ఆదర్శాలూ వగైరాల గురించి నేను రాయబోయే నవల ప్లాట్..

ఆదర్శాలూ వగైరాల గురించి నేను ఒక నవల రాద్దామనుకొంటున్నాను..ఆ నవలని ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను.దాని ప్లాట్ ని కింద ఇచ్చాను. దీని గురించి మీ అభిప్రాయాలూ సలహాలూ తెలియ చేయండి.

—————————————————————————–

ఇది ఆదర్శ రావు కథ. పేరుకు తగ్గట్టు ఆదర్శ రావు కి ఆదర్శాలు ఎక్కువ. సమాజ వ్యవస్థ లో అనేక లోపాలున్నాయి. ఈ లోపాల కారణం గానూ, ఈ లోపాలను అధిగమించాలనే ఆదర్శరావు కోరిక  వలనా ఆదర్శరావు “సమసమాజం” అనే ఒక ఆశయాన్ని ఏర్పరచుకొన్నాడు. అతను  ఈ ఆశయం ఏర్పరచుకోవటానికి కారణం సమాజ అసమానతల్లో ఉంది. అలానే సమాజం మారాలనే అతని వ్యక్తిగతమైన కోరిక లో కూడా అతని ఆశయానికి మూలాలు ఉన్నాయి. అతని కోరిక అతని వ్యక్తిత్వం నుంచీ వచ్చింది.  అంటే చిన్నప్పటి నుంచీ అతను పెరిగిన పరిస్థితుల ప్రభావం వలన ఆ కోరిక అతనికి కలిగింది. కానీ, అతని వ్యక్తిత్వం లో అతని కోరిక తో పాటు గా వాస్తవ సమాజం లో ఉన్న అనేక దుర్లక్షణాలు కూడ ఉంటాయి. ఎందుకంటే అతను ఈ ప్రస్తుత సమాజం లోనే బతుకుతున్నాడు. ఏ అడవి లోనో బతకటం లేదు కదా?  రోడ్డు పక్క ఈగలు ముసిరిన ముసలి బిచ్చగాడిని చూసి ” ఈ సమాజం ఎంత దయాహీనమైనది!!” అనుకొంటాడు, కానీ తన జేబులోంచీ ఓ రెండు రూకలు తీసేటప్పూడు మాత్రం “ఆ..నేను ఈ రెండు రూపాయలు వేసినంత మాత్రాన ఈ సమస్య సమసి పోతుందా” అనుకొంటాడు. ఒక్కోసారి ఆ రెండు రూపాయలనూ జేబులోకే తోసేస్తాడు. ఒక్కోసారి..”ఇలా దేశం లోని బిచ్చగాళ్ళందరికీ దానం చేస్తే నేనూ ఒక రోజు బిచ్చగాడి గా మారిపోతాను తప్ప ఈ దానం వలన ఉపయోగం లేదు” అనుకొంటాడు. అతను రచనలు చేస్తాడు. కానీ, ఆ రచనలలో అతని ఆశయం తో పాటు,సమాజంలోని దుర్లక్షణాలు కూడా ఉంటాయి. తన రచనలలో కూడా రిక్షా వాడిని రిక్షా వాడనే అంటాడు. “రిక్షా ఆయన” అని అనడు. సమాజం నుంచీ వచ్చిన అలవాట్లు తొందరగా వదలవు కదా? అతని ఆదర్శం వలన అతని భావోద్వేగ పరమైన అవసరాలు కూడా కొన్ని తీరాయి.
ఆదర్శరావు, అతని సహచరుడు ఒకడి తో తన సమ సమాజ ఆదర్శాల గురించి చెప్పాడు.ఆ సహచరుడు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బుకి గడ్డి తినే రకం మనిషి. ఆ సహచరుడు వెంటనే ఆదర్శరావు ని,”ఊళ్ళో నీకెంత పొలముందీ..?” అని అడిగాడు.
ఆదర్శ రావు ఎంత పొలం ఉందో చెప్పాడు. దానికి ఆదర్శరావు సహచరుడు, “ఐతే ఆ మూడు ఎకరాలు నువ్వు ఊళ్ళో రైతు కూలీలకు పంచెయ్యి..తరువాత నాకు ఆదర్శాలు చెప్పు”,అన్నాడు. ఈ విధం గా ఆదర్శ రావు ఆదర్శాలు చెప్పటం వలన తన కంటె అన్ని రకాలు గా నీచుడైన ఒక సహచరుడి కి లోకువై పోయాడు.
ఆదర్శ రావు సహచరుడు అతని వ్యక్తిత్వాన్ని అతని ఆదర్శాలలోంచీ చూసి, “గొప్ప మాటలు చెప్పటానికి ఆదర్శరావు అప్పటికే ఆదర్శం పాటించే వ్యక్తిత్వం కలవాడు అయ్యి ఉండా”లనుకొన్నాడు.

