కాళీపట్నం రామా రావు గారి “చావు” కథ., నా అనుభూతి

తెలుగు సాహిత్యం సీరియస్ గా చదివే వారి లో, “కాళీపట్నం రామా రావు(కా.రా. మాస్టారు) గారి పేరు తెలియని వారు”, అరుదు.  మొదట, “కుటుంబ పరమైన కథల” తో తన రచనా జీవితన్ని మొదలుపెట్టిన ఆయన, మధ్య లో వామ పక్ష భావజాలానికి దగ్గరగా రచనలు చేశారు. చివరిదశ లో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు.ఆయన కథ ల లో సునిశితమైన విశ్లేషణ ఉంటుంది. చిన్న పరిధి లో అయినా చాలా గొప్ప రచనలు చేశారు.
ఈ టపా ఆయన 1971 లో రాసిన “చావు” కథ గురించి. అయితే, ఇది ఆ కథ కు పరిచయం ఎంత మాత్రం కాదు. పరిచయం చేసే అర్హతా స్థాయీ నాకు లేవు. ఆ కథ చదివేటపుడు నాలో కలిగిన భావాలను పంచుకోవటానికి మాత్రమే ఈ టపా.
కారా మాస్టారు నిజజీవితం లో లెక్కల మాస్టారు. నాకు ఈ విషయం ఆయన కథలలో కనపడుతుంది (లేక నేను ఊహించుకొన్నానేమో!) ఆయన కథలలో ని మాటలు ఆచితూచి లెక్కపెట్టి వాడినట్లు గా ఉంటాయి. కధలు సాధారణం గా చాలా సీరియస్ గా ఉంటాయి. రావి శాస్త్రి వంటి వారి రచనలలో ఉండే entertaining quality ఈ కథల లో ఉండదు. ఒక మాట ఎక్కువ గానీ, వేరొక మాట తక్కువ గానీ వాడినట్లు మన కు ఎక్కడా అనిపించదు.
క్రికెట్ ఆడేటపుడు రాహుల్ ద్రవిడ్ వంటి బాట్స్-మేన్ text book strokes కొడతారని అంటారు. కారా మాస్టారి కథలు నాకు చాలా అథెంటిక్ గానూ, text book కథలు గానూ అనిపించాయి. చావు కథ ఆయన మార్కు కథలలో అగ్ర స్థానం లో ఉంటుంది. ఆయన “యజ్ఞం” కథ గురించి చాలా మందికి రివ్యూల ద్వారానో ఇతరత్రానో తెలుసు. నాకు “చావు కథ యజ్ఞం కథ కి ఏ మాత్రం తీసిపోని కథ”, అనిపించటం కూడా ఈ టపా రాయటానికి ఒక కారణం.

ఈ కథా స్థలం ఉత్తరాంధ్ర లోని ఒక మాల పేట .( పల్లెటూర్లూ,మాల పల్లెలూ, కులాలూ, దారిద్ర్యమూ పడని వారు ఇక్కడి తో ఈ టపా చదవటం ఆపేయ వచ్చు). నారమ్మ అనే ఒక ముసలామె చనిపోతుంది. మాలపేట లోని జనమందరూ (మొగుడూ పెళ్ళాలూ,కుర్రవాళ్ళూ) కూలికి పక్క ఊరికి వెళ్తారు. ఇళ్ళ లో పిల్లా జెల్లా, ముసలీ ముతకా మాత్రమే ఉంటారు (ఈ నాడు పట్టణాల లో ఉన్నట్లు గా). అది చలి కాలం. అసలే ముసలిదైన నారమ్మ , అ చలికి పై లోకాలకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న నారమ్మ మనవరాలు సిమ్మాద్రి దాని దోస్తుల్తో కలిసి పక్క ఊరు వెళ్ళి అక్కడి కి కూలికి వెళ్ళిన తన ఊరి జనాలకి “నారమ్మ మరణం” గురించి చెబుతుంది.
ఊరి జనాలు ఇళ్ళ కు చేరి, ముసలామె ని ఖననం ఎలా చేయటమా అని ఆలోచన లో పడతారు. గుంపులో ని నారమ్మ సమకాలీనుడైన సూరయ్య, (అతనే కుల పెద్ద) ,ఆమె జీవితం లోని ఘట్టాలను గురించీ, ఆమె వ్యక్తిత్వం గురించీ చిన్న చిన్న సంఘటనల తో వివరిస్తూ ఉంటాడు.
చలికాలం అవటం మూలాన, ముసలామె ను దహనం చేయటానికి కట్టెలు దొరకవు, కన్నయ్య అనే అతను ఒక బారిక (ముఠా మేస్త్రి?). అతనిని కట్టెలను తీసుకొని రమ్మని, ఊరిలోని పెద్ద కులాల మనుషుల ఇళ్ళకు  పంపిస్తారు. కానీ కట్టెలు ఎక్కడా దొరకవు. ఊరిపెద్దల మాటలు వారి కుల వివక్షను బహిర్గతం చేస్తాయి.
అప్పా రావు ఆత్మ గౌరవంకల, కొంచెం దూకుడు కల కుర్రకారు.ఊరిలోని పెద్ద మనుషులు నిమ్న కులస్థులను అణచిపట్టటమే కాక వీలు చిక్కినపుడు, తమది కాని సొమ్మును చేజిక్కించు కొన్నారనే ఎరుక అప్పా రావుకీ కుర్ర కారు కీ ఉంటుంది.
ఊళ్ళో పెద్దలెవరూ ముసలామె దహనానికి కట్టెలు ఇవ్వలేదని తెలిసి, కుర్రవాళ్ళంతా ఆవేశం తో కట్టెల కోసం ఊరి లోకి వెళ్తారు. ఈ లోపల సూరయ్య అక్కడ పోగయిన జనాలతో ఆ ఊరి ఆర్ధిక సంబంధాల చరిత్ర గురించి వివరిస్తాడు. ఒకప్పుడు అన్ని కులాలకీ కొద్దో గొప్పో ఆస్థి ఉండేదనీ, నూతన ఆర్ధిక వ్యవస్థ ( 70 ల లో ని మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ) వలన బలవంతులూ, సరైన సంబంధాలు కలవారి దగ్గర సంపద పోగుపడుతోందనీ వివరిస్తూ ఉంటాదు.
హఠాత్తుగా కుర్రాళ్ళు కట్టెల మోపులు తెచ్చి పడవేస్తారు. అవి సంగ్రహించిన కట్టెలు. కట్టెలు సంగ్రహించటం లోని న్యాయాన్యా ల గురించిన చర్చ తరువాత, కుర్రకారు తమ మాట నెగ్గించుకొని ఆ కట్టెల తో  ఖననం చేస్తారు. ఇదీ సంగ్రహం గా కథ.
ఇది చాలా పెద్ద కథ. పదుల సంఖ్య లో పాత్రలు ఉంటాయి. కథ చలికాలం లో జరుగుతుంది. నాకైతే, కధ చదివినంత సేపూ చలి చలి గా అనిపించింది. పాత్రల వస్త్రధారణా  (బట్టలు ఉన్న పాత్రలకు), వారి మాండలికం, మాటా, మాట విరుపూ అన్నీ సజీవం గా ఉంటాయి. కథలు అందమయిన విషయాల గురించి రాయాలనే ఆలోచన కి ఈ కథ ఒక పెద్ద చెంప పెట్టు. ఈ కథ లో చనిపోయిన నారమ్మ దేహం మలమూత్రాల లో పడి దుర్వాసన వెలువరిస్తూ ఉంటుంది. కానీ మనకు ఆమె పట్ల  దుర్వాసన కు అతీతమయిన మానవతా స్పందన ఏదో కలుగుతుంది.
మాస్టారు మాటలు చాలా precision తో వాడతారు. మచ్చుకి కొన్ని..
“..అప్పుడప్పుడే విచ్చుతున్న మగ గొంతు”.

