తెలంగాణ వాదానికి రూట్ కాజ్..తెలంగాణ వాదానికి మూల కారణం?

ఓ రెండేళ్ళ కిందట తెలంగాణ వాదం గురించి నేను రాసిన టపా ఇది. ఈ సమస్య రాజుకొన్నపుడల్లా నా మదిలో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. కిందటి టపా లో కొంతమంది కామెంట్స్ ఈ నా పాత టపా ని గుర్తుకు తెచ్చాయి.

సాధారణం గా తెలంగాణ వాదం(సమైక్యం గురించి కూడా) గురించిన చర్చ ఇలా నడుస్తుంది.
1.ఫలాన ఫలానా కారణాల వలన ప్రత్యేక తెలంగాణ అవసరం (ఉదా: వెనుకబాటు తనం, తెలంగాణ వస్తే నీళ్ళూ, ఉద్యోగాలూ రావటం, దోపిడీ, ఆంధ్ర రాజకీయ నాయకులు వగైరా).
2. వ్యతిరేకం గా వాదన చేసేవాళ్ళు ఆ కారణాలు చాలా వరకూ తప్పని వాదిస్తారు. ఒక్కోసారి నిరూపిస్తారు.
3. ఐనా సరే తెలంగాణ కావాలి. మిగిలిన వాదనలన్నీ తరువాత అనేది తె. వాదుల చివరి స్టాండ్ అవుతుంది.
అంటే వెనుక బాటు, దోపిడీ ఇవన్నీ మూల కారణాలు కాదు. తెలంగాణ కావాలనే ఆకాంక్ష కి వేరే ఏదో కారణం ఉంది. మిగిలినవన్నీ (అభివృధ్ధీ,వెనుక బాటు లాంటివి) ఆ ఆకాంక్షని జస్టిఫై చేయటం కోసం, నెరవేర్చుకోవటం పై కి చెప్పే కారణాలే. అందుకనే జస్టిఫికేషన్ కోసం చెప్పే కారణాలన్నీ వీగిపోయినా ఆకాంక్ష అలానే మిగిలి ఉంది.

సమూహానికి/మనిషికి ఒక బలమైన ఆకాంక్ష ఉన్నపుడు, దానికి వ్యతిరేకం గా ఉండే ఏ మంచినీ పట్టించుకోడు. ఆ మంచిని అనుమానం గా చూస్తాడు. అనుకూలం గా ఉందే ఏ చెడ్డనైనా చూసీ చూడనట్లు పోతాడు. (ఉదా: ఆంధ్ర లో/తెలంగాణ లో విగ్రహాలు పగలగొట్టారు–ఏదో కొందరు ఆకతాయిలు చేశారు లే. ******అవినీతి తగ్గుతుంది — ముందు మాది మాకివ్వండి, తరువాతి విషయాలు తరువాత ). మనిషి తన కోరిక తీరటానికి (తనకు లాభం వచ్చే విషయాలలో) చిన్న చిన్న విలువలూ, సూక్తులూ పక్కన పెడతాడు. సూక్తులన్నీ ఎవరో రా.నా. లకి మాత్రమే చెప్పాలి.

అలానే అపోజిషన్ వాడి మీద బురద జల్లటం,రంధ్రాన్వేషణ,వాడి లోపాలను గోరంతలు కొండంతలు చేయటం, తమ లోపాలను గొప్పలు గా చెప్పటం వగైరాలు(మా ఉజ్జమమే ప్రజాఉజ్జమం, వాళ్ళ ది నకిలీ ఉజ్జమం, మా పిల్లలే బలిదానాలు చేసుకొన్నారు, వాళ్ళ పిల్లలవి కావు.  మా దీచ్చలే గొప్ప దీచ్చలు,వాళ్ళవి నాటకాలు..  ). అందుకే నాకు ఉజ్జమాలంటే చిరాకు.

అందుకనే మూల కారణం ఏమిటి అని ఆలోచించటానికి ఈ టపా లో ప్రయత్నించాను.
ఇదే క్రమం సమైక్యానికీ వర్తిస్తుందనుకొంటా..!

ఇక ముందు ఈ విషయం పై రాయనవసరం లేదనిపిస్తోంది.

——————————————————————————————————————–

మధ్య కోస్తా లో ఉన్న మా ఊరి లో మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. మా చిన్నప్పుడు వాళ్ళ పిల్లలతో నేనూ మా తమ్ముడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా రెండు కుటుంబాల మధ్యా మంచి స్నేహమే ఉండేది. నాకు ఓ పదేళ్ళు ఉన్నపుడు మా పొరుగు కుటంబం నెల్లూరుకు వలస వెళ్ళారు. అక్కడ ఒక ఐదేళ్ళు గడిపాక, వరస కుదరక మళ్ళీ మా ఊళ్ళోని వాళ్ళ ఇంటికే వచ్చేశారు. తిరిగి వచ్చిన తరువాత వాళ్ళ కి చాలా వరకూ నెల్లూరు యాస వచ్చేసింది. అప్పటికి పదిహేనేళ్ళున్న మా తమ్ముడికి అది వింతగా అనిపించటమే కాక, తప్పుగా అనిపించింది. “ఊరంతా ఒక భాషైఏ వీళ్ళది వేరే యాసా..ఎచ్చులు పోవటం కాకపోతే!” అని వాళ్ళ పిల్లలని వెక్కిరించేవాడు. వాళ్ళూ నెల్లూరు వెళ్ళిన ఐదేళ్ళ లోనూ మా నాన్న పూరిల్లు తీసి డాబా వేశాడు. వెక్కిరించిన మా తమ్ముడికి అవతలి వాళ్ళూ దానిని ఈజీ గా తీసుకోవాలని ఉడేది. కానీ వాళ్ళు దానిని సహజం గానే పెద్ద అవమానం గా భావించేవారు. మా తమ్ముడు వెక్కిరించటం వలన మా పక్క వాళ్ళ పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా నెమ్మదిగా మా పై అసంతృప్తి పెంచుకోసాగారు. కొన్నాళ్ళకి మేము ఏ పని చేసిన వాళ్ళకి చెడ్డ గా కనిపించేది.

రాను రానూ వాళ్ళ ధొరణి చాలా అసఖ్యం గా మారింది. మా అమ్మ ఒక సారి పక్క వాళ్ళ అమ్మాయికి జామ పళ్ళు ఇవ్వబోతే, ఆ అమ్మాయి “మా అమ్మ తీసుకోవద్దని చెప్పింది”, అంది. ఇంకోసారి ఏదో పూజకి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు,”పూజకి పిలిచి మమల్ని సరిగా పలకరించలేదు” అని ఎవరితోనో చెప్పారు. కొన్ని నెలలకి మా డాబా గోడలపైన అంట్లు కడిగిన నీళ్ళూ పొయ్యటం, మా వైపు చెత్త వెయ్యటం మొదలయ్యింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఈ చిన్న చిన గొడవలు ఇరు కుటుంబాలకీ మధ్య సరిహద్దు తగాదాలకి దారితీసింది. ఈ తగాదాలలోకి ఊళ్ళోని రెండు ముఠాల నాయకులూ ప్రవేశించారు. మా పక్క వాడి ప్రవర్తన ఏ మాత్రం క్షమార్హం కాదని మా నాన్న ని సపోర్ట్ చేసిన నాయకుడు చెప్పాడు. మా నాన్న చేత కోర్ట్ కేసులు వేయించాడు. తరువాతి పంచాయతీ ఎన్నికలలో మా కుటుంబం యావత్తూ ఆ నాయకుడికే ఓట్లు వేశాం.ఈ లోపల కోర్ట్ కేసుల్లో డబ్బు వదిలి, ఓ రెండు సెక్షన్లు తెలిసి వచ్చాక మా పక్కింటి వాళ్ళూ మేమూ కాంప్రమైజ్ అయ్యాం..అలా అవటం రెండు పక్షాల నాయకులకీ ఇష్టం లేకపోయినా కూడా! అప్పటికి మా పక్కింటాయన కూడా డాబా ఇల్లు కట్టాడు. వాళ్ళ భాష మళ్ళీ మా ఊరి భాష కి మారిపోయింది.

అదే విధంగా..

యాభైలలో ఉభయ పక్షాలలోనూ, ముఖ్యం గా కమ్యూనిస్ట్లలో విశాలాంధ్ర భావన బలం గా ఉండేది. అయితే,
ఈ రాష్ట్రం ఏర్పడటానికి వ్యవహార పరం గా కారణం “తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి”, అని కాదు. ఆ రోజుల్లో తెలంగాన లో కమ్యూనిస్ట్ ల ప్రాబల్యం ఎక్కువ గా ఉండేది. ఆంధ్ర లో కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిస్ట్ల ప్రాబల్యానికి గండి కొట్టాలనుకొన్న నెహ్రూ ఆంధ్ర తెలంగాన ని కలపటం ద్వారా అది సాధిద్దామనుకొనటమే ఈ రాష్ట్రం ఏర్పడ్టానికి ప్రాక్టికల్ గా ముఖ్య కారణం.
ముస్లిం పరిపాలకుల కాలం లో తెలంగాణ ప్రాంతపు భాషా, సంస్కృతీ చాలా వరకూ ప్రత్యేకత సంతరించుకొన్నాయి. ఒకే రాష్ట్రం గా ఏర్పడినపుడు , ఆంధ్ర సమాజం చదువులోనూ, ప్రసార ప్రచార సాధనాలలోనూ,రాజకీయ సామాజిక వ్యవస్థలలొనూ కొంత ముందు ఉంది. ఆయా రంగాలలో వారి ఆధిపత్యం వలన, తమ భాషే సరైనది అనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఒక వేళ నిజాం తన రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం కంటే ముందుకు ప్రగతి పధం లో నడిపించినట్లైతే, తెలంగాన ప్రాంతపు భాషా, సంస్కృతే నిజమైనవి గా చెలామణి అయ్యేవి. ఉదాహరణకు కేరళలోని తిరువంకూరు (ట్రావంకోర్), కర్నాటక లోని మైసూరు సంస్థానాల భాషే అసలైనది గా అక్కడ చెలామణి అవుతోంది(ఆయా రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏలిన ప్రాంతాలతో పోలిస్తే). ఆయా రాజులు వారి కాలం లో తమ రాజ్యాలలో చేసిన అభివృధ్ధి వలన అది సాధ్యమయింది.

నిజాం ఏలుబడి లో దొరల కింద రైతు పని చేసినా, భూస్వాములు అంతటినీ కబళించే సంస్కృతి ఉండేది. దాని వలన రైతులు “పని చేయటం వలన ఏమి ఉపయోగం?”, అనుకొని నిరాసక్తం గా ఉండేవారు. ఇది అక్కడి సంస్కృతి లో ఒక భాగమైంది. కానీ ఈ ఆధునిక యుగం లో తెలంగాణ లోని యువకులు ఎంతో సమర్ధవంతం గా అని రంగాలలో దూసుకొని పోతున్నారు. ఈ సంస్కృతి వారికి వర్తించదు.

పైకి వెళ్ళిన పక్క వాడిని చూసి అసూయ నో ఈర్ష్యనో కలిగి ఉండటం మానవ సమూహాల్లో సహజం (ఈ విషయాన్ని ఆయా మనుషులలోని సంస్కారం ఒప్పుకోక పోయినప్పటికినీ). ఒక ఎకరమో అరో అమ్ముకొని హైదరాబాదు కి చేరి ఇక్కడ ఓ సైటు కొనుక్కొని, హడావిడి చేసే ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ  వారి లో కూడా ఇలాంటి భావావేశాలను రేకెత్తించటం కూడా అంతే సహజం.హడావిడీ, అజమాయిషీ చేసే వారికి అలా చేయటం చిన్న విషయమే. కానీ అజమాయిషీ చేయించుకొన్న వారికి (తెలంగాణ వారికి) అది సహజం గా సహించరాని విషయం, అనేదానిని ఆంధ్ర వారు గమనించలేదు.

తొంభై ల మధ్య నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం లో వచ్చిన మార్పులు, రాష్ట్ర రాజకీయ నాయకత్వం లో తెలంగాణ వారి స్థానాన్ని గణనీయం గా తగ్గించి వేశాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రులను తరచుగా మార్చే విధానానికి స్వస్తి చెప్తే, ఇంకొక పార్టీ ఏక కుటుంబ పాలన కు పరిమితమై పోయింది. దీని వలన తెలంగాన లోని నాయకులు గ్లాస్ సీలింగ్ కు గుద్దుకోవలసి వచ్చింది. కానీ ఈ అంశం మూల కారణాలలో ఒకటి కాదు.