ఇక్కడే మనం ఆదర్శరావు కి ఉన్న ఇంకొక స్నేహితుడు సుబ్బారావు గురించి చెప్పుకోవాలి……..

సుబ్బారావు క్రికెట్ ఒక మాదిరి గా ఆడతాడు. కానీ అతనికి తన ఆట తో సంతృప్తి గా లేదు. సచిన్ టెండుల్కర్ లా షాట్ లు కొట్టాలని కోరిక అతనికి. ఇక్కడ సుబ్బా రావు ఆశయం టెండుల్కర్ లా షాట్ లు కొట్టటం. ఈ ఆశయం అనేది తన యొక్క వాస్తవ పరిస్థితి (టెండుల్కర్ లా షాట్లు కొట్టలేక పోవటం) నుండీ,  ఇంకా
టెండుల్కర్ లా షాట్లు కొట్టాలనే కోరిక నుంచీ వచ్చింది. సుబ్బా రావు ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేసి టెండుల్కర్ లా షాట్లు కొట్ట వచ్చు. కానీ దాని వలన ఆట లో సుబ్బా రావు వ్యక్తిత్వం టెండుల్కర్ వ్యక్తిత్వానికి సమానమవ్వదు. ఎందుకంటే టెండుల్కర్ కి షాట్లు కొట్టటం అనాయాసం గా చిన్నప్పటినుంచీ అలవడిన ఒక విద్య. సుబ్బా రావు చాలా శ్రమ పెట్టి నేర్చుకొన్న ఒక కళ. ఐతే సుబ్బా రావు తాను అనుకొన్న ఫలితం సాధించాడు. ఫలితాన్ని మాత్రమే చూసినట్లైతే సుబ్బా రావు ని టెండుల్కర్ తో సమానం గా చూడ వలసిందే

సుబ్బారావు క్రికేట్ సరిగా రాకుండా టెండుల్కర్ లా బాటింగ్ చేయాలనుకొన్నప్పుడు అందు లో జనాలకు వైరుధ్యం ఏమీ కనపడదు. అదే సుబ్బారావు తనకు బాటింగ్ సరిగా రాకుండానే పక్క వాడితో,”టెండుల్కర్ లా బాటింగ్ చెయ్యాలోయ్…. అది అంత కష్టమేమీ కాదు” అని చెప్పకూడదు కదా! ఆదర్శ రావు తన వరకూ తన ఆదర్శాలను పాటించటానికి ప్రయత్నిస్తే అతని సహచరుడి కి ఏమీ వైరుధ్యం కనపడేది కాదు. ఎప్పుడైతే ఆదర్శ రావు తనకి చెప్పటం ప్రారంభించాడో, అప్పుడు అతని సహచరుడు ఆదర్శ రావు విశ్వసనీయత ని డిమాండ్  చేశాడు. ఆ సహచరుడు తనకున్న వడ్డీ వ్యాపారం మాని  ఆదర్శాలను పాటించటానికి సిధ్ధం గా లేడనేది వేరే విషయం.
ఈ స్థితి లో ఆదర్శ రావు కి ఏ ఆదర్శాన్నైతే తాను భుజాన వేసుకొన్నాడో, ఆ ఆదర్శానికి అనుగుణం గా తన వ్యక్తిత్వమూ, చేతలూ, ఒక్కోసారి మాటలూ కూడా  లేవు అని అర్ధమయ్యింది. తన ఆదర్శ భావాలను వదలకుండానే, తన సహచరుడి లాంటి వాళ్ళ కు లోకువ కాకుండాఉండటానికి, ఆదర్శరావు కి రెండు మార్గాలున్నాయి. ఒకటి తను పూర్తి గా వ్యక్తిత్వ విప్లవాన్ని సాధించి అడవుల్లోకి పోయి ఈ సమాజం మీద పోరాడటం. ఈ పోరాటమూ దాని నైతికత గురించి తరువాత చెప్పుకొందాము.
ఇక రెండో మార్గం, తాను కూడా అందరి లాంటి వ్యక్తిత్వం కలవాడే అని అంగీకరించి,సమాజం లోని మిగిలిన వారితో, “మనలో,మన సమాజము లో ఇలాంటి లోపాలున్నాయి, వాటిని మనం ఇలా మార్చుకొంటే బాగుంటుంది” అనే స్వరంలో చెప్పటమే.  ఇదే “సిగరెట్లు కాల్చే కొడుకుకి, సిగరెట్లు కాల్చే తండ్రి చెప్పే” స్వరం అన్నమాట.
కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన వ్యక్తిత్వాన్ని తన ఆదర్శాలకు అనుగుణం గా మార్చుకొనే ప్రక్రియ లో అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరు బాట పట్టాడు. అక్కడ చాల మంది యువకులను పోగేశాడు ఈ యువకుల వ్యక్తిత్వాలు ఇంకా ఆదర్శ రావు సమసమాజ ఆదర్శాలకు అనుగుణం గా ఇంకా మార లేదు. కానీ ఆదర్శ రావుకు  తన ఆదర్శం గురించిన అవగాహన బాగానే ఉంది.
సమాజ వ్యవస్థ లో అసమానతలున్నాయి. దీని లో వ్యక్తుల పై ఆదర్శ రావు కి కోపం లేదు. కానీ వ్యవస్థ కి ప్రతినిధులు వ్యక్తులే. ఈ వ్యవస్థ అనేది వారి బుర్రలలోని ఆలోచనల లోనే ఉంది. డబ్బున్న వారు ఆ డబ్బుని వదులుకోలేరు. మంచి గా చెప్తే, అధికారం ఉన్న వారు ఆ అధికారాన్ని వదులు కోరు సరి కదా, ఆదర్శ రావు పైకి పోలీసులని పంపిస్తారు.  కాబట్టీ అసమానతలు తొలగించాలంటే అసమానతలు ఉన్నచోట చదును చేయక తప్పదు. కాబట్టీ ధనిక వర్గాన్ని మట్టుబెట్టక తప్పదు.
ఆదర్శరావు తో ఉన్న కుర్రాళ్ళ లో ఈ స్పష్టత లేదు. వాళ్ళు “తమ ఊళ్ళోని  ఖామందుల పై ద్వేషం తోనో, నిరుద్యోగం తో నో ఆదర్శరావు ఉద్యమం లో చేరిన వాళ్ళు”. ఆదర్శ రావు వాళ్ళ ఆవేశాన్ని ఒక పనిముట్టు లా వాడుకొని, ఉన్న వ్యవస్థ ని కూల్చి, కొత్త వ్యవస్థని పై నుంచీ ఇంపోజ్ చేద్దామనుకొన్నాడు. కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన ఉద్యమ కారుల సహయం తో కొంతమంది భూస్వాములను చంపి కొంత ప్రాంతాన్ని ఉద్యమ ఆధీనం లోకి తెచ్చుకొన్నాడు. ఈ భూస్వాములను చంపేటప్పుడు కొందరు మంచి భూస్వాములు కూడా చనిపోయారు.మంచి భూస్వాములంటే పేదవాళ్ళ కష్టాల పై సానుభూతి ఉన్నవాళ్ళు. మంచి భూస్వాములను చంపకపోతే ఉద్యమ నినాదాలను సంక్లిష్టం చేయవలసి వస్తుంది. “భూస్వాములను మట్టుబెట్టండి” అని కాకుండా “చెడ్డ భూస్వాములను చంపండి” అని అంటే ఉద్యమం లోని భావోధృతి తగ్గుతుంది. భూస్వాములలో కూడా మంచివారున్నారని అంగీకరించినట్లౌతుంది. ఇది సామాన్య జనాల దృష్టి లో  ఉద్యమ లక్ష్యాలకు భిన్నం గా ఉన్న నినాదం గా కనపడుతుంది. ఆదర్శ రావుకు ఉద్యమ ఉధృతి తగ్గటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే అతను, మంచి భూస్వాములు ఉన్నారని తెలిసినా వారిని చంపే సమయం లో మిన్నకున్నాడు. ఆదర్శ రావు తన అనుచరులను సిధ్ధం చేసేటప్పుడు వాళ్ళ కి ఆవేశాన్నైతే ఇవ్వగలిగాడు కానీ తన కున్న అవగాహనను వాళ్ళకి బదిలీ చేయలేక పోయాడు. అందు వలన అతని అనుచరులు మంచీ చెడూ చూడ కుండా భూస్వాముల నందరినీ మట్టుబెట్టారు. ఈ పోరాటం లో చనిపోయిన ఆదర్శ రావు అనుచరులను అమరవీరులు గా కీర్తించి వారికి స్థూపాలు కట్టారు. పోరాటం లో ఆదర్శ రావు గెలిచాడు కాబట్టీ  సరిపోయింది. ఓడి పోతే చనిపోయిన ఆదర్శరావు అనుచరులను” తరువాత గుర్తు పెట్టుకొనే వారే ఉండేవారు కాదు. ఆదర్శ రావు కి “పేద వాళ్ళు భూస్వాముల స్థితి లో ఉంటే వారి లానే ప్రవర్తిస్తారు” అనే విషయం లో ఏ మాత్రం సందేహం లేదు. ఆ విధం గా చూస్తే “భూస్వాములకంటే వ్యక్తి గతం గా ఏ మాత్రం ఉన్నతులు కాని ఆదర్శ రావు సైన్యం భూస్వాములను చంపటం” నైతికం గా సరి కాదనేది ఆదర్శ రావు కి కూడా తెలియలేదు. కొత్త వ్యవస్థ రావటం కోసం పాత వ్యవస్థ లో లబ్ది పొందిన “భూ స్వాములు ఆ మాత్రం మూల్యం చెల్లించాలి” అనుకొన్నాడు ఆదర్శ రావు.
ఆదర్శ రావు కలలు కన్న సమ సమాజం వచ్చేసింది.  పై నుంచీ వ్యవస్థ లో వచ్చిన మార్పులవలన,డబ్బు పై మనుషులు ఆధార పడవలసిన అవసరం లేక పోవటం వలనా,మనుషులకు కనీసావసరాలైనా కూడూ గుడ్డా అందటం వలన, మనుషులలో చాలా వరకూ సమాజ పరమైన అవలక్షణాలైన మోసం, నేరం తగ్గాయి. కానీ మనుషుల్లో ఆదర్శ రావు స్థాపించిన వ్యవస్థ పరిధి లోకి రాని అవలక్షణాలు చాలానే ఉన్నాయి. అధికారం కోసం తపన, పక్క మనిషి మీది అసూయా ఎక్కడికీ పోలేదు. వ్యక్తిగత లాభమూ, వైవిధ్యమూ,వ్యక్తి గత పరమార్దమూ తన జీవితం లో మనిషి వెతుకుతూనే ఉన్నాడు. వ్యక్తి గత అర్దానికి ప్రయోజనం
లేక పోవటం వలన మనుషులు కష్టించి పని చేయటం తగ్గించారు. వీటన్నిటి వలనా, మరియూ ప్రకృతి సిధ్ధమైన ప్రతిభా పాటవాలలోని తేడాల వలనా మళ్ళీ అసమానతలు  పుట్టుకొచ్చాయి. ఆదర్శ రావు తన లో సమ సమాజానికి అనుగుణం గా లేని అవలక్షణాలను అధిగమించ గలిగినా, అతని అనుచరులు అలా అధిగమించిన వారు కాదు. ఏ స్థానిక భూస్వామి మీది ప్రతీకారేచ్చ తో నో వారు ఆదర్శ రావు తో కలిశారు. ఆదర్శ రావు కి ఈ విషయం తెలుసు కనుక వారిని సరైన దారి లో పెడుతూ వచ్చాడు.

ఆదర్శరావు కి వయసు పైబడ సాగింది. ఆదర్శరావు లోని భావోద్వేగ పరమైన అవసరాలు తగ్గాయి.అప్పటి దాకా ఆ అవసరాలను తీర్చిన అతని ఆదర్శాలు ఇప్పుడు అతనికి అంత ఆకర్షణీయం గా కనపడటంలేదు. అతనికి వయసు పెరిగే కొద్దీ తను స్థాపించిన వ్యవస్థ యొక్క తాత్కాలికతా, దానిలోని లొసుగులూ అర్ధమవ్వసాగాయి. కానీ అప్పటికే ఆ వ్యవస్థను స్థాపించిన వాడిగా లోకం ఆదర్శ రావు ని దేవుడి గా కీర్తించసాగింది. తాను స్థాపించిన వ్యవస్థ అంత గొప్పదేమీ కాదని చెప్తే ఆదర్శ రావు తన తప్పు అంగీకరించినట్లే. అందువలన అతను జనాలకి తన పట్ల ఉన్న గౌరవాన్ని కోల్పోవటమే కాకుండా, తనని ఏ ఆదర్శమైతే గొప్పది చేసిందో ఆ ఆదర్శాన్నే మట్టుబెట్టిన వాడౌతాడు. అందుకనే ఆదర్శ రావు తను తీసుకొని వచ్చిన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపించలేకపోయాడు.  

ముసలి వాడైపోయిన ఆదర్శ రావు, ఒక రోజు హఠాత్తు గా గుండె పోటు తో చనిపోయాడు. ఆదర్శరావు స్థాపించిన ఆదర్శ సమాజానికి ఏమై ఉంటుందో మీరే ఊహించి చెప్పండి… ఇంతకీ ఆదర్శ రావు ఆశయాల వలన సమాజానికి మంచి జరిగిందా? చెడు జరిగిందా?

ప్రకటనలు

7 thoughts on “ఆదర్శాలూ వగైరాల గురించి నేను రాయబోయే నవల ప్లాట్..

 1. yedo cinema lo oka vaakyam undi pedavaadi gurinchi matladevaadu, pedavaala kosam paatupaduthunaam ani cheppukune vaallu dhanavanthulu ayyaru kaani pedavaallu pedavaalla laagane undipothunaaru ee desam lo ani..alane mee Adarsha Rao kalukanna “samasaamaajam” mana bhaaratha desam lo ayite ippatlo raadu..me kadhaku mugimpu ala unte baaguntundi..meeru tisukunna plot baagundi..kaani mee vishleshana tho enduko yekibhavinchalekapothunaanu..kaani baaga kasarathu chesthe ee kadha baga vache avakaasam undi paigaa samaajam meeda vengya aastram laa vaadochhu..meeru iche treatment ni batti..All da best and keep going:-)

  మెచ్చుకోండి

 2. అసమర్ధుని జీవిత యాత్ర/చివరికి మిగిలింది లాంటి నవలలు ఇలాంటి ఇతివృత్తపు ఛాయల మీద నడుస్తాయి.
  ———————
  స్వాతంత్ర పోరాట సమయం నుంచి సమజంలో వివిధ వర్గాల వారికి ఆదర్శాల అవసరం మొదలైందని నా అభిప్రాయం. ఆ కాలంలో ఎన్నో పుస్తకాలు రాశారు. అన్ని రకాల భావల మీద పుస్తకాలు వచ్చాయి. అంతకు మునుపు వచ్చిన సాహిత్యం కన్నా ఈ కాలంలో భిన్న సాహిత్య సృజన జరిగింది. అందుకు కారణమేమిటి? అప్పటి వరకు ఉన్న ఆదర్శాలను/అనుసరిస్తున్న మోడల్ ఎందుకు ప్రశ్నించ వలసి వచ్చింద ఆదర్శాలనేవి ప్రతి కాలంలో ఉంటాయి కదా! కాని ఆరోజులలో అదే పనిగా ఆదర్శాలను హీరోలుగా చేసిచూపే రచనలు చాలా వచ్చాయి. అప్పటి సమాజంలో ఉన్న ప్రతిదానిలో లోపాలు చూపుతూ పరోక్షంగా రచయితలు హీరోవర్షిప్ స్థాయికి చేరుకొన్నారు. అందులో కొంతమంది నిజాయితిగల వారు ఉండవచ్చు, కొంతమందిని ఇతరులు ప్రమోట్ చేసి ఉండవచ్చు. మీరు రాయబోయే కథలో ఆ ఆదర్శాల ఫాక్టరిని వెనుకనించి నడపిన వారి గురించి కూడా రాయాలి. ఇటువంటి వాటిని కవర్ చేస్తే కొంచెం మీరు రాయబోయే నవల బాగుంట్టుంది.
  ———————————–
  ఆదర్శం అనేది ఆచరణలో చాలా కష్టం. కాని ఆరోజులలో ఈ ఆదర్శాలను కొంతమంది రచయితలు ఒక గొప్ప ఇమేజ్ ని సృష్టించారు. చాలా మంది మనసులపైన వారు ఒక బలమైన ముద్రను వేశారు. ఐతే ఆ రచయిత అభిమానులలో వచ్చిన పరివర్తన ఎనత? అసలు రచయిత నిజంగా అంత పరివర్తన చెందాడా లేక ఇన్ స్పిరేషనా? అంతిమంగా ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్ట్టపోయారు? సాధారణ పాఠకులు విరిని గొప్ప వారి గా భావిస్తూ, ఆరధిస్తూ ఎలా బ్రమలో చిక్కుకు పోయారు? అనేదాని మీద కూడా రాయండి.

  మెచ్చుకోండి

  1. ఆదర్శవాదులు తమ ఆదర్శాలలోని దొల్లతనం తెలిశాక కూడా వాటినే పట్టుకొని వేలాడటం అనేది(అప్పటికే తమకు ఆ ఆదర్శాల వలన వచ్చిన పేరు చెడగొట్టుకొవటం ఇష్టం లేక) అసమర్ధుని జీవిత యాత్రలో ప్రస్తావించారు..కరక్టే. ఈ పాటర్న్ కి జిడ్డు కృష్ణమూర్తి ఒక ఎక్సెప్షన్.
   మీ కామెంట్స్ నాలో చాలా ప్రశ్నలను/ఆలోచనలను రేకెస్తున్నాయి.
   “వారికి ఆదర్శాల అవసరం మొదలైందని నా అభిప్రాయం” ఆదర్శలు ఎందుకు అవసరమైనాయో కొంచెం విశదీకరిస్తారా?శ్రీ శ్రీ జీవిత చరిత్ర చదువుతుంటే నాకు అర్ధమైనదేమిటంటే, పెట్టుబడిదారీ కంటే కొంచేం సహజమైన భూస్వామిక, వ్యావసాయిక విలువలు కొత్తగా వచ్చిన బయటి చదువులతో మిళితమై ఈ ఆదర్శాలు ఏర్పడ్డాయి అని. ఆదర్శాలలో చాలా నార్సిజం( స్వప్రేమ), మరియూ ఎమోషనల్ శాటిస్ఫాక్షన్ ఉంటుంది.
   ఆదర్శాల ఫాచ్టరీ ని వెనుక నుంచీ ఎవరు నడిపించారు అనే దాని మీద నాకు అవగాహన లేదు. మీరే కొంచెం చెప్పాలి.
   “ఐతే ఆ రచయిత అభిమానులలో వచ్చిన పరివర్తన ఎనత? అసలు రచయిత నిజంగా అంత పరివర్తన చెందాడా లేక ఇన్ స్పిరేషనా? అంతిమంగా ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్ట్టపోయారు? సాధారణ పాఠకులు విరిని గొప్ప వారి గా భావిస్తూ, ఆరధిస్తూ ఎలా బ్రమలో చిక్కుకు పోయారు? ”
   వీటిని గురించి నా భావాలను కొంచెం ఇంతకు ముందు రాసిన మల్లాది గురించిన పోస్ట్ లో రాశాను. మీతో ఏకీభవిస్తాను.

   మెచ్చుకోండి

 3. బొందలపాటి గారు,

  మీరు 1900-1980 మధ్య కాలం వరకు చూస్తే ఈ ఆదర్శ భావాలు, సామజిక, రాజకీయ రంగాల పైవాటి ప్రభావాన్ని గ్రాప్ గీస్తే ఒక పీకు వైపుకు వేళ్లాతుంది. మీరు మీ ఆలోచనా పరిధిని ఆంధ్రా వరకే పరిమితం చేస్తున్నట్లు ఉంది. తమిళనాడును అక్కడజరిగిన ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని ఆలోచించి రాసేది. తమీళ ప్రజల ఉద్యమాల ప్రభావం భారత రాజకీయాలపై ఎంతో ఉంది. అక్కడినుంచే ప్రజలను ఆకట్టుకొనే వాగ్దానాలు చేయటం, మధ్యాహ్న భోజన పథకం మొద|| మొదలైయ్యాయి. ఈ పథకాలకు ఆ ఆదర్శవాదాలకు సంబంధమేమిటంటే , సంభందం ఉన్నాది. మన సంస్కృతి లో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దటానికి, మార్చటానికి మొదలైన ఈ ఆదర్శవాదుల రచనల లో కొన్ని వాదనలు/అభిప్రాయాలు కొంతకాలానికి రాజకీయ పార్టిల అజేండాగా మారి విశ్వరూపం చూపటం మొదలు పెట్టాయి. ఆతరువాత రచయితలు రాయటం మానుకొన్నా వారి భావాలను రాజకీయ పార్టిలు మీటీంగ్ లో మాట్లాడటం మానుకోలేక పోయారు. ఇదంతా మీకు తెలిసిందె. తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్లు ఈ ఆదర్శవాదాలతో, ఆకట్టుకొనే నినాదాలతో మొదలైన ఈ ప్రక్రియ ఉచిత టి విలు, మంగళ సూత్రాల వరకు తమీల నాడులో వచ్చింది. ఇక ఆంధ్రకి వస్తే ఆకట్టుకొనే పథకాలు రెండు రూపాయల కిలొ బియ్యం లాంటివి మొదలుపెట్టి, దానిని అమలు జరపటానికి డబ్బులు లేక తెలుగు వారుణి వాహిని తో మొదలు పెట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ల వరకు రూపంతరం చెందాయి.
  —————————————-
  ఆదర్శాలను ఎన్నికల మానిఫేస్టోలో వినడానికి బాగున్నా వాస్తవానికి ఎవరిని ఉద్దరించటానికి వీటిని తీసుకు రావాలనుకొంటారో వారికి పెద్దగా మేలు చేయవు. ఇది నా అభిప్రాయం. మీరు రాసే నవలలో 1980-2010 జరిన మార్పులను కవర్ చేస్తే చదివేవారికి గతకాలపు ఆదర్శాలు అమలు జరిగిన తరువాత ప్రజలలో వచ్చిన మార్పులను అప్పటివి ఇప్పటిని బేరిజు వేసుకొంట్టు చదవడానికి బాగుంట్టుంది.

  మెచ్చుకోండి

 4. ఉచిత పథకాల వలన,గ్రామీణపథకాల వలన పొలం పనులు చేయటానికి కూలిలు దొరకక, దొరికినా వారికి చిన్నరైతులు దిన దినం పెరిగే వ్యవసాయ ధరలవలన పంటలు వేయటం మానుకొనే పరిస్థితి మొదలైంది. వీటివలన దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతిన్నాది. అన్నిటికి సర్వరోగ నివారిణి లాగా పిల్లలకు చదువులు చెప్పియటం మొదలుపెట్టారు. కాని రానున్న కాలంలో చదువులవలన ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూడాలి. ఇలా రాసుకొంట్టూ పోతే ఎన్నో వస్తాయి. నేను చెప్పిన పాయింట్లను మీరు పరిశిలించి మీకు నచ్చితే మీరు రాసే నవలలో ఎక్కడైనా ప్రస్థావించండి.

  మెచ్చుకోండి

  1. ఈ రోజు నా ఆలోచనలన్నిటినీ మీ కీ బోర్డ్ నుంచీ చూస్తున్నానేమిటండీ 🙂
   రెండు రూపాయల కిలో బియ్యం గురించి “ఒక అమెరికా వాడి రైలు బండి ప్రయాణం” కథ లో ప్రస్తావించాను (వీరమాచనేని వెంకట ప్రసాద్ విషయం లో).
   ఇంతకు ముందు ఒక ఆంధ్ర సాఫ్ట్-వేర్ ఇంజినీర్ కథ లో కూడా దీనిని గురించి కొంచెం రాశాను.ఇక్కడ…http://wp.me/pGX4s-G
   అలానే చదువుల వలన ఇక ముందు పెద్ద ఉపయోగం ఉండక పోవచ్చుననే చర్చ నా ఈ కథ లో ఉంది:
   http://wp.me/pGX4s-fj

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s