మా కాలేజీ రోజులు- ఒక కథ కాని కథ

అవి మా కాలేజీ రోజులు. ఊహలు మబ్బులలో తేలే రోజులు. కాళ్ళు భూమి మీదకి ఇంకా రాని రోజులు.  ఆలోచనలు జీవిత వాస్తవపు మురికి గుంటలో ఇంకిపోని రోజులు. ఏమీ ఆశించకుండా మంచి చేసిన రోజులు. మంచి చేసి మరచిపోయిన రోజులు.భావోన్నతుల రోజులు.’శరీర పరీవృతులైన ‘ రోజులు.
అపోహలలో సంతోషం గా గడిపిన రోజులు. అందమైన అమ్మాయి నవ్వితే “నన్నే ఇష్టపడిందనుకొనే”, రోజులు. అసలు పాటల వెనుక లేని బూతు పాటలను కనిపెట్టే రోజులు.పొగరు గా, పచ్చి గా మాట్లాడుకొనే రోజులు.అనుకోకుండా అమ్మాయిల మనసు కష్టపెట్టి, తరువాత సారీలు చెప్పే రోజులు. ఇష్టం లేని వాడిని కసి తీరా తిట్టుకొని , లేని వెధవాయిత్వాన్ని వాడికి ఆపాదించి తృప్తి పడే రోజులు. ఆత్మ విమర్శకు నిర్దయత్వం రాని రోజులు. ఆ నిర్దయత్వం కూడా స్వార్ధం కోసమేనన్న అవగాహన రాని రోజులు. ఆలోచనలు భౌతికత బాట పట్టని రోజులు. రోగం, రొష్టూ, డబ్బూ దస్కం, వ్యవహారం, సంభవం, అసంభవం గురించి ఆలోచించని రోజులు. ఆదర్శాలతో బతికేయ వచ్చనుకొనే రోజులు. ప్రపంచం లోని అన్ని విషయాల మీదా పందాలు వేసుకొనే రోజులు. స్నేహితుల హృదయాల మధ్య “డైరెక్ట్ ఆన్-లైన్ ట్రాన్స్-ఫర్ ఏదో” జరుగుతుండే రోజులు. జీవితపు విశ్లేషణ లు ఇంకా మేలుకోని రోజులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితాన్ని జీవించే రోజులవి.
ఆ రోజుల్లో మా రూం మేట్లు ఇద్దరు,  గర్ల్స్ హాస్టల్ కి కి వెళ్ళి,  అమ్మాయిలను కలుసుకొని,  తిరిగి రూం కి వచ్చి , అక్కడి కబుర్లు మొదలెట్టే వారు. వాళ్ళను సోది మొదలెట్టారంటూనే, మిగిలిన వాళ్ళము కూడా వాళ్ళతో కలిసి సోది కి రాగం కలిపే వాళ్ళం.అందరూ రూం లోని పరుపుల మీద పడుకొని తన్మయత్వం తో సోది కబుర్లలో తేలియాడే వాళ్ళం.  అమ్మాయిలు ఏమి మాటలాడుతున్నారో, ఆ మాటల వెనుక మర్మాలేమిటో ఉన్నవీ లేనివీ ఊహించుకొని మాట్లాడేవాళ్ళం. కాలేజీ లో ఎవరు ఎవరికి లైన్లు వేస్తున్నారో, ఎవరి మధ్య ఏమి నడుస్తున్నదో ఉన్నదీ లేనిదీ కూడా సృజించేవాళ్ళం.

సోదంతా ఐపోయిన తరువాత, “అరే,   టైం అంతా వేస్ట్ అయిపోయిందే, ప్రతి రోజూ ఇలానే చేస్తున్నాం. ఇవాళ స్టడీస్ మొత్తం చంకనాకిపోయాయి”, అన్నాడు సురేష్ .
దానికి కీట్స్ అనబడే కృష్ణా రావు గాడు,  “ఈ సోది కబుర్లు ఎందుకు రా బాబు. ఈ అమ్మాయిల  గురించి మన టైమంతా వేస్ట్ అవుతోంది.వాళ్ళ గురించి చొంగ కార్చటం మానేయండి.  ఈ టైం లో నేను ఓ రెండు కవితలు రాసేవాడిని కదా..!”, అన్నాడు. కీట్స్ గాడు అమ్మాయిల గురించి అందమైన కవితలల్లుతాడు.
“ఒరేయ్, మేము మాటలు చెప్పుకొని చొంగ కారిస్తే, నువ్వు కవితలు రాసి, అలా కూడా చొంగ కారుస్తున్నావు. అయినా, సోది మనం కొట్టుకొని, వాళ్ళను అంటే ఎలా రా ? అసలు అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఒకే హాస్టల్లో రూం షేరింగ్ చేసుకొంటూ ఉంటే బాగుంటుంది. అమెరికా లో అలానే ఉంటుందట!”సురేష్ అన్నాడు.
“అవును అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఉంటే అన్ని ముచ్చట్లూ అయిపోతాయి. ముచ్చట్లు తీరిన తరువాత, ఇక హస్కు కొట్టుకోవలసిన అవసరం ఏముంది? అప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేయవచ్చు,” అన్నాన్నేను.

“ఆగండి” , అన్నాడు అప్పటి దాకా కళ్ళు మూసుకొని నిశ్శబ్దం గా మా మాటలు వింటున్న జంగ్ గాడు. వాడి అసలు పేరు జంగయ్య. కానీ వాడు జనాల సైకాలజీ ఎక్కువ వి”శ్లేషించటం” వలన వాడికి జంగ్ అని పేరు పెట్టాము.లైబ్రరీ లో ఎప్పుడు చూసినా ఎవో పుస్తకాలు చదువుతూనే ఉంటాడు.
జంగ్ గాడు చెంపకి అరిచెయ్యి ఆనించి, మో చేతిని కిందికి ఆనించి, “పామ్మీద విస్ణు మూర్తి”లా పడుకొని,  మొదలు పెట్టాడు. “అరే, మనమంతా పడవలేసుకొని ఒక ఉధృతం గా ప్రవహించే నదిలో పోతున్నాం రా. మన సంఘమూ పెద్దాళ్ళూ ఆ నదికి కట్టుబాట్లనే ఒక ఆనకట్ట కట్టారు. మనకి ఆనకట్ట కొన్ని మైళ్ళ దూరం లో ఉండగానే మనలో కొంత మంది నది కి ఉండే మురికి కాలువల లోకి ఎదురు పోతున్నారు. వాళ్ళని వదిలేద్దాం. మురికి కాలువ ఉధృతం గా ఉండదు. కానీ మనం ఉన్న నది కి భావోద్వేగాల,కోరికల ఉధృతి ఎక్కువ.  మనం డ్యాం రిజర్వాయర్ లో నిలకడ గా ఉన్న నీటిలో ఉన్నంత వరకూ పరవాలేదు. ఒక్కోసారి డ్యాం గేట్లు సగం తెరచుకొంటాయి.  కాకతాళీయం గా మన పడవ ఆ గేట్ దగ్గరికి వెళ్తే, మన పడవ డాం కిందికి బోల్తా కొడుతుంది. అంటే బై చాన్స్ మనం లవ్ లో పడితే మన చదువు కొన్నాళ్ళైనా బోల్తా పడుతుంది. మన పక్క రూం భాస్కర్ గాడిని చూడటం లా. వాడు ఆ ‘శిశిర’ తో లవ్ లో పడిన తరువాత, వాడి పర్సెంటేజీ తగ్గిపోయింది కదా! ఒక్కోసారి డాం కిందికి పడిన పడవ లోని మనిషి బతికి బట్ట కట్టడు. కిందటి సంవత్సరం మెకానికల్ లో శివ అనే వాడు మెడికల్ కాలేజీ అమ్మాయి రిజెక్ట్ చేసిందని ఆత్మ హత్య చేసుకొన్నాడు. లా కాలేజీ వాడొకడు తనను తిరస్కరించిన అమ్మాయి మీద యాసిడ్ పోయబోయాడు. వాడి మీద కేసు బుక్ అయింది. వాడి జీవితం నాశనం అయినట్లే! ఇవన్నీ మరిచిపోయారా? ….అలా అన్న మాట. కాబట్టీ మనమందర మన పెద్ద వాళ్ళు పెళ్ళి  అనే లీవర్ ద్వారా డాం లోని నీటిని క్రమం గా సేఫ్ లెవల్ కి తెచ్చేదాకా ఆగి అప్పుడు డాం అవతలిపైపుకి వెళ్ళ వచ్చు. అదీ సంగతి!”, అన్నాడు జంగ్.

జంగ్ గాడి వాదన లో నాకొక లొసుగు కనిపించింది. ” అసలు ఆనకట్టే లేక పోతే, మనకు ఈ తిప్పలు ఉండవు కదా?”, అన్నాను.
“ఆనకట్టలేక పోయినా మన కుర్రతనపు నదిప్రవాహం ఉధృతం గా ఉంది. ప్రవాహం లో మన పడవ బోల్తాపడక తప్పదు. కాబట్టీ, అప్పుడప్పుడూ ఇలా అమ్మాయిల గురించి సొల్లు కబుర్లు చెప్పుకొంటూ, స్థిరమైన రిజర్వాయర్ లో తెడ్డేసుకొంటూ తిరగటమే మేలు”, జంగ్ నవ్వాడు.
“పెద్ద వాళ్ళు కట్టిన ఆనకట్ట గేట్లు ఈ మధ్య చాలానే ఊడిపోతున్నాయి. అమెరికాలో లా ఇంకా ఆనకట్టే కొట్టుకొనిపోలేదనుకోండి. ఒక వేళ ఆనకట్ట లేకపోయినా, ప్రవాహ ఉధృతి లో పడవ బోల్తా పడుతుంది.”

“అరే జంగ్ గా, ప్రవాహమూ ఉధృతీ డామూ అంటూ ఇంకో సోది మొదలెట్టావు. అర్ధమై చావట్లేదు. అసలు విషయం చెప్పరా!”
” పాశ్చాత్య దేశాలలో టీనేజీ సెక్స్ గురించి  పరిశోధనలు జరిగాయి. . అక్కడ “కో-ఎడ్యుకేషన్” కాలేజీ ల కంటే, అబ్బాయిలకు మాత్రమే పరిమితమైన కాలేజీల లో అబ్బాయిలు మంచి ఫలితాలు సాధించారు .  మన పూర్వపు గురుకులాల మాదిరి. సంఘం పరిపూర్ణం గా నిషేధించి, పూర్తిగా సాధ్యం కాని ఏ అంశం మీదికైనా మన ఆలోచన పోదు. అప్పుడు మనసు పక్క దారి పట్టక, చదివే అంశం మీద మనసు లగ్నం చేయవచ్చు. సంఘం విధించే నిషేధం, “డాం కి ఉన్న పుచ్చిపోయిన తలుపుల లా”, ఉంటే, వ్యక్తుల మనసులు అటూఇటూ కాకుండా ఊగిసలాడి మనసు లగ్నం కాదు.అలానే, టీనేక్ సెక్స్ వలన “మెదడు అభివృధ్ధి చెందటం ఆగిపోయే అవకాశం ఉంది”, అని కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ వలన మాత్రం యువకుల చదువులకి నష్టం లేదు!”.

“సరేరా జంగ్, ఇంతకీ ప్రేమ గురించి నీ అభిప్రాయమేమిటి రా?”

“ప్రేమించటం అనేది కోర్ట్ కేసు లాంటిది. ఓడిపోయిన వాడు కోర్ట్-లో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట.  అలానే, ప్రేమ విఫలమైన వాడు గుండె పగిలి ఏడిస్తే, ప్రేమ సఫలమైన వాడు పెళ్ళయిన తరువాత భ్రమలు విడిపోయి ఏడుస్తాడంట! అసలు ప్రేమ లో పడనివాడిదేనోయ్ జల్సా అంతా!”

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s