అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన చిక్కులూ, మనిషి బుర్ర పరిమితులూ…

అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన ఇబ్బందులూ, మనిషి బుర్ర పరిమితులూ…

మీరు ‘X’ అనబడే వర్గానికి చెందిన వారనుకొందాం. మీరు Y అనే వర్గం వారిలో చాలా మంది వలన మీకు నష్టం జరిగింది అనుకొంటున్నారు. మీరు ఇలా అనుకోవటం అనేది మీ ప్రత్యక్షానుభవం వలన కావచ్చు, లేక పుస్తకాలు చదవటం వలన కావచ్చు,లేక పెద్ద వాళ్ళు మీకు చెప్పటం వలన కావచ్చు లేక మీడియా వలన కావచ్చు. అయితే అదే సమయం లో Y వర్గం కి చెందిన వాళ్ళ లో కొందరి పట్ల మీకు మంచి అభిప్రాయం కూడా ఉంది.ఎందుకంటే వాళ్ళు మీకు మంచి చేశారు. Y వర్గం లోని ఆ కొంత మందికి, మీరు “Y వర్గం వాళ్ళకు ఉంటాయి” అనుకొన్న చెడు లక్షణాలు లేవు.

కానీ మన మనిషి బుర్ర ఒక విషయం గురించిన అన్ని వివరాలనూ( డీటెయిల్స్) వాటి కి చెందిన సంక్లిష్టత (కాంప్లెక్సిటీ) లనూ  తనలో ఇముడ్చుకోలేదు. ఆ విషయానికి సంబంధించిన సారాన్ని (అబ్స్ట్రాక్ట్) మాత్రమే ఒక  చిత్రం(ఇమేజ్) గా లేక ఒక మాట గా తన లోపల ప్రాతినిధ్యం(రిప్రజంటేషన్) కల్పిస్తూ దాచుకొంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం కి సంబంధించిన కోడ్ మొత్తం మన బుర్ర లో దాచుకోం..కానీ దాని డిజైన్ కి సంబంధించిన స్థూలమైన మోడల్స్ మాత్రం మన బుర్రలోఉంటాయి కదా.ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు,”Y వర్గం లో పుల్లయ్య మంచి వాడు..ఎల్లయ్య మంచివాడు కాదు…సీతమ్మ మంచిది…. “,అని చెప్పరు.   అలానే”Y వర్గం మంచిదీ కాదు..చెడ్డదీ కాదు..అందులోనే మంచివాళ్ళూ..చెడ్డ వాళ్ళూ..మంచీ చేడూ కాని వాళ్ళూ అందరూ ఉన్నారు”, అనికూడా చెప్పరు.

కాబట్టీ, ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు మీకు Y వర్గం వలన మొత్తం(రిసల్టెంట్) గా కలిగిన భావం మాత్రమే మీరు చెప్తారు. అంటే  Y వర్గం వలన మీకు కలిగిన నష్టం లో నుంచీ,అదే వర్గం లోని తక్కువ మంది వలన మీకు కలిగిన లాభాన్ని తీసి వేస్తే మిగిలేది కొంచెం తక్కువగా నైనా నష్టమే. కాబట్టీ మీరు Y వర్గం అంటె చెడు భావాన్నే వ్యక్త పరుస్తారు. భావాలను వ్యక్త పరిచేటప్పుడు మనిషికి పెద్ద వెసులుబాటు లేదు. మీరు ఒక వర్గాన్ని ఇష్టబడతారు లేదా ద్వేషిస్తారు. వీటినే ద్వంద్వాలంటారు. ఈ రెండిటికీ మధ్య ప్రతిస్పందన మనిషికి ఈ విషయాలలో చేత కాదు. కాబట్టీ మీరు టొకున గంప గుత్త గా Y వర్గమంటే మీ అయిష్టాన్నీ ద్వేషాన్నీ వ్యక్తపరుస్తారు..అది రచనల ద్వారా కావచ్చు..చేతల ద్వారా కావచ్చు..మాటల ద్వారా కావచ్చు.
ఒక్క సారి మీ అయిష్టాన్ని విన్న తరువాత,అంతకు ముందు Y వర్గం లో మీకు మంచి చేసిన వాళ్ళూ, లేక మీరంటే ఇష్టమున్న వాళ్ళూ కూడా గాయపడతారు. వారు కూడా మీరు అంటే అయిష్టం పెంచుకొంటారు. మీ లాంటి వారు ఇంకొందరు  Y వర్గాన్ని తిడితే, వీళ్ళ అయిష్టం మీ వర్గమైన X అంతటికీ విస్తరిస్తుంది. ముందు నుంచీ Y వర్గం లో మీకు అయిష్టమైన వాళ్ళూ ఎటు తిరిగీ ఆత్మ విమర్శ చేసుకొనే రకం కాదు. వాళ్ళూ ఎటుతిరిగీ మీ వర్గానికి వ్యతిరేకమే. ఇప్పుడు Y వర్గం నూరు శాతం మీకూ మీ వర్గానికీ వ్యతిరేకమయ్యింది.  ఇలా పరస్పర ద్వేషం ఒక విష వలయం లా వర్ధిల్లుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇక్కడ ముఖ్యమైన లోపం మనిషి బుర్రకి ఉన్న పరిమితులే అనిపిస్తుంది నాకు…
X వర్గాన్ని స్త్రీ, దళిత, ప్రాంతీయ వాదుల తో ప్రతిక్షేపించండి (సబ్స్టిట్యూట్).
Y వర్గాన్ని X వర్గం యొక్క ప్రత్యర్థి వర్గం తో ప్రతి క్షేపించండి.
అలా చేస్తే మన సమాజం లో ద్వేషం రోజు రోజు కీ ఎలా  పెరుగుతోందో మీకు అర్ధమౌతుంది అని ఆశిస్తున్నాను.
ఒక్క సారి ఎదుటి వర్గాన్ని ద్వేషించటం మొదలు పెట్టిన తరువాత, వారు చెప్పే మంచి మాటలను కూడా మీరు అనుమానం తోనే చూస్తారు.ఒక సారి అనుమానం మొదలైన తరువాత,ఎదుటి వారి మాటలు ఎంత అర్ధవంతమైనవి ఐనా అవి వీరి చెవిన పడవు. ఒక వేళ పడినా అవి మెదడుని చేరవు.
కానీ X వర్గానికి చెందిన వాళ్ళు X వర్గాన్ని ద్వేషించటం చాలా చాలా తక్కువ. అలానే Y వర్గం కూడా. ఒక రకం గా వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం. మళ్ళీ ఒకే వర్గం లోని వాళ్ళు వారి వారి స్వార్థ ప్రజోజనాలకు భంగం వచ్చినప్పుడు ఒకరినొకరు ద్వేషించుకొంటారు. శాంతి కోసం మనిషి ఎప్పుడూ ఎదుటి వాడినీ లేక ఎదుటి వర్గాన్ని మారమంటాడు. కానీ సమస్య తనలో కూడా ఉందని గుర్తించడు.
కాబట్టీ, మనిషి ఎదుటి వర్గం లోని వాడిని “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వమనటం తో పాటు తాను కూడా “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వటం వలన్ ఈ సమస్యలన్నీ పోతాయి. ఇలా డీ-సెల్ఫ్ అవ్వటానికి వ్యక్తి గతం గా మనిషి తన మానసిక శక్తిని ధారపోయాలి. దానివలన మనిషి కి వ్యక్తిగతం గా ఒరిగేదేమీ ఉండదు. ఒకపల్లెటూరి కుల తత్వ వాది కష్టపడి కుల తత్వాన్ని అధిగమించి ఒక పాశ్చాత్యుడి లా ఆలోచిస్తే, సమాజానికి మంచిదేనేమో కానీ, వాడికి ఒరిగిందేమిటి?

***************************************

మీరు మెయిన్ రోడ్డు లో కారు తోలుకొంటూ పోతూ ఉంటారు. అప్పుడే పక్క రోడ్డు లో నుంచీ ఒకతను స్పీడ్ గా మెయిన్ రోడ్ మీదకు వస్తాడు. అతనిని మీరు, ” పక్క రోడ్ మీది నుంచీ వస్తున్నాడు కదా..నెమ్మది గా రావాలనే ఇంగితంలేదా వీడికి?” అని విసుక్కొంటారు.
కొంచెం ముందుకు పోయాక మీరు ఒక పక్క రోడ్ లోకి వేళ్తారు. కాసేపటికి పక్క రోడ్ లో నుంచీ మెయిన్ రోడ్ మీదికి వేళ్తుంటే,మెయిన్ రోడ్ మీద ఒక ఫర్లాంగ్ దూరం లో ఒక కారు మీ వైపుకి వస్తోంది. ఆ కారు ఇంకా చాలా దూరం లో ఉంది గదా అనుకొని మీరు మెయిన్ రోడ్ ఎక్కేస్తారు.  మెయిన్ రోడ్ మీది కారు వాడు మిమ్మల్ని చూస్తూ కోపం గా హారన్ కొడతాడు… మీరు వాడిని లెక్క చేయరు.
కానీ మీరు చేయ వలసిన పని మెయిన్ రోడ్ లో ఉన్నా , పక్క రోడ్ లో ఉన్నా రెండు సందర్భాలలోని పరిస్థితి ని కూడా అర్ధం చేసుకొని ప్రతిస్పందించటం. కానీ అస్థిత్వ వాద కవిత్వం చెప్పే వారు ఈ పని చేయరు. వారి కవిత్వమూ ఆవేశమూ పాటలూ అన్నీ తాము ఎదుటి వారి పరిస్థితి లో ఉంటే ఏమి చేస్తామో అన్న స్పృహ తో ఉండవు. ఇంతకు ముందు ఎదుటి వారి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయా కవిత్వాలు చెప్పిన వారు గొప్ప గా ఏమీ ప్రవర్తించి ఉండరు. ఎదుటి కార్ వాడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా, వాడు చేసిన తప్పులే చేస్తూ వాడిని ఆవేశం గా తిట్టటమూ,తమని సమర్ధించుకోవటమూ ఈ అస్థిత్వ వాద కవులకే చెందింది.  ఆత్మ స్థుతీ..పర నిందా..  తాము మాత్రం పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇచ్చే రక్షణ తో విమర్శలకు అతీతులమనుకొంటూ కాలం గడిపేస్తారు.ఒకడిని తిట్టటం చాలా సులువు..వాడి పరిస్థితి లో మనము ఉంటే బాధ్యత తీసుకొని పని చేయటం చాల కష్టం.. .

********************************

కొందరు ఏదో ఒక వాదాన్ని భుజాన వేసుకొంటారు. భుజాన వేసుకొన్నాక ఆ వాదం వాళ్ళది అవుతుంది. దానితో ఒక వ్యక్తి గత సంబంధం ఏర్పడుతుంది. ఇష్టం ఏర్పడుతుంది. తరువాత ఆ వాదం లో ఉన్న లోపాలు తెలిసి వస్తాయి. కానీ అప్పటికే ఆ వాదం తనది ఐపోయింది. ఆ బంధాన్ని తెంపుకోవటం కష్టమౌతుంది. ఆ వాదం సహాయం తో లోకం లో పేరు ప్రతిష్టలు వచ్చేశాయి. ఇప్పుడు దానిని దింపుకోవటం కష్టమౌతుంది.
మరి కొంతమంది వాదం మొదలెట్టిన కొత్తలో నిజాయితీ గా మొదలెడతారు. కానీ వాదం తెచ్చిన పేరు ప్రతిష్టల వలన, అధికారం డబ్బుల వలన వారికి మొదట్లో ఉన్న పరిస్థితి ఉండదు. వారికి ఆ వాదం ఇంకెంత మాత్రం అవసరం లేదు కానీ జనాలను మభ్య పెట్టతం కోసం, స్వార్థం కోసం ఇంక ఆ వాదాన్ని వదల లేరు. వాదాల ముసుగు లో వ్యక్తి గత దాహాలను తీర్చుకొనే వారు ఇంకొందరు. “మీరు లేక పోయినా వాదాల కొచ్చిన ఇబ్బంది ఏమె లేదు కదా, మీరు తప్పుకోండి”, అని వీరిని అడగండి, వీరి బండారం బయట పడుతుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

50 thoughts on “అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన చిక్కులూ, మనిషి బుర్ర పరిమితులూ…”

 1. ఎనాలిసిస్ బాగుంది. X.,Y గ్రూప్స్ లో చివరికి గుర్తు పెట్టుకునేది నష్టము కారణంగా , మంచి చేద్దామనుకునే వారు కూడా ఉదాసీనంగా ఉంటారు(చెడ్డ తనము, మంచితనము రెండూ లేకుండా). దానితో ఇంకా నష్ట పోయేది నష్ట పోయా మానుకునే X వర్గమే. (X కి మంచి చేద్దామనుకునే Y లో వాళ్ళు చెయ్య కుండా ఉన్నారు.) అలా ఇరు వర్గాలలో ద్వేషము పెరుగుట తప్ప తగ్గదు.అది జరుగుతున్న సంగతి. చెడ్డ తనమునే గుర్తించటం మూలాన జరిగేది నష్టము అని తెలుస్తోంది కదా. ఏమి చేస్తే బాగు పడుతుంది ?.
  నా ఉద్దేశం లో కక్షలు పోవాలంటే ఒకటే మార్గము రెండు వర్గాల వారూ ఎదుటి వర్గము లోని మంచి తనమును గుర్తించటం.
  రూట్ కాజు ని పట్టారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

  మెచ్చుకోండి

 2. స్త్రీ,దళిత,ప్రాంతీయ వాదాలలో అన్యాయం జరిగిందనే “అపోహ” లేదు. అన్యాయం చెయ్యబడ్డామనే స్పృహ ఉంది. దానికి empirical deviance ఉంది.

  ఈ ఉద్యమాలలో ద్వేషంకన్నా, సమానత్వకాంక్ష ఉంది. కానీ ఆ సమానత్వం వస్తే ఎక్కడ ఆధిపత్యం చేజారిపోతుందో అనే పురుష,అగ్రకుల,వలసవాద కుట్రలు ఈ ఉద్యమాల్ని ద్వేషపూరితం చేస్తున్నాయి. మార్పుని ఆధిపత్యం అంత సులభంగా అంగీకరించదు. అందుకే ఈ violence. దానికి counter violence ఆ మార్పుకోసం జరిగే పోరాటంలో భాగమే.

  సామాజిక ఉద్యమాలు mathematical calculations కావు. అవి మానవసంబంధాలంత సంక్లిష్టం.

  మెచ్చుకోండి

 3. x ని ‘y ‘, y ని x ద్వేషిస్తున్నారని రకరకాల లెక్కల్లో గందరగోళ పెట్టేసి మొత్తానికి
  మానవ సమాజాన్నే ద్వేషిస్తోంది మీ టపా .ఎందుకంటే సమాజంలో ప్రతి వర్గం
  తమదైన సమస్యలని కలిగి వుంటుంది.సమస్యలున్న చోట సంఘర్షణలు
  సహజం.సమస్య మనది కానప్పుడు అందరం శాంతి సూత్రాలు వల్లిస్తాం .
  అస్తిత్వ ఉద్యమాలకీ పరిమితులున్నాయి.కానీ వాటి గురించి మాట్లాడుకోవాల్సింది
  తిరస్కరణ ధోరణిలో కాదు.మానవీయ కోణంలో …మహేష్ గారూ మీరు చెప్పింది
  నిజం.

  మెచ్చుకోండి

  1. “కానీ వాటి గురించి మాట్లాడుకోవాల్సింది
   తిరస్కరణ ధోరణిలో కాదు.మానవీయ కోణంలో”

   పరిమితుల ఉంటాయని గుర్తించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను..
   తిరస్కార ధోరణి తో చూడకూడదు. కరక్టే! కానీ నా టపా లో మీకు తిరస్కరణ ధోరణి ఎక్కడ కనపడింది? పరిమితుల గురించి ఈ ఉద్యమ కారుల కి సంబంధించిన వర్గానికి సహజం గానే ఇండల్జన్స్ ఉంటుంది.ఈ పరిమితూలని చూసీ చూడకుండా పోతుంటారు వారు. అదే ఇండల్జన్స్ బయటి వారికి ఉండటం కష్టం…..అదీ, ఈ పరిమితుల వలన ఈ బయటి వారు నష్టపోతున్నప్పుడు.

   మెచ్చుకోండి

 4. మీ analysis ను ఇంకాస్త extend చేద్దాం. ఈ x,y ల మధ్య ఘర్షణను z అనేవాడు గమనించాడు. వీడు మహా తెలివైన వాడు, గుళ్ళో లింగాన్ని మింగేరకం. వీడికి చాలా సులభంగా వీరిద్దరి మధ్య గొడవను “తన స్వార్థం” కోసం ఎలా వాడుకోవచ్చో తెలిసిపోయింది. ఈ తారతమ్యాల పచ్చగడ్డికి కాస్త నిప్పు సోకించాడు.

  బుద్ధిహీనులైన x,y లకు ఈ విషయం తెలీలేదు. x వర్గంలో కొందరికిది చూచాయగా తెలిసినా, వారి మాట చెల్లదు. చెడు వ్యాపించినంత త్వరగా మంచి వ్యాపించదు కదా.

  నిజానికి ఏ సమాజంలో దోపిడీ అనేది నిరంతరాయంగా సాగదు. ఎందుకంటే, టోకున సమాజం మొత్తం దోపిడీ వల్ల నష్టపోతుంది కాబట్టి. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. దోపిడీ నిరంతరంగా సాగుతోంది, ఫలానా వర్గంలో అందరూ మమ్మల్ని దోచుకుని బలిశారు (బలుస్తూనే ఉన్నారు), ఇది ఆగకుండా వేలయేళ్ళ కొద్దీ సాగుతోంది, ఆగే అవకాశమే లేదు అని ఇంకోవర్గం “భావిస్తే” అది అవగాహనలో లోపం అయే అవకాశం కూడా తోచిపుచ్చతగింది కాదు.

  z దగ్గరకొద్దాం. వీడు x,y లనిద్దరినీ ఎగదోసి, వారిద్దరినీ దోచుకున్న తర్వాత, ఓ అందమైన వాదం చెబుతాడు. “It’s a just right for stronger to exploit the weaker” అని. కిం కర్తవ్యం? z ను, వాడి వంచననూ సరిగ్గా అర్థం చేసుకుని, వాడికి సంబంధించిన ఛాయలనన్నిటినీ తొలగించుకోవడమా, లేక x వర్గం పైన ఉద్యమాన్ని (ఉద్యమం పేరుతో ద్వేషాన్ని) కొనసాగిస్తూనే ఉండడమా?

  z బదులుగా బ్రిటీషు వాడిని ఊహించుకోండి. పైన వాక్యం will durant – The case for India నుండీ గ్రహించింది. అది బ్రిటిష్ వారి వాదనే.

  మెచ్చుకోండి

  1. XYZ ల గాలిమాటలు పక్కనబెట్టి కొంత క్లియర్గా మాట్లాడుకుందాం!

   దళితులు అగ్రకులాలు మమ్మల్ని దోపిడి చేశాయి, చేస్తున్నాయి అంటారు.
   స్త్రీవాదులు పురుషభావజాలం మమ్మల్ని దోపిడి చేసింది, చేస్తుంది అంటారు.

   మీ వాదన ప్రకారం “ఏ సమాజంలో దోపిడీ అనేది నిరంతరాయంగా సాగదు”. మరి దీనికి ఆది అంతాలు ఎక్కడో కాస్త చెబుతారా?
   దోపిడి ప్రస్తుతం లేదంటారా లేక రేపోమాపో అది అంతమైపోతుందని mathematical గా నిరూపిస్తారా?

   ఇక్కడ XY లమధ్య Z లేకపోయినా వివక్ష ఉంది. దోపిడి ఉంది. ఆభిజాత్యం ఉంది. హింస ఉంది. దానికి ముందు సమాధానం కావాలి. అది అర్థం చేసుకుని రాజీపడితే వస్తుందా, పోరాటానికి ఉద్యమిస్తే వస్తుందా అనేది చరిత్ర నిరూపించిన సత్యం. అందుకే ఈ ఉద్యమాలు. ఆ ఉద్యమాల ఆరంభమే అర్థం చేసుకోవడం. కాబట్టి అపోహలకు ఆస్కారం తక్కువ.

   మెచ్చుకోండి

   1. I completely agree with mahesh. Z సంగతి పక్కనబెడితే, X, Y ల మధ్యే ఆధిపత్యం, అసమానత్వం రాజ్యమేలుతున్నాప్పుడు Z వర్గం వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మనకు ఉన్న ప్రాధమిక సమస్య X, Y ల మధ్య వచ్చినదే. ఉద్యమమే దానికి పరిష్కారం.

    మెచ్చుకోండి

   2. మీ వాదనలన్నీ ఈ X Y Z పరిధిలోకే వస్తున్నప్పుడు వీటిని గాలి మాటలని ఏలా అనగలరు. మీరు ఈ ఉదాహరణ ను అర్ధం చేసుకొని, మీ వాదనల లో దీనికి అతీతం గా ఏమైనా ఉంటే చెప్పండి.
    దోపిడీ గురించిన మీ ప్రశ్న కి రవి గారే సమాధానం చెప్పాలి.

    మెచ్చుకోండి

   3. @మహేష్ గారు : నేను క్లియర్గానే చెప్పాను. ఈ టపా రచయితకూ అర్థమయింది.

    “దళితులు అగ్రకులాలు మమ్మల్ని దోపిడి చేశాయి, చేస్తున్నాయి” – మీరనే అగ్రకులాలేవో, వాటి structure, developments ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. అయితే so called అగ్రకులాలలో, నగరాలకూ, పట్టణాలకూ, జనపదాలకూ దూరంగా అడవులలో పళ్ళూ, దుంపలు తింటూ, నిస్వార్థంగా విద్యాదానం చేసిన వర్గీయులున్నారు. ఇతర మతస్తులను మొట్టమొదటి సారి తమ పాఠశాలలో చేర్చుకుని, ఆ పాఠశాలను విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్ళిన మహానుభావులున్నారు. స్త్రీ జనోద్ధరణ కోసం పాటుపడ్డ మహనీయులున్నారు.

    ఈ టపా రచయిత చెప్పినట్టు – ఒకవర్గం లో మంచివాళ్ళున్నప్పటికీ, ఆ వర్గాన్ని మొత్తం ఒకే గాటన కట్టటం, తద్వారా ద్వేషభావనకు బీజం పడటం ఈ టపాకు సంబంధించి ప్రధాన అంశం. మీ వ్యాఖ్య మళ్ళీ ఇక్కడ,

    “దళితులు అగ్రకులాలు మమ్మల్ని దోపిడి చేశాయి, చేస్తున్నాయి అంటున్నారు”

    ఇక పైన ’z’ సమస్యే కాదని ఒకరన్నారు. ఖచ్చితంగా z సమస్యే. ఎందుకంటే, ఈ మధ్య z వాడిన పద్ధతినే మరో వర్గం (ఒమెగా అందామా) వాడుతోంది. (రాజకీయనాయకులు). x,y, ల మధ్యలో చిచ్చు పెట్టేది ఈ తురీయ వర్గాలే. వీరిని అర్థం చేసుకోవలసిన అవసరం తప్పక ఉంది. లేకపోతే, ఏదీ మారదు. (ఈ మధ్య వస్తున్న ఉద్యమాల గురించి ఆలోచిస్తే తేలిగ్గా అర్థమయే అవకాశం లేకపోలేదు)

    మెచ్చుకోండి

 5. X, Y లు పెట్టి చాలా సింపుల్ గా తేల్చిపారేసారు విషయాన్ని. ఒక వర్గంలో మంచిని ఇంకో వర్గం వారు చూడాలి అంటున్నారు. కానీ మంచి, చెడులను బేరీజు వేసినప్పుడు మంచి కన్న చెడు ఎక్కువగా కనిపిస్తుంటే మంచిని ఎలా అర్థం చేసుకోగలం?

  ఆధిపత్యం అనే మానవసహజ ధోరణి ఉన్నంతవరకు వర్గాల మధ్య విభేదాలు వస్తూనే ఉంతాయి. ఆధిపత్యం నుండి సమానత్వం దిశలో నడవాలంటే మంచిని అర్థంచేసుకోవడమొక్కటే సరిపోదు. మనిషితనం, మానవత్వం నేర్చుకోవాలి. తను ఎలాగో, పక్కవాళ్ళు అలాగే నే స్ఫురణ రావాలి. మహేష్ గారన్నాట్టు “సామాజిక ఉద్యమాలు మానవ సంభందాలంత క్లిష్టం”….అవి లెక్కల్లో తేలేవి కాదు.

  నాకు ఇప్పుడు గోదావరి సినిమాలో డైలాగు గుర్తు వస్తోంది…..”రుజువులు చూపించడానికి అవి మేత్స్ లు, సైన్సులు కావు బాబూ మనసులు”.

  మెచ్చుకోండి

  1. “కానీ మంచి, చెడులను బేరీజు వేసినప్పుడు మంచి కన్న చెడు ఎక్కువగా కనిపిస్తుంటే మంచిని ఎలా అర్థం చేసుకోగలం?”

   ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు…కానీ అర్ధం చేసుకోవాలి. దాని వలన సమాజానికి మంచి జరుతుంది.

   మెచ్చుకోండి

 6. @కత్తి మహేష్ కుమార్ :మార్పుని ఆధిపత్యం అంత సులభంగా అంగీకరించదు.
  కరక్టే. కాక పోతే నేను చెప్పేదేమంటే అది మానవ సహజం. మీకు ఉన్న దాన్ని (దాన్ని మీరు ఎలా సంపాదించినా సరే) ఎవరో ఊడలాక్కుంటానంటే మీరు ఊరుకుంటారా? ఒక ఎడిటర్ ఆధిపత్యం గురించి పేద్ద ఎడిటోరియల్ రాయవచ్చు. అతని కింద పని చేసే జర్నలిస్ట్ అతనిని విమర్శిస్తే ఊరుకుంటాడా. తన దాకా వస్తే గానీ తెలియదు కదా? మీ తాత తన తాత ని ఎక్స్ ప్లాయిట్ చేశాడని మీ పక్కింటి వాడు మీ ఇంటిని లాక్కుంటే మీరు చూస్తూ ఊరుకొంటారా?
  “సామాజిక ఉద్యమాలు మాథమెటికల్ కాలిక్యులేషన్స్ కావు” ఇదీ కరక్టే. దీనిలో మాథమెటిక్స్ ఏమీ లేదు.ఇదే విషయాన్ని నేను X, Y లు ఉపయోగించకుండా చెప్పవలసింది. కానీ నా బధ్ధకం కారణం గా త్వరగా అవ్వగొడదామని అలా చెప్పాను.

  @ జజిమల్లి: X ని ‘Y ‘, Y ని X ద్వేషిస్తున్నారని రకరకాల లెక్కల్లో గందరగోళ పెట్టేసి మొత్తానికి మానవ సమాజాన్నే ద్వేషిస్తోంది మీ టపా .
  గందరగోళ పెడుతునదనే భయపడ్డాను. అనుకున్నదంతా అయ్యిందన్న మాట. మానవ సమాజాన్ని ద్వేషించటం అనేది మీ గందర గోళం లోంచీ వచ్చిందనుకొంటా. నేను చెప్పిన దాంట్లో ద్వేషం ఎక్కడా లేదు.నేను చెప్పేదేమంటే మానవ సమాజానికి(మనందరికీ) కొన్ని పరిమితులున్నాయని. ఈ పరిమితులకు పరిష్కారం నాకు తెలియదు.
  @మాయాశశిరేఖ:
  “తను ఎలాగో, పక్కవాళ్ళు అలాగే నే స్ఫురణ రావాలి”
  నేను చెప్పేదీ అదే కదా? కాక పోతే ఇరువైపుల నుంచీ ఆ ప్రయత్నం ఉండాలి అంటున్నాను.
  మిరియప్పొడి :,కృష్ణ:,రావ్ ఎస్ లక్కిరాజు:ధన్య వాదాలండీ!

  రవి: మీరు ఎక్స్ టెండ్ చేసి చెప్పింది చాలా కరెక్ట్ అండీ..

  మెచ్చుకోండి

  1. ఆధిపత్యం మానవనైజం అని జస్టిఫై చెయ్యడం వల్లనే కుల,లింగ పోరాటాల తీవ్రత సమాజంలో ఇంతగా పెరిగింది. మీరిచ్చిన ఉదాహరణ ఎంత పేలవంగా ఉందో మీరే గుర్తించండి. ఉద్యోగ బాధ్యత, అధికారాలకూ సామాజిక ఆధిపత్యానికీ పొంతనా!

   ఏది సహజం???
   అగ్రకులాలు అధిపతులుగా చలామణీ అవడమా!
   పురుషులు స్త్రీలను అణగద్రొక్కి ఇదే కరెక్ట్ అనడమా!

   ఇక్కడెవరూ తాత ఎక్స్ ప్లాయిట్ చేశాడని మనవడి ఆస్తి లాక్కోవడం లేదు. మమ్మల్ని కొల్లగొట్టి ఇల్లు కట్టుకునే తాతవిధానాలు మనవడూ కొనసాగిస్తున్నాడు, అది అన్యాయం అని పోరాడుతున్నారు. Try to understand the difference.

   మెచ్చుకోండి

   1. “ఉద్యోగ బాధ్యత, అధికారాలకూ సామాజిక ఆధిపత్యానికీ పొంతనా!”

    ఇప్పటి దళితులపై వివక్షకు మూలాలు “భూస్వాముల కీ కూలీలకీ మధ్య ఉన్న ఉద్యోగ సంబంధాల” లో కూడా ఉన్నాయి. కాబట్టీ ఉద్యోగ అధికారాలే కాల క్రమంలో ఆధిపత్యం గా రూపాంతరం చెందుతాయి.

    మెచ్చుకోండి

 7. @రవి: ఈ సమస్య వ్యక్తులది కాదు. సమాజంలోని భావజాలానిది.

  అగ్రకులాల్లో ఎందరో దళితసమస్యపై పోరాడుతున్నంతమాత్రానా, పురుషుల్లో కొందరు స్త్రీవాదులు ఉన్నంతమాత్రానా పురుషస్వామ్యమనే భావజాలం, కులవివక్ష అనే వికృత సామాజిక రూపం fundamentalగా మారవు. ఆ భావజాలాన్ని ప్రతిఘటించే ప్రతిసారీ, స్టార్ మార్క్ పెట్టి “conditions apply” అనే గమనిక వేస్తూ చర్చించాలి అంటే కుదరదు.

  దళితులూ, స్త్రీవాదులూ తమ పోరాటాలతో ద్వేషభావాన్ని నింపుతున్నాయనే మీ అపోహ అవగాహనలేని ఆభిజాత్యం మాత్రమే. Fight for existence and human rights can never propagate hatred.

  నిజంగా దళితులు తమ పోరాట క్రమంలో ద్వేషాన్ని నూరిపోసుంటే, హింసనే ఆయుధంగా మలుచుకొనుంటే ఈ పాటికి భారతదేశం గృహయుద్దంలో ఉండేది. స్త్రీవాదులు ఆ పనిచేసుంటే, ప్రతి ఇల్లూ ఒక అగ్నిగుండమయ్యుండేది.

  మెచ్చుకోండి

  1. “conditions apply” అనే గమనిక వేస్తూ చర్చించాలి అంటే కుదరదు.”

   ఇప్పుడు మీరు పాయింట్ కి వచ్చారు. అలా కుదరక పోవటం వలన నష్టాలున్నాయి(మనందరికీ, సమాజానికి) అని నేను అంటున్నాను. ఇది మనిషి కి ఉన్న ఒక లిమిటేషన్ అని చెప్తున్నాను.

   “అవగాహనలేని ఆభిజాత్యం మాత్రమే”…అవగాహన లేక పోవటాన్ని అర్ధం చేసుకోగలను..హఠాత్తు గా అభిజాత్యం ఎక్కడి నుంచీ ఊడిపడింది? ప్రస్థుత సందర్భం లో ఇది మీ మనసు లో మాత్రమే ఉన్న ఒక ఊహ.

   మెచ్చుకోండి

   1. @బొందలపాటి: ఆధిపత్యం సహజం అనుకోవడం ఒక prejudice. అస్థిత్వ ఉద్యమాలు ద్వేషాన్ని “మాత్రమే” నూరిపోస్తాయి అనుకోవడం మరో prejudice. దళితులు అగ్రకులాల అందరినీ, స్త్రీవాదులు పురుషుల్నందరినీ చెడ్డవాళ్ళంటారనుకోవడం ఇంకో prejudice. “వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం” అన్నది అవగాహనారాహిత్యంతో కూడిన అతిపెద్ద prejudice. ఇన్ని ఆభిజాత్యాలుండగా, అదెక్కడ్నుంచీ వచ్చింది అంటే ఎట్లా చెప్పేది?

    మెచ్చుకోండి

    1. I’ll rather replace the word “prejudice” with “lack of understanding”
     “వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం” ఉద్యమాల ప్రాక్టికల్ లెవల్ కి వచ్చేసరికి ఇంతకంటే సత్యం లేదు. ఎవరో మీ లాంటి మేధావులు దీనికి అతీతమేమో!

     మెచ్చుకోండి

  2. @మహేష్: నా వ్యాఖ్యలు ఈ టపా పరిధికి చెందినవి మాత్రమేనని మీరు గుర్తించాలి. భావజాలాలు, ఉద్యమాలు, వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి చర్చించే ఆసక్తి నాకు లేదు.

   “….ప్రతిఘటించే ప్రతిసారీ, స్టార్ మార్క్ పెట్టి “conditions apply” అనే గమనిక వేస్తూ చర్చించాలి అంటే కుదరదు.” – అంటే అందరినీ ఒకే గాటన కట్టటం పెద్ద తప్పేమీ కాదని మీ అభిప్రాయం కామోసు. సరే, మీ అభిప్రాయం అలానే ఉంచుకోండి. (ముసల్మానులను, వారి దౌష్ట్యాలనూ, దేశద్రోహాన్ని, ప్రశ్నించి ప్రతిఘటించే ప్రతిసారి, వారిని అర్థం చేసుకోవాలని, వారిని ఒకే గాటన కట్టకూడదని, conditions apply అని ఎవరు ఎందుకు అంటారో మీకే తెలియాలి)

   “దళితులూ, స్త్రీవాదులూ తమ పోరాటాలతో ద్వేషభావాన్ని నింపుతున్నాయనే మీ అపోహ అవగాహనలేని ఆభిజాత్యం మాత్రమే.”

   మీరు నా ఆలోచనల్లో inference తప్పుగా గుర్తించారని చెప్పడానికి చింతిస్తున్నాను. వర్గంలో అందరినీ ఒకే గాటన కట్టటం వల్ల ద్వేష భావన జనిస్తుందని ఈ టపా రచయిత సూచించారు. నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. నింపటం, అపోహ, అభిజాత్యాలు – ఇవన్నీ నా వ్యాఖ్యల context లో లేవని గుర్తించాలి.

   మీ చివరి పేరాగ్రాఫ్ గురించి చెప్పడానికేమీ లేదు.

   మెచ్చుకోండి

   1. అస్థిత్వవాదానికీ మతవాదానికీ తేడా తెలీకుండా పోలికలుపెట్టి వాదన చేస్తానంటే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. రెంటిపైనా కొంత అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడైనా కొన్ని అపోహలు తొలగుతాయేమో!

    మెచ్చుకోండి

    1. మహేష్,
     ముస్లింలు దళిత-బహుజన వాదం లో ఒక భాగం కాదా? ఒక వేల వారు భాగం ఐనా కాక పోయినా నా టపా కీ మీరు చెప్పిన తేడా కీ సంబంధం లేదు. ఏ వాదం తెలిసినా తెలియక పోయినా వదనలు ఇంగితానికి వ్యతిరేకం గా ఉండకుంటే చాలు….ఇంతకీ ఆ తేడా ఏమిటో కొంచెం ఓ టపా వేస్తారా?

     మెచ్చుకోండి

 8. శాంతి కోసం మనిషి ఎప్పుడూ ఎదుటి వాడినీ లేక ఎదుటి వర్గాన్ని మారమంటాడు. కానీ సమస్య తనలోనే ఉందని గుర్తించడు.
  ఈ వాక్యాలు మీరు వర్గ సమస్యల పట్ల వాటి మూలాల పట్ల అవగాహనతో కాకుండా అన్ని వర్గాల సమస్యలు ఒకటే
  అనుకోవడం మూలంగానే రాయగలిగారు.అస్తిత్వ ఉద్యమాలు ఎక్కడా మొదలయ్యాయో ఆ ప్రాతిపదికనే వ్యతిరేకించే వాక్యం
  పైన మీరు రాసింది ….

  మెచ్చుకోండి

  1. శాంతి కోసమైతే అగ్రకులాలవాళ్ళే మారాలి కదా. శాంతి పేరుతో దళితులు అగ్రకులాల క్రింద పాలేర్లు (కంబార్లు)గా బతకడం అవసరమా?

   మెచ్చుకోండి

 9. @మహేష్: ఇందాక “భావజాల” సమస్య, అస్తిత్వ వాదం, మతవాదం భేద ఆధారిత అవగాహనాలోపంగా రూపుదాల్చిందన్నమాట. సరే.

  నా వైపు నుంచీ మీకే సలహాలు/సూచనలు లేవు. స్వస్తి.

  మెచ్చుకోండి

 10. @రవి: ముస్లింలు దేశద్రోహులు అనడానికీ, అగ్రకులాలు దళితుల్ని వివక్షకు గురిచేశాయి అనడానికీ చాలా తేడా ఉంది. ఒకటి సమూహాన్ని దోషులుగా నిందించేది. మరొకటి సామాజిక సమస్యను గుర్తుచేసేది. ఒకటి అభియోగం. మరొకటి భావజాలం. వీటిని interchangeable వాదనలుగా వాడి నన్ను ప్రశ్నించడం నిర్హేతుకం.

  @బొందలపాటి: నా సమాధానం నా మీద రవి మోపిన ముస్లిం అనుకూల వాదన గురించి. మీ ప్రశ్నకు కాదు. ఇంగితం తెలుసుకోవడం ద్వారా వస్తుంది. అస్తిత్వవాదాల అవిర్భావాలూ,మూలాలు తెలీకుండా మీరు ఇంగితాన్ని ప్రదర్శిస్తానంటే, వాటిని తెలియజెప్పడానికి టైమున్నప్పుడు నాలాంటివాడు రాకతప్పదు.

  మెచ్చుకోండి

  1. ఒకటి ముస్లిం ల పై టోకుగా నెగటివ్ గా ఉన్న అభియోగం, రెండోది అగ్రవర్ణాల పై టొకుగా నెగటివ్ గా ఉన్న భావజాలం. నా పోస్ట్ ఆ టోకు గా ఉన్న నెగటివిటీ గురించే గానీ వెరే కాదు..క్లారిఫికేషన్ కు థాంక్స్.

   మెచ్చుకోండి

 11. చర్చ చాలా బాగుంది.ఒక వర్గం లో చెడు చేసె వారి వలన మంచి చేసె వారు కూడా అవతలి వర్గం వారి దృష్టిలోon larger point of view చెడ్డవారు అయ్యిపోతారు అన్నది రచయత ఉద్దేశ్యం.నేను మీతో పూర్తిగా ఈ విషయంలో ఏకీభవిస్తున్నాను బొందలపాటి గారు!వ్యక్తిగతం గా ఎదుటి వారిని ఇష్టపడ్డ,(వారి మంచితనం వలన)వారి వర్గ విషయంకి వచ్చినప్పుడు అందరిని కలిపిగట్టి వ్యతిరేకించడం వలన వారిని కూడా మనం దూరం చేసుకుంటాము. దీని వలన మన ఉద్యమానికి నష్టం లేక పోయినా మనకి వ్యక్తిగతంగా నష్టమే!అందుకే వర్గ భావన వదులుకోవడమే సరైన పరిష్కారం!ఒక వర్గం మనలని అణిచివేస్తుందని మనం కూడా వారిని అణిచివేద్దామని(మనకు అవకాశం దొరికినప్పుడు) అది ఎప్పటికి తెగని విషయం అయ్యిపోతుంది.ఒక వర్గం వారు మన మీద బాంబులు వేసారని మనం వారి పై బాంబులు వేస్తె వాళ్లు భయపడి ఆగిపోతారా? ప్రతి వర్గం లో మరో చిన్న వర్గం.దానికి ప్రత్యర్ధి వర్గం మరొకటి.ఏ వర్గపు వాదన పూర్తిగా కరెక్ట్ కాదని రచయత ఉద్దేశ్యం!మన తప్పులు మనం వ్యక్తిగత స్థాయిలో మార్చుకుంటూ వర్గ భావాలని వదిలించుకోవాలి.
  వర్గమే కట్టక తప్పని పరిస్థితిలో అతి పెద్ద వర్గం కడదాము. అది “మానవత్వం”

  మెచ్చుకోండి

  1. థాంక్స్ కృష్ణ గారు.
   “మన తప్పులు మనం వ్యక్తిగత స్థాయిలో మార్చుకుంటూ వర్గ భావాలని వదిలించుకోవాలి.”
   ఈ వాక్యం నేను టపా లొ అడిగిన ప్రశ్నల కు సమాధానం ఇస్తుంది. “పలానా వర్గమా? వాళ్ళు అలాంటి వాళ్ళూ…ఇలాంటి వాళ్ళు అన్న నీ జెర్క్ సార్వజనీకరణలను మానుకొంటే మంచిది.”

   మెచ్చుకోండి

 12. @బొందలపాటి: మళ్ళీ మీరు అక్కడికే వచ్చారు. Let me explain it through an example.
  ‘భారతదేశంలో ముస్లిం తీవ్రవాదం పెరుగుతోంది’ అన్నామనుకోండి. అదొక trend analysis. ఒక నిజం. ‘అగ్రకులాలు దళితుల్ని వివక్షకు గురిచేశాయి’ అనడం కూడా అంతే. దీంట్లో రీటెయిల్, హోల్సేల్ సమస్యలు లేవు.

  మెచ్చుకోండి

  1. మహేష్,
   ఇద్దరమూ ఒకే అభిప్రాయం చెప్తున్నామనుకొంటా…
   ‘భారతదేశంలో ముస్లిం తీవ్రవాదం పెరుగుతోంది’
   ‘అగ్రకులాలు దళితుల్ని వివక్షకు గురిచేశాయి’
   పై రెండిటికీ నేను అంగీకరిస్తాను.

   అదే..
   “భారత దేశం లో ముస్లింలంతా టెర్రరిస్టులు”
   “అగ్రకులాలా…వాళ్ళంతా కులతత్వ వాదులు”
   పై దానికి నేను అంగీకరించను.

   మెచ్చుకోండి

 13. @మహేష్:

  1. అగ్రకులాల్లో “కొన్ని కులాలు/కొందరు” దళితుల మీద వివక్ష చూపారు. (కొన్ని కులాలు/కొందరు – condition should not apply. All are culprits only)

  2. ముసల్మానులలో “అనేకులు” ఇతరులపై దౌష్ట్యాలు, దౌర్జన్యాలు చేశారు. (అనేకులు, అంటే కొందరు మంచివారు.so, conditions should apply, let’s give lenience)

  ఈ టపా సారాంశం – “x, y ల మధ్య భేదాలున్నాయి. y వర్గం/సమూహం వారు x లో అందరినీ ఒకే గాటన కట్టడం పద్ధతి కాదు”. ఈ టపా పరిధిలో మొదటి వాక్యానికి, రెండవ వాక్యానికి తేడాలెందుకొస్తాయో, చెప్పగలిగితే,చెప్పదలిస్తే సూటిగా చెప్పండి.

  అభిజాత్యాలు, అస్తిత్వాలు, మతం, భావజాలం – ఇవన్నిటి గురించి నా వ్యాఖ్యలు ఉటంకించబడలేదు. నాకా ఆసక్తీ లేదు. (ముసల్మానులు అంటే – వర్గం అనే అర్థంలో మాత్రమే వాడడం జరిగింది. వారి మతం గురించి, హిందూ మతం గురించి, వాటిపై నా అభిప్రాయాలు, అపోహలు ఇక్కడ అనవసరం)

  @బొందలపాటి గారు: మీ టపా బావుంది. మీకు ఈ విషయంలో ఆసక్తి ఉంటే, వీలయితే భారతదేశంలో “కుల వ్యవస్థ” (వివక్ష కాదు) గురించి, బ్రిటీషు వారి interpretations గురించి వీలయినంత 1st hand info చదువడానికి ప్రయత్నించగలరు. అనవసరంగా ఈ వ్యాఖ్యాజాలం నా కారణంగా ఇలా పెరగటం జరిగింది. ఈ టపాకిదే ఆఖరు వ్యాఖ్య.

  మెచ్చుకోండి

    1. లేదు లేదు…అతను “ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ” లో కథానాయకులుం గారు.భార్య సరళ తో విడాకులు తీసుకొని అలా ఒంటరిగా వ్యాహ్యాళి కి బయలు దేరాడు.

     మెచ్చుకోండి

 14. బొందలపాటి గారు మీ అనాలిసిస్ చాల బాగుంది అలాగే రవి గారి వాక్యలు కూడా ! నేను మీతో పూర్తిగా ఈ విషయంలో ఏకీభవిస్తున్నాను .

  మెచ్చుకోండి

 15. సూక్ష్మం గా చెప్పాలంటే X, Y సెట్స్(వర్గాలు) రెండూ Joint అయి Union అవ్వాలంటే X, Y సెట్స్ లోని మంచితనం అనబడే sub sets ని రెంటిని పెద్దవి చెయ్యాలి. లేక పోతే X, Y సెట్స్ లోని చెడ్డ తనము అనబడే sub sets ని పెద్దవి చేసుకుంటూ పోతే ఎన్నేళ్ళయినా disjoint గానే ఉండిపోతయ్యి.

  మెచ్చుకోండి

  1. అవునండీ…అమెరికా లో నల్ల జాతీయులవిషయం లో..జరిగినదేదో జరిగింది…”లెట్స్ మూవ్ అహెడ్” అనే స్పూర్తి తో సాగి పోయి ఆ సమస్య ను చాలా వరకూ అధిగమించారనిపిస్తుంది. గతం లో జరిగిన చెడు ని వదిలేసి,ఇరు వర్గాలూ పరస్పరం ఏమి మంచి చేయగలం అని ఆలోచించటం మంచిది.

   మెచ్చుకోండి

    1. సరేనండీ మహేష్, నేను నేర్చుకోవటానికి ఎప్పుడూ సిధ్ధం.అమెరికా లో నల్లజాతీయుల స్థితి గతుల గురించి నాకు సమగ్రమైన అవగాహన లేదు. అందుకె నేను “….అనిపిస్తుంది” అని అన్నాను. అది నా ఇంప్రెషన్ మాత్రమే. దీనిలో ఏమైనా వాస్తవ విరుధ్ధమైనది ఉంటే చెప్తారని (లక్క రాజు గారు కానీ, మీరు కానీ, ఎవరైనా)అలా అన్నాను.మీకు తెలిస్తే చెప్పండి తెలుసుకొంటాను.

     ఇక పోతే అమెరికా లోని ఉద్యమాల గురించి మీరు ఆల్రెడీ సర్వం నేర్చేసుకున్నారా? లేక నేర్చుకోవలసిన అవసరం లేదా?

     ఈ “మీరు” వదిలి “మనం” మొదలవ్వక పోతే ఇండియా కి మోక్షం లేదు…మళ్ళీ మీరు అమెరికా లోని ఆత్మ గౌరవ ఉద్యమాల గురించి మీకు ఏమి తెలుసు? అక్కడ ఏ ఏ వాదులున్నారు అంటే నేను చెప్పేదేమీ లేదు…
     నాకు ఒక విషయం మాత్రం తెలుసు, నల్ల జాతీయుల ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు కూడా మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా జాతీయ వాదానికే కట్టుబడి ఉన్నాడు..

     మెచ్చుకోండి

 16. *సామాజిక ఉద్యమాలు మథెమతిచల్ చల్చులతిఒన్స్ కావు. అవి మానవసంబంధాలంత సంక్లిష్టం.*
  *మహేష్ గారన్నాట్టు “సామాజిక ఉద్యమాలు మానవ సంభందాలంత క్లిష్టం”….అవి లెక్కల్లో తేలేవి కాదు.రుజువులు చూపించడానికి అవి మేత్స్ లు, సైన్సులు కావు బాబూ మనసులు.*

  సామజిక ఉద్యమం గా ప్రారంభమైన కొన్ని ఉద్యమాలు అధికారం సంపాదించటానికి సర్వ శక్తులతో పోరాడి వారి వ్యతిరేకులను చాలా ఘొరం గా చిత్రికరించాయి. ప్రజాస్వామ్యం లో మరి అధికారం అనేది అంకేల మీద ఆధార పడుతుంది కదా. కచ్చితం గా ఈ రోజులలో సామాజిక ఉద్యమాలు mathematical calculations

  *మనిషితనం, మానవత్వం నేర్చుకోవాలి. *

  సోమక్కా, మనిషితనం, మానవత్వం ఎక్కడ నేర్చుకోవాలి , ఎన్ని రోజులు నేర్చు కోవాలి, ఎవ్వరు నేర్పిస్తారు? ట్యుషన్ ఫీ ఎంత? మనిషి కి ఎంత పది మంది ఈ కోర్సులో చెరితే ఎమైనా కన్సెషన్ ఉందా? అసలికి మీరు మంచి వారని మిమ్మల్ని ఎలా అనుకుంటారు, అది ఇతరులను ఎలా వొప్పిస్తారు ?

  మెచ్చుకోండి

 17. @బొందలపాటి: అమెరికాలో నల్లజాతీయుల స్థితిగతులూ, అస్తిత్వవాదాల గురించి వివరించే టైం ప్రస్తుతానికి లేదు. వీలుచూసుకుని ఒక comparative analysis చేస్తాను. లేదా ఇప్పటికే ‘డర్బన్’ ప్రతిపాదనల ఆధారంగా ఏవైనా దస్తావేజులు లభ్యతలో ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను.

  “నల్ల జాతీయుల ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు కూడా మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా జాతీయ వాదానికే కట్టుబడి ఉన్నాడు..” అన్నారు…దీని అర్థమేమిటో కాస్త వివరిస్తారా?

  ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ అస్తిత్వవాదం భారతజాతీయవాదానికి కట్టుబడిలేదు?

  మెచ్చుకోండి

  1. Thanks Mahesh. అమెరికా లో తెల్ల వాళ్ళూ నల్ల వాళ్ళూ ఎంత కొట్టుకున్నా బయటి దేశాల వాళ్ళ దగ్గరికొచ్చే సరికి వాళ్ళంతా ఏకమౌతారు. ఇక్కడ మనకున్న విభిన్న వాదాలు కూడా ఆ విధం గానే దేశం దగ్గరికి వచ్చే సరికి ఏకమైతే బాగుంటుంది. ఈ వాదాలకి ఇప్పటికే ఆ స్టాండ్ ఉంటే నాకు సంతోషమే… ఇదంతా వేరే టాపిక్ కాబట్టీ ఇక్కడి తో ఆపేస్తున్నాను.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s