కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ అనబడే “శృతి ఆకలి కథ”

శృతి ‘లిప్-స్టిక్’ వేసుకొని పెదాలు దగ్గర పెట్టి అద్దం లో చూసుకొంది. రక్తం కారుతున్నట్లు ఎర్రగా ఉన్నాయి పెదాలు. “పెదాలు ఎంత ఎర్ర గా ఉంటే అంత మంచిదట”, తన సూపర్వైజర్  చెప్పింది.  తన యూనిఫాం చీర కుచ్చిళ్ళు దోపి చూసుకొంది. బొడ్డు కింది కి రాక పోతే సూపర్వైజర్  రమ ఊరుకోదు.
శృతి ఒక “ఈవెంట్ మానేజ్మెంట్” కంపెనీ లో పని చేస్తోంది. ఆ రోజు సాయంత్రం ఒక మంత్రి గారి బావమరిది కూతురు పెళ్ళి రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ ని శృతి వాళ్ళ కంపెనీ ఆర్గనైజ్ చేస్తోంది.
శృతి సూర్యాపేట నుంచీ ఐదు గంటలకి వచ్చింది. అక్కడ వాళ్ళ నాన్న రంగయ్య కి ఏమీ బాగోలేదు. రంగయ్య దర్జీ పని చేసి, తల్లి లేని లోటు తెలియకుండా, ఎలానో శృతి ని బీయే వరకూ చదివించాడు. ఈ మధ్య డాక్టర్లు అతనికి మూత్ర పిండాల వ్యాధి అని చెప్పారు.
తమ్ముడు నగేష్ పదో తరగతి లో ఉన్నాడు. వాడు చదువు లో మంచి మెరిక. శృతికి వాడంటే ప్రాణం.వాడిని ఎలాగైనా గొప్ప చదువు చదివించి ఏ అమెరికా నో పంపించాలని శృతి ఆశ. గవర్నమెంట్ కాలేజీ లో తెలుగు మీడియం లో బీయే చేసిన శృతి కి ఏమి ఉద్యోగం దొరుకుతుంది? అందుకే ఆ ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ లో అతిధులకి సత్కారాలు చేసే ఆ చిన్న ఉద్యోగం లో చేరి పోయింది.అదైనా తను కాస్త తెల్ల గా ఉంటుంది కాబట్టీ ఇచ్చారు. వారానికొక సారి సూర్యా పేట వెళ్ళి తన తండ్రినీ తమ్ముడినీ చూసి వస్తూ ఉంటుంది.ఈ రోజు ప్రయాణం లో భోజనం చేయటం కుదరలేదు..శృతి కడుపు లో ఎలుకలు పరుగెడుతున్నాయి.రూం కి వచ్చే సరికే సాయంత్రం ఐదైపోయింది..ఇప్పుడు త్వరగా ఫంక్షన్ కి వెళ్ళాలి..

వ్యాన్ హారన్ విని ఈ లోకం లోకి వచ్చింది శృతి. డ్రైవర్ అరుస్తున్నాడు, “టైమైపోతోంది..జల్దీ..జల్దీ”
వ్యాన్ లో ఆమె తో పాటు పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అతిధులకి సత్కారాలు చేసే వారే. అందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళలో షబ్నం కూడా ఉంది. అది “నార్త్ ఈస్ట్” వాడి కీ బెంగాలీ ఆమె కీ పుట్టిన అందగత్తె. దానికి పక్క వేషాలు చాలా ఉన్నాయి.

*******************

వ్యాన్ వాళ్ళని తీసుకెళ్ళి కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ దగ్గర దిగ బెట్టింది.ఫంక్షన్ హాల్ చాలా విశాలం గా, ఇరుకు సిటీ లొ బృందావనం లా ఉంది. దాని అలంకరణ కి మూడు  క్వింటాళ్ళ పువ్వులన్నా ఖర్చుపెట్టి ఉంటారు.

