మానవ జాతి పయనం ఎటు వైపుకి?

ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.

ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి  ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.

ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’  లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే,ఇప్పటి వరకూ మరే జీవీ చేయనట్లు, తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.

మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి.   మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను  గుర్తు చేసుకోవటం మంచిది.

ప్రకటనలు

అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

ఒక బాబా గారు గాల్లోంచీ అరటి పండు తీసి చేతి లో పెడతాడు. వేరొక బాబా ఇతరుల బుర్ర లోని ఆలోచనలను చెబుతాడు. దీనిని మనం నమ్మాలా? కనికట్టు అని కొట్టి పారేయాలా? నమ్మకూడదా? లేక బాబా గారిని మన యూనివర్సిటీ లాబ్ లో అదే అద్భుతం చేయమని సవాలు చేయాలా?   ఇలాంటి మహిమల్ని నమ్మితే, అది శాస్త్రీయ దృష్టి అవుతుందా?
నా చిన్నతనం లో మా అత్తగారి ఊరి లో ఉండేవాడిని. ఓక రోజు “లవకుశ” సినిమా చూస్తున్నట్లుగా ఓ కల వచ్చింది. వాస్తవం లో అంతకు ముందు ఆ సినిమా ను నేను చూసి ఉండలేదు. ఆ మరుసటి రోజు మా నాన్న మా ఊరినుంచీ వచ్చి, నన్ను మా ఊరు తీసికెళ్ళి, అక్కడ ఆడుతున్న లవకుశ సినిమా చూపించారు. సినిమాలంటేనే గిట్టని మా నాన్న నాకు జీవితం లో చూపించిన ఒకే ఒక్క సినిమా అది! తరువాత ఈ అనుభవం గురించి ఆలోచించుకొని, “ఆ..కాకతాళీయం అయి ఉంటుంది లే!”, అని కొట్టి పారేశాను. ఈ సంఘటన లో భవిష్యత్తు గురించి చెప్పే విద్య నాకు తెలియదని చెప్పక్కర్లేదు.

పెద్దయ్యాక కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు కొన్ని చదివాను. వాటిలో ఆయన మానవాతీత శక్తులు ఉండవచ్చుననీ, మనం ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పధం తో, ఓపెన్ మైండ్ తో చూడాలనీ రాశారు. ఆయన తనకు జరిగిన ఒకటిరెండు అసాధారణ అనుభవాలను కూడా పంచుకొన్నారు.(ఆయన కు కలిగిన అనుభవాల లో Out of body experience ఒకటి ఉంది . తరువాతి కాలం లో సైంటిస్ట్ లు దీనికి శాస్త్రీయం గా వివరణ ఇవ్వగలిగారు.)

ఆయన లాంటి హేతువాదీ, మార్కిస్టూ వెలిబుచ్చిన అభిప్రాయాలతో, నేను అలౌకిక అనుభవాల గురించి సందేహం లో పడ్డాను. ఆయన “యూరీ గెల్లర్” అనుభవాల గురించీ, మరణానంతర జీవితం గురించిన కొన్ని అమెరికన్ వార్తా వ్యాఖ్యల గురించి కూడా రాశారు. అయితే అమెరికన్ పత్రికల వ్యాపారీకరణ తెలిందే కాబట్టీ నేను ఆ కథనాల కి పెద్ద విలువ ఇవ్వలేదు. పత్రిక అమ్ముకోవటం కోసం రాసిన కట్టుకథలు గానే వాటిని చూశాను. కుటుంబరావు గారి ప్రకారం…

“ఈ విశ్వం స్థల కాలాల నాలుగు కొలత (డైమన్షన్) లతో పాటు, బుధ్ధి కొలతలో కూడా పరిణామం చెందింది. అంటే బయట విశ్వం లొ ఎక్కడో ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఈ బుధ్ధి లేక ఇంటెలిజెన్స్ విశ్వం తో పాటు పరిణామం చెందుతూ వస్తోంది. మొదట్లో జీవపరిణామం లో,ఆదిమ దశ లో ఉన్న మానవుడికి ఈ బుధ్ధి నేరు గా సహాయం చేసేది. ఆ సహాయం అతీంద్రియ శక్తుల రూపం లో ఉండేది. కాబట్టీ ఆ రోజుల్లో అతీత శక్తులు చాల సాధారణం గా ఉండేవి. తరువాత మనిషి మేధ పెరిగే కొద్దీ, వాటి అవసరం మనిషికి తీరిపోయింది. మనిషి కి ఈ అతీత శక్తుల మీద అదుపు లేనట్లు కనిపిస్తుంది. అవి కావాలనుకొంటే ఓ మనిషిలో ప్రత్యక్షమౌతాయి..లేకపోతే లేదు.”

