స్వేఛ్ఛాఇఛ్ఛ, లేక ఫ్రీ విల్, ఉందా..లేదా..?

ఒక ఆకలి గా ఉన్న కుక్క కి మాంసం ముక్క దొరికిందనుకోండి, అది వెంటనే ఆ ముక్కని తినేస్తుంది. దాని కోరిక కు తినాలా వద్దా అనే ఛాయిస్ లేదు. అంటే దాని విల్ ఆకలి కి బానిస.
ఆ మాంసం ముక్క పక్కన ఎవరైనా ఒక దుడ్డు కర్ర పట్టుకొని నిలబడితే, కుక్క కి భయం వేస్తుంది. కానీ ఆకలి వలన తినాలని కూడా అనిపిస్తుంది. కుక్క ఆ మాంసం ముక్క ని తింటుందా లేదా అనేది ఆ క్షణం లో ఆ కుక్క భయం యొక్క మరియూ ఆకలి యొక్క ఉమ్మడి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. కుక్క కి ఆకలి మరీ ఎక్కువైతే తన్నులను లెక్క చేయకుండా ముక్క తినటానికి ప్రయత్నిస్తుంది. దానికి తన్నుల భయం ఎక్కువైతే బ్రతికుంటే తరువాత తినవచ్చులే అన్నట్లు గా అక్కడి నుంచీ జారుకొంటుంది. ఈ సంఘటన లో కుక్క కి ఉన్న ఆప్షన్లు పెరిగాయి. విల్ కి ఉన్న డిగ్రీ ఆఫ్ ఫ్రీడంపెరిగింది.
మనిషి కుక్క కంటే చాలా సంక్లిష్టమైన జీవి. మీరు మధ్య యుగాల నాటి ఒక రాజు అనుకోండి. మిమ్మల్ని వేరొక రాజు యుధ్ధం లో ఓడించి కటకటాలలో పెట్టి, నాలుగు రోజులు భోజనం లేకుండా మాడ్చి, అప్పుడు ఒక అన్నం గిన్నె మీ ముందుకు తోశాడనుకొందాం. మీరు అభిమాన ధనులైతే అన్నం తినరు. ఆన్నం తినకుండా చనిపోవటానికి కూడా రెడీ. మీకు ఆకలి ఎక్కువైతే అభిమానాన్ని పక్కన పెట్టి అన్నం తింటారు. ఇక్కడ కూడా మీ కోరిక ముందు ఉన్న ఆప్షన్లు పెరిగాయి.
మీరు మళ్ళీ ఒక చక్రవర్తి అయ్యారు…ఊరికే…అనుకోండి. శతృ దేశపు రాజు మీ మీదికి దండెత్తి వచ్చి మీకు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు.
1. ఓడిపోయినట్టు ఒప్పుకొని రాజ్యాన్ని స్వాధీన పరచి మీరు సామంత రాజులు గా మారటం.
2.ఆయనకు కొన్ని ధన కనక వాహనాదులు సమర్పించి సంధి చేసుకోవటం.
3. యుధ్ధానికి సిధ్ధపడటం.
కానీ మనిషి గా మీరు బుధ్ధి జీవి. ఆలోచనలు ఉన్నాయి. మీకు అనుభవం కల మంత్రులు ఉన్నారు. వారికి ముందు మూడు తరాల చరిత్ర తెలుసు. ఇక ముందు రెండు తరాల లో ఏమి జరుగ బోతోందో ఊహించి చెప్ప గల దిట్టలు ఆ మంత్రులు. అప్పుడు మీరు ఆ మంత్రులను సమావేశ పరిచి, సమాలోచనలు జరిపి, శత్రు రాజు ఇచ్చిన ఆప్షన్ ల తో పాటు మీకు వేరే ఏ ఏ ఆప్షన్లు ఉన్నాయో కనుక్కొంటారు. తరువాత మీకూ ప్రజలకూ ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకొంటారు. ఇక్కడ మీరు తీసుకొన్న నిర్ణయం కూడా శత్రు రాజు ఇచ్చిన ఆప్షన్లు,మంత్రులు ఇచ్చిన సల హాలూ, వారి తెలివి తేటలూ,మీదృష్టి లో ప్రజలకి ఏది మేలు చేస్తుంది.. మొదలైన కారణాలకి లోబడి ఉంటుంది. ఒక్క సారి ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత, ఆ నిర్ణయం అమలు చేయటం మీ చేతులలో పని. కానీ ఆ నిర్ణయం వలన వచ్చే ఫలితం మీ చేతులలో ఉండదు. ఒక వేళ యుధ్ధం చేయాలని నిర్ణయించుకొంటే,యుధ్ధం లో గెలవగలగటం పూర్తిగా మీ చేతులలో ఉండదు. కానీ యుధ్ధం చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే యుధ్ధం మొదలు పెట్టటం మీ చేతులలోనే ఉంది. ఒకవేళ మీరు తిక్కల రాజు అయ్యి ఉండి ఒక ర్యాండం డెసిషన్ తీసుకున్నా కూడా,ఆ డెసిషన్ వెనుక ఏవో కొన్ని సైకలాజికల్ డైనమిక్స్ కారణం గా ఉంటాయి.  ఇక్కడ మనిషి ఇఛ్ఛ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడం పెరగటం మనం చూస్తాం. ఇది చాలా వరకూ మనిషి ఆలోచనా శక్తి వలన.విల్ కి ఉన్న డిగ్రీ ఆఫ్ ఫ్రీడం మరింత పెరిగింది.     కానీ మనిషి ఇఛ్ఛ ఇంకా కొన్ని కారణాల వలన పుట్టి,కొన్ని పరిమితులకి లోబడే ఉంది.
ఫ్రీ విల్ అంటే ఏమిటి? మనిషి కోరిక కి కారణాలు లేకుండా ఉండటమా? లేక మనిషి ఏ నిర్ణయమైనా తీసుకోగలగటమా? మనిషి కోరిక కి కారణాల నుంచీ మినహాయింపులేదు. ప్రతి కోరికకీ ఏవో కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి నిర్ణయం వెనుకా ఏవో కొన్నిశక్తుల కలయిక ఉంటుంది. మనిషి ముందున్న ఆప్షన్లలో  దేనిని ఎంపిక చేసుకొంటాడూ అనేది కూడా అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈకారణాలలో మనిషి వ్యక్తిత్వం కూడా ఒకటి. పిరికి వ్యక్తిత్వం కలవాడు యుధ్ధం చేయాలనే నిర్ణయం తీసుకోలేదు.కాబట్టీ పిరికి వాడికి యుధ్ధం విషయం లో ఫ్రీ విల్ పని చేయనట్లే.మనిషి వ్యక్తిత్వమే అనేక కారణాల సమాహారం. మనిషి జీవితం లో అతని ఇఛ్ఛ మీద అధారపడని అనేక అంశాలు కూడా ఉంటాయి. ఒక సారి తాజ్ మహల్ చూసిన వాడు తాజ్ మహల్ ను మరిచిపోవాలనుకొన్నా మరిచి పోగలడా? ఇక చేతులతో కొండలని పిండి చేయటం లాంటి అనేక విషయాలు మనిషి ఇఛ్ఛ కి వెలుపల ఉన్నవే.
ఇఛ్ఛకీ ప్రయత్నానికీ కల సంబంధం ఏమిటి?పరిస్థితుల వలన మన ఇఛ్ఛ ఏర్పడితుంది. కానీ మన ఇఛ్ఛ కి కూడా పరిస్థితులని మార్చేశక్తి ఉంది. నాకు కారు డ్రైవ్ చేయటం రాదు.  కానీ, డ్రైవ్ చేయాలనే ఇఛ్ఛ ఉంది.  ఇఛ్ఛ కలిగిన వెంటనే ఒక కారు బయటకి తీసి డ్రైవ్ చేయలేను. ఒక మనిషి సహాయం తో డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకొని ఆ రిఫ్లెక్సెస్ మన అంతశ్చేతనలో భాగమయ్యాక మనకు డ్రైవింగ్ వచ్చేసినట్లే. అప్పుడు డ్రైవ్ చెయ్యాలనిపిచిందే తడవు గా  కారు బయటికి తీసి డ్రైవ్ చేయవచ్చును. అంటే మన విల్ వలన ముందు గా ఉన్న పరిస్థితిని, అంటే డ్రైవింగ్ రాకపోవటాన్ని అధిగమించి, డ్రైవింగ్ వచ్చే స్థితి లోకి చేరాం. ఈ పరిస్థితి కి కారణం మనం చేసిన ప్రయత్నం . ఇప్పుడు డైవ్ చేయటం మన విల్ పరిధి లోనిది అయ్యింది.
ఫ్రీ విల్ అనేది . ఒక కట్టుగొయ్యకి కట్టబడిన గేదె లాంటిది అంటారు. దాని స్వేఛ్ఛ తాడు పొడవు కి లోబడి ఉంటుంది. ఇక్కడతాడు పొడవు అనేది పరిస్థితులను సూచిస్తుంది. మనిషికి తన ఇఛ్ఛ యొక్క కారణలైన  పరిస్థితులను అధిగమించి  స్వేఛ్ఛ సంపాదించే శక్తి లేదు అని ఈ కట్టుగొయ్య ఉదహరణ భావం. కానీ దీనికి మనం ఒక విషయాన్ని అదనం గా చేరచవచ్చు.  అదేమిటంటే ఆ తాడు రబ్బర్ లా సాగే ఎలాస్టిక్ తాడు. దాని పొడవుని మన యొక్క విల్ పవర్ లేక ప్రయత్నం వలన పెంచ వచ్చును. “కారు తోలే శక్తి” మొదట కారు నేర్చుకోనక  పూర్వం మన తక్షణ ఇఛ్ఛ పరిధికి బయట ఉంది. కానీ మన ప్రయత్నం వలన అది మన ఇఛ్ఛ పరిధి లోకి వచ్చేసింది. అంటే తాడు పొడవు పెరిగినట్లే. అయితే ఎలాస్టిక్ తాడు కొంత పొడవు తరువాత మరి సాగదు.  అలానే ప్రయత్నం  వలన సాధించే విషయాలకూ ఒక పరిధి ఉంటుంది. ఎవరైన కదిలే రైలుని ఎప్పటికైనా తమ చిటికెన వేలు తో ఆపగలం అనుకొంటే అది అమాయకత్వమే కదా…
అలానే, ఒక్క సారి డ్రైవింగ్ నేర్చుకొన్న తరువాత ఆ రిఫ్లెక్సెస్ మనలో భాగమౌతాయి.  తరువాత వాటిని వదిలించుకోవటమనేది మన విల్ పరిధిలో లేని అంశం.
మొత్తం మీద చూసినట్లైతే, ఫ్రీ విల్ అనేది మౌలికం గా పరిస్థుతుల తో ఏర్పడిన ఒక ఆకృతి మత్రమే. మనం చిన్న చిన్న మేకులతో నేల మీద ఒక పక్షి ఆకారం వచ్చేలా అమర్చామనుకోండి. అక్కడ పక్షి ఉన్నట్లా లేనట్లా? పక్షి అనేది ఒక ఆకారం గా మాత్రమే ఉన్నది. కానీ భౌతికం గా అక్కడ ఉన్నది మేకులు మాత్రమే. అలానే, ఫ్రీ విల్ అనేది ఫ్రీ గా కనిపిస్తుంది. ఒక మనిషి ఏ క్షణం లోనైనా ఒక నిర్ణయం తీసుకొన్నాడంటే దాని వెనుక తెలిసింటువంటీ, మరియూ తెలియనటువంటీ అనేక భౌతిక, మానసిక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని అంతర్గత కారణాలైతే, కొన్ని బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాలు.  ఈ కారణాలను అధిగమించి, ఏ కారణం వలనా కాకుండా, మనిషి ఏదైన నిర్ణయం తీసుకొంటే అది ఫ్రీ విల్ అవుతుంది. కానీ, మన నిర్ణయాలమీద బిగ్ బ్యాంగ్ నుంచీ జీవ పరిణామం వరకూ అనేక విషయాల ప్రత్యక్ష,పరోక్ష ప్రభావం ఉంటుంది. ఈ కారణాలు కనపడేవి కావు. మనిషి నిర్ణయమే కనపడుతుంది. మనిషి నిర్ణయం వెనుక కారణం కనపడనంత మాత్రాన కారణం అసలు లేనట్లు కాదుకదా.
ఈ ప్రపంచం మొత్తం ఒక పరుగెట్టే రైలు బండి లాంటిదైతే, అందులో ఉన్నఒక ప్రయాణికుడి లాంటిదే ఫ్రీ విల్. ఆ ప్రయాణికుడి కి రైలు భోగీ లో ఏ మూలకైనా పోయే స్వేఛ్ఛ ఉంది. కానీ రైలు బండి ప్రయణిచే దిక్కుని బట్టే ఈ ప్రయాణికుడు ప్రయాణించే దిక్కు ఉంటుంది.

ప్రకటనలు

8 thoughts on “స్వేఛ్ఛాఇఛ్ఛ, లేక ఫ్రీ విల్, ఉందా..లేదా..?

 1. మంచి టాపిక్ ఎంచుకున్నారు. కానీ, మరో రకంగా ఎప్రోచ్ అయ్యుంటే నాకు తృప్తిగా ఉండేది. కానీ బానే ఉంది. సో మొత్తానికి మీరు ఫ్రీ విల్ లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుందంతే అంటున్నారు. లేదా లిమిటెడ్ సెన్స్‌లో మాత్రమే ఉంటుంది అంటున్నారా?

  మెచ్చుకోండి

 2. శ్రీ బొందలపాటి వారికి, నమస్కారములు.

  చక్కటి వ్యాసాన్ని అందించారు. అయితే, నా ఉద్యేశ్యంలొ మీరు చెప్పిన కొన్ని విషయాలకి అర్ధాలు వేరని అనుకుంటాను. `స్వేఛ్చా ఇఛ్చా’ అనే పదాలకి ` ఫ్రీ విళ్ అని ఆంగ్ల తర్జుమా చెప్పారు. ఫ్రీ విల్ కి తెలుగులో అర్ధం `సంకల్పం’ ( only a primary proposal of mind ) అని. ఇది మనస్సుకి చెందినది. ఇక, స్వేఛ్చా ఇఛ్చ లో, ఇఛ్చ అనేది సంస్కృత పదం. అర్ధం: కోరిక అని. సంకల్పం, కోరిక రెండూ ఒకటి కాదని మాత్రం నేను చెప్పగలను. శ్రీ సరస్వతీదేవిని ప్రార్ధించేటప్పుడు, `జ్ఞానశక్తిని; ఇఛ్చాశక్తిని; క్రియాశక్తిని ఇవ్వమని ప్రార్ధిస్తుంటారు. మొదటగా జ్ఞానశక్తి కలిగితే, సంకల్పం చేయగలిగే స్థితి కలుగుతుంది. ఇఛ్చ కలిగినప్పుడు, దానిని సంకల్ప బలం (మనోబలం) చేత మరింత బలపరచి, అప్పుడు క్రియాశక్తిచే కార్యరూపంలోకి మార్చుకుంటాము. `సంకల్పానికి ఏదైనా కోరిక ఆధారమై వుండనక్కరలేదు కానీ, ఏదైనా కారణం వుండివుంటుంది. కానీ, కోరికకి కి సంకల్పం ఆధారమై వుంటుంది.
  ఉదా:- కొంతమంది గొప్ప వ్యక్తులు హిమాలయాలు ఎక్కారు. నాకుకూడా వాటిని ఎక్కాలనే తీవ్రమైన కోరిక కలిగింది. ఇప్పుడు, నా మనసులో ఈ విషయానికి సంబంధించి ఒక సంకల్పం కలిగింది. ఇప్పుడు నా సంకల్పం బలపడి, నా కోరికకు ఒక నిర్దుష్టమైన రూపం ఇచ్చి, దానిని నెరవేస్ర్చుకోవటం జరుగుతుంది.(ఇక్కడ కోరిక ముందు, సంకల్పం తరువాత)
  ఉదా:- ఒక దినపత్రికను చదవాలని మనసులొ ఒక సంకల్పం కలిగింది. ఏ కోరికా లేదు. అయితే, ఇంతలొ నాకు లాటరీ వచ్చిందని, పత్రికలో వచ్చిందనీ తెలిసింది. ఇప్పుడది తెలుకోవటానికోసం నాలో తీవ్రమైన కోరిక కలిగింది.( ఇక్కడ సంకల్పం ముందు, కోరిక తరువాత )

  “కారణాలను అధిగమించి, ఏ కారణం వలన కాకుండా, మనిషి ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అది ఫ్రీ విల్ అవుతుందీ’ అని మీరు అన్నారు. అయితే, దీనితో నేను ఏకీభవించలేను. అందుకు ఒక ఉదా:- నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటే, అప్పుడు చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాననుకోండి.కానీ, నా సంకల్పం లేదా ఒకవేళ అది కోరిక అయినా, అది నెరవేరదు. ఎందుకంటే, నా కోరికకి కారణం ఏదీ ఆధారముగా లేదు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  మెచ్చుకోండి

  1. మాధవరావు గారూ,
   సంకల్పం అనే మాట నాకు తట్టలేదు. ఈ మాట బాగుంది. రోజు రోజుకీ నా తెలుగు మసిబారిపోతోంది.
   నేను స్వేఛ్ఛా సంకల్పం గురించి మాట్లడాను, ఒట్టి సంకల్పం కాదు. సంకల్పానికి కూడా కారణాలు ఉంటాయి కదా? స్వేఛ్ఛా సంకల్పానికి కారణాలు ఉండకూడదు. అలా ఉంటే అటువంటి సంకల్పం దాని కారణాలకి బందీ అయినట్లే. సంకల్పానికి కారణాలు లేక పోవటం మనిషి విషయం లో సాధ్యం కాదు. జంతువుల సంకల్పానికి సరళమైన కారణాలుంటే మనిషి సంకల్పానికి కొంచెం సంక్లిష్టమైన కారణాలుంటాయి. ప్రత్యక్ష కారణాలు కొన్నైతే,పరోక్ష కారణాలు ఎన్నో…

   మెచ్చుకోండి

 3. బొందలపాటి గారు,
  మంచి విషయం మీద రాశారు. స్వేచ్చా సంకల్పం కూడా పరిమితులకి లోబడి ఉంటుందనేది నిజమే అనిపిస్తుంది. కాకపోతే మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కాదని తెలుస్తుంది.

  స్వేచ్చా సంకల్పాన్నీ, లాజికల్ సంకల్పాన్నీ వాటి మధ్య ఉండే పరస్పర ప్రభావాల్నీ గురించి అర్థం చేసుకుంటే మరింత లోతుగా విషయాన్ని పరిశీలించగలుగుతాం.

  లాజికల్ సంకల్పం ప్రభావం వల్ల, స్వేచ్చా సంకల్పం కూడా పరిమితుల్ని అలవాటు చేసుకున్నప్పుడు, ఈ రెండింటికీ తేడా ఉండదు. అందుకే స్వేచ్చా సంకల్పం కూడా పరిమితులకి లోబడే ఉన్నట్లనిపిస్తుంది.

  మెచ్చుకోండి

  1. వీకెండ్ పొలిటీషియన్ గారు ,
   లాజికల్ సంకల్పం గురించి మీరు చెప్పింది తాజా గా ఉంది. లాజికల్ సంకల్పం వలన మనకు మనమే కొన్ని పరిమితులు విధించుకుంటామనుకొంటా.. చిన్నపిల్లలలో లాజికల్ సంకల్పం తక్కువ కదా..అయినా వాళ్ళ స్వేఛ్ఛా సంకల్పం యొక్క స్వేఛ్ఛ కీ పరిమితులు ఉంటాయి అనుకొంటా..

   మెచ్చుకోండి

   1. స్వేచ్చా సంకల్పం ఎప్పుడూ ఏదో ఒక స్థాయిలో లాజికల్ సంకల్పం విధించే పరిమితులకు లోబడే ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచం నిండా స్వేచ్చా సంకల్పాలు మాత్రమే ఉంటాయో అప్పుడే అది మనగలుగుతుంది. ప్రపంచంలో ఏ ఒక్క స్వేచ్చా సంకల్పమైనా లాజికల్ సంకల్పానికి లొంగిందో, ఇక అంతే దాని పరిమితులకి మిగిలిన అన్ని స్వేచ్చా సంకల్పాలూ రియాక్ట్ అవక తప్పదు. అందుకె మనం దాదాపుగా స్వేచ్చా సంకల్పం అనేదాని ఉనికిని కూడా గుర్తించడం మానేస్తాము.

    స్వేచ్చా సంకల్పం, ప్రాపంచిక పరిమితులకి లోబడకుండా ఉండగలిగింది అంటే అది ఈ ప్రపంచంలో మనలేదు అని అర్థం. ఎంతోకొంత ప్రాపంచిక పరిమితులకి లోబడే స్వేచ్చా సంకల్పం ఉంటుంది అని గుర్తించినప్పటికీ, మనిషి అంతర్గతంగా తనలోని స్వేచ్చా సంకల్పం, లాజికల్ సంకల్పం వేరు వేరు అని వాటి ఉనికిని గుర్తించి కాపాడుకోగలిగితే ఆ రెండూ ఒకదాన్నొకటి ఎలా ప్రభావం చేసుకోగలుతున్నాయో అర్థం చేసుకోగలుగుతాడు. అలా కానప్పుడు కేవలం లాజికల్ సంకల్పం మాత్రమే ఉంది అని అనిపిస్తుంది.

    PS: I am not an expert on these things. But I spent time in understanding myself and formed my own theory. It is difficult to discuss these in blogs.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s