చింత చెట్టు మీద కాకుల సమావేశం

“కావ్ ..కావ్..ఈ కాకేదో తేడాగా ఉంది..అందరూ రండీ..”, అని కూసింది హెడ్ కాకి.
వెంటనే ఆ చుట్టు పక్కల ఊళ్ళలోని కాకులన్నీ  వచ్చి ఆ ఊరి బయటి చింత చెట్టు మీద వాలిపోయాయి.
“ఏమిటి విషయం?”, అంది ఒక “గుంపులో గోవిందయ్య” కాకి.
“చూడండి. దీని కూత తేడా గా ఉంది. పైగా ఇది ఏమందో తెలుసా..? “కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది హెడ్ కాకి.
“వార్నీ! అయితే దీనిని పొడవాలిసిందే..!తన్నాల్సిందే..!తన్నండి..తన్నండి”, కాకులన్నీ తమ ఇనప గోళ్ళతో ఆ ఎర్ర కాకిని ఎగిరి తన్న సాగాయి.
“ఇంకా ఏమందో తెలుసా? మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ,  కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.
“తప్పు రా ఎర్ర కాకీ. వేదాలలో అంతా మంచే ఉంది. వేదాలూ గీతా అన్ని వర్ణాలూ సమానమనే చెప్పాయి. ఆచరణలో విఫలమైతే వేదాలదా బాధ్యతా..? వాటిలో అనేక కనిపెట్టబడని నిగూఢార్ధాలున్నాయి.గురజాడ వంటి మహా కవి, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, అని చెప్పలేదా? అయినా వేదాల ను ప్రశ్నించటానికి నువ్వెంతా నీ అనుభవమెంతా? పిల్ల కాకీ!” అని , మిగిలిన కాకులతో, ” వీడిని మళ్ళీ మీ వాడి ముక్కులతో పొడవండి…కావ్..కావ్..వీడు “ఐ ఎస్ ఐ” ఏజంటైనా ఉండాలి లేక చైనా ఏజంటైనా ఉండాలి,” అంది గుంపులో గోవిందయ్య కాకి.

హెడ్ కాకి: విమానాలూ, అణు బాంబులూ గట్రా మన వేద కాలం లోనే ఉన్నాయని నేనంటే, “అప్పటి డిజైన్లు మొన్నీ మధ్య పరీక్షిస్తే ఫెయిలయ్యాయని” చెప్తోంది. ఇంకా..”మన వాళ్ళ ఫేక్ రెజ్యూం లలా, అవి ఫేక్ డిజైన్లా?” అని వెక్కిరిస్తోంది. పైపెచ్చు. “విమానాలు ఆ కాలం లోనే ఉంటే వాటి అవశేషాలు పురావస్తు తవ్వకాలలో ఎందుకు బయట పడలేదు?” అంటోంది. నేనన్నాను, “పురావస్తు తవ్వకాలలో బయట పడటానికి అవేమన్నా భౌతిక వస్తువులా? మన రుషుల మంత్ర శక్తి తో ఉద్భవించిన అధిభౌతిక వస్తువులు కదా?” …. దానికి ఈ పిల్ల వెధవ ఏమందో తెలుసా?..” మీ వాదనలకి ,మీ వ్యక్తిగత నమ్మకాల ఆధారం లేని ఏదైనా నిరూపణ చూపించండి!”.
“అదేమి కూసినా, నువ్వు బాగా సమధానం చెప్పావు. వీడు మన పూర్వీకుల ఈకలు పీకుతున్నాడు , కాబట్టీ, వీడి ఈకలు పీకండి,” అని మిగిలిన కాకులకి పిలుపునిచ్చింది గు.గో. కాకి.
హెడ్ కాకి మళ్ళీ కావ్ భాష లో చెప్పింది, “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం”, అని కూడా అంది.
“ఇది దీనికి వచ్చిన ఆలోచన కాదు. ఆ తమిళ రామస్వామో, లేక తెలుగు రామస్వామో చెప్పిన మాటలను విని చెడిపోయింది. ఆ రామ స్వాములను లోకమంతా మరిచిపోయింది. కానీ, ఇది మరిచిపోలేదు. ఇంకా నయం.. దీనికి కొ.కు, శ్రీ శ్రీ లాంటి వారి ఆలోచనలు తెలియవనుకొంటాను. తెలిస్తే కొంప మునుగుతుంది. ఈ లోపే, తన్నండి, పొడవండి.”
” ఇది ఈ మధ్య “కాకిత్వ వాదం” అదీ ఇదీ అని పేలుతోంది”
గు.గో కాకి పెద్ద గా అరిచింది, “అయితే దీనికి ఇన్నయ్య జబ్బు అయినా పట్టి ఉండాలి, లేక రాయో రప్పో తగిలి ఉండాలి. ముక్కులకి పదును పెట్టి మరీ దీనిని పొడవండి”
“అంతే కాదు, అప్పుడప్పుడూ దళిత-బహుజనులు అనే పదం వాడుతోంది”
“అమ్మో! అయితే అయిలయ్య రోగం పట్టుకొంది దీనికి. దీనిని చీరాల్సిందే! ఇంకా నయం “జై తెలంగాణా..” అని పాట పాడటం లేదు!”
“”జై తెలంగాణ..”, అని పాట పాడటం లేదు . కానీ, “చీ కొట్టినా పోవేరా ఆంధ్రోడా?”, అంటోంది.”, అంది హెడ్ కాకి.
“ఇది చాలా డేంజర్. దీనిని చెట్టుమీదినుంచీ తోసేయండి!, కాదు..కాదు..కానీ మనం సమైక్య వాదులం కదా! కాబట్టీ, చెట్టు మీదే ఉంచి ముక్కు తో పొడవండి”
“ఇది తనకు “అమెరికా పురం” లో ఎద్దు ను పొడవటానికి చాన్స్ వచ్చినా వెళ్ళలేదంట. అమెరికా పురం వెళ్ళిన కాకులన్నిటికీ కొంచెం స్వార్ధం ఎక్కువ అంటోంది”
గు. గో కాకి, వెటకారం గా ఎర్ర కాకి కళ్ళలోకి చూసి, ” ఛా.! మీ ఊరు కాకవరం లో ఎవరూ స్వార్ధపరులు లేరా?” అని ఎగిరి తన్నింది ఎర్ర కాకిని.
ఇంతలో ఒక అమాయకపు కాకి మెత్త గా గొంతు సవరించుకొని, “దాని పైత్యమేదో అది కూస్తుంది. ఇంతోటి దానికి దానిని ఎగిరి తన్నటం అవసరమా?”, అంది.
“దాని పైత్యం కూయటం లో ఉంటే, మా పైత్యం దానిని ఎగిరి తన్నటం లో ఉంది”, అని కాకులన్నీ అమాయకపు కాకిని ఎగిరి తన్నాయి. అమాయకపు  కాకి కి “ఉలిపి కట్టె” అని పేరు పెట్టాయి. అమాయకపు కాకి మిగిలిన కాకులను intolerant bunch అని తిట్టుకొంటూ ఎగిరిపోయింది.
ఇంతలో అక్కడ గొర్రెలను కాసుకొంటున్న కాపరి ఒకడు ఓ రాయి తీసుకొని, “ఛీ, కాకి గోల!”, అని చింత చెట్టు మీదికి విసిరాడు. ఆ రాయి కాకులకి తగలకుండా దూరం గా పోయింది. కాకులన్నీ ఒక్కొక్కటీ జారుకోవటం మొదలు పెట్టాయి.
“మా పిల్లల కి దొండ పండు తేవాలి”, అని ఓకాకి అంటే, “మా ఆయనకి ఎద్దు పుండు చూపెట్టాలి “, అని ఇంకొక కాకి అంది.
గొర్రెల బుడ్డోడు ఈ సారి గురి తప్పకుండా విసిరాడు. అప్పటికే కాకులన్నీ జారుకున్నాయి.
“కుహూ, కుహూ”, అంటూ ఓ నల్లటి సన్నటి పక్షి బయట పడింది చింత చెట్టులోంచీ!

ప్రకటనలు

18 thoughts on “చింత చెట్టు మీద కాకుల సమావేశం

 1. ఏమండీ బొందల పాటి వారు,

  మీరూ కాకుల కథలు చెప్పడం మొదలెట్టేశారు !! అయ్య బాబోయ్ నేను వెళ్లి వెంటనే కాకుల కథలకి పేటెంటు రిజిస్టర్ చేసేసుకోవాలి ! హమ్మ, ప్రతి ఒక్కరూ ఇలా కాకుల కథల ని జేప్పేస్తే నా గతేం గాను !!

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 2. శ్రీకాంత్ గారు,
  ఓ నెల రోజులనుంచీ రాద్దామనుకొంటున్నాను. ఒకే అభిప్రాయం కలవాళ్ళు ఎవరినో ఒకరిని target చేస్తూ ఒక చోట చేరి వెటకారం చేయటం ఎక్కువైపోయింది ఈ మధ్య బ్లాగులలో. నేను కూడా దీనికి అతీతం ఏమీ కాదు. కానీ భావ సారూప్యం కలవాళ్ళు ఎప్పుడూ ఒకరినొకరు సమర్ధించుకొంటూ రాస్తే వారు ఆలోచించే డైరెక్షన్ ఎపుడూ ఒకటే గా ఉంటుంది. అ దిశ లోని తప్పులు తెలియవు. నాలుగు రకాలుగా నాలుగు కోణాలనుంచీ ఆలోచించే కెపాసిటీ వారు కోల్పోతారు. వారి తెలివి అంతా ఒకే దిక్కులో ఉంటుంది. అందుకనే ఇది రాశాను.
  మీకు ఒకే విషయాన్ని భిన్న కోణాలలోంచీ ఆలోచించగల శక్తి ఉండటాన్ని ఆడవారి వస్త్ర ధారణ గురించిన మీ టపాలలో గమనించాను. కానీ మీరు కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చే సరికి ఆ శక్తిని వదిలేస్తారు.. ఎందుకో! అలానే కమ్యూనిస్టు బైబిళ్ళైన కాపిటలూ, మానిఫెస్టో నెట్లో ఉన్నాయి . వాటి ని కొంతైనా చదివి పాయింట్ల వారీ గా ఎండగడితే, సంతోషించేవాళ్ళలో నేనొకడిని.

  మెచ్చుకోండి

  1. నేను ఇదివరకే ఈవిషయంగా బ్లాగ్ముఖంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ పోస్టు ఇక్కడ చూడండి… ” మార్క్సిజం గురించి నేను చర్చించక పోవడానికి కారణం..!! “.

   ఒక పని చేయండి, మీరైనా సరే లేదా .. మార్క్సిజాన్ని పని గట్టుకుని ప్రచారం చేస్తున్న వ్యక్తులైనా సరే వాటిని పాయింటు వైజుగా మీ టపాలలో రాసి అవి ఎంత గొప్పవో చెప్పండి. ఇక్కడా వాటికి రియాక్షనుగా నేను పోస్టూలు తప్పకుండా రాస్తాను. ప్రస్తుతానికి నేను అది మాత్రమే చేయగలను.

   మెచ్చుకోండి

   1. మీ పై లింక్ పని చేయటం లేదు.
    మార్క్సిజం గొప్పది అని నేను అనను కానీ దానిని నేను చదివినంత వరకూ, నేను అనుకొన్నమంచి చెడుల గురించి ఇంతకు ముందే రెండు టపాలు రాశాను.
    కమ్యూనిజం లోని (నేను అనుకొన్న)లోపాల గురించి కొన్ని ప్రశ్నలు కూడా వేశాను.

    మెచ్చుకోండి

 3. “ఇది చాలా డేంజర్. దీనిని చెట్టుమీదినుంచీ తోసేయండి!, కాదు..కాదు..కానీ మనం సమైక్య వాదులం కదా! కాబట్టీ, చెట్టు మీదే ఉంచి ముక్కు తో పొడవండి”

  సమైక్యవాద నిర్వచనం బాగుంది.

  మెచ్చుకోండి

 4. వేదాలకి మార్క్సిజంతో పోలిక అనవసరం. వ్యక్తిగతంగా దేవుణ్ణీ, ఆత్మలనీ నమ్ముకునేవాడు కూడా తన నిజ జీవితంలో ఇంద్రియాతీత శక్తుల మీద నమ్మకాలతో సంబంధం లేకుండా అన్ని పనులూ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం మార్క్సిస్ట్‌లకి తెలుసు కాబట్టే మార్క్సిస్ట్‌లు మతాన్ని అంతగా విమర్శించకుండా భౌతిక జీవితాలకి సంబంధించిన పెట్టుబడి & వర్గాలకి సంబంధించిన విషయాలనే ఎక్కువగా విమర్శిస్తారు. బ్లాగుల్లో మార్క్సిజాన్ని విమర్శిస్తూ వ్రాసేవాళ్ళకి మార్క్సిజం గురించి ఏమీ తెలియదు. అమెరికాకి చెందిన ఒక అయన్ రాండ్ అభిమాని నడుపుతోన్న వికీపీడియా నుంచి కాపీ కొట్టిన విషయాలే ఇక్కడ వ్రాస్తారు. భాషా ప్రావీణ్యం అంతగా లేని ఈ మార్క్సిజం విమర్శకులకి ఒకవేళ ఇంగ్లిష్ అర్థం కాకపోతే ఈ విమర్శకులు మార్క్సిస్ట్‌లు తమ మతం మీద పడి ఏడుస్తున్నారని అంటూ అరిగిపోయిన రికార్డ్‌లు తిప్పుతారు. అదే ఇక్కడ మార్క్సిజాన్ని విమర్శించేవాళ్ళ మోడస్ ఓపరాండి.

  మార్క్సిజాన్ని చదివిన తరువాతే మీరు విమర్శించండి అని మార్క్సిస్ట్‌లు అన్నారనుకోండి. వీళ్ళు ఏమి సమాధానం చెపుతారంటే “మీరు చదివే బూజు పట్టిన పుస్తకాలు మేము చదవాలా?” అని. మార్క్సిజంలో ఏమి ఉందో ఈ విమర్శకులకి తెలియనప్పుడు అందులో ఇలా ఉంది, అలా ఉంది అని కబుర్లు చెప్పడం ఎందుకు?

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s