కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )

ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.

1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు 🙂 )
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది.  మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ,  భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది.  కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది.  .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు.  ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.

ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm)  దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition  లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత  నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.

10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.

ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework),  తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి  కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో!  వ్యక్తులు  కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు.  నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!

అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.

10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.

డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ  ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు.  డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు  ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా  కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.

11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).

12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి  సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.

13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది.  ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?

అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.

కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!

14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి  సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది.  అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.

మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.

15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.

16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు.  సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.

17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ)  ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )

18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన  ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.

మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.

19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు,  ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?

ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా?  OK . Then, have a nice weekend.

ప్రకటనలు

ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..

కథలు రాయాలనే బులపాటం చాలా మందికి ఉంటుంది. అచ్చు లో తమ పేరు చూసుకోవాలనో, పేరు తెచ్చుకోవాలనో, తమ భావాలనూ ఆలోచనలను పంచు కోవాలనో రాస్తారు.
నేనేమీ గొప్ప కథకుడిని కాదు. కనీసం చిన్న కథకుడిని కూడా కాదు. కథలు రాయాలని ఒకప్పుడు ఆశపడిన ఔత్సాహికుడిని మాత్రమే!
కథలు రాసే క్రమం లో నేను తెలుసుకొన్న విషయాలు, నా లాంటి కొత్త ఔత్సాహికులకు ఉపయోగపడతాయని, ఇక్కడ:
1. మీరు మీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథ రాయాలనుకొంటే, మరొక్క సారి ఆలోచించుకోండి. అభిప్రాయాలను వ్యాసాల ద్వారా సూటి గా చాల తక్కువ మాటలలో చెప్పవచ్చు. ఒక ఇరవై పేజీల కథ ద్వారా చెప్పే అభిప్రాయాన్ని , ఓ వాక్యం ద్వారా వ్యాసం లో చెప్పవచ్చు.కథ, రచయిత అభిప్రాయాలను ఏదో ఒక స్థాయి లో ప్రతిబింబిస్తుంది. కానీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథను రాయనవసరం లేదు.
2. కథలు రాయటం చిత్రాలు గీయటం లాంటిది, మట్టి తో బొమ్మలు చేయటం లాంటిది. ఉదాహరణ కి ఒక స్త్రీ బొమ్మ ఎంత నిజమైన స్త్రీలా కనపడితే అంత ఆ బొమ్మ గొప్పది అవుతుంది. అలా అని బొమ్మ నిజం కాదు. బొమ్మ బొమ్మే. అది వాస్తవ భ్రమ ను కలుగజేస్తుంది. ఈ సూత్రం కథలకు కూడా వర్తిస్తుంది.కథ అనేది నిజం లా అనిపించే “అందమైన” అబధ్ధం. దీనినే శిల్పం అంటారు.    కథ రాసే వారికి అందమైన కల్పనలు చేసే ఆసక్తి ఉండాలి. వాస్తవం లో ఉన్న చెత్త అంతా కథల లోకి ఎక్కటం బాగుండదు. కథలు ముఖ్యం గా మనిషి మానసికప్రపంచం లో చోటున్న విషయాల గురించి రాస్తాము. మన మానసిక ప్రపంచం లో ఏ విషయాలకి చోటు ఉంటుంది అనేది మన విలువలూ ప్రాముఖ్యతలూ నిర్ణయిస్తాయి.మన చేతన లో చోటు లేని విషయాలకి అంతశ్చేతన లో చోటుంది. (ఉదా: నిషిధ్ధమైన సెక్స్) .  వాస్తవాన్నే కొలబద్ద గా పెట్టుకొంటే, మన మానసిక ప్రపంచం లో స్థానం లేని అనేక విషయాలు (కాల కృత్యాలు తీర్చుకోవటం లాంటివి) కథలలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ వాస్తవ విషయాల ఆధారం గా కథలు రాస్తే అవి మళ్ళీ మన మానసిక ప్రపంచం లోనీ విషయాల గురించే ఏదో ఒక పాయింట్ చెప్పేవై ఉండాలి. వాస్తవ విషయాలను వాటి యధాతధ నిడివి తో కథలలో ప్రస్తావిస్తే అది వాస్తవికత కాజాలదు. ఒక వ్యక్తి పది నిమిషాలు పళ్ళుతోముకొంటే, కథలో ఆ వర్ణన పది నిమిషాల పాటు ఉండజాలదు కదా!

వ్యాసాలు నేరు గా పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తే, కథలు సబ్-కాన్షస్ గా ప్రభావితం చేస్తాయి.
3. కథకు ఒక ఇన్స్పిరేషన్ ఉండవచ్చు. ఆ ఇన్స్పిరేషన్ తో సంఘటనలూ, సన్నివేశాలూ అల్లటం లో కథకుడి ప్రతిభ బహిర్గతమౌతుంది. కథ ద్వారా ఒక భావోద్వేగ పరమైనా, లేక ఆలోచనా పరమైన సత్యాన్ని కథకుడు చెప్పగలగాలి.అంటే కథ చదివే వారి లో భావోద్వేగాలనైనా కలిగించగలగాలి, లేక ఆలోచనలనైనా రేపగలగాలి. సన్నివేశాలు అల్లటం కోసం కష్టపడే వారు, “ఇంకా కథలు అల్లటం నేర్చుకోవాలి” అని అర్ధం.పాత్రలకి “నిజ జీవితం లో వ్యక్తులకి ఉన్న multi-dimesionality”, ఎంత ఎక్కువ గా ఉంటే అవి అంత సజీవం గా కనపడుతాయి
4.పరిభావనల స్థాయి లోనే ఆలోచనలు చిక్కుకు పోయి, వివరాలంటే పడని వారు కథలు రాయటం కష్టం.
5. తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవటానికి కథలు రాయవచ్చు. ఆ అనుభవాలూ, కథకుడి ఆలోచనా సరైనవైతే, పాఠకుడికి ఆ కథ ద్వారా నాణ్యమైన అనుభూతే దొరుకుతుంది. అయితే, నిజ జీవితం లోని సంఘటనల ఆధారం గా కథలల్లటం లో ఉన్న ప్రతిభ, పూర్తి కాల్పనిక కథలల్లటం లో ఉన్న ప్రతిభ కన్నా తక్కువ అనే విషయాన్ని కథకుడు అంగీకరించాల్సిందే!

6. కథలు చదివి ఆనందించే చాల మంది కథలు రాయటానికి ఉత్సాహపడతారు. కానీ రాయటం చదవటం కంటే భిన్నమైన ప్రక్రియ. ఇతరులు రాసిన కథలను చదివేటపుడు,  కథకుడు చెప్పే పరిధిలోని విషయాలు మాత్రమే మన మనో ఫలకం పై ఆడతాయి. కానీ కథ రాసేటపుడు మన అనేక ఇష్టాఇష్టాలు priority ప్రకారం మనో ఫలకం పై ముందుకు వస్తాయి. ఉదాహరణ కు ఇతరులు రాసిన వర్ణనలు చదివి ఆనందించే మనం, రాసేటపుడు వర్ణనలు రాయలేక పోవచ్చు. కారణం వర్ణనలు మనకు ఇష్టమైనప్పటికీ, వాటికంటే మనకు వ్యక్తి గతం గా ముఖ్యమైన పరిభావనలూ మానవ సంబంధాలూ మన మనోఫలకం పైకి రావచ్చు.
మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే, వంట తిని ఆనందించే వాళ్ళందరూ వంట చేయటం ఇష్టపడనవసరం లేదని.చాలా సార్లు కథలు రాయటం లోని ఆనందం కంటే వేరే వాళ్ళు రాసిన కథలు చదవటం లోని ఆనందమే ఎక్కువ గా ఉంటుంది.

7. కథ కి సాంఘిక ప్రయోజనం ఉండాలా వద్దా? అని పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడను , కానీ, “కథ కు అంత సీన్ ఉందా?” అనేది నా సందేహం. రా.వి శాస్త్రి లాంటి వారు చివరి రోజులలో పెన్ను పక్కన పెట్టి, గన్ను పట్టాలన్నారు.  కొ.కు(కొడవటిగంటి . కుటుంబ రావు) చివరికి కథలు రాయటం అపేశారు. చా.సో(చాగంటి సోమయాజులు) ముందే విరమించారు. ఫ్రెంచ్ విప్లవం నాటి పరిస్థితులు ఈ రోజున లేవు.
తెలుగు సమాజం లో, టాల్ స్టాయ్, హెమింగ్వే ల లా గన్ను పట్టి ఆ పై పెన్ను పట్టిన రచయితలెవరూ లేరు. ప్రముఖ రచయితలందరూ పట్నాలలోని తమ మధ్యతరగతి వాలు కుర్చీలలో సుఖం గా కూర్చొని పెన్ను పట్టి, ఇతరులను గన్నుపట్టమని ప్రోత్సహించినవారే!

శ్రీ శ్రీ మహాప్రస్థానం వంటి సులభమైన కావ్యమే, పాటక జనాలకు అర్ధం కాదు. పేద వారి గురించి రాసే కథలన్నీ, నాకు “పేద వారిని ముడి పదార్ధం గా తీసుకొని మధ్య తరగతి చేసుకొనే రస సృష్టి గా కనిపిస్తాయి.”

8. ఈ రోజుల్లో, తెలుగు కథలు రాసి డబ్బులు చేసుకోవాలనుకోవటం, “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అనేదాన్ని గుర్తు చేస్తుంది.  యండమూరులూ, మల్లాదులూ మానేశారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.

