ఈ కథ ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?

ఈ కథ చదివి ఇది ఏ టైపో చెప్పంది.
ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?
అలానే కథ బాగుందో లేదో కూడా చెప్పండి.
**********************

“సుయ్” మని కుక్కర్ విజిల్ వేసింది. సుమ స్టవ్ కట్టేసి వచ్చి బాబు దగ్గర కూర్చొంది. బాబు రెండు కాళ్ళూ పైకి మడిచి  చిట్టి చేతులు ఊపుతూ బోసి నోటితో కేరింతలు కొడుతున్నాడు.  సుమ రెండు చేతులూ మొహానికి అడ్డం పెట్టి, ఒక్క సారి గా చేతులు తీసి, “బావ్” అంది. బాబు గుక్క పెట్టి నవ్వ సాగాడు. వాడు నవ్వుతోంటే లోకమే తెలియదు సుమకి!

ఏదో సుమ చేతి మీద పాకినట్లనిపించింది. చేయి విదిలించి పక్కకి చూసింది..”అమ్మో పాము..!ఎక్కడి నుంచీ వచ్చింది..?”

పక్కనే, ఆఫీసు నుంచీ అప్పుడే వచ్చిన భర్త, రవి నిల్చొని, ఉన్నాడు నవ్వుతూ. పాము ని పరీక్ష గా చూసింది, “అది ఒట్టి రబ్బరు పామే.!.అచ్చు పాము లానే ఉంది..!హమ్మయ్యా..!తను హడిలి పోయింది..తనకు ముందు నుంచీ పాములంటే చచ్చే భయం.!.”

“మీకు కొనటానికి పాము బొమ్మే దొరికిందా?”, అంటూ భర్తని మందలించింది.

బాబు అప్పుడే దొర్లి పాము బొమ్మని చేతిలోకి తీసుకొని దానికి “ఉంగా” చెప్తున్నాడు ఉత్సాహం గా.

“వచ్చే వారం మూడురోజులు సెలవలొచ్చాయి మాకు. మనం ఊరేళ్తున్నాం”, అన్నాడు రవి.

*********

ఊరికి పెడగా మామిడి తోట లో ఉంటుంది సుమ వాళ్ళ అత్త గారి ఇల్లు. ఇంటి పక్కనే చెరువు. మిగిలిన ఇళ్ళు కొంచెం దూరం కావటం తో ఏదో తెలియని గుబులు గా ఉంది సుమ కి. ఆమె పంపు కొడుతుంటే, పక్కనే ఈత చెట్టు మీద చిక్కుకొని తెల్లగా మెరుస్తూ కనపడింది ఏదో. “ఇదేదో పాము చర్మంలానే ఉందే..తనకసలే పాములంటే అదురు..అందుకే తానీ పల్లెటూరు రానంది..”

రవిని పిలిచి చూపించింది.

“అది పాము కుబుసం..ఇవి ఇక్కడ మామూలే..!పాములు తమ చర్మాన్ని విడుస్తూ ఉంటాయి..నువ్వు సిటీ లో పుట్టి పెరిగావు కాబట్టీ నీకు వింత గా ఉంది”, అన్నాడు.

” వింత గా కాదు భయం గా ఉంది..అయినా, ఇంట్లో బాబుని పెట్టుకొని, అసలు మీరలా ఎలా మాట్లాడ గలుగుతారు?! ఇక్కడ కుబుసం ఉందంటే, ఇంటి దగ్గర్లోనే ఎక్కడో పాము ఉందన్న మాట.!.”, అంది కోపం గా.

“సరే..సరే.పాముల సుబ్బయ్య ని పిలిపించమని నాన్న కి చెప్తాలే”,అన్నాడు రవి.

పాముల సుబ్బయ్య పాములు పట్టటం లో దిట్ట. పట్టిన పాముల కోరలు తీసి వాటిని ఆడించి కడుపు పోసుకొంటాడ వాడు.

********

మరుసటి రోజు సాయంత్రం,రవి ఊళ్ళో తన చిన్న నాటి స్నేహితుడు ఒకతనిని కలుసుకోవటానికి వెళ్ళాడు.

బాబుని చెక్క ఉయ్యాలలో పడుకోబెట్టి అత్తగారికి సహాయం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది సుమ. సుమ మామ గారు పొలం నుంచీ వచ్చే సమయం అయ్యింది..

పాలేరు వీరడు, వడ్ల బస్తా వరండా లో వేసి,, “బస్తా వేశానండీ అమ్మగారూ..!”, అన్నాడు.

సుమ పాలు తీసుకోవటానికి వెళ్తుంటే, ఉయ్యాలలో బాబు చిన్న గా నవ్వుతున్న శబ్దం వినిపించింది. బాబు వైపు చూసిన సుమ స్థాణువై నిలబడిపోయింది. ఉయ్యాల అంచు మీద పామొకటి నెమ్మది గా పాకుతోంది. బాబు దాని వైపు చూసి నవ్వుతున్నాడు.

కొంచెం తేరుకొని,”పాము..పాము.రండి త్వరగా ..!” అని కేకలు పెట్టింది సుమ.

బాబు పాము వైపుకి చేతులు ఆడించాడు. పాము అందకుండా ఉయ్యాల కిందికి వెళ్ళింది. వీరడు త్వరగా తన ములుగర్ర పట్టుకొని ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. సుమ అత్త గారు ఆప సోపాలు పడుతూ ఉయ్యాల గదికి చేరింది.

వీరడికి పాముని కొడదామంటే వాటం కుదరటం లేదు.అది ఉయ్యాల కింద నెమ్మది గా కదులుతోంది. సుమ ధైర్యం చేసి బాబు వైపుకి కదిలింది. పాము బాబు పక్కకి వచ్చి ‘చట్’ మని పడగ విప్పింది. సుమ అత్త గారు,”అమ్మో నాగుపామే..చూడండి సీతమ్మ వారి పాదాలు పడగపై”,..అంది.

సుమ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.

గది అంతా నిశ్శబ్దమైపోయింది. వీరడు పాము పై కర్ర విసుదామంటే, ఎక్కడ బాబు కి తగులుతుందో అని భయం గా ఉంది. ఒక వేళ కర్ర పాముకి తగలక పోతే పాము వెంటనే కాటేస్తుంది. నాగు పాము చాలా చురుకైనది.

ఆ సాయం కాలపు నీరెండ లో పాము పడగ నీడ బాబు లేత మొహం పై పడుతోంది. బాబు పాము పడగ చూసి నవ్వుకొంటూ చేయి ముందుకి సాచాడు. పాము బుస కొట్టింది. విసురు గా బాబు చేతి వైపుకి పడగ విసిరింది. బాబు మొదటి సారి గా ఏడుపు మొదలుపెట్టాడు. సుమకు ఎక్కడ లేని తెగువా వచ్చేసింది. ఒక్క ఉదుటున వెళ్ళి, పాము తోక పట్టుకొని బయటికి విసిరి, బాబు ని ఎత్తుకుంది.

సుమ అత్త గారు,”వీరడూ, డాక్టర్ ని పిలుచుకు రా..పో! తొందరగా! ఒక్క అంగ లో.. ఇక్కడున్నట్లు రావాలి!”, అని వీరడి ని పంపించింది”.

“యావండీ..ఏమిటి..బాబు ఏడుస్తున్నాడు?” అంటున్నారు బయట ఎవరో.

బయట చూస్తే, పాముల సుబ్బయ్య, నెత్తి మీద బుట్ట తో.

అత్త గారు బాబు చేయి మొదట్లో గుడ్డ తో కడుతూ,”సరిగ్గా సమయానికి వచ్చావు, పాము ఇక్కడే ఎక్కడో ఉంటుంది..పట్టుకో సుబ్బయ్యా..దాన్ని”, అంది.

“నేను దొడ్లో రెండు పాముల్నీ పొద్దునే పట్టి, విషమూ, కోరలూ తీసేశానమ్మా..!ఎట్టా తప్పించుకొందో..మద్దేనం ఒక పాము బుట్టలోంచీ తప్పించుకొంది.!.దాని వలన అపాయం ఏమీ లేదు..విషం తీసేశాగా..”, అంటూ పక్క పొదలలో వెతకటం ప్రారంభించాడు సుబ్బయ్య.

***********

ప్రకటనలు

2 thoughts on “ఈ కథ ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?

  1. హ్మ్ ఒక పాము, పిల్లలందరూ కూడి ఉన్న చోట, వస్తే కుంచెం దూరం గా దాని చుట్టు నిలబడి చుఉడ్డం, అదేమో కాస్త ముందుకు వచ్చి అటు ఇటు ఆ వృత్తం లోనే తిరగడం, వంట చేసే మామ్మ చిన్న కర్రుచ్చుకొని దాని పని పట్టడం లీల గా గుర్తు చేసుకొంటూ ఇప్పటి కి పాము ని అలా దగ్గరగా ఎలా చూసానా, భయపడకుండా అని ఇప్పటికి సందేహం 🙂 ఎవరినో గుర్తు పట్టడానికి అందరిని చూస్తుంది అది అని అనుకోవడం ..

    ఇంతకీ అది తాటిగిరి పాము 🙂

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s