నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ

అప్పట్లో న్యాయస్థానం రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షలు విధించింది. గుంటూరు  శేషేంద్ర శర్మ గారు,”భగవద్గీతను ఉటంకిస్తూ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏమీ జరుగదు. రాజీవ్ హంతకులు కూడా భగవంతుని ప్రమేయం తోనే హత్య చేసి ఉంటారు. కాబట్టీ ఆ హత్య లో వారు దోషులు కారు. వారిని శిక్షించ కూడదు.”, అని వాదిస్తూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆయనను చాలా మంది విమర్శించారు.
అప్పట్లో నాకు ఆయన వాదన నిజమే కదా! అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే దానికి కౌంటర్ గా ఇలా వాదించవచ్చు అనిపిస్తుంది. “న్యాయస్థానాలు కూడా భగవంతుడు సృష్టించిన జీవ కోటి నుంచీ పుట్టిన మానవ సమాజం లోనివే. భగవంతుని ఇఛ్ఛానుసారమే ఆ వ్యవస్థ కూడా నేరస్థులను అదుపులో పెట్టటానికి శిక్షలను అమలు చేస్తాయి. కాబట్టీ, ఆశిక్షలు కూడా భగవంతునికి వ్యతిరేకం కాదు.”

భగవంతుని విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం.
న్యాయాన్ని మానవ సమాజం తన దీర్ఘకాలిక మనుగద కోసం, సమాజం లో ఒక క్రమ పధ్ధతీ శాంతీ ఉండటం కోసం ఏర్పాటు చేసుకొంది.  అయితే ఈ న్యాయస్థానాలు నైతికమైన విషయాలలో  తీర్పులు ఇస్తాయి. ఒక సమాజం లో అనేక నీతులు ఉంటాయి.  నీతి ఒక్కోసారి వ్యక్తిగతం గా ఉంటుంది. మనిషి మనిషి కీ మారుతుంటుంది. మరి న్యాయస్థానాలు అమలు పరిచే నీతి ఎవరి నీతి?  అది అధిక సంఖ్యాకుల నీతి. ఒక్కోసారి అది బలవంతుల నీతి. ఒక సమాజం “ఒక్కరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం” నేరం అంటుంది.అదే సమాజం లో పెరిగిన వ్యక్తికి ఈ నియమం తెలుసు కాబట్టీ, అతను ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి దగ్గరగా వచ్చినపుడు, గిల్టీ గా ఫీలవుతాడు.అంటే ఇక్కడ, అతని అంతరాత్మ యొక్క నీతీ, సమాజం నీతీ, న్యాయపరమైన నీతీ ఒక్కటే.తరువాత అతనిని న్యాయస్థానం శిక్షించినా, అది సబబే అని అతనికి అనిపిస్తుంది.

ఇస్లామిక్ దేశాలలో ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం నేరం కాదు. అక్కడ పెరిగిన వ్యక్తి  ముగ్గురిని పెళ్ళి చేసుకొని కూడా గిల్టీ గా ఫీలవడు. అతనిని  అమెరికా చట్టం ప్రకారం శిక్షిస్తే, ఆ చట్టం చేసింది సరి అయినది అని అతను ఫీలవకపోవచ్చు. అలానే, ఆదిమ, పురాణ పురుషులను ఇప్పటి సమాజ, న్యాయ విలువల తో తూచటం సరి కాదు. శ్రీకృష్ణుడు తన అనేక భార్యల గురించి గిల్టీ గా ఫీలవాలనుకోవటం సరి కాదు కదా!
“మనం మన విలువల తోనే అంచనా వేస్తాం! ఇంకెవరి విలువల తోనో మనం ఎలా అంచనా వేస్తాం?”, అని ఎవరైనా అడగవచ్చు.
మన కాలానికీ ఆ కాలానికీ ఉమ్మడిగా కొన్ని సార్వజనీనమైన మానవ విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం వారిని అర్ధం చేసుకోవాలి.తన బాణం వేటుకి ఒంటరైన పక్షిని చూసి బోయవాడైన వాల్మీకి శోకించటం ఇలాంటి సార్వజనీనమైన మానవ విలువే!

 సమాజం లోని కట్టుబాట్లూ విలువలూ తగ్గుతూ ఉంటే జనాలు న్యాయస్థానాల దగ్గరికి పరుగులు తీయటం ఎక్కువౌతుంది. ఇంకా సమాజ విలువలు కొద్దో గొప్పో ఉన్న మన గ్రామాలలో జనాలు కోర్టులకి వెళ్ళటం తక్కువ గా కనపడుతుంది. అలానే మానవీయ విలువలు తగ్గిన సమాజం లో  కట్టుబాట్లు దురాచారాల రూపం లో బిగుసుకొనిపోతాయి. అప్పుడే మానవీయ విలువలు ఉన్న సంఘ సంస్కర్తలు సమాజ నీతిని ఎదిరించైనా ఒక మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. ఈ సంస్కర్తలు చేసే పనులు మొదట సమాజం దృష్టి లో న్యాయ వ్యవస్థ దృష్టిలో నేరాలౌతాయి (రాజా రామ మోహన రాయల వంటి వారు మొదట సమాజం ఆక్షేపణ కు గురైనవారే). కానీ వీరి విలువలు సమాజ, న్యాయ విలువల కన్నా ఉన్నతమైనవి. వారికి తమ మానవ విలువల లో ఉన్న నమ్మకం కూడా అచంచలమైనది.క్రమం గా సమాజమూ, న్యాయమూ తమ తప్పు తెలుసుకొని సంస్కర్తల విలువలను అంగీకరిస్తాయి. తరువాత వీరి విలువలే సమాజ, న్యాయ విలువలు గా మారుతాయి. కాలం చలన శీలమైనది. కాలచక్ర గమనం తో పాటు ఈ సంస్కర్తలు తెచ్చిన విలువలు కూడా బూజుపట్టి ప్రగతి నిరోధకాలై, మళ్ళీ కొత్త విలువలకు వేదిక తయారు చేస్తాయి. ఈ చక్ర భ్రమణం అనంతం.

ఒక్కోసారి మన వ్యక్తి గత విలువలు సమాజ విలువలకి విరుధ్ధం గా ఉండవచ్చు. అప్పుడు మనం సమాజ విలువలను అంగీకరించం. ఆ విలువలను ప్రశ్నిస్తాం. అలా అని మన వ్యక్తిగత విలువలు సమాజ విలువల కంటే ఉన్నతమైనవని చెప్పలేం.  ఈ సందర్భం లో సమాజ విలువలకి వ్యతిరేకం గా ఆలోచించటానికి  మనం గిల్టీ గా ఫీల్ కాము.  చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది. 
మన వ్యక్తి గత విలువలు న్యాయస్థానాల విలువల తో విబేధించినా, మన విలువలు న్యాయస్థానాల విలువల కనా ఉన్నతమైనవి అయినా కూడా చివరికి మనం న్యాయస్థానాల విలువలనే అంగీకరించాలి. లేకపోతే న్యాయస్థానం మనలని శిక్షిస్తుంది. న్యాయస్థానాలు నిరంకుశమైనవి మరి. మనకి “లా” ఏమి చెబుతోందో తెలియక పోయినా, దానిని ఉల్లంఘించినట్లైతే అది మనని శిక్షిస్తుంది. చూడండి న్యాయస్థానాల అన్యాయం!ఈ మాట పై కి అంటే, మళ్ళీ మనని  contempt of court కింద శిక్షిస్తాయి :-(. ఎంచక్కా మన పెజాస్వామ్యం లో రాజకీయ నాయకులనైతే నోరారా తిట్టుకోవచ్చు. అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా కొట్టుకోవచ్చు 🙂 . (మనం వోట్ వేయం. వేసేవాళ్ళు డబ్బు తీసుకొని వేస్తారు. చివరికి తిట్టటానికి మాత్రం రా.నా. లను తిట్టుకోవచ్చు..ఎంచక్కా..)

  కానీ, ప్రతి వాడూ తన సొంత విలువలను ప్రతిపాదిస్తే ఇక న్యాయస్థానాల మాట వినేవాడెవడు? అందుకే న్యాయస్థానాలు నిరంకుశం గా ఉండక తప్పదనుకొంటా! అలానే, న్యాయస్థానాలు “లా” తెలియని వారిని క్షమించేటట్లైతే, నేరస్తులు “లా” తెలిసినా, అది ఏం చెబుతోందో తనకు తెలియదని శిక్ష తప్పించుకొంటారు కదా! అప్పుడు న్యాయవాదులతో పనే ఉండదు.”లా” తెలుసుకోని వారికి శిక్ష నుంచీ exemption ఇస్తే, అందరూ “లా” ని తెలుసుకోకుండా ఉండేందుకు పోటీ పడతారనుకొంటా! 😦

న్యాయ స్థానాల తీర్పులను ఫిర్యాదీలు విమర్శించటం మొదలు పెడితే వాటి తీర్పులను ఎవరూ నమ్మరు. తరువాత వాటి దగ్గరికి న్యాయం కోసం ఎవరూ వెళ్ళరు. న్యాయస్థానాన్ని విమర్శించటం అంటే, న్యాయస్థానం చెప్పే తీర్పుని అంగీకరించకపోవటం. అటువంటి వారు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం తో మొదట న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న ప్రశ్న వస్తుంది. తనకు అనుకూలం గా తీర్పు వస్తేనే తీర్పును అంగీకరిస్తాననటం సరి కాదు. తీర్పు తమకు అనుకూలం గా వచ్చినపుడు కూడా ఆ తీర్పును విమర్శించేవారు ఉండరు కదా? కాబట్టీ న్యాయస్థానాన్ని విమర్శించటానికి ముఖ్య కారణం తీర్పు వలన తమకు వచ్చిన నష్టం అయి ఉంటుంది. న్యాయస్థానం యొక్క పక్షపాతం అయ్యే అవకాశం తక్కువ. న్యాయస్థానాలు అన్నివేళల్లోనూ నిష్పాక్షికం గా వ్యవహరించవనుకోండి. వాటికి ఉండే biases, ప్రలోభాలు వాటికి ఉంటాయి.  అది వేరే విషయం.అప్పుడు పై న్యాయస్థానాలకు అప్పీలు చేసుకొంటూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవచ్చు. కానీ సుప్రీం కోర్ట్ మీద ఎవరికి అప్పీలు చేయాలి?  
క్రిమినల్ కేసుల్లో కేసు ఓడిపోయిన వ్యక్తి యొక్క న్యాయవాది అబధ్ధాలు చెప్పినట్లు కదా!(ఇదే లాజిక్ ప్రకారం  ఎగువ కోర్ట్ లో వేరే గా తీర్పు వస్తే దిగువ కోర్ట్ జడ్జ్ గారు అబధ్ధం ఆడినట్లా? ) మరి ఆ న్యాయవాదిని ఎందుకు న్యాయస్థానం శిక్షించదు? అబధ్ధాలు చెప్పటం అతని “వృత్తి” కాబట్టీ నా? లేక అతను చెప్పిన అబధ్ధాల వల్లే సత్యం వెలుగులోకి వచ్చిందనా? ఒక న్యాయవాదిని జైల్లో  పెడితే, తరువాత ఎవరూ కేసులు వాదించరనా?  

ఇప్పుడు ఊరి నిండా న్యాయవాదులు ఉన్నా వారికి ఫీజు చెల్లించలేని మామూలు జనానికి వారి వలన ఏమి లాభం. కాబట్టీ పరిస్థితి ఇప్పుడు కూడా న్యాయవాదులు లేనట్లు గానే ఉండి. న్యాయ వ్యవస్థ ఖరీదైనదవ్వటం వలన మెజారిటీ జనాలకు అది అందుబాటులో లేదు. అంటే జనసామాన్యానికి అది ఉన్నా లేనట్లే. అది వారి కోసం రూల్స్ పెట్టటం మినహా, వారికి అవసరమైనపుడు అందుబాటు లో ఉండదు.  దాని వలన వారికి మేలు జరుగదు.  డబ్బు ఖర్చు పెట్టగల వారికి మన నత్త నడక న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సమయమూ, ఓపికా ఉండవు.

న్యాయస్థానాలు పిచ్చి వారూ, మానసిక వ్యాధి గ్రస్తులూ చేసిన నేరాలకు వారిని ఎందుకు శిక్షించవు? వారి నేరాల వలన కూడా ఇతరులు ఇబ్బంది పడతారు కదా? న్యాయ స్థానాలు ముందు “నేరం చేసే ఉద్దేశాన్ని(మోటివ్) చూస్తాయి. ఆ ఉద్దేశం ఉన్న వారిని శిక్షించటం ద్వారా ఇక ముందు వారి నేరం చేయాలనే కోరిక ను తగ్గిస్తాయి. అప్పుడప్పుడూ మనిషి నేర ఇఛ్ఛ కు కారణాలూ పరిస్థితులను పరిగణన లోకి తీసుకొంటాయి . కానీ ఈ కారణాలూ పరిస్థితులూన్యాయస్థానాల పరిధిలోనివి కాదు.న్యాయ స్థానాలు ఆ పరిస్థితులను మార్చలేవు. వాటిని గురించిన కొన్ని పరిశీలనలను తమ తీర్పులో పొందుపరచటం మినహా ఏమీ చేయలేవు.  మొత్తానికి మనిషి నేర ఇఛ్ఛకి పరిస్థితులు కారణం అయినా, లేక దేవుడు ప్రసాదించిన స్వేఛ్ఛా సంకల్పం( ఫ్రీ విల్) కారణం అయినా, లేక పరోక్షం గా దేవుడే కారణం అయినా న్యాయస్థానాలు  నేరం చేసే ఉద్దేశం నిరూపించబడినపుడు అసలే శిక్ష వేయకుండా ఉండవు. ఇది మామూలు వ్యక్తుల విషయం.
ఇక పిచ్చివాళ్ళ, మానసిక వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే,..వారి ఉద్దేశాలకీ, వారి వ్యక్తిత్వానికీ మధ్య సంబంధం అసాధారణం గా, అస్పష్టం గా ఉంటుంది.  ఉదాహరణకి obsessive compulsive disorder ఉన్నవాళ్ళు సరిగ్గా తమ కోరిక కి విరుధ్ధం గా ప్రవర్తిస్తారు. వారికి అలా ప్రవర్తించే విషయం లో స్వేఛ్ఛ ఏమాత్రం ఉండదు. They are compelled to behave in that way. . అలానే schizophrenia ఉన్న వారు violent గా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకుండా నిగ్రహించుకొనే సంకల్పం వారి మెదడులోకానీ, శరీరం లో కానీ ఉండదు. కాబట్టీ వారి ప్రవర్తనకు నేరం వారి రోగానిది. కుంటి వారి వైకల్యం పైకి కనపడుతుంది. కానీ వీరి వైకల్యం పైకి కనపడదు.కోర్ట్లు , అలాంటి వారిని శిక్షించటం ద్వారా, వారు తరువాత నేరాలను చేయటాన్ని తగ్గించటం కుదరదు.వ్యాధి ఉన్నంత వరకూ వారు నేరాలు చేయటానికే అవకాశం ఉంటుంది.  అందుకే వారిని ఏ శరణాలయాలలోనో చేర్చమని న్యాయస్థానాలు సలహా ఇస్తాయి.

ప్రకటనలు

3 thoughts on “నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ

  1. చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది.

    ఆయన ఎవరిని పెళ్ళి చేసుకున్నారు? నాకు తెలియక అడుగుతున్నాను.

    మెచ్చుకోండి

  2. చలం గారు తన పెదనాన్న కూతురు రమణని ప్రేమించారు. సమాజం ఒప్పుకోదు అంటూ అతని తండ్రి అడ్డు తగిలాడు. తరువాత రమణ ఏమయ్యిందో తెలియదు. అసలు విషయానికొద్దాం. ఇస్లామిక్ దేశంలో పుట్టినవాడు ముగ్గురిని పెళ్ళి చేసుకోవడం తప్పు అనుకోడంటే అందుకు కారణం ఆ దేశాలలోని సామాజిక పరిస్థితులు కావచ్చు లేదా మతం చేసిన బ్రెయిన్ వాష్ కావచ్చు. కానీ ఇస్లామిక్ దేశంలో పుట్టి పెరిగినవాడు ఇండియాకి వచ్చి హిందువులు కూడా బహు భార్యత్వాన్ని పాటించడం తప్పు కాదు అని అడ్వొకేట్ చేస్తే హిందూ సమాజంలో సమస్యలు వస్తాయి కదా. కనుక ఇండియాలో బహుభార్యత్వం పై చట్టబద్ధమైన నిషేధం ఉండాల్సిందే.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s