తెలుగు భాష ఎందుకు అంతరించిపోబోతోంది?

తెలుగు భాష – RIP

—————————————————————————————————————–

ఓ టీవీ చానల్ లో ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు ఎంత సేపు మాట్లాడగలరు అనే విషయం పై ఓ పోటీ జరుగుతోంది.
అందులో ఏ ఒక్కరు కూడా పట్టుమని పది సెకండ్లు కూడ మాట్లాడ లేకపోయారు.
ఆ ప్రోగ్రాం చూసి ఓ ఇద్దరు మిత్రులు చర్చించుకొంటున్నారు:
రామాయ్: పరిస్థితి ఈ రకం గా ఉంటే కొన్నాళ్ళ కి తెలుగు భాష అంతరిచిపోతుందేమో అని భయం గా ఉంది.
కిట్టాయ్: ఏమీ దిగులు అవసరం లేదు. పరిణామమనేది అన్ని భాషలకూ సహజం. ఒక భాష అనేది ఇతర భాషలలోని పదాలను కలుపుకొని పోతే నే ఆ భాష పరిపుష్టమౌతుంది.ఇంగ్లీషుని చూడ రాదూ, ప్రపంచం లోని అన్ని భాషల పదాలనూ తన లో కలుపుకొని ఎలా వృధ్ధి చెందినదో!  ఓ విధం గా చూస్తే ఇతర భాషల లో ని పదాలు చేర్చుకొనని భాష మృత భాష అవుతుంది. అది వాడుకలోంచీ పోతుంది.
రామాయ్: కిట్టాయ్, నువ్వు చెప్పే విషయాలన్నీ నిజమే!  కానీ, అవేమీ తెలుగు కి వర్తించవు. ఇంగ్లీషు భాష ప్రపంచాన్నేలే క్రమం లో కొన్ని ఇతర భాషల పదాలను కలుపుకొని పరిపుష్టమయింది. కానీ తెలుగు భాష ప్రపంచాన్ని ఏలటం లేదు. అధికారం డబ్బు ల ప్రవాహం వలన తెలుగు భాష విస్మరించబడుతోంది.
ఒక భాష వృధ్ధిలో కి వచ్చే క్రమం ఇలా ఉంటుంది:
1. మొదట కొద్ది మంది మాట్లాడే నోటి భాష గా మొదలవుతుంది.
2. తరువాత పరిధి విస్తృతమై, జనాల ఆలోచనలలో ఆ భాష కు భాగం ఏర్పడుతుంది. ఈ స్థితి లో అలిఖిత మైన పాటలూ, కథలూ సృష్టించబడతాయి.
3. ఆ పై ఆ భాష అక్షర బధ్ధమై, ఆ భాష లో లిఖిత వాంజ్మయం సృష్టించబడుతుంది.
4. శాస్త్ర సాంకేతికాలలో ఆ భాష స్థానం సంపాదించుతుంది.
5. ఇతర భాషలను ప్రభావితం చేసి, తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది.
6. ఆ భాష సమాజం లోని ప్రజల రోజు వారీ మనుగడకి అవసరం కాబట్టీ, దీర్ఘ కాలం వర్ధిల్లుతుంది.
తెలుగు భాష కు పైన చెప్పిన ఐదో పాయింట్ వర్తించదు కాక వర్తించదు. ఇంగ్లీషు భాష ను తెలుగు కలుపుకొని పోవటం లేదు. ఇంగ్లీషు భాషా ప్రవాహం లో తెలుగు కొట్టుకొని పోతోంది.
అదే ఇంగ్లీషు భాషని తీసుకొంటే పైన చెప్పిన 5,6 స్టేజీ ల లో ఉన్నట్లు స్పష్టమౌతోంది.

ఇక, ఓ భాష అంతరించిపోబోయే క్రమం పైన చెప్పిన క్రమానికి సరిగ్గా వ్యతిరేకం గా  ఇలా ఉంటుంది.
1. మొదట ఆ భాష ను ఉపయోగించి మనుగడ సాగించటం కష్టమౌతుంది.
2. ఆ భాషను వదిలి మనుగడ కోసం వేరే భాషల ను నేర్చుకొనటం వలన, వేరే భాషల అజమాయిషీ ఆ భాష పై ఎక్కువవుతుంది.
3. నెమ్మది గా శాస్త్ర సాంకేతికాల నుంచీ ఆ భాష కనుమరుగౌతుంది.
4. ఆ భాష లో ఉండే సాహిత్యాదులు దిగ నాసిల్లటం మొదలౌతుంది.
5. జనాలు ఆ భాషను వదిలి, ఆలోచన చేయటానికి కూడా ఇతర భాషలను ఆశ్రయిస్తారు.
6. ఆ భాషలో రాయటం అంతరిస్తుంది.
7. ఆ భాషని చదవటం, ఆ తరువాత మాట్లాడటం మానేస్తారు.

