అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

ఒక బాబా గారు గాల్లోంచీ అరటి పండు తీసి చేతి లో పెడతాడు. వేరొక బాబా ఇతరుల బుర్ర లోని ఆలోచనలను చెబుతాడు. దీనిని మనం నమ్మాలా? కనికట్టు అని కొట్టి పారేయాలా? నమ్మకూడదా? లేక బాబా గారిని మన యూనివర్సిటీ లాబ్ లో అదే అద్భుతం చేయమని సవాలు చేయాలా?   ఇలాంటి మహిమల్ని నమ్మితే, అది శాస్త్రీయ దృష్టి అవుతుందా?
నా చిన్నతనం లో మా అత్తగారి ఊరి లో ఉండేవాడిని. ఓక రోజు “లవకుశ” సినిమా చూస్తున్నట్లుగా ఓ కల వచ్చింది. వాస్తవం లో అంతకు ముందు ఆ సినిమా ను నేను చూసి ఉండలేదు. ఆ మరుసటి రోజు మా నాన్న మా ఊరినుంచీ వచ్చి, నన్ను మా ఊరు తీసికెళ్ళి, అక్కడ ఆడుతున్న లవకుశ సినిమా చూపించారు. సినిమాలంటేనే గిట్టని మా నాన్న నాకు జీవితం లో చూపించిన ఒకే ఒక్క సినిమా అది! తరువాత ఈ అనుభవం గురించి ఆలోచించుకొని, “ఆ..కాకతాళీయం అయి ఉంటుంది లే!”, అని కొట్టి పారేశాను. ఈ సంఘటన లో భవిష్యత్తు గురించి చెప్పే విద్య నాకు తెలియదని చెప్పక్కర్లేదు.

పెద్దయ్యాక కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు కొన్ని చదివాను. వాటిలో ఆయన మానవాతీత శక్తులు ఉండవచ్చుననీ, మనం ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పధం తో, ఓపెన్ మైండ్ తో చూడాలనీ రాశారు. ఆయన తనకు జరిగిన ఒకటిరెండు అసాధారణ అనుభవాలను కూడా పంచుకొన్నారు.(ఆయన కు కలిగిన అనుభవాల లో Out of body experience ఒకటి ఉంది . తరువాతి కాలం లో సైంటిస్ట్ లు దీనికి శాస్త్రీయం గా వివరణ ఇవ్వగలిగారు.)

ఆయన లాంటి హేతువాదీ, మార్కిస్టూ వెలిబుచ్చిన అభిప్రాయాలతో, నేను అలౌకిక అనుభవాల గురించి సందేహం లో పడ్డాను. ఆయన “యూరీ గెల్లర్” అనుభవాల గురించీ, మరణానంతర జీవితం గురించిన కొన్ని అమెరికన్ వార్తా వ్యాఖ్యల గురించి కూడా రాశారు. అయితే అమెరికన్ పత్రికల వ్యాపారీకరణ తెలిందే కాబట్టీ నేను ఆ కథనాల కి పెద్ద విలువ ఇవ్వలేదు. పత్రిక అమ్ముకోవటం కోసం రాసిన కట్టుకథలు గానే వాటిని చూశాను. కుటుంబరావు గారి ప్రకారం…

“ఈ విశ్వం స్థల కాలాల నాలుగు కొలత (డైమన్షన్) లతో పాటు, బుధ్ధి కొలతలో కూడా పరిణామం చెందింది. అంటే బయట విశ్వం లొ ఎక్కడో ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఈ బుధ్ధి లేక ఇంటెలిజెన్స్ విశ్వం తో పాటు పరిణామం చెందుతూ వస్తోంది. మొదట్లో జీవపరిణామం లో,ఆదిమ దశ లో ఉన్న మానవుడికి ఈ బుధ్ధి నేరు గా సహాయం చేసేది. ఆ సహాయం అతీంద్రియ శక్తుల రూపం లో ఉండేది. కాబట్టీ ఆ రోజుల్లో అతీత శక్తులు చాల సాధారణం గా ఉండేవి. తరువాత మనిషి మేధ పెరిగే కొద్దీ, వాటి అవసరం మనిషికి తీరిపోయింది. మనిషి కి ఈ అతీత శక్తుల మీద అదుపు లేనట్లు కనిపిస్తుంది. అవి కావాలనుకొంటే ఓ మనిషిలో ప్రత్యక్షమౌతాయి..లేకపోతే లేదు.”

కుటుంబ రావు గారి బుధ్ధి కొలత ప్రతిపాదన ఆ రోజులలో విమర్శలను ఎదుర్కొంది. ఆయన హేతు వాద మరియూ మార్క్సిస్ట్ అర్హతల పైన కొందరు సందేహాలు వెలిబుచ్చారు. అయితే ఆయనది కేవలం ప్రతిపాదన మాత్రమే. అది శాస్త్రీయ సిధ్ధాంతం గా అంగీకరించబడాలంటే దానిని ప్రపంచం లో మనం పరిశీలించదగిన ఒక విషయం లో నిరూపించాలి. ఆయన అలా చేయలేక పోయారు. తన ప్రతిపాదనని ఆయన అమెరికా లో ఉండే తన స్నేహితులైన కొందరు భౌతిక శాస్త్రవేత్తలతో కూడా పంచుకొని, దాని నిరూపణ కి ఏదైనా ఒక ప్రాతిపదిక దొరుకుతుందేమో అడిగారు. ఆయన ప్రతిపాదన ఇప్పటి క్రియేషనిస్ట్ సిధ్ధాంతానికి దగ్గర గా ఉన్నట్లు నాకు తరువాత అనిపించింది.

అప్పుడప్పుడూ మన కు తారస పడే, మాధ్యమాలలో కనిపించే, మహిమలు నాకు ఒక ద్వైధీ భావాన్ని కలిగించ సాగాయి. వాటిని మూఢనమ్మకాలని కొట్టి పారేయాలా? లేక వాటి గురించి శాస్త్రీయం గా పరిశోధించి తెలుసుకోవాలా? లేక పోతే నిప్పులేకుండా పొగ రాదని వాటిని నమ్మాలా?
మనం వింటూ ఉండే అతీత శక్తులలో కొన్ని: “ఎదుటి వారి ఆలోచనలను తెలుసు కోవటం, వస్తువులను చూపులతో వంచటం, శరీరం ఇనుప వస్తువులను ఆకర్షించటం, గాలిలో తేలటం, భవిష్యత్తు గురించి చెప్పటం, మరణానంతర జీవితం అనుభవం లోకి రావటం, చనిపోయిన వారిని బతికించటం, శూన్యం లోంచీ వస్తువులను సృష్టించటం, ఇవి కొన్ని మాత్రమే!”
అయితే వీటిలో కొన్నిటిని చేయటానికి భౌతిక ప్రాతిపదిక ఉండవచ్చు. సైన్స్ ఇంకా వీటి మెకానిజం ని కనిపెట్టి ఉండక పోవచ్చు. ఉదాహరణ కి ఎదుటి వారి ఆలోచనలు తెలుసుకోవటం గురించి…
మన ఆలోచనలకు విద్యుతయస్కాంత గుణం ఉంటుంది. మామూలు మనిషిలో ఆలోచన లు గజి బిజి గా ఉంటాయి. కొందరు యోగులు ధ్యానం ద్వారా తమ ఆలోచనలను క్రమబధ్ధీకరించి, వాటి ఇంటెన్సిటీని పెంచుకోగలరు. అలానే వారిమనసు ప్రశాంతం గా ఉన్నపుడు ఎదుటి వారి ఆలోచనల సున్నితమైన తరంగాలని గ్రహించగలరు. అది ఒక పధ్ధతి. కానీ ఇది నిరూపించబడలేదు.భవిష్యత్తు లో సైన్స్ దీనిని నిరూపిస్తుందేమో!

అలానే శరీరం తో  ఇనుప వస్తువులను ఆకర్షించటం అనేది నాకు తెలిసిన ఒక వ్యక్తి చేస్తాడు. శాస్త్రజ్ఞులు దీనిని ఇంకా అర్ధం చేసుకోవలసి ఉంది.

ఈ మధ్య “మన భౌతిక ప్రపంచం అవతల మన సైన్స్ ఎప్పటికీ చేరలేని అధిభౌతిక ప్రపంచం ఉంటుంది”, అని నేను విశ్వసించటం ప్రారంభించాను. దీనికి రెండు కారణాలు.

1. ఈ విశ్వం అనేది కారణ రహితమైన ఒక స్థితి నుంచీ పుట్టిందని శాస్త్రజ్ఞుల మధ్య ఉన్న ఒక అభిప్రాయం. విశ్వానికి ఐదో కొలతో , ఆరో కొలతో ఉన్నట్లైతే దానిని మన సైన్స్ ఎప్పటికీ నిరూపించలేదు. అలాంటి ఐదో కొలత గురించి సైన్స్ కేవలం ఊహాగానం మాత్రమే చేయగలదు. అలానే విశ్వ సృష్టి స్థల కాలాల ఆవల జరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్థల కాలాలు లేకుండా జరిగిన విశ్వసృష్టిని శాస్త్రీయ నిరూపణ ల పరిధి లోకి లాక్కు రావటాన్ని ఊహించటం కష్టం.
2. ఇక రెండవ కారణం, క్వాంటం తీరీ లాంటివి, కారణ రహితమైన “వాక్యూం ఫ్లచుయేషన్” వంటి వాటిని అంగీకరిస్తున్నాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్ లాంటి కణాలు ఏ కారణం లేకుండానే శూన్యం లోంచీ పుట్టి, మళ్ళీ శూన్యం లోనే కలిసిపోతాయి, బాబా గారు శూన్యం లోంచీ విభూతి తీసినట్లు. ఇలాంటి విషయాలను “ఐదో డైమన్షన్” లేకుండా వివరించటం సాధ్యం కాదు. కానీ ఐదో డైమన్షన్ లోకి మనిషి కి ప్రవేశం లేదు. కాబట్టీ వీటిని నిరూపించటం మనిషికి సాధ్యపడక పోవచ్చు.కాబట్టీ మనిషి ఎప్పటికీ అనుభవించలేని అధి భౌతిక జగత్తు ఒకటి ఉంటుంది. ((ఐతే ఈ అధి భౌతిక జగత్తు గురించి ఎవరేమి చెప్పినా నమ్మేయాలా? ఈ అధి భౌతిక ప్రపంచం లోనే దేవుడు ఉండి సృష్టిని శాసిస్తున్నాడంటే నమ్మేయాలా? అధి భౌతిక ప్రపంచ నియమాలు భౌతిక ప్రపంచ నియమాల లా ఉంటే , “అలా నమ్మ కూడదు”. కానీ సైన్స్ దీనిని నిరూపించలేదు. ఎందుకంటే మనిషికి అక్కడ ప్రవేశం లేదు.స్థల కాలాలే లేని చోట దేవుడు ఒక మోటివేషన్ తో ఉంటాడా?ఆయన ఎలక్ట్రాన్లూ, పాజిట్రాన్లూ వంటి చిన్న కణాలను సృష్టించే విషయం లో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకొంటాడు. మిగిలి విశ్వమంతా మనకు తెలిసిన రూల్స్ ప్రకారమే ఎందుకు నడుస్తుంది?))

అలానే, ఎలక్ట్రాన్లు ఒక చోట మాయమై, కొంచెం దూరంలో ప్రత్యక్షమౌతాయి. దీనినే క్వాంటం జంప్ అంటారు. క్వాంటం తీరీ చదివితే ఈ విశ్వమంత ఒక మాయ అనిపిస్తుంది. మౌలిక కణాలన్నీ(పదార్ధం అంతా) ,  శక్తి తో చేయబడి ఉన్నాయి. ప్రస్థుతం ఒక కణం ఉందా లేదా అనేది ఆ కణం యొక్క భూత భవిష్యత్ స్థితుల పై ఆధారపడి ఉంటుంది.
సరేనండీ, నేను అధిభౌతిక ప్రపంచం గురించి నమ్మటం మొదలు పెట్టాను. అయితే ఏమిటంట? నిజజీవితం లో చూపబడే మహిమలన్నీ మోసాలే అవ్వనక్కరలేదు. వాటిలో కొన్నిటికి మూలాలు ఈ అధిభౌతిక ప్రపంచం లో ఉండవచ్చు. ఉదాహరణకి శూన్యంలోంచీ వస్తువులను తీయటం, శూన్యం లోంచీ ఎలక్ట్రాన్లు పుట్టవచ్చు అని సైన్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కదా!
ఇక ఈ మధ్య నేను పరమహంస యోగానంద గారు రాసిన, “ఒక యోగి ఆత్మ కథ” అనే పుస్తకం చదివాను. ఆ పుస్తకం నిండా నేను పైన చెప్పిన అనేక మహిమలు ఉన్నాయి. అందులో యోగానంద గారు ఆ మహిమలకు సైన్స్ పరమైన సమర్ధన కూడ ఇచ్చారు. వాటిని వివరించటం లో ఆయన స్వరం చాలా నమ్మదగినదిగా ఉంది. దానితో నేను, “ఏమో ఈ మహిమలు కూడా నిజమేనేమో”, అనే స్థితి కి చేరాను.”ఆ మహిమలకు భౌతికం గా ఇంకా కని పెట్టబడని కారణం ఉండవచ్చునేమో. లేకపోతే, ఈ మహిమల మూలాలు అధిభౌతిక జగత్తులో ఉండ వచ్చునేమో?! “గొప్ప యోగులు అధిభౌతిక జగత్ లోని నియమాల ద్వారా మహిమలను చూపించగలరేమో!

కొన్ని రోజుల తరువాత ఇంటర్నెట్ లో యోగానంద గారి గురించి ఒక కెనడియన్ రాసిన ఒక పుస్తకం లోని విషయాలు చదివాను. ఆయన యోగానంద గారి గురించి పూర్తి నెగటివ్ ధోరణి లో రాశారు. మొత్తానికి యోగానంద గారు చెప్పినవి చాల వరకూ తప్పులూ లేక అబధ్ధాలు అన్నట్లు గా రాశాడు. అది చదివిన తరువాత నాకు కొన్ని వ్యతిరేక ఆలోచనలు రావటం మొదలయ్యాయి. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా?

ఈ ఆలోచనల తరువాత, నాకనిపించిందేమంటే..
–ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటనికి సిధ్ధం గానే ఉంటుంది. తమ శక్తుల మీద తమకు అదుపు లేని వారు, ఆ శక్తులు తమకు ఉన్నపుడే చూపించవచ్చు. నాకు తెలిసిన ఒక మనిషికి అయస్కాంత శక్తి ఉంది అని చెప్పాను కదా? ఆ మనిషిని శాస్త్రజ్ఞులు పరిశీలించి, అతని శక్తి కి కారణం తెలియలేదనీ. దాని పై ఇంకా పరిశోధనలు చేయాలనీ ఒప్పుకొన్నారు. కారణం లేకుండా జనించిన ఎలక్ట్రాన్లనే ఒప్పుకొన్న సైన్స్, పరిశోధనల తరువాత అతని అయస్కాంత శక్తికి కారణం తెలియకపోతే, ఆ విషయాన్ని కూడా ఒప్పుకొంటుంది. చివరికి చెప్పవలసిన విషయమేమిటంటే, మహిమల గురించి ప్రధమం గా నమ్మ క పోవటమే మంచిది. అలా నమ్మకపోవటం అనేది నిజానికి దగ్గర గా ఉంటుంది. ఏ కోటికో, ఒక మహిమ నిజమైనా, దానిని సరిగా నిరూపించబడిన తరువాతే నమ్మటం మంచిది.

ఎలక్ట్రాన్లు శూన్యం లోంచీ పుడతాయంటే నమ్ముతాను. శూన్యం లోంచీ అరటి పండు తీశాడంటే, ముందు నమ్మను. ఒక వేళ అదే పనిని ప్రయోగశాల లో చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను.

ప్రకటనలు

15 thoughts on “అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.”

 1. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా? ”

  ఇది చదివాక నాకు ఇలా అనిపిస్తోందండి. ………. పరీక్ష నిర్వహించేటప్పుడు. ఒక ఉపాధ్యాయుడు తనకు జవాబులు అన్నీ తెలిసినా కూడా విద్యార్ధికి జవాబులు చెప్పరు కదా ! ఎందుకంటే విద్యార్ధి తన స్వశక్తితో అన్ని విషయాలు నేర్చుకోని జీవితంలో పైకిఎదగాలని. అప్పుడే జీవితంలో ఎదురయ్యే సమస్యలను తనకుతానుగా పరిష్కరించుకోగలడు అని. అన్నీ మహిమలతో చేసేస్తే ఇక మనిషి పనీపాటాలేకుండా ఏం చేస్తాడు. ?

  ప్రతి జీవి తనకు తానుగా కష్టపడి అత్యుత్తమమైన పరమపదాన్ని పొందాలన్నది దేవుని ఆలోచన కావచ్చు. అన్నీ మహిమలతో అమర్చి ఇస్తే , ఈ మానవులు సోమరిపోతుల్లాగ తింటూ కూర్చోవాలని ఎందుకు అనుకుంటున్నారో ?

  సృష్టిలో పశువులు, పక్షులు కూడా తమకు తాముగా ఎన్నో కష్టాలు పడి ఆహారాన్ని సంపాదించటం , జీవించటం చేస్తుంటాయి. మనుషులు మాత్రమే సోమరిలాగ పని లేకుండా ఆహారాన్ని మహిమల ద్వారా సంపాదించటం ఎలా ? వంటి ఆలోచనలు చేస్తుంటారు.

  దేనికయినా ఒక పద్ధతి ఉంటుంది. బిడ్డను కనాలంటే కొన్ని నెలలు వేచి ఉండవలసే ఉంటుంది. అంతేకానీ మహిమలతో రాబోయే తరాలవారి మెదళ్ళలోని ఆలోచనలు కనిపెట్టటం ఇవన్నీ అసహజమైన , సోమరితనపు ఆలోచనలుగా నాకు అనిపిస్తున్నాయండి. కర్మసిద్ధాంతం ప్రకారం సృష్టి ఒక పద్ధతిలో చక్కగా సాగుతోంది. కొందరు తమ గందరగోళపు ఆలోచనలతో ,ఆవిష్కరణలతో సృష్టినీ పాడు చేస్తున్నారు..

  మెచ్చుకోండి

 2. భూకంపాలూ, రైలుప్రమాదాలూ వంటి వాటిని ముందే కనిపెట్టటం వలన అనేక మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన వారమౌతాము. రైలు ప్రమాదం లో, సునామీ లో మరణించిన వారందరూ (కొన్ని లక్షల మంది) వారి కిందటి జన్మల కర్మ ప్రకారం మరణించారనటం ఎందుకో నాకు సరిగా కనిపించటం లేదు.
  సోమాలియా, ఇతియోపియా వంటి దేశాలలో ఎంత కష్టించి పని చేసినా ఆహారం ఉండదు ,. అలాంటి చోట్ల ఈ బాబాల మహిమలు ఉపయోగ పడ్తాయి.
  ఏయిడ్స్ వలన అనేక మంది అమాయకులు కూడా చనిపోతున్నారు. సైంటిస్టులు కనిపెట్టబోయే విషయాలను(మందు) ముందే బాబాలు తెలుసుకొంటే, అనేక మంది రక్షించబడతారు.
  ఒక పనిని సులువు గా చేయగల పరిస్థితి ఉన్నపుడు దానిని అనవసరమైన కష్టపడి చేయటం విజ్ణత అవుతుందా(Especially when one is not doing an unethical thing)?
  శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు, మనకు సంకల్పాన్ని ఇచ్చిన దేవుడు దానిని మార్చలేడా? మన సంకల్పానికి కూడా దేవుడే బాధ్యుడు కదా? మనం సోమరిపోతులు గా కూర్చున్నామంటే మనకు ఆ ఇచ్చ లేదని అర్ధం. కానీ ఈ ఇచ్చ కూడా దేవుడి ఆధీనం లోనే ఉంటుంది (ఆయన సర్వ శక్తివంతుడు కనుక). దేవుడికీ స్కూల్ మేస్టర్ కీ ఒక తేడా ఉంది. దేవుడే మనకు పని చేసే ఇచ్చను కూడా ఇచ్చాడు. కాబట్టీ మనం పని చేయకపోయినా ఆయనే బాధ్యుడు కదా? (అసలు ,మన ఇచ్చ అనేదే పరిస్థితుల ప్రభావం వలన మన శారీరక భౌతిక అవసరాలకు ఏర్పడిన ఒక ఆకారం.)
  దేవుడు ఉంటే కనుక, నేను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నానని నాపై పక్షపాతం చూపించేటంత ఇరుకు మనసు వాదనుకోను. అలా చూపించేవాడైతే దేవుడికీ రాగ ద్వేషాలుంటాయని అర్ధం కదా?దేవుడు ఆయనని నమ్మని వాళ్ళందరినీ నరకం లోకి పంపిస్తాడనుకోను. అలానే ఆయనను భక్తి తో ధ్యానించే వారి పట్ల ఫేవర్ చూపిస్తాడనుకోను. ఆయన మనకి ఫేవర్ చేయగలడు కాబట్టీ మనం ఆయనని నమ్మాలి అనటం, ఒక నియంత మనపై చూపించే అధికారాన్ని శిరసావహించే పధ్ధతి ఇది.

  నేను ఈ ప్రశ్నలు అడిగింది బాబాలను సైంటిస్టుల మెదళ్ళలోని ఆలోచనలు కనిపెట్టమని కాదు. వారు మన మెదళ్ళలో ఆలోచనలను కనిపెట్టలేకపోతున్నారంటే, వారి మహిమలు నిజం కాదేమో అనే సందేహం తో. లేక వారి మహిమల పై వారికి అదుపు అన్నా లేక పోయిఉండాలి. వారి మహిమల పరిధి చాలా పరిమితమైనా అయి ఉండాలి.

  మెచ్చుకోండి

 3. “మనుషులు మాత్రమే సోమరిలాగ పని లేకుండా ఆహారాన్ని మహిమల ద్వారా సంపాదించటం ఎలా వంటి ఆలోచనలు చేస్తుంటారు” ఆహారాన్ని మహిమల ద్వారా సంపాదించటం ఎలా అని మనుషులు ఆలోచనలు చేస్తున్నారా.. లేదండీ శతాబ్దాలుగా వాళ్లు కష్టపడే బతుకుతున్నారు. మనుషులు వాస్తవాచరణలో అత్యంత భౌతిక వాదులు. ఏం చేస్తే ఏం కలుగుతుందో, ఏం చేయకపోతే ఏం జరుగదో వారికి బాగా తెలుసు. దైవానికి లేదా దయ్యానికి ప్రతినిధులుగా భావించుకుంటూ వచ్చినవారు వివిధ కాలాల్లో రేపిన భ్రమలే ఇవి. ఇవి ఖచ్చితంగా మనుషుల ఆలోచనలు కావు.
  తెల్లార్లూ అలవాటుగా గుడిలో రాంభజన చేసే రైతుకు తెల్లారి పొలం వద్దకు పోయి చూడకుంటే, పంటకు నీరు మలపకుంటే పంట పండదని నూటికి నూరుపాళ్లూ తెలుసు. పంట పండించే బాధ్యతను దేవుడికో, దయ్యానికో వదిలేసి కూర్చోడు రైతు. వాస్తవ జీవితంలో హేతువుకు తావు ఇవ్వకుంటే ఈ ప్రపంచంలో గుండుసూది కూడా తయారు కాదు. భూమ్మీద ఇంతవరకూ ఏ స్వామీ, దొంగస్వామీ కూడా స్వంతంగా గుండుసూదిని కూడా సృష్టించి ఇవ్వలేకపోయాడు. మనిషి గతంలోనే చేసి సిద్దంగా ఉంచిన దాన్ని చంకల కిందినుంచో, చొక్కా మడతల కిందినుంచో మాయచేసి బయటకి తీయడం తప్ప.

  స్లో మోషన్ కెమెరా ద్వారా సాక్షాత్తూ పుట్టపర్తి సాయిబాబాయే 1993లో అడ్డంగా దొరికిపోయాడు. నమ్మడానికి, లేనిదాన్ని ప్రచారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటే ప్రతి క్షణం మహిమలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దేవుడిని నమ్మడం తప్పు కాదు. ఆస్తిత్వ భావనతో బతకడం కూడా తప్పు కాదు. కాని అస్తిత్వ వాదులను కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు… మనం ఇప్పటికే తేలిపోయిన, బూటకపు విషయంగా నిర్ధారించబడిన విషయాన్ని మళ్లీ ఈరూపంలో చర్చకు పెట్టడం అవసరమా అన్నదే నా ప్రశ్న.

  “ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటానికి సిధ్ధం గానే ఉంటుంది.”

