ప్రేమ రాహిత్యం, వస్తు రాహిత్యం , నా తికమకలూ, కొంత విశ్లేషణ..

నాకు తెలిసిన ఒకాయన బాగా ఆస్థిపరుడు. ఎప్పూడూ AC కారుల్లోనే తిరుగుతూ ఉండగల ఆస్థి ఆయనది. ఇద్దరు ముగ్గురు నౌకర్లను పెట్టుకోగలిగిన స్తోమతుంది.  కానీ, ఆయన తన కొడుకుకి ఒక డొక్కు సైకిల్ ఇచ్చి మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రమ్మంటాడు. ఆ కుర్రవాడు అయిష్టం గానే కూరగాయలకి వెళ్తుంటాడు.
ఆయనని అదేమని అడిగితే, “తాను ఎంతో శ్రమ కోర్చి ఆ ఆస్థి సంపాదించాననీ, శ్రమ విలువ తెలియాలంటే, తన కొడుకు ని కూడా జీవితం లోని కష్టం సుఖం తెలిసేటట్లు పెంచాలనీ”, చెప్పాడు. ఇప్పుడు కుర్రవాడిని కొంచెం కష్టం తెలిసేటట్లు పెంచితే అతను పెద్దయాక కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి ఇప్పటి తన పెంపకం ఉపయోగపడుతుందని కూడా పెద్దాయన ఆలోచన.
అయితే ఇదే తర్కాన్ని ప్రేమ కి కూడ ఉపయోగించవచ్చా? చిన్నప్పుడు పెద్ద వాళ్ళ ప్రేమ కి నోచుకోని పిల్లలు, పెద్దయాక ప్రేమలో విఫలమైతే దానిని సులువు గా తట్టుకోగలరా? చిన్నప్పుడు పిల్లలు ప్రేమ రాహిత్యం లో పెరగటం మానసికం గా ఏ మాత్రం ఆరోగ్యదాయకం కాదనేది ఇంగిత జ్ఞానం. మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెప్పేది కూడా ఇదే!
మరి కష్టాల విషయం లో “సరి” అయిన తర్కం, ప్రేమ విషయం లో ఎందుకు పని చేయదు? ఒక పిల్ల వాడిని TV ప్రోగ్రాంలు చూడనీయకుండా పెంచామనుకోండి. వేరొకడిని ముందు నుంచీ TV ని అందుబాటులో ఉంచుతూ పెంచామనుకొందాం.  TV చూడని వాడికి హఠాత్తుగా ఒక రోజు TV ఎదురయిందనుకొందాం. మనం ఇద్దరినీ ఒక గది లో పెట్టి , పక్క రూం లో TV ఉంచి, ఇద్దరికీ TV ని చూడకుండా నియంత్రించుకోమని అడిగామనుకొందాం! అప్పుడు… రోజూ TV చూసే వాడి తో పోలిస్తే అప్పుడే TV చూడటం మొదలు పెట్టిన వాడికి తనను తాను TV చూడకుండా ఆపుకోవటం చాలా కష్టమౌతుంది. ఇది కూడా కామన్ సెన్స్.
ఇక వస్తు వ్యామోహం విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి, మళ్ళీ ప్రేమ విషయానికి వద్దాం. పిల్లలు పెద్దల ప్రేమకు నోచుకొనకపోవటం ఒక తీరని లోపం. ఒక కోరిక తీరని స్థితి. అలాంటి పిల్లలకి యుక్త వయసు వచ్చాక, సహచరులు (opposite sex) కొంచెం  ఆసక్తి చూపించినా అది ప్రేమ లానే అనిపించి వారు నిలువెత్తు భావావేశ పరం గా చిక్కుకొని పోయే ప్రమాదం ఉంటుంది. TV చూడని వాడు మొదటి సారి చూసినపుడు నియంత్రించుకోలేడు కదా! ఇదీ అలానే!
ఇక్కడ ఇంకొక సంశయం! చిన్నప్పటి నుంచీ కష్టాలు పడేవారు, పెద్దయాక కష్టాలను విజయవంతం గా ఎదుర్కోగలరు. అలానే చిన్నప్పుడు ఆదరణ కు నోచుకోని వారు పెద్దయాక ప్రేమ వైఫల్యాన్ని సులువుగా ఎదుర్కోగలరా?
వస్తువుల లేమి వలన మనుషుల శీలం (character) ఓటిది అవదు. పైగా దృఢమౌతుంది.. కానీ ప్రేమ రాహిత్యం వలన మనుషుల మనస్తత్వం ఓటికుండలా బలహీనమౌతుంది. ఎందుకంటే, మానవ సంబంధాల వలన భావోద్వేగాలు ప్రభావితమౌతాయి. వస్తువుల లేమి వలన మన భావోద్వేగాలు లోతుగా ప్రభావితమవ్వవు. ప్రేమ అనేది మనిషి మనసు కి తిండి లాంటిది. తిండి తినకపోతే శరీరం ఎలా కృశించిపోతుందో, ప్రేమకు నోచుకోని మనసుకూడా అలానే న్యూనతకు లోనవుతుంది. మన శరీర ఆరోగ్యాన్ని “మనం ఆహారాన్ని ఏ పాత్రలో తిన్నాం” అనే విషయం నిర్ణయించజాలదు. అదే విధం గా  వస్తు సంపద లేమి మన మనసు యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయించదు.  పై పెచ్చు లేమి నేర్పిన పాఠాలు తరువాత ఉపయోగపడతాయి. చిన్నప్పుడు మూకుడు లో అన్నం తిన్న వాడు తరువాత అన్నాన్ని ఏ పాత్రలోనైనా తినగలడు.
చిన్నప్పటి ప్రేమ రాహిత్యం వలన యుక్త వయసులో ప్రేమ లో పడే వారి మనసు బలహీనం గా ఉంటుంది. వారికి చిన్నప్పుడే ప్రేమ లేమి తెలియటం వలన, పెద్దయాక మానవ సంబంధాలలో, నమ్మకం తో ముందుకి పోరు. మానవ సంబంధాలకు నమ్మకం ముఖ్యం. కాబట్టీ, వీరు ఆయా సంబంధాలలో విఫలమయే అవకాశం ఎక్కువ.  కాకపోతే, అంతకు ముందే చిన్నప్పటి అనుభవం వలన ఈ వైఫల్యాన్ని వీరు త్వరగానే జీర్ణించుకొంటారు. అదే, చిన్నప్పుడు ప్రేమ రాహిత్యాన్ని చవి చూడని వారు,  పెద్దయాక సంబంధాలలో విశ్వాసం తో పురోగమిస్తారు. అయితే మొదటి వైఫల్యం వలన వీరికి కలిగే మనస్థాపం చాలా ఎక్కువ గా ఉంటుంది. కానీ వీరి వ్యక్తిత్వం దృఢం గా ఉంటుంది. కంచు పాత్ర కి దెబ్బ ఎక్కువ తగిలినా తట్టుకొన్నట్లు, వీరికి మొదటి వైఫల్యం వలన బాధ ఎక్కువ కలిగినా తట్టుకొంటారు. అదే ప్రేమ రాహిత్యం తో పెరిగిన వారికి మొదటి ప్రణయం లో తగిలిన దెబ్బ పెద్దగా అనిపించదు (వీరికి ప్రేమేఛ్ఛ ఎక్కువగా ఉన్నా, అది సఫలం కాదేమోననే అపనమ్మకం కూడా ఉంటుంది (once bitten, twice shy).చిన్నప్పుడే దెబ్బలు తిని ఉండటం వలన, వీరు మళ్ళీ దెబ్బ తగులుతుందేమో అనే సందేహం తోనే సంబంధాలు నెరపటం వలనా). కానీ వీరు గాజు పాత్ర లాంటి వారు. తగిలిన చిన్న దెబ్బ ను కూడా తట్టుకొనే శక్తి వీరికి చాలా తక్కువ గా ఉంటుంది.

ప్రకటనలు

20 thoughts on “ప్రేమ రాహిత్యం, వస్తు రాహిత్యం , నా తికమకలూ, కొంత విశ్లేషణ..

 1. ప్రసాద్ గారూ,
  మూడు నెలల తర్వాత మళ్లీ బ్లాగులో అడుగుపెడుతున్నమీకు స్వాగతం. ఇకెప్పుడూ మళ్లీ మీరు బ్లాగింగ్ చేయననే ప్రతిజ్ఞలు చేయరని, చేయకూడదని కోరుకుంటున్నాను.

  పోతే. “వస్తువుల లేమి వలన మనుషుల శీలం (character) ఓటిది అవదు. పైగా దృఢమౌతుంది.. కానీ ప్రేమ రాహిత్యం వలన మనుషుల మనస్తత్వం ఓటికుండలా బలహీనమౌతుంది….. చిన్నప్పుడు మూకుడు లో అన్నం తిన్న వాడు తరువాత అన్నాన్ని ఏ పాత్రలోనైనా తినగలడు.” అంటూ మనిషి జీవితాన్నే మీరు తాత్వీకరించేశారు.

  ‘వస్తువును ప్రేమించకండి. ప్రేమిస్తే వస్తువు మిమ్మల్ని కూడా ప్రేమిస్తుం’ది అని కాలేజీలో మా లెక్చరర్ చెప్పేవారు. ఇది వస్తువుపై వ్యామోహం వద్దని చెప్పే నీతి. కాని మా తాత మాత్రం ఈ నీతిని మరొకలా చెప్పేవాడు. “పొలాలకేసి రోజూ పోయి చూసిరండి, ఎదుగుతున్న పంటను రోజూ చూసి రండి. భూమి యజమాని తనను చూస్తున్నాడంటే, తన బాగోగులు పట్టించుకుంటున్నాడంటే పొలానికి, పంటకు కూడా సంతోషం కలుగుతుంది. మంచి పంటనిస్తుంది” అని తాత చెప్పేవాడు.

  ఇది వస్తువ్యామోహం కాదు. జీవితాన్నే వ్యామోహించడం. ఈ సందర్భంలో వ్యామోహం అనే పదం సందర్భోచితమో కాదో కాని ఇది అందరికీ అవసరం. పనిని ఇష్టంగా చేయడానికి కష్టంగా చేయడానికి మధ్య చాలా తేడా ఉందని తాత జీవితానుభవాన్ని రంగరించి చెప్పేవాడు.

  ‘రిటైరయ్యాక వ్యవసాయం చేసుకుంటా’ అని అంటున్న మన రాజమౌళి కూడా -ఈ ఆదివారం సాక్షి ఫ్యామిలీ- పల్లెల్లో పనిని ఒక ఆటపాటగా చేస్తారని, కొందరు పనిని శాపంగా చేస్తారని దీనికి కారణం ఆ పని వారికి రాకపోవడం, అసలు ఆ పని వాళ్లకు చెందకపోవడమే అంటూ మాబాగా చెప్పారు.

  “చిన్నప్పుడు పిల్లలు ప్రేమ రాహిత్యంలో పెరగటం మానసికంగా ఏ మాత్రం ఆరోగ్యదాయకం కాదనేది ఇంగిత జ్ఞానం.”

  ఆలోచనాత్మకమైన వాక్యం.

  కాని ప్రేమ రాహిత్యం మాటేమిటో గాని వస్తువ్యామోహం అనేది ఒళ్లు బలిసినవారికి, డబ్బు చేసిన వారికి మాత్రమే చెందిన లక్షణం కదా. కోట్లమంది ఇప్పటికీ మన దేశంలో అవసరానికి మించి అదనంగా ఒక్క వస్తువు కూడా కొనలేనివారే.

  మెచ్చుకోండి

 2. రాజు గారు,
  ధన్యవాదాలు!
  “కోట్లమంది ఇప్పటికీ మన దేశంలో అవసరానికి మించి అదనంగా ఒక్క వస్తువు కూడా కొనలేనివారే.”

  అందుకే సాధారణ ప్రజలు చిన్న చిన్నా, ఊహా జనితమైన కష్టాలకు(సీరియల్స్ లో ఆడవాళ్ళ కష్టాల లాంటివి) కౄంగిపోరనుకొంటా!

  మెచ్చుకోండి

  1. రాజుగారు,
   నేను చాలా మార్క్స్ గారి పుస్తకాలు చదివానండి. అందువలన ఆయన గుర్తొస్తుంటాడు. లాప్ టాప్ నాలో అంతర్భాగం అయిపోయాయి. కాని వాటితో అనుబంధం ఉండదు. అవి ఎక్కడైనా పోయినా కూడా విచారించను.
   *పాతది పనిచేస్తున్నప్పుడు అనవసరంగా డబ్బు తగలెయ్యడం ఎందుకు అని కొనలేదు*
   భలే వారే కంపేని లో పాత ఉద్యోగి బాగా పనిచేస్తున్నడని ఎక్కువ జీతం ఇస్తారా? బయటి నుంచి కొత్త వాడిని తీసుకొని, వాడికి ఎక్కువ జీతం ఇస్తారుకదా! కేపిటలిస్ట్ ప్రపంచంలో ఉంట్టూ, నేను వారి సుత్రానే ఫాలో అవుతాను. పాతది పనిచేస్తున్నా కొత్తదికొని పాతదానిని బయటికి సాగనంపుతాను 🙂 అప్పుడే జీవితంలో ఎదో సాధించినట్లు ఉంట్టుంది. ఒక స్టేజ్ కి వచ్చిన తరువాత జీవితంలో పెద్ద మార్పులు కనిపించవు. చిన్నపటినుంచు 25సం|| చదువుల వలన ప్రతిసం కొత్త తరగతికి మారటం అలవాటౌతుంది. ఉద్యోగంలో ప్రతి సం || ప్రమోష రాదు కదా! అందువలన మనకు కొత్తదనం కొద్ది కాలానికి పోయి బోర్ అవుతుంది. వస్తువలను అన్నా మారుస్తూంటె టైంపాస్, మార్కేట్లో మని సర్కులేషన్ రెండు జరుగుతాయి కదా! బాంక్ లో దాస్తే ఎమి లాభం? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనపుడు దానిని డి-వాల్యు చేస్తుంది.

   డబ్బులను దాచి పెట్టకుండా, చేతైనైంత సొమ్మును ఖర్చు పెట్టి సర్విసులను కొనుకోవటమే, నాకు చాలా సరదా. ఎన్ని వస్తువులు ఉంటే అంత టైంపాస్, కొన్న కొత్తల్లో వాడి ఆఫర్లకొరకు వేచి చూడటం, వారంటి పిరియడ్లో రిపేర్ వస్తే కాల్ సెంటర్ కి పోన్ చేసు తగువులు వేసుకోవటం, వారంతం లో వాటిని శుభ్ర పరచుకోవటం. ఎలాగు ఈ రోజుల్లో అందరికి ఒకరిద్దరు పిల్లలేకదా! వాళ్లు పెరిగి కొంచెం పెద్దయ్యాక చేయదగ్గ పనులు ఏముంటాయి. వస్తువులనుకొని వాటిద్వారా మనం సేవలు పొందుతూ,తిరిగి మనం సేవచేసుకొంట్టు పోతే అదొక సరదా! పేపర్ మని పుష్కలంగా ఉంటే వాటి తో మనం అనుబంధం ఎర్పరచుకోనక్కరలేదు. పోతే ఇంకొకటి కొత్త టేక్నాలజి వస్తువు రిప్లేస్ చేస్తుంది 🙂

   మెచ్చుకోండి

   1. శ్రీరాం గారు,
    మీ దగ్గర డబ్బులు పుష్కలం గా ఉన్నట్లున్నాయి, నాకో పదివేలు అప్పుకొట్టండి. 🙂
    క్రెడిత్ కార్డులుంటే మీ పిన్ను చెప్పి నాకో కార్డ్ పారేయండి.

    మెచ్చుకోండి

 3. రాహిత్యము, లోటు అనేవి సాపేక్షికమేమోనండీ. ప్రేమరాహిత్యంవల్ల -supposedly- కలిగే “character deficiency” పరిణామక్రమంలో అలవడిన (అవ)లక్షణమేమో.

  Good one and thank you.

  మెచ్చుకోండి

 4. “రాహిత్యము, లోటు అనేవి సాపేక్షికమేమోనండీ.”
  అవునండీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. మన పరిసరాలలోని మనుషుల జీవితాల తో పోలిస్తే మన జీవితం లో లేమి ఉంటే దానిని మరింత గా ఫీల్ అవుతాం.
  ఈ character deficiency పరిణామ క్రమం లో ఎలా వచ్చిందీ నాకు పెద్ద అయిడియా లేదు. మీకు తెలిస్తే కాస్త వివరిస్తారా? ఈ character deficiency వలన మనుషుల/జీవుల మనుగడ కి ఏవిధం గా ఉపయోగం?

  మెచ్చుకోండి

 5. *యుక్త వయసు వచ్చాక, సహచరులు కొంచెం ఆసక్తి చూపించినా అది ప్రేమ లానే అనిపించి వారు నిలువెత్తు భావావేశ పరం గా చిక్కుకొని పోయే ప్రమాదం ఉంటుంది*
  అందులో ప్రమాదమేమి ఉందండి? ప్రేమలో పడటాన్ని/భావావేశాన్ని మీరు అలా డిసైడ్ చేశారే. అప్పు చేసి పప్పుకూడు సినేమాలో ఒక పాటలో “యువతి చెంత పర పురుషుడు నిలిచిన భావవేశం కలుగు కదా” అని మగ రచయిత రాశాడు. అది అటువైపు వారికి కూడా చాలా కలుగుతుందని, కొంతమంది స్రీ వాద సాహిత్యం వాళ్లు పద్యాలు రాశారు కదా! మార్క్స్ గారి లాగా ప్రపంచ ప్రజలకు ఏది క్షేమమో, ఏది ప్రమాదమో మీరే నిర్ణయిస్తున్నట్లు ఉంది 🙂 🙂 ఎంత మోహం ఉంటే అంత మంచిదండి. జీవితంలో తాడో పేడో తేలిపోతుంది. ఐతే వాల్మికి, తులసిదాస్ వంటి గొప్ప కవి అవుతాడు, లేకపోతే సుఖాలు పొంది, డబ్బులుపోగొట్టుకొని సుబ్బిశెట్టిలాగా తత్వవేత్తగా అన్నా మారుతాడు.

  *అదే విధం గా వస్తు సంపద లేమి మన మనసు యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయించదు. *

  ఈ మాట భార్య కి నచ్చిన ఇల్లు నగలు, చీరేలు అడిగినపుడు చెపితే, అప్పుడు మగవారి ఆరోగ్యం ఎంత దృడంగా ఉంట్టుందో తెలుస్తుంది 🙂 :). ఇది వాస్తవం కాదు. వస్తువూలనేవి జీవితం లో అంతర్భాగం, ఉన్నపుడు వాటి విలువ తెలియదు, కంప్యుటర్ చేడిపోయి, ఒక నేల నేట్ కనేషన్ లేదనుకోండి, జీవితం లో ఎంత వెలితిగా ఉంట్టుందో అర్థమౌతుంది. ఇన్వటర్ పని చేయకపోతే చాలా అప్సేట్ అవుతాను. కరెంట్ లేకపోతే కోపం వస్తుంది. అది ఆరోగ్యాన్ని దెబ్బతీసుతుంది. కదా!

  మీరు ఇంట్లో వాడే వస్తువుల్లంటిని నెలరోజులు వాడకుండా చూడండి. తరువాత, మీ ఆరోగ్యం ఎలా ఉంట్టుందో చెప్పండి. అసలికి మనం పని చేసేదే వస్తువులను కొన్నుకోవటానికి . అచ్చంగా అంత తిండి తిని పనుకోవటానికి ఇంత కష్టపడాలా?

  మొదటి కంప్యుటర్ కొన్న మోదట్లో అది గోద్రేజ్ బీరు వాలాగా జీవితకాలం ఉపయోగిస్తామనుకొన్నట్లు ఒక ఫీలింగ్ ఉండేది, చాలా విచారించి కొనుకొన్నే వాళ్లం. ఆతరువాత మూడూ లాప్ టాపులు, డేటామార్చుకోవటానికి రెండు యక్స్ టర్నల్ డిస్క్లలు అయ్యయి. ఈ మధ్య కొత్త మొబైల్ తీసుకొంట్టున్నపుడు, బహుశా ఇదే ఆఖరి సారిగా డేటాను ట్రాన్స్ ఫర్ చేసేదనుకొన్నాను. చూడాలి ఎంత వరకు విజయం సాధిస్తానో! ఇప్పుడు మన జీవితాలను టెక్నాలజి నడుపుతున్నాది. ఆరంగంలో ఉంటూ, వాటిని ఉపయోగిస్తూ దానిపైన విజయం సాధించటం అసంభవం అనిపిస్తుంది. ఇప్పుడు మొబైల్ ద్వారా ,ఆన్ లైన్ షాపింగ్ వలన వస్తువులను కొనటం ఎక్కువైంది. నేను చాలా పుస్తకాలు కొంటాను. రాను రాను కారు, కంప్యుటర్, ఎలేక్ట్రానిక్స్ వస్తువులను కొనటం అమ్మటం వలన, వాటితో అనుబంధం అనేది పోయింది. ఆ కొంట్టూటాం, పోతూంటాయి బాగ లేకపోతే మార్చేయటమేకదా అని తేలికగా తీసుకోవటం మొదలుపెట్టి చాలా కాలమైంది.

  మెచ్చుకోండి

 6. వస్తువుల్లేని కష్టాలకు అలవాటు పడి రాటుదేలుతాం. ప్రేమ లేని కష్టం మనిషి కారెక్టర్ ని దెబ్బతీస్తుంది. కానీ వస్తువులతో “రొమాన్స్ చేయటం గాఢమైన అనుబంధం ఏర్పరుచుకోవటం చేయం” అని మీ చివరి లైన్లు కూడా చెబుతున్నాయండీ! 🙂

  మెచ్చుకోండి

 7. “అందుకే సాధారణ ప్రజలు చిన్న చిన్నా, ఊహా జనితమైన కష్టాలకు(సీరియల్స్ లో ఆడవాళ్ళ కష్టాల లాంటివి) కౄంగిపోరనుకొంటా!”
  ప్రసాద్ గారూ.. చాలా కరెక్టండీ. సాధారణ ప్రజల జీవితాల్లో మెలోడ్రామా -నాటకీయత- ఉండదు కాబట్టే వాళ్లు ఊహాజనితమైన కష్టాలను ఫీలవలేరు. వాళ్ల కష్టాలన్నీ వాస్తవ జనితమైనవే. వర్షం మీద ఆధారపడిన రైతు తన కష్టసుఖాలను వర్షం రావటం, రాకపోవడం అనే వాస్తవికతపై ఆధారపడి మాత్రమే ఫీలవుతుంటాడు.

  “మార్క్స్ గారి లాగా ప్రపంచ ప్రజలకు ఏది క్షేమమో, ఏది ప్రమాదమో మీరే నిర్ణయిస్తున్నట్లు ఉంది”

  శ్రీరామ్ గారూ, నాకూ నవ్వొస్తోందండీ. మీరెప్పటికీ ఇంతే. కార్మికులకు ఏది క్షేమమో మాత్రమే మార్క్స్ చెప్పారనుకుంటాను.

  అయినా కంప్యూటర్, మొబైల్, చివరకు లాప్‌టాప్‌ వంటివి కూడా ఇప్పుడు విలాస వస్తువుల్లాగా లేదా వ్యాపారానికి ఉపయోగపడే వస్తువుల్లాగా కాకుండా అన్ని వర్గాల ప్రజల వినియోగ వస్తువులుగా మారుతున్నట్లున్నాయి కదా. దేశంలో ఇప్పటికి 99 కోట్ల మొబైల్ ఫోన్ల అమ్మకాలు, కాలేజీ విద్యార్థులందరికీ తక్కువ స్థాయి లాప్ టాప్‌లు అందివ్వటానికి ప్రభుత్వాలు సిద్ధమైపోవడం వంటివి మార్పును స్పష్టంగా సంకేతిస్తున్నాయి. అదే సమయంలో మంచినీళ్లకు గతి లేని చోట మందుబార్లు మాత్రం దండిగానే లభిస్తున్నాయి కూడా…

  మరోమాట.. 2005లో నేను కొన్న పర్సనల్ కంప్యూటర్ ముక్కుతూ మూలుగుతూ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. మా సర్వీసర్ గత రెండేళ్లుగా మార్చేయమని పోరు పెడుతున్న అలాగే నెట్టుకొస్తున్నాను. ఒకే కంప్యూటర్‌ని ఎనిమిదేళ్లుగా వాడుతుండటం కూడా రికార్డేనేమో. కొనగలిగే శక్తి ఉన్నా పాతది పనిచేస్తున్నప్పుడు అనవసరంగా డబ్బు తగలెయ్యడం ఎందుకు అని కొనలేదు.

  మెచ్చుకోండి

 8. ప్రేమ రాహిత్యాన్ని వస్తు పరమైన విషయాలతో పోలుస్తూ రాయడం బాగుంది.

  గాడ్జెట్స్ లేకుండా పెరిగినవాడి భవిష్యత్ ప్రవర్తన గూర్చి ఏమోగాని.. ప్రేమరాహిత్యంతో పెరిగినవాడు మాత్రం చాలా ఇబ్బందులు పడతాడు. పెడతాడు. భవిష్యత్తులో మానసిక రోగి అయ్యేందుకు ఇదొక సూచిక అని సైంటిఫిక్ ఎవిడెంస్ కూడా ఉంది.

  అయితే డొక్కు సైకిల్ ఇవ్వడం, టీవీ చూడనీక పోవడం అనేది ప్రేమరాహిత్యం కిందకి రాదేమోనని నా అనుమానం. అది కేవలం ఒకరి చాదస్తం, అజ్ఞానం పిల్లల మీద రుద్దడమే! వీళ్ళల్లో ఎక్కువమంది న్యూరోటిక్స్.

  చాలా రోజుల తరవాత మీ పోస్ట్ చదువుతున్నందుకు సంతోషంగా ఉంది.

  మెచ్చుకోండి

  1. రమణ గారు,
   మీ టపాలని నేను విడువకుండా చదువుతూనే ఉన్నాను.
   ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ గా మీరు కంఫం చేయటం వలన నేను చెప్పినదానికి అతెంటిసిటీ వచ్చిందని సంతోషపడుతున్నాను.
   “అయితే డొక్కు సైకిల్ ఇవ్వడం, టీవీ చూడనీక పోవడం అనేది ప్రేమరాహిత్యం కిందకి రాదేమోనని నా అనుమానం. ”
   ఇక్కడ ఫోకస్ “డొక్కు సైకిల్”,”ప్రేమరాహిత్యం” మీద కాదండీ.(నేను సరిగా విశదీకరించలేకపోయానేమో! )..”చిన్నప్పటి నుంచీ కష్టాలకు అలవాటు పడితే, పెద్దయ్యాక కష్టాలను తేలిక గా ఎదుర్కొంటారు” అనే పాయింట్ మీద. అలానే చిన్నప్పుడు ప్రేమ పొందకపోవటం అనేది ఒక కష్టం. కానీ పెద్దయ్యాక రిజెక్ట్ చేయబడటం అనే కష్టాన్ని ఎదుర్కోవటానికి, ఈ చిన్నప్పటి కష్టం ఏ విధం గానూ ఉపయోగపడక పోగా, పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది కదా(చిన్నప్పటి ప్రేమ లేమి నుంచీ వచ్చిన న్యూనత మొదలైన వాటి వలన). వ్యత్యాసం.. “ఒక కష్టం వస్తువు వలన వచ్చినది అయితే, వేరొక కష్టం మానవ సంబంధాల వలన రావటం” లో ఉంది. మానవ సంబంధాలు ఎప్పుడూ ఆయా వ్యక్తుల మనసు ను ప్రభావితం చేస్తాయి. మనకిష్టమైన లాప్టాప్ దొరకకపోతే, తరువాత కొనుక్కొందాం లే అనుకొంటాం. మనకిష్టమైన అమ్మాయి దొరకకపోతే అంత వీజీ గా దులిపేసుకొనిపోలేం! పైగా అమ్మాయి అవును అనలేదంటే మనలో ఏ లోపముందో అని ఆలోచిస్తాం.ఆ అమ్మాయి దృష్టిలో మనం ఏమిటి? అనే ఆలోచనలు వస్తాయి. లాప్టాప్ దొరకకపోతె దానిలో మనలోపం ఉందేమో అన్న ఆలోచనే రాదు.లాప్టాప్ వస్తువు కాబట్టీ “దాని దృష్టి లో మనం ఏమిటి?”, అనే ఆలోచనే రాదు.
   మానవతా విలువలు తగ్గిపోయి , పక్కోడి గురించి పట్టించుకోక పోయినా, మనకి మనుషులతో ఉండే సంబంధాలు వస్తువులతో ఉండవు. మనుషులకిచ్చే విలువ, వస్తువులకి ఇవ్వం. వాటి తో మనకి ఉండే సంబంధాని(?)కి ఇతర మనుషులతో మనకు ఉండే సంబంధాలతో పోలిస్తే చాలా తక్కువ విలువ నే ఇస్తాం. మనుషులకి రాగ ద్వేషాలు ఉంటాయి కానీ వస్తువులకి అవి ఉండవు కదా? చివరికి మనలా రాగద్వేషాలు ఉండే వ్యక్తులే మన మనసుని పాజిటివ్ గానో నెగటివ్ గానో ఆక్రమిస్తారు. చాలా పొడుగే రాశాను..మీకు ఇవన్నీ చెప్పటం “హనుమంతుని ముందు కుప్పిగంతులేయటం” లాంటిది..ఇక ఉంటాను.

   మెచ్చుకోండి

 9. *చిన్నప్పటి నుంచీ కష్టాలకు అలవాటు పడితే, పెద్దయ్యాక కష్టాలను తేలిక గా ఎదుర్కొంటారు*
  క్రితం తరం తల్లిదండృల అభిప్రాయాలు. ఇందులో నిజం పెద్దగా ఉండవచ్చు. ఇవ్వన్ని మన ఊహలు అనుకోవచ్చా?

  *వస్తువుల లేమి వలన మనుషుల శీలం (చరచ్తెర్) ఓటిది అవదు. పైగా దృఢమౌతుంది*

  మహేష్ భట్ తీసిన జన్నత్ సినెమాలో హీరో పాత్రను విశ్లేషిస్తే మీరు పైన రాసిన వ్యాఖ్యకు పూర్తి విరుద్దంగా ఉంట్టుంది. ఆ హీరో మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ టీచర్ కొడుకు. తండ్రి వాడిని తన సంపాదనలో వచ్చే డబ్బులతో, మంచి విలువలతో పెంచాలనే ప్రయత్నం చేస్తాడు. కాని ఈ హీరొకి తండ్రి అంటే, అతని మధ్యతరగతి విలువలు అంటే ఒక విధమైన అయిష్టత ఎర్పరచుకొంటాడు. తనకు నచ్చిన చిన్న వస్తువును కొనిమంటే పెద్ద పిలాసఫి చెపే, పర్చేసింగ్ పవర్ లేని తండ్రిని అతను ఇష్టపడడు. ఈ లైన్ మీద సినేమా కథ ఉంట్టుంది. సినేమా చాలా బాగుంట్టుంది. వీలైతే చూడండి.

  తల్లిదండృలు పిల్లలకు కష్ట్ట సుఖాలు తెలియాలి అనే శ్రద్దతో పెంచినా బయట పరిస్థితి బాగా లేదు. వ్యాపారం స్కుల్స్ నుంచి మొదలైపోయింది. కాబట్టి పిల్లలు మార్కేట్ ఎకనామికి బాగా ప్రభావితం అయిపోయారు. దానితో పాటుగా వాళ్ల అంత కంటే ఎక్కువగా టి.వి. కి, అందులో వచ్చే యాడ్స్ కి ప్రభావితం అవుతారు. ఇప్పటి స్కుల్స్ లో చదివే పిల్లలకి ఫ్రెండ్షిప్ చేసే వారికి ఎన్ని బి.హెచ్.కె ల ఇల్లు ఉంది, ఏ కారు ఉంది అని తెలుసుకొని పెట్టుకొంట్టున్నారు. సమానస్థాయిగల వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు.

  మెచ్చుకోండి

 10. విలువలు అనేవి ఉత్త మాట మత్రమే. మధ్య తరగతి ప్రజలు ఆమాటను తమ తమ అవసరాల కొరకు ఎక్కువగా వాడుతారు. వాటిని ఇంకే వర్గ ప్రజలు పట్టించుకోరు. విషయానికి వస్తే మార్కేట్ ఎకనామి అనేది ఒక వ్యసనం. ప్రజలు ఒకసారి అలవాటు పడితే దానినివదులుకోరు. దానిలోని ఎన్ని లోపాలు చెప్పినా, దానివలన లాభం పొందిన మధ్య తరగతి వారు(ఉద్యోగం సంపాదించిన వారు,వ్యాపారంలో డబ్బులు పోగేసినవారు) వాస్తవాన్ని విస్మరించి, దానివలన ఎంతో లాభముందని బ్రమ పడుతూ అందరిని వాదనా పటిమతో నమ్మిస్తూంటారు. దీపం చుట్టు పురుగులు తిరుగుతూ అక్కడినుంచి బయటికి రాకుండా అందులోనే పడి చనిపోతాయి. అదే కొంతమంది మధ్యతరగతి ప్రజలకి భవిషత్ లో జరగబోయేది కూడాను.

  మెచ్చుకోండి

  1. ఏ రిసెషనో వచ్చి ఉద్యోగాలు ఊడితేనో, వ్యాపారాలు కూలితేనో, చివరికి క్రితం తరం పెద్దల పాఠాలు అక్కరకొస్తాయి.
   సమాజానికి సంబంధిన విలువలు దాని మనుగడను నిర్దేశిస్తాయి. విలువలను తక్కువ అంచనా వేయవద్దు. మధ్యతరగతి విలువలు, ముఖ్యం గా పెళ్ళి,ప్రేమ,నైతికత గురించినవి, వీటిని గురించి మీరు చెప్పినది నిజమే కావచ్చు.ఈ మధ్యతరదతి విలువలలో కూడా ప్రక్టికాలిటీ ఉంది. మధ్య తరగతి వాడికి సినిమా హీరోలలా ఓ పది మంది గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేసే అవకాశం వస్తవం లో ఉండదు. వాడి ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించదు. ఒక భార్యను హాపీ ఉంచటానికే తల ప్రానం తోకకి వస్తుంది. అలాంటప్పుడు వాడు తన కోరికలను, ఊహలను అదుపులో పెట్టుకొని నీతివంతమైన జీవితం గడిపితే కొంతైనా అనందం గా ఉంటాడు. లేక పోతే తీరని కోరికలు పెంచుకొని, చివరికి అవి అందక తీవ్ర అసంతృప్తి పాలౌతాడు.

   మెచ్చుకోండి

 11. డబ్బున్నవాడు తన కొడుకుకి కష్టం విలువ చెప్పడానికి డొక్కు సైకిల్ తొక్కించడం సినిమాలలో సాధ్యం కానీ నిజ జీవితంలో అది జరగదు. అందుకే మొదటి పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడు సినిమా స్టోరీ చదివినట్టు అనిపించింది. సుఖం విషయానికి వస్తే, ఎప్పుడూ ఎసి పెట్టెలలో ట్రైన్ ప్రయాణం చేసే నేను రిజర్వేషన్ దొరక్కపోతే స్లీపర్ పెట్టెలు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. జెనెరల్ పెట్టెలు ఎక్కిన సందర్భాలు మాత్రం రాలేదు.

  పిల్లలకి తల్లితండ్రుల ప్రేమే అన్నిటికంటే ముఖ్యం. చిన్నప్పుడు బెల్ట్ దెబ్బలు తిని పెరిగినవాళ్ళు పెద్దైన తరువాత తమ పిల్లలని కూడా బెల్ట్‌తో కొట్టి పెంచుతారు కానీ ప్రేమ నేర్చుకోరు.

  మెచ్చుకోండి

 12. ప్రేమ రాహిత్యం సెర్చ్ చేస్తూ ఇక్కడకు రీడైరెక్ట్ అయ్యాను. అవగాహనా రాహిత్యం పై bondalapati గారు
  రాజశేఖర రాజు గారు ఎలా విశ్లేషిస్తారో చదవాలని కుతూహలంగా ఉంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s