ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..

కథలు రాయాలనే బులపాటం చాలా మందికి ఉంటుంది. అచ్చు లో తమ పేరు చూసుకోవాలనో, పేరు తెచ్చుకోవాలనో, తమ భావాలనూ ఆలోచనలను పంచు కోవాలనో రాస్తారు.
నేనేమీ గొప్ప కథకుడిని కాదు. కనీసం చిన్న కథకుడిని కూడా కాదు. కథలు రాయాలని ఒకప్పుడు ఆశపడిన ఔత్సాహికుడిని మాత్రమే!
కథలు రాసే క్రమం లో నేను తెలుసుకొన్న విషయాలు, నా లాంటి కొత్త ఔత్సాహికులకు ఉపయోగపడతాయని, ఇక్కడ:
1. మీరు మీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథ రాయాలనుకొంటే, మరొక్క సారి ఆలోచించుకోండి. అభిప్రాయాలను వ్యాసాల ద్వారా సూటి గా చాల తక్కువ మాటలలో చెప్పవచ్చు. ఒక ఇరవై పేజీల కథ ద్వారా చెప్పే అభిప్రాయాన్ని , ఓ వాక్యం ద్వారా వ్యాసం లో చెప్పవచ్చు.కథ, రచయిత అభిప్రాయాలను ఏదో ఒక స్థాయి లో ప్రతిబింబిస్తుంది. కానీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథను రాయనవసరం లేదు.
2. కథలు రాయటం చిత్రాలు గీయటం లాంటిది, మట్టి తో బొమ్మలు చేయటం లాంటిది. ఉదాహరణ కి ఒక స్త్రీ బొమ్మ ఎంత నిజమైన స్త్రీలా కనపడితే అంత ఆ బొమ్మ గొప్పది అవుతుంది. అలా అని బొమ్మ నిజం కాదు. బొమ్మ బొమ్మే. అది వాస్తవ భ్రమ ను కలుగజేస్తుంది. ఈ సూత్రం కథలకు కూడా వర్తిస్తుంది.కథ అనేది నిజం లా అనిపించే “అందమైన” అబధ్ధం. దీనినే శిల్పం అంటారు.    కథ రాసే వారికి అందమైన కల్పనలు చేసే ఆసక్తి ఉండాలి. వాస్తవం లో ఉన్న చెత్త అంతా కథల లోకి ఎక్కటం బాగుండదు. కథలు ముఖ్యం గా మనిషి మానసికప్రపంచం లో చోటున్న విషయాల గురించి రాస్తాము. మన మానసిక ప్రపంచం లో ఏ విషయాలకి చోటు ఉంటుంది అనేది మన విలువలూ ప్రాముఖ్యతలూ నిర్ణయిస్తాయి.మన చేతన లో చోటు లేని విషయాలకి అంతశ్చేతన లో చోటుంది. (ఉదా: నిషిధ్ధమైన సెక్స్) .  వాస్తవాన్నే కొలబద్ద గా పెట్టుకొంటే, మన మానసిక ప్రపంచం లో స్థానం లేని అనేక విషయాలు (కాల కృత్యాలు తీర్చుకోవటం లాంటివి) కథలలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ వాస్తవ విషయాల ఆధారం గా కథలు రాస్తే అవి మళ్ళీ మన మానసిక ప్రపంచం లోనీ విషయాల గురించే ఏదో ఒక పాయింట్ చెప్పేవై ఉండాలి. వాస్తవ విషయాలను వాటి యధాతధ నిడివి తో కథలలో ప్రస్తావిస్తే అది వాస్తవికత కాజాలదు. ఒక వ్యక్తి పది నిమిషాలు పళ్ళుతోముకొంటే, కథలో ఆ వర్ణన పది నిమిషాల పాటు ఉండజాలదు కదా!

వ్యాసాలు నేరు గా పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తే, కథలు సబ్-కాన్షస్ గా ప్రభావితం చేస్తాయి.
3. కథకు ఒక ఇన్స్పిరేషన్ ఉండవచ్చు. ఆ ఇన్స్పిరేషన్ తో సంఘటనలూ, సన్నివేశాలూ అల్లటం లో కథకుడి ప్రతిభ బహిర్గతమౌతుంది. కథ ద్వారా ఒక భావోద్వేగ పరమైనా, లేక ఆలోచనా పరమైన సత్యాన్ని కథకుడు చెప్పగలగాలి.అంటే కథ చదివే వారి లో భావోద్వేగాలనైనా కలిగించగలగాలి, లేక ఆలోచనలనైనా రేపగలగాలి. సన్నివేశాలు అల్లటం కోసం కష్టపడే వారు, “ఇంకా కథలు అల్లటం నేర్చుకోవాలి” అని అర్ధం.పాత్రలకి “నిజ జీవితం లో వ్యక్తులకి ఉన్న multi-dimesionality”, ఎంత ఎక్కువ గా ఉంటే అవి అంత సజీవం గా కనపడుతాయి
4.పరిభావనల స్థాయి లోనే ఆలోచనలు చిక్కుకు పోయి, వివరాలంటే పడని వారు కథలు రాయటం కష్టం.
5. తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవటానికి కథలు రాయవచ్చు. ఆ అనుభవాలూ, కథకుడి ఆలోచనా సరైనవైతే, పాఠకుడికి ఆ కథ ద్వారా నాణ్యమైన అనుభూతే దొరుకుతుంది. అయితే, నిజ జీవితం లోని సంఘటనల ఆధారం గా కథలల్లటం లో ఉన్న ప్రతిభ, పూర్తి కాల్పనిక కథలల్లటం లో ఉన్న ప్రతిభ కన్నా తక్కువ అనే విషయాన్ని కథకుడు అంగీకరించాల్సిందే!

6. కథలు చదివి ఆనందించే చాల మంది కథలు రాయటానికి ఉత్సాహపడతారు. కానీ రాయటం చదవటం కంటే భిన్నమైన ప్రక్రియ. ఇతరులు రాసిన కథలను చదివేటపుడు,  కథకుడు చెప్పే పరిధిలోని విషయాలు మాత్రమే మన మనో ఫలకం పై ఆడతాయి. కానీ కథ రాసేటపుడు మన అనేక ఇష్టాఇష్టాలు priority ప్రకారం మనో ఫలకం పై ముందుకు వస్తాయి. ఉదాహరణ కు ఇతరులు రాసిన వర్ణనలు చదివి ఆనందించే మనం, రాసేటపుడు వర్ణనలు రాయలేక పోవచ్చు. కారణం వర్ణనలు మనకు ఇష్టమైనప్పటికీ, వాటికంటే మనకు వ్యక్తి గతం గా ముఖ్యమైన పరిభావనలూ మానవ సంబంధాలూ మన మనోఫలకం పైకి రావచ్చు.
మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే, వంట తిని ఆనందించే వాళ్ళందరూ వంట చేయటం ఇష్టపడనవసరం లేదని.చాలా సార్లు కథలు రాయటం లోని ఆనందం కంటే వేరే వాళ్ళు రాసిన కథలు చదవటం లోని ఆనందమే ఎక్కువ గా ఉంటుంది.

7. కథ కి సాంఘిక ప్రయోజనం ఉండాలా వద్దా? అని పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడను , కానీ, “కథ కు అంత సీన్ ఉందా?” అనేది నా సందేహం. రా.వి శాస్త్రి లాంటి వారు చివరి రోజులలో పెన్ను పక్కన పెట్టి, గన్ను పట్టాలన్నారు.  కొ.కు(కొడవటిగంటి . కుటుంబ రావు) చివరికి కథలు రాయటం అపేశారు. చా.సో(చాగంటి సోమయాజులు) ముందే విరమించారు. ఫ్రెంచ్ విప్లవం నాటి పరిస్థితులు ఈ రోజున లేవు.
తెలుగు సమాజం లో, టాల్ స్టాయ్, హెమింగ్వే ల లా గన్ను పట్టి ఆ పై పెన్ను పట్టిన రచయితలెవరూ లేరు. ప్రముఖ రచయితలందరూ పట్నాలలోని తమ మధ్యతరగతి వాలు కుర్చీలలో సుఖం గా కూర్చొని పెన్ను పట్టి, ఇతరులను గన్నుపట్టమని ప్రోత్సహించినవారే!

శ్రీ శ్రీ మహాప్రస్థానం వంటి సులభమైన కావ్యమే, పాటక జనాలకు అర్ధం కాదు. పేద వారి గురించి రాసే కథలన్నీ, నాకు “పేద వారిని ముడి పదార్ధం గా తీసుకొని మధ్య తరగతి చేసుకొనే రస సృష్టి గా కనిపిస్తాయి.”

8. ఈ రోజుల్లో, తెలుగు కథలు రాసి డబ్బులు చేసుకోవాలనుకోవటం, “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అనేదాన్ని గుర్తు చేస్తుంది.  యండమూరులూ, మల్లాదులూ మానేశారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.

9. కథలు ప్రధానం గా మానవ సమాజం లోని సంబంధాల ను చిత్రిస్తాయి. కానీ ఈ పరిధికి ఆవల ఉండే సైన్స్, టెక్నాలజీ, తత్వం, కాస్మాలజీ వంటి అనేక విషయాలపై కథలు చదివి వాటి పై అవగాహన పెంచుకోవటం కంటే, ఆయా విషయాలను నేరు గా చదివి అవగాహన పెంచుకోవటం సులువు.  అందుకే  కథలకు ఉండే ప్రభావం ఈ విషయలలో చాల పరిమితం.జీవితం లో ఉండే సవా లక్ష రంగాలలో, సాహిత్యం అనే ఒక చిన్న రంగం లో, ఒక కొత్త చిన్న ప్రక్రియ మాత్రమే కథ. దానికి ఉన్న పరిమితులు అనేకం.

10. మీకు అందమైన రసన కంటే ఆచరణ ఇష్టమైతే, కథలు రాయటం శుధ్ధ దండుగ.

11. సాహిత్యానికి సమాజం లో ఉండే స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని, ఊహలతో రాసిపారేయటం చాలా సులువు. దానికి కావలసింది కథలు రాసే ప్రతిభ మాత్రమే. పీపాడు ఆలోచనల కంటే, చెంచాడు ఆచరణ కొండంత మెరుగు. బయటకు వచ్చి సమాజం తో తలపడి పోరాడి సాధించటం చాలా కష్టం.  వ్యక్తి గతం గా రచయితలు ఆచరించని ఆదర్శాలను ప్రబోధిస్తూ రచనలు చేసే హక్కు, రచయితలకు లేదు కాక లేదు.అత్యున్నత ఆదర్శాలూ, నీతులూ ప్రవచించే రచయితలు, ఏ ఆదర్శాలూ విలువలూ లేని రాజకీయ మీడియా సంస్థలు విసిరే కుక్క బిస్కట్లకూ ఉద్యోగాలకూ ఆశపడటం ఆ రచయితల ఆదర్శాల పైపూతలను తెలియజేస్తోంది. ఒక వేళ పొట్టకూటి కోసం ఆయా సంస్థలకు పనిచేస్తోన్నట్లైతే, ఆ విషయాలను నిజాయితీ గా, బహిరంగం గా  ఒప్పుకోవటం మంచిది(శ్రీ శ్రీ లా).తన దాకా వస్తే గానీ తెలియదంటారు కదా మరి!

రచయిత ఓ ఆదర్శాన్ని పాటించాడని, అలా పాటించని వారిని తప్పుపట్టే హక్కు అతనికి లేదు. ఇతరులకి ఆ ఆదర్శాన్ని పాటించటం “రచయితకి అయినంత convenient” కాక పోవచ్చు. లేక, ఆ ఆదర్శం గురించి ఇతరులు convince అయి ఉండక పోవచ్చు. కాకపోతే ఇతరులకి ఆ ఆదర్శం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు.రచయిత కి ఆ ఆదర్శం పాటించటానికి ఎంత హక్కు ఉందో ఇతరులకి “పాటించక పోవటానికి” అంతే హక్కు ఉంటుంది.

12. మన వ్యక్తి గత గోడునూ, ఉద్వేగాలనూ,అనుభూతులనూ  పంచుకోవటానికి కవిత్వం సరైన సాధనం అనుకొంటా.!

13. అసలు విషయం ఉంటే ఎవరైనా రాస్తారు. విషయం లేనప్పుడు కూడా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా వంటి విషయాలపై పేజీలకు పేజీలు రాసి జనాలను మెప్పించటం( జనాలకు వినోదాన్ని పంచటం) ఒక గొప్ప కళే. అలాంటి రాత గాళ్ళకు నా “సెల్యూట్”.

14. భాష పై పట్టు లేని వారు కథలకి దూరం గా ఉండటం మంచిది. కవిత్వం సంగతి చెప్పనవసరం లేదు.

15. గొప్ప రచయితల రచనలు చదివి, వాటి తో స్ఫూర్తిని పొంది రాయాలనుకొని కలం పట్టే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. ఎందుకంటే, గొప్ప రచయితలకు అప్పటికే జీవితం సగం అయిపోయి ఉంటుంది. లేక పూర్తి గా అయిపోయి ఉంటుంది. వారి వ్యక్తిత్వం వారి అనుభవాల సారం గా ఏర్పడి ఉంటుంది. వారి రచనలు వారి వ్యక్తిత్వం లోంచీ పుట్టుకొని వస్తాయి. వారి జీవితం లోని వయసు,దశలను బట్టి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మన లాంటి వారు వేరే స్థల కాలాల్లో ఉంటాం. అంటే మన వ్యక్తిత్వం వారి కంటే చాలా భిన్నం గా ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మెరుగ్గా, ఇంకొన్నిటిలో నాసి గా. కాబట్టీ వారి స్థాయి లో కథలల్లటం కష్టమే. అనుకరణ మాత్రం కుదరవచ్చు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అవసరమా?

16.విశాల సమాజం లో లానే రచయితల సమాజం లో కూడా కుల ప్రాంత మతాల కుమ్ములాటలూ, భావజాలపు పీకులాటలూ, రాజకీయాలూ ఉంటాయి.  తస్మాత్ జాగ్రత్త!

17. ఈ రొజుల్లో తెలుగు రచయితకొచ్చే పాపులారిటీ కొన్ని వేల పాఠకుల సంఖ్యను మించకపోవచ్చు. అచ్చు లో మీ పేరు చూసుకోవాలంటే (పుస్తకం వేసుకోవాలంటే),  మీ చేతి చమురు వదలవచ్చు.

18.తెలుగు రచనలకి భవిష్యత్తు లేదు. పీరియడ్. ఇంకో పదేళ్ళ లో, బళ్ళో తెలుగు మీడియం చదివే వారు దాదాపు మృగ్యమవుతారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి తెలుగు చదవటం నేర్చుకొన్న వారికి (అసలు నేర్చుకొంటే) తెలుగు చదివే ఫ్లూయెన్సీ చాలా తక్కువ గా ఉంటుంది (కాలేజి వరకూ తెలుగు మీడియం లో చదివిన నాకే, ఇంగ్లీషు మాటలు లేకుండా రాయటం కుదరటం లేదు). ఇక తెలుగు రచనలు చదివేది ఎవరు? చేసేది ఎవరు?తెలుగు లో రాయటం అనేది శిల్ప కళ లా “ఒకప్పుడు విలసిల్లిన కళ”  కావటానికి ఎన్నో రోజులు పట్టదు.

19. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి. మీరు ఎప్పుడూ పుస్తకాలలో మునిగి  తేలేటట్లైతే మీ పిల్లల మీద మీ ప్రభావం కంటే మీ భార్య ప్రభావం ఎక్కువ ఉంటుంది (వారి తో ఎక్కువ సమయం గడపటం వలన). శ్రీ శ్రీ గారు తన నాస్తికతను ఆయన ఇద్దరు భార్యలూ కొడుకు చేత కూడా ఆచరింప చేయలేకపోయారు. అలానే అనేక వామపక్ష మేధావుల పిల్లలు ఇప్పుడు అమెరికా లో ఉంటూ, తమ పెద్ద వారివి ఛాదస్తపు ఆలోచనలు గా భావిస్తున్నారు. ఇంట్లోనే మీ భావాలకు గొప్ప విలువ లేని పరిస్థితి దాపురించ వచ్చు. ఇంట్లో వారిని తమ ఆదర్శాల తో ఒప్పించలేని వారి భావాలను సమాజం ఒప్పుకోవాలనుకోవటం అత్యాశ కదా?

20. మీరు రాజకీయ సవ్యత ఉన్న తెలంగాణ వాదం, స్త్రీ వాదం, దళిత వాదం వంటి వాటికి వ్యతిరేకం గా కథలు రాసేటట్లైతే ఇంకొక సారి ఆలోచించుకోండి. పత్రికలు మిమ్మల్ని చూసి జడుసు కొంటాయి. మిమ్మల్ని ఆమడ దూరం లో పెడతాయి. ఎవరి సర్క్యులేషన్ వారికి ముఖ్యం కదా! అలానే పత్రికల పోకడల గురించి వ్యంగ్యం గా రాస్తే వాటిని ప్రచురించేంత విశాల హృదయం పత్రికలకు ఉండదని గుర్తుంచుకోండి.లౌక్యం అనేది కథలు రాసేవారికి కూడా అవసరం మరి.

21. పబ్లిషర్లూ, పత్రికలలో ఉండే ఉద్యోగులతో స్నేహాలూ, నెట్వర్కింగూ లేని వారు,తమ కథలను పబ్లి ష్ చేసుకోవటం గురించి పునరాలోచించుకోవలి.

22. జీవితం లో రచయిత ఉండే మూడ్ ని బట్టీ, జీవిత దశ ని బట్టీ కూడా అతని రచనలు ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న రచయిత హాస్య రచనలు రాయటం కష్టం.అంతర్ముఖుడైన రచయిత సంభాషణలు రాయటానికి కష్టపడవచ్చు. డెబ్బై యేళ్ళ రచయిత రొమాన్స్ రచించటం అరుదు (ఆ రచయిత మనసు కవి ఆత్రేయ లాంటి వాడైతే తప్ప).

ప్రకటనలు

25 thoughts on “ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..”

 1. చాలా బాగా రాశారు.
  పదకొండో పాయింట్ గూర్చి ఆలోచిస్తున్నాను.
  ఈ పోస్ట్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని భావిస్తున్నాను.
  మీ బ్లాగులు రెగ్యులర్ గా చదువుతున్నాను.
  అనేక రకాల అంశాలపై సూటిగా, సరళంగా రాస్తున్నారు.
  అభినందనలు.

  మెచ్చుకోండి

 2. య రమణ గారు,
  ధన్యవాదాలండీ. నేను కూడా మీ టపాలు రెగ్యులర్ గా చదువుతుంటాను. మీ టపాలు హాయి గా చదువుకొనేట్లు గా ఉంటూనే మంచి మెసేజ్ ని కూడా ఇస్తాయి.

  మెచ్చుకోండి

 3. చాలా బాగుంది. నేనుకూడా రచయితనవ్వాలన్న దురదున్న వాన్నే. కకపోతే నా కోరిక నా సంతృప్తి కోసమే. మంచి ఫిక్షన్ నవల్స్ రాయాలన్న కోరిక. కాకపోతే, మీరు ఒక పాయింట్లో చెప్పినట్టు స్ట్రైట్ గా రాయడమే కానీ, అందంగా సరదాగా చెప్పే విధ్య నాకింకా అలవడలేదు. సాధనమున సమకూరు ధరిలోన అన్నట్లు ప్రయత్నించ దలిచా.

  మెచ్చుకోండి

 4. బాగుంది వాస్తవికంగా రాశారు . తమ తృప్తికోసం కథలు రాసుకోవాలంటే మంచిదే కానీ డబ్బు, పేరు కోసం అంటే సాధ్యం కాదు . కథలు రాసి యండమూరి పక్కన పీట వేసుకొని కుర్చున్డమంటే సాధ్యం అయ్యే పని కాదు. తెలుగు చదివే వారు తగ్గి పోతున్నారని మీరు రాసింది నిజమే అదే సమయం లో తెలుగు చదివే వారు 10 ఏళ్ళ తరువాత కూడా చాలా మందే ఉంటారు ఎలా అంటే దాదాపు ఇప్పుడు 60 శాతం అక్షరాశ్యత. ఇప్పటికీ 40 % మంది చదువుకు దూరంగానే ఉంటున్నారు . భవిషత్తులో తెలుగు బతికేది ఈ వర్గం లోనే .. ఆ వర్గం ఆర్ధిక స్థితిగతులు కొద్దిగా మెరుగు పడవచ్చు వారు కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూల్ లో తెలుగులో చదువుకొనే అవకాశం ఉంది .

  మెచ్చుకోండి

 5. ఆల్రెడీ ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అని మొదలు పెట్టారు.దిగువ వర్గాలూ దళిత మేధావులూ కూడా ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ని సమర్ధిస్తున్నారు. ఓ పది సంవత్సరాల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
  మొదట తెలుగు లో రాసేవారు తగ్గుతారు. తరువత తెలుగు చదివే వారు తగ్గుతారు. ఆ తరువాత తెలుగు సగం ఇంగ్లీష్ తో మాట్లాడుతారు. ఆపై ఆలోచించటం ఇంగ్లీష్ లో మొదలౌతుంది, ఆ పై పూర్తిగా ఇంగ్లీష్ లో ఆలోచించటం, మాట్లాడటం మొదలౌతుంది, తరువాత తెలుగే మాయమౌతుంది (చాలా సంవత్సరాల తరువాత కావచ్చు)

  మెచ్చుకోండి

 6. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి.
  ——————————————
  వావ్ ఏమి చెప్పారు?. కధలే కాదు అన్నిటిలోనూ అంతే. రిటైరు అయి ఇంట్లో కూర్చుంటే ఇంకా బాధ.

  మాకు కొంచెం లేటుగా తెల్లారుతుంది. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  మెచ్చుకోండి

 7. వామ్మో, ఇవన్నీ ముందరే తెలియకుండా పోవడం మంచిది అయ్యింది. చాలా కథలు రాసేసా అవి ప్రింటూ అయిపోయేయి! జేకే!

  కథల్రాయాలనుకుంటీ వెంటనే రాసెయ్యాలి. మనం దానికి తగుమా కాదా అని ఆలోచించ కూడదన్నమాట! అది చదివే వాడి ప్రాబ్లెం చదవాలా వద్దా అన్నది !

  రెండు, కథల్రాయడం బ్లాగటం కన్నా చాలా ఈజీ! జేకే !

  కధలరాయడం ఎలా అన్న పుస్తకం చదవడం మంచిదనుకుంటాను ! శార్వరి గారిదనుకుంటాను. మోర్ inspiring and పాసిటివ్ నెస్ అబౌట్ దట్!

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 8. జిలేబి గారూ మీరు నాచురల్ గ వ్రాయ గలిగే శక్త్క్తి ఉంది. అందుకని ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్ళం వ్రాద్దామని కూర్చుంటే అప్పుడే మా కాఫీ లోకి పాలుండవు, వంట చెయ్య టానికి ఉప్పు ఉండదు. స్నానానికి సోపులు అయిపోతాయి. ఏది ముందో ఆలోచించాలి బజారుకి వెళ్ళటమా లేక వ్రాయటమా ఏది ముఖ్యమో తేల్చుకోవాలి. అది చివరికి వ్రాశాము పో కొంచెం చదివి ఎల్లా ఉందొ చెప్పమన్నా చెప్పరు. నాలుగు సార్లు కరెక్టు చేస్తే గానీ మనకే నచ్చదు. ఆలోచించకుండా ఎల్లా వ్రాస్తాము ? ఇంట్లో వాళ్లకి ఊర్కేనే కుర్చీలో కూర్చున్నాడే అని కుళ్ళు అనుకుంటాను. అదీ మా బాధ. మా టేలంట్ ని బయటికి తీసుకు వద్దామని అనుకున్నా కష్టమే. ఈ బాధలగురించి పుస్తకాల్లో వ్రాయరు. బొందలపాటి వారు మెన్షన్ చేసారు. థాంక్స్.

  మెచ్చుకోండి

 9. జిలేబి గారు,
  మొత్తానికి ఇది నెగటివ్ టపా అనేశారుగ! 🙂
  ఈ టపా బహుశా మీ లాంటి వాళ్ళ నుద్దేశించి కాదండీ. పూర్వం నా లాంటి వారు సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుదామని చెన్న పట్నం చేరుకొని, ఆనక నా నా తిప్పలూ పడే వారట. అలంటి కథా ఔత్సాహికులను ఉద్దేశించి ఈ టపా.

  మెచ్చుకోండి

 10. @లక్కరాజు గారు,

  జీవాత్మలో పరమాత్మ ని గాని గాంచిన మీ కథకన్నా ఇప్పుడొచ్చే కథలు గొప్పంటారా ?

  ఇక వంట సంగతి ఉప్పు సంగతి అంటారా, నేను దానికి సప్పోర్ట్ ఇవ్వాలి. మా వారు ఇలా కుర్చీ లో కూర్చుని రాస్తే శుద్ధ టైం వేష్టు ఎందుకుచేస్తారండీ, ఉప్పు నిండుకుందే, తీసుకోద్దురు అంటాను. ! –

  మనం కూర్చుని రాస్తూంటీ , పోదు – ఇంటి పనంతా అయ్యాక , కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను సుమండీ !!! ఎంతైనా మేము గడుసు వారమే నండోయ్ !, ‘పతివ్రతా ‘శిరో’మణీ యులం !!

  @బొందలపాటి వారు,

  జస్ట్ కిడ్డింగ్. పాపం ఔత్సాహికులు !! టపా చదివి హడలి పోయేరు. పోరనుకొండీ, ఎందుకంటే, కా ‘మింటు’ లూ వారు చదువుతారు, అబ్భా, ఈ జిలేబి రాయగాలేనిది, ఆ పాటి మనమూ రాయలేమా అని వారికి గుండె ధైర్యం వచ్చేస్తూంది. !!! ఐ యాం సో ఆల్ పాసిటివ్ అబౌట్ దట్!!

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 11. అయ్యో శైలజా చందు గారు,
  ఈ టపా మీ లాంటి వారిని ఉద్దేశించి కాదండీ. మీరేమీ ఆలోచించకుండ మీ రచనలు కొనసాగించండి. మీ రచనలు చదవటం ఆపటానికి మీ ఫ్యాన్ గా నేనేమాత్రం సిధ్ధం గా లేను.
  ఈ టపా లో కొన్ని సాధారణ పరిమితులూ, వ్యక్తిత్వ పరమైన వ్యక్తిగత పరిమితులూ మాత్రమే చర్చించాను. ఈ పరిమితులకి అతీతం గా చాలా మందే ఉంటారు. వారు రాయక పోవటం వలన వారికి పోయేదేమీ లేదు. తెలుగు సమాజమే మంచి రచయితల ని కోల్పోతుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s