దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..

నా టపా “విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!” (http://wp.me/pGX4s-iR) కి వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ టపా రాస్తున్నాను.
సృష్టి మొదలూ, దేవుడూ మొదలైన వాటి గురించి మాట్లాడే వారి లో కొందరిని ఈ కింది  విధం గా వర్గీకరించ వచ్చు:
1. దేవుడిని నమ్మే వారు. వీరు తమ ఇష్టమైనది నమ్మవచ్చు. కానీ వీరికి దేవుడి గురించిన ఎటువంటి ప్రత్యక్ష అనుభవాలూ ఉండవు.వీరు, భౌతిక నియమాలను లెక్కచేయకుండా దేవుడిని తమ ఇష్టమైనట్లు ఊహించుకొంటారు .ఈ ఊహలు వీరి మన్సులో మాత్రమే ఉంటాయి. బయట ఎక్కడా ఉండవు. ఉదాహరణకు రెక్కల దేవదూతలూ, సింహం తల కలిగిన పక్షి దేవుళ్ళూ వీరి ఊహల్లోనే ఉంటాయి.వీరిలో కొంతమంది తమ నమ్మకాన్ని బలపరుచుకోవటానికి తమకు తెలిసిన సైన్స్ ని ఒక వాదన గా ఉపయోగించుకొంటారు.
2. ‘సంపూర్ణ సత్యం’ లేక ‘దేవుడు’ తమ ప్రత్యక్ష అనుభవం లోకి వచ్చాడనే వారు. వీరి అనుభవాలు సాధారణం గా ఆధ్యాత్మికమైనవి అయి ఉంటాయి. గొప్ప గొప్ప యోగులూ, ఋషులూ ఈ అనుభవాలను పొందినట్లు చెప్తారు. కానీ ఈ అనుభవాలు మానవ మేధ పరిధికి బయట జరిగి ఉంటాయి. మేధో పరం గా వీరి అనుభవాలను పరీక్షించటం కుదరదు.ఎందుకంటే అవి కాలానికి బయట జరిగిన అనిర్వచనీయమైన అనుభవాలు. మామూలు మనుషులకు ఈ అనుభవాలు “నిజమైనవా, కానివా?” అని తేల్చుకోవటం కూడా కష్టం.ఈ అనుభవాలు ఐన ఇద్దరు మనుషులు కూడా, వాటి గురించి చర్చించుకొని, వారు “ఒకే విషయాన్ని అనుభవించార”ని చెప్పటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, ఇద్దరు మనుషులు చర్చించుకోవాలంటే మాటలు కావాలి. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు సాధారణం గా మాటలకు అందనివై ఉంటాయి.
3. ఇక మూడో రకం మేధోపరం గా సృష్టి గురించి పరిశోధించే వారు. వీరు చెప్పిన వాటిని పరీక్షించి నిగ్గుతేల్చవచ్చు. భౌతిక శాస్త్రవేత్తలు ఈ కోవలోని వారే! వీరు కాలానికి ఆవల నున్న విషయాలను ప్రత్యక్షం గా అనుభవించలేక పోయినప్పటికినీ, ఆ విషయాలను మేధోపరం గా తమ సమీకరణాలతో అర్ధం చేసుకొని,వాటిని ఆ సమీకరణాలతో ప్రాతినిధ్యం వహింపచేస్తారు. వీరు చెప్పిన సిధ్ధాంతాలను భౌతిక ప్రపంచం లో నిరూపణకు పెట్టవచ్చు. వీరి తో చిక్కల్లా వీరు పరిశోధించే విషయం భౌతిక పరిధి దాటిపోయినప్పుడు వస్తుంది. ఉదహరణ కు “ఈ విశ్వం రక రకాల నియమాలతో, స్థల కాలాలతో ఇలా ఎందుకు ఏర్పడి ఉన్నది?” అనే ప్రశ్న భౌతికత కి ఆవల ఉన్నది. ఇది అధి భౌతికమైనది. ఈ ప్రశ్నకు భౌతిక నిరూపణలతో సమాధానం ఇవ్వటం సాధ్యపడక పోవచ్చు. అప్పుడు కొందరు శాస్త్ర వేత్తలు “సైధ్ధాంతిక కల్పనల (conceptual fantasy)”  లోకి దిగుతారు. ఈ కల్పనలు  అన్నీ నిజం కావు. ఏదో ఒక కల్పన మాత్రమే నిజమౌతుంది. అనంత విశ్వాలు ఉన్నాయి అనటమూ, అనంతమైన కొలత (Dimension) లు ఉన్నాయి అనటమూ, ఐదో కొలత  లో ఈ సృష్టి జరిగింది అనటమూ ఇలాంటి కల్పన లే.అయితే వీరి కల్పన లన్నీ భౌతిక నియమాలకూ, భౌతిక దృగ్విషయాలకూ భిన్నం గా ఉండవు. ఇవి భౌతిక నియమాల ఆవల ఉంటాయి . వీరి కల్పనలు మనిషి బయట ఉన్న భౌతిక వస్తువు శోధనలో, భౌతికత పరిధిని దాటి, అధి-భౌతిక విషయాలలోకి వెళ్ళటం వలన వచ్చినవి.
శాస్త్రవేత్తలకున్న ఇంకొక పరిమితి,విశ్వ చరిత్రని శోధించి  విశ్వం గురించిన నియమాలను మాత్రమే వారు కనుగొన గలరు. “ఆ నియమాలతో కూడిన విశ్వం ఎందుకు ఆవిర్భవించింది” అనేది వారి పరిధి లో లేని విషయం.యోగులకు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలకు అధి-భౌతిక విషయాల గురించిన ఇంద్రియానుభవం ఉండదు.

