ రాదూ..నేనే ఎందుకు వండాలీ ఆడదాన్నని అలుసు కాక పోతే. ఈ వ్యవస్థే ఆడదాన్ని దాసీ గా పడి ఉండమంటుంది?”,అంది.
రఘురాం,” ప్రపంచం లో రెండు రకాల న్యాయాలున్నాయి..ఒకటి సహజ న్యాయం, రెండు సామాజిక పరమైన న్యాయం. సహజ న్యాయం ప్రకారం మగాడు రక్షణ,పోషణ బాధ్యత తీసుకొంటే ఆడది సంసారాన్ని చక్క దిద్దుకోవాలి. ఈ న్యాయం లో మగాడు బలవంతుడు కాబట్టీ అతని మాటలను ఆడది వినవలసి వచ్చేది..అలానే శారీరకం గా బలవంతుడైన మగాడి మాట బలహీనుడైన మగాడు వినవలసి వచ్చేది. తరువాత వ్యవస్థ మారి మనిషి సాంఘిక న్యాయాన్ని ఏర్పరుచుకొన్నాడు.  మగాడు ఆడదానికి శతృవు ఐతే,ఆడ దానిని సమానం గా చూసే చట్టాలు ఎక్కడి నుంచీ వచ్చినై..ఆడ వాళ్ళని గౌరవించే విలువలు ఎక్కడి నుంచీ వచ్చినై. ఇవన్నీ మగాడి సహకారంలేకుండా రావు కదా. ముందు రాజ్యమంతా మగాడిదే..మగాడి అనుకూలత లేకుండా వ్యవస్థ ఇలా మారదు కదా. కాబట్టీ మగాడు ఆడదానికి శతృవు అనే ఆలోచన మానుకో”,అన్నాడు
“ఆ చెప్పావులే వెధవ కబుర్లు..ఇవన్నీ మగ పందులు కూసే కూతలే. ఆడ వాళ్ళు పోరాడి సాధించుకొంటేనే ఈ స్వేచ్చలన్నీ వచ్చాయి”, అని దుప్పటి ముసుగెట్టింది ఝాన్సి.
రఘు రాం కి కాలి దుప్పటి లాగి, ఇంటి తలుపులు మూసి,”ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాము..ఈ పురుషాధిక్య సమాజం లేదు..వ్యవస్థా లేదు..మనమిద్దరమూ అంటే ఆడా మగా మాత్రమే ఉన్నాము. నీ ప్రకారం మనిద్దరమూ శతృవులం”, అని ఝాన్సి కింద పడే దాకా పెడీ పెడీ కొట్టాడు.
ఝాన్సి లేచి, “ఆడ దానిని కొట్టేవాడివి నువ్వూ ఒక మగాడివేనా?”, అని అతని మొహం మీద ఊసింది.
రఘురాం, “ఏం ఆడదేమన్నా దిగి వచ్చిందా..ఆడ దానిని కొట్టగూడదన్న నియమం కూడా ఈ పురుషాధిక్య వ్యవస్థే పెట్టింది. ఆ నియమం ఆడదాన్ని అవమానించినట్లే కదా. ఈ నియమం ప్రకారం ఆడది తక్కువ అని అంగీకరించినట్లేగా”, అని మళ్ళీ పిచ్చి గా కొట్టటమ్మొదలు పెట్టాడు.
కాసేపటికి దెబ్బలు కొట్టి రఘు రాం, తిని ఝాన్సీ అలిసి నిద్ర పోయారు.
మరుసటి రోజు రఘురాం ఏమీ జరగనట్లు గానే స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళి పోయాడు.
లంచ్ అయ్యిన తరువాత ఎవరో పోలీస్ ఇన్స్ పెక్టర్ వచ్చాడని తెలిస్తే బయటికి వచ్చాడు రఘు రాం.  ఇన్స్పెక్టర్ నాన్ బెయిలబుల్ గృహ హింస కేసు కింద రఘు రాం ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. పాపం రఘు రాం, పెళ్ళాన్ని తన్నే ఆవేశం లో సమ కాలీన వ్యవస్థ లోని నియమాలని కొద్ది సేపు మరిచిపోయినందుకు తగిన శిక్ష అనుభవించాడు.
పక్క కంపార్ట్మెంట్ లోంచీ నడిచి ఝాన్సి వచ్చి హారీ కి ఎదురు గా కూర్చొంది.

*****************************

Vja-Paddy

Vja-Paddy

ఝాన్సి పక్కనే ఉన్న సుబ్బారావు ని మనసు లో పురుగును చూసినట్లు చూసి, పైకి మాత్రం,”కొంచెం దూరం గా జరుగుతారా?” అంది.
చిట్టి బాబు ఝాన్సి వైపు చూసి, “కాజల్ అగర్వాల్ లా మంచి ఫిగరేనే”, అనుకొన్నాడు.
సుబ్బారావు ఝాన్సి ని, ” మీరు హైదరాబాదు కా ముంబై కా అన్నాడు”
ఝాన్సి, “ఆ రెండు చోట్లకీ కాదు..అమెరికా కి..ఏ మీరు కూడా వస్తారా?”,అంది వెటకారం గా.
సుబ్బారావు,హారీ వైపు చూపించి, “ఈ సార్ అమెరికా నుంచీ వచ్చారు. అమెరికా మొత్తం తెలుసు ఆయన కి. మీకు కావాలంటే అమెరికా మొత్తంచూపిం చేస్తాడు”, అన్నాడు వెకిలి గా.

హారీ వీళ్ళ సంభాషణ లోని లో గుట్టు అర్ధం కాక, ఝన్సి వైపుకి చేయి సాచి,”హాయ్ అయాం హారీ..అయాం ఫ్రం కాలిఫోర్నియా”, అన్నాడు.

ఝాన్సి హారీ ని ఒక్క సారి చూసి అతని ఆక్సెంట్ విని అతను నిజం గా అమెరికా వాడే అని నిర్ధారించుకొంది. ఝాన్సి కూడా అతనికి షేక్ హాండిచ్చి తనను పరిచయం చేసుకొంది. ఝాన్సి కి ఇండియన్ మగాళ్ళంటే ద్వేషమే కానీ అమెరికన్ మగాళ్ళంటే ద్వేషంలేదు, పైగా అభిమానం కుడా. హారీ కిటికీ లోంచీ చెట్టూ పుట్టా గొడ్డూ గోదా చేలూ పొదలూ చూస్తూంటే, ఝాన్సి మాత్రం అప్పుడప్పుడూ హారీ ని దొంగ చూపులు చూస్తోంది.అలా  చూడనప్పుడు మాత్రం హారీ తననే చూస్తున్నడని అనుకొని సిగ్గుపడుతోంది.
మధ్య మధ్య లో తాను ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కి అమెరికా వెళ్ళినట్లూ. తన కాలేజీ కి హారీ వచ్చినట్లూ..ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళినట్లూ అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసినట్లూ ఏదేదో ఊహించుకొంటూంది. ఇంతలో రఘు రాం గుర్తుకొచ్చాడు..”ఛీ… ఆ మగ పంది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాడు?..మూడ్ పాడు చేశాడు వెధవ..నిజ జీవితం లోనూ వాడి వలన సుఖం లేదు ఊహా జీవితం లోకి కూడా వస్తున్నాడు”, అనుకొని స్టేషన్ లో తను కొన్న ఫెమినా తీసి చదవ సాగింది.
***********

khammam

khammam

ట్రెయిన్ ఖమ్మం లో ఆగింది. అరవై ఐదేళ్ళ విస్సంసెట్టి నరసింహ మూర్తి ఆప  సోపాలు పడుతూ ఎక్కాడు ట్రెయిన్. వచ్చి చిట్టి బాబు పక్కన కూర్చున్నాడు.

సుబ్బారావు మూర్తి ని, “ట్రెయిన్ ఖమ్మం నుంచీ సికిందరాబాదు చేరటానికి ఎంత టైం పడుతుందండీ?”, అన్నాడు.
మూర్తి, “ఏమో తెలియదు భై, మూడు గంటలుండొచ్చు”,అన్నాడు.
“మా కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం లో తెలంగాణా ఉద్యమం ఎలా జరుగుతోంది?”, అన్నాడు సుబ్బారావు.
మూర్తి అసలు ప్రశ్నను వదిలేసి, “ఆ ఏం కమ్యూనిస్టుల్లే..ప్రపంచం ల ఎక్కడైనా కమ్యూనిజం వస్తదేమో గానీ ఇండియాల మాత్రం రాదు”,అన్నాడు.
“అయ్యో ఒక్క సారి అలా అనేశారేంటి..!నేనసలే కమ్యూనిస్ట్ సానుభూతిపరుణ్ణి”
“ఇక్కడ చాలా విషయాలు ఉన్నై..కులాలూ..మతాలూ..ప్రాంతాలూ..ఒక పేద వాడున్నడనుకొందాం..వాడి కులంలోనే ఒకడు బాగా రిచ్ వాడు ఉన్నడనుకొందం..ఈ పేద వాడు ఆ ఉన్న వాడ్ని శతృవు గా చూస్తడా..లేక ఆరాధనా భావం తో చూస్తడా..నూటికి నూరు పాళ్ళూ అభిమానిస్తడు..మా కులపోడే అంత పైకి పోయిండని..ఖేల్ ఖతం…ఇంక కమ్యూనిజం ఎలా వస్తది”, అన్నాడు మూర్తి.
హారీ కల్పించుకొని,”అయితే ఇండియా కు కమ్యూనిజం వచ్చే రిస్కు లేదన్న మాట!”
సుబ్బారావు, “కమ్యూనిజం అయితే ఇప్పట్లో రాదు..ఇక అది రిస్కా లేక వరమా లేక శాపమా అనేది మీరు కమ్యూనిస్టులా కాపిటలిస్టులా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది”,అన్నాడు.

చిట్టి బాబు కి వీళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్కా అర్ధం కావటం లా. తన మొబైల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని “ఆర్యా” పాటలు వినటం లో మునిగి పోయాడు. ఝాన్సి ఫెమినా లోకి దించిన తల ఎత్తలేదు.

***********************

“మీదే ఊరండీ?”,సుబ్బా రావు అడిగాడు నరసింహ మూర్తి ని.
“మాది ఖమ్మం దగ్గర వైరా. నాకు అక్కడ భూములున్నాయి అవి చూసుకొని వస్తున్నా”,అని జేబులోంచీ ఏదో మాత్ర తీసి  నీళ్ళ కోసం చూశాడు..ఎవరి దగ్గరా నీళ్ళ బాటిల్ లేదు..హారీ నీళ్ళు కూడా అయ్యిపోయాయి.మళ్ళీ టాబ్లెట్ జేబులో పెట్టుకొన్నాడు మూర్తి.
“మీ ఫామిలీ ఎంత మందండీ?”అన్నాడు సుబ్బా రావు.
“నా భార్య ఉంటుండె.ఇప్పుడు ఆమె చని పోయింది..ఉండుడు హైద్రవాద్ లోనే..ఓక పనిమనిషి వండి పెడుతుంది. నాకు ఒక్కడే కొడుకు వాడు “శానోసే” ల ఉంటడు”
“మీరు మరి మీ అబ్బాయి దగ్గరే ఉండక పోయారా?”
“అక్కడ మనకు బాతాఖానీ కి ఎవరు? దొరుకుతరు.హైద్రావాద్ లో నా ఆల్విన్ కొలీగ్స్ ఉంటరు..మా ఫ్రెండ్స్ మస్తున్నరు..వాల్లతో టైం పాస్ ఐతది..ఐనా వాడూ రమ్మంటుండు..అక్కడికి పోయేవాల్లు తోడు దొరికితే పోతా..”,అన్నాడు మూర్తి.
సుబ్బా రావు యధా విధి గా హారీ ని చూపించి, “ఈయన కూడా కాలిఫోర్నియా లో నే ఉండేది..మీకు తోడొస్తారేమో..”, అన్నాడు.
హారీ పెదాలు బిగించి మూర్తి తో చేయి కలిపి, “యా స్యూర్..ఎనీ టైం..ఐ విల్ హెల్ప్ యూ..”,అన్నాడు.
హారీ మూర్తిని, “తెలంగాణా గురించి ఈ మధ్య చాలా గొడవ జరుగుతోంది కదా మీ అభిప్రాయమేమిటి?”, అని అడిగాడు.
మూర్తి చేతులు ముకుళించి ,”దాని గురించి తప్ప దేని గురించైనా మాట్లాడు బాబు”,అన్నాడు.
హారీ సుబ్బా రావు వైపుకి తిరిగి, “ఈయన సిగ్గుపడుతున్నాడు..నువ్వే తెలంగాణ గురించి ఒక చర్చ ఎందుకు మొదలు పెట్టకూడదు? “, అన్నాడు.
సుబ్బా రావు, “అదో పెద్ద విషయం..దాని గురించి మొదలుపెడితే ఇప్పుడు తేలే విషయం కాదు..ఈ సమైక్యాంధ్రా తెలంగాణా వాదనల్లో రెండు పక్షాల వాళ్ళూ తమ చెవులు మూసుకొని ఎదుటి వాళ్ళతో వాదిస్తున్నారు. ఏదైనా ఒక విషయం చర్చించాలంటే చర్చించే వాళ్ళు ఇద్దరూ కొన్ని విషయాల గురించి అంగీకరించాలి..చర్చ ప్రయోజనాలేమిటి? ఇద్దరూ ఏ విలువలనూ కొలమానాలనూ అంగీకరిస్తారు…? మొదలైనవి. అలానే ఇద్దరూ ఓపెన్ మైండ్ తో చర్చ లోకి వెళ్ళాలి..ఒక వేళ ముందే ఒప్పుకున్న విలువల ప్రకారం తమ వాదనా లేక పాయింట్ తప్పయ్యితే ఒప్పుకోవటానికి సిధ్ధం గా ఉండాలి..అవతలి వారి మీద గెలవాలి అనే ఉద్దేశ్యం తో చర్చకు ఉపక్రమించ కూడదు. అలానే చర్చ అనేది నాకు తెలియని విషయాలు తెలుసుకొంటాను అనే సత్యన్వేషణా స్ఫూర్తి తో చేయాలి. చర్చించేటప్పుడు ఎదుటివాళ్ళు చెప్పిన లెక్కలని విశ్వసించాలి..తమ లెక్కల గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలి…కానీ తెలంగాణా విషయం లో ఇరు వర్గాల చర్చల లో ఇది లోపించింది..భావోద్వేగాలు ఎక్కువైనాయి. ఈ భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి ఆలోచన భావోద్వేగాలకు దాస్యం చేస్తుంది..భావోద్వేగాలను బలపరచటానికే ఆలోచన ఉపయోగ పడుతుంది… కాబట్టీ ఈ చర్చల వలన ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు చర్చలలో సరైన పరిష్కారం అనేది ఏదీ ఉండకపోవచ్చు..ఎందుకంటే అది చర్చల లో పాల్గొనే వారి వ్యక్తి గత ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుంది..నాకు నేను గొప్ప మీకు మీరు గొప్ప. ఇద్దరూ ఎంతసేపు వాదించుకొన్నా ఎవరో ఒకరు గొప్ప వారు అని నిర్ణయించలేము కదా..అలా వాదించుకొనే కంటే ఇద్దరూ ముష్టి యుధ్ధానికి దిగటం సరైనది…”
హారీ అడ్డు తగిలి, “హేయ్..నేను చర్చ మొదలు పెట్టమంటే నువ్వు చర్చను గురించి మోనొలోగ్ మొదలు పెట్టావు. తెలంగాణా విషయం గురించి నీకు ఇంత భయముందని నాకు చెప్పలేదే..ఏమైనా నీకు నేను డబ్బులిచ్చేది జనాలను మాట్లాడించేందుకు..కానీ ఇప్పుడు నువ్వు చర్చలకు వ్యతిరేకం గా మాట్లాడుతున్నావు. కాబట్టీ నీ పేమెంట్ లోకొంత కట్..” అన్నాడు.
సుబ్బా రావు,”తెలంగాణా గురించి చర్చించటం కంటే అది వెయ్యి రెట్లు బెటర్”,  అన్నాడు.

****************

warangal

warangal

రైలు బండి వరంగల్ స్టేషన్ చేరింది..ఈ స్టేషన్ లో ’సుబ్బారావు అండ్ కంపెనీ’ కి ఎవరూ తోడవ్వలేదు.
ఝాన్సీ ఫెమినా మూసి అప్పుడప్పుడూ హారీ తో మాత్రమే మాట్లాడుతోంది..అమెరికా లో యూనివర్సిటీలు ఎలా ఉంటాయి…అక్కడ స్త్రీ స్వేచ్చ చాలా ఎక్కువ కదా…వగైరాలు అడుగుతోంది.
చిట్టి బాబు కి ఆర్య సాంగ్స్ వినీ వినీ బోర్ కొట్టినట్లుంది, సుబ్బారావు తో తానెప్పటికీ కొనలేని కార్ బ్రాండ్ల గురించి చర్చ మొదలు పట్టాడు.మూర్తి గారు చేరగిలపడి నిద్రపోతున్నారు. కాజీ పేట్ కూడా వచ్చి వెళ్ళింది.
చిట్టి బాబు ని వదిలించుకొని సుబ్బారావు హారీ తో అన్నాడు. “మన ప్రయాణం ఇంకో గంటన్నర లో అయిపోతుంది. దీని వలన మీరు ఏమైనా ప్రయోజనం కలిగిందా ?”

జవాబు గా హారీ తన లాప్-టాప్ సుబ్బారావు కి ఇచ్చాడు, చదవమంటున్నట్లు గా.
సుబ్బా-రావు చదవ సాగాడు…

“1. నేను ఈ ప్రయాణం మొదలు పెట్టింది నా రీసెర్చ్ కోసం ఏమైనా లోతైన విషయలు తెలుస్తాయేమో నని. కానీ రీసెర్చ్ కంటే నాకు వ్యక్తి గతం గా ఈ ప్రయాణం చాలా ఉపయోగపడింది. దీనికి ముందు ‘ఈ భారతీయ సమాజం ఇలా ఎందుకు చీలికలు పేలికలు గా ఉందా?’ అనుకొనే వాడిని. ఇప్పుడు నాకొకటి అర్ధమైంది. సమాజమనేది మన అంతర్గత ప్రపంచానికి ఒక ప్రతి-బింబం లాంటిది..సమాజం లోని ద్వేషం, అవినీతీ, ఓర్వలేనితనం… ఇవన్నీ మన మనసులలోంచీ పుట్టినవే! అలానే మన అంతర్గత ప్రపంచం కూడా సమాజం వలన ప్రభావితమౌతుంది.
2. ఈర్ష్యా, అసూయా, ప్రేమా, ద్వేషం, స్నేహం ఇవన్నీ మన మానసిక గుణాలు. వీటన్నిటికీ ‘నేను’ లేక అహం అనేది కేంద్రం. ఈ ‘నేను’ కి జాతీ మతం కులం దేశం మొదలైనవి అడ్రస్ లాంటివి. ఒక మనిషికి ఊరు వీధి లాంటి భౌతికమైన అడ్రస్ లు ఉన్నట్లే, అతని లో ఉండే మానసిక మైన వ్యక్తిత్వానికి  అస్థిత్వపరమైన అడ్రస్ కూడా ఉంటుంది. ‘నేను’ యొక్క అభిప్రాయాలూ ప్రవర్తనా ఈ అడ్రస్ కి అనుగుణం గా ఉంటాయి. నువ్వు అమెరికన్ ఐతే నీ అస్తిత్వ అడ్రస్ లోని పంక్తుల సంఖ్య తక్కువ గా ఉంటుంది. అదే, నువ్వు ఇండియా లో పుట్టిపెరిగితే,ఇక్కడి చారిత్రక, సామాజిక కారణాల వలన, నీ అస్తిత్వ అడ్రస్ లో కులమూ, మతమూ, భాషా, ప్రాంతమూ ఇవన్నీ కలిసి నీ అడ్రస్ చాలా పొడవు సాగుతుంది అంతే తేడా!అస్తిత్వ అడ్రస్ లేకుండా ఏ మనిషైనా భూమి మీది కొన్ని కోట్ల గుంపులో ఒకడిగా ఫీలయ్యి, తాను ఒక పనికి రాని దుమ్ము కణం గా భావిస్తాడు. అస్థిత్వాలు మనిషి పరిధిని అతని సమూహ పరిధికి పెంచి, అనంతమైన ఈ మానవ జాతి లో అతనికి ఒక స్థానాన్నీ, ప్రాముఖ్యతనీ ఇస్తాయి.

3. అయితే ఒకే మనిషి కి పరస్పర విరుధ్ధమైన రెండు అడ్రస్ లు ఉండ వచ్చు. ఉదాహరణ కు పేదవారిని అణగదొక్కటాన్ని వ్యతిరేకించే మనిషి ఆడ వారిని అణగ దొక్కటాన్ని సమర్ధించ వచ్చు. ఇది అతని అడ్రస్ లో ఉండే మగాడు అనే విషయం వలన. వ్యక్తిగత విషయాలలో ఈ వైరుధ్యం వలన నష్టం లేదు. భార్య నీ చెల్లి నీ ఒకే దృష్టి తో చూడలేము కదా! కానీ సమాజం లో ఇది తప్పు. ప్రభుత్వం తెలంగాణ నూ ఆంధ్ర నూ ఒకే దృష్టి తో చూడాలి కదా! సమాజం లో ఉండే అధికారం, ధనం, పేరు ప్రతిష్టలూ అనేవి పరిమితమైన వనరులు. ఈ వనరులకోసం, ఈ అడ్రస్ ల ను  తలలోకి ఎక్కించుకొన్న మనమందరం పోటీ పడతాం. ఈ పోటీ వలన, ఈ అడ్రస్ లు ప్రాతినిధ్యం వహించే దేశాల, మతాల, కులాల మధ్య ఘర్షణ తప్పదు.
ఇక పోతే,నా డియర్ ఫ్రెండ్ సుబ్బా రావ్  చెట్టు కింద పొదలూ చెట్టు కాయల రుచీ కూడా చూశానన్నాడు.
నాకు కూడా ఆ రుచి తెలిసింది. ఒక సమాజాన్ని అధ్యయనం చేయాలంటే దాని సూక్ష్మ దృష్టి లోనూ స్థూల దృష్టి తోనూ కూడా చూడాలి. ఈ రైలు ప్రయాణం వలన నాకు సూక్ష్మ దృష్టి ఏమిటో తెలిసింది. అలానే అమెరికన్స్ ఎక్కువగా బుధ్ధి ఉపయోగించి ఆ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఇండియన్స్ భావోద్వేగాలు ఉపయోగించి ఎమోషనల్ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు హృదయాన్ని కూడా ఉపయోగించాలని కూడా ఈ ప్రయాణం నాకు చెప్పింది”

….సుబ్బా రావు లాప్-టాప్ మూసి హారీకిచ్చి,”బాగున్నాయి సార్, మీ నోట్స్..!” అన్నాడు.

హారీ వాలెట్ తీసి, “నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా..ఎంత ఇవ్వమంటావు?” అన్నాడు
“ఈ ప్రయాణం వలన నాకు కూడా లాభం కలిగింది. కాబట్టీ మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు”
“ఏమి లాభం?”
“మనిషి కి కులం కంటే మతంకంటే స్వార్థం అనేది ముఖ్యం అని తెలిసింది. ఈ స్వార్థమూ మీరు చెప్పిన నేను అనే కేంద్రమూఒక్కటే. కానీ ఈ కేంద్రం హైదరాబాద్ ట్రాఫిక్ లా చాలా గందర గోళమైనది. ఈ స్వార్ధం లో మనిషిని వివిధమైన దిక్కులలో కి లాగే పరస్పర విరుధ్ధమైన అనేక శక్తులు ఉంటాయి. నిజాన్ని తెలుసుకోవాలంటే వీటన్నిటినీ అధిగమించ గలగాలి. ఇదీ నా పాఠం”,అన్నాడు సుబ్బారావు.
హారీ ,”నాకు అందరి కులాలూ మతాలూ జాతులూ తెలిశాయి. కానీ, ఇవన్నీ నాకు తెలియటానికి కారణమైన నీ కులం మాత్రం నాకు తెలియ లేదు” అన్నాడు సుబ్బారావు తో.
“నాకూ ఒక కులముంది సార్…అదే మనిషి కులం!”, అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
“నాది కూడా అదే కులం”,అన్నాడు హారీ సీరియస్ గా.
సీట్లో నిద్ర పోతున్న మూర్తి గారు సీట్ మీదికి ఒరిగి పడి పోయాడు. సుబ్బారావు చెయ్యి పట్టుకుంటే చల్ల గా తగిలింది. హారీ, ఝాన్సీ, చిట్టి బాబు లేచి దగ్గరకు వెళ్ళారు. భోగీ లో మిగిలిన ప్రయాణికులు కూడా వచ్చి గుమి కూడారు. ఇంతలో ప్రయణికులలో ఒక డాక్టర్ లా ఉన్నాడు, అతను వచ్చి మూర్తి గారి చెయ్యి చూసి ముక్కు దగ్గిర చెయ్యి పెట్టి పెదవి విరిచి, “హి ఈజ్ డెడ్!!”, అన్నాడు.
సుబ్బారావు మూర్తి గారిని బెర్త్ మీద సరిగా పడుకోబెట్టాడు. చిట్టి బాబు ఇంకా షాక్ నుంచీ తేరుకోలేదు. అతను చూసిన మొదటి మరణం ఇదేలా ఉంది. హారీ మూర్తి జేబు లోంచీ మొబైల్ బయటికి తీశాడు. దాంట్లో రెండే నంబర్లు ఉన్నాయి. మొదటి నంబర్ డయల్ చేశాడు.అమెరికా నంబర్ అది. అవతలి మనిషి లేడు. వాయిస్ మెయిల్ బాక్స్ లోకి వెళ్ళింది.
రెండో నంబర్ డయల్ చేశాడు.
“గుడ్ హెవెన్స్ ఎలక్ట్రిక్ క్రెమటోరియం”…
హారీ ఫోన్ సుబ్బారావు కి ఇచ్చాడు. సుబ్బారావు కాసేపు మాట్లాడి చెప్పాడు. మూర్తి గారు ముందు గానే క్రెమటోరియం కి డబ్బులు ఇచ్చి, ఆయన స్నేహితుల ఫోన్ నంబర్ల లిస్టు ఇచ్చారంట. వాళ్ళు స్టేషన్ కి వాన్ పంపిస్తారట..అలానే మూర్తి గారి అబ్బాయి ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉందట..వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు..తన దహన క్రియల గురించి వివరమైన సూచనలు ఇచ్చారంట వాళ్ళకి”, అని చెప్పాడు.

మూర్తి దేహం పై ఈగలు వాలసాగాయి. ఝాన్సీ తన బాగ్ లోంచీ షాల్ తీసి కప్పింది మూర్తి పై.
“చావు లో మనుషులందరూ ఒక్కటౌతారు కాబోలు!!”, అనుకొన్నాడు హారీ.

అయిపోయింది

మన రాజకీయ నాయకులను సమర్ధిస్తూ..

In praise of politicians

In praise of politicians

రాజకీయ నాయకులు నిజ జీవితం లో జరిగే సంఘటనలకు ఆలోచించుకొనే వ్యవధి లేకుండా వెంటనే ప్రతిస్పందించాలి. రాజకీయ నాయకుడు కావటానికి రిస్క్ తీసుకొనే మనస్థత్వం తో పాటు, ఒత్తిడి కి లోనవ్వకుండా ఉండటం చాలా అవసరం. ప్రత్యర్ధులు చేసే ఆరోపణలు ఎదుర్కొనటానికి కొంత తోలు మందం కూడా అవసరం.ఏదైనా దుర్ఘటన జరిగినపుడు మిగిలిన జనాలంతా తమ కడుపు లో చల్ల కదల కుండా ఇంట్లో టీవీ ల ముందు కూర్చుంటే, రాజకీయ నాయకుడు సంఘటనా స్థలానికి వెళ్ళి జనాలకి ధైర్యం కలిగించాల్సి ఉంటుంది.

ఇంట్లో కూర్చొని ఒక కథ రాయటానికి కొంత తెలివి కావాలి. చదరంగం ఆడటానికి దీనికంటే కొంచెం ఎక్కువ తెలివే కావాలి. ఎందుకంటే చెస్ ఆడటానికి స్పాంటేనిటీ కావాలి. కథ రాసేటప్పటి లా తీరిక గా కూర్చొని ఆలోచించుకొని రాస్తానంటే కుదరదు. అంతే కాక ప్రత్యర్ధి ఎప్పుడూ మన ఎత్తులకు  పై ఎత్తులు వేస్తూనే ఉంటాడు. అతనిని ఓడించే విధం గా మనం ఆలోచించాలి. రాజకీయాలకు చెస్ ఆడే టప్పటి కన్నా చురుకైన తెలివి కావాలి. ఎందుకంటే ఇక్కడ సమాజం లోని అనేక పరిమితులకి లోబడి ఎత్తులు వేయాలి. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణం గా మాట్లాడాలి.

మనం ఆఫీసు క్యాంటీన్ లో కబుర్లు చెప్పుకొనేటప్పుడూ, స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడే టప్పుడూ, “దేశాన్ని రాజకీయ నాయకులు ఎంతగా దోచేస్తున్నారో!”, అని వాపోవచ్చు. కానీ మనలో చాలా మంది మన మన పరిధులలో రాజకీయ నాయకులమే! మనం గృహ రాజకీయాలు చేస్తాం. ఆఫీసు రాజకీయాలు చేస్తాం. ఆదర్శాల గురించి మాట్లాడే రచయితలూ, ప్రజలను బ్రతికించాల్సిన డాక్టర్లూ వారి వారి పరిధులలో రాజకీయాలు చేసే వారే. అన్ని వృత్తులలానే, మానవ స్వభావం నుంచే రాజకీయాలు పుట్టాయి.ప్రపంచం లో అన్ని వృత్తుల వారూ రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు తమ వృత్తే అయిన రాజకీయాలు చేయటం లో తప్పేముంది?
మనలో,ఆఫీసులలో మెడికల్ అలవెన్స్ కి దొంగ బిల్లులు పెట్టని వారు ఎంత మంది? ఇల్లు అమ్మే లావాదేవీ లలో నల్ల ధనం తీసుకోని వారు ఎంత మంది? సమాజం మొత్తం అవినీతి మయమైనపుడు, కొంత లాభదాయకమైన పదవులలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా చేతులు ముడుచుకొని కూర్చొంటారు? మనలో చాలా మంది ఆ పదవులలో ఉంటే, అంత కంటే అవినీతి పరులయ్యే వారు. రాజకీయుల అక్రమ సంపాదన గురించిన మన ఆగ్రహం లో అసూయ పాలు ఎంతో, మనం ఆత్మ విమర్శ చేసుకొంటే తెలుస్తుంది.మనం చేసే అవినీతి, మనకున్న పరిమితమైన పరిధి వలన ప్రాచుర్యం లోకి రాదు. రాజకీయ నాయకుల అవినీతి వారికున్న పేరు వలన నలుగురికీ తెలిసి, ప్రత్యర్ధుల ఆరోపణలతో మీడియా ద్వారా పబ్లిక్ షో గా మారుతుంది. రాజకీయ నాయకులంతా అవినీతిపరులని ప్రజలు భావించే ఈ కాలం లో, ఎవరైనా నాయకుడు నిజాయితీ గా ఉన్నా అతని పై బురద జల్లటం ఈజీ.  “అతను పలానా అవినీతి చేశాడు” అంటే వాస్తవం గా అతను చేయక పోయినా ప్రజలు నమ్మే స్థితి ఉందీవేళ దేశం లో.

మనకు అవకాశం లేకో,డబ్బులేకో, రిస్క్ తీసుకొనే ధైర్యం లేకో, సరైన పరిచయాలు లేకో, నాయకత్వ లక్షణాలూ తెలివీ లేకో, మనం రాజకీయ నాయకులం అవ్వలేదనేది వేరే విషయం.చిన్న చిన్న ఆఫీసు రాజకీయాలకు ఇవేమీ అవసరం లేదు కాబట్టీ, మనం అక్కడ రాజకీయాలు చేస్తాం. రాజకీయుల మీదికి రాళ్ళు విసరటానికి మనలో చాలా మందికి అర్హత ఉండదు. ఎందుకంటే, ఏ పాపం చేయని వాడే ఆ రాళ్ళు విసరాలి కాబట్టీ!

రాజకీయ నాయకులు వెధవలైనపుడు,రాజకీయం సులువైతే, రాజ కీయం లాభసాటి అయ్యినపుడు, మనమే ఎందుకు రాజకీయాలలోకి ప్రవేశించకూడదు? లేక పోతే, మన పిల్లలను  ఎందుకు రాజకీయాలలోకి ప్రోత్సహించకూడదు?  మనం ప్రోత్సహించం..ఎందుకంటే దానిలో ఉన్న రిస్క్ మనకు తెలుసు కాబట్టీ..రాజకీయాలలో విజయం సాధించాలంటే దానికి అవకాశం వెయ్యి లో ఒకటి కూడా ఉండదు కాబట్టీ. అక్కడ సక్సీడ్ అయ్యే లోగా మనకున్న కొంత డబ్బూ పోగొట్టుకొనే అవకాశం ఎక్కువ కాబట్టీ. కడుపులో చల్ల కదలకుండా కబుర్లు చెప్పుకొనే అవకాశం అక్కడ ఉండదు కాబట్టీ.

ఇక పోతే, రాజకీయ పార్టీల విధానాల గురించీ, వాటి సిధ్ధాంత లేమి గురించీ, వచ్చే ఎన్నికలను దాటి చూడలేని హ్రస్వదృష్టి గురించీ మనం చాలా విమర్శలను పత్రికా సంపాదకత్వాలలో చదువుతూ ఉంటాం.(అదే పత్రికా సంపాదకుడు తనకు ఎదురు తిరిగిన కింది ఉద్యోగిని రాజకీయాలు చేసి అణగదొక్కుతాడనేది గమనించవలసిన విషయం.) వాలు కుర్చీ లో కూర్చొని విమర్శలు చేయటం చాలా సులువు. రాజకీయాలు “సాధ్యమయ్యే విషయాల గురించిన ఒక కళ” అని ఒక నానుడి ఉంది. దీర్ఘ కాలికం గా సిధ్ధాంతం మన గలగాలంటే, ఆ సిధ్ధాంతాన్ని మోసే పార్టీ “ఇవాళ” బతికి బట్ట కట్టాలి. “ఇవాళ” పార్టీ బతకాలంటే, మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో, ఆ పార్టీ ఎన్నికలలో గెలవాలి. కమ్యూనిస్టులు ఒక సారి కాంగ్రెస్ తోనూ, ఇంకొక సారి తెలుగు దేశం తోనూ పొత్తు పెట్టుకొంటున్నారంటే, దానికి కారణం సిధ్ధాంతాన్ని ఒదిలేయటం కాదు. “దీర్ఘకాలికం గా వర్గ రహిత సమాజం సాధించటానికి, స్వల్పకాలికం గా కొన్ని రాజీలు చేసుకొంటున్నాం”, అనే ఆత్మ వంచన. ఇది ఆత్మ వంచన ఎందుకౌతుందంటే, “ఇప్పటి నుంచీ ఒక పదేళ్ళ తరువాత కూడా మన కమ్యూనిష్టులు ఇలాంటి స్వల్పకాలిక వ్యూహాలే అనుసరిస్తూ ఉంటారు”, కాబట్టీ.  వారి రాజీ కి అంతు లేదు. వారి దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు లో పెట్టే రోజు ఎప్పటికీ రాదు. సమైక్య వాద పార్టీ అయిన తెలుగు దేశం, ప్రత్యేక తెలంగాణా కి అనుకూలం గా మారటం కూడా ఇలాంటి కారణాల వలననే. ప్రత్యేక వాదానికి మద్దతునివ్వకుంటే “ఇవాళ” తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి మనుగడ లేదు. “ఇవాళ” బతికి బయట పడక పోతే ఆ పార్టీ కి “రేపు” ఎలా ఉంటుంది? రేపు లేని పార్టీకి, “ఒక దీర్ఘ కాలిక ఆదర్శం అయిన సమైక్య వాదం”, ఉండి కూడా ఉపయోగం లేదు.  రాజకీయ పార్టీలు “పార్టీ కి సిధ్ధాంతమే ముఖ్యం, సిధ్ధాంతం ఉండేది వోట్ల కోసం కాదు, వోట్లు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి” అనుకొంటే, మన వ్యవస్థ లో అలాంటి పార్టీ ల కథ మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుంది. గిరీశం చెప్పినట్లు, “అప్పుడప్పుడూ మాట మారుస్తూ ఉంటేనే”, రాజకీయ పార్టీలు తమ మనుగడ సాగిస్తాయి.

డబ్బు తీసుకొని ఓట్లు వేసే జనాలు ఉన్నప్పుడు, ఆ డబ్బును పంచే రాజకీయ పక్షాలను తప్పుపట్టటం, కుల మత ప్రాంతాలను చూసి రెచ్చిపోయి కొట్టుకొనే జనాలు ఉన్నప్పుడు, వాటిని ఉపయోగించుకొనే పార్టీలను తప్పుపట్టటం, తాగిన వాడిని కాక అమ్మిన వాడిని కొట్టినట్లు ఉంటుంది.

జనాల మీదకి బూమరాంగ్ కా బోతున్న జనాలతీర్పు

ఈ మధ్య నితీష్ కుమార్ బిహార్ ఎన్నికల్లో గెలవటం గురించి మీడియా “ఇది అభివృధ్ధికి ప్రజలు వేసిన వోటు” అని ఊదరకొట్టింది. కానీ నాకు నమ్మబుధ్ధి కాలేదు.
మన రాష్ట్రం లోనే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే …
చంద్ర బాబు ఎన్నికల్లో గెలిచి రెండవ సారి అధికారం లోకి వచ్చాడు. అప్పుడు కూడా మీడియా ఇలానే అభివృధ్ధి కీ వోటు అని చెప్పింది.
తరువాత చంద్ర బాబు నా దృష్టి లో మంచివైన రెండు విషయాలలో సరిగా వ్యవహరించాడు.
1. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవటం…. విద్యుత్ సంస్కరణల విషయం లో కానీ, …అనేక కార్పొరేట్ సంస్థలను రాష్ట్రానికి తీసుకొని రావటం లో కానీ చంద్ర బాబు చేసినది సరైనదే అనుకొంటాను
2. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిష్పాక్షికత: కొంతవరకూ, పార్టీ కీ వంది మాగధులకూ ప్రభుత్వం లో ప్రాబల్యాన్ని తగ్గించటం.దీని వలన దిగువ స్థాయి లో అవినీతి ని తగ్గింది.

కానీ తరువాతి ఎన్నికలలో ఈ రెండు పధ్ధతులూ చంద్ర బాబుకి వ్యతిరేకం గా పని చేసి అతన్ని మట్టిగరిపించాయి. వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్తూ, ఇతర వరాలూ, సామాజిక, రాజకీయ సమీకరణ లూ అతన్ని ముఖ్యమంత్రిని చేశాయి.
వై ఎస్ ఆర్ చంద్ర బాబు కి పూర్తి భిన్నం గా వ్యవహరించి అస్మదీయులకు పట్టం గట్టారు. అనేక ప్రజాకర్షక పధకాలు ప్రవేశ పెట్టి రెండవ సారి కూడా అధికారం లోకి రాగలిగాడు.
ఈ సమయం లో చంద్ర బబు తన గుణపాఠాలను నేర్చుకొన్నట్లు కనపడుతోంది. ఆయన రైతుల పేరు తో దీక్షలు చేస్తున్నారు.ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు.  వీటన్నిటితోనూ జనాలలో ఆవేశ కావేశాలను రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మళ్ళీ అధికారం లోకి వస్తే ఇక దీర్ఘ కాలిక విధానాలకు ఇంతకు ముందు ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వక పోవచ్చు. అలానే అస్మదీయులను ప్రభుత్వ కార్యకలాపాల నుంచీ దూరం గా పెట్టేతప్పు? చేయక పోవచ్చు.
ప్రజాస్వామ్యం లో ఉన్న ఒక లొసుగు ఏమిటంటే “జనాలకు తగ్గ పాలకులు” వస్తారు. యధా ప్రజా తధా రాజా. అలానే జనాలు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలకు చివరికి జనాలే బలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు జనాల ను ఎలా మభ్య పెట్టి అధికారం లోకి రావాలా అని చూస్తాయి. అందుకే జనాల తీర్పు జనాలమీదికే బూమర్యాంగ్ అవుతుంది.

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers