కాళీపట్నం రామా రావు గారి “చావు” కథ., నా అనుభూతి

తెలుగు సాహిత్యం సీరియస్ గా చదివే వారి లో, “కాళీపట్నం రామా రావు(కా.రా. మాస్టారు) గారి పేరు తెలియని వారు”, అరుదు.  మొదట, “కుటుంబ పరమైన కథల” తో తన రచనా జీవితన్ని మొదలుపెట్టిన ఆయన, మధ్య లో వామ పక్ష భావజాలానికి దగ్గరగా రచనలు చేశారు. చివరిదశ లో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు.ఆయన కథ ల లో సునిశితమైన విశ్లేషణ ఉంటుంది. చిన్న పరిధి లో అయినా చాలా గొప్ప రచనలు చేశారు.
ఈ టపా ఆయన 1971 లో రాసిన “చావు” కథ గురించి. అయితే, ఇది ఆ కథ కు పరిచయం ఎంత మాత్రం కాదు. పరిచయం చేసే అర్హతా స్థాయీ నాకు లేవు. ఆ కథ చదివేటపుడు నాలో కలిగిన భావాలను పంచుకోవటానికి మాత్రమే ఈ టపా.
కారా మాస్టారు నిజజీవితం లో లెక్కల మాస్టారు. నాకు ఈ విషయం ఆయన కథలలో కనపడుతుంది (లేక నేను ఊహించుకొన్నానేమో!) ఆయన కథలలో ని మాటలు ఆచితూచి లెక్కపెట్టి వాడినట్లు గా ఉంటాయి. కధలు సాధారణం గా చాలా సీరియస్ గా ఉంటాయి. రావి శాస్త్రి వంటి వారి రచనలలో ఉండే entertaining quality ఈ కథల లో ఉండదు. ఒక మాట ఎక్కువ గానీ, వేరొక మాట తక్కువ గానీ వాడినట్లు మన కు ఎక్కడా అనిపించదు.
క్రికెట్ ఆడేటపుడు రాహుల్ ద్రవిడ్ వంటి బాట్స్-మేన్ text book strokes కొడతారని అంటారు. కారా మాస్టారి కథలు నాకు చాలా అథెంటిక్ గానూ, text book కథలు గానూ అనిపించాయి. చావు కథ ఆయన మార్కు కథలలో అగ్ర స్థానం లో ఉంటుంది. ఆయన “యజ్ఞం” కథ గురించి చాలా మందికి రివ్యూల ద్వారానో ఇతరత్రానో తెలుసు. నాకు “చావు కథ యజ్ఞం కథ కి ఏ మాత్రం తీసిపోని కథ”, అనిపించటం కూడా ఈ టపా రాయటానికి ఒక కారణం.

ఈ కథా స్థలం ఉత్తరాంధ్ర లోని ఒక మాల పేట .( పల్లెటూర్లూ,మాల పల్లెలూ, కులాలూ, దారిద్ర్యమూ పడని వారు ఇక్కడి తో ఈ టపా చదవటం ఆపేయ వచ్చు). నారమ్మ అనే ఒక ముసలామె చనిపోతుంది. మాలపేట లోని జనమందరూ (మొగుడూ పెళ్ళాలూ,కుర్రవాళ్ళూ) కూలికి పక్క ఊరికి వెళ్తారు. ఇళ్ళ లో పిల్లా జెల్లా, ముసలీ ముతకా మాత్రమే ఉంటారు (ఈ నాడు పట్టణాల లో ఉన్నట్లు గా). అది చలి కాలం. అసలే ముసలిదైన నారమ్మ , అ చలికి పై లోకాలకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న నారమ్మ మనవరాలు సిమ్మాద్రి దాని దోస్తుల్తో కలిసి పక్క ఊరు వెళ్ళి అక్కడి కి కూలికి వెళ్ళిన తన ఊరి జనాలకి “నారమ్మ మరణం” గురించి చెబుతుంది.
ఊరి జనాలు ఇళ్ళ కు చేరి, ముసలామె ని ఖననం ఎలా చేయటమా అని ఆలోచన లో పడతారు. గుంపులో ని నారమ్మ సమకాలీనుడైన సూరయ్య, (అతనే కుల పెద్ద) ,ఆమె జీవితం లోని ఘట్టాలను గురించీ, ఆమె వ్యక్తిత్వం గురించీ చిన్న చిన్న సంఘటనల తో వివరిస్తూ ఉంటాడు.
చలికాలం అవటం మూలాన, ముసలామె ను దహనం చేయటానికి కట్టెలు దొరకవు, కన్నయ్య అనే అతను ఒక బారిక (ముఠా మేస్త్రి?). అతనిని కట్టెలను తీసుకొని రమ్మని, ఊరిలోని పెద్ద కులాల మనుషుల ఇళ్ళకు  పంపిస్తారు. కానీ కట్టెలు ఎక్కడా దొరకవు. ఊరిపెద్దల మాటలు వారి కుల వివక్షను బహిర్గతం చేస్తాయి.
అప్పా రావు ఆత్మ గౌరవంకల, కొంచెం దూకుడు కల కుర్రకారు.ఊరిలోని పెద్ద మనుషులు నిమ్న కులస్థులను అణచిపట్టటమే కాక వీలు చిక్కినపుడు, తమది కాని సొమ్మును చేజిక్కించు కొన్నారనే ఎరుక అప్పా రావుకీ కుర్ర కారు కీ ఉంటుంది.
ఊళ్ళో పెద్దలెవరూ ముసలామె దహనానికి కట్టెలు ఇవ్వలేదని తెలిసి, కుర్రవాళ్ళంతా ఆవేశం తో కట్టెల కోసం ఊరి లోకి వెళ్తారు. ఈ లోపల సూరయ్య అక్కడ పోగయిన జనాలతో ఆ ఊరి ఆర్ధిక సంబంధాల చరిత్ర గురించి వివరిస్తాడు. ఒకప్పుడు అన్ని కులాలకీ కొద్దో గొప్పో ఆస్థి ఉండేదనీ, నూతన ఆర్ధిక వ్యవస్థ ( 70 ల లో ని మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ) వలన బలవంతులూ, సరైన సంబంధాలు కలవారి దగ్గర సంపద పోగుపడుతోందనీ వివరిస్తూ ఉంటాదు.
హఠాత్తుగా కుర్రాళ్ళు కట్టెల మోపులు తెచ్చి పడవేస్తారు. అవి సంగ్రహించిన కట్టెలు. కట్టెలు సంగ్రహించటం లోని న్యాయాన్యా ల గురించిన చర్చ తరువాత, కుర్రకారు తమ మాట నెగ్గించుకొని ఆ కట్టెల తో  ఖననం చేస్తారు. ఇదీ సంగ్రహం గా కథ.
ఇది చాలా పెద్ద కథ. పదుల సంఖ్య లో పాత్రలు ఉంటాయి. కథ చలికాలం లో జరుగుతుంది. నాకైతే, కధ చదివినంత సేపూ చలి చలి గా అనిపించింది. పాత్రల వస్త్రధారణా  (బట్టలు ఉన్న పాత్రలకు), వారి మాండలికం, మాటా, మాట విరుపూ అన్నీ సజీవం గా ఉంటాయి. కథలు అందమయిన విషయాల గురించి రాయాలనే ఆలోచన కి ఈ కథ ఒక పెద్ద చెంప పెట్టు. ఈ కథ లో చనిపోయిన నారమ్మ దేహం మలమూత్రాల లో పడి దుర్వాసన వెలువరిస్తూ ఉంటుంది. కానీ మనకు ఆమె పట్ల  దుర్వాసన కు అతీతమయిన మానవతా స్పందన ఏదో కలుగుతుంది.
మాస్టారు మాటలు చాలా precision తో వాడతారు. మచ్చుకి కొన్ని..
“..అప్పుడప్పుడే విచ్చుతున్న మగ గొంతు”.

సమయం తో పాటు జనాలలో వచ్చిన పరిణామాన్ని సూచించే ఒక వాక్యం..
“..అయితే అప్పటి నాయుళ్ళు ఇప్పట్నాటి కరువుగొట్టు నాయాళ్ళు కారు. “ఆపు” ఉంచిన పెండ్లి కెళ్ళినా, ఏదో పేదా రోదా కడుపు జరగని గుంట పాపల్లెమ్మని సూసీ చూణ్ణట్టు, ఓ కసురు గసిరి, ఒగ్గీసీవోరు.”

కటిక పేదరికం లోం కూడా సమాజంపు ఆచారాలనూ కట్టు బాట్లనూ ఒదులుకోలేని పేద మనుషులు కపడుతూఉంటారు. ముసలామె ను కప్పెట్టటానికి ఆచారం అడ్డొస్తుంది.

“నారమ్మ కు కుర్ర తనం లో పట్ట రాని చోట జలగలు పట్టటం, సూరయ్య ఆ ప్రదేశం పై చుట్ట నమిలి ఉమ్మేయటం”, మాస్టారు ఏ ఉద్దేశం తో రాశారో కానీ, నాకు మాత్రం titillating  గా అనిపించింది (ఈ విషయం గురించి చెప్పటం (మోటు సరసం) సూరయ్య స్వభావానికి సరిపోయినా).
ఈ కథలోనూ, యజ్ఞం కథలోనూ, “నెహ్రూ హయాం లోని మిశ్రమ ఆర్ధిక విధానాల వలన  చిన్న కమతాలు కలిగిన దళిత కులాలు, భూమిని కోల్పోయి దిగజారాయని”, రాశారు మాస్టారు. ఉత్తరాంధ్ర సంగతి  నాకు తెలియదు కానీ మధ్యాంధ్ర లో దళితులకి నలభైలలో కానీ యాభైలలో కానీ చిన్న కమతాలు కూడా ఉన్న దాఖలాలు లేవు. డెభ్భై ల చివరికి వచ్చేటప్పటికి పట్టా భూములూ, జమీందార్ల భూములూ పంచి పెట్టటం వలన వారికి కూడ కొంచమైనా భూ వసతి ఏర్పడింది. తొంభైల చివరికి పల్లెలలోని దళితులలో కూడా టీచర్లూ, గుమాస్తాలూ వంటి మధ్య తరగతి ఏర్పడి, వారిలో కూడా మధ్య తరగతి భూ-యాజమాన్యం వచ్చింది.
కథ మొత్తం మనకు దృశ్య పరం గా కన్నుల ముందు తిరుగుతూ ఉంటుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ గోదా, ఎండా అన్నీ నిజ జీవితపు ముసుగు వేసుకొని కనపడతాయి.
మొత్తానికి ఉత్తరాంధ్ర లోని ఒకప్పటి పల్లెటూరి సామాజిక వ్యవస్థనీ అందులోని దోపిడీనీ, దానిలో వస్తున్న ఒక మార్పునీ కళ్ళ కు కట్టిన కథ “చావు”.

ప్రకటనలు

18 thoughts on “కాళీపట్నం రామా రావు గారి “చావు” కథ., నా అనుభూతి

 1. అవును. కారా మాస్టారి రచనల్లో ‘చావు’ ఒక గొప్ప కథ. కానీ వారి ‘యజ్ఞం’ దెబ్బకి ‘ చావు’ కొంచెం పక్కకి పోయింది. మీరు మాస్టారిని ద్రావిడ్ తో పోల్చారు. నేనయితే ఆయన్ని గంభీరంగా, నిండుగా, నిదానంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మతో పోలుస్తాను.

  మెచ్చుకోండి

  1. యజ్ఞం కథ పాపులర్ కావటానికి తగిన నాటకీయత ఆ కథ క్లైమాక్స్ లో ఉంది. దానిని గురించి ఆ కాలం లో చాలా విమర్శా ప్రతి విమర్శలు జరిగాయని విన్నాను. ఈ కథలు రాసేటప్పటికి నేను పుట్టను కూడా లేదు.

   మెచ్చుకోండి

   1. ‘చావు’ లో ‘యజ్ఞం’ ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి. నాకు తెలిసి తెలుగు కథల్లో ఎక్కువసార్లు సమీక్షంచబడింది, అత్యంత ఎక్కువగా చర్చించబడింది.. ‘యజ్ఞం’ కథ ఒక్కటే! ఈ విషయంలో దీనికి దరిదాపుల్లో కూడా ఇంకే కథా లేదు. మీరు చెప్పినట్లు.. ఈ కథ పాపులారిటీకి ముగింపు భీతి కొలిపే విధంగా ఉండటం (షాకింగ్ అనవచ్చు) ఒక కారణం కావచ్చు.

    రంగనాయకమ్మ ‘యజ్ఞం’ ని అద్భుతంగా చర్చించారు. (నాకు తెలిసి) ఒక కథ మంచి చెడ్డల్ని అంత వివరంగా, శ్రద్ధగా వేరొకరు చేయగా చదవలేదు. చాలా ఎకడెమిక్ గా ఉంటుంది.

    ఈ మెటీరియల్ అంతా కలిపి మాస్టారే ‘కథా యజ్ఞం’ పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించారు. తన పుస్తకంలో రంగనాయకమ్మ విమర్శని ఆయన చాలా ప్రముఖంగా ప్రచురించారు. రంగనాయకమ్మ విమర్శపై కూడా (ఈ పుస్తకం లోనే) చాలా చర్చ జరిగింది.

    మీ బ్లాగు చదివేవారికి కారా మాస్టారుకి, రంగనాయకమ్మకి పడదేమోననే భావన కలిగే ప్రమాదం ఉంది. అంచేత.. నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

    వ్యాఖ్య నిడివి ఎక్కువైంది. సారీ!

    మెచ్చుకోండి

 2. ప్రసాద్ గారూ,
  ‘పరిచయం చేసే అర్హతా స్థాయీ నాకు లేవు’ అంటూనే పదాల కూర్పులో ఈ లెక్కల మాస్టారు చూపిన అత్యంత ఖచ్చితత్వం -accuracy అనే ఈ పదానికి ప్రత్యామ్నాయ పదం లేదా?- గురించి నిఖార్సుగా చెప్పారు.

  దళితులకు భూమి ఉండదు. ఒక వేళ అరా కొరా ఉన్నా లేదా ప్రభుత్వం ఇప్పించినా దాన్ని నిముషాలలో భూమి గల ఆసామీలకు రాసిచ్చేయడంలో దళితులంత ఉదారులు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు. వాళ్ల ఆర్థిక బలహీనతలూ, సాంస్కృతిక బలహీనతలు ఎంత బలీయంగా ఉంటే వాళ్ల భూమి అంతే బలంగా అన్యాక్రాంతమైపోతుంది.

  చిత్తూరు, కడప జిల్లాల్లో పదిహేనేళ్ల క్రితం నేను గ్రామీణ ఉద్యమంలో పనిచేసేటప్పుడు అనేక గ్రామాల దళిత యువకులు తమ తండ్రులు, తాత ముత్తాతలు కొద్దో గొప్పో ఆర్జిత భూములను చేజేతులా ఎలా ‘ధారపోసేవారో’ కథలు కథలుగా చెప్పి నవ్వించేవారు. ఆ నవ్వు వెనుక వారు వ్యక్తీకరించే జీవన వేదన పరమ విషాదంగా ఉండేది.

  పలానా పోలయ్య లేదా నారిగాడు, ఏలోడు మరొకరో ఎవరో ఒక దళితుడి భూమిపై భూ ఆసాముల కన్ను పడిందంటే ఆ భూమి గంటల్లోపలే అన్యాక్రాంతమైపోయేదట. ‘పనుంది రా మామా’ అంటూ వరుస కలిపి కల్లు లేదా సారాయి పూటుగా తాపించి మాటల్లో పెట్టి కాస్త ఉబ్బేస్తే చాలు.. ఎకరాలు ఎకరాల భూమిని ఆ మత్తులోనే ఆసాములకు రాసిచ్చేవారట. అంటే వేలిముద్ర కొట్టేవారు.

  దళిత పెద్దాయన తన ఇంట్లోంచి అడుగు బయటకేసి మళ్లీ ఇంటికి వచ్చేసరికి సొంత భూమి చేజారిపోయేదట. మత్తు దిగాక విషయం తెలిసి ‘నా భూమి నీకెట్లా వచ్చింది సామీ’ అని అడిగితే ‘దళిత జాతిలోనే దొడ్డమనిషివి. అలాంటిది… వేలిముద్ర వేసి భూమి రాసిచ్చిన తర్వాత మళ్లీ ఇలా అధర్మంగా పలుకుతావేంటి మామా, మనం మనం ఎలాంటోళ్లం మరి’ అంటూ భూమి దొబ్బేసిన ఆసామి సెంటిమెంటుతో కొడితే చాలు… అంత జాతి దొడ్డ మనిషి కూడా ఐసయిపోయి, నీరైపోయి ఆ ఆసామీ ఇంట్లోంచి ఏ టెంకాయో, పండో పుచ్చుకుని తుండు దులుపుకుని వెళ్లిపోయేవాడట.

  ఈ దేశపు దొడ్డ దళితుల భూమి అలా చేతులు మారిపోయేది. ఇలా తాగిన మత్తులోనే కాదు. అవసరానికి మూడు మూరల పంచె ఆసామీనుంచి తీసుకుని దానికి కూడా కుంట రెండు కుంటల నేల రాసిచ్చిన మహానుభావులు వీళ్లు.

  తమ తండ్రులు, తాతలు చేస్తూ వచ్చిన ఈ అపరదానాల గురించి ప్రాయంలోని పల్లెల్లోని దళిత యువకులు జోకులేస్తూ చెబుతుంటే మాక్కూడా నవ్వాగేది కాదు. మనలాంటి వ్యవసాయ దేశాల్లో ఎవరి చేతుల్లో భూమి ఉండదో అక్కడంతా దరిద్రమే మరి.

  ఇప్పుడైతే చిన్న కమతాల రైతులు 20 నుంచి 30 శాతం దాకా తమకు సన్నకారు సేద్యం గిట్టుబాటు కావడం లేదంటూ తీవ్ర అసంతృప్తి చెందుతున్న వైనాన్ని ఇటీవలే సర్వే రూపంలో వార్తల్లో పెట్టేశారు. సర్వే మొదలయిందంటే కార్పొరేట్ శక్తుల శీతకన్ను చిన్న కమతాలపై పడిపోయిందన్నమాట. ఇక దళితులే కాదు, అంతో ఇంతో భూమి గల బీసీలూ, శూద్ర అగ్రకులస్తులూ కూడా త్వరలోనే కూలీలుగా మారడాన్ని మనం చూసేయవచ్చు. ఆ తర్వాత ‘మా భూమి మీకెట్లా పోయింది సామీ’ అని ఎవరైనా అడిగితే వెనుకటి తరంలాగా మాయమాటలకు బదులుగా, భూమి దక్కించుకున్న కార్పొరేట్లను కాపాడేందుకు మిలటరీ కూడా అండగా వస్తుంది. ప్రజల కష్టంతో సైన్యాన్ని మేపుతోంది అందుకే కదా.

  ‘కథలు అందమయిన విషయాల గురించి రాయాలనే ఆలోచనకి ఈ కథ ఒక పెద్ద చెంప పెట్టు.’ కాని ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. దేశదేశాలనుంచి సంపద విభ్రమ విలాసాల గురించి, మనిషి సుఖంగా తిని వైభోగాలతో చావడం గురించి చెబుతున్న సాహిత్యం దేశ దేశాల నుంచి ఊడిపడుతోంది కదా ఇప్పుడు. లోకమంతా సౌందర్య, విలాస, భోగ పిపాసే ఇప్పుడు. ‘ఎవడు ఎక్కడ పడి చస్తే మనకేంటి..! నీ సంపాదనను నువ్వే తిను, బాగా తిని తట్టెడు ఏరిగి తొంగుని చావు’ అంటూ కొత్త నీతులు బోధించడానికి అయాన్ రాండమ్మలు తయారైపోయాక.

  “అయితే అప్పటి నాయుళ్ళు ఇప్పట్నాటి కరువుగొట్టు నాయాళ్ళు కారు.” ఎంత చక్కటి భవిష్యద్దర్శనమో ఇది. భూమిగల ఆసాములకు, ఆశ్రయించుకుని ఉండే పేదలకు మధ్య పల్లె బంధనాన్ని పుట్టుక్కున తుంచేసిన క్రాంత దర్శనమిది.

  లెక్కల మాస్టారు నిజంగా కథకుల మాస్టారే.

  ప్రసాద్ గారూ నిజంగా మీకు థాంక్స్ అండీ. మళ్లీ ఒకసారి మన సమాజపు చావు గురించి, మలమూత్ర దుర్వాసనల వెనుక కొట్టుకులాడుతున్న మనుషుల చావుగీతి గురించి గుర్తుచేసినందుకు.

  చావు కథను మళ్లీ చదవాలనిపిస్తోంది నాకు.

  ఆధునికులం కథల సంపుటిని కినెగెలో పెట్టేశారా.. చాలా సంతోషం.

  మెచ్చుకోండి

  1. “భూమి దక్కించుకున్న కార్పొరేట్లను కాపాడేందుకు మిలటరీ కూడా అండగా వస్తుంది. ప్రజల కష్టంతో సైన్యాన్ని మేపుతోంది అందుకే కదా.”
   ఎన్నికలంటూ ఒక అనవసరపు తంతు లేకపోతే, మీరు చెప్పినట్లు ఈ మిలటరీ ని నిమిషాలలో దింపుతారు. ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించే,.. మిలిటరీలను దింపటం లేదు.

   మెచ్చుకోండి

 3. *నూతన ఆర్ధిక వ్యవస్థ ( 70 ల లో ని మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ) వలన బలవంతులూ, సరైన సంబంధాలు కలవారి దగ్గర సంపద పోగుపడుతోందనీ వివరిస్తూ ఉంటాదు*

  ఇతను రాసిన కథలు ఒక్కటి చదవలేదు. మొదటిసారిగా ఇతని పేరు, వంకాయమ్మ పుస్తకం లో చదివాను. ఆమే ఇతనిని తీవ్రంగా విమర్శిసించింది. సోషలిజం అసలు రంగు గురించి ఆయనకి చాలా చక్కగా అర్థమైంది. ఎంతైనా లెక్కల బుర్ర కదా! పుస్తకాలలో చదువుకోవటానికి సిద్దాంతం ఎంత అందగా ఉంటే, వాస్తవిక జీవితంలో అంత విఫలం చెందుతుందన్ని గ్రహించి ఉంటాడు. అందుకే వామపక్ష భావజాలానికి దూరం జరిగి,వంకాయమ్మ ఆగ్రహానికి గురయ్యాడేమో! రాను రాను వంకాయమ్మ ఆంధ్రా అయాన్ రాండ్ లాగా తయారైంది. తనకు నచ్చినదానిని నెత్తినేక్కించుకొని, దానిని సమర్ధించుకొంట్టూ, ఆవేశంతో , ఎమోషనల్ గా పుస్తకాలు రాసుకొంట్టు పోతూంటుంది. ఆయన చివరిదశ లో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు. ఆయనకి నా అభినందనలు. ఆయన రాసిన పుస్తకాలు ఆన్ లైన్ లో దొరుకుతాయా?

  మెచ్చుకోండి

  1. శ్రీరాం గారు,
   మీరు ఆమె అసలు పేరు పెట్టి రాస్తే మీ విమర్శ అర్ధం చేసుకోతగ్గదే!. మారు పేరుపెట్టటం వలన మీ విమర్శ లోని సీరియస్నెస్ తగ్గిపోయిందికదా!?

   “ఆయన రాసిన పుస్తకాలు ఆన్ లైన్ లో దొరుకుతాయా?”
   కినిగె లో ఆయన సమగ్ర రచనల పుస్తకం చూశాను.

   మెచ్చుకోండి

    1. అయ్యో శ్రీరామ్ గారూ,
     మీకు కూడా ఇలాగే జరుగుతోందా. నేను కూడా గతంలో ఇలాగే నేరుగా కామెంట్ బాక్సులోనే టైప్ చేస్తూ చాలా సార్లు అక్కడ పేస్ట్ కాక -నెట్ ప్రాబ్లెమ్ లేదా టైప్ చేస్తున్నప్పుడు డిలెట్ కీ వేలికి తగిలి బ్లాగ్ మొత్తంగా క్లోజ్ కావడం వంటి వాటివల్ల- మొత్తం పోయేది.

     దాంతో వ్యాఖ్య పెద్దదవుతోందని తట్టినప్పుడు వెంటనే దాన్ని నోట్ ప్యాడ్‌లో కాపీ చేసుకుని మేటర్ పూర్తయ్యాక దాన్ని మళ్లీ కామెంట్ బాక్స్‌లో పేస్ట్ చేస్తూ వచ్చాను. దేనికైనా అనుభవం కావాలి మరి.

     ఈసారికి పోనివ్వండి. మరోసారి మీరు కూడా నాలాగే చేయండి. ఈ సమస్య ఉండదు.

     మెచ్చుకోండి

 4. చెప్పటం మరచాను బొందలపాటిగారు, ఈ టపాను మీరు చాలా బాగా రాశారు. అలాగే రాజేశేఖర్ రాజు గారి తెలుగు రచన ఫ్లో చాలా బాగుంట్టుంది, ఆయనకు నచ్చే వామపక్ష భావజాలం నాకు నచ్చకపోయినా ఆయన మంచి రచయిత . మీటపాకు ఆయన వ్యాఖ్య అదనపు ఆకర్షణ.

  మెచ్చుకోండి

 5. శ్రీరామ్ గారూ,
  ఆదివారం కదా.. కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. మీరు కారా గారి రచనలు ఏవీ చదవలేదంటున్నారు కనుక మీ పరిశీలన కోసం కింది లింకులలోని కథనాలు వీలున్నప్పుడు చూడగలరు.

  కారా మాస్టారుతో కేతు
  http://www.prajakala.org/PDF/kara_interview.pdf

  Unique effort to preserve Telugu fiction
  http://hindu.com/2000/12/01/stories/0401201w.htm

  కాళీపట్నం రామారావు
  http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

  వీటిలో కేతు విశ్వనాధ రెడ్డి గారు 1995లో ఆకాశవాణి కోసం కారా గారితో ఇంటర్వ్యూ పాఠాన్ని తప్పకు చూడండి. జీవితం పట్ల సమాజం పట్ల ఆయనలో మారుతూ వచ్చిన పరిణామాలను ఈ ఇంటర్వ్యూ చాలా చక్కగా వివరించింది. ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని చూసినా ఆయన మలిదశలో నమ్మిన మార్క్సిస్ట్ సామాజిక, సాహిత్య దర్శనాన్ని, దృక్పథాన్ని తదనంతరం కూడా విభేదించినట్లు కనబడటం లేదు నాకయితే.

  మొదట్లో కౌటుంబిక జీవితం మాత్రమే రాస్తుండేవాడినని, ఒక మనిషి లేదా ఒక కుటుంబం.. వాళ్ల తాలూకా దుఃఖానికి, కష్టాలకు కారణాలు వాళ్ల స్వయంకృతాలే అనేటటువంటి అవగాహనతో తొలి దశలో రచనలు చేశానని ఆయన ఈ ముఖాముఖిలో చెప్పారు. మలిదశలో కుటుంబరావు, గోపీచంద్ వంటి రచయిలను చదివాకా, వామపక్ష భావాలకు సంబంధించినటువంటి మిత్రులతో పరిచయాలు పెరిగిన తర్వాత, వ్యక్తి తాలూకా ప్రయత్నం వల్లే సమస్త చక్కపడదని, ప్రతిదీ అతని చేతుల్లోనే లేదని, వ్యక్తుల తాలూకా ప్రయత్నాలకూ, సమస్యలకూ వెనుక సామాజిక కారణాలు ఉన్నాయని గ్రహించగలిగేరు.

  ఆ గ్రహింపును ఈనాటికీ ఆయన వదులుకున్నట్లు లేరు. పైగా మన కష్టసుఖాలకి, సుఖ దుఃఖాలకి మన మంచి చెడ్డలకూ కారణం భగవంతుడు అనేటటువంటి కాన్సెప్ట్ తనకు మొదట్నుంచీ లేదని కూడా ఆయన పై ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కూడా. తన కథల్లో సామాజిక కారణాలను వెదుక్కుంటూ వచ్చిన పరిణామాలు 1952 నుంచే మొదలయ్యాయని కూడా చెప్పారు.

  ఒక సామాజిక పరిణామం నేపథ్యంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం లేదా ఒక సామాజిక వ్యవస్థ లేదా మొత్తం మానవ సమాజం యొక్క సంక్షోభం వంటి వాటిని చిత్రించేది నవల అంటూ సాహిత్యం పట్ల మార్క్సిస్ట్ సిద్ధాంతం చెబుతున్న సామాజిక దృక్పథాన్ని ఆయన ఏనాడూ వ్యతిరేకించలేదు.

  బొందలపాటి ప్రసాద్ గారూ,

  “మొదట, “కుటుంబ పరమైన కథల” తో తన రచనా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన, మధ్యలో వామ పక్ష భావజాలానికి దగ్గరగా రచనలు చేశారు. చివరిదశలో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు.” అంటూ మీరు ఈ బ్లాగ్ కథనంలో వెలిబుచ్చిన అభిప్రాయానికి ఆధారం చూపితే మంచిదనుకుంటాను.

  1995 తర్వాత కారాగారి అభిప్రాయాలలో మార్పు వచ్చిందా? నాకయితే స్పష్టంగా తెలీదు. ఏ ఆధారంతో మీరీ అవగాహనకు వచ్చారో చెప్పండి.

  నాకు తెలిసి మీ పై వ్యాఖ్యను చూసే శ్రీరామ్ గారు…. “సోషలిజం అసలు రంగు గురించి ఆయనకి చాలా చక్కగా అర్థమైంది. ఎంతైనా లెక్కల బుర్ర కదా!…. ఆయన చివరిదశ లో సిధ్ధాంత పరిధులకి లోబడని రచనలను కూడా చేస్తున్నారు. ఆయనకి నా అభినందనలు.” అంటూ సోషలిజంపై ఆవేశపడిపోయారనుకుంటాను. సిద్ధాంతంతో విభేదించడం తప్పు కాదు లెండి.

  మనసు ఫౌండేషన్ వారు కారామాస్టారు గారి రచనలన్నింటినీ ఒకే పుస్తకంగా 2006లో తీసుకువచ్చారనుకుంటాను. అదే ప్రస్తుతం కినిగె లో లభ్యమవుతోంది.

  మెచ్చుకోండి

  1. రాజు గారు,
   ఆయన సామాజిక ప్రయోజనాన్ని వీడారని నేనూ అనుకోను. కానీ, దానిని దాటి ఒకడుగు ఇంకా ముందుకు వెళ్ళారని అనిపిస్తుంది. అంటే ఆయన దృక్కోణం సిధ్ధాంతం కంటే కూడా పెద్దదీ మరియూ సిధ్ధాంతాన్ని ఒక సబ్సెట్ గా తనలో ఇముడ్చుకొన్నదీ అనిపిస్తుంది. నా దగ్గర మాస్టారి కథల సమగ్ర సంకలనం ఉంది. దానిలో కొన్ని వ్యాసాలను బట్టి ఆ విధమైన అభిప్రాయం నాకు ఏర్పడింది.
   1. సాహిత్యం యొక్క ప్రయోజనం గురించి మీరిచ్చిన మొదటి లింకులోనే మాస్టారు సందేహం వ్యక్తం చేశారు. (5వ పేజీ లోని మొదటి పేరా చూడండి)
   2.మాస్టారు సామాజిక ప్రయోజనం నుంచీ, ఒకడుగు ముందుకు వేసి పరిస్థితులను బట్టి సొల్యూషన్ ఉండాలని కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
   3. రావిశాస్త్రీయం లో శాస్త్రి గారు ఒక సభలో ప్రసంగిస్తూ, ఇక్కదున్న వారి లో ఒక్కరైనా చమటోడ్చి కష్టపడే వారున్నారా? అని ప్రశ్నించారు. అది శ్రమ గురించిన ఒక సంకుచిత మైన డెఫినిషన్. కానీ కారా గారు, మేధోపరమైన శ్రమ కూడా శ్రమేనని గుర్తించారు.
   4. కే.వి.రె ఇంటర్వ్యూలోనే తానను కమ్యూనిస్ట్ కాదని చెప్పుకొన్నారు.
   5. తన కధా నిలయం లో సిధ్ధాంత రాధ్ధాంతాల తో పని లెకుండా అన్ని రచనలకూ చోటు కల్పించారు.
   ఆయన గురించి నాది అభిప్రాయమే. సిధ్ధాంతం కాదు. కాబట్టీ దానిని ప్రూవ్ చేయలేను.

   మెచ్చుకోండి

 6. శ్రీరామ్ గారూ,
  “…రాజు గారి తెలుగు రచన ఫ్లో చాలా బాగుంట్టుంది, ఆయనకు నచ్చే వామపక్ష భావజాలం నాకు నచ్చకపోయినా ఆయన మంచి రచయిత . మీటపాకు ఆయన వ్యాఖ్య అదనపు ఆకర్షణ.”

  ఒక సామాన్య అర్భకుడిని ఆకాశమంత ఎత్తులో ఉంచినట్లున్నారు. మీ ప్రశంసతో గాల్లో తేలిపోతానేమో అని భయమేస్తోంది మరి. కృతజ్ఞతలు. కానీ…

  ‘ఆయనకు నచ్చే వామపక్ష భావజాలం నాకు నచ్చలేకపోయినా’
  నచ్చకపోతే ఏమీ కొంపలంటుకుపోవండి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే మరింత స్నేహపూర్వకంగా చర్చ సాగాలంటాను నేను. అయాన్ రాండమ్మ అని నేను కూడా పదప్రయోగం చేశాను కాని తను ఏం చెబుతున్నారో వినడానికి మీకంటే ముందుంటాను నేను. ఆ భావజాలాన్ని నేను ఏకీభవించినా, ఏకీభవించకపోయినా.

  “తనకు నచ్చినదానిని నెత్తినేక్కించుకొని, దానిని సమర్ధించుకొంట్టూ, ఆవేశంతో , ఎమోషనల్ గా పుస్తకాలు రాసుకొంట్టు పోతూంటుంది.”
  ఎవరైనా చేసేది ఇదే కదండీ. మీకు నచ్చనిదాన్ని మీరు నెత్తినెక్కించుకుంటారా..? నిజం చెప్పండి మాస్టారూ… నచ్చకపోతే సమర్థించుకోవడం ఎలా?

  ఆమె పట్ల ఈ పదప్రయోగాన్ని చాలా సందర్భాల్లో ప్రయోగించినట్లున్నారు మీరు. “మారు పేరుపెట్టటం వలన మీ విమర్శ లోని సీరియస్నెస్ తగ్గిపోయిందికదా!?” అని బొందలపాటి గారు కూడా అభిప్రాయపడ్డారు కనుక దీనిపై మీరూ ఆలోచించండి. అయాన్ రాండమ్మ అనే నేను చేసిన పదప్రయోగానికి కూడా ఇది వర్తిస్తుందనుకోండి.

  పారిశ్రామిక ప్రపంచంలో తోటి పౌరుల శ్రేయస్సుపట్ల అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించే ప్రజలుగా అమెరికన్లు మారిపోవడానికి, దోహదం చేసిన అయాన్ రాండ్ తాత్వికత గురించి కింది లింకులో ఒక కథనం ఉంది. మీ పరిశీలన కోసం దీన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఈ కథనంలో చివరి పేరాను మీరు తప్పక వ్యాఖ్యానించాలి.

  కుక్షింభర తత్వం
  – బ్రూస్ ఇ.లెవినె
  https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

  మెచ్చుకోండి

 7. మిగతా విషయాలు చర్చలూ అలా ఉంచండి, మీరు ముందు కారామాస్టారి రచనలు చదివి దాన్ని గురించి చక్కగా విపులంగా మీ అభిప్రాయం రాయడమే నాకు చాలా సంతోషాన్నిస్తోంది. నాకు తెలిసిన రెండు మూడు విషయాలు. మాస్టారు వృత్తి రీత్యా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు. పర్ధానోపాధ్యాయులుగా రిటైరయ్యారు అనుకుంటాను. ప్రాథమిక బడులలో మాస్టార్లు సబ్జక్టుకి విడిగా ఉండరు. అందరూ అన్ని సబ్జక్టులూ బోధిస్తుంటారు. మాస్టారికి బహుశ లెక్కలంటే అభిమానం ఉండి ఉండొచ్చు. ఆ క్లుప్తత, మాట పొందిక ఆయనతో సంభాషించినప్పుడు కూడా కనిపిస్తుంది. రచనలో ఇంకా క్లుప్తత పాటించారు. నేను సుమారుగా వారి పిల్లల తరం వాణ్ణి. ఇందిరాగాంధీ రాజ్యమేలుతున్న రోజుల్లో బళ్ళో చదువుకున్నాను. అప్పట్లో బడిపుస్తకాల్లోనూ, వార్తా పత్రికల్లోనూ, జనాభిప్రాయంలోనూ నెహ్రూగారి విధానాల పట్ల గౌరవం బాగా ఉండేది. ఆ విధానాలే భావి భారతానికి బలమైన పునాది అనే భావన ప్రబలంగా ఉండేది. కానీ ఆ విధానాలు సమాజంలోని బడుగు వర్గాలని ఎట్లా ఒక క్రమపద్ధతిలో అణగదొక్కుతూ వచ్చాయో కారామాస్టారి కథలు చదివాకే నాకు తొలిసారిగా అర్ధమయింది. రావిశాస్త్రి, బీనాదేవిల రచనల్లో ఆధిపత్య వర్గం, ప్రభుత్వం చెయ్యగల, చేస్తున్న అరాచకాల గురించి బాగా రాశారుగాని, పైన చెప్పిన క్రమపద్ధతి అణచివేత చిత్రణ వారి రచనల్లో కనబడదు. ఆవేశం, ఉద్రేకం ఎక్కువగా ఉంటాయి. మాస్టారి కథలనించి మనం గ్రహించదగిన మరో విషయం ఆ స్థల కాల పరిస్థితుల్లోని జీవన చిత్రణ. కథలో చెప్పే ఆర్ధిక రాజకీయ సందేసాన్ని మనం ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా, ఈ సజీవ జీవన చిత్రణ వారి కథల్లో అద్భుతంగా ఉంటుందని ఒప్పుకోవాలి.
  ఇతర వ్యాఖ్యాతల నించి కూడ కొన్ని మంచి విషయాలు తెలిశాయి. నెనర్లు. మీరు చదివే ఇతర రచనలని గురించి కూడా రాస్తారని ఆశిస్తున్నా.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s