పీ వీ నరసింహా రావు గొప్పతనం గురించి స్వామినాథన్ అయ్యర్.

మన వాడు, తెలుగు వాడు, తెలంగాణ వాడు ఐన మాజీ ప్రధాని పీ వీ నరసింహా రావు నిరాడంబరుడే కాక, పెద్ద పేరు కోరుకొనకుండా తన పని తాను చేసుకొని పోయిన కర్మ యోగి.ఆర్భాటం లేని నిరాడంబరుడు. దేశ గతిని మలుపు తిప్పిన వాడు. దేశానికి “ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్”, చేసిన వాడు.
దేశ రహస్యాలు కొన్ని తనతోనే పోతాయని (అణు పరీక్షల వ్యవహారం లో), బయటికి చెప్పని దేశ భక్తుడు.
స్వామినాథన్ అయ్యర్, గుంపు పోకడకు వ్యతిరేకం గా ఒక కౌంటర్ పాయింట్ ని బలం గా వినిపించే పాత్రికేయుడు. తన అంచనా తప్పు అయితే నిజాయితీ గా ఒప్పుకొనే ధైర్యవంతుడు.తగినంత అధ్యయనం చేసి రాసే వ్యక్తి. నేను గౌరవించే మేధావి. అటువంటి స్వామినాథన్ అయ్యర్ మన పీ వీ కి ఘటించిన స్మృత్యంజలి ..ఇక్కడ..:ఎకనమిక్ టైంస్ లో:

http://economictimes.indiatimes.com/opinion/columnists/swaminathan-s-a-aiyar/unsung-hero-of-the-india-story/articleshow/8998458.cms

ప్రకటనలు

పాపం మగాళ్ళు! ఎలా ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారు!

ఒకప్పుడు:
———
వాళ్ళు మగ మహారాజులు. వీరులూ ధీరులూ. యుధ్ధాలు చేసే వారు. తెగించే వారు. సాహసాలు చేసే వారు.తరుణులను గెలిచే వారు.పొగరు గా, పౌరుషం గా, ఆప్యాయం గా, స్నేహం గా,దుడుకు గా, పెద్ద మన్సుతో ఉండే వారు.
నచ్చిన వనితలను వలచి వలపించుకొనే వారు.
కుటుంబాలు ఏర్పడటం మొదలయ్యాక, ఇంట్లో వీరి మాటకి తిరుగే లేదు.

నిన్న:
——
నెచ్చెలి గురించి ఎక్కువగా ఊహలలో కాలక్షేపం చేసే వాడు. ఇష్టమైన అమ్మాయిని కాక, పెద్దలు చూసిన “కన్య” ని వివాహమాడిన వాడు. ఊరిలో సగం ఆడ వాళ్ళయినా, వారితో మాట్లాడటానికి కూడా స్వేచ్చ, అవకాశం లేక తన మగ స్నేహితులతో కాలక్షేపం చేసే వాడు. పస లేని గుమాస్తా ఉద్యొగాలు చేసే వాడు.గానుగెద్దు జీవితం!
అధికారం తో పాటు బాధ్యతలు పైన పడిన వాడు. కుటుంబానికి యజమాని ..కానీ కుటుంబ భారం మోసే వాడు..భర్త.ఇంట్లో నచ్చిన వంటలు చేయించుకొని నచ్చకపోయినా తినేవాడు.ఆడవారినీ పిల్లలనూ రక్షించే వాడు..అతనికి రక్షణ ఉందా లేదా అనేది వేరే విషయం. ఇంట్లో పిల్లి అయినా వీధిలో పులి.

నేడు:
—–
ఒక అమ్మాయి దయ కోసం పది మంది మగ వాళ్ళు అలమటించే స్థితి. బిక్కు బిక్కు మంటూ ప్రేమించాలి.ఏమైనా తేడా వస్తే నాన్-బెయిలబుల్ కేసు కింద కట కటాలలోకి పోవాలి. లేకపోతే ప్రభుత్వమే పైకి పంపిస్తుంది.
వళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో బాబూ, నీకు 33 శాతం రిజర్వేషన్లు లేవు!
ఆఫీసు లో తేడా వచ్చిందా సెక్సువల్ హరాస్మెంట్ కేస్ కి సిధ్ధం కావాలి కాబట్టీ, ఆడ పిల్లలతో జాగ్రత్త గా ఉండాలి.
పెళ్ళయినాక, గృహ హింస కేసు ఉంది నాయనా, పెళ్ళాం కొడితే మూసుకొని కూర్చో!ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకు ముల్లు మీద పడిన అరిటాకు కే నష్టం. బాసు గారు నీ కొలీగ్ ని “మేడం కొంచెం ఈ పని చేస్తారా?” అంటారు, నిన్ను మాత్రం, “ఈ పని ఇంకో అరగంట లో చెయ్”, అంటారు.
మహిళా మణులు,బాసు చెప్పిన పని ఇష్టం లేక పోయినా చేస్తారు. మరి అది డబ్బు తో సంబంధమున్న విషయం కదా! నువ్వు వారి మంచికోరి చెప్పినదైనా, చెయ్యరు. చేస్తే స్త్రీ స్వేచ్చ కి భంగం. ఆత్మ గౌరవానికి వ్యతిరేకం.
నీ భార్యకి వంట తెలవదు కదా నువ్వే కాస్త వంట నేర్చుకో నాయనా. లేక పోతే హోటల్ బిల్లు పేలుతుంది. పెళ్ళాం వస్తాదు తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ముందు నడుస్తుంటే, నువ్వు అణకువగా పిల్లల్ని ఎత్తుకొని వెనుక నిలబడు.లేకపోతే నీకు సంస్కారం లేనట్లే! కారు డ్రైవర్ పని చేయి, పచారీ పని చేయి.
ఆడ వారి హక్కుల గురించీ మగ వారి బాధ్యతల గురించీ తోటి మగ వాళ్ళతో సహా బ్రెయిన్ వాష్ చేయబడిన వాడా!
బజారు లో కురచ బట్టల కుర్రదాన్ని చూసి, తన నోట్లో మాట తనే నొక్కేసుకోవటమే నాగరికత అనుకొనే వాడా.. !కుటుంబ చట్రం లో పడి కునారిల్లుతున్న వాడా!రోజు రోజు కీ సహజ స్వభావాన్ని వీడుతున్న వాడా!!రేపు లోకం ఎలాఉంటుందో అని భయపడే వాడా!చచ్చి పోయిన “మగాడా”!, నీ స్మృతికి ఇదే నా నమస్సుమాంజలి!

దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..