అతిధులు ఒక్కరొక్కరే రాసాగారు. దాదాపు అందరూ ఖరీదైన కార్లలో వస్తున్నారు. మొకమంతా నవ్వు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు “బాగున్నారా?”, “హౌ ఆర్ యూ?” అంటూ కరచాలనాలు చేసుకొంటూ పలుకరిస్తున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళూ “నమస్తే” అని చేతులు జోడిస్తున్నారు.మగ వాళ్ళు బంద్ గలా సూట్లూ,  షేర్వాణీలూ,లాల్చీ పైజమాల్లో డాబు గా దిగుతున్నారు.అందం గా ఉన్న స్త్రీల డబ్బు ,వారి మేకప్ లో కనిపిస్తుంటే, అందం లేని స్త్రీల డబ్బు, వారి నగలలో కనిపిస్తోంది. కొందరు కల వారి పిల్లలు చాలా సింపుల్ గా, జీన్స్ టీ షర్ట్ లో ఉన్నారు. వారికి మేకప్ అంటే ఇష్టం ఉన్నట్లు లేదు. కానీ వారి చేతులకి డైమండ్ రింగ్స్ ఒకటో రెండో సింపుల్ గా మెరుస్తున్నాయి.
ఫంక్షన్ హాల్ లో క్లోజ్-సర్క్యూట్ టీవీ, జెయింట్ “ఎల్ సీ డీ”  స్క్రీన్ ల మీద, వచ్చే అతిధులని వారి వారి హోదా ని బట్టి దగ్గర గా నో, దూరం గా నో , ఎక్కువ సేపో, తక్కువ సేపో, చూపిస్తోంది.వధూ వరుల తల్లి తండ్రులు వచ్చిన వాళ్ళతో వారి వారి హోదా ని బట్టి ఎక్కువ నవ్వుతూ నో,తక్కువ నవ్వుతూ నో పలుకరిస్తున్నారు.
టీవీ లో అంతకు ముందు రోజు వధువూ వరుడూ డ్యాన్స్ చేసిన ఒక సినిమా పాటని చూపిస్తున్నారు. వేదిక దగ్గర ఒక సినిమా క్రేన్ వచ్చే వాళ్ళని షూట్ చేస్తోంది. స్టేజీ పక్కన ఆంధ్రుల అభిమాన గాయకుడొకాయన తన గానామృతం తో అతిధులను అలరిస్తున్నాడు.
ఎం పీలు, ఎంఎల్యే లూ, సినిమా నటులూ, పారిశ్రామిక వేత్తలూ,మహిళా సంఘం సభ్యులూ,ప్రతి పక్షం వారూ, అధికార పక్షం వారూ, తెలంగాణా వాదులూ, సమైక్య వాదులూ… రోజు వారి టీవీ వార్తలలో కనపడే పెద్దలంతా  వస్తున్నారు..వెళ్తున్నారు.
శృతి సర్వర్స్ ని పిలిచి వచ్చేవారికి ముందు మంచి నీళ్ళ బాటిల్ ఇప్పిస్తోంది… తరువాత వారికి ఒక సీట్ చూపిస్తోంది.చిరు నవ్వుతో వారికి ఏమి కావాలో కనుక్కొంటూంది….కడుపులో ఆకలి మాత్రం నవ్వుతున్న పెదాలను వంకర తిప్పుతోంది.
హాల్ నిండా రక రకాల వంటకాలు ఉన్నాయి, ఒక వైపు నార్త్ ఇండియన్ వంటలు, ఒక వైపు సౌత్ ఇండియన్ వంటలు…ఒక చోట టిఫిన్ మాత్రమే చేసే వారికి  టిఫిన్లు..ఇంకొక చోట ఛాట్స్, పళ్ళు, అయిస్ క్రీంలు, ఇంకొక స్టాల్ లో ఇరానీ వంటలు,వేరొక స్టాల్ లో ఆఫ్ఘన్ పదార్ధాలు,చవులూరించే చైనీస్ నూడుల్సూ, సలాడ్లు, స్వీట్లు..అక్కడ ఉన్న తినుబండారాలతో ఒక ఊరిని ఒక సంవత్సరం పాటు పోషించవచ్చు. పక్కనే నాన్ వెజ్ సెక్షన్.అక్కడ చికెన్, మటన్, కోస్తా రొయ్యలూ, గోదావరి చేపలూ, పీతలూ సకల తినదగిన ప్రాణులూ.
పక్కనే మందు బాబుల కోసం ఒక సెక్షన్, అక్కడ్ ఖరీదైన కాక్ టైల్సూ,  నిషా ఎక్కని మాక్ టైల్సూ..
వచ్చిన వాళ్ళు వడ్డించే వాళ్ళతో “అంత వద్దు.అంత వద్దు తక్కువ..చాలు”, అంటున్నారు. పక్క వాళ్ళతో “తిండి తగ్గిపోయింది నాకు బీపీ…నాకు సుగర్..”, అని చెప్తున్నారు. కొంత మంది అన్నిపదార్ధాలలో ఏది తినాలో తెలియక, అన్నీ పెట్టుకొని, అన్నీ పక్క నున్న చెత్త బుట్టలో పడ వేస్తున్నారు.పిల్లలు అయిస్ క్రీం పెట్టుకొని సగం కింద పోగొడుతున్నారు. మందు బాబులు ముందే ఔటైపోయి కుర్చీలకి చేరగిల బడుతున్నారు.
కానీ..శృతి కడుపులో ఎలుకల జోరెక్కువైంది. ఎవడో ఒక టీ షర్ట్ యువకుడు శృతి దగ్గరికి వచ్చి ఏదో ఇరానీ ఐటం గురించి మొదట తెలుగు లో అడిగి, ఆపై ఇంగ్లీషు లో దడ దడా ఏమిటో మాట్లాడుతున్నాడు. వాడి స్పీడు అందుకోవటం శృతికి గగనం అయిపోయింది. శృతి తోటి మర్యాద గత్తెలు,ఫంక్షన్ కి వచ్చిన తెలుగు జనాల కి హిందీ లో మర్యాద చేస్తున్నారు.”అబ్బా..!కడుపులో ఎలుకలు..” ఇంతలో, ఒక మధుబాబు కొంచెం తూలుకొంటూ శృతి దగ్గరికి వచ్చి, “ఆప్ కా ఫోన్ నంబర్ క్యా హై?”అని అడుగుతున్నాడు. శృతి మనసు లో “ఈ జాబ్ చేసే వాళ్ళంటే ప్రతి వెధవకీ అలుసే !” అనుకొని, షబ్నం ని చూపించి,”ఆప్ కో షాయద్ వో మదద్ కర్ సక్తీ హై”అంది. వాడు ఓ వంకర నవ్వు నవ్వి షబ్నం తో ఏదో మాట్లాడాడు. చేతిలో పెన్నుతో ఏదో రాసుకొంటూ పోయాడు.
శృతి ఆకలి బాధ తీరలేదు..కడుపు లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి.  ఆమె కి “బీ యే” లో ఇంగ్లీష్ లెక్చరర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, “వాటర్ వాటర్ ఎవిరీవేర్, బట్ నో డ్రాప్ టు డ్రింక్”. ఓ అతిథి సర్వర్ మీద అరుస్తున్నాడు, “నేను చెప్పింది చెయ్యి…నాకు సలహాలు ఇవ్వ వద్దు”.
చిన్న పిల్లాడొకడు ఐస్ క్రీం కింద పడేసుకొంటూ తింటున్నాడు. వాళ్ళమ్మ, పట్టు చీర కట్టుకొన్న మధ్య వయసామె, వచ్చి, “కొంచెం ఆ ఐస్ క్రీం తినిపిస్తా అమ్మా?, అంది.
శృతి వాడికి ఐస్ క్రీం తినిపించసాగింది. ఆమె కి నోట్లో నీళ్ళూరుతున్నాయి..పక్క డస్బిన్ లో ఊసి వచ్చింది.
*********
నెమ్మది గా జనాలు తగ్గారు. రాత్రి పదకొండున్నర కి రిసెప్షన్ అయిపోయింది. కార్లు వెళ్ళిపోయాయి. వాటి తో పాటు పట్టు చీరలు వెళ్ళి పోయాయి. శృతికి ఆకలి అప్పటికే చచ్చిపోయింది. తల నొప్పి గా ఉంది. ఆమె కి కళ్ళు తిరుగుతున్నాయి. ..రక రకాల వంటకాలు..ఏది తినాలి..! తనకిష్టమైన గుత్తి వంకాయ కూర పెట్టుకొంది..ముద్ద కలుపుకొని ఆబగా రెండు ముద్దలు తింది..ఎక్కిళ్ళు వచ్చాయి..నీళ్ళు..నీళ్ళేవి..?..
“నీళ్ళ బాటిళ్ళు అయిపోయాయి” ఎవరో చెప్పారు. ఇంకొ రెండు ముద్దలు లోపలికి తోసింది.. అంగిట్లో తిరిగింది..వాంతి అయేటట్లుంది..కింద పడితే సూపర్వైజర్ ఊరుకోదు..పరుగెత్తింది వాష్ బేసిన్ దగ్గరికి..మధ్య లో నే ఆపలేక పోయింది.
సూపర్వైజర్ వచ్చి తిడుతోంది..ఆ మాటలన్నీ ఎక్కడో నూతిలోంచీ వినపడుతున్నత్లు ఉన్నాయి,”కస్టమర్ ప్లేస్ ని ఖరాబు చేయకూడదు..!నీ బోనస్ తగ్గించాల్సి వస్తుంది..!”

ఫంక్షన్ హాల్ వెనుక వదిలేసిన పదార్ధాలు గుట్ట గా ఒక కొండలా పేరుకొని పోయాయి. ఉదయానికి అవి కంపుకొడ్తాయి. వాటిని శుభ్రం చేయటం మునిసిపల్ ఉద్యోగుల విధి.

ప్రకటనలు

ఆదర్శాలూ వగైరాల గురించి నేను రాయబోయే నవల ప్లాట్..

ఆదర్శాలూ వగైరాల గురించి నేను ఒక నవల రాద్దామనుకొంటున్నాను..ఆ నవలని ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను.దాని ప్లాట్ ని కింద ఇచ్చాను. దీని గురించి మీ అభిప్రాయాలూ సలహాలూ తెలియ చేయండి.

—————————————————————————–

ఇది ఆదర్శ రావు కథ. పేరుకు తగ్గట్టు ఆదర్శ రావు కి ఆదర్శాలు ఎక్కువ. సమాజ వ్యవస్థ లో అనేక లోపాలున్నాయి. ఈ లోపాల కారణం గానూ, ఈ లోపాలను అధిగమించాలనే ఆదర్శరావు కోరిక  వలనా ఆదర్శరావు “సమసమాజం” అనే ఒక ఆశయాన్ని ఏర్పరచుకొన్నాడు. అతను  ఈ ఆశయం ఏర్పరచుకోవటానికి కారణం సమాజ అసమానతల్లో ఉంది. అలానే సమాజం మారాలనే అతని వ్యక్తిగతమైన కోరిక లో కూడా అతని ఆశయానికి మూలాలు ఉన్నాయి. అతని కోరిక అతని వ్యక్తిత్వం నుంచీ వచ్చింది.  అంటే చిన్నప్పటి నుంచీ అతను పెరిగిన పరిస్థితుల ప్రభావం వలన ఆ కోరిక అతనికి కలిగింది. కానీ, అతని వ్యక్తిత్వం లో అతని కోరిక తో పాటు గా వాస్తవ సమాజం లో ఉన్న అనేక దుర్లక్షణాలు కూడ ఉంటాయి. ఎందుకంటే అతను ఈ ప్రస్తుత సమాజం లోనే బతుకుతున్నాడు. ఏ అడవి లోనో బతకటం లేదు కదా?  రోడ్డు పక్క ఈగలు ముసిరిన ముసలి బిచ్చగాడిని చూసి ” ఈ సమాజం ఎంత దయాహీనమైనది!!” అనుకొంటాడు, కానీ తన జేబులోంచీ ఓ రెండు రూకలు తీసేటప్పూడు మాత్రం “ఆ..నేను ఈ రెండు రూపాయలు వేసినంత మాత్రాన ఈ సమస్య సమసి పోతుందా” అనుకొంటాడు. ఒక్కోసారి ఆ రెండు రూపాయలనూ జేబులోకే తోసేస్తాడు. ఒక్కోసారి..”ఇలా దేశం లోని బిచ్చగాళ్ళందరికీ దానం చేస్తే నేనూ ఒక రోజు బిచ్చగాడి గా మారిపోతాను తప్ప ఈ దానం వలన ఉపయోగం లేదు” అనుకొంటాడు. అతను రచనలు చేస్తాడు. కానీ, ఆ రచనలలో అతని ఆశయం తో పాటు,సమాజంలోని దుర్లక్షణాలు కూడా ఉంటాయి. తన రచనలలో కూడా రిక్షా వాడిని రిక్షా వాడనే అంటాడు. “రిక్షా ఆయన” అని అనడు. సమాజం నుంచీ వచ్చిన అలవాట్లు తొందరగా వదలవు కదా? అతని ఆదర్శం వలన అతని భావోద్వేగ పరమైన అవసరాలు కూడా కొన్ని తీరాయి.
ఆదర్శరావు, అతని సహచరుడు ఒకడి తో తన సమ సమాజ ఆదర్శాల గురించి చెప్పాడు.ఆ సహచరుడు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బుకి గడ్డి తినే రకం మనిషి. ఆ సహచరుడు వెంటనే ఆదర్శరావు ని,”ఊళ్ళో నీకెంత పొలముందీ..?” అని అడిగాడు.
ఆదర్శ రావు ఎంత పొలం ఉందో చెప్పాడు. దానికి ఆదర్శరావు సహచరుడు, “ఐతే ఆ మూడు ఎకరాలు నువ్వు ఊళ్ళో రైతు కూలీలకు పంచెయ్యి..తరువాత నాకు ఆదర్శాలు చెప్పు”,అన్నాడు. ఈ విధం గా ఆదర్శ రావు ఆదర్శాలు చెప్పటం వలన తన కంటె అన్ని రకాలు గా నీచుడైన ఒక సహచరుడి కి లోకువై పోయాడు.
ఆదర్శ రావు సహచరుడు అతని వ్యక్తిత్వాన్ని అతని ఆదర్శాలలోంచీ చూసి, “గొప్ప మాటలు చెప్పటానికి ఆదర్శరావు అప్పటికే ఆదర్శం పాటించే వ్యక్తిత్వం కలవాడు అయ్యి ఉండా”లనుకొన్నాడు.

ఇక్కడే మనం ఆదర్శరావు కి ఉన్న ఇంకొక స్నేహితుడు సుబ్బారావు గురించి చెప్పుకోవాలి……..

సుబ్బారావు క్రికెట్ ఒక మాదిరి గా ఆడతాడు. కానీ అతనికి తన ఆట తో సంతృప్తి గా లేదు. సచిన్ టెండుల్కర్ లా షాట్ లు కొట్టాలని కోరిక అతనికి. ఇక్కడ సుబ్బా రావు ఆశయం టెండుల్కర్ లా షాట్ లు కొట్టటం. ఈ ఆశయం అనేది తన యొక్క వాస్తవ పరిస్థితి (టెండుల్కర్ లా షాట్లు కొట్టలేక పోవటం) నుండీ,  ఇంకా
టెండుల్కర్ లా షాట్లు కొట్టాలనే కోరిక నుంచీ వచ్చింది. సుబ్బా రావు ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేసి టెండుల్కర్ లా షాట్లు కొట్ట వచ్చు. కానీ దాని వలన ఆట లో సుబ్బా రావు వ్యక్తిత్వం టెండుల్కర్ వ్యక్తిత్వానికి సమానమవ్వదు. ఎందుకంటే టెండుల్కర్ కి షాట్లు కొట్టటం అనాయాసం గా చిన్నప్పటినుంచీ అలవడిన ఒక విద్య. సుబ్బా రావు చాలా శ్రమ పెట్టి నేర్చుకొన్న ఒక కళ. ఐతే సుబ్బా రావు తాను అనుకొన్న ఫలితం సాధించాడు. ఫలితాన్ని మాత్రమే చూసినట్లైతే సుబ్బా రావు ని టెండుల్కర్ తో సమానం గా చూడ వలసిందే

సుబ్బారావు క్రికేట్ సరిగా రాకుండా టెండుల్కర్ లా బాటింగ్ చేయాలనుకొన్నప్పుడు అందు లో జనాలకు వైరుధ్యం ఏమీ కనపడదు. అదే సుబ్బారావు తనకు బాటింగ్ సరిగా రాకుండానే పక్క వాడితో,”టెండుల్కర్ లా బాటింగ్ చెయ్యాలోయ్…. అది అంత కష్టమేమీ కాదు” అని చెప్పకూడదు కదా! ఆదర్శ రావు తన వరకూ తన ఆదర్శాలను పాటించటానికి ప్రయత్నిస్తే అతని సహచరుడి కి ఏమీ వైరుధ్యం కనపడేది కాదు. ఎప్పుడైతే ఆదర్శ రావు తనకి చెప్పటం ప్రారంభించాడో, అప్పుడు అతని సహచరుడు ఆదర్శ రావు విశ్వసనీయత ని డిమాండ్  చేశాడు. ఆ సహచరుడు తనకున్న వడ్డీ వ్యాపారం మాని  ఆదర్శాలను పాటించటానికి సిధ్ధం గా లేడనేది వేరే విషయం.
ఈ స్థితి లో ఆదర్శ రావు కి ఏ ఆదర్శాన్నైతే తాను భుజాన వేసుకొన్నాడో, ఆ ఆదర్శానికి అనుగుణం గా తన వ్యక్తిత్వమూ, చేతలూ, ఒక్కోసారి మాటలూ కూడా  లేవు అని అర్ధమయ్యింది. తన ఆదర్శ భావాలను వదలకుండానే, తన సహచరుడి లాంటి వాళ్ళ కు లోకువ కాకుండాఉండటానికి, ఆదర్శరావు కి రెండు మార్గాలున్నాయి. ఒకటి తను పూర్తి గా వ్యక్తిత్వ విప్లవాన్ని సాధించి అడవుల్లోకి పోయి ఈ సమాజం మీద పోరాడటం. ఈ పోరాటమూ దాని నైతికత గురించి తరువాత చెప్పుకొందాము.
ఇక రెండో మార్గం, తాను కూడా అందరి లాంటి వ్యక్తిత్వం కలవాడే అని అంగీకరించి,సమాజం లోని మిగిలిన వారితో, “మనలో,మన సమాజము లో ఇలాంటి లోపాలున్నాయి, వాటిని మనం ఇలా మార్చుకొంటే బాగుంటుంది” అనే స్వరంలో చెప్పటమే.  ఇదే “సిగరెట్లు కాల్చే కొడుకుకి, సిగరెట్లు కాల్చే తండ్రి చెప్పే” స్వరం అన్నమాట.
కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన వ్యక్తిత్వాన్ని తన ఆదర్శాలకు అనుగుణం గా మార్చుకొనే ప్రక్రియ లో అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరు బాట పట్టాడు. అక్కడ చాల మంది యువకులను పోగేశాడు ఈ యువకుల వ్యక్తిత్వాలు ఇంకా ఆదర్శ రావు సమసమాజ ఆదర్శాలకు అనుగుణం గా ఇంకా మార లేదు. కానీ ఆదర్శ రావుకు  తన ఆదర్శం గురించిన అవగాహన బాగానే ఉంది.
సమాజ వ్యవస్థ లో అసమానతలున్నాయి. దీని లో వ్యక్తుల పై ఆదర్శ రావు కి కోపం లేదు. కానీ వ్యవస్థ కి ప్రతినిధులు వ్యక్తులే. ఈ వ్యవస్థ అనేది వారి బుర్రలలోని ఆలోచనల లోనే ఉంది. డబ్బున్న వారు ఆ డబ్బుని వదులుకోలేరు. మంచి గా చెప్తే, అధికారం ఉన్న వారు ఆ అధికారాన్ని వదులు కోరు సరి కదా, ఆదర్శ రావు పైకి పోలీసులని పంపిస్తారు.  కాబట్టీ అసమానతలు తొలగించాలంటే అసమానతలు ఉన్నచోట చదును చేయక తప్పదు. కాబట్టీ ధనిక వర్గాన్ని మట్టుబెట్టక తప్పదు.
ఆదర్శరావు తో ఉన్న కుర్రాళ్ళ లో ఈ స్పష్టత లేదు. వాళ్ళు “తమ ఊళ్ళోని  ఖామందుల పై ద్వేషం తోనో, నిరుద్యోగం తో నో ఆదర్శరావు ఉద్యమం లో చేరిన వాళ్ళు”. ఆదర్శ రావు వాళ్ళ ఆవేశాన్ని ఒక పనిముట్టు లా వాడుకొని, ఉన్న వ్యవస్థ ని కూల్చి, కొత్త వ్యవస్థని పై నుంచీ ఇంపోజ్ చేద్దామనుకొన్నాడు. కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన ఉద్యమ కారుల సహయం తో కొంతమంది భూస్వాములను చంపి కొంత ప్రాంతాన్ని ఉద్యమ ఆధీనం లోకి తెచ్చుకొన్నాడు. ఈ భూస్వాములను చంపేటప్పుడు కొందరు మంచి భూస్వాములు కూడా చనిపోయారు.