9. కథలు ప్రధానం గా మానవ సమాజం లోని సంబంధాల ను చిత్రిస్తాయి. కానీ ఈ పరిధికి ఆవల ఉండే సైన్స్, టెక్నాలజీ, తత్వం, కాస్మాలజీ వంటి అనేక విషయాలపై కథలు చదివి వాటి పై అవగాహన పెంచుకోవటం కంటే, ఆయా విషయాలను నేరు గా చదివి అవగాహన పెంచుకోవటం సులువు.  అందుకే  కథలకు ఉండే ప్రభావం ఈ విషయలలో చాల పరిమితం.జీవితం లో ఉండే సవా లక్ష రంగాలలో, సాహిత్యం అనే ఒక చిన్న రంగం లో, ఒక కొత్త చిన్న ప్రక్రియ మాత్రమే కథ. దానికి ఉన్న పరిమితులు అనేకం.

10. మీకు అందమైన రసన కంటే ఆచరణ ఇష్టమైతే, కథలు రాయటం శుధ్ధ దండుగ.

11. సాహిత్యానికి సమాజం లో ఉండే స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని, ఊహలతో రాసిపారేయటం చాలా సులువు. దానికి కావలసింది కథలు రాసే ప్రతిభ మాత్రమే. పీపాడు ఆలోచనల కంటే, చెంచాడు ఆచరణ కొండంత మెరుగు. బయటకు వచ్చి సమాజం తో తలపడి పోరాడి సాధించటం చాలా కష్టం.  వ్యక్తి గతం గా రచయితలు ఆచరించని ఆదర్శాలను ప్రబోధిస్తూ రచనలు చేసే హక్కు, రచయితలకు లేదు కాక లేదు.అత్యున్నత ఆదర్శాలూ, నీతులూ ప్రవచించే రచయితలు, ఏ ఆదర్శాలూ విలువలూ లేని రాజకీయ మీడియా సంస్థలు విసిరే కుక్క బిస్కట్లకూ ఉద్యోగాలకూ ఆశపడటం ఆ రచయితల ఆదర్శాల పైపూతలను తెలియజేస్తోంది. ఒక వేళ పొట్టకూటి కోసం ఆయా సంస్థలకు పనిచేస్తోన్నట్లైతే, ఆ విషయాలను నిజాయితీ గా, బహిరంగం గా  ఒప్పుకోవటం మంచిది(శ్రీ శ్రీ లా).తన దాకా వస్తే గానీ తెలియదంటారు కదా మరి!

రచయిత ఓ ఆదర్శాన్ని పాటించాడని, అలా పాటించని వారిని తప్పుపట్టే హక్కు అతనికి లేదు. ఇతరులకి ఆ ఆదర్శాన్ని పాటించటం “రచయితకి అయినంత convenient” కాక పోవచ్చు. లేక, ఆ ఆదర్శం గురించి ఇతరులు convince అయి ఉండక పోవచ్చు. కాకపోతే ఇతరులకి ఆ ఆదర్శం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు.రచయిత కి ఆ ఆదర్శం పాటించటానికి ఎంత హక్కు ఉందో ఇతరులకి “పాటించక పోవటానికి” అంతే హక్కు ఉంటుంది.

12. మన వ్యక్తి గత గోడునూ, ఉద్వేగాలనూ,అనుభూతులనూ  పంచుకోవటానికి కవిత్వం సరైన సాధనం అనుకొంటా.!

13. అసలు విషయం ఉంటే ఎవరైనా రాస్తారు. విషయం లేనప్పుడు కూడా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా వంటి విషయాలపై పేజీలకు పేజీలు రాసి జనాలను మెప్పించటం( జనాలకు వినోదాన్ని పంచటం) ఒక గొప్ప కళే. అలాంటి రాత గాళ్ళకు నా “సెల్యూట్”.

14. భాష పై పట్టు లేని వారు కథలకి దూరం గా ఉండటం మంచిది. కవిత్వం సంగతి చెప్పనవసరం లేదు.

15. గొప్ప రచయితల రచనలు చదివి, వాటి తో స్ఫూర్తిని పొంది రాయాలనుకొని కలం పట్టే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. ఎందుకంటే, గొప్ప రచయితలకు అప్పటికే జీవితం సగం అయిపోయి ఉంటుంది. లేక పూర్తి గా అయిపోయి ఉంటుంది. వారి వ్యక్తిత్వం వారి అనుభవాల సారం గా ఏర్పడి ఉంటుంది. వారి రచనలు వారి వ్యక్తిత్వం లోంచీ పుట్టుకొని వస్తాయి. వారి జీవితం లోని వయసు,దశలను బట్టి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మన లాంటి వారు వేరే స్థల కాలాల్లో ఉంటాం. అంటే మన వ్యక్తిత్వం వారి కంటే చాలా భిన్నం గా ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మెరుగ్గా, ఇంకొన్నిటిలో నాసి గా. కాబట్టీ వారి స్థాయి లో కథలల్లటం కష్టమే. అనుకరణ మాత్రం కుదరవచ్చు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అవసరమా?

16.విశాల సమాజం లో లానే రచయితల సమాజం లో కూడా కుల ప్రాంత మతాల కుమ్ములాటలూ, భావజాలపు పీకులాటలూ, రాజకీయాలూ ఉంటాయి.  తస్మాత్ జాగ్రత్త!

17. ఈ రొజుల్లో తెలుగు రచయితకొచ్చే పాపులారిటీ కొన్ని వేల పాఠకుల సంఖ్యను మించకపోవచ్చు. అచ్చు లో మీ పేరు చూసుకోవాలంటే (పుస్తకం వేసుకోవాలంటే),  మీ చేతి చమురు వదలవచ్చు.

18.తెలుగు రచనలకి భవిష్యత్తు లేదు. పీరియడ్. ఇంకో పదేళ్ళ లో, బళ్ళో తెలుగు మీడియం చదివే వారు దాదాపు మృగ్యమవుతారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి తెలుగు చదవటం నేర్చుకొన్న వారికి (అసలు నేర్చుకొంటే) తెలుగు చదివే ఫ్లూయెన్సీ చాలా తక్కువ గా ఉంటుంది (కాలేజి వరకూ తెలుగు మీడియం లో చదివిన నాకే, ఇంగ్లీషు మాటలు లేకుండా రాయటం కుదరటం లేదు). ఇక తెలుగు రచనలు చదివేది ఎవరు? చేసేది ఎవరు?తెలుగు లో రాయటం అనేది శిల్ప కళ లా “ఒకప్పుడు విలసిల్లిన కళ”  కావటానికి ఎన్నో రోజులు పట్టదు.

19. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి. మీరు ఎప్పుడూ పుస్తకాలలో మునిగి  తేలేటట్లైతే మీ పిల్లల మీద మీ ప్రభావం కంటే మీ భార్య ప్రభావం ఎక్కువ ఉంటుంది (వారి తో ఎక్కువ సమయం గడపటం వలన). శ్రీ శ్రీ గారు తన నాస్తికతను ఆయన ఇద్దరు భార్యలూ కొడుకు చేత కూడా ఆచరింప చేయలేకపోయారు. అలానే అనేక వామపక్ష మేధావుల పిల్లలు ఇప్పుడు అమెరికా లో ఉంటూ, తమ పెద్ద వారివి ఛాదస్తపు ఆలోచనలు గా భావిస్తున్నారు. ఇంట్లోనే మీ భావాలకు గొప్ప విలువ లేని పరిస్థితి దాపురించ వచ్చు. ఇంట్లో వారిని తమ ఆదర్శాల తో ఒప్పించలేని వారి భావాలను సమాజం ఒప్పుకోవాలనుకోవటం అత్యాశ కదా?

20. మీరు రాజకీయ సవ్యత ఉన్న తెలంగాణ వాదం, స్త్రీ వాదం, దళిత వాదం వంటి వాటికి వ్యతిరేకం గా కథలు రాసేటట్లైతే ఇంకొక సారి ఆలోచించుకోండి. పత్రికలు మిమ్మల్ని చూసి జడుసు కొంటాయి. మిమ్మల్ని ఆమడ దూరం లో పెడతాయి. ఎవరి సర్క్యులేషన్ వారికి ముఖ్యం కదా! అలానే పత్రికల పోకడల గురించి వ్యంగ్యం గా రాస్తే వాటిని ప్రచురించేంత విశాల హృదయం పత్రికలకు ఉండదని గుర్తుంచుకోండి.లౌక్యం అనేది కథలు రాసేవారికి కూడా అవసరం మరి.

21. పబ్లిషర్లూ, పత్రికలలో ఉండే ఉద్యోగులతో స్నేహాలూ, నెట్వర్కింగూ లేని వారు,తమ కథలను పబ్లి ష్ చేసుకోవటం గురించి పునరాలోచించుకోవలి.

22. జీవితం లో రచయిత ఉండే మూడ్ ని బట్టీ, జీవిత దశ ని బట్టీ కూడా అతని రచనలు ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న రచయిత హాస్య రచనలు రాయటం కష్టం.అంతర్ముఖుడైన రచయిత సంభాషణలు రాయటానికి కష్టపడవచ్చు. డెబ్బై యేళ్ళ రచయిత రొమాన్స్ రచించటం అరుదు (ఆ రచయిత మనసు కవి ఆత్రేయ లాంటి వాడైతే తప్ప).