మనలో దాగున్న రేపిస్ట్

నాకు ఓ ఐదేళ్ళ వయసున్నపుడు, ఓ పల్లెటూరి సినిమా హాలు కి వెళ్ళే వాడిని. సినిమా లో, ఏ గిరిబాబో, సత్యనారాయణో హీరో గారి చెల్లిని రేప్ చెసే వాళ్ళు. రేప్ మొదలవ్వగానే హాల్ అంతా ఈలల తో మారు మోగేది. నాకు ఆ వయసు లో, జనాలు ఎందుకు ఈలలు వేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. పాపం విలన్ హీరోయిన్ ని ఆ విధం గా హింసిస్తుంటే, ఈలలు వేసే జనాల మీద కోపం వచ్చేది. అదే జనం,  క్లైమాక్స్ లో విలన్ ని హీరో గారు చితక కొడుతుంటే కూడా ఈలలు వేసే వారు.
సెక్స్ కి ముఖం వాచిన జనాలు అలా చేసే వారా?
ఇంకో సంఘటన. ఓ ఐదేళ్ళ తరువాత ఏదో పట్నం నుంచీ వచ్చిన ఒకావిడ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని వెళ్తోంది. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఆమె శీలం మీద కామెంట్ చేశారు. కానీ వారికి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం తెలియదు.ఆ సమాజం లో అలాంటి జాకెట్ మామూలు ఆడవారు వేసుకోవక పోవటం వలన ఆ కామెంట్ వచ్చిందా?
ఓ ఇరవై యేళ్ళ కిందట మన సమాజం లో వయసొచ్చిన ఆడ  మగ మధ్య స్నేహాలు ఉండేవి కావు. ఇప్పటికీ పల్లెలలో వారికి ఆడ మగా మధ్య “ప్రణయ సంబంధం కాని స్నేహమంటే”, ఏమిటో తెలియదు. వారికి అటువంటి స్నేహం గురించి వివరిస్తే intellectual గా అర్ధం చేసుకోగలరేమో , కానీ అటువంటి స్నేహం లోని భావోద్వేగాల కు వారు relate చేసుకోలేరు. అది వారి తప్పు కాదు.

ఆడ మగా మధ్య interaction తక్కువ గా ఉండటం, ఇంట్లో ఆడ వారు తక్కువ గా ఉండటం వంటి కారణాల వలన, మగ వాళ్ళ కు ఆడ వారి ఆలోచనలూ, భావోద్వేగాలూ తక్కువ గా తెలిసి, ఆడ వారిని సెక్స్ పరం గా objectify చేయటం జరుగుతుంది. మన సినిమాలు కూడా ఒక ఆడ మగా మధ్య సంబంధం లో ఉండే, “పరిచయం, స్నేహం, భావోద్వేగ సంబంధాలూ” మొదలైన స్థాయి లను వదిలి, నేరు గా తడి చీరల పాటలను చూపెట్టటం వలన, ఆడవారిని objectify చేయటం మరింత పెరుగుతుంది.

మిస్సమ్మ సినిమా కాలం నుంచీ కూడా హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. “ఆడ వారి మాటల కి అర్ధాలే వేరులే!”, అంటాడు. పాత కాలం లో స్త్రీల కి స్వాతంత్ర్యం లేనపుడు, మనసు లోని మాట పై కి నేరు గా వ్యక్తీకరించే వారు కాదేమో! కానీ నేడు ఓ ఆడ పిల్ల, “నో” అన్నదంటే, “కాదనే” అర్ధం. ఈ విషయాన్ని wishful thinking చేసే మగవాళ్ళ కు అర్ధమయ్యేలా చెప్పాలి.
రేప్ అనేది learned behavior అని ఈ మధ్య హిందూ లొ వచ్చిన ఈ ఆర్టికల్ చెప్తుంది:
http://www.thehindu.com/opinion/lead/the-danger-to-women-lurks-within-us/article4242142.ece?homepage=true

ఇది చాలా వరకూ కరక్ట్ కూడా. నేర్చుకొన్న ప్రవర్తనను సరిగ్గా educate చేయటం ద్వారా మార్చ వచ్చు. కానీ కొంతవరకూ రేప్ అనేది బయలాజికల్ గా సంక్రమించిన రోగం కూడా. అనేక జంతువులు రేప్ చేస్తాయి. అలానే కొందరి జీన్స్ లో హింసా, సెక్స్ ఎక్కువ గా ఉంటాయి. అలా అని రేప్ పాపం అలాంటి వారికి అంటకుండా పోదు. తాను బలవంతుడనని పక్క వాడిని కొడితే జైల్లో పెడతారు కదా!

మన దేశం లో “ఆడ మగా మధ్య interaction లేక పోవటం” రేప్ కి ఓ కారణం అయితే(మన దేశం లో ఆడపిల్లల తో మాట్లడ గలిగే సోషల్ స్కిల్ల్స్ ఉన్న మగ వాళ్ళు రేప్ కు తెగబడే అవకాశం తక్కువ), అమెరికా లాంటి దేశాలలో ఈ interaction ఎక్కువై, లవ్ లో రిజెక్ట్ కా బడ్డ వారు కూడా స్త్రీ ద్వేషులు గా మారి రేప్ లు చేస్తున్నారు. బూతు సినిమాలు చూసే వారి వలన కూడా రేప్ లు ఎక్కువవ్తాయని పాశ్చాత్య దేశాలలోని సర్వే లు బయటపెట్టాయి.ఏదేమైనా, ఈ విషయం లో సరైన ప్రవర్తన ఏమిటి (ఆడ మగా ఇరు వైపుల నుండీ) అనేదానికి విస్తృతమైన ప్రచారం కలిపించవలసిన అవసరం ఉంది. అలానే మీడియా, సినిమాలు ప్రచారం చేసే sexist myths లోని డొల్ల తనాన్ని బయట పెట్టాలి.

ఓ మగ వాడు, ఆడ వాళ్ళకి రేప్ గురించి జాగ్రత్తలు చెప్పటం లో ఓ ప్రమాదం ఉంది. ఆడ వారు ముందే అతని ఉద్దేశాలను అనుమానిస్తారు. నమ్మకం లేని చోట మంచి చెప్పినా చెడు అవుతుంది.అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.బహుశా అలాతప్పుపట్టటం, “తమ లో అంతర్లీనం గా ఉండే instincts ను రేపిస్టుల instincts తో ఇడెంటిఫై చేసుకోవటం వలన కూడా అవ్వవచ్చును”. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే విషయం లో మగ వారి స్వరం, ఆడ వారి శ్రేయోభిలాషులు గా ఉంటే పరవాలేదు. “నే చెప్పింది విన్నారా? ఇప్పుడు అనుభవించండి”, అనే విధం గా ఉన్నపుడే సమస్య. రేప్ జరిగిన పరిస్థితుల కి అతీతం గా రేప్ శిక్షార్హమే! అందులో సందేహం లేదు. అయితే రేప్ కి మరణ శిక్ష వేయాలా వద్దా అనేది, అనేక పరిస్థితులనూ, మోటివ్స్ నీ పరిగణన లోకి తీసుకొని నిర్ణయించాలి.
రోడ్ మీద పోయే జనాలలో అన్ని రకాల వారూ ఉంటారు. అందులో మూర్ఖులు ఓ రకం. యువత డేటింగ్ చేయవచ్చు. కానీ public display of affection ని తగ్గించటం మంచిది. ఏ పల్లెటూరి బైతో, “అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చూపించే playful behavior ని తన పై ఎందుకు చూపించదు?”, అనుకోవచ్చు. ఏ కరడు గట్టిన సాంప్రదాయ వాదికో వారి ప్రవర్తన చూసి ఒళ్ళు మండ వచ్చు. వారిలో ని విలువలు వారి లోని జంతుప్రవృత్తి  ని నియంత్రించినంత వరకూ పరవా లేదు. అలా కాకపోతే నే సమస్య. చేసే వెధవ పనుల పర్యవసానాన్ని గురించీ, చట్టమూ శిక్షల గురించీ ఆలోచించని మగవాళ్ళు చాలా మందే ఉంటారు. అందని ద్రాక్షల మీద కసి పెంచుకొనే వారు చాలామందే ఉంటారు. కసి అంటే గుర్తుకొచ్చింది, తెలుగు రొమాంటిక్ పాటలలో ఈ పదం చాలానే ఉపయోగిస్తారు. కానీ కసి అనే పదం లో హింస అనేది కూడా ఉందని ఆయా రచయితలకి తట్టిందో లేదో!

