వ్యసనాలు..కొన్ని ఆలోచనలు..

Some additions…if you’ve already read ..never mind

నాకు తెలిసిన ఒక స్నేహితుడు అతని ఉద్యోగంలో చాలా పైకి ఎదిగాడు. ఓ రోజు, అతని తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు, అతను, “జీవితం లో ఇప్పటి కంటే డబ్బు లేనప్పుడే సంతోషం గా ఉండేదబ్బా..!” అన్నాడు.

కానీ, నాకనిపించిందేమిటంటే, అతను తన ఎదుగుదల (సక్సెస్) కి అలవాటుపడి పోయాడు. అతను ఉద్యోగం లేని రోజులలో కంటే ఇప్పుడు సంతోషం గా ఉన్నప్పటికీ, ఇప్పటి సంతోషానికి ‘అలవాటు’ పడిపోయాడు. అంతకు ముందు పడిన కష్టాలను తాత్కాలికం గా మరిచిపోయాడు. క్రితం లో ఉన్న జీవితమే బాగుంటే, అతను తన ఉద్యోగాన్ని విడిచి పెట్టాలి కదా? కానీ అలా చేయటంలేదంటే అంతకు ముందు జీవితంకంటే ఇప్పటి జీవితమే బాగుంది.కానీ పూర్వం అతనికి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు అతను చాలా సంతోషపడటం నాకు గుర్తు. అతను ఇప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించటంలేదంటే, మనిషి సంతోషాన్ని తన జీవితం లోని సుఖం యొక్క స్థాయి పెరిగినప్పుడు మాత్రమే అనుభవిస్తాడనుకొంటా! కొత్త గా వచ్చిన సుఖం స్థాయికి తరువాత క్రమేణా అలవాటు పడి, మనిషి చేతన లో నుంచీ సంతోషం మరుగుపడుతుంది అనిపిస్తుంది.
నా స్నేహితునికి మళ్ళీ సంతోషం రావాలంటే మళ్ళీ ఉద్యోగం లోఏదో ఒక పదోన్నతి రావాలి. సంతోషం కోసం మళ్ళీ జీవితంలో ఒక స్థాయి పైకి ఎదగాలి. ఈ విధమైన మెట్లు ఎక్కే ప్రక్రియ కి అంతంలేదు. అలానే, రాజకీయ నాయకులకు ఒక పదవి వచ్చిన తరువాత ఇంకొక పదవి పైకి దృష్టి మళ్ళుతుంది. దీనికీ అంతం లేదు.
మనిషి కోరిక కి అంతంలేక పోవటం అంటే ఇదేనేమో! ఈ విధమైన ప్రక్రియ అంతటినీ వ్యసనం అనవచ్చు. దీనికీ మాదక ద్రవ్యాలకి అలవాటు పడటానికీ సాంకేతికం గా పెద్ద తేడాలేదు.
తాగుడు కి అలవాటు పడితే శరీరం గుల్ల అవుతుంది. ఇదిఒక నష్టం.సమాజంలో గౌరవం పోతుంది. సక్సెస్ కీ, అధికారానికీ అలవాటు పడితే దాని వలన వ్యక్తికి నష్టం లేదు. పైగా చాలా ఇతర లాభాలు ఉన్నాయి. సమాజం లో పేరు రావటం, చుట్టూజనాలు చేరటం, భార్యా పిల్లల దగ్గరా చుట్టాలలో గౌరవం పెరగటం, వగైరా. మనిషి అధికార దాహం వలన సమాజానికి నష్టం అనేది వేరే విషయం.
కొందరికి సినిమాలు వ్యసనమైతే,మరి కొందరికి టీవీ సీరియళ్ళు వ్యసనం. ఈ వ్యసనాల వలన నేరు గా పెద్ద నష్టాలు లేవు. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. జీవితం లో ఉద్యోగం, కుటుంబం, ఆటలూ,స్నేహితులూ,సాంస్కృతిక కార్యక్రమాలూ మొదలైన వాటి మధ్య ఒక సమతూకం ఉండాలి. ఒక పని చేయటం వలన వలన వచ్చే ఆనందాన్ని ఇంకొక పని వలన వచ్చే ఆనందం భర్తీ చేయలేదు. ఉదాహరణ కి తినటంవలన వచ్చే ఆనందాన్ని, మైధునం వలన వచ్చే ఆనందం భర్తీ చెయ్యలేదు. అలానే స్నేహితుల తో సరదా గడపటం వలన వచ్చే ఆనందాన్ని, ఉద్యోగం లో వచ్చే ఆనందం రీప్లేస్ చెయ్యలేదు. కాబట్టీ మనిషి టీవీ చూడటంలాంటి ఒక నిరపాయకరమైన విషయానికి అడిక్ట్ అయ్యినప్పటికీ, అతను జీవితం లో మిగిలిన ఆనందాలను కోల్పోతున్నాడనే చెప్పాలి. ఒక్కోసారి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయటం వలన కష్టాలు కూడా రావచ్చు. టీవీ సీరియళ్ళకు అడిక్ట్ అయ్యిన గృహిణి భర్త సాన్నిహిత్యాన్నీ ఆప్యాయతనూ కోల్పోయే ప్రమాదముంది.
అలానే బూతు సినిమాలు చూడటానికి అలవాటు పడటం వలన సమాజం లో చులకన అవ్వటమే కాకుండా, ఉద్యోగం చదువూ ఇతర రంగాలలో వెనుకపడి జీవితం లో దెభ్భ తినే అవకాశం ఉంది..తను చేసే పని నైతికం గా తప్పు అనే న్యూనత ఎలానూ ఉంటుంది.
బూతు సినిమాలలాంటివి పరిమితం గా అదుపు (కంట్రోల్) లో ఉంటూ చూడ వచ్చా..? ‘కంట్రోల్’ అనేది జీవితం లో ఇతర రంగాల నుంచీ ఆనందం పొందుతున్న వారికి సాధ్యం. అలానే, ఒక మనిషి కి ఒక పని వలన ఎనలేని ఆనందం వస్తున్నప్పుడు,మిగిలివ పనుల వలన పెద్ద సంతోషం లేనప్పుడు, ఎక్కువ ఆనందం వచ్చే పనికి అతను అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రేమ లో విఫలమయ్యిన వాళ్ళు తాగుడుకి బానిస అయ్యినట్లు.
సినిమా నటుడు ప్రకాష్ రాజ్ చిన్నప్పుడు తన తండ్రి వలన పొందలేక పోయిన ప్రేమని తరువాత ప్రేక్షకుల ప్రశంశల ద్వారా పూడ్చుకొన్నట్లు చెప్పాడు. ఇలాంటి కొన్ని భావోద్వేగ విషయాల్లో ఒక రకమైన ఆనందాన్ని ఇంకొక రకమైన ఆనందం రీప్లేస్ చెయ్యగలదు. పిల్లలు పుట్టినతరువాత తల్లికి భర్త మీది నుంచీ దృష్టి పిల్లల మీదికి మళ్ళటం సహజమైనట్లు..
ఇక పోతే, “తినగ తినగ వేము తియ్యగుండు..” అన్నాడు వేమన..
కానీ “పాడిందే పాట రా పాసి పళ్ళ దాసరా” అనికూడా అంటారు.
ఒకే పనిని పదే పదే చెయ్యటం వలన దానికి అడిక్ట్ అవ్వుతారా?, లేక, దానితో విసుగు చెందుతారా? ఆ పని చేదుదైతే దానిలోని చేదు పోతుంది. కానీ తీయనిదైతే వెగటుపుడుతుంది కదా!
ఒక వ్యసనానికి అడిక్ట్ అయ్యిన వాళ్ళు, ముందు దాని వలన ఎక్కువ సంతోషం పొందుతారు.తరువాత సుఖం నెమ్మదిగా తగ్గుతుంది. కానీ అలవాటు వలన, ఆ  వ్యసనాన్ని వదిలిపెట్టినప్పుడు మానసిక వ్యధపెరుగుతుంది. వెంటనే మళ్ళీ మామూలు గా అవ్వటానికి వ్యసనాన్నే ఆశ్రయించాల్సి వస్తుంది.
మనకిష్టమైన పాట మొదటిసారి విన్నప్పుడు సంతోషం గా ఉంటుంది.మళ్ళీ వెంటనే వింటే సంతోషం తగ్గుతుంది. ఇలా నాలుగైదు సార్లు వెంటనే వింటే అది విసుగు పుడుతుంది. మనని ఎవరైనా కట్టేసి అదే పాటని వంద సార్లు వినిపిస్తే అదే పాట నరకమౌతుంది. ఇక్కడ మన మెదడు లో భావోద్వేగాలు కల్పించే న్యూరో ట్రాన్స్మిటర్లు మొదటి సారి బాగానే పని చేస్తాయి. తరువాత వాటి సరుకు నిండుకుంటుంది. మనకు ఎప్పుడైతే బోర్ కొట్టిందో అప్పుడు మన ఆనందం నెగటివ్ లోకి వెళ్ళిందన్నమాట. అప్పుడు పాటని కట్టివేస్తాం. మళ్ళీ తరువాత ఏ రెండు నెలలకో అదే పాటని విని ఆనందించగలం, మొట్టమొదటి సారి అంతకాక పోయినా…అలానే భావోద్వేగాల విషయం లో న్యూరోట్రాన్స్మిటర్లు చేసిన పనిని సెక్స్ విషయం లో హార్మోన్లుచేస్తాయి. కానీ, అడిక్షన్ విషయం లో అలా కాదు. మొదటి సారి తాగిన కిక్ తరువాత తగ్గుతుంది… కానీపాట విషయంలోఅయ్యినట్లు అది బాధించే బోర్ గా తయారవ్వదు. ఆ కిక్ ఒక తటస్థ (న్యూట్రల్) స్థాయి లో ఉండి, అది లేనిదే బతకలేని విధం గా తయారవుతాం.
మనం భోజనం రోజూ చేస్తాం అయితే భోజనానికి మనం అడిక్ట్ ఎందుకు అవ్వం? తిండి తినటం అనేది ఒక అంతం లేని చక్ర భ్రమణ ప్రక్రియ (సైక్లికల్ ప్రాసెస్). ఆకలీ …తిండి..ఆకలీ తిండీ..ఇది ఒక భౌతిక ప్రక్రియ..నాలుగు రోజులు అన్నంలేకుండా మాడబెట్టి,తరువాత అన్నం ముందు పెట్టి, నిన్ను కంట్రోల్ చేసుకో అంటే ఎవరికీ సాధ్యంకాని పని. అప్పుడు ఎవరికైనా తినాలనే యావ (కంపల్షన్) కలుగుతుంది. అలాంటి కంపల్షనే అడిక్ట్ అయ్యిన వారికీ ఉంటుంది. జంతువులలో తినటం ఒకభౌతిక ప్రక్రియ మాత్రమే..కానీ మనుషులలో దీనికి మానసిక కోణం కూడా ఉంది.
జీవితంలో మొట్టమొదటి అనుభవాలు సాటిలేని ఆనందాన్ని ఇస్తాయి. అలానే సాటిలేని దుఖాన్ని కూడా మిగులుస్తాయి.నాకు జీవితంలో మొట్ట మొదటి సారి కూల్ డ్రింక్ తాగిన అనుభవం ఇంకా గుర్తుంది. మొదటి మామిడి కాయ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. తరువాత తిన్నప్పుడు మొట్ట మొదటి సారి తిన్నంత మజా ఉండదు. మొదటి సారి తాగిన జ్ఞాపకం మెదడులోనమోదయ్యి, రెండవసారి తాగిన అనుభవానికి అడ్డుపడటం వలన, రెండవ సారి మన ఆనందంలో ఉండే వ్యత్యాసం (డిఫరెన్షియల్ వాల్యూ) తగ్గిపోతుంది.
ఒక మనిషి ఒక విషయానికి అలవాటు పడిన తరువాత, దానికి సంబధించిన కోరిక అతని చేతనావస్థ (కాన్-షస్-నెస్) నుంచీ కలగటం తగ్గుతుంది. మెదడులోని కణాలు మార్పుకి లోనవ్వుతాయి. దీని వలన, అది అతని అంతశ్చేతన (అన్-కాన్-షస్) లో భాగమౌతుంది. అప్పుడు అతనికి ఏదో తెలియని శక్తి తనని అడిక్షన్ వైపుకి లాక్కుపోతున్నట్లు అనిపిస్తుంది. సిగరెట్ తాగేవాళ్ళకి, సిగరెట్ గుర్తు రాని వాతావరణం లో కూడా సడన్ గా సిగరెట్ తాగాలనిపించటం ఇందుకు ఒక ఉదాహరణ.
చివరిగా, వ్యసనం అంటే స్థూలం గా ఏదైనా ఒక విషయానికి జీవితంలోని సమతౌల్యాన్ని దెబ్బతీసే విధం గా,మితిమీరి అలవాటుపడటం. ఒక్కో వ్యసనం వలన నష్టాలు ప్రత్యక్షం గా ఉంటే ఇంకో వ్యసనం వలన పరోక్షంగా ఉంటాయి.ఒక్కొ వ్యసనం వలన తక్కువ నష్టాలుంటే వేరొక దానివలన ఎక్కువ నష్టాలుంటాయి. జీవితం లో ఆనందించటానికి అనేక మార్గాలున్న వ్యక్తి వ్యసనాలబారిన పడే అవకాశం తక్కువ. వ్యసనాలబారిన పడికూడా జీవిత సమతౌల్యత దెబ్బతిన కుండా ఉండాలంటే ఆవ్యక్తి చాలా ‘ప్రతిభ’ కలవాడై ఉండాలి. కాబట్టీ జీవితం లో సమతౌల్యత ముఖ్యం. చిన్న మోతాదులో మందు అయ్యినది పెద్దమోతాదులో విషం అవ్వటం వ్యసనాలకి బాగా వర్తిస్తుంది.
మనిషి మెదడు కీ, శరీరానికీ ఉన్న పరిమితుల వలన శాశ్వతమైన ఆనందం  అనేది కుదరని విషయం. తృప్తి పడటం కూడా మనిషి జీవన చర్య లో ఒక భాగం కావాలి. కొంత మంది ఎప్పుడు చూసినా ఉల్లాసం గా కనిపిస్తారు. మానసికం గా, శారీరకం గా ఆరోగ్యకరమైన సమతౌల్యమైన జీవితాన్ని గడపటం ద్వారా మనిషి తన లో ఉన్న ఆనందపు స్థాయి ని పెంచుకోవచ్చు.

“పరిమిత మోతాదు లో అయితే మందు”, అనే సూత్రానికి మాదక ద్రవ్యాలూ, అంతర్జాల శృంగారం (డ్రగ్స్, సైబర్ సెక్స్) మినహాయింపులు. ఎందుకంటే, వీటి విషయం లో, చిన్న మోతాదులో పుచ్చుకున్నది కొంత కోరిక ని తీర్చినా, అదే సమయం లో మరింత కోరిక ని కలిగిస్తుంది. అప్పుడు మన సంకల్పం మన అదుపులో ఉండదు. కాబట్టీ డ్రగ్స్ వంటి వాటికి పూర్తిగా దూరం గా ఉండటం మంచిది. వీటి విషయం లో “అడుసు తొక్కనేల?, కాలు కడుగనేల?” అనే సామెత వర్తిస్తుంది.

కొంతమంది కవిత్వం పట్లో, క్రికెట్ పట్లో లేక తమ ప్రియురాలి పట్లో ఒక తపన తో (పాషనేట్ గా) ఉంటారు. మరి పాషన్ కూడా ఒక అడిక్షనేనా?
సాంకేతికం గా చూస్తే, ” ‘అంతరాత్మ అనుమతీ,సమాజం అనుమతీ ఉన్న అడిక్షన్ ‘ నే పాషన్ అంటారు”, అనిపిస్తుంది.

సమాజంలో మెజారిటీ వ్యక్తులకి సాధారణమైన ప్రతిభ ఉంటుంది. అసాధారణమైన ప్రతిభ ఏ కొద్దిమందికో ఉంటుంది. సాధారణమైన టాలెంటూ, తెలివీ కల వ్యక్తులు ఏదైనా ఒక రంగం లో పేరు సంపాదించాలంటే, వారు ఆ రంగం లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే, వారి సమయం లో హెచ్చు భాగాన్ని ఆ రంగానికి కేటాయించాలి. దీని వలన వారి జీవితం లోని మిగిలిన పార్శ్వాలు నిర్లక్ష్యం చేయబడతాయి.ఇది కూడా ఒక విధమైన వ్యసనమే! అసాధారణమైన ప్రతిభ కలవారు మాత్రం ఏ రంగం లోనూ అతి శ్రమ పెట్టకుండా సమ తూకం పాటించగలరు.

మనం ప్రస్తుతం అనేక విషయాలకు బానిసలమయ్యి ఉంటాం. ఇవి కూడా వ్యసనాలే. కానీ మనకు మనం ఒక వ్యసనం లో ఉన్నాం అనే విషయం తెలియదు. వ్యసనానికి అంతరాయం కలిగినపుడు కదా వ్యసనం లో ఉన్నాం అని తెలిసేది! ఉదాహరణకి మనం విద్యుత్ (కరెంటు) కి దానితో పని చేసే ఉపకరణాలకీ అలవాటు పడి ఉన్నాం. ఏదైనా కరెంటు లేని పల్లెటూరికి వెళ్ళినప్పుడు, కరెంటు లేని పరిస్థితి లోని ఇబ్బంది కారణం గా  మన ఈ వ్యసనం బయట పడుతుంది.
అలవాటు లన్నీ వ్యసనాలేనా? మనం ఏ అలవాటు మీద ఆధారపడి, అవిలేకుండా చాలా ఇబ్బంది పడతామో అవన్నీ వ్యసనాలే. వ్యసనం లో ఆధారపడటం (డిపెండెన్సీ ) ఉంటుంది.మంచి అలవాటు లో డిపెండెన్సీ  ఉండదు. వ్యసనం కుంటివాళ్ళు వాడే ఊత కర్రలాంటిదైతే, అలవాటు పొద్దున్నే నడక కి వెళ్ళేటపుడు ఏ కుక్క నో కొట్టడానికి మనం దగ్గరుంచుకొనే పొన్ను కర్ర (వాకింగ్ స్టిక్) లాంటిది.

మరి పిల్లలమీద ప్రేమా, భార్య మీద ప్రేమా,స్నేహితుడి మీది అభిమానం ఇవన్నీ వ్యసనాలా? ఎందుకంటే ఒక్కోసారి మనం  భార్య లేకుండా ఉండలేం. ఒక్కోసారి పిల్లలు లేకుండా “జీవితం ఎంత దుర్భరమో కదా!” అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన డిపెండెన్సీ నే కదా?
భావోద్వేగపరమైన మానవ సంబంధాలలో “మానసికం గా ఆధారపడటం” అనేది ఒక సకారాత్మక (పాజిటివ్) అంశం. కానీ ఈ అధారపడటం అనేదానికి సమాజంకొన్ని పరిమితులు విధించింది. ఇక్కడ వ్యసనాన్ని సమాజం దృష్టి నుంచీ చూడాల్సి వస్తుంది.అలానే, ఆధారపడటం వలన జీవితం లోని ఇతర పార్శ్వాలు కుంచించుకుపోకుండా ఉంటే అప్పుడు మనం ఆధారపడిన విషయం వ్యసనం అవ్వదు.
ఈ ప్రకారం చూస్తే, పిల్లల పై ధృతరాష్ట్రుడి కి ఉన్న ప్రేమ లాంటి ప్రేమ నిస్సందేహం గా వ్యసనమే. అలానే కైక పై దశరధుడికి ఉన్న ప్రేమ కూడా వ్యసనమే.

సమాజం సమర్ధించే వ్యసనాలు కూడా ఉన్నాయి. అతి ప్రేమ, అతి మంచితనం మొదలైన వాటిని సమాజం పాజిటివ్ గా చూస్తుంది. తన భర్త చనిపోయాడని ఆత్మ హత్య చేసుకోబోయిన స్త్రీ గురించి జనాలు “భర్తంటే ఎంత ప్రేమా” అని ఎంతో గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను. ఒక కమ్యూనిస్టు నాయకుడు తనకున్న ఆస్తినంతటినీ కూలీలకీ , పార్టీ కి రాసిచ్చి, చివరికి సొంత ఇల్లుకూడా లేక, పార్టీ ఆఫీసు లో నే పడుకొని నానా కష్టాలు పడటం గురించి కూడా ప్రజలు గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను.కొందరి వ్యసనాల వలన సమాజానికి ఎన లేని మేలు జరుగుతుంది. గాంధీ గారు, పటేల్ వంటి నాయకులు దేశ ప్రజలకోసం, దేశ భవిత కోసం తమ జీవితాలనే ధారబోశారు. కానీ వ్యక్తి గతం గా గాంధీ గారి కొడుకే ఆయన ఒక “గొప్ప నాయకుడే కానీ, గొప్ప నాన్న  కాదు”, అని చెప్పాడు. ఆయా నాయకులంతా తమ యావత్సమయాన్నీ ప్రజా జీవితానికే కేటాయించటం వలన, కుటుంబం తో గడిపే సమయం తక్కువైన వారే!

నా మిత్రునితో ఈ వ్యాసం గురించి చర్చిస్తుంటే ఇలా అన్నాడు: “వ్యసనాలని వదిలించుకోవాలని ప్రయత్నించడమూ ఒక వ్యసనమే!”.

నా మిత్రుని వాదాన్ని కొనసాగిస్తే ఈ “వ్యసనాన్ని వదిలించుకొవాలనే వ్యసనాన్ని” వదిలించుకోవాలనుకోవటమొక వ్యసనం…ఇలా అంతం లేకుండా, ఒక ఇన్-ఫినిట్ లూప్ లో చెప్పుకుపోవచ్చు. కానీ ఇదంతా వాదనాపరమైనదే (తీరిటికల్).  క్రియాత్మకం (ప్రాక్టికల్) గా వ్యసనం ఒకరి జీవితం లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి,దాని మీద డిపెండెన్సీ ఉండాలి, దాని వలన మిగిలిన జీవిత భాగాలు నిర్లక్ష్యం చేయబడాలి. ఈ లక్షణాలన్నీ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకొనే కోరిక కి ఉంటే ఆ కోరిక కూడా వ్యసనమే!

గుండె ఎలా పనిచేస్తుందో తెలిసిన వాడికి గుండె జబ్బు రాకుండా పోదు కదా..? అలానే నాకు ఈ వ్యాసాన్ని రా…రా…స్తూపోవటం ఒక వ్యసనమయ్యినట్లుంది. ఇక ఉంటా!

ఆనందాన్వేషణ

ప్రకటనలు

11 thoughts on “వ్యసనాలు..కొన్ని ఆలోచనలు..”

  1. మనిషి స్వభావాలని (అతి మంచితనం), అబ్సెషన్ (అతి శుభ్రత) – ఇలా ప్రతిదీ మీరు వ్యసనమంటే ఎలా? 🙂

    నా మిత్రునితో ఈ వ్యాసం గురించి చర్చిస్తుంటే ఇలా అన్నాడు: “వ్యసనాలని వదిలించుకోవాలని ప్రయత్నించడమూ ఒక వ్యసనమే!” 🙂

    మేం నిన్న కష్టపడిరాసిన వ్యాఖ్యలని పీకేశారుగా 😦

    మెచ్చుకోండి

    1. “మనిషి స్వభావాలని (అతి మంచితనం), అబ్సెషన్ (అతి శుభ్రత) – ఇలా ప్రతిదీ మీరు వ్యసనమంటే ఎలా? :-)”
      మనిషి స్వభావాన్ని వ్యసనం చాలా వరకూ ప్రభావితం చేతుంది. ఉదాహరణకు రజకీయ నాయకుడి పదవీ కాంక్షనీ అతని స్వభావాన్నీ వేరు చేసి చూడటం కష్టం. అలనే డ్రగ్స్ తీసుకొనే వాళ్ళు చెసే చిన్న చిన్న నేరాలలు వారి డ్రగ్ ఎడిక్షన్ కారణం కదా..
      “నా మిత్రునితో ఈ వ్యాసం గురించి చర్చిస్తుంటే ఇలా అన్నాడు: “వ్యసనాలని వదిలించుకోవాలని ప్రయత్నించడమూ ఒక వ్యసనమే!” 🙂
      హమ్మ.. చివరికి సెటైర్ నా మీదికే వచ్చి పడిందిగా :-)..మీ మిత్రుని వాదాన్ని కొనసాగిస్తే ఈ “వ్యసనాన్ని వదిలించుకొవాలనే వ్యసనాన్ని” వదిలించుకోవాలనుకోవటమొక వ్యసనం…ఇలా అంతం లేకుండా ఒక ఇంఫినిట్ లూప్ లో చెప్పుకుపోవచ్చు. కానీ ఇదంతా తీరిటికల్…
      ప్రాక్టికల్ గా వ్యసనం ఒకరి జీవితం లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి,దాని మీద డిపెండెన్సీ ఉండాలి, దాని వలన మిగిలిన జీవిత భాగాలు నిర్లక్ష్యం చేయబడాలి. ఈ లక్షణాలన్నీ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకొనే కోరిక కి ఉంటే ఆ కోరిక కూడా వ్యసనమే.
      మేం నిన్న కష్టపడిరాసిన వ్యాఖ్యలని పీకేశారుగా 😦
      అయ్యో, తీసివేయలేదండీ. కొత్త టపా రాసి పాత టపా వ్యక్తిగతం చేశాను. మీ వ్యాఖ్య కి సమాధానం కూడ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ పాత టపా పబ్లిక్ చేశాను.మీకామెంట్లు ఈ టపాకి బాగా కింద ఉంటాయి,లేక ఇంతకు ముందు టపా చూడండి.

      మెచ్చుకోండి

  2. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

    చక్కని విశ్లేషణతో వ్యాసాన్ని వ్రాశారు. చాలా బాగుంది. `జె.బీ. గారు – అతి మంచితనం, అతి శుభ్రత – వీటినికూడా వ్యసనం అంటే ఎట్లా అని అన్నారు. మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం “అతి సర్వత్ర వర్జతే”. అని. కాబట్టి, పై రెండూ వ్యసనమనే చెప్పాలి. అతి శుభ్రంగా వుండాలి అని చెప్పి, రోజుకి వంద సార్లు చేతులు కడిగామనుకోండి, చేతులు పాచి పట్టిపోతాయి. కాబట్టే, సమతుల్యం జీవితంలో చాలా ముఖ్యం.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    మెచ్చుకోండి

  3. మీ Random Thoughts ని అక్షరబద్ధం చేసారనుకుంటా బాగుంది . కాని నాకు ఇది చదివిన తరవాత మాత్రం చాలా అనుమానాలు వచ్చాయి 🙂

    సక్సెస్ కి అలవాటు పడటం అంటూ ఉంటుడా ? అది సక్సెస్ ఐనా కాకపోయినా సరే అదే పని చేస్తుండం విసుగే కదా ? మీ ఫ్రెండ్ కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటే అనుకుంటా ఇది, ఎవరికైనా గడిచిపోయిన కాలం ఎప్పుడు ప్రస్తుతం కన్నా అందం గా కనపడుతుంది అనుకుంటా .

    అలాగే సమాజం అంగీకరించే వ్యసనాలు అంటారా వాటిని కాదేమో sociology ప్రకారం సమాజం లో రూల్స్ అనుగుణం గా నడుచుకునే వాళ్ళకి సహజం గానే క్రెడిట్స్ ఎక్కువ గా లభించాలి , అందుకే వాళ్లకి ఆ గౌరవం వస్తుంది .

    మెచ్చుకోండి

    1. “మీ ఫ్రెండ్ కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటే అనుకుంటా ఇది, ఎవరికైనా గడిచిపోయిన కాలం ఎప్పుడు ప్రస్తుతం కన్నా అందం గా కనపడుతుంది అనుకుంటా .”

      కానీ అది కనపడటమే అనుకొంటా. నిజం గా గడిచిపోయిన కాలం అంత బాగుంటే ఎందుకని అప్పటి అదాయ స్థాయికి మళ్ళీ దిగ జారటానికి ఇష్ట పడం?

      “కాదేమో sociology ప్రకారం సమాజం లో రూల్స్ అనుగుణం గా నడుచుకునే వాళ్ళకి సహజం గానే క్రెడిట్స్ ఎక్కువ గా లభించాలి , అందుకే వాళ్లకి ఆ గౌరవం వస్తుంది .”
      వ్యసనాలు అన్నిటినీ నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పేది సమాజపరం గా సబబు. కానీ వ్యక్తి పరం గా చూసినప్పుడు,ఆ వ్యక్తి మిగిలిన విషయలలో చాలా కోల్పోయి ఉండవచ్చును. ఉదాహరణ కి అతని కుటుంబ జీవనానికి సమయం ఉండి ఉండక పోవచ్చును. అప్పుడు వ్యక్తిగతం గా అది మంచిది కాదు కదా?

      మెచ్చుకోండి

      1. Yes exactly !
        కానీ అది కనపడటమే అనుకొంటా. నిజం గా గడిచిపోయిన కాలం అంత బాగుంటే ఎందుకని అప్పటి అదాయ స్థాయికి మళ్ళీ దిగ జారటానికి ఇష్ట పడం?
        ———————
        నేను సరిగా మాట్లల్లో పెట్టలేకపోయాను , ఎప్పడికప్పుడు మనం అలా అనుకుంటూ ఉంటాము నిజం గా మాత్రం ఆ కాలం లోకి వెళ్లలనుకోము ఎందుకంటే ఆ దాటి వచ్చిన కస్టాలు మనకు తెలుసు కదా 🙂

        మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s