సమయం తో పాటు జనాలలో వచ్చిన పరిణామాన్ని సూచించే ఒక వాక్యం..
“..అయితే అప్పటి నాయుళ్ళు ఇప్పట్నాటి కరువుగొట్టు నాయాళ్ళు కారు. “ఆపు” ఉంచిన పెండ్లి కెళ్ళినా, ఏదో పేదా రోదా కడుపు జరగని గుంట పాపల్లెమ్మని సూసీ చూణ్ణట్టు, ఓ కసురు గసిరి, ఒగ్గీసీవోరు.”

కటిక పేదరికం లోం కూడా సమాజంపు ఆచారాలనూ కట్టు బాట్లనూ ఒదులుకోలేని పేద మనుషులు కపడుతూఉంటారు. ముసలామె ను కప్పెట్టటానికి ఆచారం అడ్డొస్తుంది.

“నారమ్మ కు కుర్ర తనం లో పట్ట రాని చోట జలగలు పట్టటం, సూరయ్య ఆ ప్రదేశం పై చుట్ట నమిలి ఉమ్మేయటం”, మాస్టారు ఏ ఉద్దేశం తో రాశారో కానీ, నాకు మాత్రం titillating  గా అనిపించింది (ఈ విషయం గురించి చెప్పటం (మోటు సరసం) సూరయ్య స్వభావానికి సరిపోయినా).
ఈ కథలోనూ, యజ్ఞం కథలోనూ, “నెహ్రూ హయాం లోని మిశ్రమ ఆర్ధిక విధానాల వలన  చిన్న కమతాలు కలిగిన దళిత కులాలు, భూమిని కోల్పోయి దిగజారాయని”, రాశారు మాస్టారు. ఉత్తరాంధ్ర సంగతి  నాకు తెలియదు కానీ మధ్యాంధ్ర లో దళితులకి నలభైలలో కానీ యాభైలలో కానీ చిన్న కమతాలు కూడా ఉన్న దాఖలాలు లేవు. డెభ్భై ల చివరికి వచ్చేటప్పటికి పట్టా భూములూ, జమీందార్ల భూములూ పంచి పెట్టటం వలన వారికి కూడ కొంచమైనా భూ వసతి ఏర్పడింది. తొంభైల చివరికి పల్లెలలోని దళితులలో కూడా టీచర్లూ, గుమాస్తాలూ వంటి మధ్య తరగతి ఏర్పడి, వారిలో కూడా మధ్య తరగతి భూ-యాజమాన్యం వచ్చింది.
కథ మొత్తం మనకు దృశ్య పరం గా కన్నుల ముందు తిరుగుతూ ఉంటుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ గోదా, ఎండా అన్నీ నిజ జీవితపు ముసుగు వేసుకొని కనపడతాయి.
మొత్తానికి ఉత్తరాంధ్ర లోని ఒకప్పటి పల్లెటూరి సామాజిక వ్యవస్థనీ అందులోని దోపిడీనీ, దానిలో వస్తున్న ఒక మార్పునీ కళ్ళ కు కట్టిన కథ “చావు”.

ప్రకటనలు