రేప్ ఎంత ఆటవికమో, జనాలు గుంపులు గుంపులు గా రోడ్ పైకి వచ్చి, రేపిస్టులని విచారణ లేకుండా ఉరి తీయాలనటం కూడా అంత ఆటవికమే. శిక్షించటానికి నిపుణులు ఉన్న న్యాయవ్యవస్థ ఉంది.వారే అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఈ విషయం లో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్య సరైనదైతే, ఆయన కొడుకు చేసిన వ్యాఖ్య దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ప్రజల ఆందోళన చాలా వరకూ సమర్ధించతగ్గదే! అలా అని ఆందోళన కారులంతా holy cows కాదు.తమ లోని అరాచకాత్వాన్ని బయట పెట్టటానికి ఈ సంఘటనను ఓ సాకు గా ఉపయోగించుకొనే వారూ, vested interests, భోగస్ స్త్రీ వాదులు,సమస్య ల కోసం కాసుకొని కూర్చునే వామ పక్ష వాదులూ కూడా ఉండవచ్చు. ఏదేమైనా, ఈ ఆందోళనల వలన ప్రభుత్వమూ, అది నియమించిన కమీషన్ సరైన ప్రతిపాదనల తో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

ఢిల్లీ ఘాతుకం లో మరణించిన ఆ యువతి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

ప్రకటనలు

బురదగుంట – రేప్ ప్రపంచం..

ఢిల్లీ రేప్ సంఘటన సమాజం లో కావలసిన కదలికనే తెచ్చింది. రేపిస్టులను శిక్షించాల్సిందే. బురదగుంటలొంచీ దోమ వచ్చి కుడితే వెంటనే చంపేస్తాం కదా! అయితే ఆ సంఘటన గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా, రాజకీయ ప్రముఖులను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.
ఆ బురద గుంత ఏర్పడటానికి ఓ ముఖ్య కారణమే ఈ మీడియా, సామాజిక ప్రముఖులు. రేప్ కి సంబంధించిన behavior patterns సమాజం లొ బలపడటానికి ఈ ప్రముఖులు కూడా ఓ కారణం.
ఈ బురద గుంట కి ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది?

తెలుగు లో “ఓలమ్మీ తిమ్మిరెక్కిందా? అని హీరోయిన్ పిల్ల పిర్ర మీద ఓటిచ్చినపుడు” దానితో మొదలైందేమో!

లేకపోతే,”లే లే లే..నా రాజా!” తో మొదలైందేమో! లేక ఇంకా ముందే మొదలైందేమో! నాకు తెలియదు.
“ఓ సీన్ లో ఆకతాయిల కు క్లాస్ పీకి, మరో ఐదు నిమిషాలలో హీరో గారు బూతు పాటలు పాడినపుడు”, ఈ బురద గుంట కంపు అందరికీ అలవాటైపోయి, వాసన గుర్తు తెలీటం లేదని తెలిసింది.
“హీరోయిన్ ని సినిమా మొత్తం, రేప్ చేయటం మినహా, అన్నిరకాల వేధింపులూ చేసిన హీరో గారు”, మాస్ రాజా అయినపుడు, ఈ గుంటకి జనామోదం కూడా లభించిందని తెలిసింది.

సినిమా ఫంక్షన్లలో,”అర్ధ నగ్న ఐటం డాన్సర్ చుట్టూ, పది మంది మగ డాన్సర్లు చొంగ కారుస్తుంటే”, వేదిక కింద కూర్చొన్న హీరో గారు నిర్వికారం గా చప్పట్లు కొడితే తెలిసింది, “మురుగు గుంట ఓ అభినందించవలసిన విషయం” అని

“సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు”, అని ఓ డైరెక్టర్ గారు బుకాయిస్తూంటే తెలిసింది, మురికి గుంట చాలా నిరపాయకరం అని. 

“దిగి దిగు నాగా..” వంటి పాటలు ప్రొడ్యూస్ చేసిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ద్లు లభించినపుడు, ఈ మురికి గుంటకి మానసరోవరం గా అధికారిక శాంక్షన్ కూడా వచ్చేసింది.

ముందు పేజీలలో తాము ఎడమపక్క పత్రికలమని కోడై కూసే పత్రికలు, వెనుక పేజీలలో సీ గ్రేడ్ సినిమా యాడ్స్ వేసుకొన్నపుడు, మురికి గుంట కంపు పూదోట కంపుని మింగేసింది.

మెరుగైన సమాజం కోసం పాటుపడే చానళ్ళు, బూతు సినిమాల పై ప్రత్యేక కార్య క్రమాలను ప్రసారం చేసినపుడు, మెరుగైన సమాజం బురద గుంట ఉండగానే వస్తుందని తెలిసింది.

“బూతుసినిమాలూ, సైట్లూ సాధారణమని”, డోకు భాష తార పిల్ల చెప్పినపుడు, “ఓ, మురికి వాసన చూసినపుడు, వమనం చేసికోకూడదని”, తెలిసింది.

రాష్ట్ర స్థాయి నాయకుడు అధినేత్రి మైకం లో, “ఇదో చిన్నవిషయం” అన్నప్పుడు, కొన్నాళ్ళకి మురికి గుంటలో పొర్లిన వాడే నాయకత్వానికి అర్హుడేమో అన్న సందేహం వచ్చింది. అప్పుడు “అదో పెద్ద విషయం” అవుతుంది.

ఊళ్ళోని పెద్ద పెద్ద ఇళ్ళలోంచీ డబ్బు అనే పిల్ల కాలువల ద్వారా ఈ మురుగు గుంట నింపబడుతోంది. జీవిక కోసం ఈ పిల్ల కాలువలను నిర్వహించే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మందిమి చేస్తాం. జీవిక కోసం మనం మౌనం గా ఉంటాం. ఈ మురికి గుంటని పూడ్చి వేయాలని గట్టి గా అడగం. అడిగితే మన జీవిక పోతుంది.

కాబట్టీ ప్రముఖులారా, ధర్మాగ్రహం వ్యక్తం చేయకండి. మీరిచ్చే వినోదం వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ని సెలబ్రేట్ చేసుకోండి.

వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.

జాబ్ శాటిస్ఫాక్షన్ – మాస్లొవ్ నీడ్స్ హీరార్కీ.. ..రాజకీయాలూ, సిధ్ధాంతాలూ..

ఇటీవల ప్రైవేటు ఉద్యోగాలలో జీతాలు బాగా వస్తున్నాయి. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్  (ఉద్యోగ సంతృప్తి?) తగ్గిపోతోంది. దీనికి కారణాల గురించి ఆలోచిస్తే అబ్రహాం మాస్లోవ్ గారి అవసరాల (Maslow’s hierarchy of needs) సిధ్ధాంతం గుర్తుకొచ్చింది. ఈ సిధ్ధాంతం గురించి నెట్ లో చాలా సమాచారం దొరుకుతుంది. కాబట్టీ దాని గురించి ఆఠే మాట్లాడి మీకు బోర్ కొట్టించను.

స్థూలం గా చూస్తే ఈ సిధ్ధాంతం ప్రకారం మనిషి కి భౌతికమైన అవసరాలూ, తన భవిష్యత్ భద్రత గురించిన అవసరాలూ, ప్రేమించబడటం వంటి భావోద్వేగపరమైన అవసరాలూ,  మర్యాదా మన్ననకు సంబంధిధించిన అవసరాలూ, చివరి గా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ అవసరాలూ ఉంటాయి.
వీటిలో అన్నిటికన్నా కింది స్థాయి లో భౌతిక అవసరాలు ఉంటే,  అదే క్రమం లో ఆత్మ పరమైన అంశాలు పై స్థాయి లో ఉంటాయి. ఈ టపాలో నేను భావోద్వేగ అవసరాల గురించి మాట్లాడ దలచ లేదు. ఎందుకంటే,అవి ఉద్యోగ తృప్తి కి అంతగా సంబంధం ఉన్న అంశాలు కావు.

ఏ మనిషైనా, ముందు గా కింది స్థాయి లోని భౌతిక మైన అవసరాలు తీరిన తరువాతే, పై స్థాయి లోని భద్రత మొదలైన అవసరాల గురించి ఆలోచిస్తాడు. భౌతికమైన అవసరాలు తక్షణ మనుగడ కి సంబంధించిన విషయాలు. మనిషి ప్రస్తుతం ఆహారం లేక పోతే చనిపోతాడు. మనిషి రేపటి తన భద్రత గురించి అలోచించాలంటే, ఈ రోజు బ్రతికి ఉండాలి. ఈ రోజు బ్రతికి లేని మనిషి రేపు బ్రతికి ఉండలేడు కదా? ఇండియాలో చాలా మంది పేదలకు రెక్కాడితే గానీ డొక్కాడదు. వీరికి ఏ పది సంవత్సరాల తరువాతో ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితాల గురించి ఆలోచించే వెసులు బాటు ఉండదు. అందుకే ఎవరు తక్షణం నోటు ఇస్తారో వారికే వోట్ వేస్తారు. అలానే సిధ్ధాంత పరం గా కమిట్ అయ్యి దీర్ఘకాలం ఆలోచించే పార్టీలకి కూడా, ప్రస్తుత ఎన్నికలలో గెలవకపోతే మనుగడ ఉండదు. రేపు మనగలగాలంటే, ఇవాళ ఆ పార్టీలు బతికి బట్టకట్టాలి. అంటే మామూలు జనాల తక్షణావసరాలకి తగ్గట్టు గా తమ  విధానాలు ఉండాలి. భౌతిక అవసరాలు చాలా వరకూ తీరిన మధ్య తరగతి కి, టీవీ (లేక సిస్టం ) ముందు నుంచీ లేవకుండా వోటు-నోటు, జనాకర్షక రాజకీయాలను విమర్శించటం చాలా సులువు.  అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం. దేశం లోని పేదరికం తగ్గి సంపద పెరిగితే కానీ జనాలు భవిష్యత్ భద్రత అవసరాల గురించి, దీర్ఘ కాలిక విధానాల కి మద్దతు ఇవ్వరు. కానీ హ్రస్వ దృష్టి తో చేసే జనాకర్షక విధానాల వలన దేశం లో సంపద స్థాయి పెరగదు. ఇదొక విష వలయం. ఈ విష వలయాన్ని ఉత్తరించటానికి జనామోదం గల నిజమైన  నాయకుడు కావాలి.
ఉద్యోగాల విషయం లో దిగువ తరగతి వారు పూట గడవటం కోసం నౌకరీలు చేస్తారు. వీరికి రేపటి గురించి ఎక్కువ గా ఆలోచించే లక్జరీ ఉండదు. మధ్య తరగతి వారు, అందులోనూ తెలుగు వారు ఉద్యోగాలని తమ భవిష్యత్ భద్రత కోసం చేస్తారు. వీరిలో చాలా మంది తమకు ఇష్టమైన, తమ సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ కి ఉపయోగ పడే ఉద్యోగాలు చేయరు. ఏ కొద్ది మంది అదృష్టవంతులో తమ ఇష్టమైన, మరియూ తమ భద్రతావసరాల ను తీర్చే ఉద్యోగాలు చేస్తారు.  ఈ ప్రైవేటు ఉద్యోగాలు చాలా వరకూ తమకు సంబంధించి మర్యాద పరమైన అవసరాలను తీర్చేవి గా ఉండవు. ఉదాహరణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఉద్యోగాల ద్వారా సెక్యూరిటీ పరమైన అవసరాలను అధిగమించి, తమ సృజనాత్మక ఇఛ్ఛలకు  తృప్తి కలిగించే ఉద్యోగాలను పొందటం రాను రానూ కష్టమౌతూంది. దీనికి ముఖ్య కారణం మన కాపిటలిస్ట్ వ్యవస్థ లోని ద్రవ్యోల్బణం, అధిక ధరలూ. ఎవరైనా వచ్చే ఐదేళ్ళ లో తన రొటీన్ ఉద్యోగం ద్వారా తన భద్రతావసరాలకు సరిపడా సంపాదించి, తరువాత తన కు ఇష్టమైన వృత్తిలో కి మారుదామనుకొంటే , అలాంటి ప్లాన్స్ ని, అదుపులో లేని,  ఊహకందని ద్రవ్యోల్బణం తలకిందులు చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగ భద్రతా లేమిని ఉద్యోగుల తో పని చేయించటనికి ఒక సాధనం గా వాడుతాయి. “తమకు అసక్తికరమైన విషయాలోని పాషన్ వలన, సకారాత్మకం గా మనుషులు పని చేయటం”, కాపిటలిస్ట్ వ్యవస్థ లో కొంచెం తక్కువే అని చెప్పాలి. (ముఖ్యం గా ఇండియా లోని మధ్య తరగతి ఉద్యోగాల విషయం లో).
ఏ సినిమా స్టార్ల , పొలిటిషియన్ల పిల్లల కో తమ కు ఇష్టమైన తమ సృజనాత్మకతకు అద్దం పట్టే రంగాలలో పని చేసే అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే వారి సెక్యూరిటీ నీడ్స్ వారి పెద్దల సంపాదన వలన తీరిపోయి ఉంటాయి కాబట్టీ! కాపిటలిస్ట్ వ్యవస్థ లో మెజారిటీ మధ్య తరగతి ప్రజలు తమ భౌతిక, భద్రత అవసరాలను దాటి, తమ కు తృప్తి నిచ్చే రంగాలలో పని చేసుకోవటం కష్ట సాధ్యమైన, అరుదైన విషయం.
సోషలిస్ట్ వ్యవస్థ, “మనిషి భౌతిక, భద్రత అవసరాలను తన(వ్యవస్థ)కు వదిలి, మనిషి ని తన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ నీడ్స్ మీద ధ్యాస పెట్టమంటుంది”. అందువలననే కాబోలు ఒకప్పుడు కళాకారులూ, రచయితలూ సోషలిజాన్ని ఎక్కువ గా సమర్ధించే వారు. కానీ, మౌలిక అవసరాలు తీరిన తరువాత, సిన్సియర్ గా పని చేసే వారు చాలా అరుదు గా కనపడతారు. రష్యా అనుభవం ద్వారా తెలిసేదేమంటే, వాస్తవం లో సొషలిస్ట్ వ్యవస్థ కూడా మనిషి కి ఇష్టమైన ఉద్యోగాలను చేసుకోనివ్వకుండా, వ్యవస్థ, తనకి  అవసరమైన ఉద్యోగాలను మనిషి చేత చేయిస్తుంది అని.ఇండియాలాంటి చోట్ల ఇష్టమైన రంగం లో ఉద్యోగం చేయమంటే 90% జనాలు క్రికెట్టూ, సినిమలూ ఎంచుకొంటారు. అప్పుడు మిగిలిన రంగాలలో పని చేయటానికి జనాలు మిగిలి ఉండరు. మనుషుల మెడ పై “జాబ్ ఇన్సెక్యూరిటీ” అనే కత్తి వేలాడక పోతే, రష్యా లో అయినట్లు గా,మనుషుల ఉత్పాదక తగ్గుతుందేమో!

వెబ్ సైట్ పరిచయం : Qyuki

శేఖర్ కపూర్, ఏ ఆర్ రహమాన్ కలిసి Qyuki అని ఓ సోషల్ మీడియా వెబ్ సైట్ ప్రారంభించారు.
ఎలా ఉందా అని ఓ లుక్కేస్తే, ఇంటరెస్టింగ్ గానే ఉన్నట్లు అనిపించింది.
దీని ఉద్దేశం ముఖ్యం గా “కళా కారులు తమ సృజనాత్మక పనులను ప్రదర్శించుకొనేందుకు”.
వీడియోలూ, ఫొటోలూ, సినిమా స్క్రిప్ట్ లూ, వీడియోలూ గట్రా దీనిలో పెట్టుకోవచ్చు.
అదృష్టం ఉంటే ఆయా రంగాలలోని ఎక్స్-పర్ట్ ల అడ్వైజ్ దొరుకుతుంది.
రాతగాళ్ళకి చేతన్ భగత్ సలహా దొరకవచ్చు. పాటగాళ్ళకి రహమాన్ అడ్వైజ్ దొరకవచ్చు, స్క్రిప్ట్ కి శేఖర్ కపూర్ అడ్వైజ్ దొరక వచ్చు. స్క్రిప్ట్ బాగుంటే శేఖర్ కపూర్ ఓ సినిమా కి స్క్రిప్ట్ ని అడగవచ్చు.

ఇది కళాకారులు తమ ప్రతిభను చూపించుకొని, పదునుపెట్టుకొని, నిపుణుల సహాయం తీసుకొనే ఓ వేదిక అని చెబుతున్నారు. కానీ ఈ వేదిక ఎక్కటానికి అందరికీ అవకాశం ఉంటుంది.వేదిక ఎక్కేది, “పది మంది కంటే ప్రత్యేకం గా కనపడటానికి”. అందరూ వేదిక ఎక్కితే, వేదిక ఎక్కటం లో ప్రత్యేకత ఏమీ ఉండదు.

సైట్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని నా ఫొటోలు కొన్నీ, వీడియోలూ, నా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథలోని ఆంగ్ల తర్జుమా భాగాలు కొన్నీ ఈ సైట్ లోకి ఎక్కించాను.. లే అవుట్ బాగుంది. కానీ, ఆప్షన్లు తక్కువ. ఉదహరణ కి, మన వర్క్ ని ఎక్కించిన తరువాత, ప్రివ్యూ సదుపాయం లేదు. ఒక్క సారి పబ్లిష్ అయిన ఆవిష్కరణ ని మళ్ళీ ఎడిట్ చేయలేము.
వినియోగస్తులు, ఫొటోలూ అవీ చూసిన తరువాత, సంగీతం విన్న తరువాత, తమ భావోద్వేగాలను నమోదు చేయవచ్చును. టాగ్ చేయ వచ్చును. కామెంట్లు పెట్టవచ్చు. రికమెండ్ చేయవచ్చు.
నేను ఎక్కించిన కథ ఇక్కడ:   http://www.qyuki.com/creations/detail/profile-Story_of_an_Indian_SoftwareEngineer_4814#divText
తెలుగు కథలు కొన్నిటిని కూడా చూశాను. ఇంకా ఏ ఇతర దేశీయ కథలూ కనపడ లేదు. నెట్ ని ఉపయోగించటం లో మన తెలుగు వాళ్ళు అందరి కంటే ముందుంటారనుకొంటా! కానీ ఈ సైట్ లో తెలుగు కథలను , తెలుగు కవిత్వాన్నీ ఎంత మంది చదువుతారో తెలియదు. మీరూ మీ మీ ఆవిష్కరణ లను ఈ సైట్ లోకి ఎక్కించి చూడండి.