మానవ జాతి పయనం ఎటు వైపుకి?

ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.

ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి  ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.

ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’  లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే,ఇప్పటి వరకూ మరే జీవీ చేయనట్లు, తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.

మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి.   మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను  గుర్తు చేసుకోవటం మంచిది.

ప్రకటనలు

7 thoughts on “మానవ జాతి పయనం ఎటు వైపుకి?

 1. Nicely written
  ఖచ్చితం గా మానవజాతి అంతరించే ప్రమాదం ఉంది నేను నమ్ముతాను , కాకపోతే మనం తీసుకునే చర్య ద్వారా కొంచెం ముందో , వెనకో కాని అసలు ఐతే ఎప్పటికో ఒకప్పటికి తప్పదు అని అనుకుంటాను . జాతి మనుగడ కే కాకుండా అభివృద్ధి కి కూడా వైరుధ్యం అనేది కావాలేమో .

  My above comment was not for this post accidentally pasted here pls deleteit !

  మెచ్చుకోండి

  1. “జాతి మనుగడ కే కాకుండా అభివృద్ధి కి కూడా వైరుధ్యం అనేది కావాలేమో . ”
   మీరు వైవిధ్యం కావాలి అంటున్నారా? లేక వైరుధ్యం కావాలంటున్నారా?

   మెచ్చుకోండి

 2. “పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.”

  చిన్న సవరణ. చరిత్రలో ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక అనే భావనలు, వాటి ఆమలు తొలిసారిగా సోవియట్ యూనియన్‌లో 1930లలో ఉనికిలోకి వచ్చాయని చదివాను. 1930లలో మహామాంద్యం తర్వాతే కీన్స్ ప్రతిపాదనలతో యూరప్, అమెరికా దేశాల్లో సంక్షేమ రాజ్య భావన అమలయిందని మీకూ తెలుసు. మరి పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తులూ, సంస్థలూ గెలవడానికి… … ప్రణాళికా రూపకల్పన చేస్తారు అనే మీ ప్రతిపాదన చాలా పరిమితార్థాన్ని మాత్రమే కలిగి ఉంటోందేమో.. మీరు ప్రస్తావించిన తరహా ప్రణాళిక వ్యక్తుల, సంస్థల గెలుపుకు, వాటి లాభాలకు సంబంధించినదే కదా!

  అలాగే.. భూమ్మీద మానవజాతి అంతరిస్తుంది.. మీ ప్రతిపాదన సరైంది.

  “మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను గుర్తు చేసుకోవటం మంచిది.”

  మౌలికంగా మీ అభిప్రాయం సరైందే. కాని మనిషి తన జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా, జీవుల ఉనికిని కాపాడినా, ధ్వంసం చేసినా సూర్య నక్షత్రం తన వికాస దశను ముగించుకుని తనలోకి తాను కుంచించుకు పోవడం మొదలైనప్పుడు భూమితో సహా అన్ని గ్రహాలూ, సూర్య నక్షత్రం పరిధిలోని అన్ని పాదార్థిక అంశాలూ సూర్యుడి ఆకర్షణ శక్తికి గురై తమ ఉనికిని కోల్పోతాయని సైన్స్ పుస్తకాల్లో చదివాను. ఇలా భూమి పూర్తిగా నశించిపోయినా, జీవరాసులు భూగ్రహంమీద ఉనికి కోల్పోయినా మానవులు, జీవరాసుల యొక్క ఉన్నత రూపాలు మరింత మెరుగైన పరిస్థితుల్లో ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట తమ ఉనికిని మరింత మెరుగైన రూపంలో ప్రతిష్టించుకుంటాయని ఎంగెల్స్ 130 సంవత్సరాల క్రితమే తన ‘ప్రకృతి గతితర్కం’ -Dailectics of Nature- అనే సుప్రసిద్ధ రచనలో పేర్కొన్నారు. జీవం తన్ను తాను ఒక ప్రాంతంలో తోసిపుచ్చుకుని – నెగేట్ చేసుకోవడం- మరొక విశ్వ ప్రాంతంలో ఆవిర్భవించే క్రమాన్ని ఈ పుస్తకం చివరలో ఎంగెల్స్ అద్భుతంగా వర్ణించారు. ఎంగెల్స్ పుస్తకం తెలుగు ప్రతి నా వద్ద ఇప్పుడు లేదు. ఇది స్వంత ప్రకటన కాదు. తన కాలపు శాస్త్రీయ శోధనల సారాన్ని ఇలా సూత్రీకరించారనుకుంటాను.

  షేర్ చేసుకోవడానికి తప్ప మీ అభిప్రాయంతో విభేదించుకోవడానికి ఇలా ప్రకటించడం లేదు.

  ఆలోచనాత్మకమైన ఇలాంటి రచనలపై చర్చ పెద్దగా లేదు కాని మీరు సెక్సువల్ విషయాలపై రాస్తే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు, పరమ అభ్యంతరకర వ్యాఖ్యలు ఒకే ఒక రోజులో వచ్చి చేరిపోతున్నాయి. మన ప్రాధాన్యతలు వేటిపై మొగ్గు చూపుతున్నాయో ఇవి తెలుపుతున్నాయనుకుంటాను.

  మంచి రచనకు అభినందనలు…

  మెచ్చుకోండి

  1. రాజు గారూ నమస్తే, మీకు మళ్ళీ తీరిక చిక్కినట్లుంది!
   “ప్రణాళికా రూపకల్పన చేస్తారు అనే మీ ప్రతిపాదన చాలా పరిమితార్థాన్ని మాత్రమే కలిగి ఉంటోందేమో.. మీరు ప్రస్తావించిన తరహా ప్రణాళిక వ్యక్తుల, సంస్థల గెలుపుకు, వాటి లాభాలకు సంబంధించినదే కదా!”
   అవునండీ రాజు గారు. వ్యక్తులకూ వారొ సంస్థలకూ సంబంధించినదే!
   “జీవరాసులు భూగ్రహంమీద ఉనికి కోల్పోయినా మానవులు, జీవరాసుల యొక్క ఉన్నత రూపాలు మరింత మెరుగైన పరిస్థితుల్లో ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట తమ ఉనికిని మరింత మెరుగైన రూపంలో ప్రతిష్టించుకుంటాయని”
   నాకు ఏంగెల్స్ చెప్పినా ఈ మాట నమ్మబుధ్ధికావటంలేదు. మనిషి సూర్యుడు చనిపోయే లోపే తాను చనిపోతాడేమో అనిపిస్తుంది ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే.
   సూర్యుడు క్షీణించే కాలానికి మనిషి మేధస్సు దానిని అధిగమించగలిగితే ఏంగెల్స్ చెప్పింది సాధ్యం కావచ్చు!
   నాగరికతలూ, సాంకేతిక పరిజ్ఞానమూ పురోగమనం చెందటమే కాదు, స్థబ్దు గా ఉండటమూ, కొండొక చో తిరోగమనం చెందటం కూడా జరుగుతుంది. ఉదాహరణ కు సాంచీ సారనాథ్ స్తూపాల నాటి మెటలర్జీ రహస్యలు కొన్ని మరుగున పడిపోయాయంటారు. ఇప్పటికీ ఆ రహస్యాలు తెలియవు.
   ఇక వేరే గెలాక్సీల లో బుధ్ధిజీవులు ఉండే సంభావ్యత ని కాలం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టీ సూర్యుడు నశించే సమయానికి అలాంటి వారు ఉండవచ్చు.
   ఇక పోతే ఈ మధ్య కాంతి కి మించిన వేగం కల మౌలిక కణాన్ని ఒక దాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే నిజమైతే, కాలం లో చక్కా వెనుకకి పోవచ్చు. కాబట్టీ టైం మెషీన్లు వేసుకొని ఎప్పటికప్పుడు సూర్యుడు ఉండే కాలంలోనే ఉండవచ్చు (అప్పటికి టైం మెషీన్లను కనిపెడితే). అప్పుడు భవిష్యత్తు తరువాత భూతకాలం వస్తుంది. వర్తమానానికి ముందు భూత కాలం ఉంటుంది.
   ఆ టపా లో సెక్స్ ఏమీ లేదు. సెక్స్ commercialize అవ్వటానికి మూల కారణం గురించి lighter vein లో రాస్తే, ఆ టపా కి ఒకే రోజు 1209 హిత్స్ వచ్చాయి. ఇకా వందల్లో వస్తూనే ఉన్నాయి. కామెంట్లు వందల్లో వచ్చాయి. చాలా వాటిని నేను తొలగించాను.ఇంతకుముందు కులం గురించి రాసిన ఒక కథ కి ఇలానే వచ్చాయి.
   కుటుంబ వ్యవస్థ లో మగ వారి మారుతున్న పాత్ర గురించి ఇంకో టపా రాశాను. అది చదివి మీ అభిప్రాయం కొంచెం చెప్తారా?

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s