తెలుగు, మొదట చెప్పిన ఆరు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా, లేక తరువాత చెప్పిన ఏడు పాయింట్ల క్రమాన్నీ అనుసరిస్తోందా?   తరువాతి ఏడు పాయింట్ల క్రమాన్ని అనుసరిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే తెలుగు అంతరించిపోయే దిశ లో అడుగులేస్తోందన్న మాట.అంతరించటం ఖాయం, “ఎప్పుడు అంతరిస్తుంది?” అన్నదే ప్రశ్న. అన్ని భాషలూ, పది వేల ఏళ్ళ కో, నలభై వేల ఏళ్ళ కో, ఎప్పుడో అప్పుడు అంతరించేవే. కానీ, తెలుగు, సమీప భవిష్యత్తులోనే అంతరించబోతోంది.
ప్రస్తుతానికి యువ తరం లో చాలా మందికి తెలుగు లో రాయటం రాదు. ఇంకొంతమందికి చదవటం రాదు, ఇంగ్లీషు పదాలు లేకుండా మాట్లాడటం రాదు. పట్నాలలో ఉండే చాలా మంది ఆలోచించటం కూడా ఇంగ్లీషులోనే చేస్తున్నారు. తెలుగు భాషలో గత కొన్ని దశాబ్దాలు గా వచ్చిన గొప్ప రచనలు కనపడటం లేదు.  ఇక ముందు పరిస్థితి ఇంకా దిగజారబోతోంది అని తెలుస్తూనే ఉంది. తెలుగు భాషా, సంస్కృతీ ప్రమాణాలు నానాటికీ దిగజారే దిశలోనే వెళ్తున్నాయి. అదే ఆంగ్ల భాష ని తీసుకొంటే, ఆ భాషలో ఇంకా ముందు ముందు ఆధునిక సాహిత్యమూ, సాంకేతిక గ్రంధాలూ వెలువడతాయని చెప్ప వచ్చు. ప్రపంచం లో ఇంకా ఎక్కువ మంది ఆ భాషని నేర్చుకోబోతున్నారని చెప్పవచ్చు. తెలుగు భాష గురించి అలా చెప్ప గలమా? తెలుగు భాష పైన చెప్పిన 7 వ పాయింట్ దిశ గా వేగం గా అడుగులు వేస్తోంది. ఈ స్థితి ని “పైన చెప్పిన ఏడు పాయింట్లకీ పైన ఉన్న”, ఆరు పాయింట్ల లో, ఐదవ పాయింట్(తాను ఇతర భాషల నుంచీ పరిపుష్టమౌతుంది) తో పొరపడటం, భ్రమల లో కాలం గడపటమే! తెలుగు ఇంగ్లీషుని కలుపుకొని పరిపుష్టమౌతోందనుకోవటం, మధ్య తరగతి ఉష్ట్ర పక్షులు తమ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి చేసుకొనే ఓ ఆత్మ వంచన మాత్రమే. వాస్తవాన్ని ఎదుర్కొనటానికి ఒప్పుకోని ఒక  బాధ్యతానిరాకరణ మాత్రమే!
కిట్టాయ్: బాగా పొడుగుగానే ఉపన్యాసం ఇచ్చావు కానీ, ఇంతకీ తెలుగు భాష అంతరించకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో నువ్వే చెప్పు.
రామాయ్: భాష అంతరించటం లేక వృధ్ధి చెందటం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఒక భాషని, అది మాట్లాడే జనాల మద్దతు లేకుండా బలవంతం గా బ్రతికించటం చాలా కష్టం. ప్రయాణాన్ని మొదటి అడుగుతో మొదలు పెట్టినట్లే, రిపేరీ ని కూడా పైన చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిదైన మనుగడ తో మొదలుపెట్టాలి. ఓ భాష మాట్లాడటం వలన మనిషి మనుగడ పెరిగితే ఆ భాష వృధ్ధి మొదలౌతుంది. ప్రభుత్వాలు ఆ దిశలో చట్టా లు చేయాలి. మేక మీదికి లంఘించిన పులిలా ఇతర భాషలను తింటున్న పరాయి భాష (English)ని నిషేధించాలి.ఇది మరీ “అతి” అనవద్దు. తీవ్రమైన పరిస్థితులలో తీవ్రమైన పరిష్కారాలే అవసరమౌతాయి.   ఇతర భాషలను నేర్చుకోవటాన్ని నిషేధించకపోయినా, వ్యవహారం లో వాటి వాడకాన్ని నిషేధించాలి.తెలుగు భాషలోని ఆంగ్ల పదాలను నెమ్మది గా ఏరి వేయాలి.  ఎందుకంటే పరిస్తితి చాలా తీవ్రం గా ఉంది. నిషేధా నికి తక్కువైన ఏ చర్య ను ఐనా  సమర్ధించే ప్రజల, ప్రభుత్వాల (మన భాషను నిలబెట్టటం లో ఉన్న) చిత్తశుధ్ధిని శంకించాల్సి వస్తుంది. లేక వారివి పై పై కాలక్షేపపు మాటలు అనుకోవలసి వస్తుంది.  లేక అర్ధం లేని అమాయకపు ఆశావాదం అనుకోవాల్సి వస్తుంది.  ఇంకా మన పిల్లల ను విధి గా  తెలుగు మాధ్యమం లో చదివించాలి.

