మీకు మహదేవన్ ఇష్టమా..? ఇళయరాజా ఇష్టమా..?

సంగీతం గురించి నాకు పెద్ద గా తెలియదు, కానీ, సినీ సంగీతం లో (ఇప్పటిది కాదండోయ్, ఓ పదీ పదిహేనేళ్ళ కిందటిది..) నాకు ఇద్దరు దర్శకులు నచ్చుతారు. ఒకరు మామ మహదేవన్, రెండవ వారు ఇళయ రాజా. సినిమాల లో పాటలు సందర్భాని (situation)కి అనుగుణం గా తయారవుతాయి (ఇప్పటి సినిమాలలో అలా కాదనుకోండి). సినిమా దర్శకుడు ఒక సన్నివేశం, ఆ సన్నివేశం లోని భావోద్వేగ వాతావరణాన్ని పాట రచయితకీ, సంగీత దర్శకుడికీ వివరిస్తే, ఆ మూడ్ రక్తి కట్టేటట్లు గా పాట తయారవాలి.
ఇక్కడ పాటల రచయిత ముందు పాట రాస్తే, తరువాత ఆ పాటకి సంగీత దర్శకుడు బాణీ కట్ట వచ్చు. రెండవ పధ్ధతి, “సంగీత దర్శకుడు బాణీ ని కుదిరిస్తే రచయిత దానికి పాట రాసి ఇవ్వటం.”
సినిమా డైరెక్టర్ సన్నివేశాన్ని చెప్పినపుడు, సంగీత దర్శకుడు అందులో అంతర్లీనం గా ఉండే మూడ్ ని మాత్రమే తన బాణీ తో సృష్టించగలడు. మూడ్ ఒక రూపం రంగూ రుచీ లేకుండా ఉండి, ఇతమిధ్ధం గా ఉండదు.ఉత్సాహమైన మూడో, విషాదమైన విషయమో, భక్తి వాతావరణమో..ఇలా ఒక మూడ్ ఉంటుంది..అంతే!  ఆ మూడ్ ని ఎలివేట్ చేసి, దానికి ఒక భావాన్ని ఇచ్చి, దానికి గుణ గణాలనీ లక్షణాలనీ ఇచ్చి, సొబగులు అద్దేది సాహిత్యం.  మబ్బు చినుకు అయినట్లు, సాహిత్యం వలన సన్నివేశం లోని మూడ్, ఒక ప్రత్యేక భావావేశం అవుతుంది. ఆ మూడ్ కి ఒక అస్థిత్వం వస్తుంది. ఒక రేంజ్ వస్తుంది.
అయితే బాణీ కి పాటను రాస్తే బాగుంటుందా? సాహిత్యానికి బాణీ కడితే బాగుంటుందా? ఏది మంచిది?
ఇళయరాజా బాణీ ని ముందు ఇచ్చి దానికి సాహిత్యం రాయించుకొనే వారు. మహదేవన్ సాహిత్యాన్ని తెచ్చుకొని దానికి బాణీ ని సమకూర్చే వారు. బాణీ కి సాహిత్యాన్ని సమకూర్చటం లో భావానికి పరిధులు ఎక్కువ ఉన్నాయి . ఎందుకంటే, ఆ బాణీ కి సరిపోయిన పదాలనే రచయిత వేయాలి. ఇందువలనే అనుకొంటా ఇళయ రాజ పాటలలో మూడ్ బాగా రిచ్ గా ఉంటుంది. కానీ వాటి వలన “ఇదీ అని మనం వేలు పెట్టి స్పృశించదగ్గ”, భావోద్వేగం రాదు. బాణీ కి రాసి మెప్పించాలంటే రచయిత కష్ట పడాలి. (సరళత కోసం కాసేపు వేటూరి వంటి రచయితలు రాయలేదనుకొందాం. వేటూరి వంటి వారు బాణీ ఇచ్చినా సమర్ధవంతం గా పాట రాయగలరు.అనువాద చిత్రాలలో నటీ నటుల పెదాల కదలికల కి అనుగుణం గా పాట ఉండాలి కాబట్టీ, వాటిలో పరిమితులు ఇంకా ఎక్కువ. ఏ శ్రీ శ్రీ లాంటి వారో అటువంటి పాటలకు కొంత న్యాయం చేయగలిగారు.  )
ఉదాహరణ కు ఈ ఇళయ రాజా పాట వినండి.మూడ్ బానే ఉంటుంది. దానికి ఇళయ రాజా అనేక వన్నె చిన్నెలను అద్దారు. కానీ, ‘భావో’ద్వేగం లేదు.
శ్రీ శ్రీ కవిత్వాన్నైనా ఒక పాఠం లా చదువుతూ పోతే దాని లో పెద్ద మూడ్ ఉండదు. కానీ దానికి ఒక బాణీ ని సమకూర్చితే దానిలోని భావానికి ఒక మూడ్ వచ్చి ఉద్వేగం వస్తుంది. మహదేవన్,  వార్తాపత్రిక సంపాదకీయానికి కి కూడా బాణీ కట్టగల సమర్ధుడని ప్రతీతి. రాసిన పాట కు దానిలోని భావానికి, ఆ భావాలలోని nuances కి తగిన మూడ్ ని సృష్టిస్తూ బాణీ కట్టాలంటే సంగీత దర్శకుడు కష్టపడాలి. అందుకే నాకు ఇళయ రాజా, మహదేవన్ ల లో మహదేవన్ అంటే ఎక్కువ గౌరవం. మహదేవన్ సాహిత్యానికి న్యాయం చేకూర్చిన పాట ఇక్కడ ఒకటి .

సినిమా చూడకుండా ఈ పాట వింటే, “కమల మృదులమైన ఆమె చరణాలూ,… రసవేదాలైన ఆ పాదాలూ,….మన హృదయలోలకాన్ని ఉర్రూతలూగిస్తాయి కదా..!” (అన్నట్లు, ఎప్పుడూ అలనల్లని తెలుగు పదాలతో పాటలు రాసే ఆత్రేయ , ఈ పాటలో కొంచెం ఎక్కువే సంస్కృతం వాడారు మరి ఎందుకో..! ఇది ఆయన చివరి రోజులలో రాసిన పాట.)

మామా, రాజా ఇద్దరూ సంగీత పరికరాలను తక్కువ గానే వాడే వారు. వారివాయిద్యాలలో ఎక్కువగా దేశీవే ఉండేవి. ఇద్దరి పాటలలోనూ శబ్ధం సాహిత్యాన్ని మింగేసేది కాదు.అయినా, ఎవరి గొప్పవారిదే!

మామ మహదేవన్ మలయాళీ అయినా భావం తెలుసుకొని బాణీ కట్టే వాడు. ఆయన చేసిన శంకరాభరణం లాంటి కొన్ని ప్రయోగాలని పక్కన పెడితే, ఆయనవి ఎక్కువ గా పల్లెటూరి పాటలు ఉంటాయి. ఆ పాటలు వింటూ ఉంటే అచ్చం గా ఒక తెలుగు పల్లెకు వెళ్ళొచ్చిన అనుభూతి కలుగుతుంది.

మరి మీకు మహదేవన్ అంటే ఇష్టమా? లేక ఇళయరాజా అంటే ఇష్టమా?..అదేనండీ ఎవరి పాటలు ఇష్టం?

ప్రకటనలు

6 thoughts on “మీకు మహదేవన్ ఇష్టమా..? ఇళయరాజా ఇష్టమా..?

 1. నాకేమీ తెలియదు అంటూనే చాలా చక్కగా చెప్పారు! కొన్ని సందర్భాలకి భావానికి ప్రాముఖ్యత ఉంటే కొన్నిటికి మాత్రం కేవలం సంగీతం ద్వారా (సాహిత్యం లేకుండా) భావ ప్రకటన చేయటం బాగుంటుంది. ఎవరి శైలి వారిది కనుక పోల్చలేము. ఇద్దరి బాణినీ ఆస్వాదించటమే అని నా ఉద్దేశ్యం!

  మెచ్చుకోండి

  1. నాకు సంగీతం గురించి నిజం గానే తెలియదు రసజ్ఞ గారు. స్వర జ్ఞానం లేదు, రాగాలు, శృతీ తెలియవు. ఒక్కోసారి నేర్చుకోవాలని పిస్తుంది. కానీ అవి తెలిసిన దగ్గరి నుంచీ సంగీతాన్ని నేరు గా సహజం గా ఆస్వాదించటం మానేసి, మన విస్లేషణల స్వారా, ఆ ఇది ఆ రాగం అది ఈ తాళం అంటూ డైల్యూట్ చేస్తానేమో ననిపిస్తుంది.

   మెచ్చుకోండి

 2. మహదేవన్ గారు స్వర పరచిన అన్ని పాటలు…సాహిత్యం కి సంగీతం మిళితమై..భావానుభూతిని కల్గించి సాహిత్యాన్ని శ్రోత మదికి ,ఆలోచనకి అతిసమీపంగా వచ్చి మీటి వెళుతుంది.

  ఖచ్చితంగా సంగీత వినీలాకాశంలో “మామ” చందమామే! వారి కన్నా మేలిమి నయు ఎవరిలోనూ కనబడదు. కీరవాణి సంగీతం యెంత ఇష్టమైనా మహదేవన్ తర్వాతే..కదా ! .

  నాకు చాలా చాలా ఇష్టమైన పాట జత చేసారు. ఈ పాట అంటే.. ఇక చెప్పనులెండి..నా బ్లాగ్ లో ఈ పాట చూడవచ్చు. ధన్యవాదములు.

  మెచ్చుకోండి

 3. ఇద్దరు ఇష్టమే కాని, ఇద్దరిలో మహదేవన్ అంటే చాలా చాలా ఇష్టం.
  మహదేవన్ లేకుండా ఆదుర్తి, విశ్వనాథ్, బాపు లాంటి గొప్ప దర్శకుల మేటి చిత్రాలని ఊహించలేము.
  శంకరాభరణం నుండి అడవిరాముడు వరకు ఎలాంటి సినిమాకైనా సంగీతం ఇవ్వడం అందరివల్లా కాదు.
  అందుకే ఆయనని ‘స్వరబ్రహ్మ’ అన్నారు.
  మహదేవన్ ఇచ్చినన్ని మ్యూజికల్ హిట్లు బహుశా ఇండియాలోనే ఎవరూ ఇచ్చి ఉండరు.

  ఇళయరాజా గొప్పతనం ఏమిటంటే ఆయన పాటలు ఎన్నేళ్ళ తరువాత విన్నా, నిత్యనూతనంగానే ఉంటాయి.

  మెచ్చుకోండి

  1. బోనగిరి గారు,
   “ఇళయరాజా గొప్పతనం ఏమిటంటే ఆయన పాటలు ఎన్నేళ్ళ తరువాత విన్నా, నిత్యనూతనంగానే ఉంటాయి.”
   ఇళయరాజా కి సంగీతం పుట్టుక తో వచ్చింది అంటారు బాలు!

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s