ఇక పోతే సృష్టికి కారణం లేదనే వాదనకి మూలం ఐన్-స్టీన్ మహాశయుడు ప్రతిపాదించిన సాపేక్ష సిధ్ధాంతం లో ఉంది. ఈ సిధ్ధాంతం ప్రకారం సమయం సాపేక్షమే! విశ్వం మొత్తానికి ”భారతీయ  ప్రామాణిక సమయం(Indian Standard Time)” లా ఒకే సమయం లేదు. భూమిని ఆధారం
(reference) గా తీసుకొంటే మిగిలిన ఖగోళ వస్తువుల (గ్రహాలూ నక్షత్రాలూ)మీద కాలం నెమ్మదిగానో, వేగం గానో,( భూమితో ఆయా ఖగోళ వస్తువుల సాపేక్ష వేగాన్ని బట్టీ, ఆయా వస్తువుల గురుత్వాకత్షణను బట్టీ) ఉంటుంది. సాపేక్ష సిధ్ధాంతాన్ని సూర్యగ్రహణం సమయం లో స్థల-కాలం(Space-Time) వంపు తిరిగింది అని తెలుసుకోవటం ద్వారా నిరూపించారు. కాబట్టీ కాలం నెమ్మది గానూ, వేగం గానూ నడవటం పై సందేహాలు అవసరం లేదు. “ఈ విశ్వం లో అనేక కాల ప్రవాహాలు ఉండటం” పై కూడా సందేహాలు అనవసరం.
స్థల-కాలం(Space-Time) అనేది విశ్వం తో పాటు పుట్టి ఉబ్బుతోంది. స్థల-కాలం వంపుతిరిగి, భూమి ఉపరి తలం లా తన పైకి తాను ముడుచుకొని పోయి ఉన్నదని ఐన్-స్టీనుడి ఉవాచ. గోళాకార ఉపరితలం లా ఉన్న కాలానికి “మొదలు” ఎలా ఉంటుంది?(Ref: Hawkings proposed quantum theory of gravity) ఒక వృత్తం గీస్తే, ఆ వృత్తం వెంబడి ఏది మొదలూ ఏది చివరా? అలానే భూమి మీద ప్రయాణం మొదలు పెట్టి ఉత్తర ధృవం చేరుకున్న తరువాత భూమి అంతమౌతుందా? కాదు కదా? ఉత్తర ధృవం తరువాత కూడా భూమే ఉంటుంది. కాకపోతే ఈ సారి మన ప్రయాణం ఉత్తర ధృవానికి దక్షిణం గా సాగుతుంది. అలానే కాలం పరిమితమైనది. కాబట్టీ, విశ్వం కాలం లో పుట్టలేదు. కాలం లో పుట్టని దానికి కారణం ఉండదు. ఎందుకంటే కార్య కారణ సంబంధాలు కాలం లోనే జరుగుతాయి.
భౌతిక శాస్త్రం ప్రకారం ఇలా కారణం లేకుండా పుట్టేవి అనేకం ఉన్నాయి. గుళిక సిధ్ధాంతం (quantum theory) ప్రకారం శూన్యం నుంచీ ఎలక్ట్రాలు ఏ కారణం లేకుండానే పుట్టి మళ్ళీ అంతరిస్తాయి. దీనినే శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations) అంటారు. ఇది సాయి బాబా శూన్యం నుంచీ విభూతి పుట్టించటం లాంటిది. కానీ, ఈ రెండూ ఒకటి కాదు. శాస్త్రం(science) ప్రయోగాల ద్వారా ధృవీకరించిన విషయమే శాస్త్ర నియమమౌతుంది . శాస్త్రం , శూన్యంలోంచీ ఎలక్ట్రాన్లు పుట్టటాన్ని ధృవీకరించి దాన్ని ఒక నియమం గా ఏర్పరిచింది కనుక, అది శాస్త్రీయమే. సాయి బాబా ఏ మోసమూ లేకుండా ప్రయోగశాల లో విభూతి పుట్టించినట్లైతే, శాస్త్రం ఒక సాయి బాబా నియమాన్ని కూడా ప్రతిపాదించేదేమో!
ఇంకొక విషయం..విశ్వానికి “బయట” అనేది లేదు. “బయట” ఉండాలంటే స్థలం ఉండాలి. కానీ, స్థలం అంతా విశ్వం తో పాటు పుట్టి విశ్వం లోనే ఉంది. మరి విశ్వం ఎక్కడికి వ్యాకోచిస్తూంది? ఎక్కడికీ వ్యాకొచించటం లేదు. ఉన్న స్థలకాలానికి మరింత స్థ- కాలం కలుపబడుతోంది. విశ్వం “బయట” ఏముంది? ఏమీ లేదు. దక్షిణ ధృవానికి దక్షిణం గా ఏముంది? ఏమీ ఉండదు కదా? “బయట” లేని విశ్వాన్ని ఊహించుకోవటం లో కొన్ని పరిమితులున్నాయి. ఒక బుట్ట లో ఐదు మామిడి పళ్ళున్నాయి అనుకొందాం. ఆ ఐదు పళ్ళనూ బయటికి తీస్తే బుట్టలో ఏముందీ అంటే, ‘శూన్యం ఉంది’ అని చెప్పవచ్చు. కానీ విశ్వం “బయట” స్థలం కూడా లేదు. స్థలం లేని స్థితి ని ఊహించుకోవటం మనకు చేతకాదు. ఎందుకంటే, మన రోజువారీ జీవితం లో మనం అలాంటి స్థితి ని చూసి ఉండం.అనంతం కాని కాలాన్ని ఊహించుకోలేకపోవటం కూడా ఈ కారణం వలననే! మనం విశ్వానికి మొదలు వెతకటం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మన జీవితం లో అన్ని విషయాలకీ మొదలూ చివరా ఉంటాయి. కాబట్టీ, మనం విశ్వానికి కూడా మొదలును వెతుకుతాం. కాకపొతే, అదృష్టం కొద్దీ విశ్వానికి మొదలు ఉంది.కానీ కాలం లో ఈ మొదలు దాటి ముందుకు పోతే (ఉత్తర ధృవం దాటి ముందుకు పోతే దక్షిణం వచ్చినట్లు) మళ్ళీ తరువాతి కాలం వస్తుంది.
కారణం లేకుండానే ఎలక్ట్రాన్లూ, విశ్వమూ మొదలైనవి పుట్టటాన్ని మనం ఇంకొక కొలత (Dimension) ప్రవేశ పెట్టటం ద్వారా కారణం పరిధిలోకి తీసుకొని రా వచ్చును.అయితే ఈ కొత్త కారణం మనం దైనందీన జీవితం లో చూసే కారణాలవంటిది కాదు. ఇది మన బౌతిక కాలం లో జరిగేది కాదు.అధిభౌతిక కాలం లో జరిగేది. సినిమా తెర మీది రెండు కొలతల బొమ్మలకు తెలివి ఉందనుకొందాం. తెరమీద మనం ఒక టార్చీ లైటు ఫోకస్ చేసినప్పుడు, తెరమీద బొమ్మలు ఆ టార్చి లైట్ వెలుగు కి కార్య కారణ నియమాన్ని ఆపాదిస్తే, ఆ వెలుగు ఏ కారణం లేకుండానే వచ్చినట్లు తేలుతుంది. ఎందుకంటే ఆ బొమ్మలు మూడవ కొలతలో ఉన్న మనలను కనిపెట్టలేవు కాబట్టీ. అలానే ఈ విశ్వ సృష్టి ఐదవ కొలత లోజరిగితే, అప్పుడు  ఆ సృష్టి నాలుగు కొలత (కాలం తో కలిపి నాలుగు డైమన్షన్లు) ల లో ఉన్న మనకు, కారణం లేనిది గా కనపడుతుంది. కానీ ఐదవ కొలత అనేది అధి-భౌతికం. దీనిని మన నాలుగు కొలత ల ప్రపంచం లోని విషయాల సహాయం తో నిరూపించటం కష్టం. దీనినే సైధ్ధాంతిక కల్పన(conceptual fantasy) అనవచ్చు. ఈ ఐదవ కొలత ఏ భౌతిక నియమాన్నీ ఉల్లంఘించ లేదు . కానీ ఈ ఐదవ కొలత మన ఊహ లోని ఒక విషయమే!ఐతే దీనికీ, కేవలం ఊహా గానాలైన “భూమిని సృష్టించే రెక్కల దేవతలకీ, తాబేళ్ళకీ” తేడా గమనించవచ్చు.కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదన్నప్పుడు,దాని అర్ధం, మనం ఉన్న నాలుగు డైమన్షన్లలోనూ, విశ్వం పుట్టుకకి కారణం దొరకలేదనే! ఐదో కొలతలోనో, పన్నేండో కొలతలోనో దానికి కారణం ఉండవచ్చు. కానీ ఇలా ఎన్ని కొలతలని ఊహించుకొంటాం అనేది వేరే ప్రశ్న.