నా టపా “విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!” (http://wp.me/pGX4s-iR) కి వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ టపా రాస్తున్నాను.
సృష్టి మొదలూ, దేవుడూ మొదలైన వాటి గురించి మాట్లాడే వారి లో కొందరిని ఈ కింది  విధం గా వర్గీకరించ వచ్చు:
1. దేవుడిని నమ్మే వారు. వీరు తమ ఇష్టమైనది నమ్మవచ్చు. కానీ వీరికి దేవుడి గురించిన ఎటువంటి ప్రత్యక్ష అనుభవాలూ ఉండవు.వీరు, భౌతిక నియమాలను లెక్కచేయకుండా దేవుడిని తమ ఇష్టమైనట్లు ఊహించుకొంటారు .ఈ ఊహలు వీరి మన్సులో మాత్రమే ఉంటాయి. బయట ఎక్కడా ఉండవు. ఉదాహరణకు రెక్కల దేవదూతలూ, సింహం తల కలిగిన పక్షి దేవుళ్ళూ వీరి ఊహల్లోనే ఉంటాయి.వీరిలో కొంతమంది తమ నమ్మకాన్ని బలపరుచుకోవటానికి తమకు తెలిసిన సైన్స్ ని ఒక వాదన గా ఉపయోగించుకొంటారు.
2. ‘సంపూర్ణ సత్యం’ లేక ‘దేవుడు’ తమ ప్రత్యక్ష అనుభవం లోకి వచ్చాడనే వారు. వీరి అనుభవాలు సాధారణం గా ఆధ్యాత్మికమైనవి అయి ఉంటాయి. గొప్ప గొప్ప యోగులూ, ఋషులూ ఈ అనుభవాలను పొందినట్లు చెప్తారు. కానీ ఈ అనుభవాలు మానవ మేధ పరిధికి బయట జరిగి ఉంటాయి. మేధో పరం గా వీరి అనుభవాలను పరీక్షించటం కుదరదు.ఎందుకంటే అవి కాలానికి బయట జరిగిన అనిర్వచనీయమైన అనుభవాలు. మామూలు మనుషులకు ఈ అనుభవాలు “నిజమైనవా, కానివా?” అని తేల్చుకోవటం కూడా కష్టం.ఈ అనుభవాలు ఐన ఇద్దరు మనుషులు కూడా, వాటి గురించి చర్చించుకొని, వారు “ఒకే విషయాన్ని అనుభవించార”ని చెప్పటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, ఇద్దరు మనుషులు చర్చించుకోవాలంటే మాటలు కావాలి. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు సాధారణం గా మాటలకు అందనివై ఉంటాయి.
3. ఇక మూడో రకం మేధోపరం గా సృష్టి గురించి పరిశోధించే వారు. వీరు చెప్పిన వాటిని పరీక్షించి నిగ్గుతేల్చవచ్చు. భౌతిక శాస్త్రవేత్తలు ఈ కోవలోని వారే! వీరు కాలానికి ఆవల నున్న విషయాలను ప్రత్యక్షం గా అనుభవించలేక పోయినప్పటికినీ, ఆ విషయాలను మేధోపరం గా తమ సమీకరణాలతో అర్ధం చేసుకొని,వాటిని ఆ సమీకరణాలతో ప్రాతినిధ్యం వహింపచేస్తారు. వీరు చెప్పిన సిధ్ధాంతాలను భౌతిక ప్రపంచం లో నిరూపణకు పెట్టవచ్చు. వీరి తో చిక్కల్లా వీరు పరిశోధించే విషయం భౌతిక పరిధి దాటిపోయినప్పుడు వస్తుంది. ఉదహరణ కు “ఈ విశ్వం రక రకాల నియమాలతో, స్థల కాలాలతో ఇలా ఎందుకు ఏర్పడి ఉన్నది?” అనే ప్రశ్న భౌతికత కి ఆవల ఉన్నది. ఇది అధి భౌతికమైనది. ఈ ప్రశ్నకు భౌతిక నిరూపణలతో సమాధానం ఇవ్వటం సాధ్యపడక పోవచ్చు. అప్పుడు కొందరు శాస్త్ర వేత్తలు “సైధ్ధాంతిక కల్పనల (conceptual fantasy)”  లోకి దిగుతారు. ఈ కల్పనలు  అన్నీ నిజం కావు. ఏదో ఒక కల్పన మాత్రమే నిజమౌతుంది. అనంత విశ్వాలు ఉన్నాయి అనటమూ, అనంతమైన కొలత (Dimension) లు ఉన్నాయి అనటమూ, ఐదో కొలత  లో ఈ సృష్టి జరిగింది అనటమూ ఇలాంటి కల్పన లే.అయితే వీరి కల్పన లన్నీ భౌతిక నియమాలకూ, భౌతిక దృగ్విషయాలకూ భిన్నం గా ఉండవు. ఇవి భౌతిక నియమాల ఆవల ఉంటాయి . వీరి కల్పనలు మనిషి బయట ఉన్న భౌతిక వస్తువు శోధనలో, భౌతికత పరిధిని దాటి, అధి-భౌతిక విషయాలలోకి వెళ్ళటం వలన వచ్చినవి.
శాస్త్రవేత్తలకున్న ఇంకొక పరిమితి,విశ్వ చరిత్రని శోధించి  విశ్వం గురించిన నియమాలను మాత్రమే వారు కనుగొన గలరు. “ఆ నియమాలతో కూడిన విశ్వం ఎందుకు ఆవిర్భవించింది” అనేది వారి పరిధి లో లేని విషయం.యోగులకు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలకు అధి-భౌతిక విషయాల గురించిన ఇంద్రియానుభవం ఉండదు.

ఇక పోతే సృష్టికి కారణం లేదనే వాదనకి మూలం ఐన్-స్టీన్ మహాశయుడు ప్రతిపాదించిన సాపేక్ష సిధ్ధాంతం లో ఉంది. ఈ సిధ్ధాంతం ప్రకారం సమయం సాపేక్షమే! విశ్వం మొత్తానికి ”భారతీయ  ప్రామాణిక సమయం(Indian Standard Time)” లా ఒకే సమయం లేదు. భూమిని ఆధారం
(reference) గా తీసుకొంటే మిగిలిన ఖగోళ వస్తువుల (గ్రహాలూ నక్షత్రాలూ)మీద కాలం నెమ్మదిగానో, వేగం గానో,( భూమితో ఆయా ఖగోళ వస్తువుల సాపేక్ష వేగాన్ని బట్టీ, ఆయా వస్తువుల గురుత్వాకత్షణను బట్టీ) ఉంటుంది. సాపేక్ష సిధ్ధాంతాన్ని సూర్యగ్రహణం సమయం లో స్థల-కాలం(Space-Time) వంపు తిరిగింది అని తెలుసుకోవటం ద్వారా నిరూపించారు. కాబట్టీ కాలం నెమ్మది గానూ, వేగం గానూ నడవటం పై సందేహాలు అవసరం లేదు. “ఈ విశ్వం లో అనేక కాల ప్రవాహాలు ఉండటం” పై కూడా సందేహాలు అనవసరం.
స్థల-కాలం(Space-Time) అనేది విశ్వం తో పాటు పుట్టి ఉబ్బుతోంది. స్థల-కాలం వంపుతిరిగి, భూమి ఉపరి తలం లా తన పైకి తాను ముడుచుకొని పోయి ఉన్నదని ఐన్-స్టీనుడి ఉవాచ. గోళాకార ఉపరితలం లా ఉన్న కాలానికి “మొదలు” ఎలా ఉంటుంది?(Ref: Hawkings proposed quantum theory of gravity) ఒక వృత్తం గీస్తే, ఆ వృత్తం వెంబడి ఏది మొదలూ ఏది చివరా? అలానే భూమి మీద ప్రయాణం మొదలు పెట్టి ఉత్తర ధృవం చేరుకున్న తరువాత భూమి అంతమౌతుందా? కాదు కదా? ఉత్తర ధృవం తరువాత కూడా భూమే ఉంటుంది. కాకపోతే ఈ సారి మన ప్రయాణం ఉత్తర ధృవానికి దక్షిణం గా సాగుతుంది. అలానే కాలం పరిమితమైనది. కాబట్టీ, విశ్వం కాలం లో పుట్టలేదు. కాలం లో పుట్టని దానికి కారణం ఉండదు. ఎందుకంటే కార్య కారణ సంబంధాలు కాలం లోనే జరుగుతాయి.
భౌతిక శాస్త్రం ప్రకారం ఇలా కారణం లేకుండా పుట్టేవి అనేకం ఉన్నాయి. గుళిక సిధ్ధాంతం (quantum theory) ప్రకారం శూన్యం నుంచీ ఎలక్ట్రాలు ఏ కారణం లేకుండానే పుట్టి మళ్ళీ అంతరిస్తాయి. దీనినే శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations) అంటారు. ఇది సాయి బాబా శూన్యం నుంచీ విభూతి పుట్టించటం లాంటిది. కానీ, ఈ రెండూ ఒకటి కాదు. శాస్త్రం(science) ప్రయోగాల ద్వారా ధృవీకరించిన విషయమే శాస్త్ర నియమమౌతుంది . శాస్త్రం , శూన్యంలోంచీ ఎలక్ట్రాన్లు పుట్టటాన్ని ధృవీకరించి దాన్ని ఒక నియమం గా ఏర్పరిచింది కనుక, అది శాస్త్రీయమే. సాయి బాబా ఏ మోసమూ లేకుండా ప్రయోగశాల లో విభూతి పుట్టించినట్లైతే, శాస్త్రం ఒక సాయి బాబా నియమాన్ని కూడా ప్రతిపాదించేదేమో!
ఇంకొక విషయం..విశ్వానికి “బయట” అనేది లేదు. “బయట” ఉండాలంటే స్థలం ఉండాలి. కానీ, స్థలం అంతా విశ్వం తో పాటు పుట్టి విశ్వం లోనే ఉంది. మరి విశ్వం ఎక్కడికి వ్యాకోచిస్తూంది? ఎక్కడికీ వ్యాకొచించటం లేదు. ఉన్న స్థలకాలానికి మరింత స్థ- కాలం కలుపబడుతోంది. విశ్వం “బయట” ఏముంది? ఏమీ లేదు. దక్షిణ ధృవానికి దక్షిణం గా ఏముంది? ఏమీ ఉండదు కదా? “బయట” లేని విశ్వాన్ని ఊహించుకోవటం లో కొన్ని పరిమితులున్నాయి. ఒక బుట్ట లో ఐదు మామిడి పళ్ళున్నాయి అనుకొందాం. ఆ ఐదు పళ్ళనూ బయటికి తీస్తే బుట్టలో ఏముందీ అంటే, ‘శూన్యం ఉంది’ అని చెప్పవచ్చు. కానీ విశ్వం “బయట” స్థలం కూడా లేదు. స్థలం లేని స్థితి ని ఊహించుకోవటం మనకు చేతకాదు. ఎందుకంటే, మన రోజువారీ జీవితం లో మనం అలాంటి స్థితి ని చూసి ఉండం.అనంతం కాని కాలాన్ని ఊహించుకోలేకపోవటం కూడా ఈ కారణం వలననే! మనం విశ్వానికి మొదలు వెతకటం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మన జీవితం లో అన్ని విషయాలకీ మొదలూ చివరా ఉంటాయి. కాబట్టీ, మనం విశ్వానికి కూడా మొదలును వెతుకుతాం. కాకపొతే, అదృష్టం కొద్దీ విశ్వానికి మొదలు ఉంది.కానీ కాలం లో ఈ మొదలు దాటి ముందుకు పోతే (ఉత్తర ధృవం దాటి ముందుకు పోతే దక్షిణం వచ్చినట్లు) మళ్ళీ తరువాతి కాలం వస్తుంది.
కారణం లేకుండానే ఎలక్ట్రాన్లూ, విశ్వమూ మొదలైనవి పుట్టటాన్ని మనం ఇంకొక కొలత (Dimension) ప్రవేశ పెట్టటం ద్వారా కారణం పరిధిలోకి తీసుకొని రా వచ్చును.అయితే ఈ కొత్త కారణం మనం దైనందీన జీవితం లో చూసే కారణాలవంటిది కాదు. ఇది మన బౌతిక కాలం లో జరిగేది కాదు.అధిభౌతిక కాలం లో జరిగేది. సినిమా తెర మీది రెండు కొలతల బొమ్మలకు తెలివి ఉందనుకొందాం. తెరమీద మనం ఒక టార్చీ లైటు ఫోకస్ చేసినప్పుడు, తెరమీద బొమ్మలు ఆ టార్చి లైట్ వెలుగు కి కార్య కారణ నియమాన్ని ఆపాదిస్తే, ఆ వెలుగు ఏ కారణం లేకుండానే వచ్చినట్లు తేలుతుంది. ఎందుకంటే ఆ బొమ్మలు మూడవ కొలతలో ఉన్న మనలను కనిపెట్టలేవు కాబట్టీ. అలానే ఈ విశ్వ సృష్టి ఐదవ కొలత లోజరిగితే, అప్పుడు  ఆ సృష్టి నాలుగు కొలత (కాలం తో కలిపి నాలుగు డైమన్షన్లు) ల లో ఉన్న మనకు, కారణం లేనిది గా కనపడుతుంది. కానీ ఐదవ కొలత అనేది అధి-భౌతికం. దీనిని మన నాలుగు కొలత ల ప్రపంచం లోని విషయాల సహాయం తో నిరూపించటం కష్టం. దీనినే సైధ్ధాంతిక కల్పన(conceptual fantasy) అనవచ్చు. ఈ ఐదవ కొలత ఏ భౌతిక నియమాన్నీ ఉల్లంఘించ లేదు . కానీ ఈ ఐదవ కొలత మన ఊహ లోని ఒక విషయమే!ఐతే దీనికీ, కేవలం ఊహా గానాలైన “భూమిని సృష్టించే రెక్కల దేవతలకీ, తాబేళ్ళకీ” తేడా గమనించవచ్చు.కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదన్నప్పుడు,దాని అర్ధం, మనం ఉన్న నాలుగు డైమన్షన్లలోనూ, విశ్వం పుట్టుకకి కారణం దొరకలేదనే! ఐదో కొలతలోనో, పన్నేండో కొలతలోనో దానికి కారణం ఉండవచ్చు. కానీ ఇలా ఎన్ని కొలతలని ఊహించుకొంటాం అనేది వేరే ప్రశ్న.