ఈ మూల కారణాల వలన రాష్ట్రం ఏర్పడిన కొత్తలో “మనము” గా ఉన్న భావన అనతి కాలం లోనే “మీరు”, “మేము” గా విడిపోయింది. తెలంగాణ వాదానికి మూల కారణం ఇదే. ఒక్కసారి ఈ వేరు భావన ఏర్పడిన తరువాత ప్రతి విషయాన్నీ అదే ధోరణి లో అనుమానం తో చూడటం వలన (అలా చూడవలసిన పరిస్థితి లేక పోయిన విషయాలలో కూడా) ఎక్కువయింది.ఒక సమయం లో తెలంగాణ ప్రాంతీయులకి జరిగిన పొరపాట్లు (అన్యాయాలు కావు..ఎందుకంటేఅవి కావాలని ద్వేషం తో చేసినవి కావు.అలానే ఆయా పనుల పర్యవసానం దృష్టి లో పెట్టుకొని చేసినవి కావు) వేరొక సమయం లో ఆంధ్ర ప్రాంతానికీ జరిగాయి. కాకపోతే ప్రస్థుతం సమైక్యం అంటున్న ఆంధ్ర ప్రాంతీయులు ఆ పొరపాట్లను పైకి చెప్పటం లేదు. అలా చెప్పితే వాటిని భూతద్దం లో చూపించే ప్రత్యేక వాద రా.నా లు అక్కడా ఉన్నారు. ఈ విబేధాలు మొదట్లో ప్రజలలో నామ మాత్రం గా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం కోరేంత బలం గా లేవు. కానీ అవకాశం కోసం కాచుకొని కూర్చొన “దుర్బుధ్ధి రాజకీయ నాయకులు” విబేధాలకు కారణమైన విషయాలను భూతద్దం తో చూపించి తమ రాజకీయభవిష్యత్తుకు పునాది గా ఉపయోగించుకొన్నారు.మన కు అన్యాయం జరిగిపోతోంది అని మనవాడు గట్టిగా చెప్పినపుడు మనం వెంటనే  ఉత్సాహం తో నమ్మేస్తాం. అన్యాయం జరుగలేదు అని పక్కన ఉన్న ‘మనవాడు కాని వ్యక్తి, నిరూపించాలంటే వాడు దానికి రక రకాల  ప్రూఫ్ లు చూపించినా మనం నమ్మం. వాడి ప్రూఫ్ లను అనుమానం గానే చూస్తాం. కానీ మనవాడికి మాత్రం నమ్మకమనే కన్సెషన్ ఇస్తాం. అందుకనే తెలంగాన లోని విష నాయకులు చెప్పిన దోపిడీ అబధ్ధాలని అక్కడి ప్రజలు ముందూ వెనుకా చూడకుండా వెంటనే నమ్మి ఆవేశం తెచ్చుకొన్నారు. స్వప్రేమా పరద్వేషం మనిషి లక్షణమనుకొంటా!అలానే తెలంగాణ వస్తే స్వర్గం ఊడిపడుతుంది అన్న అక్కడి నేతల మాటలను కూడా ప్రజలు నమ్మినట్లు కనపడుతోంది. ఇక ఆత్మ గౌరవం వంటి మాటల సంగతి చెప్పనక్కర లేదు.

కర్నాటక, మహరాష్ట్ర ల లో ఊపందుకోని ప్రత్యేక భావనలు మన రాష్ట్రం లో ఊపందుకొనటానికి ప్రధాన కారణం, తెలంగాణ పది జిల్లాలతో పెద్దది కావటమే!  మన రాష్ట్రం లో లా, ప్రాంతీయ పరమైన అనేక రాయితీలూ ఆరక్షణలూ మహారాష్ట్ర, కర్నాటకలలో లేవు. అయినా అక్కడ వేర్పాటు వాదం తలెత్తక పోవటానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పరిమితమైన నైజాం జిల్లాలే!

నేను బెంగళూరు లో ఉన్నప్పుడు కన్నడ చానెళ్ళ లో కొన్ని సీరియళ్ళు వచ్చేవి. అవి అల్ప సంఖ్యాకులైన, వెనుకబడిన ఉత్తర కన్నడ జిల్లాల వారి సంస్కృతిని ప్రతిబింబించేవి గా ఉండేవి. అక్కడి పెద్దలు కన్నడ భావాన్ని సజీవం గా ఉంచేందుకు అటువంటి ఇముడ్చుకు పోయే తత్వాన్ని అవలంబించారని అనిపించేది. మనకు ఉన్న మీడియా చానెళ్ళ లో తెలంగాన సంస్కృతి ప్రతిబింబించేవిధం గా ఉన్న ఒక్క సీరియల్ ను కూడా చూసిన గుర్తు లేదు (ఉద్యమం ఉధృతం గా ఉన్నపుడు కూడా). ఆంధ్ర ప్రాంతపు ఆధిపత్య వర్గాల ఈ విధమైన తోలు మందం మనస్థత్వం కూడా తెలంగాన ప్రజలలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. తెలంగాన ఉద్యమ సందర్భం గా కొన్ని ప్రధాన చానళ్ళు,ప్రత్యేక ఉద్యమ కారులు ఎక్కడ తమపై గురి పెడతారో అని తమ విశ్లేషణ ను మాత్రం బంద్ చేశాయి.అంటే వీరు అందరి మంచి కోసం, కలుపుకొనిపోయే, మన సోదరుల సంస్కృతిని చూపించే పాజిటివ్ మనస్థత్వాన్ని కాక, తమ ఆస్థులను రక్షించుకొనే సంకుచితమైన వ్యూహాన్ని అనుసరిస్తారు.

ఇక ఈ విషయం లో ఆంధ్ర ప్రాంతపు రా.నా. లు తక్కువ తినలేదు. ఒక సైధ్ధాంతిక మైన స్టాండ్ తీసుకోవక పోవటం, స్వల్పకాలిక ప్రయోజనాలూ, వోట్లూ ఆశించి తాము ప్రత్యేక వాదానికి అనుకూలమని ప్రకటించుకోవటం, అస్పష్ట విధానాలతో (రెండు కళ్ళ సిధ్ధాంతం) జనాల జీవితాలతో ఆడుకొని ఆత్మహత్యల పాపాన్ని కొంతైనా మూటగట్టొకోవటం వీరి పాపాలు. ప్రత్యేక వాదం తలెత్తిన నాడే, దానికి ధీటుగా, సమైక్య వాదాన్ని ప్రజల లో జాగరూకత చేయకపోవటం,అన్యాయమేదైనా ఉంటే సరి దిద్దటం, సో కాల్డ్ సమైక్య వాదుల లోపం.ప్రత్యేక వాదులు అబధ్ధాలు చెప్పారని, తాము కూడా అబధ్ధాలు చెప్పటం (“దేశ సమగ్రత కు ముప్పు”, లాంటివి) ఇంకో చిల్లర పని. వాళ్ళు నాలుకలు కోస్తాం అంటే, మేము ఆత్మాహుతి చేస్తాం అనటం కూడా భావ్యం కాదు.ప్రత్యేక వాద నాయకులు చేసినట్లుగా, సమైక్య నాయకులు తమా సమైక్య వాదానికి మేధోపరమైన సపోర్ట్ ని కూడగట్టటం లో విఫలమయ్యారు. సమైక్య స్టాండ్ ని తీసుకోవటమే గత్యంతరం లేని పరిస్థితులలో తీసుకొన్నారు.