విశ్వం లో కారణాలు లేనివీ (ఉదా: శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations)), కారణాలు తెలియనివీ (ఉదా: జీవులలో జన్యు మార్పులు), కారణాలు ఎప్పటికీ తెలుసుకోలేనివి (విశ్వం యొక్క ప్రయోజనం, ఐదవ కొలత, పదవ కొలత లాంటివి), కారణాలను ఖచ్చితం గా కొలవలేనివీ (హైజెన్-బర్గ్ అనిశ్చితి  సిధ్ధాంతం(Heisenberg’s Uncertainity principle) ప్రకారం, ఎలక్ట్రాన్ వేగాన్నీ, స్థానాన్నీ ఒకే సమయం లో ఖచ్చితం గా ఎప్పటికీ తెలుసుకోలేము) ఉన్నాయి. వీటి మధ్య గల తేడాలను తెలుసుకోవటం కూడా ముఖ్యమైన విషయమే!

వేదాలూ, భగవద్గీతా, ఇతర మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర వేత్తలూ, మాట్లాడే దానిలో కొంత సారూప్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒకే విషయం, సృష్టి యొక్క జననం, సృష్టి కి కారణం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విశ్వం లాంటి విషయాల్లో సమాధానాలు చాలా తక్కువ ఆప్షన్స్ తో ఉంటాయి. సృష్టి పరిమితం, లేక అనంతం. దీనికి కారణం ఉంది, లేక లేదు.లేక ఉండీ ఉండకుండా ఉంది. దీనికి బయట ఉంది లేక లేదు.లేక ఈ మధ్య లో ఉంది. సృష్టికి కారకుడు ఉన్నాడు లేక లేదు.లేక ఈ మధ్య లో ఉన్నాడు. ఇలా ఆప్షన్స్ అన్నీ రెండు లేక మూడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక మత గ్రంధం చెప్పేదానికీ, సైన్స్ చెప్పిన ఫలితానికీ పోలిక ఉండటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కాబట్టీ, “మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర పరిశొధనలూ, ఈ సృష్టి రహస్యాల గురించి ఏకీభవిస్తున్నాయి”, అనటం అప్పుడే సరి కాదు అనుకొంటాను.

14 thoughts on “దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..”

  1. *మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర పరిశొధనలూ, ఈ సృష్టి రహస్యాల గురించి ఏకీభవిస్తున్నాయి”, అనటం అప్పుడే సరి కాదు అనుకొంటాను.*

    బొందలపాటి గారు,

    మరి ఎప్పటికి రేండు ఏకీభవిస్తాయో ఎవరైనా చెప్పగలరా? దానికి టైం ఫ్రేం లేకుండా ఎన్నిరోజులు విభేదించటం అనేదానికి ఏమైనా అర్థం ఉందా? హాకిన్స్ చూస్తుంటే ఒక పెద్ద బపున్ అనిపిస్తుంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు జవాబులిస్తాడు. ఆయన(పశ్చిమ దేశాల వారి దేవుడు అర్థం వేరే ) వారి మత విశ్వాసాలను పరిగణలోనికి తీసుకొని వ్యాఖ్యానిస్తుంటాడు. కనీశం హిందూ (ఇండిక్ ట్రేడిషన్లో) మత గ్రంథాల కంక్లుషన్స్ ఉన్నాయి. కాని నేడు సైన్స్ పరిశోధనలకు కంక్లుషన్స్ లేకుండా ఒక సిద్దాంతాన్ని అది కొన్ని సంవత్సరాలు నెత్తికెత్తుకొనేది తరువాత దానిని కాదని ఇంకొకదానిని ప్రతి పాదించేది. సైంట్స్లు సుమన్ బాబు గారిలాంటివారు, డవ్వులు ఇచ్చేవాడు, స్టుడియో ఉన్నాది కదా అని సినేమాలు తీసినట్లు, వీళ్ళు ఫండిగ్ ఇచ్చే ప్రభుత్వం, యునివర్సిటిలో ఉన్న ఇంఫ్రాస్ట్రక్చర్ అనిటిని ఉపయోగించు కొంట్టు సిద్దాంతలను ప్రతి పాదిస్తుంటారు. దీనికి మరే గొప్ప కారణమేమిలేదు. ఈ శతాబ్దం మొదటి నుంచి సైన్స్ లో జరిగిన ఆవిష్కరణాల వల్ల ప్రభుత్వాలు సైంటిస్ట్స్ ను నమ్మటం ఎక్కువైంది. వారు విశ్వవిద్యాలయాలకు పరిశొధన కొరకు ఫండింగ్ చేస్తునంటారు. వీళ్ళు ఎవేవో కొత్త సిద్దాంతాలను ప్రతిపాదిస్తూంటారు అంతే. ఒకప్పుడు జెనొం ప్రాజేక్ట్ మీద ఎంతో హంగామా చేశారు. ఇప్పుడు ఎక్కడా దాని గురించి వినపడదు.
    డబ్బుకొరకు పని చేసేవీరు వారి పరిశోధనలన సారాన్ని మత గ్రంథాలతో ఎకీభవించి ముగింపు ఇస్తారా? అలాచేస్తే వారికి రేపటినుంచి తిండి ఎవరు పేడతారు? కేరీర్ సంగతి ఎమీటి? సమాజం లో వారి గౌరవ మర్యాదల సంగతి ఎమీటీ?

    మెచ్చుకోండి

  2. you have touched an interesting angle.
    “సైంట్స్లు సుమన్ బాబు గారిలాంటివారు” 🙂

    కొంత మంది సైన్స్ చెప్పిన ప్రతి సిధ్ధాంతమూ వేదాలలో/బైబిల్ లో ఉంది అంటారు. అది ఉంటే సరే, లేక పోయినా పోలిక కల్పించి మరీ, దీనిని ఆల్రేడీ వేదాలు/బైబిల్ ఇలా చెప్పాయి అంటారు.వారి ఇష్టం వచ్చినట్లు ఇంటర్ప్రెటేషన్ ఇస్తారు. అలాంటి వారి గురించి నేను ఈ వ్యాఖ్య రాశాను. సైంటిస్టులందరూ సుమన్ బాబు లాంటి వారైతే, ఇప్పటి దాకా జరిగిన ప్రగతి పాజిబుల్ అయ్యేది కాదు. వారిలో కూడా చాలా కమిటేద్ అయిన వారు వ్యక్తిగతం గా నాకు తెలుసు.
    BTW ..Do you know what happened to CERN project?

    మెచ్చుకోండి

  3. బొందలపాటి గారు,

    ఏ రంగంలోనైనా నీజాయితి గల వారి వలననే మొదట ఆరంగానికి గుర్తింపు వస్తుంది. ఆ తరువాతే వ్యాపారం మొదలయ్యేది. ముఖ్యం గా యురప్ దేశాల సైన్స్ ప్రగతికి డబ్బులు ఇండియా నుంచి కొల్ల గొట్టుకొని పోయినవాటి తో జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత వారికి డబ్బుల కొరతను కొంత ప్రభుత్వం, కొంత వ్యాపారవర్గాలు నిధులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసుకొన్నారు. ఆతరువాత సంగతి మీకు తెలిసిందే. పేపర్లో చూడండి ఒకసారీ రోజుకి కొంచెం మందు పుచ్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందని కొందరు మందువలన నష్టమని ఇంకొందరు సైంటిస్ట్ల ప్రకటనలు చూస్తూనే ఉంటాం. అలా తయారయ్యారని నా ఉద్దేశం.

    *కొంత మంది సైన్స్ చెప్పిన ప్రతి సిధ్ధాంతమూ వేదాలలో/బైబిల్ లో ఉంది అంటారుబొందలపాటి గారు,
    మత గ్రంధమైనా, సైన్స్ అయినా వాటి ములాలు ప్రకృతి పరిశీలన దగ్గరే ఉండేవి. మతవాదుల ఇంటర్ప్రేటేషన్ వలన నష్టామేమి లేదు.డబ్బు ఖర్చు పైసా ఉండదు. నేటి సైంటీస్ట్లు పరిశొధన పేరుతో ఎంత డబ్బులు తగలేస్తున్నారో గమనించాలి. అదే వైద్య రంగనికి చెందిన వారైతే ఎన్ని జంతువులను చంపుతారో తెలిస్తే మానవత్వమున్న వారు సైంటిస్ట్లకు మద్దతే ప్రకటించరు.

    CERN – No Idea

    మెచ్చుకోండి

  4. శ్రీ బొందలపాటివారికి,నమస్కారములు.

    మొత్తం మీద ఈ వ్యాసంపై అనేక విశ్లేషణలు వచ్చాయి; అనేక కొత్త విషయాలు తెలిసినాయి. శ్రీ శ్రీరామ్ గారుకూడా తమ విశ్లేషణాలను చక్కగా అందించారు.అందరికీ ధన్యవాదాలు. అయితే, మరొక సందేహం: `శాస్త్రజ్నులు చెప్పిన విషయాలను భౌతిక ప్రపంచంలో నిరూపణకు పెట్టవచ్చును’ అని వ్రాశారు. అయితే, `E = mc2 ‘ అనే సిద్ధాంతంలో, matter ని energy గా మార్చి (ex: nuclear fusion /fission ) శాస్త్రజ్నులు నిరూపించారు. అయితే, energy ని matter గా మార్చి చూపించగలిగారా? తెలియచేయగలరు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    మెచ్చుకోండి

  5. మాధవ రావు గారూ,
    పార్టికల్ యాక్సెలరేటర్స్ ఈ పని చేస్తాయి…
    CERN, Fermi Labs have these accelerators..
    I just googled to find these links:
    http://www.scienceagogo.com/message_board7/messages/1445.shtml
    http://wiki.answers.com/Q/Can_you_convert_energy_into_matter

    మెచ్చుకోండి

  6. విశ్వం ఆవిర్భావానికి కారణం లేదు అంటునే మనం అనుభవించలేని వేరొక డైమెన్షన్ లొ కారణం ఉండవచ్చు అని చెప్పీ చెప్పకుండా చెప్పారు. మరొకటి, cause precedes effect అనేది ఒక భౌతిక నియమం. అది సింగ్యులారిటి దగ్గర విఫలమైనపుడు విశ్వం పుట్టుకకు కారణం చెప్పలేము. కారణం లేదు అని అనడం తర్కబద్దమేగాని శ్రాస్త్రబద్దం కాదేమో!!
    అలాగే పాత వ్యాసం లో బిగ్‌బ్యాంగ్ ముందు శక్తి కూడా లేదు అని అన్నారు. అది పూర్తిగా నిజం కాదు. Only the net energy was zero. http://www.youtube.com/watch?v=7ImvlS8PLIo

    నిత్యం చర్చించుకునే స్థల-కాలం ఈ విశ్వానికి సంబంధించినది. ఈ విశ్వం బయట ఏమిలేదు అని అంటున్నామంటే there exists nothing outside this universe whose effects can be observed/ were observed in this universe. Space and time are just relative quantities of the observable universe. నా అభిప్రాయం ఏంటంటే there can be ‘nothing’ beyond the 90 billion light year universe but it doesn’t matter since we were never effected by it.

    మెచ్చుకోండి

  7. “మరొకటి, cause precedes effect అనేది ఒక భౌతిక నియమం. అది సింగ్యులారిటి దగ్గర విఫలమైనపుడు విశ్వం పుట్టుకకు కారణం చెప్పలేము. కారణం లేదు అని అనడం తర్కబద్దమేగాని శ్రాస్త్రబద్దం కాదేమో!!”
    అవును.మీరు రాసినది చదివిన తరువాత నాకూ అలానే అనిపిస్తీంది!
    కారణాల కోసం వెతుకుతూ పోతే , చివరికి కారణం లేనిది ఒకటైనా ఉండాలి కదా? దానిని విశ్వం కాకపోతే గిశ్వం అనుకోండి. చివరికి ఎన్ని డైమన్షన్లు అయినా కారణం లేని దానిని ఒక దానిని మనం అంగీకరించాలి.
    “Only the net energy was zero”
    Yes. My expression was wrong. I stand corrected.
    “there can be ‘nothing’ beyond the 90 billion light year universe but it doesn’t matter since we were never effected by it.”
    Yes. Still there’s curiosity on “what is that nothing”. Beside, that ‘nothing’ can one day suddenly decide(?) to change the rules, or obliterate the the creation 🙂
    గుళిక సిధ్ధాంతం లేక క్వాంటం తీరీ ఎలక్టాన్లూ మొదలైనవి, ఉన్నాయి అని చెప్పి చావదు. ఎప్పుడూ సంభావ్యతల తో చెప్తుంది.ఉండీఉండకుండా ఉన్నాయి అన్నట్లు. లేకపోతే “ఉండటానికీ లేకపోవటానికీ మధ్యలో ఉంది” అని చెప్తుంది. దీని గురించి మీకు అవగాహన ఉంటే కొంచెం విశదీకరిస్తారా?

    మెచ్చుకోండి

  8. quantum mechanics పై నాక్కూడా అంతగా అవగాహన లేదండి. చేసుకుందామంటే సరళమైన భాషలో చెప్పే literature కూడా దొరకడంలేదు మొదలు పెట్టడమే wave equations తొ ఉంటున్నాయి.

    >>కారణం లేని దానిని ఒక దానిని మనం అంగీకరించాలి.

    As you’ve said, theists and atheists both might agree upon this 🙂

    మెచ్చుకోండి

  9. “కాలం” అనే అక్షం వెంబడి ప్రయాణం చేసి, “వెనక్కి” తిరిగి చూస్తే మూడు దిశలు ఉన్న మన భౌతిక ప్రపంచంలో ఉన్న వంపులు కనబడతాయా?”
    ఒక క్యూబ్ ఆకారం లో ఉన్న రబ్బర్ ని తీసుకోండి. దానిని మూడు దిక్కులలోనూ వంచవచ్చు కదా? ఆ వంపుని చూడటానికీ అనుభవించటానికీ నాలుగో దిశ ఐన సమయం అవసరం లేదు. క్యూబ్ ని ఎక్స్ అక్షం వైపూ, వై అక్షం చుట్టూ వంచితే, ఆ క్యుబ్ పై ఉన్న ఒక చీమ చేసే “వై అక్షం దిశ లో కదలిక” వలన వేరే ఏ దిశలోనూ కదలిక ఉత్పన్నం కాదు. కానీ జెడ్ అక్షం వైపు కదిలితే అది ఎక్స్ అక్షం వైపుకూడా కదలిక ని తెస్తుంది.ఈ క్యూబ్ ని మూడు అక్షాల దిశలవైపుకీ ఒకే సారి వంచవచ్చు. అప్పుడు అది ఉల్లిపాయ అకారం లోనే ఉంటుంది. అప్పుడు ఏ ఒక్క దిశలో జరిపిన కదలిక అయినా మిగిలిన దిశలలో కూడా కదలిక ను తెస్తుంది. ఈ క్యూబ్ ని నాలుగవ దిక్కు అయిన సమయం వైపు వంచటాన్ని ఊహించుకోవటం కొంచెం కష్టం. కానీ రెండు దిశలు ఉన్న వస్తువు ని (ఉదా: కాగితం) మూడవ దిశ లో వంచినపుడు, ఆ వంపు వెంబడి ప్రయాణం చేస్తే మూడవ దిక్కులో ప్రయాణిస్తాం.అలానే కాలం అనే నాలుగవ దిశ లో వంచబడిన స్థలం, (మూడు దిశల వస్తువు) యొక్క వంపు వైపుకి వెళ్తే కాలం లో ముందుకీ వెనుకకీ ప్రయాణం చేయగలగాలి. అంతే కాదు, స్థలాన్ని కాలం డిశలో వంచుతూనే, మిగిలిన మూడు దిశలలో కూడా వంచవచ్చు. అప్పుడు, మనం యే దిశ లో ప్రయాణం చేసినా, ఈ వంపు వలన కొంత కాలం దిశలో కూడా ప్రయాణం చేస్తాం!
    ఇక స్థలకాలం (స్పేస్ టైం) నాలుగు దిశల వస్తువు, ఉన్న నాలుగు దిశలలోనే వంచబడింది. అన్ని అక్షాల వెంబడీ వంచబడింది. ఉల్లిపాయ పొరలని ఒక దానికొకటి స్పైరల్ లా కనెక్షన్ ఇచ్చినట్లు. బాగా గుండ్రం గా ఉండి స్పైరల్ గా వంపులు తిరిగిన నత్తగుల్ల ఆకారమూ ఈ ఆకారమూ ఒకటే!

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి