వ్యక్తిత్వం (personality), శీలం (character), దార్శనికత్వం(visionary) గట్రా..!

ఈ రోజు టీవీ ఛానల్స్ ను తిప్పుతూ కూర్చొంటే, ఓ ఛానల్ లో personality development కోర్స్ గురించిన ప్రకటన వస్తోంది. “వార్నీ! వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, కానీ, దానిని అభివృధ్ధి కూడా చేసుకోవచ్చునన్న మాట. అదీ… , ఏదో కోర్స్ లో చేరి”, అనుకొంటూ ఉండగా, అదే చానల్ లో అబ్రహాం లింకన్, గాంధీజీ వంటి వారి గుణగణా లను మనం ఎలా పొందవచ్చు అనే విషయం మీద ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రాం మొదలైంది.
నాకు, “గాంధీ గారికీ, లింకన్ గారికీ, వీరి కోర్స్ కి వెళ్ళకుండానే ఆయా లక్షణాలు వచ్చాయి కదా!”, అనే ఆలోచన వచ్చింది.
“ఈ కోర్స్ ల లో ఉపయోగకరమైన మాటలు చెప్తారు. వాటిని ఆచరించాలా లేదా అనేది వ్యక్తి యొక్క ఇష్టం.ఏదేమైనా గుర్రాన్ని నీళ్ళ వద్దకు గైకొని(?) పోగలం, దీనికి నీటిని త్రాపలేము. నీటి వద్దకు తీసికొని పోవటం పెద్ద విద్య కాదు. దానికి త్రాపటమే కష్టమైన విద్య. (మార్క్స్ గారి ప్రకారం, ఉన్నటువంటి సమాజ వ్యవస్థ ఎలా ఉంది అని తెలుకోగలగటం పెద్ద విద్యకాదు. దానిని మార్చటమే అసలు విషయం. . కానీ ఈ రెండో విషయం లోనే విఫలమైంది ఆయన సిధ్ధాంతం ). ఆ బాధ్యతను ఈ కోర్స్ లు తీసుకోలేవు కదా!”, అనుకొని చానల్ మార్చాను.
ఈ చానల్ లో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్, తన తదుపరి తెలుగు చిత్ర రాజమునందు తాను పోషించబోవు “కారెక్టర్” గురించి విశదీకరించుచున్నాడు.
“సినిమాలలో హీరో, హీరోయిన్ ల పక్కన ఉండే పాత్రలనే కారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎందుకంటారో! హీరో, హీరోయిన్ ల కు కారెక్టర్ ఉండదా?! దాని అవసరం నేటి హీరో, హీరోయిన్ ల కు లేదా?” ఈ రీతిన పరిపరి విధముల నా తలంపులు (తల వంపులు కాదని మనవి!) పోవుచుండ నా మది లో ఓ ప్రశ్న తటిల్లత వోలె మెరిసినది.
“అసలు వ్యక్తిత్వమునకూ, శీలమునకూ వ్యత్యాసం ఏమి? నీటి వద్దకు తీసుకొనిపోబడిన అశ్వమునకు శీలము ఉండిన చో దానికి నీటిని త్రాగించుటకు కష్టపడవలసిన అవసరము ఉన్నదా?”

వేరొక చానల్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా బోసు బాబు నాయకత్వ లక్షణాల గురించి చూపిస్తున్నాడు. అటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు లేరు? నాయకులు కూడా కొన్ని పరిస్థితులలో,అవసరాన్ని బట్టి కొన్ని కాలాల లోనే తయారౌతారా?  ఏ కాలానికి తగ్గ నాయకుడు ఆ కాలానుగుణం గా వస్తారా? అన్ని కాలాలకూ వర్తించే సర్వకాలీన నాయకుడు అంటూ ఉండదా?
*************
వ్యక్తిత్వము అను మాట వ్యక్తి నుంచీ వచ్చింది. వ్యక్తం అయిన వాడు వ్యక్తి. అంటే బయటికి వ్యక్త పరచబడని ఆలోచనలు, ఆవేశాలు వ్యక్తిత్వం లో భాగం కావు.personality అనే ఇంగ్లీషు ముక్క కు మూలం కూడా mask అని అర్ధం వచ్చే లాటిన్ ముక్కలో ఉంది.

సాధారణం గా మనం వ్యక్తిత్వాన్ని, కారెక్టర్నీ మనం పాజిటివ్ సెన్స్ లోనే వాడుతాం. మనమొక మనిషికి వ్యక్తిత్వం ఉంది అంటే, అతనికి మంచి వ్యక్తిత్వం ఉంది అనేఅర్ధం లో ఉపయోగిస్తాం. అలానే, కారెక్టర్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాం.

ఒక మనిషి మాటా, అతని పాండిత్యమూ, హాస్య చతురతా,అందం, ఒడ్డూ పొడుగూ మున్నగునవన్నీ అతని వ్యక్తిత్వం లో ని భాగాలు. అలానే పదుగురికీ తెలిసేటట్లు అతను చేసే మంచి పనులూ, చెడ్డపనులూ, దానాలూ, మోసాలూ ఇవికూడా అతని వ్యక్తిత్వం లోని అంశాలే. వ్యక్తిత్వం లోనే సకారాత్మక వ్యక్తిత్వమూ, నకారాత్మక వ్యక్తిత్వమూ ఉంటాయి. ఏ మనిషి వ్యక్తిత్వం లోనూ అన్నీ మంచి విషయాలే ఉండవనేది తెలిన విషయమే. (ఏది మంచి? ఏది కాదు? అనే దానిని తేల్చటం ఓ బ్రహ్మ విద్య అనుకోండి!).
వ్యక్తిత్వం అనేది చాలా వరకూ, “మనుషుల మధ్య అస్థిత్వం లోకి వచ్చే”, విషయం (interpersonal issue). మనకు పక్క వాడి తో పరిచయం లేనపుడు, వాడి వ్యక్తిత్వం ఏదైతే మనకెందుకు? అయితే, దీనికి సెలబ్రిటీ ల వ్యక్తిత్వం ఒక మినహాయింపు. అది one way traffic లాంటిది. వాళ్ళ ని మన జీవితం లో కలిసే అవకాశం లేక పోయినా, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనకి ఆసక్తి ఉంటుంది.

బయటికి కనపడని మనుషుల చెడు ఆలోచనలూ, వారు చాటు మాటు గా చేసే చెడు పనులూ, లేక మంచి పనులూ వారి వ్యక్తిత్వం లో భాగమవ్వాలంటే, అవి బయట పడి నలుగురికీ తెలవాలి. వ్యక్తిత్వం అనే సులువైన విషయాన్ని, మన self అనే విషయం చాలా సంక్లిష్టం చేస్తుంది.
మనం నలుగురికీ మన గురించిన మంచి మాత్రమే తెలియాలనుకొంటాం. దానితో తగిన ఇమేజ్ చూపించటానికి ప్రయత్నిస్తాం. మన గురించిన చెడుని దాచుకొని, మంచి నలుగురుకీ తెలిసే లా ప్రవర్తిస్తాం. ఇది పరిణామ శాస్త్రం ప్రకారం మన వ్యక్తిగత మనుగడ కి అవసరం కూడా.ఎందుకంటే, చెడ్డ పేరు ఉన్నవారిని సమాజం కష్టపెడుతుంది కనుక.
ఒక్కోసారి మనం లోకానికి, మన గురించిన చెడు ని కూడా తెలియ చేస్తాం. మనం మంచి అనుకొన్న విషయాన్ని లోకం చెడు అనుకొన్నపుడు ఇది జరుగుతుంది.  ఒక్కోసారి మనం కప్పెట్టిన చెడు ని లోకం కనిపెట్టి బయటకు లాగుతుంది.
మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి ముఖ్య కారణాలన్నీ లౌకిక మైనవి (డబ్బూ, అధికారమూ, పేరూ వగైరాలు).
ఇక శీలం (character) అనేది  స్వభావ సిధ్ధమైన గుణాన్ని తెలియ చేస్తుంది. మనిషి “ముసుగు వేసుకోని” స్వరూపమే అతని శీలం.(ఒక మనిషి తన మనసు లోపల రహస్యం గా చేసే ఆలోచనలు కూడా అతని కారెక్టర్ లో భాగమే. ఈ రహస్య ఆలోచనలు ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. కానీ ఆ మనిషి దీర్ఘకాలిక బాహ్య ప్రవర్తన ద్వారా అతని ఆలోచనలను కొంత వరకూ అంచనా వేయగలం.   ఆలోచనలు కూడా మనిషి శీలం లో భాగం కాబట్టీ, మనిషి కారెక్టర్ పూర్తి గా ఇతరులకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. ఎందుకంటే, మనిషి తన ఆప్త మితౄలకు కూడా చెప్పుకోలేని కొన్ని రహస్య అలోచనలను కలిగి ఉండగలడు.రహస్యమైన పనులు చేయగలడు. ఆ ఆలోచనలను బహిర్గతం చేయటానికి అతని అంతరాత్మా, విలువలూ అంగీకరించకపోవచ్చు.మనిషి అచేతన(unconscious) లో అతనికే తెలియని భావాలుండవచ్చు.  ఇంకా, మానసిక వ్యాధి గ్రస్తుల ప్రవర్తనా, ఆలోచనలూ ఒక మిస్టరీనే! )

శీలం బయటి వత్తిడులని తట్టుకొనే resilience ని కూడా కలిగి ఉంటుంది.కారెక్టర్ ఉన్నవ్యక్తి తాను నమ్మిన విలువలను ఎన్ని కష్టాలకైనా ఓర్చి నెగ్గించుకొంటాడు. అలా అని మొండి పంతం పట్టే వారంతా కారెక్టర్ ఉన్న వారు కాదు. వ్యక్తిగతగా తన మాటే నెగ్గాలనుకొనే వారు మంకు మనుషులు మాత్రమే!    నీతీ , నిజాయితీ ధైర్యం లాంటివి ఒక మనిషి లో ఉంటే ఉంటాయి. లేక పోతే లేదు. వీటిని core characteristics అనుకొందాం.  వీటిని పెంపొందించుకోవటం చాల కష్టం. ఈ కాలం లో ఏ మనిషీ వీటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించటం కుదరదు. ఎందుకంటే మన సమాజం లో వీటి వలన ఒరిగేది ఏమీ లేదు. ఒక్కోసారి మనిషి ఈ లక్షణాలని నటించటం ద్వారా లబ్ధి పొందటానికి ప్రయత్నించ వచ్చు. నటించినంత మాత్రాన ఆ లక్షణాన్ని కలిగిఉన్నట్లు కాదు.

కారెక్టర్ లో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక మాఫియా డాన్ చెడు కారెక్టర్ ని కలిగి ఉంటే, ఒక స్టేట్స్-మాన్ మంచి కారెక్టర్ ని కలిగి ఉంటాడు.
వ్యక్తిత్వ వికాసం కోర్స్ లు ఏతా వాతా చెప్పేదేమంటే, మనం వ్యక్త పరిచే బాహ్య (superficial) ప్రవర్తనను సాధ్యమైనంత లాభదాయకం గా మార్చుకొమ్మని. ఇది చాల వరకూ కుదిరే విషయమే! ఒక ప్రవర్తననను చాలా కాలం వ్యక్తపరచగ , వ్యక్త పరచగా, కొంత కాలానికి అది మన నిజ స్వభావం లో ఒక భాగమైపోతుంది(internalization). నాకు “థాంక్స్” అని చెప్పటం కొత్తలో చాలా ఇబ్బంది గా ఉండేది. కానీ ఓ నాలుగైదేళ్ళ కు అలవాటైపోయి, థాంక్స్ చెప్పకుండా ఉంటే ఇబ్బంది గా అనిపిస్తోంది.
వ్యక్తిత్వ కోర్స్ ల తో ఇబ్బందేమిటంటే, ఇవి సమాజానికి మొత్తం గా ఉపయోగ పడే compassion వంటి లక్షణాలని internalize చేసుకోమని చెప్పవు. వ్యక్తి కి ఉపయోగ పడే  “చొరవ” వాటి లక్షణాల గిరించి మాత్రమే చెబుతాయి.ఒక ఇంటర్వ్యూ కి ఎవరూ వ్యక్తిత్వ కోర్స్ తీసుకోకుండా హాజరయారనుకొందాం. అప్పుడు ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X అనుకొందాం. కొన్నాళ్ళకు ఆ ఇంటర్వ్యూ కి అందరూ ఆ పర్సనాలిటీ కోర్స్ చదివి, తరువాత అటెండ్ అయారనుకొందాం. అప్పుడు కూడ ఒక అభ్యర్ధికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం X గానే ఉంటుంది. అంటె ఇలాంటి కోర్స్ ల వలన వచ్చే మొత్తం ప్రయోజనం సున్నా! కోర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాడి జేబు లోనికి మాత్రం పైసలు వచ్చాయి. వాడికి ఉపాధి దొరికింది. ఉద్యోగాల సంఖ్య పెరగనంత వరకూ ఇలాంటి కోర్స్ ల వలన వ్యవస్థ స్థాయి లో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంచే కోర్స్ లు ఈ లాజిక్ కి మినహాయింపు. వాటి వలన కనీసం నైపుణ్యం పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది.

ఒక మనిషికి గొప్ప కారెక్టర్ ఉండి, సరైన వ్యక్తిత్వం ఉండక పోవచ్చు. మన పల్లెల లోని రైతులు చాలా మంది ఈ కోవకే వస్తారు. (ఈ విషయం లో నాకు చార్లెస్ డికెన్స్ great expectations నవల లోని పిప్ పాత్ర గుర్తుకు వస్తుంది.) వీరు సరిగా మాట్లాడటం నేర్చుకొంటే వీరు మంచి వ్యక్తిత్వం కలవారౌతారు .
మరి కొంత మందికి గొప్ప వ్యక్తిత్వం ఉండి, మంచి శీలం లేక పోవచ్చు. బిల్ క్లింటన్లూ, రిసెషన్లను కొని తెచ్చిన హెడ్జ్ ఫండ్ మానేజర్లూ ఈ కోవ కి చెందిన వారే! గొప్ప నెగటివ్ కారెక్టర్ అంటే గాడ్-ఫాదర్ పాత్ర గుర్తుకు వస్తుంది.గొప్ప నెగటివ్ వ్యక్తిత్వం అంటే , ప్రతి విషయానికీ బూతులు తిట్టే ఆటగాళ్ళు (భజ్జీ లాంటి వారు, మెకన్రో లాంటి వారు) గుర్తుకు వస్తారు.  జార్జ్ బుష్ కి మంచి కారెక్టర్ ఉంది కానీ, వ్యక్తిత్వం లేదని నా అనుమానం.
గొప్ప వ్యక్తిత్వమూ శీలమూ ఉన్న వారు చాలా అరుదు. నాకు ఈ విషయం లో ఛత్రపతి  శివాజీ గుర్తుకొస్తాడు. “గడ్ ఆలా, పరూ సిమ్హ్ గేలా!”, అన్న ఆయన వ్యక్తీ కరణా, యుధ్ధాలలో చిక్కిన ముస్లిం స్త్రీలను ఆయన గౌరవించిన విధానం ఆయన వ్యక్తిత్వాని కి సూచికలైతే, ఔరంగజేబుని ఎదిరించి నిలుపుకొన్న సార్వ భౌమత్వం ఆయన సమరశీలతకు ఒక తార్కాణం.

నెగటివ్ కారక్టరూ, నెగటివ్ పెర్సనాలిటీ రెండూ కలిగి ఉన్న వ్యక్తికి ఒక ఉదాహరణ  హిట్లర్ అని అనిపిస్తుంది . దీనికి వివరణ అవసరమా!
వ్యక్తిత్వమూ శీలమూ లేని faceless people  సమాజం నిండా ఉంటారు కదా?వారి ప్రవర్తనా ఇష్టాఇష్టాలూ పరిస్థితుల ప్రకారం, స్వప్రయోజనం ప్రకారం మారిపోతూ ఉంటాయి.చదువుకొన్న, అభివృధ్ధి చెందిన మానవ సమూహాలలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. అలానే, కష్టాలు పడుతున్న, వెనుకబడిన సమూహాలలో కారెక్టర్ ఉన్న మనుషులు ఎక్కువ గా ఉండవచ్చు.వెనుకబడిన సమూహాలలో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు వారి స్థాయికి మించిన జనాదరణ లభిస్తుంది, మన ఒలింపిక్ మెడల్ విజేతలకు లభించినట్లు గా.   అమెరికా వంటి దేశాలలో ఒలింపిక్ విన్నర్స్ కి లభించే గుర్తింపు కంటే, మన దేశం లో మన విన్నర్స్ కి లభించే ఆదరణ చాలా రెట్లు ఎక్కువ కదా? ఏ చెట్టూ లేని చోట ఆముదం చెత్టే మహా వృక్షం. అలానే వెనుకబడిన వర్గాలలోని వ్యక్తిత్వమున్న నాయకులూ, కరిష్మా ఉన్న నాయకులూ ఆయా వర్గాల అస్థిత్వం (identity) లో ఒక భాగమైపోయి, ఆయా వర్గాలలో ఎక్కువ జనాదరణని పొందుతారు.ఇదే సూత్రం ప్రకారం, అభివృధ్ధి చెందిన వర్గాలలోని కారెక్టర్ ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ ఆదరణ ని పొందాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే, కారెక్టర్ అనేది నలుగురికీ సులువు గా తెలిసే వ్యక్తమైన విషయం కాదు కాబట్టీ.

నాయకునికి గొప్ప శీలమూ, వ్యక్తిత్వమూ తప్పని సరి. ఇంకా నాయకుడనే వాడు గొప్ప దార్శనికుడై ఉండాలి. అతనికి ఆవేశమూ ఆలోచనా సమపాళ్ళ లో ఉండటమే కాకుండా, తన ఆలోచనలనూ, కలలనూ “నిజం” గా మలచుకొనే క్రియాశీలత ఉండాలి(ఈ లెక్క ప్రకారం thought leadership అనేది ఒక పెద్ద మిధ్య). సమాజపు విలువల కన్నా ఒక మెట్టు పైన ఉన్న విలువలను ప్రతిపాదించి కూడ వాటిని నిజం గా మలచగల సమర్ధత ఉండాలి. (conceptual గా ఈ విలువల స్థాయి కి ఒక అంతం అంటూ ఉందదు. ఒక విలువ కన్నా పైస్థాయి లో వేరొక విలువ ఉంటుంది. ఏ స్థాయి విలువ సమాజానికి సరిపోతుందనేదీ, అవసరమనేదీ, ఆచరణీయమనేదీ నాయకుడు నిర్ణయించుకోవాలి. అలానే కింది స్థాయి విలువల పై “చలం” గారి లా చిన్న చూపు తగదు. కింది స్థాయి విలువలు ఏర్పడిన పరిస్థితులనూ, అనివార్యతను సానుభూతి తో అర్ధం చేసుకోవాలి. నాయకుడు, తన విలువలను, ఒంటరి ఉలిపి కట్టె లా తాను మాత్రం పాటిస్తే చాలదు. తాను మాత్రమే పాటిస్తే అతనికి గొప్ప కారెక్టర్ ఉండవచ్చు. కానీ ఆ విలువలను సమాజం లో చెలామణి లోనికి తే గలిగినపుడే అతను అసలైన నాయకుడవుతాడు.)
ఈ రోజుల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఎక్కడన్నా ఒకరు తగులుతారు (నాకు గుర్తుకు వచ్చే వారు జైపాల్ రెడ్డి, జై రాం రమేష్ , సుబ్రమణ్య స్వామి ). గొప్ప శీలం ఉన్న నాయకులు చాలా  తక్కువ (అన్నా హజారే గుర్తుకు వస్తున్నాడు.ఇది నా నమ్మకం మాత్రమే! ఒక మనిషి కారెక్టర్ దీర్ఘకాలం లోనే బయటపడుతుంది). నాయకత్వానికి కావలసిన క్రియాశీలత చాలామంది లో ఉంటుంది. ముఖ్యం గా కార్పొరేట్ నాయకులలో ఇది మెండు. కానీ, కారెక్టర్ విషయం లో సందేహాలుంటున్నాయి. cultivated personality చాలా మందికి ఉంటుంది. కానీ అసలైన వ్యక్తిత్వం ఉండేది ఎందరికి?
“శీలం అనేది కష్టాల వలన పెంపొందుతుంద”నేది ఒక బలమైన నమ్మకం. resilience అనేది శీలానికి ఉండే ఒక ముఖ్య లక్షణం.వ్యక్తిత్వాన్ని ఒక కుండ తో పోల్చవచ్చు. కోర్స్ ల ద్వారా నేర్చుకొనే వ్యక్తిత్వం ఏ కుండ లో పోస్తే ఆ కుండ ఆకారం తీసుకొనే నీటి లాంటిదైతే, అ కుండ కు ఇనుముతో చేసినట్లు గట్టితనాన్ని ప్రసాదించేదే మంచి కారెక్టర్. కానీ ఈ ఆధునిక సమాజం లో జనాలు మరీ కష్టాలు పడే రోజులు పోయాయి. నాయకులు జనాల లోంచే వస్తారు. జనాలు తిరుగుబాట్లు చేయకుండా ఉండటానికి , లేక ఓట్ల కోసం, ప్రజాస్వామ్య నాయకులు జనాలకు కావలసిన కనీసావసరాలను కొంతైనా కల్పిస్తున్నారు. దీని వలన కావచ్చు, గొప్ప కష్టాలలోంచీ వచ్చే, సమ్మెట దెబ్బలు పడిన ఇనుము లాంటి కారెక్టర్ ఉన్న నాయకులు రావటం లేదు.

మన వ్యవస్థలకు ఎటువంటి నాయకులు అవసరం?రాజకీయాలలో ఓట్లు పట్టే వాడే నిజమైన నాయకుడు. వచ్చే ఎన్నికలను గెలవ లేని వాడికి ఎంత గొప్ప కారెక్టర్ ఉన్నా ఏమి లాభం? కార్పొరేట్ వ్యవస్థ లో మదుపరుల డబ్బుని పెంచే నాయకుడు కావాలి.అది ఏ మార్గం ద్వారా పెరిగిందనేది అనవసరం. కొత్త కొత్త సృజనాత్మక ఉత్పత్తులు తయారు చేసే, రిస్క్ చేసే నాయకుడు మనకు అవసరం లేదు. మనకు తెలిసిన, అలవాటైన సేవల ద్వారా నాలుగు రాళ్ళూ సంపాదించగలిగితే చాలు. దీనికి ఒక కారెక్టర్ ఉన్న నాయకుడు అవసరం లేదు. స్వంత నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడే వాడు ఈ వ్యవస్థ లో చాలా ప్రమాద కరం. ఒక cultivated personality ఉన్న నాయకుడు చాలు. భారతీయ కార్పొరేట్ వ్యవస్థ లో, బాస్ నిర్ణయమే చివరికి శిరోధార్యం.flexibility ఉన్న వాళ్ళు కావాలి. అంటే కారెక్టర్ అనవసరం. ఐ టీ సేవల రంగం లో అయితే, ఈ రోజు జావా నేర్చుకొమ్మంటే నేర్చుకోవాలి, రేపు సీ నేర్చుకొమ్మంటే నేర్షుకోవాలి అంటే సర్దుకుపోయే తత్వం ప్రధానం. సర్దుకుపోయే తత్వం వ్యక్తిగత మనుగడ కి ఉపయోగమేమో కానీ, అది ఒక నాయకత్వ లక్షణం కాదు. నాయకుడు బలమైన సంకల్పం కలవాడై, తాను అనుకొన్నదానికోసం మనసు మారకుండా నిలబడే దృఢ చిత్తుడై ఉండాలి. కానీ ఇలాంటి  గుణాలు ఏ రంగం లోనూ ప్రోత్సహించబడటం లేదు.  ఇటువంటి వాతావరణం లో నాయకుడి అవసరం ఎందుకు ఉంటుంది?  సినిమాలలో జనం తమని identify చేసుకొన గలిగిన కారెక్టర్ ఉన్నవాడే హీరో. వాడికి సున్నితమైన లక్షణాలు ఎలా అబ్బుతాయి? మన సమాజానికి నాయకుల అవసరం ఉన్నట్లు కనపడదు. స్వతంత్రం రావటం తోనే ఆ అవసరం తీరిపోయిందేమో!