కుటుంబ రావు గారి బుధ్ధి కొలత ప్రతిపాదన ఆ రోజులలో విమర్శలను ఎదుర్కొంది. ఆయన హేతు వాద మరియూ మార్క్సిస్ట్ అర్హతల పైన కొందరు సందేహాలు వెలిబుచ్చారు. అయితే ఆయనది కేవలం ప్రతిపాదన మాత్రమే. అది శాస్త్రీయ సిధ్ధాంతం గా అంగీకరించబడాలంటే దానిని ప్రపంచం లో మనం పరిశీలించదగిన ఒక విషయం లో నిరూపించాలి. ఆయన అలా చేయలేక పోయారు. తన ప్రతిపాదనని ఆయన అమెరికా లో ఉండే తన స్నేహితులైన కొందరు భౌతిక శాస్త్రవేత్తలతో కూడా పంచుకొని, దాని నిరూపణ కి ఏదైనా ఒక ప్రాతిపదిక దొరుకుతుందేమో అడిగారు. ఆయన ప్రతిపాదన ఇప్పటి క్రియేషనిస్ట్ సిధ్ధాంతానికి దగ్గర గా ఉన్నట్లు నాకు తరువాత అనిపించింది.

అప్పుడప్పుడూ మన కు తారస పడే, మాధ్యమాలలో కనిపించే, మహిమలు నాకు ఒక ద్వైధీ భావాన్ని కలిగించ సాగాయి. వాటిని మూఢనమ్మకాలని కొట్టి పారేయాలా? లేక వాటి గురించి శాస్త్రీయం గా పరిశోధించి తెలుసుకోవాలా? లేక పోతే నిప్పులేకుండా పొగ రాదని వాటిని నమ్మాలా?
మనం వింటూ ఉండే అతీత శక్తులలో కొన్ని: “ఎదుటి వారి ఆలోచనలను తెలుసు కోవటం, వస్తువులను చూపులతో వంచటం, శరీరం ఇనుప వస్తువులను ఆకర్షించటం, గాలిలో తేలటం, భవిష్యత్తు గురించి చెప్పటం, మరణానంతర జీవితం అనుభవం లోకి రావటం, చనిపోయిన వారిని బతికించటం, శూన్యం లోంచీ వస్తువులను సృష్టించటం, ఇవి కొన్ని మాత్రమే!”
అయితే వీటిలో కొన్నిటిని చేయటానికి భౌతిక ప్రాతిపదిక ఉండవచ్చు. సైన్స్ ఇంకా వీటి మెకానిజం ని కనిపెట్టి ఉండక పోవచ్చు. ఉదాహరణ కి ఎదుటి వారి ఆలోచనలు తెలుసుకోవటం గురించి…
మన ఆలోచనలకు విద్యుతయస్కాంత గుణం ఉంటుంది. మామూలు మనిషిలో ఆలోచన లు గజి బిజి గా ఉంటాయి. కొందరు యోగులు ధ్యానం ద్వారా తమ ఆలోచనలను క్రమబధ్ధీకరించి, వాటి ఇంటెన్సిటీని పెంచుకోగలరు. అలానే వారిమనసు ప్రశాంతం గా ఉన్నపుడు ఎదుటి వారి ఆలోచనల సున్నితమైన తరంగాలని గ్రహించగలరు. అది ఒక పధ్ధతి. కానీ ఇది నిరూపించబడలేదు.భవిష్యత్తు లో సైన్స్ దీనిని నిరూపిస్తుందేమో!

అలానే శరీరం తో  ఇనుప వస్తువులను ఆకర్షించటం అనేది నాకు తెలిసిన ఒక వ్యక్తి చేస్తాడు. శాస్త్రజ్ఞులు దీనిని ఇంకా అర్ధం చేసుకోవలసి ఉంది.

ఈ మధ్య “మన భౌతిక ప్రపంచం అవతల మన సైన్స్ ఎప్పటికీ చేరలేని అధిభౌతిక ప్రపంచం ఉంటుంది”, అని నేను విశ్వసించటం ప్రారంభించాను. దీనికి రెండు కారణాలు.

1. ఈ విశ్వం అనేది కారణ రహితమైన ఒక స్థితి నుంచీ పుట్టిందని శాస్త్రజ్ఞుల మధ్య ఉన్న ఒక అభిప్రాయం. విశ్వానికి ఐదో కొలతో , ఆరో కొలతో ఉన్నట్లైతే దానిని మన సైన్స్ ఎప్పటికీ నిరూపించలేదు. అలాంటి ఐదో కొలత గురించి సైన్స్ కేవలం ఊహాగానం మాత్రమే చేయగలదు. అలానే విశ్వ సృష్టి స్థల కాలాల ఆవల జరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్థల కాలాలు లేకుండా జరిగిన విశ్వసృష్టిని శాస్త్రీయ నిరూపణ ల పరిధి లోకి లాక్కు రావటాన్ని ఊహించటం కష్టం.
2. ఇక రెండవ కారణం, క్వాంటం తీరీ లాంటివి, కారణ రహితమైన “వాక్యూం ఫ్లచుయేషన్” వంటి వాటిని అంగీకరిస్తున్నాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్ లాంటి కణాలు ఏ కారణం లేకుండానే శూన్యం లోంచీ పుట్టి, మళ్ళీ శూన్యం లోనే కలిసిపోతాయి, బాబా గారు శూన్యం లోంచీ విభూతి తీసినట్లు. ఇలాంటి విషయాలను “ఐదో డైమన్షన్” లేకుండా వివరించటం సాధ్యం కాదు. కానీ ఐదో డైమన్షన్ లోకి మనిషి కి ప్రవేశం లేదు. కాబట్టీ వీటిని నిరూపించటం మనిషికి సాధ్యపడక పోవచ్చు.కాబట్టీ మనిషి ఎప్పటికీ అనుభవించలేని అధి భౌతిక జగత్తు ఒకటి ఉంటుంది. ((ఐతే ఈ అధి భౌతిక జగత్తు గురించి ఎవరేమి చెప్పినా నమ్మేయాలా? ఈ అధి భౌతిక ప్రపంచం లోనే దేవుడు ఉండి సృష్టిని శాసిస్తున్నాడంటే నమ్మేయాలా? అధి భౌతిక ప్రపంచ నియమాలు భౌతిక ప్రపంచ నియమాల లా ఉంటే , “అలా నమ్మ కూడదు”. కానీ సైన్స్ దీనిని నిరూపించలేదు. ఎందుకంటే మనిషికి అక్కడ ప్రవేశం లేదు.స్థల కాలాలే లేని చోట దేవుడు ఒక మోటివేషన్ తో ఉంటాడా?ఆయన ఎలక్ట్రాన్లూ, పాజిట్రాన్లూ వంటి చిన్న కణాలను సృష్టించే విషయం లో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకొంటాడు. మిగిలి విశ్వమంతా మనకు తెలిసిన రూల్స్ ప్రకారమే ఎందుకు నడుస్తుంది?))

అలానే, ఎలక్ట్రాన్లు ఒక చోట మాయమై, కొంచెం దూరంలో ప్రత్యక్షమౌతాయి. దీనినే క్వాంటం జంప్ అంటారు. క్వాంటం తీరీ చదివితే ఈ విశ్వమంత ఒక మాయ అనిపిస్తుంది. మౌలిక కణాలన్నీ(పదార్ధం అంతా) ,  శక్తి తో చేయబడి ఉన్నాయి. ప్రస్థుతం ఒక కణం ఉందా లేదా అనేది ఆ కణం యొక్క భూత భవిష్యత్ స్థితుల పై ఆధారపడి ఉంటుంది.
సరేనండీ, నేను అధిభౌతిక ప్రపంచం గురించి నమ్మటం మొదలు పెట్టాను. అయితే ఏమిటంట? నిజజీవితం లో చూపబడే మహిమలన్నీ మోసాలే అవ్వనక్కరలేదు. వాటిలో కొన్నిటికి మూలాలు ఈ అధిభౌతిక ప్రపంచం లో ఉండవచ్చు. ఉదాహరణకి శూన్యంలోంచీ వస్తువులను తీయటం, శూన్యం లోంచీ ఎలక్ట్రాన్లు పుట్టవచ్చు అని సైన్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కదా!
ఇక ఈ మధ్య నేను పరమహంస యోగానంద గారు రాసిన, “ఒక యోగి ఆత్మ కథ” అనే పుస్తకం చదివాను. ఆ పుస్తకం నిండా నేను పైన చెప్పిన అనేక మహిమలు ఉన్నాయి. అందులో యోగానంద గారు ఆ మహిమలకు సైన్స్ పరమైన సమర్ధన కూడ ఇచ్చారు. వాటిని వివరించటం లో ఆయన స్వరం చాలా నమ్మదగినదిగా ఉంది. దానితో నేను, “ఏమో ఈ మహిమలు కూడా నిజమేనేమో”, అనే స్థితి కి చేరాను.”ఆ మహిమలకు భౌతికం గా ఇంకా కని పెట్టబడని కారణం ఉండవచ్చునేమో. లేకపోతే, ఈ మహిమల మూలాలు అధిభౌతిక జగత్తులో ఉండ వచ్చునేమో?! “గొప్ప యోగులు అధిభౌతిక జగత్ లోని నియమాల ద్వారా మహిమలను చూపించగలరేమో!

కొన్ని రోజుల తరువాత ఇంటర్నెట్ లో యోగానంద గారి గురించి ఒక కెనడియన్ రాసిన ఒక పుస్తకం లోని విషయాలు చదివాను. ఆయన యోగానంద గారి గురించి పూర్తి నెగటివ్ ధోరణి లో రాశారు. మొత్తానికి యోగానంద గారు చెప్పినవి చాల వరకూ తప్పులూ లేక అబధ్ధాలు అన్నట్లు గా రాశాడు. అది చదివిన తరువాత నాకు కొన్ని వ్యతిరేక ఆలోచనలు రావటం మొదలయ్యాయి. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా?

ఈ ఆలోచనల తరువాత, నాకనిపించిందేమంటే..
–ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటనికి సిధ్ధం గానే ఉంటుంది. తమ శక్తుల మీద తమకు అదుపు లేని వారు, ఆ శక్తులు తమకు ఉన్నపుడే చూపించవచ్చు. నాకు తెలిసిన ఒక మనిషికి అయస్కాంత శక్తి ఉంది అని చెప్పాను కదా? ఆ మనిషిని శాస్త్రజ్ఞులు పరిశీలించి, అతని శక్తి కి కారణం తెలియలేదనీ. దాని పై ఇంకా పరిశోధనలు చేయాలనీ ఒప్పుకొన్నారు. కారణం లేకుండా జనించిన ఎలక్ట్రాన్లనే ఒప్పుకొన్న సైన్స్, పరిశోధనల తరువాత అతని అయస్కాంత శక్తికి కారణం తెలియకపోతే, ఆ విషయాన్ని కూడా ఒప్పుకొంటుంది. చివరికి చెప్పవలసిన విషయమేమిటంటే, మహిమల గురించి ప్రధమం గా నమ్మ క పోవటమే మంచిది. అలా నమ్మకపోవటం అనేది నిజానికి దగ్గర గా ఉంటుంది. ఏ కోటికో, ఒక మహిమ నిజమైనా, దానిని సరిగా నిరూపించబడిన తరువాతే నమ్మటం మంచిది.

ఎలక్ట్రాన్లు శూన్యం లోంచీ పుడతాయంటే నమ్ముతాను. శూన్యం లోంచీ అరటి పండు తీశాడంటే, ముందు నమ్మను. ఒక వేళ అదే పనిని ప్రయోగశాల లో చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను.