ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…

ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…
హర్యానా లో ఖాప్ పంచాయితీ లు ఒకే గోత్రం లో వివాహాలకి అడ్డు చెప్తున్నాయి. దీని గురించి సో కాల్డ్ స్త్రీ వాదులూ, “ఎన్ జీ ఓ లూ”, కోర్ట్ లూ చాలా గందర గోళం చేస్తున్నారు.
ఇదే విషయం మన రాష్ట్రం లో తీసుకొంటే, ఒకే కులంలో, ఒకే ఇంటి పేరు లేక గోత్రం కల స్త్రీ పురుషులు వరుసకు అన్నా చెల్లెళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ అవుతారు. మరి అలాంటి వారి మధ్య వివాహ సంబంధాన్ని మనం ఆమోదిస్తామా? ఇప్పుడు ఇలాంటి సంబంధాలను ఆమోదిస్తే తరువాత కుటుంబ వ్యవస్థ గతేమిటి. అప్పుడు ఇన్సెస్ట్ తో కూడిన సంబంధాలను కూడా ఆమోదించవలసి వస్తుంది కదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలేమిటి?

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…

మొన్న రిచర్డ్ ఫేన్మాన్ ఉపన్యాసాలు చదవటం పూర్తి చేసిన తరువాత దానిలోని విషయాల గురించి టపా వేద్దామనుకొన్నా. కానీ టైం లేక, వేయలేక పోయాను.
ఇవాళ ఆకాశరామన్న గారి ఉత్తరం చూస్తుంటే ఫేన్మాన్ చెప్పినవి గుర్తుకొచ్చాయి. అలానే అంతకు ముందు మతం గురించి చాలా వేడి వేడి చర్చలే నడిచాయి(కృష్ణ గారి టపా లో ).

వీటన్నిటి ప్రభావం తో ఆకాశ రామన్న గారి టపాలోకామెంటుదామనుకొంటే ఈ కింది చాట భారతం వచ్చింది.
ఇంత వచ్చింది కదా అని కొత్త టపా మొదలెట్టా. ఈ టపా మతానికి అనుకూలమూ కాదు,ప్రతికూలమూ కాదు. దీన్ని “గోడ మీది పిల్లి” టపా అనుకోండి. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కూడా ఉద్దేశింపబడలేదు.

హమ్మయ్య డిస్-క్లెయిమర్లు అయ్యాయి కదా, ఇక నా ఆలోచనలు ఇక్కడ…
ఫేన్మాన్ గారి ఉపన్యాసం వలన నాకు అర్ధమైనది ఏమంటే మతమూ సైన్సూ రెండిటినీ కూడా మనిషి తన బాగు కోసమే అభివృధ్ధి చేసుకొన్నాడు. చూడండి మనిషి ఎంత స్వార్థ పరుడో! కాబట్టీ మనిషి కోసం మతమూ,సైన్సూ. మతమూ,సైన్స్ కోసం మనిషి కాదు. అలానే చివరికి మనిషి కోసం కమ్మ్యూనిజం, కాపిటలిజం మొదలైన సిధ్ధాంతాలు. సిధ్ధాంతాలు సిధ్ధాంతాలకోసం మాత్రం కాదు.
మతం సరైనదై మనిషి దారి తప్పినప్పుడు నాగరిక సమాజం మనిషిని ముందు దారిలోకి తేవాలి.
మతమూలేక సైన్స్ ఒక కత్తి అనుకొంటే, కత్తిని తయారు చేయటం లోనే మనిషికి స్వార్థం ఉంది. అది తన సర్వైవల్. అలాంటి మనిషి కత్తిని స్వార్థం కోసం ఉపయోగించడని గారంటీ ఏమీ లేదు. కత్తిని పొదలను నరికే మంచి పనికీ వాడవచ్చు. అలానే ఎదుటి వాడి గొంతు కోసే చెడ్డ పనికీ వాడ వచ్చు. ఈ రెండిటిలోనూ కత్తి తప్పు ఏమీ లేదు అది ఉపయోగించే మనిహి తప్పు. ఇక్కడి వరకూ సూటి గా ఉంది కదా. సమస్య కొన్ని తుప్పు పట్టిన కత్తులు మనిషి తమను ఎలా ఉపయోగించ గలడో తమ( కత్తుల) చేతుల్లోనే ఉంది అని భ్రమ కలిగించినపుడు…….

సైన్స్ అనేది ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో చెప్తుంది. కానీ మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో చెప్పలేదు. అలానే ప్రపంచం ఎందుకు పని చేస్తుంది? మనుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు సైన్స్ కి తెలియదు. మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో మతం చెప్తుంది. ఐతే ఒక్కోమతం ఒక్కో దిక్కు సూచిస్తుంది. దీని వలన హింస పెరుగుతుంది. అందుకే మానవ జాతి అంతటికీ ఆమోద యోగ్యమైన దారి కనపడే దాకా మనం మన మనసు ని అన్ని మార్గాలకూ తెరుచుకొని ఉంచటం మంచిది.

సైన్స్ పరిశీలనా ప్రధానమైనది. మతం ఇంగితం తో కూడుకొన్నది. సత్య శొధన కు పరిశీలన ఒక్కటే మార్గం కాదు. ఇంగితం కూడా ఒక మార్గమే. ఐతే ఈ మార్గం సైన్స్ లో పనికి రాదు. మతానికి ఇంగితమే (ఇన్ ట్యూషన్) ప్రధానం.

ఇది చదివిన తరువాత మతం యొక్క ఆవశ్యకత గురించి నాకు కొంత క్లారిటీ కలిగింది…
జంతువులకి మతం లేదు. మనిషికి మతం ఉంది. అంటే మనిషి జంతువుల నుంచీ పరిణామం చెంది ఆలోచనలో కొంత స్థాయి వచ్చిన తరువాత మతం వచ్చింది.మతం కంటే ముందే మనిషి లోని లక్షణాలనీ ఏర్పడ్డాయి. కాబట్టీ మనిషి చేసే వెధవ పనులన్నిటికీ మతానిది బాధ్యత కాదు.మతం ఆధీనం లో లేని అనేక విషయాలు మనిషి లో ఉన్నాయి.

అలానే పాపులర్ మతం చెప్పుకొంటున్నట్లు మతం సర్వ రోగ నివారిణి కాదు. మీరు ఎప్పుడైనా క్రీస్తు సువార్త సభలో, లేక కొందరు బాబాల సభలో వింటే వాళ్ళు “మతానికి సాధ్యం కానిది లేదు” అనే భ్రమ కలిగిస్తారు. మీరు మా దేవుడిని/మతాన్ని నమ్మండి ఏదైనా సంభవం అంటారు. బహుశా అసలైన మతాధీశులు (చంద్రసేఖర సరస్వతి వారు కానీ, శంకరాచార్యులు కానీ, లేక క్రీస్తు కానీ) ఇలంటి క్లెయింస్ ఎప్పుడూ చేయరనుకుంటా…! ఒక మతాన్ని నమ్మిన వాడు ఏదైనా నేరం చేయగానే “వాడు నిజం గా మావాడైతే అలా చేయడు. కాబట్టీ వాడు మా వాడే కాదు” అనటం అవకాశ వాదం. నేరం చేసేదాకా మా వాడే అన్నప్పుడు, నేరం చేసిన తరువాత కూడా మా వాడే అనాలి కదా.ఒక మతాన్ని నమ్మినంత మాత్రాన అతని వ్యక్తిత్వాన్ని మతం మార్చలేక పొయింది. ఒక
పెద్ద స్వామి  హిందూ మతానికి అత్యున్నతమైన పదవి లో ఉన్నారనుకొందాం. ఆయనకు తెలియని ధర్మం లేదు. కానీ ఇవన్నీ తెలియటం అనేది ఆయనను ఒక హత్య చేయించకుండా ఆపలేక పోయింది అనుకొందాం. హత్య చేయించాడు అని తెలిసిన వెంటనే “ఆయన హిందువే కాదు” అనటం సబబు కాదు. హత్య చేసిన తరువాత కూడా ఆయన హిందువే! కానీ హిందూ మతం తెలిసినంత మాత్రాన, వాటిలో కొన్ని పధ్ధతులు ఆచరించినంత మాత్రాన, మనిషి మంచి వాడైపోడు. అతని లో స్వతహా గా ఉన్న చెడ్డతనం ఎక్కడికీ పోలేదు.(అందరూ ఈ పెద్ద స్వామి లాంటి వారని కాదు. చాలా మంది మతావలంబకులలో మంచి వారే ఉంటారు. ఆ మంచి తనానికి కారణం ఒక్కోసారి మతమే అవుతుంది. ఒక్కోసారి కాదు కూడా.) పెద్ద స్వామి చెడు ఆలోచనని మతం హరించలేక పోయింది.ఈ విషయాన్ని అన్ని మతాలలోని అసలైన ప్రవక్తలు చెప్పినదే.కాక పోతే పాపులర్ మతాలు (బాబాలూ గట్రా) మతం అనేది సర్వ రోగ నివారిణి అని చెప్తాయి. అరచేతి లో వైకుంఠం చూపిస్తాయి.
మత గ్రంధాలు మార్గ దర్శకాలు మాత్రమే. కానీ మమూలు జనాల మూర్ఖత్వం/మూఢత్వం వలన అవి జీవితం లో ఫత్వా ల స్థాయికి దిగజారిపోయాయి.మార్గదర్శకాలు జీవితాన్ని శాసించవు. కానీ నిత్య జీవితం లొ మతాలు రాజకీయాల నుంచీ, ఆర్ధిక సమస్యల దాకా అన్నిటినీ శాసించే స్థాయి కి దిగ జారిపోయాయి. ఈ దిగజారుడు కి మతాని కన్నా జనాల మూర్ఖత్వాన్నే నిందించాలి.
పాపులర్ మతాల వలన కూడా కొన్ని లాభలున్నాయి..పాపభీతి, సమస్యలు వచ్చినప్పుడు దైవం పై ఆశ, నీతి, పధ్ధతి ఇవన్నీ మతం వలననే వచ్చాయి. ఇవిలేకుండా జీవితం ఇంకా దుర్భరమౌతుంది.
బందిపోటు దొంగకి భాగవతం వలన ఉపయోగం ఏమిటి? వాడికి భాగవతాన్ని ఇచ్చినా వాడు అది చదివి మారిపోడు. దాని వలన భాగవతం పనికి రానిది కాదు. అలానే భాగవతం రాసినాయన “బందిపోటు దొంగ భాగవతం చదివి ఆనందించి మారిపోతాడని” చెప్పటం కూడా సరి ఐనది కాదు. వాడికి భాగవతం ఉపయోగం లేనిది. అదే ఏ భక్తుడి చేతిలోనో పడితే అప్పుడు అది ఉపయోగపడుతుంది. అయితే ఈ భక్తులు మన సమాజం లో నానాటికీ తగ్గిపోతున్నారు.జనాలకు తోలు మందం ఎక్కువయ్యింది. అందువలనే ఇలాంటి జనాలని డీల్ చెయ్యటానికి మావోఇజం లాంటి కొత్త హింసాత్మక మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
అలానే సైన్స్ కూడా…స్వర్గానికీ నరకానికీ ఒకే తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి మనిషికి సైన్స్ ఇస్తుంది. మసిషి అ తాళం చెవి తో స్వర్గ ద్వారాలు తెరుస్తాడొ, లేక నరక ద్వారాలు తెరుస్తాడొ అతని చేతుల్లో ఉంది. మనిషి నరక ద్వారాలు తెరిస్తే అది సైన్స్ తప్పు కాదు. అలా అని స్వర్గ ద్వారాలు తెరిచినా అది సైన్స్ గొప్పదనం కాదు. సైన్స్ గొప్పదనం తాళపు చెవి ని తయారు చెయ్యటం వరకే! మనిషి స్వర్గ ద్వారాలు తెరవాలా లేక నరక ద్వారాలు తీయాలా అనే విషయమై కొంత మతం అతనికి సలహా ఇవ్వగలదు. కానీ మనిషి మతం సలహా ని పెడచెవిన పెట్టి నరక ద్వారాలు తెరిస్తే మతం చేయ గలిగింది ఏమీ లేదు.తాళపు చెవి తో నరక ద్వారం తెరిచే కంటే, తాళపు చెవి అసలు లేక పోవటమే మంచిది అనిపిస్తుంది, ఈ గ్లోబల్ వామింగ్ కాలం లో. అలానే మతంస్వర్గ ద్వారం తెరవరా నాయనా అంటే, మనిషి నరక ద్వారం తెరిచినప్పుడు కూడా, ఈ మతాలు లేకపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేక పోతే మనిషి చేత స్వర్గ ద్వారం తెరిపించలేని ఈ మతాలెందుకు అనిపిస్తుంది.   సమస్య అంతాఈ మనిషి తోనే వచ్చింది అని తిట్టుకోవటం మన స్వప్రేమకు అడ్డు కదా! కానీ సమస్య అంతా మనిషి మానసికవ్యవస్థ తోనే వచ్చింది. ఈ వ్యవస్థ ని గాడిలో పెట్టనంత వరకూ మతానికి ప్రయోజకత్వం రాదు.

ఇక పోతే నాస్తికత్వం గురించి…నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే. ఎందుకంటే,మీరు ఒక నాస్తికుడిని “ఈ విశ్వం ఎక్కడినుంచీ వచ్చింది? దీనిని ఎవరు సృష్టించారు” అని అడిగితే, “నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం లేడు”, అని చెప్తాడు. అంటే ఇదీ ఒక నమ్మకమే.కాబట్టీ మతం గురించి మనం పైన చెప్పుకొన్న వాటిలో నాస్తికత్వానికీ, కమ్యూనిజానికీ కూడా వర్తిస్తాయి. కాకపోతే నాస్తికుడికి, ఆస్తికుడిలా పెద్ద ప్రవర్తనా నియమావళి ఉండదు. నాస్తికుడికి పాప భీతీ దైవ భీతీ ఉండకపోవటం వలన వాడు అంతరాత్మ లేని వాడైతే వాడి వలన సమాజానికి చాలా నష్టం. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అని అడిగితే, “నాకు తెలియదు. అది నా ఊహ కు అందని విషయం” అనే వాడిని ఇంగ్లీష్ లో ఆగ్నోస్ట్ అంటారు.

మనిషికి ఈ కాలం లోకూడా చాలా వరకూ ఆచరణ శీలమైన విలువల వ్యవస్థ ల లో కుటుంబ వ్యవస్థ ఒకటి. మనిషి పరిణామ క్రమంలో జ్ఞాపక శక్తి, అంతశ్చేతన పెరగటం వలన జంతువుల నుంచీ వేరుపడ్డాడు. అందువలన ఈ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అమ్మా నాన్న అక్కా తమ్ముడూ అనే భావాలు  ఇలాంటివే. కాబట్టీ మనిషి భౌతికమైన, పరిణామ పరమైన అవసరాలకు అనుగుణం గా ఏదైనా విలువల వ్యవస్థ ఉంటేనే అది తట్టుకొని నిలబడుతుంది. “ఈ అవసరాలకు భిన్నం గా ఉన్న వ్యవస్థను” ఆచరించే వారు కరువౌతారు. అప్పుడు ఆ వ్యవస్థ మార్గదర్శకాలకూ, ఆ వ్యవస్థ లోని మనుషుల ప్రవర్తన కూ మధ్య అంతరమెక్కువౌతుంది.  ఆచరణ సాధ్యం కాని ఏ విలువల వ్యవస్థ ఐనా ఉపయోగం లేనిది గా తయారౌతుంది. కేవలం పుస్తకాలకే పరిమితమౌతుంది.  ఆచరణ లో పెట్టలేని గొప్ప విలువల వలన ఉపయోగం లేదు. అలాని ఏ బంది పోటు దొంగో తనకు అనుగుణం గా వ్యవస్థ లోని విలువలను దిగజార్చమనటం కూడా సరి కాదు. విలువలు ఉండాలి కానీ అవి ఆచరణాత్మకం గా, మానవాళి సమిష్టిమరియూ వ్యక్తిగత మనుగడ కిమంచి చేసేవి గా ఉండాలి. ఒక యుగంలో ఉన్న విలువలు వేరొక యుగం లో అవసరం లేనివి ఔతాయి కాబట్టీ ఈ విలువలు కూడా చలనశీలమైనవి. మంచి చెడులు చలనశీలమూ, సాపేక్షమూ ఐనట్లే సమాజపు విలువలు కూడా.

కొత్త వ్యవస్థ ఏదైన తీసుకొని వచ్చేటపుడు, అది ఉన్న వ్యవస్థ కంటే మెరుగైనది గా ఉండాలి. కొత్త వ్యవస్థ మెరుగైనదా కాదా అనే విషయం, కొత్త వ్యవస్థ ని పరిమితం గా ఒక ఊళ్ళొనో, ఒక జిల్లాలోనో ఒక ప్రొటో టైప్ లా ప్రవేశపెట్టి అది సాధ్యమా కదా,ఒక వేళ సాధ్యమైతేఅది పాత వ్యవస్థకన్నా మెరుగైనద లేదా అని చూడాలి. ఒక వేళ మెరుగైనదైతే, దానిని పరిమిత కాలం పాటు విస్తరించి చూడాలి. అప్పుడు కూడా కొత్త వ్యవస్థ లో లోపాలు కనబడితే దానిని వెనుకకు తీసుకొనేటందుకు సిధ్ధం గా ఉండాలి. చివరికి కొత్త వ్యవస్థే మెరుగైనదైతే దానిని కొన సాగించాలి. అంతే గానీ కమ్యూనిజం లా “కొండ నాలిక కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది” అన్న చందాన ఉండకూడదు.

ఇంకా చాలా విషయాలున్నాయి కానీ..అవన్నీ మళ్ళీ ఇంకొక సారి…?(మీకు చదివే ఓపిక ఉంటే..)

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు

రిచర్డ్ ఫేన్మేన్ ప్రపంచ ప్రసిధ్ధ భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1965 లో భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకొన్నారు.
ఆయన సైన్స్, మతం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి ఆంగ్లం లో. ఇది కొంచెం పెద్ద డాక్యుమెంట్. తీరిక చేసుకొని అప్పూడప్పుడూ చదవ వచ్చు.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ టపాకి ప్రేరణ

సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ
అవి యండమూరి, మల్లాదీ కమర్షియల్ రచయితలు గా కాలమేలుతున్న రోజులు. మా వూరి లైబ్రరీ నుంచీ నేను నవలలూ గట్రా తెచ్చి చదువుతూ ఉండే వాడిని. కొన్నాళ్ళకి కొడవటిగంటి కుటుంబ రావు కథలు చదవటం జరిగింది. ఒక సారి ఆయన కథలు చదివిన తరువాత మళ్ళీ కమర్షియల్ నవలలు ముట్టబుధ్ధికాలేదు. ఇక అప్పటి నుంచీ కొ.కు, రావి శాస్త్రి, బీనా దేవి ల కథలు చదవటం మొదలు పెట్టాను.
మా నాన్న గారు ఒక చిన్న రైతు. ఆయన పెద్ద వాళ్ళు ఆయన విధ్యాభ్యాసాన్ని సపోర్ట్ చెయ్యలేదు. ఆయన స్నేహితులలో చాలా మంది చదివి హాయిగా ఉద్యోగాలు చేసుకొంటుంటే, తాను ఎదుగూ బొదుగూ లేని వ్యవసాయం చేయ వలసి వచ్చిందనేది ఆరోజుల్లో ఆయన బాధ.
నేను కథలూ సాహిత్యమూ చదువుతున్నప్పుడల్లా ఆయన, చూసి,”ఈ కతలూ కాకర కాయలూ అన్నం పెట్టవు. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో” అని చెప్పే వారు.
నేను వెంటనే, “ఇదేమీ చెత్త సాహిత్యం కాదు.ఇది సమాజం లో వాస్తవ పరిస్థితి గురించి చెబుతుంది. చాలా ఆదర్శవంతమైన రచనలు”, అనే వాడిని.
దానికి ఆయన, “అనుభవం మీద చెబుతున్నాను తెలుసుకో. నాకు తెలిసిన వాళ్ళూ చాలా మందే ఈ ఆదర్శాలూ, ఆకులు పట్టుకోవటాలూ అని మట్టిగొట్టుకొని పోయారు. తరువాత ఎందుకు ఆదర్శాల జోలికి పోయామా అని నా దగ్గర బాధ పడిన వాళ్ళున్నారు. కానీ పైకి సమాజం లో మాత్రం చెప్పుకోరు. ఇక పోతే ఆదర్శాలు చెప్పే వాళ్ళ జీవితాలు ఆ ఆదర్శాల ప్రకారం ఉంటాయి అని చెప్పలేం, ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులూంటాయి అని అంటారు కదా! నా స్నేహితుడొకడు ఇప్పుడు ఒక ప్రసిధ్ధ సామాజిక స్పృహ చెప్పే రచయిత. కానీ వాడి అసలు బతుకేమిటో నాకు తెలుసు. కాబట్టీ ఒరే, నువ్వు బుధ్ధిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో..నాకు ఈ మట్టి పిసకటం కొంతన్నా తప్పుతుంది…చివరికి కోటి విద్యలూ కూటి కోసమే. ఆ పైన టైం ఉంటే అప్పుడు ఆదర్శాలూ గట్రా చెప్పే పుస్తకాలు రాసుకో”, అని నాకు ఒక క్లాస్ పీకారు.
నాకు అప్పట్లో మా నాన్న మాటలు ఛాదస్తం గా కనపడినా,ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోక పోతే ఈయన ఊరుకొనేలా లేడు అని ఎలాగొలా చదువు సాగరం ఈదేసి ఒక ఉద్యోగం లో ఇరికేశా. ఈ మధ్య లో నా తో చదువుకున్న వాళ్ళు లో కొంతమంది ఉద్యమాలలోకి వెళ్ళి వ్యక్తిగతం గా నష్టపోయి, దానిని నా దగ్గర వ్యక్త పరచిన వాళ్ళున్నారు.
ఇవన్నీ చూసుకొంటే ఇప్పుడు నేను కొంచెమన్నా ఆర్ధిక ఇబ్బందుల్లో లేకుండా ఉన్నానంటే అది మా నాన్న స్వానుభవం తో వచ్చిన ఇంగితం తో అప్పుడు నన్ను చదువు లోకి తొయ్యటమే కారణం అనిపిస్తుంది. మా నాన్న లానే నాకు కూడా ఇప్పుడు ఎవరైనా ఆదర్శాలు చెప్తే వాళ్ళకి, “బాబూ ముందు నీ సర్వైవల్ గురించి ఆలోచించుకో”, అని చెప్పాలని పిస్తుంది.
మా నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలే నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా?

మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా? ఈ ప్రశ్న లోకి వెళ్ళే ముందు మనం హిపోక్రసీ ని నిర్వచించాలి. “హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం”. “హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం”.
హిపోక్రసీ ని నిర్వచించుతున్నాము కాబట్టీ ఈ నిర్వచనానికి ఉండే పరిమితు గురించి కూడా ఆలోచించుదాం. ఒక మనిషి చెల్లినీ చెలి నీ ఒకే దృష్టి తో చూడ లేడు కదా ఇది హిపోక్రసీ అవుతుందా?  కానే కాదు. పైగా అలా చూడటం పర్వర్షన్ అవుతుంది. కాబట్టీ మానవ సంబంధాలకు ఈ హిపోక్రసీ వర్తించదు. అలానే ఒక వ్యక్తి జీవ హింస తగదు అని చెప్పాడు. కానీ రోజూ అతని శరీరం లో కొన్ని లక్షల కొద్దీ సూక్ష్మ జీవులు చంపబడుతున్నాయి. దీని వలన అతను హిపోక్రాట్ అవుతాడా? హిపోక్రాట్ అనిపించుకోకుండా ఉండటానికి అతను ఆత్మ హత్య చేసుకోవాలా? కాదు, హిపోక్రసీ అనేది వ్యక్తి లో ఉండే మానవ సామాజిక విలువలకు సంబంధించిన విషయం.అలానేచెట్లు నిజాయితీ గా పూలు పూస్తాయి, మేఘం నిజాయితీ గా వర్షిస్తుంది లేక కోయిల నిజాయితీగా పాడుతుంది అనే విషయాలు సరైనవే అవ్వవచ్చును గానీ మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళనవసరం లేదు.

మనిషి వ్యక్తిత్వం అనేది అతని జీవితం లోని పరస్పర విరుధ్ధమైన పరిస్థితుల వలన ప్రభావితం ఔతుంది. కాబట్టీ, మనం మనిషి పరస్పర విరుధ్ధమైన ఆలోచనల ప్రతిరూపం అనే విషయం అంగీకరించాలి. కాబట్టీ మనిషి జీవితంలోని/వ్యక్తిత్వం లోని ఒక అంశం తో పోల్చిచూసినప్పుడు, అతని లో తద్విరుధ్ధమైన ఆలోచనలు, అంశాలు ఉండటం ఒక హిపోక్రసీ లా కనపడుతుంది. కానీ దీనికి అతీతులు చాలా తక్కువ గా ఉంటారు. మనిషి లోఉండే ఏ అంశానికి ఆ అంశం నిజాయితీ గా కనపడుతుంది. కానీ పక్క అంశం తో పాటు కలిపి చూసినప్పుడు ఆ రెండింటి మధ్యా వైరుధ్యా లుంటే అది హిపోక్రసీ.మొత్తం గా ఒక మనిషి జీవితం/వ్యక్తిత్వం సంపూర్ణం గా నిజాయితీ ఐనది అనటం లో అర్ధం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం లో పరస్పర విరుధ్ధ అంశాలు ఎంత తక్కువ గా ఉంటే ఆ వ్యక్తి అంత నిజాయితీ పరుడి గా కనపడతాడు.

శ్రీ శ్రీ ఆవేశం లో నిజాయితీ కనపడుతుంది…అంటే తనకొచ్చిన ఆవేశాన్ని సూటిగానే కవిత్వం రూపం లో వెళ్ళగ్రక్కాడాయన. అలానే ఒక ఆదర్శ లోకాన్ని చూసి, దాని గురించిన తన ఇష్టాన్నీ కవిత్వ రూపం లో చెప్పాడు. ఈ ఇష్టం లోనూ నిజాయితీ ఉంది. “ఆ ఆదర్శ లోకానికి మన వాస్తవ లోకం నుంచీ దారేమిటొ ఆయనకు తెలుసా?” అనేది వేరే ప్రశ్న.
త్రాగుడు దృక్కోణం లో చూసినప్పుడు, శ్రీ శ్రీ తాగుడు లోకూడా నిజాయితీ ఉంది.నిజాయితీ గానే తాగాడాయన. అలానే స్త్రీ లోలత్వం లో కూడా నిజాయితీ ఉంది. స్త్రీ వాంఛ వచ్చినప్పుడు తీర్చుకొన్నాడు. కానీ ఆ కవిత్వాన్ని ఆయన ప్రవర్తన పోల్చినప్పుడు ఆయన జీవితం హిపోక్రసీ అవుతుంది.
కానీ,  ఆయన కవిత్వం లో ఉన్న ఆదర్శాల దృక్కోణం నుంచీ( కవిత్వాన్ని reference point గా  చేసుకొని)  తాగుడుని చూసినప్పుడు  శ్రీ శ్రీ అనే వ్యక్తి హిపోక్రాట్ అవుతాడు.
అదే ఆయన కవిత్వం వలన ఉత్తేజం పొంది సాయుధ పోరాటం లోకి దిగిన వాళ్ళు (శ్రీ శ్రీ గారి ఊగరా ఊగరా కవిత, అలా చనిపోయిన ఒక వ్యక్తి గురించి) ఈ విషయం లో శ్రీ శ్రీ కంటే చాలా తక్కువ హిపోక్రాట్స్ అయిన వ్యక్తులు.  ఆవేశం తెచ్చిపెట్టుకొని కాలిక్యులేటెడ్ గా ఉపన్యాసాలిచ్చే రాజకీయ నాయకులు   శ్రీ శ్రీ కంటే చాలా చాలా పెద్ద హిపోక్రాట్స్.

ఏ ఆదర్శమూ చెప్పకుండా మేము దోపిడీ చేస్తున్నాము అని, అలానే చెప్పినట్లు గా దోపిడీ చేసే వ్యాపారులు తక్కువ హిపోక్రాట్స్ అవ్వవచ్చేమో కానీ, వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం. కాబట్టీ వీరి విషయం లో “హిపోక్రాట్స్ కాకపోవటాన్ని” అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. మనమంతా ఏదో ఒక విషయం లో హిపోక్రాట్స్ మే. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటేతెలుస్తుంది. శ్రీ శ్రీ  హిపోక్రాట్ అవ్వకుండా ఉండటం ఆయనకు మరింత వన్నె తెచ్చేదేమో కానీ, ఆయన హిపొక్రాట్ అవ్వటం వలన ఆయన కవిత్వం లోని నిజాయితీకి ఏమీ మచ్చ లేదు. ఇక ఆయన వ్యక్తిత్వం దగ్గరికి వస్తే, మచ్చ పడనే పడింది.

****************************

చివరి గా……, ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు మనలో అంతస్సంఘర్షణ జరుగుతుంది. మనలోని మంచి వాడు ఆ పని వద్దంటాడు. చెడ్డ వాడు చెయ్యమంటాడు.కానీ బయటి వారి దృష్టి లో నువ్వు ఒక్క మనిషివి. కాబట్టీ నువ్వు అప్పుడు చేసిన చెడ్డపని అంతకు చేసిన మంచి మాట కంటే విరుధ్ధమైనదైతే, బయటి వ్యక్తులు నిన్ను హిపోక్రాట్ అంటారు. కానీ నీకుముందు నుంచీ తెలుసు నీ లోనే మంచి మనిషీ చెడ్డ మనిషీ ఉన్నారని. వాళ్ళు ఇద్దరూ సమయాన్ని బట్టి బయట పడుతున్నారనీ. కాబట్టీ  మన దృష్టి లో మనమే హిపోక్రాట్స్ అవ్వటం చాలా తక్కువ గా జరుగుతుంది. మనం రెండు నాల్కల తో మాట్లాడినా ఆ విషయం మన అంతరాత్మకు తెలుసు. మన ఆలోచనలన్నీ మన అందుబాటులోనే ఉంటాయి కదా.   కాబట్టీ వైరుధ్యం ఉండదు.  ఆలోచనలూ, చేతలూ, ప్రవర్తనా అన్నీ స్వార్థం (Reference point) కోసమే అని తెలిసినప్పుడు వైరుధ్యం పోతుంది కదా..ఇతరులకు అలా కాదు.
మనకు తెలియకుండా మనం హిపోక్రాట్స్ అవ్వవచ్చు గానీ, మనకు తెలిసీ మనం హిపోక్రాట్స్ అవ్వటం(మన దృష్టి లో-Self image) కష్టం.  తాను సమాజందృష్టి లో హిపోక్రాట్నని తెలిసీ తన ఆలోచనలనీ,చేతలనీ, ప్రవర్తన నీ అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకం గా వాడుకొనేవాడిని హిపోక్రాట్ అనాలా వద్దా? అన్నా అనక పోయినా అటువంటివాడి(గిరీశం టైపు?) వలన సమాజానికి నష్టంకాబట్టీ వాడికి సమాజం విలువ ఇవ్వనవసరం లేదు.

***************

నాకు తెలిన ఒక తత్వ వేత్త ప్రకారం మనిషి పనులూ,ఆలోచనలన్నీ తన భౌతిక,మానసిక, ఆధ్యత్మిక, భావోద్వేగ పరమైన స్వార్థం లేక సర్వైవల్ కోసం. కాబట్టీ మనిషి స్వార్థం దృష్టి తో చూస్తే మనిషి పనులలో, ఆలోచనలలో వైరుధ్యమే లేదు. అన్నీ స్వార్థం కోసమే. అంటే స్వార్థం దృష్టితో చూస్తే హిపోక్రసీ లేదా? మనిషి చేసే పనులన్నీ సర్వైవల్ కోసం అనేది కూడా నమ్మబుధ్ధి కాని ఒక అంశం. మనిషి స్వార్థానికి సంబంధం లేని అనేక ర్యాండం పనులు కూడా చేస్తాడెమోనిపిస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న

భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న:

శిష్యుడు: గురువు గారూ కృష్ణ భగవానుడు గీత లో “కర్మల ని ఆచరించు, కానీ ప్రతిఫలం ఆశించకు”,అన్నాడు. ఇదెలా సాధ్యం? నేను క్రికెట్ ఆడతాను. ఆ ఆడటంలోనాకు ఆనందముంది.  కాబట్టీ,రేపు ఏ క్రికెట్ లో ఏ అవార్డో వస్తే నేను ఇంకా సంతోష పడతాను. మనం ప్రయాణం చేసే మార్గం లో నైనా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. లేక పోతే గమ్యం లోనైనా ప్రతిఫలం ఆశిస్తాం కదా!ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏ పని ఐనా మొదలు పెట్టటానికి ప్రేరణ ఏముంటుంది. మనకు నిత్యం బాధ కలిగించే పనిని మనం మొదలు పెట్టం కదా. సంఘాన్ని బాగు చేయ్యటం కోసం ఎన్నో కష్టాలను ఓర్చుకొన్న మహా మహులు కూడా ఆ పని వలన ప్రతిఫలాన్ని ఆత్మ సంతృప్తి రూపం లో పొందుతారు కదా?  కాబట్టీ ప్రతిఫలాపేక్ష లేని కర్మ అనేది మన ఊహలలో మాత్రమే సాధ్యమనుకొంటా గురూ గారూ!”

గురువు: బాబూ! మన ఇంటిలో మొదలూ చివరా అంటూలేని వస్తువు ఏదైనా ఉందా?

శిష్యుడ్డు: లేదు గురూ గారూ! మొదలూ చివరా లేకుండా ఏ భౌతిక వస్తువైనా ఎలా ఉంటుంది?

గురువు: బాగా ఆలోచించు నాయనా..

శిష్యుడు: నా మనసు లోకి ఏమీ రావటంలేదండీ గురువు గారూ!

గురువు: సరే, ఆ పక్క గది లో నీ ఆట వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఒక సారి వెళ్ళి చూసి రా నాయనా, ఏమైనా దొరుకుతాయేమో.

శిష్యుడు: (తన లో…గురువు గారు ఏదో మాయ చేస్తున్నారు..) ఆ ఇదిగో నండీ ఇక్కడ “టెన్నీ కాయిట్” రింగు దొరికినది. దీని చుట్టు కొలత వెంబడి పోతే దీనికి ఆదీ లేదు అంతమూ లేదు. మనం ఏక్క డ ఆది అనుకొంటామో అదే ఆది అవుతుంది..అయినా దీనికీ నిష్కామ కర్మ కీ ఏమి సంబంధం గురువు గారూ…??

గురువు గారు: బాబూ, ఐదు నిమిషాల ముందు “ఆదీ అంతం లేని విషయం అసంభవం” అన్నావు…గది లోకి వెళ్ళి వెతికిన తరువాత ఇప్పుడు ఒక వస్తువు ని కనుగొన్నావు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాహ్య ప్రపంచం ఏమైనా మారిందా?…లేదు కదా…మార్పు నీ మనసు లోనే ఉంది. రింగ్ అప్పుడూ ఉంది..ఇప్పుడూ ఉంది. ఐతే ఇప్పుడు ఆ వస్తువుని చూడటం ద్వారా నీ మనసులో మొదలూ చివరా లేని వస్తువు సంభవించటం పై ఉన్న అపనమ్మకంపోయింది.  అదే విధం గా నిష్కామ కర్మ అనేది ఒక ఊహ మాత్రమే అని నీకు అనిపించటానికి కారణం అలాంటి కర్మ నీకు వ్యక్తి గతం గా అనుభవం లోకి రాక పోవటమే. నిత్యం నీవు ప్రతిఫలం ఆశిస్తూ చేసే పనులలోనే ఏదో ఒక పనిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయగలవు.అది ఏ పని అనేది నీకు వెంటనే తట్టకపోవచ్చును.అయితే ఆ పని  ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు వెతికి చూడాలి. ఒక సారి దానిని నీవు కనుగొన్న తరువాత అది సంభవమేనని నీకు తెలుస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