కురచదైపోతున్న కాలం

కురచదైపోతున్న కాలం

————————–

నాకు ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్నపుడు, నేను మా చుట్టాల ఊర్లో పెరిగాను. తరువాత మా ఊరు వచ్చేశాను.
నేను పెరిగి డిగ్రీ లోకి వచ్చిన తరువాత దాదాపు పదిహేనేళ్ళ కి మళ్ళీ మా చుట్టాల ఊరుకి వెళ్ళాను.
అక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాను. అక్కడి పెరటి గోడలన్నీ  కురచవైపోయాయి. నా చిన్నప్పుడు దూరం గా ఉన్న ప్రదేశాలు దగ్గరగా జరిగాయి.
ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు విషయం అర్ధమైపోయింది. పెరటి గోడలు పొట్టివవ్వ లేదు, నేనే బారు పెరిగాను. దూరాలు దగ్గరవ్వలేదు నా కాలే బారు సాగింది.
మనపై కాలం కూడా ఇలాంటి కనికట్టునే చేస్తుంది.

నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, మా నాన్న ని దీపావళి కి బారు లాగూ (పాంటు) కొనిపెట్టమని అడిగాను. దానికాయన,”అప్పుడే వీడికి పాంటు కావలసి వచ్చిందంట, వచ్చేదీపావళి కి కొనిపెడతాలేరా!”, అని విసుక్కొన్నాడు.
నేను, “అమ్మో! పాంటు కోసం ఏకం గా సంవత్సరం ఆగాలా నాన్నా?” అన్నాను.
ఆయన, ” సంవత్సరం ఎంత సేపట్లో వస్తుంది. ఇలా చూస్తూ ఉండగానే గిరుక్కున తిరి వస్తుంది”, అన్నారు.
చిన్నప్పుడు ఎంతో బారు గా అనిపించిన సంవత్సరం ఇప్పుడు నాకు కూడా చాలా కురచ అయిపోయింది. ఎందుకంటే, చిన్నపుడు పన్నెండు సంవత్సరాలు ఉన్న నా మనసు ఎత్తు ఇప్పుడు పెరిగి పోయింది. అది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల ఎత్తుకు పెరిగింది. ఈ ఎత్తు ముందు,  సంవత్సరం అనే పెరటి గోడ కుంచించుకొని పిట్టగోడ లా అయిపోయింది.. ఇక నేను యాభై లలోకి అడుగు పెట్టటానికి.నా చిన్నప్పటి లెక్కలో చెబితే…, ఇంకా ఓక సంవత్సరం వ్యవధి కూడా లేదు. త్వరపడాలి లేక పోతే చూస్తూ ఉండగానే వార్ధక్యం లోకి అడుగుపెడతాను.

ప్రకటనలు