నాకు తెలిసిన ఒక దొం.క. (దొంగ కమ్యూనిస్టు) కథ

మొన్నామధ్య య.రమణ గారి బ్లాగు లో దొంగ కమ్యూనిస్టుల గురించి కొంత చర్చ నడిచింది. నాకు నిజ జీవితం లో చాలా మంది ఇటువంటి దొంగ కమ్యూనిస్టులు తారసపడ్డారు. అలాంటి  ప్రొఫైల్ ఒకటి ఇక్కడ. ఇది ప్రత్యేకం గా ఎవరో ఒకరి గురించి మాత్రం కాదు.అంటే, ఈ టపా కేక. (కేవలం కల్పితం).
****************
కా|| శేషగిరి రావు గారు మధ్య కోస్తా లోని ఒక చిన్న రైతు కుటుంబం లో జన్మించారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం లో కమ్యూనిస్టు ఉద్యమం బలం గా ఉండేది. ఆ జిల్లాలో కమ్యూనిస్టులు అందరూ కా|| కోటయ్య గారి అనుచరులే. కాశే గారి నాన్న “కోటయ్య గారి నాన్న గారి కి” అనుచరుడు.అందు వలన కాశే కూడా కాకో గారి నాయకత్వం లో పార్టీ లో చేరి పని చేయటం మొదలు పెట్టాడు.  కాశే నాన్న ఒక బక్క రైతు. ఆయన అరెకరం వాడు.
కాశే అనతి కాలం లోనే తాలూకా స్థాయి నాయకుడయ్యాడు. ముఖ్యం గా దళితుల్లో ఆయన పలుకుబడి ఎక్కువ. కాకపోతే ఆయన ఇంటికి వచ్చిన దళితులు మాత్రం వరండాలో కింద కూర్చోవాల్సి వచ్చేది. దళితులకి వేరే ఇత్తడి చెంబు లో మంచి నీరు ఎత్తి పోసి వారికి మర్యాద చేసే వాడు. ఆ రోజుల్లో స్టీలు గ్లాసులను ఇంట్లోని వారికి మాత్రమే ఉపయోగించేవారు.
కాశే అక్కడి ఒక జమీందారుకి వ్యతిరేకం గా పోరాడి తదుపరి భూ సంస్కరణలలో తాను కూడా కొంత భూమి సంపాదించగలిగాడు. పార్టీ లో తనకున్న పలుకుబడి అందుకు ఉపకరించిందనుకోండి!
కొంత కాలానికి తెలంగాణ సాయుధపోరాటం ఊపందుకుంది.  పార్టీ అతనిని నైజాముకు పంపింది. అయితే కాశే కార్య రంగం తెలంగాణ పల్లెల లో లేదు. ఆయన అనతి కాలం లోనే హైదరాబాదు కు మారాడు.
కాశే అక్కడి రోజుకూలి కార్మికులకి చేబదుళ్ళిచ్చి సహాయ పడేవాడు. కాశే మంచి మాటకారీ, ఉత్సాహవంతుడు. పార్టీ లో క్షేత్ర స్థాయి లో జనాలను సమీకరించటం లో ఆయనకున్న ప్రతిభ గొప్పది.  పార్టీ లో ఆయనకున్న అనుభవం ఆయనకు తరువాత చాలా ఉపయోగ పడింది.
త్వరలోనే ఒక ఫైనాన్స్ కంపెనీ మొదలుపట్టిన కాశే, సమాంతరం గా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ని కూడా ప్రారంభించాడు. అ సంస్థ ని విస్తరించటం లో అతని పార్టీ అనుభవం ఎంతైనా ఉపయోగ పడింది.
తన వ్యాపారాల్తో సమయం చిక్కక కాశే పార్టీ కి దూరమయ్యాడు. అంతే గానీ పార్టీ మీది వ్యతిరేకత తో కాదు.
కాశే వ్యక్తిగతం గా చాలా సరదా మనిషి. ఆయనకు అక్కినేని నాగేశ్వర రావంటే మక్కువ ఎక్కువ. తెలిసిన మిత్రులు ఎవరన్నా, “బాగానే సంపాదించినట్లున్నావే?!”, అంటే.
సంపాదించకపోతే ఎలా?, అక్కినేని నాగేశ్వరరావంతటి వాడు ఓ ఇంటర్వ్యూలో, “డబ్బులేక పోతే నీ మొహం ఎవడు చూస్తాడు?”, అన్నాడు..అని చెప్తాడు.
కాశే కి రష్యా అంటే చాలా ఇష్టం (సినీ హీరో ల అభిమానులకి వారి హీరో అంటే ఇష్టమున్నట్లు). అమెరికా కుట్ర వలననే అక్కడి కమ్యూ నిజం పడిపోయిందని కాశే నమ్ముతాడు. ఇప్పటికీ  కాశే విశాలాంధ్ర, ప్రజాశక్తి పేపర్లని క్రమం తప్పకుండా వేయించుకొంటాదు. ఆ పేపర్లకి ఆయన, తన “ఓం సాయి రియల్ ఎస్టేట్”, ప్రకటనలు కూడా ఇస్తాడు. ప్రైవేట్ గా, “ఆ..ఏదో, పార్టీ అంటే అభిమానం కొద్దీ ఈ ప్రకటనలను ఇస్తాను, కానీ ఈ పేపర్లను ఎవరు చదువుతున్నారు?”, అంటాడు.
కాశే కి వయసు పైబడింది. ఆధ్యాత్మికత ఎక్కువయింది. ఆయన దృష్టి లో లెనిన్ స్టాలిన్ లు దేవుళ్ళే.వారిని పూజించటం వ్యక్తి పూజ కాదు. ఈ మధ్య కొత్త దేవుళ్ళు కూడా ఆయన లిస్టులో చేరారు. వారి లో బెంగళూరు బాబా కూడా ఒకరు. బెంగళూరంటే గుర్తుకొచ్చింది, మొన్నో రోజు ఆయన, చిన్నకొడుకుకి కర్నాటక లో ఓ మూడొందల ఎకరాలూ రెండో మనవడికి ఒరిస్సా లో ఓ రెండొందల ఎకరాలూ,  రాసిచ్చాడు.

కాశే దగ్గర ఒకరిద్దరు రచయితలు కూడా తచ్చాడుతున్నారు. ఒక రచయిత ఆయన షష్టి పూర్తికి మంచి స్థుతినే రాసి పెట్టాడు:

వామ పక్షమున పుట్టిన భావ విప్లవ వాది
లక్ష్మీ పుత్రుడైన భూమి పుత్రుండు
పేదవారి పట్ల పెద్ద చేయి
అపర కుబేరుడే ఈ శేష గిరి.

ఈ కవిత ని ఫ్రేము కట్టించి వరండా లో పెట్టించాడు కాశే. తన ఇంటికి వచ్చిన పాత మిత్రులకు ఆ ఫ్రేం ని గర్వం గా చూపిస్తూ ఉంటాడు.

27 thoughts on “నాకు తెలిసిన ఒక దొం.క. (దొంగ కమ్యూనిస్టు) కథ”

  1. బొందలపాటి గారు,
    కాశే గారిని దొంగ కమ్యునిస్ట్ ఎందుకంటున్నారో నాకర్థం కాలేదు. కమ్యూనిస్టులంతా దాదాపు ఇంతే కదా! మీకు కమ్యూనిస్టులపై వ్యతిరేకత వున్నట్టుంది.
    కమ్యూనిస్టులు నాస్థికులయి తీరాలని రూలేమైనా వుందా?!

    మెచ్చుకోండి

  2. దొంగ కమ్యూనిస్టులంటే ఇలాంటే వారా? నాకప్పుడు (రమణ గారి బ్లాగులో) బోధపడలేదు.

    బాగా గడ్డి పెట్టారు కానీ పేరు కూడా రాసుంటే ఇంకా సంతోషం.

    మెచ్చుకోండి

  3. బొందలపాటి ప్రసాద్ గారూ,
    కొడితే ఏనుగు కుంభస్థలం మీదే కొట్టాలన్న నానుడిని మీరు నిజం చేసినట్లున్నారు. ఇలాంటి బాపతు వారిని స్వయంగా మీరే దొంగ కమ్యూనిస్టులని బిరుదిచ్చేశారు కాబట్టి మీ అక్షరాక్షరానికి నా సమర్థన.

    వీర తెలంగాణా విప్లవ పోరాటపు త్యాగాలను అమ్ముకుని బతుకుతున్న కమ్యూనిస్టులను చూసి కృద్ధుడైన చలసాని ప్రసాదరావు గారు ఇరవై ఏళ్ల క్రితమే ‘ఇలా మిగిలేం..’ అనే ఒక గొప్ప ఖండనాత్మక రచనను ప్రచురించారు.

    మీలాగా దొంగ కమ్యూనిస్టులు అని నేరుగా తిట్టలేదు కాని. ఎక్కడ ఏ పదంతో తిడితే మనిషి నవరంధ్రాలూ సిగ్గుతో తలదించుకుంటాయో అంత సుతిమెత్తగా, కత్తివాదరలాంటి శైలితో ఈదేశపు పార్లమెంటరీ కమ్యూనిస్టుల కెరీరిస్ట్ ఆచరణను తూర్పారబట్టారాయన.

    పార్లమెంటరీ కమ్యూనిస్టులకే కాదు. చీలికలు పీలికలైపోయిన ఈ దేశపు సమస్త కమ్యూనిస్టు ఆచరణలను ఉలిక్కిపడేలా చేశారాయన తన గొప్ప ఖండనతో.

    ఆ పుస్తకాన్ని మళ్లీ ఇటీవలే ప్రచురించినట్లుంది. దొరుకుతుంది కూడా. వీలైతే తప్పక తీసుకుని చదవండి.

    “కాశే అనతి కాలం లోనే తాలూకా స్థాయి నాయకుడయ్యాడు. ముఖ్యం గా దళితుల్లో ఆయన పలుకుబడి ఎక్కువ. కాకపోతే ఆయన ఇంటికి వచ్చిన దళితులు మాత్రం వరండాలో కింద కూర్చోవాల్సి వచ్చేది. దళితులకి వేరే ఇత్తడి చెంబు లో మంచి నీరు ఎత్తి పోసి వారికి మర్యాద చేసే వాడు. ఆ రోజుల్లో స్టీలు గ్లాసులను ఇంట్లోని వారికి మాత్రమే ఉపయోగించేవారు.”

    మీరు ప్రస్తావించిన పై విషయానికి కింది సమాచారం కాస్త జోడింపు అనుకోండి.

    పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను. విప్లవోద్యమంలో పనిచేస్తున్న ఒక అబ్బాయి చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడానికి ఇంటికి వచ్చాడు. ఉద్యమ జీవితంలో కులాన్ని నిజంగానే వదిలిపెట్టేసిన, దళితులతో, నిమ్నవర్గాలతో మనసా వాచా మమేకమైన ఆ కుర్రాడు ఇంటికి రాగానే తన తల్లితండ్రులు ఇంకా కుల సమానత్వాన్ని పాటించని, కులవివక్షతను ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితిని చూశాడు. అంటే తన కులం వాళ్లను, సమాన హోదా కలవాళ్లను ఒక రకంగా, ఇతర కులాలవాళ్లను, ప్రధానంగా తమకింద పనిచేసే కులాలవాళ్లను వేరుగా చూడటం గమనించాడు.

    ‘మనుషులంతా సమానమే అమ్మా, ఈ కాలంలో ఈ తేడాలెందుకు చూపడం’ అంటూ నచ్చచెప్పబోయాడు.

    ”సమానత్వం మీకు సహజమేరా, అన్నీ వదిలేసినవారికి ఏ తేడా, ఏ వివక్షతా ఉండదు. కాని మేం పల్లెల్లో మన కులాన్నే కాదు. హోదాను, ఆస్తిని, కుల గుర్తింపును దేన్నీ ఇంకా విడవలేదు. కులాలకు అతీతమైన ప్రేమను మేం చూపిస్తే, పనిచేయడానికి వచ్చిన వారిని ఇంటిలోపలికి ఆహ్వానించి సమపంక్తిలో భోజనం పెడితే మన పక్కింటివారే తర్వాత మన ఇంటికి రారు. స్వంత కులం వాళ్లే మనల్ని వెలి వేస్తారు లేదా చాలా చెడుగా ప్రచారం చేస్తారు. ఇవన్నీ మాకు అవసరమా? నువు చెబుతున్న సిద్ధాంతాలు అన్నీ మంచివే. తప్పు పట్టడానికి వీల్లేనివే.

    అంతెందుకురా కూలివాళ్లలోనే సమానత్వం లేదు. మా జీవితమంతా తపస్సు చేసినా బిసికులాల కూలీలను, ఎస్సీ కులాల కూలీలను ఒకే బంతిలో కూర్చోబెట్టి భోజనం పెట్టలేము మేము. ఎస్సీల్లోనే ఒక కులం మరో కులాన్ని తనలో కలవనీయదు. కలిపే ప్రయత్నం మేము బలవంతంగా చేశామంటే మరుసటి దినం నుంచి సేద్యానికి ఒక్క కూలీ కూడా దొరకడు. నాటు, కలుపు, ఊడ్పు వంటి పనుల్లో పోటీలకు కూడా మనుషులు దొరకరు.

    ఈ రకంగా పల్లెల్లో మా ఉనికి, జీవితం సమస్తం కులం పునాది మీదే నడుస్తోంది. ఇక్కడ మా ఉనికిని మేం ఏదో ఒక రూపంలో నిలబెట్టుకోక తప్పదు. అలాగని మిగతా ఏ విషయంలో కూడా మేం పనిచేసేవాళ్లను వేరుగా చూడటం లేదు. పాత తరం పెద్దలతో పోలిస్తే మేం చాలా మారినట్లే. కాని అన్నీ మారాలంటే మా తరంలో కూడా కష్టమేరా. ఈ విషయంలో మమ్మల్ని వదలేయండి” అంటూ అమ్మా నాన్నా ఇద్దరూ చెప్పడంతో బయట విప్లవం నడుపుతున్న ఈ అబ్బాయికి ఏం చేయాలో, ఏమనాలో పాలుపోలేదు.

    బయట ఏ సమానత్వాన్నయితే తను పాటిస్తూ వచ్చాడో, ప్రబోధిస్తూ వచ్చాడో, ఆ సమానత్వం తన స్వంత ఇంటిలో అమలు కాకపోవడం చూసి వ్యక్తిగతంగా తాను ఓడిపోయినట్లే అని భావించాడా అబ్బాయి.

    తర్వాత అక్కడినుంచి వచ్చేసిన తర్వాత పార్టీ ముందు ఈ సమస్యను పెడితే సుదీర్ఘంగా చర్చ జరిగింది. ‘కీలక అంశాల్లో కులాన్ని వదిలిపెట్టలేము’ అని ఎవరయినా అంటే వారిని శత్రువులుగా చూడటం తగదని, ఒక పోరాటం అన్ని కులాల వారిని సమానంగా ఆకర్షించే పరిస్థితి వచ్చినప్పుడే కులాన్ని దాటి మనుషుల ఆలోచనలు కొంతవరకు ఐక్యమయ్యే అవకాశం వస్తుందని. కులం, కులభావం అనేవి పుస్తకాలు చదవటం ద్వారా, సిద్దాంతాలు వల్లెవేయడం ద్వారా అంతరించిపోవని అప్పటి ఉద్యమ నాయకత్వం పేర్కొన్నది.

    బలవంతంగా కులాతీత సంబంధాలను ఏ సమాజంలోనూ నెలకొల్పలేమని, మార్పు కేవలం వ్యక్తిగతం, మానసికం గా ఉండదని, భూ ఆక్రమణ, బంజరు భూముల ఆక్రమణ, ఊరుమ్మడి సమస్యలపై పోరాటం వంటివి కులాలను తాత్కాలికంగా ఏకం చేసినప్పటికీ కులపరమైన అలవాట్లు, ఆచారాలు, నిషేధాలు అనేవి పోరాటంలోకి అన్ని కులాల వారు కలిసివచ్చినంత సులభంగా మారిపోవని, మౌలిక మార్పు అనేది అనేకానేక గొలుసుకట్టు చర్యల అనంతరం జరిగే ఆకస్మిక చర్యగా పరిణమిస్తుందని, కాబట్టి వెంటనే కులాన్ని మార్చేయడం మన దేశంలో సాధ్యం కాదని, ఇది ఇన్ని రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో కూడా అంతరిస్తుందని చెప్పలేమని నాయకత్వం ఆనాటికి తనవద్ద వున్న పరిష్కార రూపంలో చర్చను ముగించింది.

    ప్రసాద్ గారూ,
    దొంగ కమ్యూనిస్టుల గురించి మీరు ప్రచురించిన టపాలో కమ్యూనిస్టు ఆచరణలో నిజమైన అంశాలను, మార్పు కోసం చేసే పోరాటంలో తలెత్తే నిజమైన సమస్యలను ప్రస్తావించడం సందర్భ రహితం కాదనే అనుకుంటున్నాను.

    ఇప్పటికే చాలా పెద్ద వ్యాఖ్య అయినట్లుంది. ఇప్పటికి సెలవండీ..!

    మెచ్చుకోండి

  4. ముందు గా నా లేటు కామెంట్ కి అందరికీ క్షమాపణలు.
    @snkr నాకు కమ్యూనిస్టులపై వ్యతిరేకత ఏమీ లేదండీ. దొంగ కమ్మీ ల పై మాత్రమే! అలానే బ్లాగుల్లో గుంపుగా చేరి అసలు కమ్యూనిజం సిధ్ధాంతం తెలియకుండా దానిని ఆడిపోసుకొనేవారన్నా అంత పడదు. అటువంటి వారు నన్ను కమ్యూనిస్ట్ అని తిట్టారు. సమాజ విశ్లేషణ లో కమ్యూనిజం కరక్టే నని నమ్ముతాను. కానీ దానిని మార్చటం లో అది విఫలమైంది అనుకొంటాను. మార్క్స్ మహాశయుడు సమాజాన్ని మార్చటమే ముఖ్యం అన్నాడు కాబట్టీ, తానే అంగీకరించిన ఒక ముఖ్యమైన విషయం లో కమ్యూనిజం ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు.

    Jai గారు,
    ఇది ఓ నలుగురైదుగురు దొక లను చూసిన తరువాత ఒక అమాల్గమేషన్ అయి వచ్చిన రాత. ఏ ఒక్కరి జీవితమో కాదు. వారు పేరు మోసిన వ్యక్తులు కాదు. పేరు మోసిన వారు దొక లైనా వారి లో సిధ్ధాంత జ్ఞానం ఉంటుంది. కానీ కాశే కి సిధ్ధాంత జ్ఞానం సున్నా!

    రాజు గారు,
    మీ సుదీర్ఘ వ్యాఖ్య లో ఒక ముఖ్యమైన విష్యాన్ని స్పృసించారు. నాకు తెలిసిన చాలా మంది కమ్యూనిస్టులు కులం విషయం లో కొంచెం బెటర్. నాకు తెలిసిన ఒక కమ్మీ ఇంట్లో పనిమనుషులకి చాలా స్వేఛ్ఛ ఉంది, కానీ వారి కంచాలు వేరు గా ఉంటాయి .అంతెందుకు టౌనుల్లో ఉండే వారు హోటల్లో ఒక కూలి వాడు తాగిన గ్లాసుని మామూలు కంటే ఎక్కువ గా శుభ్రం చేయించుకొని తరువాత దానిని ఉపయోగించటం చూశాను.

    మెచ్చుకోండి

  5. @snkr
    కమ్యానిజం, నాస్తికత్వం గురించిన నా అభిప్రయం ఇది:
    ఈ ప్రపంచం కొన్ని స్థిరమైన భౌతిక నియమాల ప్రకారం నడుస్తుంది (ఉదా: గురుత్వాకర్షణ). ఈ నియమాలను మార్చలేము. ఈ నియమాల వెనుక దేవుడు ఉంటే ఉండవచ్చు. కానీ మనకు నియమాలు తెలిస్తే చాలు. ఎందుకంటే వాటిని ఎవరూ మార్చలేరు కాబట్టీ.
    ఈ నియమాలతో నడిచే ప్రపంచం లో మనిషి తన సంకల్పం తో ఏమి చేయవచ్చు అనే విషయం గురించి కమ్యూనిజం మాట్లాడుతుంది. మనిషి సంకల్పం దేవుడిచ్చినదా అనేది వేరే విషయం.
    కాబట్టీ నాస్తికుడైనా, ఆస్తికుడైనా భౌతిక వాదాన్ని నమ్మి (భౌతిక నియమాలను అంగీకరించి), మనిషి సంకల్పానికి విలువనిచ్చే వాడు కమ్యూనిస్టు కావటానికి అభ్యంతరమేమీ ఉండనక్కర లేదు. ఉదా: రావి శాస్త్రి.
    పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు, కమ్యూనిస్టులలో మంచి కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. భూస్వామ్య కుటుంబాలలో పుట్టి , తమ ఆస్తుల్ని ధారబోసి, చివరికి పార్టీ ఆఫీసులోనే బ్రతుకు వెళ్ళదీసిన వారున్నారు. వారు కూడా కొన్ని సిధ్ధాంత వ్యతిరేక మైన పనులు చేసిఉండవచ్చు. నేను అంతా మంచే చేస్తాను అని చెప్పి, తొంభై మంచి పనులు చేసి, ఒక చెడ్డ పని చేసే వాడున్నాడు. వాడిని “నువ్వు చెప్పుకొన్న మాటని నువ్వే అతిక్రమించావు”, అనటం చాలా సులువు. ఇంకొకడు నేను వెధవ పనులే చేస్తాను అని, అన్నీ వెధవ పనులే చేస్తాడు. నా దృష్టి లో రెండవ వాడి కంటే మొదటి వాడు చాల మెరుగు. వాడు చెప్పిన మాట ను ఆచరించి ఉండక పోవచ్చు. కానీ రెండవ వాడి తో పోలిస్తే మొదటి వాడి వలన చాలా మేలు జరిగింది.

    మెచ్చుకోండి

  6. ఇలాగైతే పెట్టుబడిదారులని మనం ఎంత తిట్టాలి? Communism and anticommunism depends upon many factors. Former CPI leader Gajjela Mallareddy claimed himself as communist until early 1980s. But he turned as virulent anticommunist and hindutva proponent when Gorbachev started the process of dissolution of USSR. Social conditions influence the behavior of individuals. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కమ్యూనిజం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు డీవియేట్ అయినా అది సామాజిక వాతావరణం యొక్క తప్పే కానీ అది కేవలం వ్యక్తిగతంగా జరిగిన తప్పని అనుకోలేము.

    And also read this link: http://4proletarianrevolution.mlmedia.net.in/cpi-cpm-29292

    మెచ్చుకోండి

  7. @praveeN
    నిజమే! సాంఘిక వాతావరణం ప్రభావం ఉంటుంది.ఒకప్పుడు (యాభై ల లో) కమ్యూనిస్ట్ అవటం ఒక ఫాషన్. ఇప్పుడు కమ్యూనిస్టులను తిట్టటం, వారిని చూసి హేళన చేయటం ఒక ఫాషన్.

    మెచ్చుకోండి

  8. వ్యక్తిగత పాప్యులారిటీ కోసం కమ్యూనిస్ట్‌నని చెప్పుకోవడం మార్క్సిజం మూల సూత్రాలకే వ్యతిరేకం. వ్యక్తి సామాజిక బాధ్యత కోసం కమ్యూనిస్ట్‌గా మారాలి. కేవలం వ్యక్తిగత పాప్యులారిటీ కోసం కమ్యూనిస్ట్‌నని చెప్పుకుంటే వ్యక్తికి గానీ సమాజానికి గానీ ఏమీ రాదు. వ్యక్తిగత పాప్యులారిటీ కోసం ప్రాకులాడడం కూడా ఒక మూఢ విశ్వాసమే. వ్యక్తిగత కీర్తిప్రతిష్టలని నమ్మేవాళ్ళకి అది అదో రకం సంతృప్తి మాత్రమే కానీ దాని వల్ల వాటిని నమ్మేవాళ్ళకి గానీ సమాజానికి గానీ ఏమీ ఒరగదు.

    మెచ్చుకోండి

  9. ” సమాజ విశ్లెషణలొ కమ్యునిజం కరక్టె నని నమ్ముతాను కాని దాన్ని మార్చడంలొ విఫలమైందని అనుకొంటాను. మార్క్స్ మహశయుడు సమాజాన్ని మార్చడమే ముఖ్యమన్నాడు కాబట్టి తానే అంగీకరించిన ఒక ముఖ్యమైన విషయంలొ కమ్యునిజం ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు.”

    బొండాలపతి గారూ ఎదైనా ఒక లక్ష్యం చేధించడంలొ ఆటుపొట్లు అనేటివి సహజం. సాఫిగా సాగిపొవడానికి అదేమీ భజన కాదు కదా . బుర్జువా వర్గం ప్యుడల్ వర్గాలను జయించడానికి అనేక పొరటాలు అవసరమైనాయి . రొండూ దొపిడీ వర్గాలే అయినా ఒకటి అభివౄద్ది కలదీ, మరొకటి అభివౄద్ది నిరొదకమైనది.వాటి సంభందాలే మారడానికి అనేక పొరాటాలు అవసరమైనప్పుడు , రొండూ పరస్పర శత్రువర్గాలూ, భిన్న ప్రయొజనం కలవరూ అయినప్పుడు ఇంకెన్ని పొరాటాలు అవసరమౌతాయొ కదా. కమ్యునిజం ఫెయిల్ అయిందంటె మీ అర్దం సిద్దాంతం ఫెయిల్ అయిందనా? లేక కమ్యునిజం పార్టీ ఫెయిల్ అయిందనా? లేక రొండూ ఫెయిల్ అయ్యాయనా? మీరు చెప్పే సమాదానాన్ని బట్టి తర్వాత చర్చించుకుందాం.

    సొదరా నాదొక చిన్న సందేహం మీరు చేసే వౄత్తిని మీ బ్లాగ్ కు పేరు పెట్టుకున్నారు దానిలొ తెలుగు అని ప్రతేకంగా పెట్టుకున్నారు అంటె తెలుగు వాళ్ళలొ యవరూ లేరనా ? లేక నలుగురిలొ హొదాకొసమా?

    మెచ్చుకోండి

  10. రామమోహన్ గారు,
    1. మీ వలన నాకు అర్ధమయిన ఒక పాయింట్(ఇంతకు మునుపు మీరు చేసిన ఇతర కామెంట్ల నుంచీ కూడా) “చరిత్ర లో మానవ సమాజ పురోగతి లో పోరాటాలు ప్రముఖ పాత్ర పోషించాయి. పోరాటాలు లేకుండా పురోగతి సాధ్యం కాదు”. దీనిని గురించి నేను తరువాత ఆలోచిస్తే నిజమే అనిపించింది.
    కానైతే, నెమ్మది గా క్రమ బధ్ధం గా జరిగే పరిణామం వలన కూడా కొంత ప్రగతి సాధ్యమే అనుకొంటున్నాను. ఉదాహరణ కు స్త్రీల పరిస్థితి ఓ యాభైయేళ్ళ కిందటి కంటే ఇప్పుడు మెరుగు గా ఉంది. దీనికి ఫెమినిస్టులు చేసిన పోరాటాల కంటే, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పులూ (గర్భ నిరోధక సాధనాల ద్వారా గర్భ ధారణ పై అదుపు, చేసే పని లో శారీరక శ్రమ పాళ్ళు తగ్గి మేధో శ్రమ ఎక్కువవటం వగైరాలు) ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇతర రంగాల ప్రభావం వలన స్త్రీల సామాజిక రంగ పురోగతి సాధ్యమైంది.
    2. పొరాటాల వలన ఒక మార్పు వచ్చినా, జనాలలో అందుకు తగిన భావ పరిపక్వత లేనపుడు, ఆ మార్పు నిలబ్డదు. రష్యా, చైనా లు ఉదాహరణ.
    3.ముందుగా జనాల విలువలూ, భావాలలో గణనీయమైన మార్పు వచ్చి మార్పుకు సిధ్ధం గా ఉన్నపుడే, విప్లవాలు నిలబడతాయి అని నా అభిప్రాయం..
    3. ఇక హింస గురించి..స్వార్ధం, అపరిపక్వత విషయం లో బూర్జువాల స్థాయి లోనే ఉన్న శ్రామిక జనం బూర్జువాలను చపటం నైతికం గా సమర్ధనీయం కాదు.(బూర్జువాల స్థనం లో వీరు ఉన్నా వీరు కూడ అంతే స్వార్ధ పరం గా ప్రవర్తిస్తారు కాబట్టీ. )వీరు రాబోయే గొప్ప మంచి కోసం హింస తప్పదనే ఒక అవగాహనతో, ఉన్న వ్యవస్థ లోని హింస యొక్క తీవ్రత పట్ల కన్విన్స్ అయి చంపితే కొంతవరకూ సమర్ధనీయం (The.case where one man’s killing is justified for saving 10 lives) కానీ ఈ అవగాహన ఎంత మంది లో ఉంటుంది?
    4..మీరు “ఇప్పటి పరిస్థితి ఒక తాత్కాలిక వెనుకంజ మాత్రమే, తరువాత చివరిగా ప్రగతి కారక శక్తులదే విజయం”, అంటున్నారు. అల అయితే సంతోషపడేవాళ్ళ లో నేను ముందుంటాను. కానీ అలా అవుతుందని చెప్పటనికి మనలాంటివారికి ఉన్న నమ్మకం(ఓwishful thinking) తప్ప వేరే ఆధారాలు కనపడటం లేదు.
    5.కొన్ని ఐరోపా దేశాలలో (స్కాందినేవియన్) సమాజాలు క్రమేణా ప్రభుత్వాల్ పాలిసీల వలన సామ్య వాదం వైపుకే నడుస్తున్నాయి అనే వాదన్ ఒకటుంది. ఈ వాదన ప్రకారం హింసా పోరాటాలు అవసరం లేకుండానే, ఒక సమాజం లో ప్రజలందరి లో వచ్చిన ఎరుక వలన, క్రమం గా statelesness అనేది వస్తుంది.దీని గురించి మీ అభిప్రయమేమిటి?
    6.ప్రకృతి విరుధ్ధమైన సిధ్ధాంతాలు నిలబడవు. ఇంతకు ముందు, సామ్యవాద సమానత్వాన్ని పరిపూర్ణ సమానత్వం గా పొరపడటం వలన, సమానత్వం ప్రకృతి విరుధ్ధం అనుకొనే వాడిని. ప్రస్తుతానికి సామ్యవాదం ప్రకృతి విరుధ్ధమా కాదా అనే విషయం లో నాకు క్లారిటీ లేదు. కుటుంబ వ్యవస్థ ఏర్పడక పూర్వం, కుటుంబాలు పెద్ద అసహజమైన విషయం గా కనపడి ఉంటాయి. కానీ ఒక సారి మొదలయిన తరువాత ఇప్పుడు మనకు కుటుంబ వ్యవస్థ లో ఉన్న అసహజత్వం కనిపించదు. కుటుంబాలు కూడా సహజమే అని ఒప్పుకోక తప్పదు.

    7. నా బ్లాగు పేరు లో తెలుగు గురించి..బెంగుళూరు లో అన్ని భాషల జనాలూ ఉంటారు, మన ప్రాంతానికి బయట ఉండటం వలన ఈ భాషాభిమానం, ఐడెంటిటీ కొంత ఎక్కువవుతుది అనుకొంటా. బెంగుళూరు లో నా మితౄల బాచీ అంతా తెలుగు బాచీ. దాని నుంచీ వచ్చిన పేరు. మీరు బాలేదంటే తీసేద్దాం. బ్లాగుల్లో నలుగురి లో హోదానా? బ్లాగులే ఒక వ్యక్తిగత వ్యవహారం. వీటి వలన ఉబుసుపోక తప్ప వచ్చేదీ పోయేదీ లేదు(తెలుగు బ్లాగు జనాలు మహా అయితే ఓ నాలుగైదు వేలు ఉంటారేమొ!). నాకు బ్లాగుల్లోని వ్యక్తులేవరూ ఇప్పటి వరకూ నిజజీవితం లో తారస పడలేదు.

    మెచ్చుకోండి

  11. బొండాలపతి గారూ మీ రొండవ పాయింట్ లొ కొంత నిజం జనాబాలొ సిద్దాంత అవహాహన లేనప్పుడు అనేక తప్పుడు దొరణులు బయలు దేరతాయి.అసలు నాయకులే అనేక విషయాలలొ అవగాహనా లొపంతొ వున్నారు. ఇక కార్యకర్తలు కుడా ప్రజల స్తాయిలొనే వున్నారు.పొరాటం ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరగాలి? లాభం, వడ్డీ, కౌలు, వీటి పైన బుర్జువా బావజాలంలొనే వున్నారు.అందుకే ప్రజలనుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. నాయకులు చెప్పినట్టు నడుచుకున్నారు ఆ కార్యకర్తలకు గానీ, ప్రజలకు గానీ సిద్దాంత అవగాహన ఎమీ లేదు. అందుకే అక్కడ పెట్టుబడిదారీ వర్గం మళ్ళీ పైచేయి సాదించింది. ప్రెంచి మార్కిస్టు రష్యా, చైనా లలొ అనేక పర్యాయాలు పర్యటించి మావొ తర్వాత చైనా అనే పుస్తకం రాశాడు. వీలైతే చూడండి. ఇక మీరు చెప్పిన మూడవ పాయింట్ నిజం. సిద్దాంతపరమైన అవగాహన, బావజాలం వున్నప్పుడు విప్లవాలు నిలబడతాయి. లేనప్పుడు విఫలం చెందుతాయి. ఇక హింస గురించి ఒకరిని అణగతొక్కుతూ, వాళ్ళ శ్రమ దొచుకుంటూ వున్నప్పుడు . వాళ్ళు తిరగబడినప్పుడు.అది న్యాయమైన పొరాటం ఆ తిరుగుబాటును అణచటం అన్యాయం. ఈ పొరాటంలొ రొడు పక్కలా కార్మిక వర్గానికి చెందిన వారే వుంటారు.ఒకపక్క పొలీసులూ, సైనికులూ, మరొపక్క కార్మికవర్గం ఆ పొరాటంలొ ఇరువురుకూ నష్టం జరుగుతుంది. పెట్టుబడిదారీ వర్గం అదెప్పుడూ ప్రతేక్ష పొరాటంలొ పాల్గొనదు. అసలు కార్మిక వర్గానికి చెందిన ఉత్పత్తి సాదనాలు వాళ్ళపరం చేస్తె ఏ పొరాటం అవసరం వుండదు.కానీ అలా జరగదు. హింస గురించి మాట్లాడు తున్నారు. వేల సంవత్సరాలుగా అది భుభాగాలను జయించడంలొనూ, వ్యపార మార్కెట్లకొసం, లాభాలకొసం అది చెయ్యని అఘాయిత్యమంటూ వుందా? లక్షల, కొట్లమంది అశువులు బాశారు.రొండవ ప్రపంచయుద్దంలొ 5 కొట్లమంది చనిపొయారు.మరెంతొమంది గాయపడ్డారు. తాజాగా అమెరికా ఇరాక్ పైన చేసిన యుద్దంలొ లక్షకు పైగా చనిపొయారు. మరెంతొమంది ప్రంతీయ యుద్దాలలొ చనిపొతున్నారు. ఇదంతా మార్కెట్ల కొసం లభాలకొసం. దీనంతటినీ తీసెయ్యడానికి చేసే పొరాటంలొ మీకు హింస మాత్రమే కనపడుతుందా?.

    ఇక మీ ఐదవ పాయింట్ గురించి. పాలసీల ద్వారా కమ్యునిజాన్ని చేరుకొవడం.అలాగే పార్లమెంటరీ పద్దతుల ద్వరా కమ్యునిజాన్ని చేరుకొవడం. ఈ రొండింటికీ పెద్ద తేడా లేదు. మొదట పాలసీల గురించి చుద్దాం. ఒక ప్రభుత్వం పాలసీలు ఎలా ప్రవేశ పెడుతుంది? ప్రదానంగా పన్నుల రూపంలొ వచ్చినాటివీ, అలాగే ప్రభుత్వ రంగ స్తంస్తలనుంచీ, ఇంకా కొన్ని వేరే పద్దతులద్వారా వస్తుంది. ఇదంతా కుడా ప్రజల శ్రమే. ఒక పక్క కార్మికులూ, పెట్టుబడిదారులూ, వుండగ సమానత్వం ఎలా సాద్యం అవుతుంది.( సమానత్వం అంటె మానసిక శారీరక సమానత్వం కాదు.ఆర్దికంగా సమానత్వం.) చరిత్ర పరిచీలిస్తె పెట్టుబడి వర్గానికీ కార్మిక వర్గానికీ, పెరుగుతూ పొతుంది. ఇక పార్లమెంటరీ ద్వారా కమ్యునిజం. ఒక పెట్టుబడిదారీ ప్రభుత్వం దగ్గరకుపొయి కమ్యునిజం ఎలా సదిస్తుంది? అంగబలం , అర్దబలం దానిదగ్గర వున్నాయి. దీని దగ్గర ఏమున్నాయి.? అది ఎవిధంగా ఉత్పత్తి సాదనాలను స్వదీనం చేసుకుంటుంది? ధర్నాలూ, రాస్తొరొకొలూ, దానికి లెక్కలొకి రావు.అవసరమనుకుంటె ఓ నలుగురిని కాల్చిపారేస్తుంది. అంతటితొ అయిపొతుంది. చిన్న చిన్న సంస్కరణల కొసం దాన్ని బ్రతిమలాడుకొవాలి.అంతకుమించి మరేమీ చెయ్యలేరు.

    మెచ్చుకోండి

  12. బొందలపాటి గారు,

    నలభై సంవత్సరాలకి ముందు కమ్యునిజం పై విసిగిన ఒక కుటుంబం దేశాన్ని దాటేస్తూ నడిసముద్రం లో తుఫాను లో చిక్కుకొన్న కధ కూడా నాకు తెలుసు. వారు ఇప్పుడు మాకు ఆత్మీయులు. కాని మీరు చెప్పిన ఈ కధ ను యధాతధం గా అంగీకరించలేను.

    మీరు కా. శేషగిరి రావు గారి నుండి ఏమి ఆశించారు. ప్రతి కమ్యునిస్టు చివరిదాకా ఎటువంటి జీవితం మాత్రమె గడపాలని మీరు అనుకొంటున్నారు ? కమ్యునిస్ట్ సిద్దాంతాలకు ఆకర్షితులైన వారు కమ్యునిస్టు గానే మరణించాలా ?

    నేను ఎంతగానో అభిమానించే బాలగోపాల్ గారు కూడా మరణించే నాటికి మొదట్లో ఉన్నటువంటి కమ్యునిస్ట్ కాదు. కాని ఆయన సంపాదిమ్చుకోలేదు కాబట్టి మీకు అభ్యంతరం లేదు అంటారా?

    మెచ్చుకోండి

  13. మౌళి గారు,
    నాకు తెలిసిన ఓ నాలుగైదు కేసులను కలిపి ఓ కారక్టర్ ను తయారు చేశాను. మేధావులు చాలా మంది కమ్యూనిజం లోకి వెళ్ళటం బయటికి రావటం జరుగుతాయి. ఈ ప్రక్రియ లో ఎంతో ఆలోచన ఆత్మ విమర్శ ఉంటుంది.
    కాశే మేధావి కాదు.సిధ్ధాంతం తెలియదు. ఒక చిన్న నాయకుడు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలలానే తన పెద్దవాళ్ళు అనుచరులు కాబట్టీ తాను కూడా అనుచరుడైనాడు.
    నటుడు నాగేశ్వర రావు డయలాగ్ రిపీట్ చేయటం తో కాశే అసలు కమ్యూనిస్టే కాదని తెలుస్తుంది.కాశే కమ్యూనిజం లోకి ఎప్పుడూ నిజం గా వెళ్ళ లేదు. లోపలికి వెళ్ళలేదు కాబట్టీ బయటకు వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
    కొ.కు లాంటి వారి రచనలు చదివి నా ఇరవైలలో కమ్యూనిస్టుల గురించి ఏదో ఉన్నతం గా ఊహించుకొనేవాడిని. కాశే గారి డయలాగ్ మొదటి సారి నన్ను చాలా షాక్ గురి చేసి భూమి మీదకి తీసుకొని వచ్చింది. అందుకే కాశే గురించి రాయవలసి వచ్చింది.

    మెచ్చుకోండి

  14. *ఉదాహరణ కు స్త్రీల పరిస్థితి ఓ యాభైయేళ్ళ కిందటి కంటే ఇప్పుడు మెరుగు గా ఉంది*

    సీతారాం,

    50సం|| క్రితం మనదేశం లో మగవారు స్రీలకన్నా అనుభవించిన ఎక్కువ సుఖాలు ఎమిటి? నేను తెలుసుకోవాలనుకొంట్టున్నాను.

    ఈ మధ్య శ్రీకాంత్ బ్లాగులో మార్క్స్ గారికి, ఆయన గురువు హేగల్ కి భారతదేశం మీద అవగాహన లేకపోయినా, చాలా తెలిసినట్లు అనాలిసిస్ చేశారు అని చెప్పటానికి కొన్ని ఉదాహరణలు చూపుతూ రాశాను. ఇది చాలా తొందరలో రాశాను. అది రాయటానికి కారణం మనదేశం గురించి తెలియకపోయినా యురోప్ వాళ్లు వాళ్ల సంస్కృతి కోణం లో చాలా ఊహించుకొని రాశారు. త్వరలో బ్లాగు పెట్టి మార్క్స్ గారి వాదనలో ఉన్న లోపాలు, చరిత్ర విషయం లో పశ్చిమదేశాల వారి అహంకారధోరణి ఎత్తి చూపుతూ రాయలనుకొంట్టున్నాను. మీ అభిప్రాయం చెప్పండి.

    http://bit.ly/TvgONw

    మెచ్చుకోండి

  15. సీతారాం,
    ఆటపాలో మార్క్స్గారిని ఒక క్రమపద్దతిలో విమర్శించ లేదు. ఆ వ్యాఖ్య రాసేటప్పుడు ఎన్నో పుస్తకాలు చదివి,వెతికి రాశాను తొందరలో రాశాను. అది సాంపుల్ అనుకోండి. ఈ సారి క్రమపద్దతిలో సుస్పష్ట్టంగా, అందరికి అర్థమయ్యే టట్లు రాస్తాను. భారత దేశచరిత్ర గురించి చాలా మంచి సమాచారం సేకరించి ఉన్నాను. ఆ సమాచారం తో, ఆధారలతో రాస్తే ఎవరు ప్రశ్నించలేరు కూడాను. తెల్ల వాళ్లు మన చరిత్రను ఎలా వక్రీకరించారో కూడా తెలుస్తుంది.

    మెచ్చుకోండి

  16. “50సం|| క్రితం మనదేశం లో మగవారు స్రీలకన్నా అనుభవించిన ఎక్కువ సుఖాలు ఎమిటి? నేను తెలుసుకోవాలనుకొంట్టున్నాను.”
    సుఖాల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఉన్నవీ అప్పుడు లేనివీ..స్వేఛ్ఛ, సొంత సంపాదన, చదువూ విజ్ఞానం వగైరాలు. అప్పటి సాహిత్యం చదివితే మనకు అర్ధమౌతుంది. ఇండియ గురించి పాశ్చాత్య దృక్కోణం(including those of marx , hegel) గురించిన మీ కామెంట్లు ఆలోచింపచేసే విధం గా ఉన్నాయి.. అయితే కొన్ని విషయాలలో, ఇప్పటి సమస్యలకి, అప్పటి పరిస్థితుల ని జత చేసి, సమస్య అంతా విదేశీయుల వ్యవస్థలను మనం అవలంబించటం వలన వచ్చింది అంటున్నారేమో ఆలోచించండి. ఉదాహరణ కు మన పట్టణాలలో ఇప్పుడు ట్రాఫిక్, పొల్యూషణ్, సానిటేషన్ ఒక సమస్య. మీరు, ” ఈ సమస్య మన ప్రాచీన సమాజం లో ఉండేది కాదు, బ్రిటీషు వారు తెచ్చిన వ్యవస్థల వలన వచ్చింది” అనటం సరి కాదు. ఎందుకంటే పాత రోజులలో ఇప్పుడున్నంత జనభా, పొల్యూషన్ లేవు. బ్రిటీష్ వారు మన దేశం రాకున్నా, మనం ఏ రాజు కిందో ఉన్నా, ఈ పొల్యూషన్ సమస్య ఈ రోజులలో ఉండేది. ఎందుకంటే శాస్త్ర శాంకేతిక మార్పులను మనం ఆపలేము. పొల్యూషన్ అనేది ఈ కాలపు సమస్య. ఈ సమస్య ని పాశ్చాత్య దేశాలు మానేజ్ చేసినట్లు మనం చేయలేకపోతున్నాం. అలానే అవినీతి అనేది తెల్లవాడు తెచ్చినది కాదు. అది మన రాజులు, బట్రాజుల బూజు లోంచీ వచ్చిన ఒక రోగం.
    మీ కామెట్ల ప్రకారం “తెల్ల వాళ్ళు రాక ముందు మనం అన్నిటిలోనూ ముందు పడి ఉన్నాం”. మరి ఓ నాలుగు పటాలాల తెల్ల సైన్యానికి తూర్పు భారతమంతా పాదాక్రాంతమెందుకయింది? అయిందంటే అది మన తక్కువ తనమే కదా? అభివృధ్ధి సాధించాలంటే,ముందు మన లోపాలను నిజాయితీ గా గుర్తించాలి, ఆ తరువాత వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. అసలు లోపాలే లేవు అని కళ్ళు మూసుకొంటే, వాటిని ఎప్పటికీ సరి దిద్దుకోలేం. మనలో లోపాలు ఉన్నాయి అనీ ఆత్మ విమర్శ చేసుకొనే ప్రతి వాడూ జాతి వ్యతిరేకి కాడు. ,
    మీరు బ్లాగు పెడితే నేను ఆహ్వానిస్తాను.

    మెచ్చుకోండి

  17. కా. శేషగిరి రావు కమ్యునిజం వైపు ఆకర్షితుడు అవడానికి కారణం కమ్యునిజం గొప్పతనం కాదు. అతని పరిస్థితులు. అవే పరిస్థితులు ఆ సమయం లో గుంటూరు జిల్లా అంతటా ఉండి ఉంటాయి.
    వారి ఏ సమస్యలు కమ్యునిస్ట్ పోరాటం లో పాలుపంచుకోనేలా చేసిందో, ఆ సమస్య తీరి పోయాక ఆ వ్యక్తి చివరిదాకా కేవలం పోరాటమే పనిగా పెట్టుకోడు. జీవించాలని తపన పడతాడు.

    ఇక్కడా అతను దళితులకి మంచి నీళ్ళు ఎలా ఇచ్చాడు అన్నది అప్పట్లో అసలు విషయమే కాదు. కాస్త పై స్థాయిలో ఉన్న దళితులకి ఇచ్చే మర్యాద ఇంకాస్త మెరుగ్గా ఉండొచ్చు కూడా.

    మీ కధ లో అతను జనానికి సాయపడినట్లు గానే చెప్పుకొచ్చారు. కాని ఆ క్రమం లో అతని అభివృద్ధి మీకు అభ్యంతరకరమైనది . అతను కమ్యునిస్టు కాదు అనడానికి, అక్కినేని పేరు తో ఆయన చెప్పిన వ్యాఖ్యకు పోలిక పెట్టనవసరం లేదు. జనం అందరు నమ్మే మాటే , డబ్బులేక పొతే ఎవరు మొహం చూస్తారు అన్నది. దాన్ని కమ్యునిజం తీసిపారేయ్యాలని ప్రయత్నించడం దండుగ.

    @కాశే కి రష్యా అంటే చాలా ఇష్టం (సినీ హీరో ల అభిమానులకి వారి హీరో అంటే ఇష్టమున్నట్లు).

    కా శే కి, ఇప్పటి సినీ హీరో ల అభిమానులకి పోలిక పెట్టడం కరెక్టే. రెండింటికీ పోలిక ఉంది. అదే అస్తిత్వ పోరాటం. కమ్యునిజం మీదా కాశే కి , హీరో ల మీదా అభిమానులకి ఉన్నది నిజంగా అభిమానం కాదు. అస్తిత్వ సమస్య !!

    @ ఉదాహరణ కు స్త్రీల పరిస్థితి ఓ యాభైయేళ్ళ కిందటి కంటే ఇప్పుడు మెరుగు గా ఉంది. దీనికి ఫెమినిస్టులు చేసిన పోరాటాల కంటే, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పులూ

    విద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్ని మార్పులు వచ్చినా..వాటి ఫలాలు స్త్రీలకు అంట సులువు గా రాలేదు , పోరాటం వల్లే అందాయి పోరాడిన వాళ్ళని మీరు ఫెమినిస్టులు అనుకుంటే అభ్యంతరం లేదు.

    కొ.కు ఏమి వ్రాసారో నాకు తెలిదు. కా శే ని కూడా భూమ్మీదకు అక్కినేని గారు తీసికొని వచ్చారేమో 🙂

    కా శే మేధావి కాదు, మీ లా పెద్ద పెద్ద రచనలు చదువుకో లేదు. కాని మీరు కూడా కొ కు వ్యక్తిత్వాన్ని కా శే వ్యక్తిత్వం తో బాలెన్స్ చేసి మీ స్వంత అభిప్రాయాలు ఏర్పరచు కొంటున్నారు.

    @ మేధావులు చాలా మంది కమ్యూనిజం లోకి వెళ్ళటం బయటికి రావటం జరుగుతాయి. ఈ ప్రక్రియ లో ఎంతో ఆలోచన ఆత్మ విమర్శ ఉంటుంది.

    ఇలా అయితే కమ్యునిజం లో రావడానికి మేధావులా కాదా, ఆత్మ విమర్శ ఉందా లేదా అని వడపోత కార్యక్రమం పెట్టాలి . అన్యాయం గా లేదూ ?

    మెచ్చుకోండి

  18. “అవే పరిస్థితులు ఆ సమయం లో గుంటూరు జిల్లా అంతటా ఉండి ఉంటాయి.”
    పరిస్థితులా పాడా. “మా నాన్న ఆ పార్టీ, నేనూ ఆ పార్టీ..అంతే!

    “మీ కధ లో అతను జనానికి సాయపడినట్లు గానే చెప్పుకొచ్చారు.”
    కాశే ఇచ్చిన చేబదుళ్ళకు వడ్డీ ఉంటుందని చెప్పటం మరిచినట్లున్నాను.

    డబ్బు లేక పోతే మొహమేవడు చూస్తాడనేది నిత్య సత్యమే. కమ్యూనిస్టు ఈ మాట అంటే వింతగా చూస్తారు అనే విషయం కూడా, కాశే కి తెలియదు.
    “..డబ్బులేక పొతే ఎవరు మొహం చూస్తారు అన్నది. దాన్ని కమ్యునిజం తీసిపారేయ్యాలని ప్రయత్నించడం దండుగ.”
    దండుగేనేమో కానీ, కమ్యూనిజం దానికంటే ఓ స్థాయి పైన ఉండే విలువలని ప్రతిపాదిస్తుంది.

    “..వాటి ఫలాలు స్త్రీలకు అంట సులువు గా రాలేదు , పోరాటం వల్లే అందాయి.”
    ఎక్కడ ఎవరు చేశారు. కనీసం నాకు తెలియదు. ఓట్లు లేకపోతే ఎవరిని ఎవరూ పట్టించుకోరు.

    “కా శే కి, ఇప్పటి సినీ హీరో ల అభిమానులకి పోలిక పెట్టడం కరెక్టే. రెండింటికీ పోలిక ఉంది. అదే అస్తిత్వ పోరాటం. కమ్యునిజం మీదా కాశే కి , హీరో ల మీదా అభిమానులకి ఉన్నది నిజంగా అభిమానం కాదు. అస్తిత్వ సమస్య !! ”
    అస్తిత్వ పోరాటమో కాదో కానీ, అస్తిత్వ సమస్య అనే దానికి అంగీకరిస్తాను.

    “కాని మీరు కూడా కొ కు వ్యక్తిత్వాన్ని కా శే వ్యక్తిత్వం తో బాలెన్స్ చేసి మీ స్వంత అభిప్రాయాలు ఏర్పరచు కొంటున్నారు.”
    “ప్చ్..అదే మీ అభిప్రాయమా..సరే కానీయండి..”

    “ఇలా అయితే కమ్యునిజం లో రావడానికి మేధావులా కాదా, ఆత్మ విమర్శ ఉందా లేదా అని వడపోత కార్యక్రమం పెట్టాలి .”
    మీకు అలా అర్ధమయిందా? కార్య కర్తలకు కనీసమైన అవగాహనా కమిట్మెంట్ ఉందా లేదా అనే వడపోత మాత్రం ఉండాలి .అవగాహనా కమిట్మెంట్ లేకపోతే శిక్షణా తరగతుల ద్వారా కల్పించాలి.

    మెచ్చుకోండి

  19. “విద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్ని మార్పులు వచ్చినా.వాటి ఫలాలు స్త్రీలకు అంట సులువు గా రాలేదు , పోరాటం వల్లే అందాయి పోరాడిన వాళ్ళని మీరు ఫెమినిస్టులు అనుకుంటే అభ్యంతరం లేదు”
    @ మౌళి గారు,

    చిన్న సహాయం చేయాలి. స్రీలు పోరాడిన పోరాటాల వివరాలు మీ దగ్గరగాని లెక మీకు తెలిసిన వారిదగ్గర గాని ఉంటే మీ బ్లాగులో ఒకటపాగా రాసేది. పోని ఎదైనా పుస్తకం లో ఆ వివరాలు ఉంటే చెప్పేది. ఈ మధ్య ఓల్గ ఆలోచనా తరంగాలు చదివాను. ఇంతక్రితం ఆమేరాసిన స్వేచ్చ, కథలు మొద|| పుస్తకాలు కొన్ని చదివాను. అందులో స్రీలు చేసిన పోరాటం మీద పెద్ద ఎక్కువ వివరాలు దొరకలేదు. యుట్యుబ్ లో వీడియోల కొరకు వెదికితే ఆవిడవి మూడు విడియోలు ఉన్నాయి. నేను సహితం మార్పు తీసుకు రావటానికి కారణమయ్యాను అని సంతోషంతో, స్రీ-పురుష సంబందాల పట్ల అవగాహాన, స్వేఛ, స్వాతంత్రం, సమానత్వం అంటూ కబుర్లు చెప్తు ఉల్లాసంగా,ఉత్సహంగా కనిపించారు. అందులో పోరాట వివరాలు పెద్దగా ఎక్కడా దొరకలేదు.

    మెచ్చుకోండి

  20. “..వాటి ఫలాలు స్త్రీలకు అంట సులువు గా రాలేదు , పోరాటం వల్లే అందాయి. ఎక్కడ ఎవరు చేశారు. కనీసం నాకు తెలియదు. ఓట్లు లేకపోతే ఎవరిని ఎవరూ పట్టించుకోరు.”

    అరే మన అభిప్రాయలు భలే కలిసాయె. అసలికి ఓల్గ గారి పుస్తకాలు చదివాను, ఆమే రాసిన నవలల మీద చాలా చర్చ జరిగింది అని చెప్పారావిడ. ఓల్గా ఆలోచన తరంగాలు చదివితే ఫ్రెంచ్ స్రీ వాద రచయిత, అమేరికా స్రీవాద రచయితలు ఎమన్నారు వాళ్ల కోటేషన్స్ ఇవి ఎన్నో ఉన్నాయి. పోరాట వివరాలు మాత్రం ఎమీ లేవు.

    మెచ్చుకోండి

  21. ఒక జిల్లా మొత్తం గా అలా ఉన్నారు అని మీరు అంటే, అక్కడి పరిస్తితులని పక్క జిల్లా వారి తో పోల్చాలి అన్నది నా అభిప్రాయమండీ .

    స్త్రీ ల విషయం లో నేను ప్రస్తుతం ఉన్న దేశం లో అయితే ఎవరు పోరాడారు అన్నది తెలుసు . ఇక మనదేశం లో అంటారా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యల్లో ఓటు రాజకీయాలకి పెద్దగా అవకాసం లేదు. పోరాడాల్సింది ప్రభుత్వాలతో కాదు , సమాజం లో . మన బ్లాగుల్లో కుడా ఈ మధ్య చర్చ జరిగింది , అబార్షన్ విష్యం లో ఏకాభిప్రాయం కుదరక విడాకులకు వెళ్ళిన ఒక కేసు లో.

    ఇప్పుడు కమ్యునిస్టు గా చేరడం కోసం జనం ఉత్తుత్తినే సరదా పడడం లేదు.(అంత తీరికా ,అవసరం ఎవరికి ఉన్నాయి ) కాబట్టి అవగాహనా , కమిట్మెంట్ వున్న వారే కార్యకర్తలు గా ఉంటున్నారని ఆశిద్దాము.

    మెచ్చుకోండి

  22. Mauli wrote:
    >>>>>
    @ ఉదాహరణ కు స్త్రీల పరిస్థితి ఓ యాభైయేళ్ళ కిందటి కంటే ఇప్పుడు మెరుగు గా ఉంది. దీనికి ఫెమినిస్టులు చేసిన పోరాటాల కంటే, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పులూ
    >>>>>
    స్వల్ప మార్పులని గొప్ప ప్రగతి అనుకోలేము. నాకు తెలిసిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నెలకి యాభై వేలు సంపాదిస్తోంది. ఇంత సంపాదిస్తోన్నా ఆమె తన భర్త తన కంటే ఎక్కువ సంపాదించేవాడు అయ్యుండాలని కోరుకుంటోంది. ఈ విషయం తెలిసిన అబ్బాయిలు ఆమెకి పది లక్షలు కట్నం అడుగుతున్నారు. ఆడది స్వతంత్రంగా సంపాదిస్తున్నట్టు చెప్పుకుంటున్నప్పుడు ఆమె ఇంకా మగవాని మీద ఆధారపడుతున్నట్టు తన భర్త తన కంటే ఎక్కువ సంపాదించేవాడు అయ్యుండాలని కోరుకోవడం ఎందుకు?

    మెచ్చుకోండి

  23. అ జిల్లాలలో ఇలాంటి వారు ఎందుకు ఉన్నారు, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అని మనం వెనుకకు చూసి ఈకలు పీకితే లేక విశ్లేషణ చేస్తే….(ఏ 1920 ల మొదటి లో నో మనం కాశే ల అవిర్భావాన్ని ఊహించగలిగే వారం కాము). ..విద్యా రంగం లో ముందు ఉండటం వలన కొందరు నాయకులు ఆవిర్భవించారు (సుందరయ్య, రాజేశ్వరరావ్). అక్కడి జమీందారులకి వ్యతిరేకం గా కొంత చైతన్యన్ని కల్పించారు. ఈ నాయకులకు సపోర్టర్సూ, అభిమానులూ తయారయ్యారు. కానీ వీరిలోకి నాయకుల గుణ గణాలూ అవగాహనా ఇంకలేదు.

    మెచ్చుకోండి

  24. *నాలుగు పటాలాల తెల్ల సైన్యానికి తూర్పు భారతమంతా పాదాక్రాంతమెందుకయింది? అయిందంటే అది మన తక్కువ తనమే కదా? *

    సీతారాం,
    దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కనీసం ఒక అరడజను (500 పేజిల ) పుస్తకాలపైన చదివి ఉంటాను. ఈ పుస్తకాలు ఎన్నో చదివిన తరువాత నచ్చినవి, అథెంటిసిటి ఉన్నవని పించినవి. ఒక్క ముక్కలో వివరించి చెప్పటం కష్టం.

    *సమస్య అంతా విదేశీయుల వ్యవస్థలను మనం అవలంబించటం వలన వచ్చింది అంటున్నారేమో *

    నా ఉద్దేశం అది కాదు. పశ్చిమదేశాల వారు మనలను దోచుకొంట్టు వచ్చిన సంపదతో, అభివృద్ది చేసుకొన్న సైన్స్ టెక్నాలజిలను చూసుకొని, వారిని చాలా గొప్ప అభివృద్ది చెందిన వారిగా భావించుకొంట్టూ, మన దేశం పైన చేసిన విశ్లేషణలన్నిటిలో చాలా తప్పులున్నాయి. రెండోది వారి దేశాల చరిత్రే ప్రపంచ చరిత్ర అన్నట్లు సొల్లువాగుడు వాగుతారు. ఇప్పుడు చూడండి యురోప్ లో ఉన్న ఆర్ధిక సంక్షోబానికి వారు గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అని పేరు పెట్టారు. మన ఆసియా దేశాలను వాటిలో చేర్చారు. వాస్తవానికి ఇండియా లో పరిస్థితి ఈ గ్లోబల్ క్రైసిస్ వలన పెద్దగా ఎమీ ఏఫేక్ట్ కాలేదు.

    మెచ్చుకోండి

  25. జిల్లా మొత్తం గా అన దలుచుకొన్నపుడు విశ్లేషణ చెయ్యాలి కదా .

    సపోర్టర్సూ, అభిమానుల కు నాయకుల గుణ గణాలూ అవగాహనా లేవు అనడం నిజమే. వాటినే పరిస్థితులకు అన్వయిస్తున్నాను. అవి విద్య విజ్ఞాన స్థాయిలు కావచ్చు. పేదరికం కావచ్చు.

    పూర్తిగా స్వార్ధమే కానవసరం లేదు.

    మెచ్చుకోండి

  26. ప్రవీణ్,

    మీరు కోట్ చేసినవి బొందలపాటి గారి మాటలు. నావి కాదు. స్వల్ప మార్పులను గొప్ప ప్రగతి అనుకోవడం నిజమే.

    ఇక ఈ కట్నాలు, సంపాదనస్థాయిల పోలిక కు సప్లై ,డిమాండ్ సూత్రం వర్తిస్తుంది. డబ్బు లేక పొతే అన్న భయం జనాన్ని కట్టి పడేస్తుంది కదా. పురుషాధిక్యత కు, ఈ సమస్య కు సంబంధం ఉందేమో తెలిదు .

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి