దేవుడూ హేతువాదుల సంవాదం

సుందరం కళ్ళు తెరిచాడు. చిమ్మ చీకటి. కళ్ళు మూశాడు. ఏమీ కనపడటం లేదు.
ఆరు నెలలు గా గుండె జబ్బు తో తీసుకొంటున్నాడు. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచాడు.
చేతులు విదిలించాడు.అరే చేతులు ఉన్నట్లే లేవే..! కాళ్ళు ఆడించాడు. ఊహూ.. కాళ్ళు కదల లేదు.
“నేను బతికే ఉన్నానా?”
“ఊహు.., నిన్న రాత్రే చనిపోయావు”, ఎక్కడి నుంచో సమాధానం వచ్చింది.

“అరే.., ఎంత ఘోరం జరిగింది..నా పెళ్ళాం పిల్లలు ఎలా బతుకుతారు?…. ఇంతకీ, నువ్వెవరు?”
“నీ భాషలో దేవుడు అంటారు”

“నేను నమ్మను.నాకు జీవితం లో దేవుడెప్పుడూ కనపడలేదు. నేను నాస్తికుడిని,రచయితని ..పైగా హేతు వాదిని…తెలుసా?”
“కనపడితే ఇంకా నమ్మేదేముంది గానీ, ప్రస్తుతం నువ్వు ఎవరి తో మాట్లాడుతున్నట్లో?”

“నమ్మను గాక నమ్మను! మనిషి బుర్రకి బయట, “తెలివిగానీ, ‘తెలివి లో ఉన్న వస్తువు గానీ ,” ఏదీ లేదని మా నాస్తికుల విశ్వాసం”.
“మనిషి తెలివీ చేతనా, నా తెలివీ చేతనా ఒకేవిధం గా ఉంటాయని నీకెవరు చెప్పారు?”

“మా శాస్త్రవేత్తలు ఈ విశ్వం పని చేసే నియమాలను కొన్ని ఎప్పుడో కనిపెట్టేశారు. ఇంకొన్నిటిని కనిపెడుతూ ఉన్నారు.క్వాంటం తీరీ, స్ట్రింగ్ తీరీ మొదలైన వాటిని గురించి నువ్వు ఇంకా వినలేదా?”
“ఆ నియమాలను పెట్టింది ఎవరు? వారికి కనిపెట్టే శక్తిని ఇచ్చింది ఎవరు?”

“అంటే ఆ నియమాలను నువ్వే పెట్టానంటావ్. అయినా సరే నేను నిన్ను నమ్మను. నువ్వు నన్నేం చేసినా సరే..!”
“నన్ను నమ్మని వాళ్ళని దండించటానికి నేనేమైనా నియంతనా..? నన్ను నమ్మిన దుర్మార్గులని నెత్తిన పెట్టుకోవటానికి నేనేమైనా ముఖప్రీతి మనిషినా?”

“సరే..నా మీద కోపం లేదన్న మాట”
“రాగ ద్వేషాలకతీతం గా నా నియమాలప్రకారం పని జరిగిపోతుంది. మీరూ నా నియమాల ప్రకారమే ప్రవర్తిస్తారు.కోపం పెంచుకోవటానికి నేనేమైనా మనిషినా..?. ”

“నువ్వు ఈ లోకం నడిచే భౌతిక నియమాలని ఎందుకు మార్చవు? దీనివలన హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు,స్థిరం గా ఉండే భౌతిక నియమాలను తెలుసుకొంటే చాలు,  నిన్ను తెలుసుకొనకపోయినా వచ్చే ప్రమాదమేమీలేదంటున్నారు కదా? ”
“నువ్వు రచయితవి కదా? నీకు శిల్పం యొక్క ప్రాముఖ్యత తెలిసేఉండాలి. లోక నియమాలని మారిస్తే నా లోక రచన లో శిల్పం దెబ్బతింటుంది. నా శిల్పం మీకు అర్ధం కాదులే . అది “అధిభౌతిక శిల్పం”. శిల్పాన్ని దెబ్బతీయటం ఉచితం కాదు కదా? ”

“నీ ఉనికిని మా శాస్త్ర వేత్తలు ఎప్పటికైనా నిరూపించగలరా ?”
“సిధ్ధాంతపరం గా నిరూపించవచ్చు. కానీ నేనుండే లోకం వేరు.నా కొలతలు వేరు. మీకు నా లోకం లోకి ప్రవేశం లేదు. నా లోకం, మీ లోకం లోని నియమాల ప్రకారం పని చేయదు. మీ లోకం నా పరిధి లోని ఒక చిన్న నలుసు మాత్రమే! నా ఉనికిని మీ లోకం లోని నిజ జీవితం లోని దృగ్విషయాలాతో నిరూపించటం అయ్యేపనేనా? ”

దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడేమో.నమ్మితే పోయిందేముంది. ఆయన తో  మంచి గా మాట్లాడదాం….అనుకొన్నాడు సుందరం లోలోపల.  దేవుడికి సుందరం మనసులోని  మాటలు వినపడుతూనే ఉన్నాయి.

“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా..అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మది గా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా..మీకు స్వేఛ్ఛా సంకల్పం ఇచ్చాను కదా?దానిని పరిస్థితులకి అతీతం గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”

“అంటే, మంచి తో పాటు చెడు చేసే స్వేఛ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట!అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ..అయినా, నువ్విచ్చిన స్వేఛ్ఛా సంకల్పం లో ని స్వేఛ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిది లే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత  బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డ వాడివా, మంచి వాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా?మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?

“కావాలని చేయవా..? అంటే నీ మీదా ఈ ప్రపంచం మీదా నీకు అదుపు లేదా స్వామీ..?”
“అదుపు అనేది, నియంత్రించటం అనేది మనుషుల లక్షణం కాదా? మీ లక్షణాలని నాకు ఆపాదిస్తే ఎలా?”

“సరే..మరి నిన్ను ఎవరైనా అదుపు చేస్తున్నారా? ఎవరైనా సృష్టించారా?”
“నన్నెవరూ సృష్టించలేదు. నాకు కారణం లేదు.నాకు మొదలు లేదు.చివర లేదు. నేనే అన్నిటినీ సృష్టించాను. అన్నిటిలోంచీ నేను వచ్చాను. అన్నీ నేనే. నేనే అన్నీ. కార్య కారణ సంబంధం మీ ప్రపంచం లోది కదా?”

ఈయనకు మొదలు లేదు, చివర లేదంట. నేనడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా భలే తప్పించుకొంటున్నాడే! అనుకొని, సుందరం, “నీకు మొదలే లేదా? నేను నమ్మను..అదెలా సాధ్యం స్వామీ?”అన్నాడు.
వెంటనే సుందరం కళ్ళముందు వెలుగుతో ఒక వృత్తం ప్రత్యక్షమైంది.
“ఈ వృత్తం చుట్టూ పోతే ఏది మొదలు? ఏది చివర? ప్రతి ప్రదేశమూ మొదలే. ప్రతిదీ చివరే. నీవు ఏది మొదలు అనుకొంటే అదే మొదలు కాదా?”

“నీ ఉదాహరణ ప్రకారం, ప్రతి విషయానికీ ముందు వేరొక విషయం ఆదిగా ఉంది కదా స్వామీ?”
“నా లోకం లో కార్యమూ కారణమూ ఒకే సమయం లో జరుగుతాయి. ఒకే బిందు సమానమైన సమయం లో కాలాలన్నీ ఉంటాయి. ఒక ప్రదేశం లోనే అనేక వస్తువులు ఉంటాయి. ”

 “ఏంటో! మా క్వాంటం తీరీలూ, స్ట్రింగ్ తీరీలూ చెప్పినట్లు గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకీ, నువ్వు ఏ కాలం లో ఉన్నావు స్వామీ?”
“అన్ని కాలాలలోనూ ఉన్నాను. కొండమీది నుంచీ చుట్టుపక్కల చెట్లన్నీ కనపడినట్లే, నాకు కాలాలన్నీ ఒక్క క్షణం లోనే కనపడుతాయి. ఏ కాలాన్నైనా నేను స్పృశించగలను. అన్ని కాలాలలోనూ నేను ప్రవేశించగలను. కాలాన్ని నేను ఆపగలనూ, పరుగులు పెట్టించగలను. అయితే, నా కాలం మీ కాలం కంటే భిన్నమైనది కదా?”
“ఏమిటో స్వామీ, నన్ను గందర గోళం లోకి నెట్టేశారు. నేను మీలా  నిన్నటి వస్తువునీ రేపటి వస్తువునీ ప్రస్తుతం ఎందుకు స్పృశించలేను స్వామీ?”
“నీ లోకం లో కార్యమూ కారణమూ వేర్వేరు గా ఉన్నపుడు, “కార్యమైన నీ ప్రస్తుత లోకం లో ఉన్న నీవు కారణమైన నిన్నటిని ఎలా స్పృశించగలుగుతావు?”
 

“మీరు మాడైమన్షన్లో ఉన్నట్లు అగుపడటంలా.. ఏ ఆరో డైమన్షన్లోనో..ఏడో డైమన్షన్లోనో ఉన్నారా?  ఏదేమైనా, కాలాన్నే అదుపు చేయగల మీరు సామాన్యులు కారు”

“ఇందులో మనుషులు చేసినట్లు గా అదుపు ఏమీ లేదు. కాలమూ, లోకమూ, నేనూ వేరు వేరు కాదు. అంతా ఒక్కటే కాదా?”

“మీరు ఎవరైనా నాకు  చేతులు జోడించాలనిపిస్తోంది. ఒక్క సారి నాకు కనపడండి స్వామీ!”
“నేను నిర్గుణుడను, నిరాకారుడను, అనిర్వచనీయుడను, అమేయుడను.  నన్ను నీవు చూడలేవు. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం.  దీనికీ మనుషుల మనుగడకీ సంబంధం ఉంది.  నీ భక్తి కీ నా ప్రత్యక్షానికీ సంబంధం ఏమీ లేదు.నీ చర్మ చక్షువుల తో నన్ను గ్రహించలేవు. దివ్య చక్షువులివ్వటానికి భక్తి ఒక్కటే సరిపోతుందా?”

“సరే స్వామీ, నా ప్రశ్నలన్నిటికీ మీ ప్రశ్నలతో బ్రహ్మాండం గా సమాధానం చెప్పారు. ఒక్క సారి నన్ను మళ్ళీ  బతికించండి స్వామీ!. అరే! ఏదీ సమాధానం రాదే? ఆ దేవుడా పాడా. లేనే లేదు.. లేక పోతే నా ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడు?”

ప్రకటనలు

23 thoughts on “దేవుడూ హేతువాదుల సంవాదం”

 1. మీ కధనం బాగుంది గానీండి, నాస్తికుని కి భగవంతుడు తారస పడడు(ఆతను నిజమైన నాస్తికుడైతే) ఆలోచించి చూడండి , అందులోనే సూక్ష్మం ఉంది