మంచి భూస్వాములంటే పేదవాళ్ళ కష్టాల పై సానుభూతి ఉన్నవాళ్ళు. మంచి భూస్వాములను చంపకపోతే ఉద్యమ నినాదాలను సంక్లిష్టం చేయవలసి వస్తుంది. “భూస్వాములను మట్టుబెట్టండి” అని కాకుండా “చెడ్డ భూస్వాములను చంపండి” అని అంటే ఉద్యమం లోని భావోధృతి తగ్గుతుంది. భూస్వాములలో కూడా మంచివారున్నారని అంగీకరించినట్లౌతుంది. ఇది సామాన్య జనాల దృష్టి లో  ఉద్యమ లక్ష్యాలకు భిన్నం గా ఉన్న నినాదం గా కనపడుతుంది. ఆదర్శ రావుకు ఉద్యమ ఉధృతి తగ్గటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే అతను, మంచి భూస్వాములు ఉన్నారని తెలిసినా వారిని చంపే సమయం లో మిన్నకున్నాడు. ఆదర్శ రావు తన అనుచరులను సిధ్ధం చేసేటప్పుడు వాళ్ళ కి ఆవేశాన్నైతే ఇవ్వగలిగాడు కానీ తన కున్న అవగాహనను వాళ్ళకి బదిలీ చేయలేక పోయాడు. అందు వలన అతని అనుచరులు మంచీ చెడూ చూడ కుండా భూస్వాముల నందరినీ మట్టుబెట్టారు. ఈ పోరాటం లో చనిపోయిన ఆదర్శ రావు అనుచరులను అమరవీరులు గా కీర్తించి వారికి స్థూపాలు కట్టారు. పోరాటం లో ఆదర్శ రావు గెలిచాడు కాబట్టీ  సరిపోయింది. ఓడి పోతే చనిపోయిన ఆదర్శరావు అనుచరులను” తరువాత గుర్తు పెట్టుకొనే వారే ఉండేవారు కాదు. ఆదర్శ రావు కి “పేద వాళ్ళు భూస్వాముల స్థితి లో ఉంటే వారి లానే ప్రవర్తిస్తారు” అనే విషయం లో ఏ మాత్రం సందేహం లేదు. ఆ విధం గా చూస్తే “భూస్వాములకంటే వ్యక్తి గతం గా ఏ మాత్రం ఉన్నతులు కాని ఆదర్శ రావు సైన్యం భూస్వాములను చంపటం” నైతికం గా సరి కాదనేది ఆదర్శ రావు కి కూడా తెలియలేదు. కొత్త వ్యవస్థ రావటం కోసం పాత వ్యవస్థ లో లబ్ది పొందిన “భూ స్వాములు ఆ మాత్రం మూల్యం చెల్లించాలి” అనుకొన్నాడు ఆదర్శ రావు.
ఆదర్శ రావు కలలు కన్న సమ సమాజం వచ్చేసింది.  పై నుంచీ వ్యవస్థ లో వచ్చిన మార్పులవలన,డబ్బు పై మనుషులు ఆధార పడవలసిన అవసరం లేక పోవటం వలనా,మనుషులకు కనీసావసరాలైనా కూడూ గుడ్డా అందటం వలన, మనుషులలో చాలా వరకూ సమాజ పరమైన అవలక్షణాలైన మోసం, నేరం తగ్గాయి. కానీ మనుషుల్లో ఆదర్శ రావు స్థాపించిన వ్యవస్థ పరిధి లోకి రాని అవలక్షణాలు చాలానే ఉన్నాయి. అధికారం కోసం తపన, పక్క మనిషి మీది అసూయా ఎక్కడికీ పోలేదు. వ్యక్తిగత లాభమూ, వైవిధ్యమూ,వ్యక్తి గత పరమార్దమూ తన జీవితం లో మనిషి వెతుకుతూనే ఉన్నాడు. వ్యక్తి గత అర్దానికి ప్రయోజనం
లేక పోవటం వలన మనుషులు కష్టించి పని చేయటం తగ్గించారు. వీటన్నిటి వలనా, మరియూ ప్రకృతి సిధ్ధమైన ప్రతిభా పాటవాలలోని తేడాల వలనా మళ్ళీ అసమానతలు  పుట్టుకొచ్చాయి. ఆదర్శ రావు తన లో సమ సమాజానికి అనుగుణం గా లేని అవలక్షణాలను అధిగమించ గలిగినా, అతని అనుచరులు అలా అధిగమించిన వారు కాదు. ఏ స్థానిక భూస్వామి మీది ప్రతీకారేచ్చ తో నో వారు ఆదర్శ రావు తో కలిశారు. ఆదర్శ రావు కి ఈ విషయం తెలుసు కనుక వారిని సరైన దారి లో పెడుతూ వచ్చాడు.

ఆదర్శరావు కి వయసు పైబడ సాగింది. ఆదర్శరావు లోని భావోద్వేగ పరమైన అవసరాలు తగ్గాయి.అప్పటి దాకా ఆ అవసరాలను తీర్చిన అతని ఆదర్శాలు ఇప్పుడు అతనికి అంత ఆకర్షణీయం గా కనపడటంలేదు. అతనికి వయసు పెరిగే కొద్దీ తను స్థాపించిన వ్యవస్థ యొక్క తాత్కాలికతా, దానిలోని లొసుగులూ అర్ధమవ్వసాగాయి. కానీ అప్పటికే ఆ వ్యవస్థను స్థాపించిన వాడిగా లోకం ఆదర్శ రావు ని దేవుడి గా కీర్తించసాగింది. తాను స్థాపించిన వ్యవస్థ అంత గొప్పదేమీ కాదని చెప్తే ఆదర్శ రావు తన తప్పు అంగీకరించినట్లే. అందువలన అతను జనాలకి తన పట్ల ఉన్న గౌరవాన్ని కోల్పోవటమే కాకుండా, తనని ఏ ఆదర్శమైతే గొప్పది చేసిందో ఆ ఆదర్శాన్నే మట్టుబెట్టిన వాడౌతాడు. అందుకనే ఆదర్శ రావు తను తీసుకొని వచ్చిన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపించలేకపోయాడు.  

ముసలి వాడైపోయిన ఆదర్శ రావు, ఒక రోజు హఠాత్తు గా గుండె పోటు తో చనిపోయాడు. ఆదర్శరావు స్థాపించిన ఆదర్శ సమాజానికి ఏమై ఉంటుందో మీరే ఊహించి చెప్పండి… ఇంతకీ ఆదర్శ రావు ఆశయాల వలన సమాజానికి మంచి జరిగిందా? చెడు జరిగిందా?

మల్లాది వెంకట కృష్ణ మూర్తి, “నా సాహితీ జీవనం లో జరిగిన కథ”-నా ఆలోచనలు

కౌముది.నెట్ లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తన సాహితీ జీవితం లోని సంఘటనలూ వ్యక్తుల గురించి “జరిగిన కథ”, అని రాస్తున్నారు. ఇది చాలా వరకూ నిజాయితీ గా రాసినట్లు గా అనిపిస్తుంది. మల్లాది గారు తన సాహిత్య యానం లో తెలిసిన వ్యక్తులూ వారి లోటు పాట్లనే కాక, తన లోటు పాట్లను కూడా ఆత్మ విమర్శ చేసుకొంటూ రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన దృక్కోణం లోని లోటు పాట్లది వేరే సంగతి. ఎవరి దృక్కోణం లో లోపాలు వారికి తెలియవు కదా!
ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సాహిత్యం అబ్సొలీట్ అయిపోవటం, మల్లాది గారు అంతగా ఈ రోజుల్లో రాయక పోవటం వలన, ఇప్పుడు ఆయన నిజాయితీగా రాసినా ఆయనకు ప్రాపంచికం గా వచ్చే నష్టం పెద్ద గా లేదు. పైగా ఆయన ప్రస్తావించే వ్యక్తులు చనిపోవటం లేదా అంతకు ముందు ఉన్న అధికార స్థానాల్లో ఉండక పోవటం కూడా ఆయన నిజాయితీ గా రాయటానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చు. ఈ ఆత్మ కథ వలన మనకు తెలుగు సాహితీ లోకం లోని నిన్నటి ప్రచురణ కర్తలు, సంపాదకులూ, రచయితలూ మొదలైన వారి వాస్తవ స్వరూపం కొంతవరకూ తెలుస్తుంది. అలానే వారి మధ్య ఉండే మానవ సంబంధాలలోని ఈర్ష్యలూ, ఇగోలూ, స్వార్ధాలూ కూడా అవగతమౌతాయి.
నేను ఎనభై ల చివరిలో మల్లాది గారి, యండమూరి మొదలైన వారి సాహిత్యాన్ని వదలకుండా చదివే వాడిని. అప్పటి కి టీనేజ్ లో ఉన్న నాకు వాళ్ళ నవలల లోని పాత్రలూ, స్వభావాలూ విపరీతం గా నచ్చేవి. ఒక్కోసారి ఆయా పాత్రలను అనుకరించటానికి ప్రయత్నించే వాడిని. ఒక పల్లెటూర్లో చిన్న రైతు కొడుకునైన నేను, ఈ కమర్షియల్ నవలలు చదవటం వలన చదువు లో వెనుకబడి తరువాత కష్టాలు పడవలసి వచ్చింది.

మల్లాది గారు తన ‘జరిగిన కథ ‘ లో  “తమ పత్రికల సర్క్యులేషన్ కోసం ఎడిటర్లు ఎలాంటి అబధ్ధపు రాతలు రాయిస్తారో, అలానే రచయితలు తమ పారితోషికం కోసం ఎలా బేరాలాడతారో, తమ నవలను ఎడిటర్ల ఇష్టానుసారం ఎలా సాగదీస్తారో” చెప్పినప్పుడు, “ఔరా! మనం బకరాలం అయ్యాం కదా, వాళ్ళ డబ్బుకోసం, కెరీర్ కోసం వాళ్ళు ఏవో జిమ్మిక్కులు చేస్తే, మనం అనవసరం గా మన చదువు పాడు చేసుకొని నష్టపోయాం కదా!”, అని అనిపించక మానదు. అలానే సాధారణ పాఠకుడి పై ఎడిటర్లకూ, రచయితలకూ ఉన్న తక్కువ అభిప్రాయం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. (ఆ మోసపోయే పాఠకుల నుంచే వారి మనుగడ కు అవసరమైన డబ్బు వస్తుందనేది గమనించవలసిన విషయం). వీరి రాతలూ, పత్రికలూ డబ్బుకోసమే. సాహిత్యం కేవలం ఒక బై-ప్రొడక్ట్.

ఈ పాఠకులు మోస పోవటం అనేది కమర్షియల్ రచయితల తోనే కాదు. అనేక మంది రచయితలు ఆదర్శాల గురించిన భావాలతో రచనలు చేస్తారు. కానీ ఈ ఆదర్శాలు మనకు వారి రాతల్లో కనపడినంత గా వారి జీవితాలలో కనపడవు. కానీ, వారి రచనల ద్వారా వారి ఆదర్శ భావాలు జనాలలోకి ముందుగా విరచిమ్మ బడతాయి. సగటు పాఠకుడికి తరువాత ఎప్పుడో వారి జీవితం గురించి తెలుస్తుంది. వారి జీవితాలలో వారు చెప్పిన ఆదర్శాలను ఆచరించ లేదని తెలుస్తుంది.డబ్బే పరమావధి కాదని చెప్పే వీరి రచనలు, డబ్బే పరమావధి గా నడిచే పత్రికలలో ప్రచురింపబడేవి. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. వారు చెప్పిన ఆదర్శాలు విని ఆవేశం తెచ్చుకొని ఏ నక్సలైటల్లోనోఈ చేరిన వారు, అప్పటికే జరిగిన నష్టాన్ని ఎలా తప్పించుకొంటారు? ఆ రచయితల సంతానం మాత్రం ఏ అమెరికాలోనో హాయిగా గడుపుతూ ఉంటారు. ఈ సంతానం దృష్టి లో వారి పెద్ద వాళ్ళు ప్రచారం చేసిన విలువలకి సానుభూతి అయినా కనిపించదు.

ఈ రోజులలో ఆర్ధిక సరళీకరణ, ఇంటర్నెట్, మీడియా ఛానెళ్ళ ప్రభావం వలన ఇలాంటి కాన్ రచయితలు, ఎడిటర్లకు కాలం చెల్లి పోయింది. యువత తమ కెరీర్ పై దృష్టి పెడుతోంది. యువతరం ఇలాంటి కాన్ రైటలూ, ఎడిటర్ల కాకమ్మ కథల బారిన పడే దురదృష్టాన్నుంచీ తప్పించుకొంది. ఇప్పటి యూత్ కావాలనుకొంటే ఇలాంటి మేధావులకే కొంత జ్ఞానోపదేశం చేయగల స్థాయి లో ఉండటం సంతోషం గా ఉంది.

విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!

బిగ్ బ్యాంగ్ తీరీ ప్రకారం, విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం తో ప్రారంభమైంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే విశ్వం తో పాటు కాలం కూడా పుట్టింది. కానీ, ఏ కారణం వలన బిగ్ బ్యాంగ్ పేలుడు జరిగింది?
బిగ్ బ్యాంగ్ కి ముందు అంతటా “ఏమీ లేని స్థితి” ఉండేది. ఆ స్థితి లో పదార్ధం లేదు, శక్తి లేదు,స్థలం లేదు. అనుభవించటానికి నువ్వూ నేనూ లేము. ఆ శూన్యం లో కాలం లేదు. కాలం ఉండటానికి ఏదో ఒక సంఘటన జరగాలి కదా! ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన నుంచీ సమయాన్ని లెక్కించవచ్చు. ఆ సంఘటన ముందు సమయాన్ని కొలవ వచ్చు. ఏ సంఘటనలూ జరగటానికి వీలులేని సందర్భం లో సహజంగానే సమయాన్ని ఊహించలేము. అది పరిపూర్ణమైన శూన్యం. దానిలో సాపేక్షత లేదు. అలానే అటువంటి శూన్యాన్ని నిర్వచించలేము (అన్ డిఫైన్డ్). కాబట్టీ విశ్వం పుట్టుకకి ముందు కాలం లేదు. కారణమూ ప్రభావమూ (కాజ్ అండ్ అఫెక్ట్) అనేవి కాలం లో జరిగే విషయాలు. కారణం ముందు జరిగి, తద్వారా దాని ప్రభావం పుడుతుంది. కాలం లేని చోట కారణమూ ప్రభావమూ ఉండవు. విశ్వం పుట్టుకతోనే కాలం ఏర్పడింది. పుట్టుకకు ముందు కాలం లేదు. కాలం లేని చోట కారణం కూడా ఉండదు. కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదు. ఇక ముందు,మన శాస్త్రవేత్తలు, కారణం లేని విషయాలని శోధించటానికి కూడా తమ పరిశోధనలను ఉపయోగించవలసి వస్తుంది.

universe
universe

ఆస్తికులు “ఈ విశ్వమే భగవంతుడు కనే ఒక కల లాంటిది” అని అంటారు. కల అనేది నిద్రలో ఉంటుంది. నిద్ర అనేది ఒక మనిషి శారీరక మానసిక పరిస్థితులవలన మొదలౌతుంది. ఎవరైనా మనకు కలలో జరిగే సంఘటనల కార్యకారణ సంబంధాలద్వారా, కల యొక్క పుట్టుక కారణాన్ని (మనిషి మానసిక, దైహిక పరిస్థితి, నిద్ర) కనిపెట్టాలంటే అది దాదాపు అసంభవం. అలానే ఈ విశ్వం లోని కార్య కారణ సంబంధాలతో విశ్వం పుట్టుక ముందు ఏమి ఉందో అన్వేషించటం కష్టమవ్వ వచ్చు. ఆస్తికుల విషయం లో, దేవుడు కనే కల లాంటిది ఈ విశ్వమైతే, మరి దేవుడిని ఎవరు సృష్టించారు? లేక, దేవుడు ఏదైన ఇంకా పెద్ద కలలోని వాడా? దీనికి సమాధానం, దేవుడు తను కనే కల(విశ్వం) లో భాగం కాదు.కాబట్టీ ఈ విశ్వం లోని సూత్రాలైన కార్య కారణ సంబంధాలను దేవుడికి అన్వయించలేము. దేవుడికి కారణం లేదు. మొత్తానికి సృష్టి జన్మ విషయానికి వచ్చేసరికి హేతువాదులూ, ఆస్తికులూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నారు. తేడా ఒక్కటే, ఆస్థికులు సృష్టి ఆదికి దేవుడి లో, ఒక మంచి లోక కల్యాణ కరమైన ఉద్దేశాన్ని (మోటివ్) చూస్తున్నారు. కానీ ఇక్కడ మనిషి, దేవుడిని మరీ తన రూపం లో ఊహించుకొంటున్నాడేమో! ఉద్దేశాలూ, ఇచ్చలూ మానవునికి ఉంటాయి. ఇవి అతనిలో జీవ పరిణామ పరం గా ఏర్పడతాయి. క్వార్క్లూ, పాజిట్రాన్లు ఏర్పడక ముందు జరిగిన బిగ్ బ్యాంగ్ కు భగవంతుడు కారకుడైతే, ఆయనకు జీవపరిణామం ద్వారా వచ్చిన “ఇఛ్ఛ” ను ఆపాదించటం సరి కాదేమో!ఇఛ్ఛ అనేది మనిషికి భౌతిక వాంఛల యొక్క పరిణామం వలన కలుగుతుంది కదా!

ఆస్తికత్వం దృష్టి తో చూసినా, నాస్తికత్వ దృష్టి తో చూసినా, మనం ఒక కారణం లేని మూలానికి వెళ్ళ వలసి వస్తోంది. కాబట్టీ, “ఈ విశ్వం పుట్టుక (లేక దేవుడు) కి కారణం లేదు”, అనటం హేతుబధ్ధమే!