ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే..ఇక ఏమీ లేదు!

ఓ రెండేళ్ళ క్రితం, రోజూ ఆఫీస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. జీవితపు బండి ని ఇష్టం లేని ఎద్దులా రొటీన్ గా లాగుతూ ఉండేవాడిని. జీవితం, “రసం పీలిచిన తరువాతి చెరుకు పిప్పిలా, ధాన్యపు మిల్లు గొట్టం నుంచీ బయటకు వచ్చే ఊక లా” ఉండేది. కుక్క, మాంసం లేని ఎముక ని పదే పదే కొరికినట్లు, నేను కూడా జీవితాన్ని ఏదో ఓ తెలియని ఆశ తో జీవించేవాడిని. ఆంధ్ర లో గడచిపోయిన మంచి కాలేజీ రోజులని గుర్తుకు తెచ్చుకొంటూ ఉండేవాడిని.  అప్పుడప్పుడూ బెంగళూరు లో తెలుగు పత్రికలు కొని డల్ గా ఉండే జీవితం లో కొంచెం తెలుగు తనం నింపటానికి ప్రయత్నించే వాడిని.
ఓ రోజు ఓ స్నేహితుడి ద్వారా తెలుగు బ్లాగులు పరిచయమయ్యాయి. దానితో, జీవితపుబండి మళ్ళీ “వోల్వో” బస్సులా పరిగెత్తడం మొదలు పెట్టింది. అంతకు ముందు ఎద్దుల బండి రోజుల్లో, బోర్ పోగొట్టుకోవటానికి, నేను ఒక కథ రాసుకొన్నాను. దానిని అప్పుడప్పుడూ నేనే చదువు కొని, “నేను రచయితనై పోయానోచ్!!” అనుకొని మురుసు కొని, మళ్ళీ ఆ ఠావులను  అల్మైరా లో పెట్టేస్తుండేవాడిని. బ్లాగులు పరిచయమైనాక ఓ రోజు, “నా కథ ని బ్లాగు లో పెట్టి ఎందుకు జనాలని భయపెట్టకూడదు?” అనిపించింది. కానీ, “నేను మాయల మరాఠీని చూపెట్టబోతే, జనాలకి లంబూ జంబూ లు కనపడతారేమో ననిపించి”, కొంత కాలం ఆగాను. ఈ అగిన కాలం లో కొన్ని శాంపుల్ బ్లాగులు చూసిన తరువాత ధైర్యం వచ్చేసింది, నా కథ చేత కూడా స్టేజ్ షో ఇప్పించవచ్చని.

కథ డ్రాఫ్ట్ ని తయారు చేసి పబ్లిష్ బటన్ నొక్కబోతూండగా ఒకటే పీకుడు మనసులో, “నువ్వు ఎందుకు నీ బ్లాగు ని పబ్లిష్ చేయాలనుకొంటున్నావు?”, అని.
“ఎందుకో ఒక అందుకు లేవాయ్!”, అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పటికి పబ్లిష్ బటన్ నొక్కేశాను.
కానీ కొన్ని రోజులు బ్లాగిన తరువాత నాకు అర్ధమైంది ఏమిటంటే, “మనిషి ఇతర మనుషుల మనసుల్లో, ఆలోచనల లో జీవించాలనుకొంటాడు. ఒక మనిషి జీవితం లో, ఇతర మనుషుల మనసుల్లో (దృష్టిలో) జీవించని భాగానికి అతి తక్కువ విలువ ఇచ్చుకొంటాడు. జీవితాన్ని మనం మన ఇంటి కుర్చీలోనూ, ఆఫీసు సీటులోనూ, ఇంటికీ ఆఫీసుకీ పోయే కారులోనూ జీవించం…కాదు కాదు జీవించమా అంటే జీవిస్తాం. కానీ మన మానసిక జీవితాన్ని మాత్రం ఎక్కువ భాగం ఇతరుల దృష్టి అనే రంగస్థలం పై జీవిస్తాం. “పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా!” అని వేమన అన్నాడంటే దానర్ధం చెదలు భౌతికం గా జీవించలేదని కాదు. అవి మన మానసిక జీవితం పై ఏవిధమైన ప్రభావాన్నీ చూపించలేక పోయాయనే! తన బంధువుల యొక్కా, స్నేహితుల యొక్కా, చుట్టు పక్కల వారి యొక్కా మానసిక ప్రపంచం లో చోటు లేని వాడు జీవించనట్లే లెక్క.
అంటే.. దీనర్ధం ఏమిటంటే, ప్రతీ మనిషి కీ “గుర్తింపు” కావాలనే “కోరిక” ఉంటుంది. కానీ అ గుర్తింపును ఇచ్చేవారు మాత్రం ఇతరులే! గుర్తింపు థియేటర్ కి తళం చెవి మాత్రం మనచేతిలో లేదు. అది జనాల చేతిలో ఉంది. ఆ గుర్తింపు పాజిటివ్ అయితే మంచిది., నెగటివ్ అయినా పరవాలేదు. కానీ ఏ గుర్తింపైనా పరవాలేదు. మా కాలేజీ రోజుల్లో కొందరు మంచి మార్కులు తెచ్చుకొని క్లాసులోని అమ్మాయిల దృష్టి లో పడేవారు, మార్కులు తెచ్చుకోలేని కొందరు జులాయి పనులు చేసో, రౌడీలు గానో అమ్మాయిల దృష్టి లో పడాలని ప్రయత్నించే వారు. అలానే బ్లాగులు కూడా! ఎవరూ పట్టించుకోని బ్లాగు చనిపోయినట్లే లెక్క!
“ఘటం చిద్యాత్
పటం బిద్యాత్
ఏనకే ప్రకారేణ
ప్రసిధ్ధః  పురుషా భవేత్!”
అంటే, సెంటర్లో కుండ పగుల కొట్టికానీ, పోస్టర్ ని చింపి ఐనా సరే అందరి దృష్టి లో పడమని చెప్పినాడండీ పద్య కారుడు!
అవుతే, గుర్తింపు ని ఒక్కొకరూ ఒక్కో మార్గం లో కోరుకొంటారు. ఒకరు గొప్ప క్రీడా  కారుడవ్వాలనుకొంటే, ఇంకొకరు పాపులర్ సినేమా స్టారు కావాలనుకొంటారు, ఇంకొకరు పేద్ద రచయిత కావాలనుకొంటారు. వీరికి  ఆయా మార్గాలు ముఖ్యమా, లేక లక్ష్యమైన గుర్తింపు ముఖ్యమా?
ఆయా మార్గాలలో ఎందుకు గుర్తింపు కోరుకొంటారంటే, ఆ మార్గాలు వారికి ఇష్టమైనవి కాబట్టీ. ఆ మార్గాలలో గుర్తింపు వస్తే, వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, పెద్ద కష్ట పడనవసరం లేకుండా గుర్తింపు సాధించవచ్చు. క్రికెట్ క్రీడాకరుడవాలనుకొన్నవాడు రచయిత గా గుర్తింపు సాధించాలంటే అందుకు మానసికం గా అతను చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అదే క్రికెట్ ఆటగాడు గా ఆడుతూ పాడుతూ శ్రమ పడుతాడు.
ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. జీవితంలోని మార్గాలు అన్నీ, ఒక మెట్టు కింది స్థాయిలో లక్ష్యాలే. క్రికెట్ క్రీడాకారుడి గా గుర్తింపు అనేది ఒక లక్ష్యమైతే, అందుకు మార్గమైన క్రికెట్ ప్రాక్టీస్ కూడా, ఒక మెట్టు దిగువ స్థాయి లో, ఒక లక్ష్యమే! క్రికెట్ ప్రాక్టీస్ అనే లక్ష్యం చేరే మార్గం లో మళ్ళీ “బధ్ధకం లేకపోవటం”, “ఫిట్నెస్ మెయింటేన్ చేయటం” అనే విషయాలు ఉంటాయి. ఏ మనిషికైనా ఒక గమ్యా నికి అన్ని స్థాయి మెట్లలోనూ  అనందకరమైన విషయాలే ఉండవు. ఏదో ఒక స్థాయి లో ఆ మనిషి ఇష్టం లేని విషయం కూడా ఉంటుంది. కానీ గమ్యం పై మక్కువ తో ఆ ఇష్టం లేని కష్టమైన విషయాన్ని కూడా అతను భరించగలుగుతాడు.
పై విషయాలన్నీ ఏ కెరీర్ కౌన్సిలర్ అయినా పుంఖాను పుంఖాలు గా చెప్తాడు. వీళ్ళు చెప్పని విషయాన్ని ఒక దాన్ని చెప్ప దలచుకొన్నాను. చదవండి….

ఒక నిజాయితీ కల రాజకీయ నాయకుడు ఉన్నాడనుకొందాం. అతను, ఉదాహరణకి ఒక లక్ష్యాన్ని సాధించే ఉద్దేశం తో ఒక పార్టీ పెట్టాడనుకొందాం. ఆ లక్ష్యం, “రాజకీయాధికారం ద్వారా, ఒక సమాజం లోని 70% మందికి ఉద్యోగాలు ఇవ్వటం” అనుకొందాం ఆ పార్టీ పెట్టే ముందు, తన లక్ష్యం పూర్తి అయేంతవరకే తాను రాజకీయాలలో ఉంటానని అతను ప్రకటించాడనుకొందాం. ఎందుకంటే అతనికి రాజకీయాధికారం కంటే, 70 శాతం మందికి ఉద్యోగాలివ్వటమే ముఖ్యం. తన లక్ష్యం నెరవేరాక అతనికి అధికారం తో సంబంధం లేదు. కానీ నిజ జీవితం లో చాలా మంది మంచి రాజకీయ నాయకులు తమ మొదటి రాజకీయ  లక్ష్యాలు నెరవేరాక కూడా తమ అధికారాన్ని వదులుకోలేరు. అంటే, రాజకీయాధికారమే అసలు లక్ష్యమైపోతుందన్నమాట!  ఇది అన్ని రంగాలకీ వర్తిస్తుంది. అధికారమూ, గుర్తింపూ, డబ్బు సంపాదనా (ఈ మూడిటికీ అవినాభావ సంబంధం ఉంది అనేది తెలిసిన విషయమే కదా!) మొదలైనవి ముందు కొన్ని మార్గాలద్వారానే వస్తే రుచిస్తాయి. కానీ వాటి రుచి మరిగిన తరువాత వాటిని వదులుకోవటం కష్టమైపోతుంది. వాటికి వ్యసనం లాంటి నైజం ఉంది.
ముందు మన ఆలోచనలను పదుగురితో పంచుకోవటం కోసం బ్లాగు మొదలెడతాం. కానీ మన ఆలోచనలన్నీ మన అనుభవాలలోంచీ వస్తాయి. మన అనుభవాలేమో పరిమితం. కాబట్టీ, మన ఆలోచనలూ పరిమితం . ఒక స్థాయి తరువాత మన ఆలోచనలు పునరుక్తి అవుతాయి. అది మన స్వప్రేమ వలన మన కి బోర్ కలిగించక పోవచ్చు . కానీ చదివే వారికి విసుగు తెప్పిస్తాయి. ముఖ్యం గా రచయితలూ కళా కారుల విషయం లో ఇది మరీ వర్తిస్తుంది. కళాకారులు తమ తొలి సృజనలలో, తమ వ్యక్తిత్వం లోని వైవిధ్యాన్నీ, ఆలోచనలలోని కొత్తదనాన్నీ ప్రతిఫ్లిస్తారు. కానీ వారి వ్యక్తిత్వపు పెరామీటర్స్ మారేవి కావు. కాబట్టీ, వారి రచనలలో ఒకే పాటర్న్ వచ్చి పునరుక్తి ఉంటుంది.(శాస్త్రవేత్త లకీ, ఇంజినీర్లకీ ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారి పాటర్న్ వారి వ్యక్తిత్వానికి బాహ్యం గా వస్తువులలో ఉంటుంది. బుర్రలో సమాచారాన్ని వారు ఎల్లప్పుడూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.) ఒకే రచయిత రాసిన కథల సంపుటు ల లో మనం అతని/ఆవిడ పాటర్న్ ని సులువు గా పట్టేయగలం కదా!  కనీసం ఈ కళాకారులు వేరు వేరు ప్రదేశాలు చూడటం, కొత్త పుస్తకాలు చదవటం, అనేక కొత్త అనుభవాలను ఆహ్వానించటం చేసే వారైతే,(వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారి కళలోని పాటర్న్ రిపీట్ అయినా), కంటెంట్ వైవిధ్యం గా ఉంటుంది.ఈ “వ్యక్తిత్వ ఆధారమైన పాటర్న్ రిపీట్ అవటం”, మనకు కమర్షియల్ సినిమాలూ వగైరా ల లో కనిపించదు. ఎందుకంటే, అక్కడ డబ్బు రాలటానికి వైవిధ్యాన్ని చూపించాలి. కాకపోతే, వాటి లో కమర్షియల్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. ఈ ఫార్మాట్ కాలాన్ని బట్టి పరిణామం చెందుతూ ఉంటుంది. కానీ, నిజ జీవితం లో అనేక ప్రదేశాలు చూడాలన్నా, వైవిధ్యమైన అనుభవాలు పొందాలన్నా డబ్బు చాలా అవసరం. మన తెలుగు మధ్య తరగతి జీవితం లో అంత డబ్బు ఎందుకు ఉంటుంది?
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, బ్లాగు రచయితల బుర్రలలో కొంతకాలం వరకూ సరుకు ఉంటుంది. ఆ సరుకు అయిపోయిన తరువాత మళ్ళీ దానిని నింపుకోవటానికి ప్రయత్నించాలి. ఇది నిజజీవితానుభవాల ద్వారా కావచ్చు, పుస్తక పఠనం ద్వారా కావచ్చు. అలా నింపుకోలేక పోతే, వారు “చెప్పినదే చెప్పటానికి” అవకాశం ఎక్కువ ఉంటుంది. సరుకు అయిపోయినపుడు మనం ఎందుకు బ్లాగటాన్ని ఆపం? రాజకీయ నాయకుడు అసలు లక్ష్యం కంటే అధికారానికి అలవాటు పడిపోయినట్లు, మనం కూడా తోటి బ్లాగరులు ఇచ్చే గుర్తింపుకీ, వారి కామెంట్లకీ, రేటింగ్లకీ, మెచ్చుకోళ్ళకీ, నొచ్చుకోళ్ళకీ అలవాటుపడిపోయి ఉంటాం.ఆ అలవాటు మానటం కష్టమైపోతుంది. ఒక స్థాయి తరువాత, ఏదో ఒకటి బ్లాగటమే ముఖ్యం అవుతుంది. ఏమి బ్లాగాం అన్నది ముఖ్యం కాదు. నా గత నాలుగైదు నెలల టపాలలో నేను దీనిని విస్పష్టం గా గమనించాను. నాకు నా బుర్ర ని మళ్ళీ రీచార్జ్ చేసుకొనే తీరిక కానీ, అవకాశం కానీ, ఓపిక కానీ కనపడటం లేదు. కాబట్టీ ప్రస్తుతానికి బ్లాగ్లోకానికి బై.

బ్లాగ్లోకం లో నాకు పరిచయమైన,అవ్వని, నన్ను ప్రోత్సహించిన, ప్రోత్సహించని, పట్టించుకొన్న, పట్టించుకోని అందరు బ్లాగరులకూ, కామెంటరులకూ, తుంటరులకూ, ఒంటరులకూ, బుధ్ధిమంతులకూ “ఐపీ ఐపీ” కీ నా ధన్యవాదాలు!