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 2. థాంక్సండీ జిలేబీ గారు,
  వీడు దొంగ నాస్తికుడు. అందుకే, తనను బతికిస్తాడేమో అనే ఆశతో దేవుడిని నమ్మటం మొదలు పెట్టాడు.మీ మాటల ప్రకారం అసలైన నాస్తికుడు కాని వాడికి దేవుడు తారస పడవచ్చు. దొంగ నాస్తికుడికే తారస పడినపుడు, అసలైన నాస్తికుడికి, అదీ దేవుని దృష్టి లో అర్హుడైన వాడికి , ఎందుకు తారసపడడు? నాస్తికత్వం దేవుని దృష్టి లో అనర్హత కాదనుకొంటా.దేవుడు మనుషులలా అంత పక్షపాతి కాదనుకొంటా.దేవుడు కనపడగానే(మామూలు కళ్ళకి కాదు, దివ్యచక్షువుల కో జ్ఞాన చక్షువులకో కనపడతాడు) అప్పటిదాకా నాస్తికుడు గా ఉన్నవాడు కాస్తా దేవుని వీక్షకుడి గా మారతాడు. దేవుడు ప్రత్యక్షం గా కనపడినపుడు, తరువాత అటువంటి వాడికి ఏ నమ్మకమూ అవసరం లేదు (for or against). కనపడని దాని గురించే కదా నమ్మకం. కనపడే దాని గురించి నమ్మకం ఉండదు. దానిని అనుభవిస్తాం. దేవుడు కనపడగానే నాస్తికుడు అతనిని దేవుడు అని ఎలా అంగీకరిస్తాడు అంటారా? మన భౌతిక పరిమితులకి లోబడి లేని శక్తి మన ముందు సాక్షాత్కరించినపుడు నాస్తికుడికైనా అంగీకరించక తప్పదు.
  నాస్తికుడికి తారసపడటం లో దేవుడికి ఉన్న ఉద్దేశం, “అతని చేత తన ఉనికిని అంగీకరింపచేయటం” కాక పోవచ్చు కూడా.
  నాస్తికుడికి ఎందుకు తారసపడతాడొ టపాలోనే దేవుడే చెప్పాడు. దానికి కౌంటర్ ఇవ్వండి.

  మెచ్చుకోండి

 3. మీ గత పోస్టులన్నింటినీ క్రోడీకరించి రాసినట్టున్నారు. బాగుంది.

  కాలంతో సంబంధం లేనివాడు నిరంతరంగా ఆ కాలచక్రాన్ని ఎందుకు నడిపిస్తున్నాడో అడిగితే బాగుండు.

  మెచ్చుకోండి

 4. దేవుడు పక్షపాతి అని నేనను. అసలు దేవుడు ఆస్తికుడూ కాదు, నాస్తికుడూ కాదు. అందుకే ఇద్దరికీ చిక్కడు అనుకుంటాను. ఆస్తికుడు వున్నాడని గోప్పతో బతుకుతాడు. నాస్తికుడు లేదని ధంకా భాజాయిస్తాడు. కలడు కలండనేవాడు కలడో లేదో ! అందుకే నేమో అన్నారు యధ్బావం తద్భవతి అని. కాబట్టే , నాస్తికుడికి భగవంతుడు కనంపడని చెప్పాను సరదాగా !

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 5. చక్కటి పోస్ట్ అండి. మంచి మనసున్న నాస్తికులకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.. తరువాత ఆ నాస్తికులు ఆస్తికులు అవుతారు.
  అయితే కొందరు హేతువాదులు దేవుణ్ణి చూపించమంటారు. నిజంగా దేవుడే ఎదురుగా కనిపించినా కూడా ఇలాంటి వాళ్ళు అదంతా భ్రాంతి లేక అదేదో పెద్ద జబ్బు అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ దురదృష్టం.
  ఎందరో భక్తులు జీవితాల్లో ఇప్పటికీ దైవం గురించి నిదర్శనాలు జరుగుతున్నాయి. ఆ భక్తులు ఆ సంఘటనల గురించి చెబుతున్నారు కూడా…

  మెచ్చుకోండి

 6. ఠాంక్సండీ!
  దేవుడు కనపడిన(మామూలు కళ్ళ కి కాదు) తరువాత నమ్మటమూ ఉండదు. నమ్మకపోవటమూ ఉండదు. మీ గది లో మీరు చూసే కుర్చీని మీరు నమ్మవలసిన అవసరం లేదు. నమ్మకుండా ఉండటానికీ లేదు. ఎందుకంటే మీరు దానిని ప్రత్యక్షం గా చూస్తున్నారు కాబట్టీ. నమ్మకం కనపడని విషయాలపైనే ఉంటుంది.
  నాస్తికులు ఏవైనా అతీత అనుభవాలు ఎదురైనపుడు closed mind తో ఉండి పిడి వాదం చేయటం సబబు కాదు.
  అలానే ఆస్తికులు దేవుడికి ఒక రూపాన్నీ, నిర్వచనాన్నీ ఇచ్చి, తరువాత ఆ నిర్వచనానికే వ్యతిరేకం గా మాట్లాడటం, లేక పోతే ఆ నిర్వచనానికి భంగం కలిగి నపుడు దేవుడు అనిర్వచనీయుడు, ఆయన లీలలు మనకు అర్ధం కావు అనటం కూడా సరి కాదు.

  మెచ్చుకోండి

 7. ఈ ఆస్తిక నాస్తిక గొడవల్నుంచి బయటపడి. “నాకు దేవుడవసరమా? ఒకవేళ అవసరమైతే ఎందుకు?” అనే ప్రశ్నవేసుకుంటే బాగుంటుంది. IMHO, we humans don’t like randomness or “chancy-ness” and would replace it with the (make-believe) sense of God. Of late, devotion has become a euphemism for boot licking addressed towards God. Unless religions start preferring spirituality to God, this sense of God would destroy our sense of humanity.

  మెచ్చుకోండి

 8. దైవానికి సంబంధించిన విషయాలను సరిగ్గా నిర్వచించటం అంటే, ఎంత ఆస్తికులైనా సరే , సామాన్యమానవుల వల్ల అయ్యే పనికాదు. అందుకని సరిదిద్దుకోవటంలో తప్పులేదని నాకు అనిపిస్తోందండి..

  మెచ్చుకోండి

 9. మినెర్వా గారు,
  నేను మీ పోస్ట్లు చాలా వరకూ చదువుతాను. I like the no nonsense tone of reasoning in them మీరు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. దేవుడి గురించిన దేవుళ్ళాటలకి మొదలు మన అవసరాల్లోనే ఉంటుంది.దేవుడిని మన కష్టసుఖాలమీద ఒక imaginary control handle గా ఉపయోగించుకొంటాం. రెండు కోతులున్నాయి. ఒక కోతిని బోనులో పెట్టి దానికి కరెంట్ షొచ్క్ ఇచ్చి, ఆ కరెంట్ స్విచ్చిని ఆ బోనులోనే పెట్టారట. షాకులు మొదలవ్వ గానే కోతి స్విచ్చి ఆపేసి , హాపీ గా ఉంది. అది తరవాత మంచి కాంఫిడెంట్ కోతి గా పెరిగింది. అదే, రెండవ కోతికి స్విచ్చి దాని బోను లో పెట్టలేదు. అది చాలా meek గా తయారయింది. చాలామంది దేవుడిని తమ కష్టాలు తగ్గించే ఒక మానసికమైన స్విచ్చి గా ఉపయోగించుకొంటారు.దాని వలన వారికి ప్రశాంతత ఉంటుంది.
  ఇక మన అవసరాలకు అతీతం గా బయట కొండలూ గుట్టలూ, నక్ష్త్రాలూ ఉన్నట్లే, దేవుడి గురించిన వాస్తవం కూడా ఉంటుంది. దానిని గురించి తెలుసుకోవాలనే మనిషి curiosity అనే అవసరం కూడా ఉంటుంది. BTW what is spirituality without God? Then we are all some complex biological organisms with some cognitive limitations. Human race is bound to perish in some indefinite cosmic timeframe. It does not matter if you practice spirituality, or apothecary. All are at tha same level.
  The question of the God is the differentiator, in spirituality (in my opinion).
  Pushing wareness/consciousness to new limits? Even some drugs can do it without side effects.

  మెచ్చుకోండి

 10. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం.
  While I agree with the tone and the content of the post, I didn’t like the above definition of ‘Bhakti’.
  Fear and devotion don’t go together. Fear of what? ‘Punishment’ by God? If you are a true devotee, where’s the cause for fear? Whatever God gives you/does to you, will be a blessing.

  మెచ్చుకోండి

 11. గుడికి వెళ్ళే సాధారణ జనాల భక్తి లో భయం కూడా ఉంటుంది. చెంపలు వాయించుకోవటం, గుంజీలు తీయటం, పొర్లు దండాలు పెట్టటం, దేవుడి గురించిన ఆక్షేపణ చేయటానికి భయపడటం ఇవన్నీ భయం(submissive nature) లక్షణాలు.
  కొందరు గొప్ప భక్తులు దేవుడిని ఆత్మీయుడిగా భావించి నిందా స్థుతి చేస్తారు. మీరా దేవుడిని తన చెలికాడుగా, భర్త గా భావించింది అనుకొంటా. ఈ భక్తి లో భయం లేదు.

  మెచ్చుకోండి

 12. ఇక్కడ ఇంత మంది ఔత్సాహికులను చూస్తుంటే నాకు మహదానందంగా ఉన్నది

  ఒకరి అనుభవాన్ని share చేసుకోవాలనుకుంటున్నాను
  ఒక రోజు మధ్యాహ్నం అలా ఒక రకమైన శ్వాస సంబంధితమైన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాను మంచం పై పడుకుని
  అక్కడ నా బోటి వారు చాల మంది తండోప తండాలు గా తరలి వస్తున్నారు, కాశి విశ్వేశ్వర స్వామి వంటి లింగము ను దర్శించిన వెంటనే నాతో సహా ప్రతి ఒక్కరికి
  చేతులు కాళ్ళు వాటి బరువును కోల్పోయినవి, స్థూల శరీరం యావత్తు తన భార లేమిని గ్రహిస్తున్నది
  ఆకారం తెలుస్తున్నది కానీ స్పర్శ ఇత్యాదివి తెలియటం లేదు
  ఏ క్షణం లో నైతే ఇలా స్థూల భావం వీడినదో, వేణు వెంటనే మరో మార్గం గుండా అంతా తరలి వెళ్తున్నారు,
  ఏమిటి ఏమి జరుగుతున్నది?
  అని ప్రశ్న ? వెంటనే సంధానం భావనాత్మకం గా ఇలా “ఇందాక నువ్వు వచ్చినప్పుడు లింగం ఉండి మరి ఇప్పడు” అనగానే “లింగం” వైపు చూడగానే అది మాయం అయ్యింది
  లింగం భంగం అయ్యింది అంటే లింగ శరీరం నశించింది
  అంటే అయ్యో అప్పుడే నేను చచిపోయనా? అనే ఆవేదన !
  ఆ భావం విదితమవ్వగానే మరో ద్వారం లోనికి ప్రేవేశం నిషేధం
  ఇంకా నీకు సమయం ఉన్నది ఒక రెండు రోజులు అనే సమాధానం
  వెను తిరిగి వెళ్దా మంటే శరీరం లేదు ఏదో దాని ఆకృతి తెలుస్తుంది అది కూడా క్రమేపి నసిస్తూ….
  urgent గా ఈ మరణాంతర స్థితిని ఎవరికైనా తెలియజెప్పాలనే తాపత్రయం కానీ
  నోటితో చెప్పవలెనంటే నోరు లేదు,
  రాసి చెప్పవలనంటే చెయ్యి లేదు,
  ఓహో! ఇక చేయగలిగిగినది చేయవలసినది ఏమి లేనే లేదు అని సమాధాన పడ్డాక
  ఆకృతి మరింతా సుక్ష్మాతి సూక్ష్మమై జగత్తు కూడా అగుపించుంట అంతరించి
  ఖాళి ఇంకా తను అంతర్ధానం అయిన వైనం …..

  ………..

  భగవంతుడు దేవుడు దైవం పరమాత్మ ఈశ్వరుడు etc
  ఆయన/అది నిత్య నిరాకార నిరంజన బుద్ధ ముక్త సూన్య పూర్ణ స్వరూప etc
  ఇది అంత మన భావన ఈ భావనను మీరిన స్థితి అది
  అనిర్వచనీయము అను దానిని ఎంత వరకు నిర్వచిమ్పగాలమో మనలో మనకు అర్థం అయ్యేందుకు
  అంత వరకు వివరణ నీయగల పదజాలమే వాటి పరమర్ధమే ఈ పేర్లు
  ఆ తత్త్వం తత్త్వాతీతం
  అన్నిటికి బయలే !!

  అయితే జగతిలో నియతి (law of action )మేరకు అన్నే జరుగుచున్నవనేది సత్యమే ఒకింత !!
  ఇవి పరమ సత్యానికి సుచికమే కాని దాని దరి దాపులను సైతం చేరలేవు

  భగవంతుడు లేక సత్యము అంటే “ఉన్నది”
  అనే అంశమే !! యదస్తి తత్ సత్యము
  ఏది ఉన్నదో అది సత్యము

  అయితే అది ఉన్నది అని కాని లేనిది అనికాని చెప్పనలవి కానిడి అది
  ఉన్నది అంటే అది దాని యదార్ధ స్థితికి ఒక మెట్టు తక్కువే
  మన అవగాహనకి రానంత మాత్రాన
  మన ఉహకు అందనంత మాత్రాన దాని ఉనికి ని లేనిదనటం అవివేకం
  ఏమాత్రం విచారణ లేకుండా మూధము గా నమ్మటం కూడా అవివేకమే !!

  నేడు గీతా జయంతి
  భగవద్గీత 2 వ అధ్యాయం 16 వ శ్లోకం
  “నా అసతో విద్యతే భావో , నా అభావో విద్యతే సతః ”
  ఇది తెలిసిన సర్వము తెలియును
  స్వస్తి !!

  మెచ్చుకోండి

 13. మీ వ్యాసంగం లో నవీన పద్దతులలో భగవంతుని define చేసేందుకు తరసపడుతున్న అంశాలను విధిగా ప్రస్తావనకు చేర్చటం బాగున్నది
  ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా “ది ఓల్డ్ మాన్” అని దేవుడికి పేరు పెట్టాడు తన భాషలో సంస్కృతం లో కి తర్జుమా చేస్తే “సనాతనుడు” అని అర్థం
  భగవద్గీత కూడా “ఆచలోయం సనాతనః ” అంటున్నది కదా.
  ఇంకో తెమంటే కాలం కాలాతీత స్థితి ప్రస్తావన బాగున్నది
  కాలాతీత వ్యక్తులు నేటి కాలం లో లేక పోలేదు
  నిజమైన సాధకులకు వారు సదా వెన్నంటే ఉన్నారు !!

  ఉత్క్రుష్టం ఐయిన post చేసినందులకు ధన్యవాదములు

  మెచ్చుకోండి

 14. Really superb. ఇటువంటి రచనలను తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. చాలా ఏళ్లక్రితం తెలుగు స్వతంత్రలో గల్పిక లని వస్తూండేవి, దీనిని గల్పిక అన వచ్చునేమో.ఏ పోరంకి దక్షిణా మూర్తిగారో చెప్పాలి. చదివిన తర్వాత మన మస్తిష్కంలో ఆలోచనల పుట్టని రేపేదే మంచి రచన అని నా ఉద్దేశం. keep writing such interesting and thought provoking articles.

  మెచ్చుకోండి

 15. బాగుంది…@దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు
  ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు
  ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ…..@swami vivekananda

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s