ఒక్కసారి అనుమానం ఏర్పడితే, ప్రతి విషయాన్నీ అనుమానం గానే చూస్తాం,. నీటి దొంగలూ, దోపిడీదారులూ, గుంటనక్కలూ ఇలాంటి ఆత్మ విమర్శ లేని ఆలోచనలన్నీ “మొదట చెడిన నమ్మకం” పునాదిగా పుడతాయి.ఇక్కడ దోపిడీ దారులనే వారు అలా అనటాన్ని ఒక చిన్నవిషయం గా చూసినా, అనిపించుకునే వారిని అది తీవ్రం గా బాధించే విషయమే! అనే వారు “మీరు దోపిడీ చేశారు కాబట్టీ, మేము అనటం లో తప్పేమిటి?” అంటారు.
అనిపించుకొన్న వారు, “మేము దోపిడీ చేయలేదు కాబట్టీ మీరు అనటం తప్పు ” అంటారు.
ఎవరైనా శ్రీకృష్ణ లాంటి మధ్యవర్తి నచ్చచెప్ప చూసినా, “అనుమానం భూతం” ముందు, అవగాహన పలాయన మంత్రం పఠించాలిసిందే! ఇక చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసే రాజకీయ నాయకులు ఎలానూ ఉన్నారు.
ఇంతకీ ఈ ప్రత్యేక వాదం భవిష్యత్తు ఏమంటారా? ఏమో దేవుడికి ఎరుక..నాకైతే మేమూ, మా పక్కింటి వాళ్ళ విషయం లో లానే ప్రత్యేకం విషయం లోకూడా అవుతుందనిపిస్తుంది.

ఇక భాష విషయం..తెలుగు భాష నెమ్మది గా ఒక కలగాపులగమైన భాష గా అవతరించబోతోంది. ఇది అన్ని ప్రాంతాల భాషవిషయం లోనూ నిజం. హిందీ ఇంగ్లీషుని కలుపుకొని, అన్ని ప్రాంతాల పదాలూ చేర్చుకొని, మీడియా సహాయంతో ఈ భాష విస్తరిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలలోని ముఖ్యమైన పట్టణాలలో నూ యువతరం టీవీ చానళ్ళ భాషనూ, సినిమాల భాషనూ ఇంచుమించు గా ఉపయోగిస్తున్నారు. ఇది హైదరాబాదు లో గత యాభై యేళ్ళు గా పుట్టి పెరిగిన నాజూకు భాష. తెలంగాణ వారు “బాబాయ్” అన్నా, కేక రా అన్నా, వెళ్తున్నారా అన్నా ఈ భాష పుణ్యమే! అలానే ఆంధ్ర ప్రాంతం వారు, “టీ వీ  బంద్ చెయ్” అన్నా, షాస్త్రం అన్నా, అనునాసికాలు లేకుండా “వం షం”, అన్నా, ఈ భాష ప్రభావమే! ఈ ప్రభావాన్ని తెలంగాణ ఏర్పడినా ఆపలేరు.

ప్ర: కేంద్ర ప్రభుత్వం లేక చిదంబరం అన్నదమ్ముల వంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారా?
జ : మనకు సిగ్గు లేక కీచులాడుకొని, పై వాడి దగ్గరికి పరిగెత్తితే, వాడి దృష్టి లో తేలిక అవమా? మనలో మనం సిగ్గులేకుండా తన్నుకొని పై వాడిని నిందించటం సరి కాదు.

ఒక సమాజాం మొత్తానికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నపుడు, ఆ ఉద్యమంలో అన్ని రకాల జనాలూ చేరుతారు. నిజాయితీ పరులూ, స్వార్థపరులూ, ఆవేశ పరులూ, కుహనా మేధావులూ, స్వార్థ నేతలూ,బూతులనే కవితలనే కవులూ, తమ బుధ్ధిని మొత్తం తమ విద్వేషాన్ని సమర్ధించటానికే ఉపయోగించే మేధావులూ,అందరూ ఉంటారు. ఏవరో కొందరు వెధవలు కారు కూతలు కూస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకం గా ఉన్న వారు ఆ కూతలు కూసిన వారిని చూపించి ఉద్యమం మొత్తాన్నీ తిడతారు. దానితో ఉద్యమం లో ఉన్న మంచివారికి కూడా కారు కూతలను సమర్ధించవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. అప్పుడు కారు కూతలు కూసిన వాడి కూతలే ఉద్యమానికి ఒక చిహ్నమౌతాయి. ఉద్యమం లోని చెడ్డ వారిని ప్రతి సారీ పేరుపేరునా వేలెత్తి చూపటం కుదరదు . చెడ్డ వారి గురించి చేసిన వ్యాఖ్యలు, మంచి వారు కూడా తమను ఉద్దేశించే అనుకొంటారు. దానితో మంచి వారి మనస్థత్వాలు కూడా బిగిసిపోయి విషపూరితమౌతాయి. ఈ ఎస్కలేషన్ ప్రక్రియ ఇంటర్నెట్ లో చాలా వేగం గా పని చేస్తుంది.అలానే తమ వాదానికి సంబంధించిన నెగటివ్ విషయాలను మరుగు పరుస్తూ లేక తేలిక పరుస్తూ, పాజిటివ్ విషయాలను పెద్దవి చేస్తూ మాట్లాడుతారు. అంటే వీరికి కావలసినది తమ ఉద్యమ వాదం గెలవటం. వాస్తవం గెలవటం కాదు. కానీ ఏ చర్చ లోనైనా వాస్తవం గెలవాలి..! ఇది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల రెండిడిటికీ వర్తిస్తుంది.  కాబట్టీ ఇంటర్నెట్ చర్చల్లో, కొన్ని అభిప్రాయాలూ ద్వేషాలతో, తామే కరక్ట్ అని నిరూపించుకోవటానికో కాకుండా, “చర్చిద్దాం,విభేదిద్దాం, మాది తప్పు అయితే ఒప్పుకొంటాం, ఇరువురం కలిసి ఒక పరిష్కారం కనుగొందాం” అనే స్ఫూర్తి తో సాగితే మంచిది.

ప్రకటనలు

ఓ సమైక్య వాది ఆత్మ పరిశీలన.

నేనో సామాన్య మానవుడిని. రాష్ట్రాన్ని కలిపీ ఉంచలేనూ, విడగొట్టాలేను. కానీ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకొనే నిఖార్సైన సమైక్య వాదిని.నేనే కనుక ఓ బలమైన రాజకీయ నాయకుడినైతే అనేక పనులు విలక్షణం గా చేసే వాడిని.

ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటి దాకా ఇప్పటి దాకా సమైక్య వాదం లోని లోటు పాట్లను తడమటానికి ఇదో చిన్న ప్రయత్నం. ఒక్క సమైక్య వాదం గురించి మాత్రమే రాస్తే అది ఈ అంశానికి న్యాయం చేసినట్లవదు. కాబట్టీ , ఆయా విషయాలలో తెలంగాణ వారి నుంచీ నేను ఏమి ఆశిస్తానో కూడా చెబుతాను.
1. అందరం ఓ రాష్ట్రం లో ఉంటున్నాం.  తెలంగాణ వాళ్ళు మనోళ్ళే. కాక పోతే “కొంచెం తక్కువ మనోళ్ళు (భాష వగైరా ల వలన)”, అనే వైఖరి ఆంధ్ర ప్రాంతపు సమైక్యవాదుల లో ఉండేది. సమానత్వం లేని సభ్యత్వం ఈ  రోజులలో నిలబడదు. తక్కువ గా చూడబడ్డ వాడు మొత్తం సమూహాన్నే కాదనుకొంటాడు, హిందువులలో తక్కువ గా చూడబడే కులాలు మొత్తం మతాన్నే విడిచిపెట్టినట్లు. ఈ సమూహం బయట పెద్ద శతృవు కాసుకొని ఉంటే తప్ప, అసమానత ను అంగీకరిస్తూ ఎవరూ లోపల ఉండరు. తనదే గొప్ప అని ప్రవర్తించే వాడికి ఆ ప్రవర్తన ఓ చిన్న విషయం గా కనిపించవచ్చు. కానీ అవతలి వాడికి అది చిన్న విషయం కాదు.

2. అనేక ఒప్పందాల ఉల్లంఘన. ఉల్లంఘించిన వాడికి అదో పెద్ద విషయం లా కనిపించక పోవచ్చు. కానీ అటువైపు వాడికి అది అంత చిన్న విషయమేమీ కాదు. దీనిని అవకాశం గా తమ రాజకీయ జీవితాన్ని ప్లాన్ చేసుకొనే నాయకులున్నపుడు, ఐటువంటి ఉల్లంఘనలు ఉన్న దానికంటే మరింత పెద్దవి గా చూపబడతాయి.
3. ఒక వేళ ఉల్లంఘించినా, “ఆరో వేలెందుకు?” లాంటి నిర్లక్ష్య ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తాయి. బూర్గుల లాంటి వారు తమ పదవులను త్యాగం చేసిన తరుణం లో, ఇటువంటి ప్రకటనలు పుండు కి కారం రాసినట్లు ఉంటాయి.
4. అరవై ల లో ఉద్యమాలు నడిచినపుడన్నా తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచించి దీర్ఘకాలిక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.తరువాత కూడా అవే తప్పులు పునరావృతం అయ్యాయి. చెన్నమనేని రాజేశ్వరరావు సాక్షి.
5. చిత్త శుధ్ధి తో ఆరువందల పది లాంటి GO లు జారీ చేసినా, వాటిని follow-up చేయటం మరిచారు.
6. అప్పట్లో చంద్ర బాబు లాంటి కుర్ర నాయకుడికి జనాల పై ప్రాంతీయ అస్థిత్వ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా కి అందలేదు.అంతకు ముందు అరవై ల లో జరిగిన ఉద్యమ తీవ్రత అతనికి అర్ధమై ఉండదు. ఎందుకంటే అతనికి అరవై లలో అంత వయసు లేదు. అంచనా కి అందినా అధికార మైకం లో పట్టించుకొనే స్థితి లేదు.
7. దేశం లో ప్రత్యేల్క రాష్ట్రం కోరుతున్న చిన్న చిన్న ఇతర ప్రాంతాల లా  కాకుండా, తెలంగాణ ఓ పెద్ద ప్రాంతం అన్న విషయం మరువ రాదు.
8. రాజధాని తెలంగాన లో ఉందనే విషయం దాదాపు మరిచిపోయి దానికి తామూ సొంత దారు అనే ఫీలింగ్ ఏర్పరచుకొన్నారు ( ఆ ఫీలింగ్ తప్పని కాదు).
9.ఏ విజయవాడ లోనో ఉమ్మడి రాజధాని పెడితే, అక్కడ అంతా తెలంగాణ వాళ్ళు హల్-చల్ చేస్తూ, ఆంధ్ర వాళ్ళు కూడా “కొంచెం తక్కువ మనోళ్ళే” అంటే, ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళ ని పొమ్మనే వారేమో . విజయవాడ చుట్టు పక్కల నీళ్ళు లేక ఎండి పోతే, అక్కడి ఉద్యోగాలలో చాలా వరకూ తెలంగాణ వారే ఉంటే, అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఉద్యమం చేయల్సి వచ్చేదేమో!
అలంటి సమయం లో భాషా, తెలుగూ వగైరా లు గుర్తుకు రావు కదా?
10. ఒక వేళ విభజన వాదులు అబధ్ధపు లెక్కలు చూపితే, అలాంటప్పుడు జనాలలోకి వెళ్ళి అబధ్ధాలను ఎండగట్టి, సామాన్య జనాల్కి అర్ధమయ్యే టట్లు, పిట్ట కథలు గా చెప్పగల సామర్ధ్యం కల నాయకుడు లేదు.పైగా సమైక్య వాదులు తాము కూడా అబధ్ధాలు(తెలంగాన ఇస్తే దేశం నాశనమైపోతుంది లాంటివి) చెప్పి ఉన్న విశ్వసనీయత ని పోగొట్టుకొన్నారు.
11. సమైక్యం అనవలసినది 69 నుంచీ. దానికి ఒప్పించవలసినది 10 జిల్లాల తెలంగాణ ప్రజలని. ఒప్పించటం కష్ట సాధ్యమే అవ్వవచ్చు. కానీ భీభత్సమైన నాయకత్వ లక్షణాలున్న YS లాంటి వారే ఎందుకు ప్రయత్నించలేక పోయారు? ఎన్నికల ముందొక మాట, తరువాత సీమ లో వేరొక మాట!
12. CBN కానీ YS కానీ తె రా స తో ఎందుకు అంట కాగి మాటలు మార్చారు. దీనివలన వారి విశ్వసనీయతే కాక సమైక్యవాదం యొక్క విశ్వసనీయత కూడా తెలంగాణ ప్రజల లో దారుణం గా దెబ్బతినలేదా?
13. ముందు నుంచీ సమైక్యమే అని, మాట మార్చకుండా, ఆ దిశ లో జరిగిన కృషి గురించీ, పొరపాట్ల గురించీ నిజాయితీ గా ప్రజల్లోకి వెళ్తే, తెలంగాన లో వీళ్ళ పరిస్థితి ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేదేమో! ప్రస్తుతానికి మాట మార్చని సమైక్య నాయకుడు లేదు. నిఖార్సైన సమైక్య వాద పార్టీ అసలే లేదు (CPM మినహా.)
14. పార్టీలు సమైక్యమన్నపుడు, ఆంధ్ర జనాలకి అది అవసరం లేకపోయింది. వారికి అప్పుడు ఉచిత కరెంటూ, బియ్యమూ, కష్టం లేని ఉద్యోగాలూ కావలసి వచ్చాయి. ఇప్పుడు జనాలు సమైక్యం అంటున్నారు. చేతులు కాలాక!

15.ఉద్యమాలు లేని సమయం లో అయినా సమైక్యత అవసరం గురించి ఎప్పుడైనా ప్రచారం చేశారా? దిక్కుమాలిన ప్రభుత్వ పధకాల గురించి వేల కోట్లు ప్రచారానికి తగలేశారు. విభజన వాదుల ప్రచారం ఎంత బాగా చేశారంటే, తొంభై ల లో పుట్టిన పిల్లవాడు యాభైలలో జరిగిన “అన్యాయా” ల గురించి ఏకరువు పెడతాడు. అభివృధ్ధి చెందిన వారుగా పిలవబడే సమైక్య వాదులు టెక్నాలజీ ని ఉపయోగించటం లో కూడ వెనుక బడ్డారు. పది సం|| ల కిందటే విభజన వాదులు వెబ్ సైట్లు పెట్టి ప్రచారం సాగించారు. సమైక్య వాదులు మొదలెట్టింది ఓనాలుగైదేళ్ళ క్రితం.  ఒక్క టీవీ చానల్ కూడా సమైక్య వాదానికి కట్టుబడి లేదు.అన్నీ so called సీమాంధ్ర ఛానల్సే అయినా చేసింది విభజన ప్రచారం. హైదరాబాదు లో విభజన వాదుల  భౌతిక దాడులకి దడిసి కావచ్చు, లేక వ్యాపారం కోసం కావచ్చు,ఒక్క ఛానల్/పేపర్ కూడా సమైక్యాన్ని సమర్ధించ లేదు.

16. విభజ అజెండా గా ఓ పార్టీ ఏర్పడ్డాక, విభజనకు సంబంచించిన అన్యాయాలను రూపుమాపినా, ఆ పార్టీ నిజాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే  అంతా సరిగా ఉంతే ఆ పార్టీ మనలేదు కాబట్టీ.
ఇక ఒప్పించ వలసినది ప్రజానీకాన్ని. ధైర్యం కలిగించవలసినది తెలంగాణ లోని అల్పసంఖ్యాకులైన సమైక్య వాదులకి. తెలంగాణ లో సభ పెట్టటం రిస్కీ నే కావచ్చు. కానీ విభజన వాదులకి అప్పీల్ చేసి అక్కడి సమైక్య వాదులకి భరోసా కలిగించే ప్రయత్నం చేయలేదెచరూ. వారికి భరోసా ఉంటే వారు నరుగురి తో  చెప్పే వారు.
17.తెలంగాణ వచ్చాక ఉండే అభివృధ్ధి గురించి వాస్తవిక మైన చిత్రం గురించిన చర్చ ఎక్కడా జరుగ లేదు. విభజన వాదులు చూపించే స్వర్గం సినిమా గురించి వారిని ఎవరూ ఎదుర్కోలేదు.

18.–90 శాతం ఆంధ్ర వారున్న తెలుగు సినిమా రంగం , సమైక్యానికి అనుకూలం గా ఒక్క సినిమా తీయలేకపోయింది. విభజ వాదానికి అనుకూలం గా కనీసం 4 సినిమా లు వచ్చాయి. హైదరాబాదు లో ఉండి సమైక్య సినిమా తీయటం సాహసమే కావచ్చు. సాహసం లేని పెద్దలకు గౌరవం ఎందుకివ్వాలి?

19.హైదరాబాదు తో సహా ఆంధ్ర ప్రాంతీయుల హక్కుల గురించి సమైక్య ఉద్యమం చేశారు/చేస్తున్నారు. ఉద్యమానికి సమైక్య ఉద్యమమని పేరు పెట్టట వలన వారి అసలు డిమాండ్లను చెప్పలేని పరిస్థితి. ఏ ఉద్యమానికైనా కావలసినది లక్ష్యాలలో, డిమాండ్ల లో స్పష్టత. అది లేకుండా ఉపయోగం లేదు. ఓ విధం గా చెప్పాలంటే నిజమైన సమైక్య ఉద్యమం 23 జిల్లాలలో జరగాలి. 23 జిల్లాల వారూ సమైక్యమంటే, విభజన ప్రసక్తే రాదు. అంతేటే సమైక్య ఉద్యమానికి అవసరమే ఉండదు. సమైక్య ఉద్యమమనేది ఓ oxymoron. సమైక్య భావన అనేది పాదుకొపవలసిన ఓ భావన. అది active గా జరగాలి, తప్ప విభజన వాదానికి ఓ reaction గా కాదు.

విభజనకి చిదంబరం నీ, మొయిలీ నీ,డిగ్గీ రాజా నీ వాళ్ళు తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టటానికి నిర్ణయాలు తీసుకొన్నారనీ అనటం సరి కాదు. ఇవి వారి వ్యక్తిగత నిర్ణయాలు కావు. వచ్చే ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం చేసి ఉండవచ్చు. దాని బాధ్య త కాంగ్రెస్ పార్టీ అంతటిదీ.  మనం మనం కొట్టుకొని వారి దగ్గరకు వెళ్ళటం సిగ్గు చేటు.

20. చివరి గా హైదరాబాదు గురించిన ఓ ముక్క. నిజాము కట్టించిన హైదరాబాదు తెలుగు నగరం కాదు. భాష ఉర్దు. మతం ఇస్లాం. సంస్కృతి నవాబీ సంస్కృతి. అరవై ల వరకూ   హైదరాబాద్ లో రోడ్ల మీద వినపడే భాష ఉర్దూనే. మెజారిటీ ముస్లిములే! కానీ హైదరాబాదు భౌగోళికం గా తెలంగాణ నడిబొడ్డున ఉంది. చారిత్రకం గా ఈ ప్రాంత పరిపాలన ఇక్కడి నుంచే జరిగింది. కాబట్టీ తెలంగాణ వారు సొంతదారులే. అయితే ఇది ఆంధ్ర వారి రాష్ట్రానికి కూడా దాదాపు అరవై యేళ్ళు రాజధాని.ఆంధ్ర వారు తమ రాధాని లో తాము సొంత దారులు కాకుండా ఎలా పోతారు? ఈ సెంటిమెంట్ తెలంగాణ వారికి లెక్కలోకి తీసుకోదగినదిగా కనిపించకపోవచ్చుగాక. (ఒప్పందనల ఉల్లంఘన ఆంధ్ర వారికి చిన్న విషయం గా కనపడినట్లు.)   ఇక రాజధాని కావటం వలన, రాష్ట్రం లోని అన్నిపట్నాలపై కలిపి పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ గా , రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజల పన్నుల నుంచీ, ఈ నగరం పై గత 60 యేళ్ళు గా పెట్టటమైనది.
విభజన అనేది ఆంధ్ర వారు లోరుకొన్నది కాదు. అది వారి మీద రుద్దబడినది. ఆంధ్ర వారికి న్యాయం జరగాలంటే, హైదరాబాదు పై వారి shared right ని కొనసాగించేలా చర్యలు ఉండాలి(ప్రత్యేక చట్టం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు). అన్ని సంస్థ లూ ఇక్కడే ఉన్నాయి. హైదరాబాదులోని సంస్థ ల లో ఆంధ్ర వారికి కూడా అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి( అటువంటి సంస్థలు ఆంధ్ర లో ఏర్పడే వరకూ).

హైదరాబాదు లో ఆంధ్ర వారి రక్షణ కి ప్రత్యేక చట్టం కూడా అవసరమే. దేశం లోని ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి ఇక్కడ నివశిస్తున్న వారికి అక్కర లేని భద్రత సీమాంధ్రుల కి ఎందుకు? ఎందుకంటే, ప్రత్యేక ఉద్యమం సీమాంధ్రులకి వ్యతిరేకం గానే జరిగింది (సీమాంధ్ర నాయకులకి కావచ్చు, ప్రజలకి కావచ్చు, పెట్టుబడి దారుల కి కావచ్చు– వీరంతా కూడా సీమాంధ్రులే) పేడ బిర్యానీ, జాగోభాగో, రామోజీ ఫిల్మ్ సిటీ ని నాగళ్ళ తో దున్నిస్తం, నాగార్జున సాగర్ కి అడ్డం గా గోడ కడతం,ఆంధ్ర వారిని రాక్షసుల తో పోల్చటం, సినిమా షూటింగ్ ల కి అడ్డుపడటం, వారి బిల్డింగ్ల పైకి రళ్ళు రువ్వటం, వారి భూములను ఆక్రమించటం, వసూళ్ళు. వసూళ్ళతో రాష్ట్రం రాకుండానే బడా నవాబులయ్యారు. రాష్ట్రం వచ్చినాక ఇంకెంత దందా నడుస్తుందో!  ఇవన్నీ వాస్తవాలు.  రేపు లోకల్-నాన్ లోకల్ అని ఏ చట్టాలు తెస్తారో తెలియదు. కావేరీ జలాల వివాదం సందర్భం గా బెంగుళూరు లో ఉన్న తమిళుల పై దాడులు జరిగిన విషయం తెలిసినదే. ఆంధ్ర తెలంగాణ ల మధ్య కావేరి వివాదం లాంటి మూడు నాలుఘు జల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు హైదరాబాదు లోని సీమధ్రుల పై దాడులు జరగవనే గారంటీ లేదు.

కాబట్టీ సీమాంధ్రుల భద్రత కి చట్టాలు ఉంటే మంచిది. కానీ స్థానిక ప్రజల తో ఉన్న సఖ్యత కంటే మించిన రక్షణ ఏ చట్టం తేలేదని కూడా సీమాంధ్రులు గుర్తెరగాలి.

అరవై ఏళ్ళ లో పెట్టిన ఖర్చు లెక్కలు తీసి అది ఆంధ్ర కి రాజధాని నిర్మించటానికి వచ్చే సంవత్సరాలలో ఉపయోగించాలి.  నీటి సమస్య కు ట్రిబ్యునల్స్ ప్రకారం పరిష్కారం వెతకాలి. (ఒప్పందాలు సరిగా అమలు జరగలేదని మొన్నటి దాకా గోల పెట్టిన విభజన వాదులు, భవిష్యత్తులో చేసుకోబోయే నీటి ఒప్పందాలగురించి అప్పుడే భరోసా ఇవ్వటం మొదలు పెట్టారు!దోపిడీ, వివక్ష లాంటి కారణాల నుంచీ సెంటిమెంట్ కీ, సెంటిమెంట్ నుంచీ, స్వయం పాలన కీ, స్వయం పాలన నుంచీ ప్రజాభీష్టానికి, విభజన కారణాలను మారుస్తూ వచ్చిన విభజన వాదుల భరోస ను ఎందుకు నమ్మాలి?  ఒక్కోసారి మావోయిస్టులకి ప్రాక్సీలుగా ఉన్న విభజన వాదుల మాటల అసలు అర్ధాన్ని సందేహించాల్సి వస్తుంది.   )

56 లో ఉన్న తెలంగాణ కావాలంటున్నారు(బీదర్, మరాఠ్వాడా వదిలి ) కాబట్టీ, భద్రచలాన్ని ఆంధ్ర కి ఇచ్చి వేయాలి.
కొత్త రాష్ట్రన్ని ఇవ్వాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ది, కాబట్టీ, కొంత ఖర్చును కేంద్రం భరించినా, మరి కొంత తెలంగాణ భరించాల్సి రావచ్చు. కేంద్రాన్ని ఎక్కువ గా అడిగితే, దేశం లోని మిగిలిన రాష్ట్రాలు ప్రశ్నిస్తాయి, “మీరూ మీరూ కొట్టుకొని విడిపోతే, మేమెందుకు చెల్లించాలి?”, అని.
తెలంగాణ వారి డిమాండ్లు ఇంకేమన్నా ఉంటే వాటికి కూడా న్యాయం చేయాలి.
ప్రస్తుతానికి కేంద్రం పై నమ్మకం పోవలసిన వసరం కనిపించటం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుతానికి త్వర త్వర గా నిర్ణయం తీసికొన్నా, ఆంధ్ర లో ఉన్న MP సీట్ల ను దృష్టి లోపెట్టుకొని, కేంద్రంసాధ్యమైనంత వరకూ ఆంధ్రకూ కూడా న్యాయం చేయటానికి వీలుంది.
ఆంధ్ర కు సంబంధించిన concerns ను అడ్రెస్ చేయకుండా జూలై 30 ప్రకటన ఉన్నా, స్పష్టత త్వరలోనే వస్తుంది. అప్పుడు సీమాంధ్ర ఉద్యమం తగ్గుముఖం పట్టవచ్చు.ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి. నిన్న మొన్నటి దాక ఉద్యమాల గురించి సీమాంధ్ర వాళ్ళు చేసిన విమర్శ ల ని తెలంగాణ వాదులు చేస్తున్నారు. తె. ఉద్యమం లో చేసిన పొరపాట్లను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమకారుకు చేస్తున్నారు. మీడియ ఎప్పటిలానే అగ్నికి ఆజ్యం పోస్తోంది. అప్పుడు విభజన ఉద్యమానికి, ఇప్పుడు వ్యతిరేక ఉద్యమానికి.. అప్పుడు శాంతి వచనాలు చెప్పిన నాయకులు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు. అప్పుడు ఉద్యమాలు చేసిన వారు ఇప్పుడు శాంతి వచనలు చెబుతున్నారు. The stake holders in peace (status quo) have changed now).

విశ్వసనీయత – కిరణ్ కుమార్ రెడ్డి, KCR.

రవీంద్ర టీవీ లో వార్తలు చూస్తున్నాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజుల సీమాంధ్ర ఉద్యమం తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు.  విద్యుత్ గురించి KCR ప్రణాళికలను ఉటంకిస్తూ, అవి ఎలా సాధ్యం కావో చెబుతున్నాడు.
“కిరణ్ కరక్ట్ గా మాట్లాడాడు. మాటల మరాఠీ మాటల లోని డొల్లతనాన్ని  బాగా ఎండ గట్టాడు”, అనుకొన్నాడు రవీంద్ర.

మరుసటి రోజు రవీంద్ర తన ఫ్రెండ్ రవీందర్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరికీ రాష్ట్ర విభజన విషయం లో విరుధ్ధమైన అభిప్రాయాలున్నా, తమ  స్నేహానికి ఆ అభిప్రాయాలు అడ్డు పడకుండా ఇంతకాలం చూసుకొన్నారు,.
రవీందర్ వాళ్ళింట్లో హాల్ లో టీ వీ రన్ అవుతోంది. నిన్నటి కిరణ్ మాటలకి KCR ప్రతిస్పందిస్తున్నాడు.
రవీందర్ అన్నాడు, “కిరణ్ అబధ్ధాలని KCR మంచి గా బయటపెట్టిండు”, అన్నాడు రవీందర్.ఈ సంఘటన లో రవీందర్ గానీ, రవీంద్ర గానీ కిరణ్ లేదా KCR చెప్పిన విషయాలను వెరిఫై చేసే స్థితి లో లేరు. నిజమేదో తేలటానికి నిపుణులూ, నివేదికలూ కావాలి.
కానీ, ఎవరి ప్రాంత నాయకుడు వారికి విశ్వసించదగిన వాడిగా కనిపించాడు.  వారికి తమ నాయకుడు చెప్పిన మాటలే పరమ సత్యాలు. ఎవరు చెప్పారు “సత్యం రెండు విరుధ్ధ రూపాలలో ఉండదని?!”

రవీందర్ ఛానల్ ని మార్చాడు.  స్పోర్ట్స్ ఛానల్.
ధోనీ ఇంటర్వ్యూ లో చెబుతున్నాడు, “ఇండియా వచ్చే మ్యాచ్ లో జింబాబ్వే పై గెలుస్తుందని”. ఈ విషయం లో రవీందర్ కీ రవీంద్ర కీ ఎటువంటి విబేధాలూ లేవు. ధోనీ ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఇండియా టీం స్థితి అటువంటిది.

సాధారణం గా మనుషులకి తమ గురించి తమకు ప్రేమా, అభిమానమూ ఉంటాయి. మనుషులు కులం, మతం, ప్రాంతం, భాష, దేశం ఇలా అనేక సమూహాలకు చెందుతారు. తమ గురించిన self image నే తమ సమూహం పట్ల కూడా వారు కలిగి ఉంటారు. అంటే తమ సమూహం వారు మంచి వారనీ, నమ్మదగిన వారనీ, by default నమ్ముతారు. ఏదైనా వ్యక్తిగతమైన అనుభవం వల్ల ఈ రూల్ కి విరుధ్ధం గానూ వ్యవహరించే వారూ ఉంటారు, అరుదు గా.
విశ్వసనీయత లో రెండు రకాలుంటాయి. ఒకటి వస్తు పరమైన విశ్వసనీయత(#objective credibility#) అయితే, రెండవది వ్యక్తి పరమైన విశ్వసనీయత (#subjective credibility#).
వస్తుపరమైన విశ్వసనీయతను (objective credibility) మనం, వాస్తవం లో ఓ మనిషి ట్రాక్ రికార్డ్  ను చూసి ఏర్పరచుకొంటాం. దీని లో వేరు అభిప్రాయాలకు తావుండదు. “సూర్యుడు తూర్పున ఉదయించును”, అన్నంత సరిగా ఈ విశ్వసనీయత రుజువౌతుంది. ఉదాహరణ కి అమీర్ ఖాన్ తదుపరి చిత్రం కనీసం యావరేయ్ గా రన్ అవుతుంది. దీని లో భిన్నాభిప్రాయాలకు తావు లేదు.
ఇక రెండవ రకం విశ్వస నీయత వ్యక్తి పరమైన విశ్వసనీయత (subjective credibility) . ఇది మనిషికీ మనిషికీ మారుతుంది. నాకు విశ్వసనీయుడైన వ్యక్తి వేరొకరికి ఏ మాత్రం విశ్వసనీయుడు కాకపోవచ్చు. ఈ వ్యక్తి పరమైన విశ్వసనీయత లో …మనం ఏ సమూహానికైతే (కులం, ప్రాంతం వగైరా) చెందుతామో, అ సమూహానికే అవతలి వ్యక్తి చెందితే, మనకి అతని పై ఎక్కువ గా విశ్వసనీయత ఉండే అవకాశం ఉంటుంది. జనాలు తమ కులం నాయకుడు చెప్పిన మాటలని సులువు గా నమ్ముతారు. అతనికే ఓట్లు వేస్తారు. అలానే, వైరి పక్షానికి చెందిన నాయకుడిని అనుమానం తో చూస్తారు. సందేహిస్తారు. వేరే కులానికి చెందిన నాయకుడు ఆ కులం నుంచీ సపోర్ట్ ని కష్టపడి సంపాదించాలి. అదే తమ కులస్తుల విశ్వాసాన్ని అనాయాసం గా పొందవచ్చు.   అందుకే అనుకొంటా, వైరి  రాజకీయ పక్షాలు అవతలి పక్షం నాయకుడి పై ఆరోపణలు, ఆ నాయకుడి  కులానికో మతానికో చెందిన వారితో చేయిస్తారు.

మనకు అన్యాయం జరిగిపోయిందని మనోడు చెబ్తే, ఆలోచించకుండా నమ్మేస్తాం. మన కు ఏం పరవాలేదని వేరే వాడు చెప్తే, వాడి మాటలని అనుమానం గా చూస్తాం.
రాజకీయాలలో జనాలకి నాయకుల మాటలను వెరిఫై చేసే అవకాశం ఉండదు. అందుకే జనాల అస్థిత్వం(identity) అనేది నాయకుల credibility ని స్థిరపరచటం లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సినిమా హీరో లకి కుల పరమైన అభిమాన సంఘాలున్నా, అంబేద్కర్ వంటి నేతల ను దైవ సమానం గా తప్పు చేయలేని వారి గా చూస్తున్నారన్నా, ఈ అస్థిత్వ ప్రభావముంటుంది. అలానే గొప్ప నాయకుల విశ్వసనీయతను అప్పుతెచ్చుకొని ఇతరులను దెబ్బ తీయటం కూడా ఈ మధ్య కాలం లో చూడ వచ్చు. ఉదాహరణకు, తెలంగాణ విషయం లో అంబేద్కర్ వేరు వేరు సందర్భాలలో చెప్పిన మాటలను ఇరు పక్షాలూ వల్లె వేస్తున్నాయి.    అయితే ఈ  credibility వ్యక్తి గతమైనది (subjective).  దురదృష్ట వశాత్తూ ఇండియా లో అనేక అస్థిత్వాలు (కులం, మతం, ప్రాంతం, భాష వగైరా, వగైరా) ఉండటం వలన ఏదో ఒక అస్థిత్వం ఉపయోగించి రాజకీయ నాయకులు విశ్వసనీయత సాధించుకొంటారు. కానీ ఈ వ్యక్తి పరమైన విశ్వసనీయత అనేది చాలా ప్రమాద కరమైనది. ఎందుకంటే , అది వాస్తవం మీద అధారపడి ఏర్పడినది కాదు. కొంత మందికి ఓ నాయడి విశ్వసనీయత మీద సందేహాలున్నా, అతనిని తెలిసే, తమ ప్రాంతం వాడనో, కులం వాడనో సపోర్ట్ చేస్తారు, వీరిని ఏమీ చేయలేం.
ఇంతకీ కిరణ్, KCR ల  లో ఎవరిని విశ్వసించాలంటారా? God is in details. దస్త్రాలు తీస్తే గానీ సత్యాలు బయటపడవ్.