సైన్స్ కి ఓ ప్రశ్న..ఓ వాదన?

మనం నివశించే ఈ విశ్వాన్ని ఓ లోకం అనుకొందాం.ఈ విశ్వం తో అసలు పోలికే లేని (absolutely mutually exclusive) వేరొక అధిభౌతిక లోకం ఉందనుకొందాం.అంటే ఆ లోకపు విషయాలు మన ఊహకు కూడా అందవన్న మాట! అంటే మన విశ్వం లో ఉన్న వస్తువులేమీ ఆ విశ్వం లో ఉండవు. ఇక్కడ ఉండే ఆలోచనలు అక్కడ ఉండవు. ఆ లోకపు భౌతిక నియమాలు వేరే. అక్కడి ఊహలూ, పరిభావనలూ ఇక్కడి వాటితో అస్సలు కలవవు అనుకొందాం. ఇక్కడ నిరూపించబడిన విషయాలు అక్కడ నిరూపించబడాలని లేదు.మన మాత్స్ కి అక్కడ ఏమి ఉందో అందను కూడా అందదు అనుకొందాం. 

సైన్స్ ముఖ్యం గా భౌతిక నిరూపణల మీద ఆధారపడుతుంది. మన ఈ లోకం లో నిరూపిపంపబడని విషయాలు నేను పైన చెప్పిన అధిభౌతిక లోకం లో ఉండవచ్చు.
సైన్స్ కి నా ప్రశ్న ఏమిటంటే,……. మనకు ఉనికి ఉన్న ఈ భౌతిక లోకం లో చేసిన ప్రయోగాల ద్వారా నిరూపించలేని విషయం, వేరొక అధిభౌతిక లోకం లో ఖచ్చితం గా ఉండవచ్చు.కానీ మన అస్థిత్వం ఈ లోకానికే పరిమితం. మనిషినుంచీ పుట్టిన సైన్స్ మనిషి కి అస్థిత్వం లేని లోకాలకు వర్తించదు…..కాబట్టీ శాస్త్రీయ నిరూపణలన్నీ(scientific proofs) ఈ అధిభౌతిక ప్రపంచానికి వర్తించవు కదా?
కాబట్టీ సైన్స్, “ఫలానా విషయం నిరూపించబడలేదు”, అని చెప్పినపుడు, “మన ఉనికి ఉన్న భౌతిక లోకం లో మాత్రమే”, అని ఓ డిస్-క్లెయిమర్ తగిలించటం మంచిది.
మనం నాలుగు కొలతల జీవులం (4 dimensional creatures). ఐదో కొలతలో, లేక పన్నెండో కొలతలో ఏమి ఉంటుందో మనం కనిపెట్టిన నాలుగుకొలతల సైన్స్ నిరూపించలేదు కదా!
అటువంటి లోకం ఉన్నంత మాత్రాన మన విశ్వాసులు జబ్బలు చరుచుకోనవసరం లేదు. ఎందుకంటే, ఆ అధి-భౌతిక లోకాన్ని మన విశ్వాసులు కూడా చూడ లేదు. దానిపై విశ్వాసుల నమ్మకం కేవలం కాకతాళీయం మాత్రమే!

అలానే ఆ అధిభౌతిక లోకం లేక పోతే, సైన్స్ కి, “చూశారా నేను ముందే నిరూపించాను!”, అనే హక్కు లేదు. ఎందుకంటే సైన్స్ చూపిన నిరూపణలు ఆ లోకానికి సంబంధించినవి కావు. ఆ నిరూపణలు ఈ లోకానికి సంబంధించినవి.
ఆ అధిభౌతిక లోకం లేనపుడు కూడా ఉందని నమ్మే వారు అంధవిశ్వాసులౌతారు.
ఇదంతా చదివాక పాఠకులు ఓ ప్రశ్న వేయాలి..ఏమిటండీ ఇంకా ఎవరూ అడగటం లేదూ?