  మహిమ అనేది మనిషి చేసినా, లేదా దేవుడు లేదా దెయ్యం అనే అభౌతిక రూపం చేసినా అది పచ్చి గారడీయే అని ఎప్పుడో తేలిపోయింది. కుటుంబరావుగారు అప్పుడెప్పుడో తప్పటడుగులు వేశారు నిజమే కాని మళ్లీ మీరు అదే వాదనను ఇంకో రూపంలో తీసుకురావలసిన అవసరం ఉందా? శూన్యం నుంచి ఎలెక్ట్రాన్ పుడుతోంది అంటున్నారు. పదార్థం అదృశ్య రూపంలో కూడా ఉంటోందని నల్లబిలాలు -బ్లాక్ హోల్స్-ఉదంతాలు తెలుపుతున్నాయి. శాస్త్ర దృష్టితో ఈ విషయాన్ని వివరించండి. ఈ చర్చే హేతువు కారణాలను కనుగొంటుంది.

  యోగి ఆత్మకథ చదివి మహిమలపై కాస్త విశ్వాసం పెంచుకున్నారు మీరు. మళ్లీ దానికి వ్యతిరేక పుస్తకం వస్తే చదివి భిన్నమైన ఆలోచనలకు మళ్లారు. భావజాలపరంగా ఎక్కడో తేడా కనిపిస్తోంది నాకు. కాని మీరు ఇలాగే కాస్సేపు దాన్ని, కాస్సేపు దీన్ని నమ్ముతూ వస్తానంటే వ్యతిరేకించడానికి నేనెవరిని? నా వ్యాఖ్య మిమ్మల్ని బాధిస్తే క్షమించాలి.

  మెచ్చుకోండి

 4. I already posted the following comment 1-2 days back but don’t know why you have not posted it here:
  అసలీ అలౌకిక శక్తులనేవాటిని గురించి పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో అనేక పరిశోధనలు జరిగాయి; వాళ్లు మరీ ఛాందస మార్క్సిస్టుల్లా కాక సమస్యలపై విస్తృతంగా పరిశీలనలు జరిపారు. మార్క్స్‌కూడ తన చారిత్రక భౌతికవాద వివరణల్లో చాల జాగ్రత్తగా ‘precedence of material forces over spiritual forces – ఆధ్యాత్మిక శక్తులపై భౌతిక శక్తుల కుండే ప్రాధాన్యం (ముందుపీటీ)’ అనే పదజాలం వాడుతాడు. కీ.శే. గౌ. కొడవటిగంటిగారు మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేసివున్నారు, నా వ్యక్తిగత పరిచయంలో నేను స్వయంగా అది గమనించానుకూడ, కనుక ఏమి రాసినా ఆషామాషీగానైతే రాసివుండరు. అలాగే ‘child prodigies – అద్భుత బాలనిపుణులు అందామా’ అనే పరిణామంకూడ ఒకటుందనీ, దానిపైకూడ అనేక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయనీకూడ మనం గమనించాలి. క్లుప్తంగా కొన్ని ఉదాహరణలిస్తాను: గుడ్లగూబలు, గబ్బిలాలకువుండే విశేష ఇంద్రియశక్తులు అరుదుగా ఎవరైనా మనుషుల్లో వికసించే సంభావ్యత లేదా? అలాగే గద్దల్లా దూరదృష్టి, కుక్కల్లా అతిచిన్న ధ్వనుల్ని వినగలిగే దూరశ్రవణ శక్తీ కూడ కొంతమందిలో అరుదుగా వికసించి వుండవచ్చేమో. పోతే నేడు [మార్క్స్ కాలంలోలా ఖచ్చితంగా] యిది ద్రవ్యము (matter) , అది భావము అని watertight compartments లా [పూర్తిగా వేర్వేరు నీరుకూడ (లేక గాలికూడ) చొరని గదుల్లా] చూచి, వ్యవహరించడానికి బాగా వికసించివున్న అధునాతన శాస్త్రవిజ్ఞానం ఒప్పుకోదేమోకూడ. ఏదేమైనా, మూఢనమ్మకాలకు గురికాకుండానే, ఈ విషయంలో కూలంకష పరిశోధనలూ, చర్చలూ జరగాల్సిన అగత్యం ఎంతైనా వుంది అని నా దృఢవిశ్వాసం.

  మెచ్చుకోండి

 5. రాజు గారు,
  ఒక యోగి ఆత్మ కథ చదవక ముందు నుంచీ నాకు అతీత శక్తుల పట్ల ద్వైధీభావం ఉంది. అది ముఖ్యం గా బాల్యం లో నాకు జరిగిన రెండు మూడు అనుభవాల వలన. వాటిలో ఒక అనుభవాన్ని ఈ పోస్ట్ మొదట్లో ప్రస్తావించాను కూడా. అతీత శక్తులను నమ్మటానికి శాస్త్రీయ నిరూపనే గీటురాయి అని చెప్పాను కదా. కానీ కొన్నిటిని (మనిషి అయస్కాంత శక్తి ఉండ్టం లాంటిది) సైన్స్ ఎక్స్ప్లెయిన్ చెయ లేకపోయింది. భవిష్యత్తు లో చేయవచ్చు. ఇక పోతే సైన్స్ ఎప్పటికీ నిరూపించలేని ఇంఫినిట్ డైమన్షన్స్, స్ట్రింగ్ తీరీ లాంటివి ఉన్నాయని మీరు విస్మరించవద్దు.
  ఒక సిధ్ధాంతాన్ని నిరూపించాలంటే దానిని మన భౌతిక ప్రపంచం లోని దృగ్విషయాలద్వారా చెయ్యాలి. కానీ ఈ భౌతిక ప్రపంచం కొంత శోధన తరువాత భౌతికత పరిధిని దాటిపోతుంది. భౌతికత పరిధి మనిషి ఇంద్రియ జ్ఞానానికీ, మనిషి భౌతిక అస్తిత్వానికీ,ఆలోచనలకీ, తద్వారా మనిషి అవగాహనకీ ఉన్న పరిమితి. ఈ పరిమితి ఆవల మనం చూసే భౌతిక ప్రపంచపు మూలాలు ఉన్నాయి. ఈ మూలాలను మనం భౌతిక ప్రపంచం లోకి లాక్కు రాలేము. ఒక రోబో పరిధి దానికి అమర్చిన సెన్సర్లూ, దానిలోని మైక్రోప్రాసెసర్ కెపాసిటీ లకి లోబడే ఉంటుంది. ఉదాహరణకి ఒక రోబో కి స్పర్శ కలిగించే సెన్సర్ లేదనుకొందాం. అప్పుడు దానికి స్పర్శ గురించి ఎంత చెప్పినా అనుభవంలోకి రాదు. ఆ రోబో స్పర్శ ను గురించి తీరీ లు పుట్టించగలదు . కానీ ఆ తీరీ ల ని నిరూపించలేదు. ఎందుకంటే స్పర్శ దాని అనుభవం లో లేదు. ఈ రోబో కి స్పర్శ విషయం లో ఉన్న పరిమితుల లాంటివి మానవ జాతికి సమిష్టి గా చాలా ఉండే అవకాసం చాలా ఎక్కువ. ఎందుకంటే మనిషి కూడా చాలా పరిమితులకి లోబడిన ఒక ఆర్గానిజం మాత్రమే. ఈ అనంత విశ్వం లో ఒక చిన్న పిచ్చి రోబో మనిషి.
  సినిమా తెర మీది బొమ్మలకి తెలివి ఉంది అనుకొంటే, అవి నిజమైన మనుషుల ఉనికిని ఎన్నటికైనా నిరూపించ గలవా? మనం వాటి భౌతికత పరిధికి బయట ఉన్నాం. అవి మన ఉనికి గురించి వాటి మాత్స్ తో వాటి సైన్స్ తో మన గురించి ఊహా గానాలు మాత్రమే చేయగలవు.స్థల కాలాలకు ఆవల ఉన్న విషయాల గురించి సిధ్ధాంతాలను ఎన్నైనా చేయవచ్చు. కానీ వాటిని నిరూపించటం అయ్యేపని కాదు.అయితే,స్థల కాలాల కు లోబడిన విషయాల గురించి సైన్స్ ముందు రోజులలో ఇంకా అనేక విషయలను కనిపెడుతుంది. ఇందులో సందేహం లేదు.
  సైన్స్ పట్ల మీకున్నది నమ్మకం మాత్రమేనేమో (సైన్స్ గత రెండు శతాబ్దులు గా సాధించిన ప్రగతి వలన ఏర్పడిన నమ్మకం)! కానీ సైన్స్ పరిధుల గురించి విశ్లేష్ణాత్మకం ఆలోచిస్తే దానికి ఉన్న పరిమితులు అవగాహన అవుతాయి. సైన్స్ లో ఏ సిధ్ధాంతమైనా, తాను ఏ ఏ పరిస్థితులలో (ఇనీషియల్ కండిషన్స్) అప్లై అవుతానో, తనకున్న పరిమితులేమిటో (స్కోప్) చెబుతుంది. అలానే సైన్స్ మొత్తానికీ కొన్ని ఇనీషియల్ కండిషన్సూ, స్కోపూ ఉంటాయి.

  మెచ్చుకోండి

 6. రాజుగారూ, బొందలపాటిగారు,
  సమాజానికి కనిపించే మనిషికి, ఆ మనిషిలోని మనిషికి తేడా ఉంటుందంటే అంగీకరిస్తారు కదా! ఇదే విషయాన్ని అన్నమాచార్యులవారు భక్తిపూర్వకంగా ‘నానాటి బ్రతుకు నాటకము’ అనే కీర్తన వ్రాశారు. మనలోని మనం అనేది అధిక శాతం ఎవ్వరికీ తెలియకపోవచ్చు లేదా ఒక్కొసారి అతికొద్దిమందికి మాత్రమే తెలియవచ్చు. ఇటువంటప్పుడు నాకేదన్నా అయితే నాలోని నేను తెలిసినవాడు, ఎలాంటి పరిస్థితినైనా చిటికెలో సరిచేయగలిగిన సర్వశక్తిమంతుడు ఒకడుంటే బాగుండు అనే భావన కలగటం అత్యంత సహజం. ఆ భావనలోంచి పుట్టినవాడే దేవుడు.

  ఇక్కడ ఆ దేవుడు నమ్మిన వారు కోల్పోయిందీ లేదా కొత్తగా వచ్చిపడిందీ ఏమీ లేదు కాకపోతే ఎవడో ఒకడు నన్ను కాపాడుతాడు అన్న భరోసా ఉంటుంది. ఇక నమ్మనివారు కోల్పోయిందీ లేదు కొత్తగా వారికి వచ్చిపడిందీ లేదు. దొంగ స్వాముల చేతిలో ఆస్తికులు మోసపోతే దురాశాపరులైన శాస్త్రవేత్తల చేతిలో వారు కనిపెట్టిన సౌకర్యాన్ని వినియోగించుకున్నవారు మోసపోతారు. రెండుచోట్లా కావల్సింది మాత్రం నైతికవిలువలు.

  బొందలపాటిగారు అన్నట్లు మనిషి చూసే భౌతిక ప్రపంచానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి అభివృద్ధిచెందే ఏ శాస్త్రమైనా దాని పరిధిలో పనిచేయాల్సిందే. సైన్సుకు నిరూపణలు ప్రాణమైతే, మతానికి విశ్వాసం ప్రధానం.

  మెచ్చుకోండి

 7. “సైన్సుకు నిరూపణలు ప్రాణమైతే, మతానికి విశ్వాసం ప్రధానం.”
  చాలా బాగా చెప్పారు.సైన్సూ మతమూ, రెండూ భౌతిక పరిధికి బయట ఏమి ఉందో చూడలేవు. సైన్స్ సిధ్ధాంతాలూ, కాన్సెప్ట్ల రూపం లో ఊహా గానాలు చేస్తుంది. కానీ వాటిని నిరూపించలేదు.చివరికి మహా అయితే “తూచ్! నాకు అక్కడ ఏమి ఉందో తెలియదు” అంటుంది.మతం నమ్మకం రూపం లో ఒక ప్రతిబింబాన్ని తయారు చేస్తుంది. దేవుడు ప్రత్యక్ష అనుభవం అయితే నమ్మకం అవసరం లేదు కదా!
  ఆస్తికులూ, నాస్తికులూ కోల్పోయేవి కూడా ఉన్నాయి.నాస్తికులు భరోసాను కోల్పోతారు. ఆస్తికులకు విశ్లేషించే ఇచ్చ కొంచెం తగ్గుతుంది.
  నాస్తికులకు పాప భీతి తక్కువ ఉండే అవకాశం ఉంది. ఆస్తికులు పాపం చేయటం కోసం ఆత్మ వంచన చేసుకోవలసి వస్తుంది.

  మెచ్చుకోండి

 8. ఇక “భూకంపాలూ, రైలుప్రమాదాలూ వంటి వాటిని ముందే కనిపెట్టటం వలన అనేక మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన వారమౌతాము. రైలు ప్రమాదం లో, సునామీ లో మరణించిన వారందరూ (కొన్ని లక్షల మంది) వారి కిందటి జన్మల కర్మ ప్రకారం మరణించారనటం ఎందుకో నాకు సరిగా కనిపించటం లేదు.
  సోమాలియా, ఇతియోపియా వంటి దేశాలలో ఎంత కష్టించి పని చేసినా ఆహారం ఉండదు ,. అలాంటి చోట్ల ఈ బాబాల మహిమలు ఉపయోగ పడ్తాయి.
  ఏయిడ్స్ వలన అనేక మంది అమాయకులు కూడా చనిపోతున్నారు. సైంటిస్టులు కనిపెట్టబోయే విషయాలను(మందు) ముందే బాబాలు తెలుసుకొంటే, అనేక మంది రక్షించబడతారు.
  ఒక పనిని సులువు గా చేయగల పరిస్థితి ఉన్నపుడు దానిని అనవసరమైన కష్టపడి చేయటం విజ్ణత అవుతుందా? …………………………………

  నేను కామెంట్ వ్రాసిన తరువాత ఊరు వెళ్ళటం వల్ల తరువాత మీ కామెంట్స్ చదవలేదండి. నిన్ననే మళ్ళీ చూశాను. అయితే పనివత్తిడి వల్ల మళ్ళి వ్యాఖ్య వ్రాయటం ఆలస్యమైంది.

  మీ అభిప్రాయములు చదివిన తరువాత .నాకు ఇలా అనిపించిందండి. మహిమలవంటివి తప్పకుండా ఉన్నాయి. మీరు చెప్పినట్లు లవకుశ సినిమా చూడకముందే ముందే మీకు కలలో రావటం వంటి అనుభవాలు చాలామందికి జరుగుతున్నాయి. నమ్మనివాళ్ళని ఎలా నమ్మించగలం ?

  ఇక్కడ ఇంకో విషయమండి. మనం ఎంతకీ మానవుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము. మనలాగే పశుపక్ష్యాదులకీ బాధలు ఉంటాయి. మరి మన స్వార్ధం కోసం పశుపక్ష్యాదులను ఎంతో బాధకు గురి చేస్తున్నాము. మానవుల కోసం లక్షలాది మూగజీవులు పడరానిపాట్లు పడుతున్నాయి. మహిమలు అవసరంలేదు. మనం మన స్వార్ధాన్ని కొంచెం అయినా ఎందుకు తగ్గించుకోలేకపోతున్నామో ? ఆలోచించండి.

  భూకంపాలను గుర్తించే శక్తి కొన్ని జంతువులకు ఉందట. జంతువుల ప్రవర్తనను గమనించి మానవులు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

  ఆకలిచావులు సోమాలియాలో అంత తీవ్రంగా కాకపోయినా భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. ఇదంతా మానవుల స్వయంకృతాపరాధం. అవును, దైవం ఎన్నో మొక్కలను, విత్తనాలను సృష్టించి మనకు ఇచ్చారు. వాటినుంచీ పుష్కలంగా పంటలు పండించుకోవచ్చు.

  కానీ మనం ఆహారం కంటే విలాసవస్తువులను తయారుచేసే పరిశ్రమలను తయారుచేయటం, ఆయుధాలను తయారుచేయటం వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఆ విధమైన పెట్టుబడి తగ్గించుకుంటే సోమాలియా వాళ్ళకు కూడా ఆహారపదార్ధాలు సరఫరా చేయొచ్చు.

  మనదేశంలో అయితే గిడ్డంగులు సరిపడాలేక ఎన్నో ఆహారౌత్పత్తులు పాడైపోతున్నాయి. ఇలా ప్రపంచమంతా ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ సమస్యలకు ఇలా ఎన్నో కోణాలున్నాయి .

  సునామీ వంటి వాటిలో మరణించటం కర్మసిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అనుకోవచ్చు. కర్మసిద్ధాంతం సరైనదే అనుకోవచ్చు. మనం పరీక్షల్లో ఎలా వ్రాస్తే అలాగే మార్కులు వేస్తారు కదా ఉపాధ్యాయులు. ! ఎంతో కష్టపడి చదవటం, ఈ పరీక్షలు, ఇవన్నీ ఎందుకు ? ఉపాధ్యాయులకే అన్నీ జవాబులు తెలుసు కాబట్టి , వారే మన జవాబులు కూడా వ్రాసేయొచ్చుకదా ! అనుకునే విధ్యార్ధులు కూడా కొందరు ఉంటారు.

  ఒక పనిని సులువుగా చేసే అవకాశం ఉన్నా కూడా , ప్రతిచిన్న విషయానికి యంత్రాలపై ఆధారపడకుండా , కష్టపడి మనపని మనమే చేయటం వల్ల మన ఆరోగ్యమే చక్కగా ఉంటుందని పెద్దలు అనుభవం ద్వారా చెప్పటం జరిగింది . ఆ విధంగా మనకు విషయపరిజ్ఞానమూ పెరుగుతుంది.

  కాలిక్యులేటర్లు ఉపయోగించని పాత తరాలవారికి మనకన్నా జ్ఞాపకశక్తి బాగా ఉండేది అనిపిస్తుంది.

  ఇక, నైతికవిలువలతో కూడిన జీవనవిధానం, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , ఎయిడ్స్ వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు అంటున్నారుకదా !

  అయినా జననం మరణం పశుపక్ష్యాదులకు వలెనే మానవులకూ అనివార్యమైన విషయాలు. ఈ కష్టాలన్నీ లేకుండా శాశ్వత బ్రహ్మానందం పొందాలంటే , దైవకృపను పొంది మోక్షమనే పరమపదమును పొందటం ద్వారా మాత్రమే సాధ్యమని పెద్దలు చెప్పటం జరిగింది.

  ఇక సైన్స్ అని వేరే ఏమీలేదు. శాస్త్రవేత్తలు కనుగొన్నవి అన్నీ దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేసినవే. అంతెందుకు శాస్త్రవేత్తలు పీల్చే గాలి కూడా దైవసృష్టియే కదా !
  ఇక మీరు ప్రశ్నలు అడిగినదానికే భగవంతుడు కోపగించుకోవటం జరగదు…

  మెచ్చుకోండి

 9. అజంతా గారు,
  పశుపక్ష్యాదుల గురించిన మీ భావాలే నా భావాలు కూడా!.
  దేవుడు లేడూ ఉన్నాడూ అని చెప్పాలంటే దేవుడికి ఒక నిర్వచనం ఇవ్వాలి. దేవుడు “దయ కల వాడు, అన్నిటినీ అదుపు చేయగల వాడు , లోక హితం చేసే వాడు”. అనేది ఒక నిర్వచనం.
  కానీ లోకం లో జరిగే అనేక దురదృష్ట సంఘటనలు చూసినపుడు దేవుడు వాటిని ఎందుకు ఆపటం లేదా అనే సందేహం వస్తుంది. దానికి సమాధానం గా కర్మ సిధ్ధాంతం, మనిషి స్వేచ్చా సంకల్పం అనే సిధ్ధాంతాలు ముందుకు వస్తాయి. కానీ ఈ సిధ్ధాంతాలు లోకం లోని చెడుకి దేవుడి బాధ్యతను ఒక మెట్టు మాత్రమే దూరం గా పెట్త గలుగుతాయి. ఎందుకంటే మనిషి ఇచ్చనూ, జన్మలకు ముందు మొదటి సారిగా మనిషినీ సృష్టించిన వాడు కూడా దేవుడే అవ్వాలి కాబట్టీ.
  ఇక దేవుడి యొక్క పై నిర్వచనం చెప్పిన వారే ఆయన నిర్గుణుడూ, అనిర్వచనీయుడూ అని చెబుతారు. దేవుడు సునామీలు ఎందుకు ఆపడు అని అడిగితే, “ఆయన నిర్గుణుడు కాబట్టీ ఆయన లీలలు అర్ధం చేసుకోవటం మానవ మాత్రుల పరిధిలో లేదు” అంటారు. నిర్గుణుడికి పైన చెప్పిన మూడు గుణాలూ (మంచి చేయటం, లోకాన్ని అదుపు చేయటం,దయ కల వాడు) కలిగి ఉండటం లో వైరుధ్యం ఉంది. ఒక వేళ ఆ మూడు గుణాలూ కాక మిగిలిన విషయాలలో ఆయన నిర్గుణుడా? దేవుడు మొత్తం గా నిర్గుణుడు అనేది సైన్స్ చెప్పే “మనం అర్ధం చేసుకోలేని అదనపు కొలతలలో సృష్టి జరిగింది. ఆ మెకానిజం మనకి ఎప్పటికీ తెలియక పోవచ్చు”, అనేదానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టీ దేవుడు మొత్తం గా నిర్గుణుడు అనే దానితో నాకు పేచీ లేదు.
  ఈ లోకాన్ని బయట వేరే ఒక డైమన్షన్ నుంచీ సృష్టించారనుకొంటే, అలా సృష్టి చేసిన వారు మన్లాంటి వారే అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మనలానే మంచి చెడుల కలయిక గా ఉండటం.
  సైన్స్ చాలా వరకూ ఈ ప్రపంచ సృష్టికి ఒక ఇంటెలిజెంట్ కాన్షస్ ఎంటిటీ లేదని అంటూ వచ్చింది. ఈ మధ్యే ఈ సృష్టిని ఎవరైనా (మంచి వారు కావచ్చు, చెడు వారు కావచ్చు) చేసి ఉండవచ్చు అనే ఇడియా ను కూడా చర్చకు ఒప్పుకొంటోంది. వారు మనలాంటి వారైతే వారు మనకంటే కొంచెం శక్తివంతులు. కానీ దేవుళ్ళు కాలేరు.మనలాంటి వారు విశ్వాన్ని దాని నియమాలకు దానిని ఒదిలిపెట్టి, అప్పుడప్పుడూ మాత్రమే (విశ్వాన్ని పుట్టించటానికీ, శూన్యం నుంచీ మౌలిక కణాలను పుట్టించటానికీ) ఎందుకు జోక్యం కలిగించుకొంటారు?
  ఇక అతీంద్రియ శక్తులు దేవుడు లేకపోయినా ఉంటాయేమోనని నా అనుమానం. ఎందుకంటే ఈ శక్తులన్నిటినీ కొంత కాలానికి దేవుడి సహాయం లేకుండా ఎక్స్ ప్లెయిన్ చేయవచ్చునేమో!

  “ఇక సైన్స్ అని వేరే ఏమీలేదు. శాస్త్రవేత్తలు కనుగొన్నవి అన్నీ దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేసినవే. అంతెందుకు శాస్త్రవేత్తలు పీల్చే గాలి కూడా దైవసృష్టియే కదా !”
  ఒక్క దైవం గురించి తప్ప దాదాపు ఇదే అభిప్రాయాన్ని నేను నేను నా పోస్ట్ లో వ్యక్త పరిచాను ఇక్కడ (http://wp.me/pGX4s-vR)

  మెచ్చుకోండి

 10. కానీ లోకం లో జరిగే అనేక దురదృష్ట సంఘటనలు చూసినపుడు దేవుడు వాటిని ఎందుకు ఆపటం లేదా అనే సందేహం వస్తుంది. దానికి సమాధానం గా కర్మ సిధ్ధాంతం, మనిషి స్వేచ్చా సంకల్పం అనే సిధ్ధాంతాలు ముందుకు వస్తాయి.

  these దురదృష్ట సంఘటనలు are relative. I mean god may not feel them as దురదృష్ట సంఘటనలు!!

  మెచ్చుకోండి

 11. నాకు కూడా కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది. సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది.

  అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే. కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.

  పెద్దలు చెప్పిన స్వర్గం వంటి ,” ఒక యోగి ఆత్మకధ ” గ్రంధములో చెప్పబడిన , కారణలోకం, వంటి ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు. కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.

  సుఖాలు పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి. చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .

  సైకిల్ నేర్చుకునేటప్పుడు బ్యాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు. అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !

  అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ……… జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే. ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.

  చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది. మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.

  బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

  జననమో ! మరణమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు. ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి.

  ఇప్పటికే ఎక్కువగా వ్రాశానేమో మీ బ్లాగులో ,దయచేసి ఏమీ అనుకోకండి…

  మెచ్చుకోండి

 12. My intuition tells god should be more sensitive to the travails of Man than other men. If an incident is miserable to a fellow man, it should be more miserable to the God (Even though he has seen incidents many many times miserable in magnitude, and that particular misery is nothing compared to other miseries he has seen).

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s