కిట్టాయ్: మరి ఒకప్పుడు సంస్కృతం కూడా, ఇప్పటి ఇంగ్లీషులా తెలుగు ని ప్రభావితం చేసినదే కదా? అలానే ఉర్దూ…. ఏ భాష అధికారం లో ఉంటే ఆ భాష ప్రభావం సహజం అనుకొంటా.
రామాయ్: సంస్కృతం వంటి భాషలు, ఇంగ్లీషులా, ఎప్పుడూ ఎక్కడా బజార్లలో వాడబడలేదు.సంస్కృతం, ఉర్దూ భాషల ప్రభావం ఉన్నా, జనాలెపుడూ ఆయా భాషలలో ఆలోచించలేదు.  కానీ, ఈ రోజు అనేక మంది పట్నపు జనాలు ఇంగ్లీషులోనే ఆలోచిస్తున్నారు. వారికి తెలుగు లో ఆలోచించటం రాదు. ఓ భాష చనిపోవటానికి ఇది ముఖ్యమైన ముందు శకునం.
కిట్టాయ్: మొత్తానికి తెలుగు భాషని బతికించాలని పెద్ద పెద్ద కలలే కంటున్నావు, ప్రభుత్వ బళ్ళ లోనే ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతూ ఉంటే, ఇంకా ఇవన్నీ అయ్యే పనులేనా? ఆ..ఈ తెలుగు  ఛానల్ మార్చి,  స్టార్ టీవీ పెట్టు “బోల్డ్ అండ్ బ్యూటిఫుల్” వస్తుంది.

తా.క. :  ఈ టపా నేనే రాసిన ఓ ఇంగ్లీషు వ్యాసాన్ని నేనే తెలుగు లోకి అనువాదం చేసుకోలేని స్థితి లో నాలో నాపై కలిగిన ఓ ఆక్రోశానికి ఫలితం.

ప్రకటనలు

18 thoughts on “తెలుగు భాష ఎందుకు అంతరించిపోబోతోంది?

 1. అనువాదం ఒక విశేషిత నైపుణ్యం. రెండుభాషలు తెలిసినంత మాత్రాన ఒకదానిలోంచి ఇంకోదాన్లోకి అందఱూ అనువాదం చేయలేరు. దానికి ఆక్రోశం అవసరం లేదు.

  ఇహపోతే తెలుగుభాషకొచ్చిన ముప్పేమీ లేదు. కోట్లాది జనాభాలు గల భాషలు నశించడం అసంభవం. మీరు చెబుతున్న “ఇంగ్లీషులో ఆలోచించడం” లాంటిది అన్ని bi-lingual సమాజాల్లోనూ ఉంది. తెలుగువాళ్ళకొకళ్ళకే పరిమితం కాదు. Bi-lingual సమాజాల్లో రెండూ బతుకుతాయి. ఏదో ఒకటి పోవడం జఱగదు. మీరు వ్రాసిన పాయింట్ల వారీ క్రమం మీరు వర్తమానాన్ని చూసి ఏర్పఱచుకున్న ఊహే తప్ప చారిత్రికంగా నిరూపితమైనది కాదు. ఈ మాత్రం తెలుగుభాషానిరక్షరాస్యులు అన్ని శతాబ్దాల్లోనూ ఉన్నారు. వాస్తవానికి నూటికి 97 శాతం మంది వాళ్ళే గతంలో ! ఇప్పటికీ కోటిమంది పిల్లలు తెలుగుని ఒక సబ్జెక్టుగా పదేళ్ళపాటు చదువుతున్నారు Languages have an existence beyond education and official policies. కాశ్మీరీ భాషని కాశ్మీర్ లో ఇళ్ళలోనే తప్ప ఇంకెక్కడా వాడరు. బోధన, పరిపాలన అంతా ఉర్దూలోనే. అయినా ఆ భాష బతుకుతూనే ఉంది. కాశ్మీరీ కంటే మఱీ తీసిపోలేదు తెలుగు.

  ఇహపోతే, తీవ్రపరిస్థితులకి తీవ్రపరిష్కారాలే శరణ్యం అని ఒప్పుకుంటాను.

  మెచ్చుకోండి

  1. తాడేపల్లి గారు,
   “మీరు వ్రాసిన పాయింట్ల వారీ క్రమం మీరు వర్తమానాన్ని చూసి ఏర్పఱచుకున్న ఊహే తప్ప చారిత్రికంగా నిరూపితమైనది కాదు. ”
   నిరూపితం కాకపోతే నాకు చాల సంతోషం.అలానే అనువాదం కుదరక పోవటం నా వ్యక్తిగత లోపమైతే, (మన ఉమ్మడి లోపానికి ఒక సూచిక కాకపోతే) నాకు సంతోషమే!కానీ అంతరించదు అని నిరూపితమైనదా? ఎందుకంటే, కోట్లమంది ఒకప్పుడు మాట్లాడిన భాషలు కొన్ని అంతరించిపోయాయి కదా? ఇంగ్లీషు లో ఆలోచించటం అనేది, తెలుగులో ఆలోచించటం తో పోలిస్తే, తెలుగు వాడకం తగ్గిన ఓ స్థితి ని తెలియజేస్తోంది కదా?
   “ఈ మాత్రం తెలుగుభాషానిరక్షరాస్యులు అన్ని శతాబ్దాల్లోనూ ఉన్నారు. వాస్తవానికి నూటికి 97 శాతం మంది వాళ్ళే గతంలో !” — ఇది నిజమా? కొంచెం వివరిస్తారా?

   మెచ్చుకోండి

 2. తెలుగు భాష అంతరించదు కానీ తెలుగు-ఇంగ్లిష్ కలిసిన సంకర భాష ఏర్పడుతుంది, అంతే. మనవాళ్ళకి ఇంగ్లిష్ ఏమాత్రం వచ్చని తెలుగు చచ్చిపోతుందనుకోవాలి? చదువుకున్నవాళ్ళు మాట్లాడే సంకర భాష కూడా సాధారణ ప్రజలకి అర్థం కాదు. అందుకే నేను ఇంగ్లిష్, తెలుగు రెండు భాషలూ సరిగ్గా నేర్చుకోవాలని అనేది.

  మెచ్చుకోండి

   1. బొందలపాటి గారు, నేను ఒక ఉదాహరణ చెపుతాను. ఇంగ్లిష్‌లో తోడల్లుడు, తోటికోడలు అనే పదాలు నిజంగా లేవు. అయినా మనవాళ్ళు కో-బ్రదరు, కో-సిస్టరు అనే పదాలు ఎందుకు కనిపెట్టినట్టు? ఇంగ్లిష్ సరిగ్గా రాకే కదా ఇంగ్లిష్‌వాళ్ళకి అర్థం కాని ఆ పదాలు కనిపెట్టారు. ఇటువంటి పరిస్థితిలో ఇంగ్లిష్ వల్ల తెలుగు చావదు కానీ “అటు తెలుగువాళ్ళకి & ఇంగ్లిష్‌వాళ్ళకి గానీ అర్థం కాని” కొత్త సంకర భాష పుడుతుంది. కోస్తా ఆంధ్రలో రెల్లి అనే భాష ఉంది. ఆ భాష ఒడియా-తెలుగు పదాలు కలిసిన సంకర భాష. ఆ భాష అటు ఒడియావాళ్ళకీ అర్థం కాదు, ఇటు తెలుగువాళ్ళకీ అర్థం కాదు. తెలుగు-ఇంగ్లిష్ కలిసిన సంకర భాష ఏర్పడినా ఆ కొత్త భాష రెండు భాషలూ కరెక్ట్‌గా వచ్చినవాళ్ళకి అర్థం కాదు.

    మెచ్చుకోండి

 3. మన పూర్వసమాజంలో 8 శాతం జనాభా గల ద్విజకులాలకి తప్ప మిగతావారికి అక్షరాలు రావు. ఆ అగ్రకులాల్లో కూడా స్త్రీలకు చదువు రాదు.

  నాకు తెలిసి ఇంగ్లీషుమీడియమ్ లో చదువుకున్నవాళ్లు కూడా తెలుగులోనే ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాల్లో చేఱి ఇంగ్లీషు వాడకతప్పని నిర్బంధాన్ని రుద్దబడ్డ మిడిల్ మేనేజిమెంట్ కేటగరీ మాత్రమే ఇంగ్లీషులో ఆలోచించడం అలవాటు చేసుకుంటున్నారు. ఆ స్థానాల్లో ఉన్నవాళ్ళ విషయంలో ఆంగ్ల భాషానైపుణ్యమే ఉద్యోగ నిర్వహణా సమర్థతగా భ్రమించబడుతోంది. కానీ ఓవరాల్ జనాభాలో వాళ్ళ సంఖ్య 1% కూడా లేరు.

  మెచ్చుకోండి

  1. “..ఆ స్థానాల్లో ఉన్నవాళ్ళ విషయంలో ఆంగ్ల భాషానైపుణ్యమే ఉద్యోగ నిర్వహణా సమర్థతగా భ్రమించబడుతోంది.”
   స్వంత భాషని గురించి గర్వించే వాడెవడూ అలా భ్రమించడు. స్వంత భాష గురించిన ప్రైడ్ ని కలిగించటం ద్వారా కూడా ఈ దిగజారుడు ని అరికట్టవచ్చును.

   మెచ్చుకోండి

 4. భాష కూడా పరిణామ వాదానిక అతీతమైనిది కాదు, మనం ఉపయోగంచేది తెలుగేనా… అంటే వందేళ్ల క్రితం వారు ఒప్పుకోరేమో…ఇంకో వందేళ్ల తరువాతది తెలుగంటే మనం ఒప్పుకోమేమో…
  అంతరించడమో….అభివృధ్దో……అర్థం చేసుకోవడంలోనే వుందేమో అసలు కిటుకు…..

  మెచ్చుకోండి

  1. @the tree gaaru,
   ఇదే పరిస్థితి(పరిణామం) ఇంగ్లీషు విషయం లో కూడా ఉంది. కానీ ఇంగ్లీషు అంతరించిపోతుందని ఎవరూ ఆందోళన చెందరు కదా?
   ఎందుకంటే తెలుగు పదాలు ఇంగ్లీషు భాషని ని కప్పిపెట్టటమెన్నటికీ జరగదు. స్థానికత ని బట్టి, ఆనైకట్, పిట్ట ఇలా.. కొన్ని పదాలు మాత్రం తెలుగు నుంచీ ఇంగ్లీషులోకి చేరాయి.
   తెలుగు కి ఇంగ్లీషు ఒక ఊత కర్రలాంటిదైతే, ఇంగ్లీషుకి తెలుగు ఒక వాకింగ్ స్టిక్ లాంటిది. ఇంగ్లీషు పదాలు లేకుండా తెలుగు నడవని పరిస్థితి.

   మెచ్చుకోండి

 5. స్థూలమైన చారిత్రక, భౌగోళిక మార్పుల వలన ఒక భాష అనేక భాషలు గా చీలికలవ్వతం, అలానే అనేక భాషలు కలిసి ఓ భాషగా ఏర్పడటం జరుగుతూనే ఉంటుంది. ఓ భాషతో ఓ స్వఛ్ఛతా స్థాయి లో అనుబంధం ఏర్పరచుకొన్న వారికి, కాలక్రమం లో ఆ భాష ఆ స్వఛ్ఛతా స్థాయి కి దూరమవ్వటం నచ్చకపోవచ్చు. దీని వలననే భాష అంతరించటం గురించిన అనేక భయాలు తలెత్తుతాయి.
  ఏ భాషలో అయినా కాలాన్ని బట్టి కొన్నిపదాల వాడకం తగ్గిపోతుంది. ఈ సాంకేతిక యుగం లో, వ్యవసాయానికి సంబంధించిన, వడ్రంగం వంటి కులవృత్తులకు సంబంధించిన పదాలు చాలా కనుమరుగౌతున్నాయి.

  మెచ్చుకోండి

 6. తెలుగు భాష ఇప్పుడప్పుడే చచ్చి పోదు. మీరు నిశ్చింత గాఉండండి. ఒక ప్రాంతీయ భాష అయిన తెలుగును ప్రపంచ భాష అయిన ఆంగ్లంతో సరి పోల్చి చూడడమే పెద్ద తప్పు.తెలుగులో ఉన్న ఆంగ్ల పదాలన్నిటిని మొదట ఏరి పారేయాలన్న మీ ఆలోచనే తప్పు.అప్పుడు మిగిలిన తెలుగు నెవ్వడూ మాట్లాడక అది తప్పకుండా మృత భాష అవుతుంది.అయినా ఇది జరగని పని కనుక నాకు భయం లేదు.మన రాష్ట్ర్రంలో ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటారు. వారంతా ఎన్నేళ్లయినా ఇంగ్లీషు పదాలు కలసినదే కావచ్చు, తెలుగే మాట్లాడతారు.ఒక వేళ తెలుగు అంతరించే పరిస్థితే వస్తే మీ నిషేధాలూ ప్రభుత్వ చట్టాలూ దానిని బ్రతికించ లేవు.తెలుగు భాష లోని అంగ్ల పదాలని పరిహరించాలంటున్న మీ రామాయ్ మాటల్లోనే రిపేరీ (Repair) స్టేజీ( Stage) పాయింట్లు ( Points) వంటి ఆంగ్ల పదాలు ఉన్నాయి.ఇదే మీ వాదన లోని డొల్లతనాన్నిచూపిస్తుంది.తెలుగు కేమీ కాదు. భయపడి మీరు గాని ఎవరు గాని చేయగలిగిందీ ఏమీ లేదు.నిశ్చింత గా నిద్రించండి..

  మెచ్చుకోండి

  1. “మీ రామాయ్ మాటల్లోనే రిపేరీ (Repair) స్టేజీ( Stage) పాయింట్లు ( Points) వంటి ఆంగ్ల పదాలు ఉన్నాయి.ఇదే మీ వాదన లోని డొల్లతనాన్నిచూపిస్తుంది.”

   ఇది నా వాదనని బలపరుస్తుందనుకొంటున్నాను. రామాయ్ గానీ నేను గానీ ఈ బలహెనత కు అతీతం కాదు . నేను స్వయం గా ఇంగ్లీషు లేకుండా రాయలేకపోవటం పై అసంతృప్తి తో ఈ టపా రాశాను. నేను చేయలేని పనిని ఇతరులను ఎలా చేయమని చెప్తారంటారా? మనమందరం కలిసి చెయ్యాలి.
   “..అప్పుడు మిగిలిన తెలుగు నెవ్వడూ మాట్లాడక అది తప్పకుండా మృత భాష అవుతుంది.”
   ప్రత్యామ్నాయ పదాలను సృష్టించి వాటిని వాడకం లోకి తేగలిగితే, అప్పుడు మృత భాష అవ్వదు.అలానే స్వభాషా మాధ్యమం లో సాంకేతిక శాస్త్ర విధ్యబోధన జరగాలి. నేను మన హైదరాబాదంత జనాభాకలిగిన ఒక ఐరోపా దేశం లో ఉన్నాను. అక్కడి ప్రజలు ఇంగ్లీషును బడి లో నేర్చుకొంటారు. కానీ వారు తమ భాష మాట్లడేటపుడు అతి తక్కువ ఇంగ్లీషు పదాలను వాడతారు. వారు సైన్స్ , టెక్నాలజీ ల ను తమ భాషా మధ్యమం లోనే నేర్చుకొంటారు.

   “ఒక వేళ తెలుగు అంతరించే పరిస్థితే వస్తే మీ నిషేధాలూ ప్రభుత్వ చట్టాలూ దానిని బ్రతికించ లేవు.”
   స్థూలం గా మీరు చెప్పేది, “జరగాల్సిందేదో జరుగుతుంది, మనం చేయగలిగిందేమీ లేదు”, అని. అలా అయితే మీతో వాదించను.

   మెచ్చుకోండి

 7. ”సంస్కృతం వంటి భాషలు, ఇంగ్లీషులా, ఎప్పుడూ ఎక్కడా బజార్లలో వాడబడలేదు.సంస్కృతం, ఉర్దూ భాషల ప్రభావం ఉన్నా, జనాలెపుడూ ఆయా భాషలలో ఆలోచించలేదు. కానీ, ఈ రోజు అనేక మంది పట్నపు జనాలు ఇంగ్లీషులోనే ఆలోచిస్తున్నారు. వారికి తెలుగు లో ఆలోచించటం రాదు.” — తెలుగు ఎన్నాళ్ళు బతుకుతుందో తెలీదు కానీ… ఈ వాక్యం మాత్రం నిజంగా నిజం.

  మెచ్చుకోండి

 8. నేను మీ రామాయ్ మాటల్లో ఇంగ్లీషు పదాల్ని చూపించడానిక్కారణం–భాషసంకరమైపోతోందని ఆవేదన తో ఉన్న మీరే అలా వ్రాయాల్సి వస్తే అటువంటి ఆలోచనో బాధో లేని సామాన్య జనం అటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారని.” నేను చేయలేక పోతున్నాను కాని మనమందరం కలసి చేయాలి” అన్నారు. మన బ్లాగర్లందరం ఒక ఉద్యమం లాగా ఆంగ్ల భాషా పదాల్ని పరిహరించి కృతకమైన పదాల్ని తయారు చేసుకుని వ్రాసినా కూడా కోట్ల మంది జనసామాన్యం చేత ఆపని చేయించలేం.నిషేధాలూ చట్టాల వల్ల జన సామాన్యం చేత అచ్చతెలుగు మాట్లాడించ వచ్చని ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు.అయినా ఈ విషయం చర్చించడానికి Comments ద్వారా కుదరదు.పెద్ద పోస్టే వ్రాయాలి.ఇది వరకే నా బ్లాగు http://www.apuroopam.blogspot.com లో ఈ విషయమయి “మడిబట్ట కట్టి తెలుగును కాపాడుకోలేం” అనే పోస్టులో కొంత చర్చ చేసి ఉన్నాను.అవసరమనుకుంటే మరో పోస్టులో ఇంకా విశదీకరించగలను.ఒక్క మాట చెప్పి ముగిస్తాను.ఎప్పుడో మన భాషలో 80 శాతం సంస్కృత పదాలు, ఎన్నో పారశీక పదాలు హిందీ పదాలు వచ్చి చేరిపోయాయి. మన తాతలు మన పూర్వ కవులు వాటిని అక్కున చేర్చుకుని కవిత్వంలో కూడా వాడుకున్నారు. భ్రమలు వీడి వాస్తవాన్ని అంగీకరించడం తప్ప చేయగలిగిందేమీ లేదు.ఇది నా అభిప్రాయం మాత్రమే.

  మెచ్చుకోండి

 9. బలవంతుల నుంచీ బలహీనులను రక్షించుకోవాలి, అందులోనూ బలహీనుడు మనవాడైనపుడు.
  తెలుగు మీడియం లో చదివే వారికి రిజర్వేషన్లూ, సరైన తెలుగు మాట్లాడే వారికి ఆదరణా ఉండాలి. సమాజం లోని పెద్దలు మంచి తెలుగు మాట్లాది తే, పిల్లలు వారిని అనుసరిస్తారు. కోనేరు హంపి, దువ్వూరి సుబ్బా రావు, మహేష్ బాబు, లక్ష్మణ్ వంటి సెలబ్రిటీలు మాట్లాదే టపుడు,ఆటే ఇంగ్లీషు ఉపయోగించకుండా మాట్లాడితే మామూలు యువతరం కూడా అలానే మాట్లాదుతుంది.
  అలానే తెలుగు ను వ్యాపారీకరణ లో భాగం గా చేయటం. ఉదాహరణకి తెలుగు రాసిన టీ షర్టులు మార్కెట్ లోకి వదలటం. టీ షర్ట్లు ఉత్పత్తి చేయగలిగేంత తెలుగు దేశం అభివృధ్ధి చెందింది కదా? తెలుగు సినిమా పేర్లకి రాయితీలు ఇవ్వటం.
  మన మేధావులు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలకి తెలుగు పెఋలు పెట్టటం. ఉదాహరన కు హైదరాబాదు లో ఓ తెలుగు ఎంజినీర్ డిజైన్ చేసిన సెల్ ఫోన్ కి “పిచిక” అని పేరు పెట్టవచ్చు.
  నెమ్మది గా సాంకేతిక విద్య ను తెలుగీకరించతం (జపాన్ వళ్ళకి ఇంగీషు రాక పోయినా, జపనీస్ నేర్చుకొని మరీ, బహుళజాతి కంపెనీలు అక్కడ వ్యాపారం చేస్తాయి). అక్కడి ఉద్యోగులు జపనీస్ లోనే టెక్నికల్ డిస్కషన్లు చేస్తారు.
  నాకు బయటి రాష్ట్రాలకు వెళ్ళిన తెలుగు వారు అక్కడి భాష నేర్చుకొంటే ఆనందమే. అలానే ఇక్కడికి వచ్చిన బయతి వారు తెలుగు నేర్చుకొంటే తప్పు లేదు.
  యూరోపియన్లు భాష కోసం యుధ్ధాలు చేసి, భాష ప్రాతిపదిక మీద దేశాలను ఏర్పరచుకొన్నారు. అటువంటి దేశాలలో భాషను బ్రతికించుకోవటం చాల సులువవుతుంది. అందుకు తగ్గ పరిపాలన, రాజకీయ, ఆర్ధిక వ్యవస్థ అక్కడ ఉంటుంది. అటువంటి దేశాలలో స్థానికుల భాషా హక్కులకు దేశ సార్వభౌమత్వానికీ విడదీయలేని సంబంధం ఉంటుంది.
  మనం ప్రత్యేక దేశం కోరక పోయినా, మన ఆర్ధికాన్ని (మనుగడని) భాష తో ముడి పెట్టి, తెలుగు నేర్చుకోకుండా ఉన్న వారికి ఎక్కువ మూల్యం ఉండేటట్టు చూడాలి.
  ఇంగ్లీషు లెక్చరర్ తో పోలిస్తే తెలుగు అధ్యాపకుడికి వేగం గా ప్రమోషన్లు ఇవ్వండి, తెలుగు నేర్చొకొనేందుకు Demand పెరుగుతుంది. రాష్ట్ర ప్రభ్త్వోద్యోగాలకి(APPSC) ఇంగ్లీష్ మీడియం వారు అప్లై చేయకూడదని చెప్పండి, జనాలు తెలుగు వైపుకి చూడటం మొదలు పెడతారు. ప్రైవేత్ కంపెనీలకి లైసెన్సులూ, పర్మిట్లూ ఇచ్చే డిపార్ట్మెంట్లు తెలుగులోనే తమ కార్య కలాపాలను జరపాలని ఉత్తర్వులు ఇవ్వండి., ప్రైవేటు కంపెనీ లలో తెలుగు కి డిమాండ్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో స్థానిక భాష నేర్చుకొన్న వారి ఓ స్పెషల్ ఇంక్రిమెంట్ పారేయండి, తెలుగు వాడకం పెరుగుతుంది.

  మెచ్చుకోండి

 10. ఇండియాలో వచ్చే ఇంగ్లీష్ సినిమా చానల్స్ లో పాత్రలు బూతులు మాట్లాడితే వినపడకుండా సైలెంట్ చేస్తున్నారు. అలానే తెలుగు చానల్స్ లో ఒక లెవెల్ కంటే ఎక్కువ ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే ఆ మాట వరకూ సైలెంట్ చేయాలని రూల్ పెడితే సరి. యాంకరమ్మలూ, సెలబ్రిటీలూ అందరూ దారి లోకి వస్తారు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s