విశ్వం లో కారణాలు లేనివీ (ఉదా: శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations)), కారణాలు తెలియనివీ (ఉదా: జీవులలో జన్యు మార్పులు), కారణాలు ఎప్పటికీ తెలుసుకోలేనివి (విశ్వం యొక్క ప్రయోజనం, ఐదవ కొలత, పదవ కొలత లాంటివి), కారణాలను ఖచ్చితం గా కొలవలేనివీ (హైజెన్-బర్గ్ అనిశ్చితి  సిధ్ధాంతం(Heisenberg’s Uncertainity principle) ప్రకారం, ఎలక్ట్రాన్ వేగాన్నీ, స్థానాన్నీ ఒకే సమయం లో ఖచ్చితం గా ఎప్పటికీ తెలుసుకోలేము) ఉన్నాయి. వీటి మధ్య గల తేడాలను తెలుసుకోవటం కూడా ముఖ్యమైన విషయమే!

వేదాలూ, భగవద్గీతా, ఇతర మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర వేత్తలూ, మాట్లాడే దానిలో కొంత సారూప్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒకే విషయం, సృష్టి యొక్క జననం, సృష్టి కి కారణం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విశ్వం లాంటి విషయాల్లో సమాధానాలు చాలా తక్కువ ఆప్షన్స్ తో ఉంటాయి. సృష్టి పరిమితం, లేక అనంతం. దీనికి కారణం ఉంది, లేక లేదు.లేక ఉండీ ఉండకుండా ఉంది. దీనికి బయట ఉంది లేక లేదు.లేక ఈ మధ్య లో ఉంది. సృష్టికి కారకుడు ఉన్నాడు లేక లేదు.లేక ఈ మధ్య లో ఉన్నాడు. ఇలా ఆప్షన్స్ అన్నీ రెండు లేక మూడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక మత గ్రంధం చెప్పేదానికీ, సైన్స్ చెప్పిన ఫలితానికీ పోలిక ఉండటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కాబట్టీ, “మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర పరిశొధనలూ, ఈ సృష్టి రహస్యాల గురించి ఏకీభవిస్తున్నాయి”, అనటం అప్పుడే సరి కాదు అనుకొంటాను.

కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకొంటున్నాను..ఏమీ అనుకోవద్దండీ..!

నా కథ ఒకటి, కథా జగత్ లో ఇక్కడ పబ్లిష్ అయ్యింది..చదివి కామెంట్ పెట్టకపోయారో మీ తల…వెయ్యి… అవుతుంది.. 🙂   : http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/anandanvesana—ram-bondalapati-bondalapati-sitaramaprasad

 

ఈ కథ ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?

ఈ కథ చదివి ఇది ఏ టైపో చెప్పంది.
ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?
అలానే కథ బాగుందో లేదో కూడా చెప్పండి.
**********************

“సుయ్” మని కుక్కర్ విజిల్ వేసింది. సుమ స్టవ్ కట్టేసి వచ్చి బాబు దగ్గర కూర్చొంది. బాబు రెండు కాళ్ళూ పైకి మడిచి  చిట్టి చేతులు ఊపుతూ బోసి నోటితో కేరింతలు కొడుతున్నాడు.  సుమ రెండు చేతులూ మొహానికి అడ్డం పెట్టి, ఒక్క సారి గా చేతులు తీసి, “బావ్” అంది. బాబు గుక్క పెట్టి నవ్వ సాగాడు. వాడు నవ్వుతోంటే లోకమే తెలియదు సుమకి!

ఏదో సుమ చేతి మీద పాకినట్లనిపించింది. చేయి విదిలించి పక్కకి చూసింది..”అమ్మో పాము..!ఎక్కడి నుంచీ వచ్చింది..?”

పక్కనే, ఆఫీసు నుంచీ అప్పుడే వచ్చిన భర్త, రవి నిల్చొని, ఉన్నాడు నవ్వుతూ. పాము ని పరీక్ష గా చూసింది, “అది ఒట్టి రబ్బరు పామే.!.అచ్చు పాము లానే ఉంది..!హమ్మయ్యా..!తను హడిలి పోయింది..తనకు ముందు నుంచీ పాములంటే చచ్చే భయం.!.”

“మీకు కొనటానికి పాము బొమ్మే దొరికిందా?”, అంటూ భర్తని మందలించింది.

బాబు అప్పుడే దొర్లి పాము బొమ్మని చేతిలోకి తీసుకొని దానికి “ఉంగా” చెప్తున్నాడు ఉత్సాహం గా.

“వచ్చే వారం మూడురోజులు సెలవలొచ్చాయి మాకు. మనం ఊరేళ్తున్నాం”, అన్నాడు రవి.

*********

ఊరికి పెడగా మామిడి తోట లో ఉంటుంది సుమ వాళ్ళ అత్త గారి ఇల్లు. ఇంటి పక్కనే చెరువు. మిగిలిన ఇళ్ళు కొంచెం దూరం కావటం తో ఏదో తెలియని గుబులు గా ఉంది సుమ కి. ఆమె పంపు కొడుతుంటే, పక్కనే ఈత చెట్టు మీద చిక్కుకొని తెల్లగా మెరుస్తూ కనపడింది ఏదో. “ఇదేదో పాము చర్మంలానే ఉందే..తనకసలే పాములంటే అదురు..అందుకే తానీ పల్లెటూరు రానంది..”

రవిని పిలిచి చూపించింది.

“అది పాము కుబుసం..ఇవి ఇక్కడ మామూలే..!పాములు తమ చర్మాన్ని విడుస్తూ ఉంటాయి..నువ్వు సిటీ లో పుట్టి పెరిగావు కాబట్టీ నీకు వింత గా ఉంది”, అన్నాడు.

” వింత గా కాదు భయం గా ఉంది..అయినా, ఇంట్లో బాబుని పెట్టుకొని, అసలు మీరలా ఎలా మాట్లాడ గలుగుతారు?! ఇక్కడ కుబుసం ఉందంటే, ఇంటి దగ్గర్లోనే ఎక్కడో పాము ఉందన్న మాట.!.”, అంది కోపం గా.

“సరే..సరే.పాముల సుబ్బయ్య ని పిలిపించమని నాన్న కి చెప్తాలే”,అన్నాడు రవి.

పాముల సుబ్బయ్య పాములు పట్టటం లో దిట్ట. పట్టిన పాముల కోరలు తీసి వాటిని ఆడించి కడుపు పోసుకొంటాడ వాడు.

********

మరుసటి రోజు సాయంత్రం,రవి ఊళ్ళో తన చిన్న నాటి స్నేహితుడు ఒకతనిని కలుసుకోవటానికి వెళ్ళాడు.

బాబుని చెక్క ఉయ్యాలలో పడుకోబెట్టి అత్తగారికి సహాయం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది సుమ. సుమ మామ గారు పొలం నుంచీ వచ్చే సమయం అయ్యింది..

పాలేరు వీరడు, వడ్ల బస్తా వరండా లో వేసి,, “బస్తా వేశానండీ అమ్మగారూ..!”, అన్నాడు.

సుమ పాలు తీసుకోవటానికి వెళ్తుంటే, ఉయ్యాలలో బాబు చిన్న గా నవ్వుతున్న శబ్దం వినిపించింది. బాబు వైపు చూసిన సుమ స్థాణువై నిలబడిపోయింది. ఉయ్యాల అంచు మీద పామొకటి నెమ్మది గా పాకుతోంది. బాబు దాని వైపు చూసి నవ్వుతున్నాడు.

కొంచెం తేరుకొని,”పాము..పాము.రండి త్వరగా ..!” అని కేకలు పెట్టింది సుమ.

బాబు పాము వైపుకి చేతులు ఆడించాడు. పాము అందకుండా ఉయ్యాల కిందికి వెళ్ళింది. వీరడు త్వరగా తన ములుగర్ర పట్టుకొని ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. సుమ అత్త గారు ఆప సోపాలు పడుతూ ఉయ్యాల గదికి చేరింది.

వీరడికి పాముని కొడదామంటే వాటం కుదరటం లేదు.అది ఉయ్యాల కింద నెమ్మది గా కదులుతోంది. సుమ ధైర్యం చేసి బాబు వైపుకి కదిలింది. పాము బాబు పక్కకి వచ్చి ‘చట్’ మని పడగ విప్పింది. సుమ అత్త గారు,”అమ్మో నాగుపామే..చూడండి సీతమ్మ వారి పాదాలు పడగపై”,..అంది.

సుమ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.

గది అంతా నిశ్శబ్దమైపోయింది. వీరడు పాము పై కర్ర విసుదామంటే, ఎక్కడ బాబు కి తగులుతుందో అని భయం గా ఉంది. ఒక వేళ కర్ర పాముకి తగలక పోతే పాము వెంటనే కాటేస్తుంది. నాగు పాము చాలా చురుకైనది.

ఆ సాయం కాలపు నీరెండ లో పాము పడగ నీడ బాబు లేత మొహం పై పడుతోంది. బాబు పాము పడగ చూసి నవ్వుకొంటూ చేయి ముందుకి సాచాడు. పాము బుస కొట్టింది. విసురు గా బాబు చేతి వైపుకి పడగ విసిరింది. బాబు మొదటి సారి గా ఏడుపు మొదలుపెట్టాడు. సుమకు ఎక్కడ లేని తెగువా వచ్చేసింది. ఒక్క ఉదుటున వెళ్ళి, పాము తోక పట్టుకొని బయటికి విసిరి, బాబు ని ఎత్తుకుంది.

సుమ అత్త గారు,”వీరడూ, డాక్టర్ ని పిలుచుకు రా..పో! తొందరగా! ఒక్క అంగ లో.. ఇక్కడున్నట్లు రావాలి!”, అని వీరడి ని పంపించింది”.

“యావండీ..ఏమిటి..బాబు ఏడుస్తున్నాడు?” అంటున్నారు బయట ఎవరో.

బయట చూస్తే, పాముల సుబ్బయ్య, నెత్తి మీద బుట్ట తో.

అత్త గారు బాబు చేయి మొదట్లో గుడ్డ తో కడుతూ,”సరిగ్గా సమయానికి వచ్చావు, పాము ఇక్కడే ఎక్కడో ఉంటుంది..పట్టుకో సుబ్బయ్యా..దాన్ని”, అంది.

“నేను దొడ్లో రెండు పాముల్నీ పొద్దునే పట్టి, విషమూ, కోరలూ తీసేశానమ్మా..!ఎట్టా తప్పించుకొందో..మద్దేనం ఒక పాము బుట్టలోంచీ తప్పించుకొంది.!.దాని వలన అపాయం ఏమీ లేదు..విషం తీసేశాగా..”, అంటూ పక్క పొదలలో వెతకటం ప్రారంభించాడు సుబ్బయ్య.

***********

మనమందరం ఇలా ఉంటే బాగుంటుంది..

ఎవరికి వారు పక్క వాడి కళ్ళతో వాడి బాధల్ని చూడ గలిగితే..

దళితుల అణిచివేత ను పైకులాలు అర్ధం చేసుకొంటే ..
పైకులాల-సామాన్యుని దళితులు ఆదరిస్తే..

తెలంగాణ వారి అస్థిత్వ వేదనను ఆంధ్రులు పడితే…
ఆంధ్ర వారి ఐక్యతా భావనను తెలంగాణ స్పృశించగలిగితే..

లేని వాడి లేమిని ఉన్నవాడు అనుభవిస్తే..
“బాగుపడినాక చేసేపని” లేని వాడి మదిలోకొస్తే..

సొంత వ్యాపారం లోని కష్టం కామ్రేడ్ కి తెలిస్తే..
తన జీతం లోని “శ్రమ” , “సీ ఈ ఓ” గారికి తెలిస్తే ..

ఆడవారి ఇష్టాన్ని మగవారు గౌరవిస్తే..
మగవారి అభిమానాన్ని ఆడవారు అర్ధం చేసుకొంటే..

సాయిబ్బు గడ్డం నామాలాయన కిష్టమైతే..
నామాల ముఖం సాయిబ్బుకింపైతే..

ఎవరికి వారు తమలోకి తొంగి చూసుకొంటే..
బాగుంటుంది…

తెలుగమ్మాయిల గురించి కొన్ని పరిశీలనలు..పక్షపాతాలూ..

బెంగుళూరు లొ మా ఆఫీసు లో ఒక తెలుగమ్మాయి కొత్తగా చేరితే, ఆమె తెలుగమ్మాయని నోరు తెరవక ముందే కనిపెట్టేస్తాం. మొదటి రోజు తెలుగమ్మాయి సాధారణం గా ఎవరినో ఒకరిని వెంటపెట్టుకొని (మగ వాళ్ళని) వస్తుంది.
తెలుగమ్మాయి పని, ఆమెది తప్ప మిగతా టీం అందరి పనీ. ఒక రోజు పనిని రెండు రోజుల తరువాత మళ్ళీ అసైన్ చేసినవాడికే ఇచ్చి, వాడిదే తప్పు అని చెప్పటం కూడా తెలుగమ్మాయిలకే చెల్లుతుంది.
ఇదంతా తెలుగమ్మాయిలు సాధారణం గా ప్రొటెక్టివ్ వాతావరణం లో పెరగటం, వాళ్ళని పెద్ద వాళ్ళు అతి గారం చెయ్యటం (ప్రభుత్వం కూడా వాళ్ళని గారం చేస్తుంది ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చి) వలన కావచ్చు.

తెలుగమ్మాయికి లోక జ్ఞానం తక్కువా,గారం మాటలు ఎక్కువా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒంటి మీద నగలు దిగవేసుకొనే వాళ్ళలో తెలుగమ్మాయిలు ముందు ఉంటారు. నార్త్ అమ్మాయిల మేక్ అప్ ఖర్చు గురించి చెప్పక్కర లేదు. అమ్మాయిలందరికీ అటెన్షన్ కావాలనుకొంటా.. కాస్త అందం గా ఉన్న అమ్మాయిలు మేకప్ వేసుకొని తమ హిట్ రేట్ ని పెంచుకొంటే, అంత అందం గా లేని వాళ్ళు నగలు దిగేసుకొని..ఇవిగో చూస్కో నా నగలు అంటారు.

ఇకపోతే ఏ సంవత్సరానికో ఒక సారి కట్టే పట్టు చీరలు కొనటం లో మన ఆడ వాళ్ళు ముందుంటారు. తరవాత ఏ నాలుగేళ్ళకో ఆ చీర ని సగం ధరకి ఎక్స్చేంజ్ ఆఫర్ లో అమ్మేస్తారు.
మన తెలుగు అమ్మాయిలలో ఇంకొక అర్ధం కాని విషయం, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటి వారు జాకెట్ ముక్కలు పెట్టటం. అమ్మాయిల ఇళ్ళలో ఆ జాకెట్ ముక్కలు కుప్పలు గా పెరుగుతాయి. అందరూ చుడీదార్ వేసుకొనే వారే..ఎప్పుడో పండగకో పబ్బానికో తప్ప. ఇంకా..జాకెట్ ముక్కల అవసరం ఏమిటి? వాటిని పెట్టటం అనేది ఒక కాలం చెల్లిన ఆచారం. ఒక ఆమె కి వేరొక ఆమె ఇచ్చిన జాకెట్ ముక్క, మరొకామె తన ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేస్తుంది. ఈ విధం గా ఎవరూ కుట్టించుకోకుండానే జాకెట్ ముక్కల సర్క్యులేషన్ మొదలౌతుంది.

ఆ… ఐనా మగాడికి నాకన్నీ ఎందుకులే ఇవన్నీ..