రచయిత గా నేను అందుకొన్న మొదటి..

రచయిత గా నేను అందుకొన్న మొదటి..పారితోషికం.

ఓ మూడు నెలల కిందట కినిగే కిరణ్ గారి నుంచీ ఓ మెయిల్ వచ్చింది.. “మీరు కినిగె లో పెట్టిన పుస్తకానికి వచ్చిన పారితోషికాన్ని మీ అకౌంటు కు ట్రాన్స్-ఫర్ చేయాలి. మీ  బాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి “, అని. కినిగే లో నా పుస్తకం “ఒక తెలుగు సాఫ్ట్-వేర్ ఇంజినీర్ కథ”, ని పెట్టినపుడు  ఆ పుస్తకం అమ్ముడు పోగా వచ్చిన సొమ్ము లో నాకు కూడా కొంత వస్తుందని తెలిసింది. కానీ నేను దానిని సీరియస్ గా తీసుకోలేదు. వెంటనే మరచి పోయాను.
అంతకు ఓ ఆరునెలల ముందు, నాగార్జునాచారి గారి సలహా మీద రహమానుద్దీన్ గారిని సంప్రదిస్తే “స్వయం ప్రకాశకమైన” పుస్తకాలను అప్పుడప్పుడే కినిగె లో అనుమతిస్తున్నాము. మీ పుస్తకాన్ని పంపించండి” అని చెప్పారు.
నేను ఎలానో కుస్తీపట్టి ఒక “పీడీ ఎఫ్” డాక్యుమెంట్ చేసి పంపిస్తే, కిరణ్ గారు వెంటనే కొన్ని సలహాలతో స్పందించారు. తరువాత ప్రతిని సరి చేసి పంపాను. పుస్తకాన్ని కినిగె లోకి ఎక్కించిన తరువాత దానిని గురించి మరిచే పోయాను.
కిరణ్ గారి నుంచీ వచ్చిన మెయిల్ చూసి చాలా సంతోషమయింది. “పరవాలేదు, పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ చాకిరీ చేసే ఉద్యోగాలలోనే కాకుండా, మనం మిగిలిన పనులు చేసినా కొద్దో గొప్పో రూకలు రాలతాయన్న మాట”, అంపించింది.
రచయితలు తమ పుస్తకాలను తామే డబ్బులు పెట్టి , చేతి చమురు కొంత వదుల్చుకొని , పంచిపెట్టవలసిన ఈ తెలుగు దేశం లో, “పక్కింటావిడ తో కబుర్లు చెప్పటం వలన డబ్బులు వస్తే మావిడకి ఎంత సంతోషం వస్తుందో”,”ఉబుసుపోక పుస్తకం రాసి, దాని వలన డబ్బులు కూడా రావటం”, నాకు అంతే సంతోషాన్ని ఇచ్చింది.

“సరే, ఒక ముచ్చట తీరిపోయింది”, అనుకొన్నా! మనమేమైనా పేరు గన్న చేయి తిరిగిన రచయితలమా? పాడా?! నేను మొట్ట మొదట గిలికిన పుస్తకమే ఈ సాఫ్ట్-వేర్ కథ.
కానీ ఈ ముచ్చట మూణ్ణాళ్ళది కాదు. మరోసారి కూడా తీరింది. మళ్ళీ ఓ మూడునెలలోనే ఇంకొక విడత డబ్బు బట్వాడా అయింది. అంతకు ముందు కంటె ఎక్కువ గా.
ఇంటర్నెట్ వినియోగం ఆంధ్ర దేశం లో పెరగబోతోంది. తెలుగు చదవటాన్ని  కుర్ర తరాలకు అలవాటు చేయగలిగితే, నిస్సందేహం గా ఇంటర్నెట్ పబ్లిషింగ్ కి తెలుగు లో భవిష్యత్తు ఉంటుంది. ఒక సారి పెట్టిన పుస్తకాన్ని ఎన్ని కాపీలయినా విక్రయించవచ్చు (కాపీలని కొన్న వారు వాటిని ఎంతమంది తో అయినా పంచుకోవచ్చుననుకోండి!)
తెలుగు లో రచనలు చేయటం ద్వారా ఈ రోజుల్లో జీవితాన్ని గడపలేమనే విషయం తెలిసినదే. కానీ మీరు అందులో వెచ్చించిన సమయానికీ శ్రమకూ కొద్దిగానైనా సాఫల్యత చేకూరాలంటే మీరు కూడా మీ పుస్తకాన్ని కినిగె లో పెట్టి చూడవచ్చు.

మొదట్లో పుస్తకం పెట్టి మరిచిపోయిన నేను, ఈ మధ్య నా కినిగే అకవుంట్ ప్రతి రోజూ చూసుకొంటున్నాను, “ఈ రోజు ఎవరైనా పుస్తకం కొన్నారా?”, అని.  కొంతమంది టైంపాస్ కి  ఏ రోజు కారోజు పేపర్లో తమ షేర్ విలువను చూసుకొన్నట్లుగా, ఇది ఒక  మంచి కాలక్షేపమే!

PS:  ఈ నా పుస్తకానికి పరిచయం రాసిపెట్టమని రాజశేఖర రాజు గారిని వేడుకొన్నాను,..నా వేడుకోలు ఎప్పటికి ఫలియించునో ఏమో!

18 thoughts on “రచయిత గా నేను అందుకొన్న మొదటి..”

  1. “పక్కింటావిడ తో కబుర్లు చెప్పటం వలన డబ్బులు వస్తే మావిడకి ఎంత సంతోషం వస్తుందో”

    🙂 congrats..

    మీ బ్లాగ్ లో కొంత చదివినట్లు గుర్తు. సాఫ్ట్ వేర్ వుద్యోగాలు అంటే డబ్బులే కాక బోలెడన్ని సమస్యలు కుడా ఉంటాయని తల్లి దండ్రులకి తెలియాలంటే మీ పుస్తకం చదవాలి కాబట్టి. అచ్చు వేయించండి 🙂

    మెచ్చుకోండి

  2. (కాపీలని కొన్న వారు వాటిని ఎంతమంది తో అయినా పంచుకోవచ్చుననుకోండి!) -e-book కినిగె లో ఉంచితే, కొన్నవారు, దానిని ఇతరులతో పంచుకోవటం సాధ్యం కాదు. ఎవరైనా పంచగలిగారా?

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి