నాకు నచ్చిన మనుషులూ, విషయాలూ, వంటలూ..

ఈ మధ్య సమాజం గురించీ, వ్యవస్థా ఇజమూ అదీ ఇదీ అని వాగి వాగి బోర్ కొట్టింది. సమాజానికి మనుగడ సాగించే సత్తా ఉంటే, అది ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంది, లేక పోతే, చంకనాకి పోతుంది. సమాజం గురించి ఓ తెగ అర్ధం చేసుకొని, వ్యక్తిగతం గా గానీ , సామూహికం గా గానీ సాధించేది ప్రస్తుతానికి నాకు కనపడటం లా..
కాబట్టీ, సమాజమూ వ్యవస్థా వగైరాలను కాసేపు పక్కనపెట్టి, నాకు ఇష్టమైన విషయాల గురించి మీతో పంచుకొంటే, రోజు గడిచే సరికి, నాకు కాస్త ఆనందమైనా మిగులుతుంది. అందుకే, నాకు ఇష్టమైన విషయాల గురించి ఈ టపాలో రాస్తాను. మీకు ఇష్టమైన వారి గురించీ, విషయాల గురించీ మీరు టపా కామెంట్లలో తెలుపండేం? ఇవి ఎక్కువ గా తెలుగు ప్రపంచం నుంచే అయి ఉంటాయి. వీరు మీకు ఎందుకు నచ్చారు అని అడిగితే, నేను ఆటే సమాధానం చెప్పలేను. కానీ, కొంచెం వివరించటానికి ప్రయత్నిస్తాను.
నాకు నచ్చిన వ్యక్తులు:

1. గాయకుడు : బాల మురళి
ఆ గొంతు లోని లోతూ గాంభీర్యం వేరెవరికి ఉన్నాయి?
2. సినిమా గాయకుడు: ఘంటసాల, బాలు
ఘంటసాల గారి గాత్రం ఎవరికి ఇష్టముండదు? కానీ, కొన్ని రకాల పాటలు పాడటం లో ఆయనకు పరిమితులు ఉన్నాయనుకొంటాను.

బాలు గారు తెలుగు సినిమా పాటలలో సాహిత్యానికీ, సంగీతానికీ ఉన్న చివరి గౌరవప్రదమైన లంకె.

జేసు దాసు స్వరం బానే ఉటుంది గానీ, అయన పట్టి పట్టి పాడటం, ఉఛ్ఛారణా దోషాలూ నాకు పట్టివేస్తాయి!
3. గాయని : సుబ్బులక్ష్మి
భజగోవిందం విని ఇంకా ఆవిడ అభిమాని గా మారక పోతే ఎలా?  ఆమె గొంతు లో ఉన్న “అతెంటిసిటీ”. ఒక్కో సారి ఆమె గొంతు గయ్యాళి గా వినపడటానికి నాది బాధ్యతా?
4. సినిమా గాయని
చిత్ర: ఎప్పుడన్నా ఒక్క పదం మలయాళం వాసన వచ్చినా, చిత్ర స్వరం అంటే మక్కువే!
అడవి రాముడు, యమగోల కాలం లో సుశీల “కై ,కై ” గొంతు వింటే చాలా కంపరం. జానకి పరవాలా! కానీ, ఆమె కొంచెం కైపు పాటలూ, చిన్న పిల్లల పాటలూ పాడేది. (వైరుధ్యం చూడండి). తరువాత “నా గొంతు శృతిలోనా..” అంటూ మొదలైన చిత్ర గొంతుకి నేను దాసోహం!

లతా మంగేష్కర్ పాత పాటలు బానే పాడేది. కానీ ఇప్పటి 18 యేళ్ళ హీరోయిన్లకు పాడితే, ఆమె స్వరం లోని వయసు మీరిన లక్షణం బయటపడుతోంది!
5. రాజకీయ నాయకుడు : సుందయయ్య, చంద్ర బాబు నాయుడు.
సుందరయ్య: అధికారపక్షం వారి నుంచీ కూడా గౌరవాన్ని పొందిన ఏకైక నాయకుడు. అలా గౌరవం ఇచ్చే వారు ఈ రోజులలో లేరనుకోండి.
చంద్ర బాబు: దీర్ఘకాలిక పధకాలు పెట్టటం, సంస్థలు నెలకొల్పటం, పార్టీకీ ప్రభుత్వానికీ మధ్య కొంత విభజన పాటించటం. మిగిలిన అన్ని విషయాలలో ఈయన కూడా సగటు రాజకీయ నాయకుడే!

పీ వీ ఒక నిజాయితీ దూరదృష్టీ కల తెలుగు ప్రధాన మంత్రి గా ఇష్టమే కానీ, ఆయనను ఒక గొప్ప నాయకుడనవచ్చునా?
6. నటుడు : N.T.R., చిరంజీవి.
నాకు ఊహ తెలిసేటప్పటికి నాటకాలు అటకెక్కాయి. అవి అప్పుడప్పుడూ మూలిగే మూలుగు వినపడేది. కాబట్టీ నాటకాలలో ఎవరు గొప్ప నటుడో చెప్పలేను. సినిమాలలో రామారావు చివరి సినిమాలు ఆడుతున్నాయి. అవి ఇప్పుడు చూస్తే కామెడీ గా ఉంటాయి . కానీ, ఆయన నటించిన పౌరాణికాలు చూసినపుడు అనిపించింది, “న భూతో న భవిష్యతి”. N.T.R. లాంటి నటుడు ఇక ముందు పుట్టబోడు. అది ఆయన గొప్ప కాదు. తెలుగు భాషా సంస్కృతీ అడుగంటి పోతున్న దశలో, మళ్ళీ అలాంటి నటన ఇక సంభవం కాదు.
చిరంజీవి మొదటి సినిమాలూ, బాపూ, విశ్వనాధ్, బాలచందర్ వంటి వారి దర్శకత్వం లో ఆయన నటన చూసినపుడు, చాలా సులువు గా అర్ధమౌతుంది, “ఆయనకున్న ప్రతిభేమిటో”. కానీ, ఎక్కడా..! మన వీరాభిమానులూ, వ్యాపార సూత్రాలూ ఆయనని ఒక మెగా స్టార్ ని చేసి, ఆయనలోని నటుడిని నొక్కేశాయి.
7. కవి: శ్రీ, శ్రీ, ఆత్రేయ
నాకు అర్ధమయ్యే సామాన్యమైన భాష లో అసామాన్యమైన భావాలను వ్యక్తీకరించిన మహా కవి. N.T.R లానే మరో శ్రీ శ్రీ పుట్టబోడు, అవే కారణాల వలన.

శ్రీ శ్రీ గొప్పదనానికి భాషమీద ఆయనకు ఉన్న పట్టు ఒక కారణమైతే, అత్రేయ “సినిమనసు” పాటలకు, కారణం భాష లో ఆయనకు ఉన్న పొదుపు. ఆయన పాటలు రాసినా వాటిలో కవిత్వం ఉంది కాబట్టీ, నా దృష్టి లో ఆయన కూడ కవే!

8. నటి: సావిత్రి
ఇప్పటి నటీమణుల లా శరీర కదలికల ద్వారా కాకుండా, ముఖ కవళికల ద్వారా నటన చేసినందుకు.
9. రచయిత: కొడవటిగంటి. కుటుంబ రావు, రా.వి. శాస్త్రి.
కొ.కు: రచనకి సంబంధించిన అనేకానేక ప్రక్రియలలో సాధికారమైన ఆధునిక రచనలు చేయటమే కాకుండా, అనేక తాత్విక, శాస్త్ర సంబంధమైన వ్యాసాలు రాసినందుకు.
రావి శాస్త్రి: రావిశాస్త్రి లా రాయాలంటే ఆయన మళ్ళీ పుట్టాలిసిందే. అనితరసాధ్యమైన, ప్రవాహసదృశమైన, కవితాత్మకమైన ఆయన శైలి.  ఆయన రచనలలో అట్టడుగు లోకపు వాస్తవ చిత్రణ ఉంటుంది. ఈ అట్టడుగు స్థాయి వారి (మెజారిటీ ప్రజల) జీవిత వాస్తవ చిత్రణ ఎర్ర రచయితల(కారా మేస్టారు ఇంకొక ఉదహరణ) రచనలలోనే ఎక్కువ గా ఎందుకు ఉంటుంది? మార్క్సిస్టు వాస్తవాన్ని చూపించాలంటే, ముందు వాస్తవాన్ని చూపించాలి, తరువాత దానికి ఎర్ర రంగు అద్దాలి. కానీ మిగిలిన నిబధ్ధత లేని రచయితలకి వాస్తవాన్ని చూపించవలసిన ఆగత్యం కూడా ఉండదనుకొంటా!

10. సినిమా దర్శకుడు : విశ్వనాధ్, బాలచందర్
కొంచెం డీసెంట్ గా సినిమాలు తీసే దర్శకులని మన చిత్రసీమా, ప్రేక్షకులూ బతకనివ్వరు. ఎప్పుడన్నా విశ్వనాధ్ వంటి వారినీ, అప్పుడప్పుడూ బాలచందర్ వంటి వారినీ బతకనిస్తుంది. బాలచందర్ వి చాల వరకూ డబ్బింగ్ లూ, రీమేక్ లే. కానీ వాటిలో విషయం ఉంటుంది. లోతు ఉంటుంది. మరో చరిత్ర వంటి సినిమాలకి ఒక surreal aura ఉంది. మన మనసు లోలోపలి భావాలను, ఉద్వేగాలనూ, రహస్య వాంఛలనూ, తాత్కాలికం గా నైనా, బయట పడేటట్లు చేసే శక్తి బాలచందర్ సినిమాలకు ఉంది.

తమిళం లో భాగ్య రాజా సినిమాలు కూడా బానే ఉంటాయి. బాలచందర్ సినిమా లు చూస్తే వాటిలోని ఇష్యూస్ ఈ రోజు కి కూడా రిలవెంట్ గానే ఉంటాయి. కానీ భాగ్య రాజా సినిమాలు  ఇప్పుడు చూస్తే, కాలదోషం పట్టినట్లు కనిపిస్తాయి. భాగ్య రాజా సినిమా ల లో ఒక రకమైన వెకిలి తనం కూడా ఉంటుంది.

11. సినిమా: మిస్సమ్మ
సునిసితమైన హాస్యం. ఆ హాస్యం, మరి, ఎవరి  మానస పుత్రికో! మిస్సమ్మ దర్శకుడు LV ప్రసాద్ అని మాత్రమే తెలుసు. ఇది కాక బాలచందర్ సినిమాలు చాలా వరకూ నచ్చుతాయి.

12. అధ్యాత్మిక వ్యక్తి: U.G. కృష్ణమూర్తి.
అధ్యాత్మిక వ్యాపారం చేయని ఒక అరుదైన ఆధునిక మనిషి.
13. ఊరు:  మా ఊరు.
కృష్ణ పక్కన ఉంది. మన మహా నగరాలను, వాటిలోని మనుషులనూ చూశాక, మా ఊరంటే ఇష్టం ఇంకా ఎక్కువైంది. విదేశాలా..అవి మనుషులున్న ఎడారులు!
14. ఆహారం : ఆవకాయ ముక్క, పెరుగు.
ఫైవ్ స్టార్ హోటల్లో వంటకాలన్నీ దీని ముందు దిగదుడుపే!

15. కూర: చిక్కుడు కాయ
గోరుచిక్కుడు కాయ అంటే మాత్రం అయిష్టం.

మా నాయనమ్మ వండుతూ ఉండే సీమతుమ్మ(సీమ చింత?) పప్పుల కూర.  వగరు పప్పులు వాడితే కూర మరింత బాగుండేది.

16.పండు : రసం మామిడి కాయ, లిచీ

పళ్ళన్నీ ఇష్టమే! ముఖ్యం గా పైవి. ఒక్క బొప్పాయ కాయ తప్ప అన్నీ ఇష్టమే!

ఏవిటో! నేను అభిమానిద్దామన్నా, తెలుగు వారిలో నాకు శాస్త్రవేత్తలూ,సాంకేతికులూ దొరకటం లేదు. K.L. రావు, యెల్లాప్రగడ సుబ్బా రావు, నాయుడమ్మా వంటి వారి పేర్లు తెలుసు గానీ, వారిని ఎందుకు అభిమానించాలో ఇక్కడ ఓ రెండు ముక్కలు కూడా రాయలేను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఓ రెండు ముక్కలు రాయగలను . కానీ ఆయన పూర్తి గా తెలుగు వాడు కాదనుకొంటా!   వై వీ రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు, విజయ రామా రావూ, KLN ప్రసాద్  వంటి బ్యూరోక్రాట్ల గురించి నేను రాసే దాని కన్నా గూగుల్ చేస్తే బాగుంటుంది. నాకు వారి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొనేంత పరిజ్ఞానం లేదు.

కూచిపూడి నృత్యం వంటివి చూడటానికి బాగుంటుంటాయి, కానీ వాటి గురించీ, ఆయా కళా కారుల గురించీ నా అభిప్రాయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు.  వెంపటి చిన సత్యం గారి నాట్యం గురించి నా అభిప్రాయం వినటానికి ఎంత తప్పు గా ఉంటుందో!

———————————————————————————————

ఇంగ్లీష్, హిందీ సినిమాలు నేను చూసేది తక్కువ. నేను చూసినంతలో.. నాకు తెలిసినంత లో…

హిందీ నటుదు: సంజీవ్ కుమార్
సహజ నటుడు. ఆయన భాషా, డిక్షన్ గురించి మనం ఎక్కువ గా మాట్లాడలేం కదా?
హిందీ నటి:స్మితా పాటిల్
ఇంకోసారి..సహజనటి. మామూలు నిజ జీవితం లోని మనిషి లా కనపడటం.

హిందీ సినిమ: షోలే
ఇంతకంటే గొప్ప సినిమాలు చూసినట్లు గుర్తు లేదు. నసీరుద్దీన్ షా ఆర్ట్ సినిమాలు సగం సగం చూశాను. రిత్విక్ ఘటక్ సినిమాలూ, మృణాల్ సేన్ సినిమాలూ కొంచెం, కొంచెం చూశాను. ప్యాసా కొంచెం చూశాను.నాకు ఈ విషయం లో అర్హత లేదు.

ఇంగ్లీష్ రచయిత: మాం, డికెన్స్, చెకోవ్
డికెన్స్ great expectation చదివి ఆయన అభిమానినయాను. అందులో హీరోయిన్ హృదయాన్ని ఆయన మలిచిన తీరు అద్భుతం.

నిన్న మొన్నటి దాకా మన సమాజపు విలువలు, ముప్పైవ నలభైవ దశకం లో పాశ్చాత్య సమాజపు మొరాలిటీనీ వాతావరణాన్ని పోలి ఉన్నదనుకొంటా. అందు వలననే  నాకు “మాం” రచనలలోని పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి.

చెకోవ్ రచనలలో ఉన్న pathos చాలా ఇష్టం.

సరేనండీ , ఇప్పటికే చాలా బోర్ కొట్టించేసి ఉంటాను. మళ్ళీ తరువాత…. మీరు తేరుకొన్న తరువాత బోర్ కొట్టిస్తాను.ధన్యవాదాలు.

ప్రకటనలు

19 thoughts on “నాకు నచ్చిన మనుషులూ, విషయాలూ, వంటలూ..

 1. డికెన్స్ ది Oliver Twist చదివి, ఇంకోసారి ఈయన్ను చదవకూడదనుకున్నానండీ. ఇప్పుడు ఈ Great Expectations కోసం మరోసారి ప్రయత్నించాలి. Thank you

  మెచ్చుకోండి

  1. ఇక్కడ ఆదర్శ నాయకుడి నిర్వచనం కాకుండా, మామూలు గా ఈ రోజుల్లో జనాలు వాడే “రాజకీయ నాయకుడు” అనే అర్ధంలో రాశాను.ఫీవీ గారు ఎన్నికల రాజ్కీయాలలో నెగ్గుకొని రాలేదు.
   అనేక రకాలైనా నాయకులూ, కార్పొరేట్ నాయకులూ, ఆధ్యాత్మిక నాయకులూ, పోలిసీ కి చెందిన నాయకులూ ఉంటారు. ఇక్కడ ఆ అర్ధం లో రాయలేదు.
   నాయకుడికి మీ నిర్వచనం ఏమిటి? ఫీవీ గారు ఏ విధమైన నాయకుడు అని మీరు అనుకొంటున్నారు?

   మెచ్చుకోండి

   1. నాయకుడికి ముఖ్యంగా ఉండవలసినది దేశ సంస్కృతి మీద పూర్తి అవగాహన, దేశ భక్తి, ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా వ్యుహాలని మార్చుకొంట్టూ, దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నించాలి. దేశ ప్రముఖ పదవులు నిర్వహిస్తున్నా నాయకులకి మాత్రం, దేశం ముందు ఆ తరువాతే వ్యక్తిగత జీవితం.

    ఇక ఆయన పని చేసిన కాంగ్రెస్ పార్టిలో అంతా తమ వ్యక్తిగత లాభాం, పదవులకొరకు ఆ పార్టిని పట్టుకొని వేలాడేవారు. అంతకు మించి వారిలో చాలా మంది దగ్గర ఉన్న ప్రతిభ ఎమీ లేదు. ధన బలం తప్ప. రాను రాను ఇటువంటి వారి సంఖ్య పెరిగి పోయింది. ఇటువంటి వారితో ఆయన పని చేస్తూ ఎన్నో సమస్యలు శాస్వతం గా పరిష్కరించాడు. నెహ్రు-గాంధి కుటుంబం వారికి సమస్యలు సృష్ట్టించటం మాత్రమే తెలుసు. వాటిని పరిష్కరించటం చేత కాక చేతులెత్తి వేస్తారు. అందులో పంజాబ్ ఒకటి, కాష్మిర్ లో ఎన్నికలు జరిపించటం మరొక విశేషం. ఇవి ఎటువంటి పరిస్థితులలో అంటే అంతర్జాతీయం గా ఎన్నొ మార్పులు జరుగుతున్న సమయంలో. మనకి మిత్రదేశ మైన రష్యా ముక్క చెక్కలైన కాలంలో ఆ ప్రాభావం దేశం మీద పడకుండా ఇంటి సమస్యలను పరిష్కరించారు. ఆర్ధిక రంగంలో ఆయన ప్రవేశ పెట్టిన మార్పులు కూడా తెలిసినవే. పివి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, వారి గుణాలను బట్టి అర్థం అవుతారు. అవినితి పరులకు ఇతరపార్టి యం.పి. లను పార్టి ఫిరాయింపు చేయించిన వ్యక్తిగా, తెలివిగల వారికి మహామేధావిగా

    మెచ్చుకోండి

   2. కార్పోరేట్ నాయకులకు, ప్రజా నాయకులకు నక్కకు నాగ లోకానికి అంత తేడా ఉంట్టుంది. వారు నాయకులే కాదు. కార్పోరేట్ వారు “నాయకుల” పదం వాడటం పైన అభ్యంతరం ఉంది. కార్పోరేట్ వారు అంత క్రీమి లేయర్ ను వేసుకొని షోని నడిపేవారు. తనకు నచ్చని వారిని పని నుంచి తొలగించటం చేస్తారు. ఇటువంటి పనులను రాజకీయాలలో చేయటం అసలికి వీలు కాదు. అందరిని కలుపుకొని పోతూ పనులు చేయాలి. డబ్బులు ఉంటే కంపెనినీ పెట్టి నడిపించవచ్చు, ఎంత డబ్బులు ఉన్నా రాజకీయ పార్టిని పెట్టి ఒక ఐదు సం|| నడపమను తెలుస్తుంది. విజయ మాల్యే చేతులేత్తెశాడు.

    మెచ్చుకోండి

   3. పి వి గారు అధికారంలో రావటానికి రాజివ్ మరణం కారణం. అప్పటికే కాంగ్రెస్ పార్టి తిరోగమన దశలో ఉంది. దానికి తోడు బాబ్రి మసీదు వివాదాన్ని ఆయన నెత్తిన మీద వేసి అతనిని తొలగించాలని చూసారు. అన్ని రోజులు అధికారంలో ఉంటాడని ఊహించలేని వారాంత ఎకమై ఆయనకి సహకరించలేదు. ఇటువంటి పరిస్థితులో ఆయన పార్టిని గెలిపించలేదని అంటే ఎలా? ఇప్పటివరకు యు.పి., బీహార్ లో ఆపార్టి ఎమాత్రం గెలిచింది? అయినా ఇప్పుడున్న నాయకత్వాన్ని పి వి ని నిలదీసినట్లు, ఎందుకు నిలదీయటం లేదు?

    మెచ్చుకోండి

   4. పి వి, ప్రణబ్ ముఖర్జీ మొద|| తెలివి గల వారు,భారతదేశం మీద అవగాహన ఉన్నారు, కనుకనే కాంగ్రెస్ ఇన్ని రోజులు అధికారంలో మనగలుగుతూ వస్తున్నాది. చిదంబరం గారు రాందేవ్ లాగా అన్నా హజారే అరేస్ట్ చేసి పరిస్థితిని ఎంత దిగజారిచారో, అటువంటి క్లిష్ట్ట సమయం లో ప్రణబ్ ముఖర్జి రంగం లో దిగి ఎలా చక్కదిద్దారో మనకు తెలిసిన విషయమే. పార్టి అభిప్రాయాలను అర్టికులేట్ చేయటానికి మణి శంకర్ అయ్యర్ టి వి షోలలో పాల్గొంట్టు ఉంటారు. ఆ షోలలో ఇతను చాలా బాగ మాట్లాడుతాడు. అందరికి తార్కికం గా సమాధానాలు ఇస్తాడు. కాని క్లిష్ట్ట సమయాలలో ఎవరు ఇతని దగ్గరికి వచ్చి సలహాలు అడగరు, పట్టించుకోరు. ఎందుకలా? సమాధానం కొరకు మీరె ఆలోచించడి 🙂

    మెచ్చుకోండి

    1. ప్రణబ్ ప్రాక్టికల్ గా ఆలోచించే రాజకీయ నిపుణుడు. మణిశంకర్ పరిభావనల స్థాయిలో ఆలోచించే మేధావి. దేశానికి ఇద్దరూ కావాలి.

     మెచ్చుకోండి

 2. మిస్సమ్మ ఒక బెంగాలీ కథ. ఆ రోజుల్లో మనకి బెంగాలీ పిచ్చి వ్యాధి స్థాయిలో ఉండేది.

  మీరు చంద్రబాబు, రావిశాస్త్రి, విశ్వనాథ్ లని ఏకకాలంలో ఇష్టపడటం నాకు గమ్మత్తుగా ఉంది.

  నా స్నేహితుడు విస్కీలోకి మంచింగ్ కోసం తిరపతి లడ్డు పెట్టేవాడు. లేదా ఏపిల్, కీర దోసకాయ ముక్కలు పెట్టేవాడు. నాకెందుకో మీ పోస్ట్ చ్హదువుతుంటే అతను గుర్తొచ్చాడు.

  మెచ్చుకోండి

  1. రమణ గారు,
   విశ్వనాధ్ సినిమాలలోని భావజాలానికి కాక వాటిలో ఉండే డీసెన్సీ కి ఇష్టపడతాను.
   చంద్ర బాబు – ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం. ఆ చెప్పిన మూడు విషయాలకీ అతను అర్హుడేననుకొంటాను.

   మెచ్చుకోండి

 3. చంద్ర బాబు దీర్ఘకాలిక పథకాలు ఎప్పుడు పెట్టాడు? పెట్టినవన్నీ పైపై పూతలు లాంటి పథకాలు కాబట్టే కదా అతను 2004 ఎన్నికలలో ఓడిపోయాడు. చంద్రబాబు గతంలో ఏ పథకాలు సాధ్యం కావని చెప్పాడో ఆ పథకాలే తాను అధికారంలోకి తిరిగి వచ్చిన తరువాత అమలు చేస్తానంటున్నాడు. అలా చెప్పకపోతే అతనికి వోట్లు పడవని తెలుసు కాబట్టే అలా మాట్లాడుతున్నాడు.

  పివి విషయం అంటారా? అతని పాలనలో సెయింట్ కిట్స్ లాంటి స్కామ్‌లు ఎన్ని జరగలేదు? అతను బతికి ఉన్నప్పుడు అతన్ని తిట్టి చనిపోయిన తరువాత అతన్ని తెలుగు జాతికి గర్వకారకుణ్ణి చేసేశారా?

  మెచ్చుకోండి

 4. JMM, సెయింట్ కిట్స్ లాంటి స్కామ్‌లు కోర్ట్ ఇచ్చిన తీర్పు సంగతి తెలుసుకదా! ఆయనని తెలుగు జాతికి గర్వకారకుణ్ణి గా మేము చేయటమేమిటి? పుట్టుకతోనే ఆయన ప్రతిభ అటువంటిది. అంత ప్రతిభా పాటవాలని పెట్టుకొని, చివరి వరకు ఇతరుల కిందే పని చేయవలసి వచ్చింది. అదే ఆయనకి ఉన్న తెలివి, డబ్బులతో ఏదైనా పరిశ్రమ పెట్టుకొని నడిపి ఉంటే ఎంతో ఎత్తుకి ఎదిగే వాడు. రాజకీయాలలో చేరి, చివరిదశలో బంజారా హిల్స్ అమ్ముకొనే పరిస్థితి వచ్చింది. పైన చెప్పినట్లు గా పి వి గారు ఎటువంటి వారికి ఆ విధంగా నే కనిపిస్తారు.

  మెచ్చుకోండి

 5. బాలమురళి లోతు ఓకే కానీ గాంభీర్యమా? (నేను ప్రత్యక్షంగా విన్నది ఒకట్రెండు సార్లే అనుకోండి) అతను సన్నజాజుల రవళి అంటాదు వడ్డెర చండీదాస్.

  మెచ్చుకోండి

  1. ఫణీంద్ర గారు,
   ఏమిటోనండీ నాకు ఆయన స్వరంలో మార్ధవం కంటే గాంభీర్యమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ గాభీర్యం నిజం గా ఆయన గొంతులో లేక పోవచ్చు. నాకు వైయక్తికం గా అలా అనిపిస్తుంది. నాకు ఆయనంటే ఉన్న గౌరవం ఒక రకమైన భయం తో కూడిన అడ్మిరేషన్ వలన కావచ్చు. అలానే ఆయనను చూస్తే, “మిగిలిన సమయాలలో చెత్త సంగీతానంతా విని ఎంకరేజ్ చేస్తున్నాం కదా ..అనే గిల్టీ ఫీలింగ్” వస్తుంది. దానితో ఆయనే నన్ను “ఆ చెత్త పాటలన్నీ ఎందుకు వింటావ్?” అని మందలిస్తున్న భావన కలుగుతుంది. పై చెప్పిన అంశాలన్నీ ఆయన స్వరం నాకు గంభీరం గా వినపడటానికి కారణాలేమో.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s