తెలంగాణ వాదానికి రూట్ కాజ్..తెలంగాణ వాదానికి మూల కారణం?

ఓ రెండేళ్ళ కిందట తెలంగాణ వాదం గురించి నేను రాసిన టపా ఇది. ఈ సమస్య రాజుకొన్నపుడల్లా నా మదిలో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. కిందటి టపా లో కొంతమంది కామెంట్స్ ఈ నా పాత టపా ని గుర్తుకు తెచ్చాయి.

సాధారణం గా తెలంగాణ వాదం(సమైక్యం గురించి కూడా) గురించిన చర్చ ఇలా నడుస్తుంది.
1.ఫలాన ఫలానా కారణాల వలన ప్రత్యేక తెలంగాణ అవసరం (ఉదా: వెనుకబాటు తనం, తెలంగాణ వస్తే నీళ్ళూ, ఉద్యోగాలూ రావటం, దోపిడీ, ఆంధ్ర రాజకీయ నాయకులు వగైరా).
2. వ్యతిరేకం గా వాదన చేసేవాళ్ళు ఆ కారణాలు చాలా వరకూ తప్పని వాదిస్తారు. ఒక్కోసారి నిరూపిస్తారు.
3. ఐనా సరే తెలంగాణ కావాలి. మిగిలిన వాదనలన్నీ తరువాత అనేది తె. వాదుల చివరి స్టాండ్ అవుతుంది.
అంటే వెనుక బాటు, దోపిడీ ఇవన్నీ మూల కారణాలు కాదు. తెలంగాణ కావాలనే ఆకాంక్ష కి వేరే ఏదో కారణం ఉంది. మిగిలినవన్నీ (అభివృధ్ధీ,వెనుక బాటు లాంటివి) ఆ ఆకాంక్షని జస్టిఫై చేయటం కోసం, నెరవేర్చుకోవటం పై కి చెప్పే కారణాలే. అందుకనే జస్టిఫికేషన్ కోసం చెప్పే కారణాలన్నీ వీగిపోయినా ఆకాంక్ష అలానే మిగిలి ఉంది.

సమూహానికి/మనిషికి ఒక బలమైన ఆకాంక్ష ఉన్నపుడు, దానికి వ్యతిరేకం గా ఉండే ఏ మంచినీ పట్టించుకోడు. ఆ మంచిని అనుమానం గా చూస్తాడు. అనుకూలం గా ఉందే ఏ చెడ్డనైనా చూసీ చూడనట్లు పోతాడు. (ఉదా: ఆంధ్ర లో/తెలంగాణ లో విగ్రహాలు పగలగొట్టారు–ఏదో కొందరు ఆకతాయిలు చేశారు లే. ******అవినీతి తగ్గుతుంది — ముందు మాది మాకివ్వండి, తరువాతి విషయాలు తరువాత ). మనిషి తన కోరిక తీరటానికి (తనకు లాభం వచ్చే విషయాలలో) చిన్న చిన్న విలువలూ, సూక్తులూ పక్కన పెడతాడు. సూక్తులన్నీ ఎవరో రా.నా. లకి మాత్రమే చెప్పాలి.

అలానే అపోజిషన్ వాడి మీద బురద జల్లటం,రంధ్రాన్వేషణ,వాడి లోపాలను గోరంతలు కొండంతలు చేయటం, తమ లోపాలను గొప్పలు గా చెప్పటం వగైరాలు(మా ఉజ్జమమే ప్రజాఉజ్జమం, వాళ్ళ ది నకిలీ ఉజ్జమం, మా పిల్లలే బలిదానాలు చేసుకొన్నారు, వాళ్ళ పిల్లలవి కావు.  మా దీచ్చలే గొప్ప దీచ్చలు,వాళ్ళవి నాటకాలు..  ). అందుకే నాకు ఉజ్జమాలంటే చిరాకు.

అందుకనే మూల కారణం ఏమిటి అని ఆలోచించటానికి ఈ టపా లో ప్రయత్నించాను.
ఇదే క్రమం సమైక్యానికీ వర్తిస్తుందనుకొంటా..!

ఇక ముందు ఈ విషయం పై రాయనవసరం లేదనిపిస్తోంది.

——————————————————————————————————————–

మధ్య కోస్తా లో ఉన్న మా ఊరి లో మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. మా చిన్నప్పుడు వాళ్ళ పిల్లలతో నేనూ మా తమ్ముడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా రెండు కుటుంబాల మధ్యా మంచి స్నేహమే ఉండేది. నాకు ఓ పదేళ్ళు ఉన్నపుడు మా పొరుగు కుటంబం నెల్లూరుకు వలస వెళ్ళారు. అక్కడ ఒక ఐదేళ్ళు గడిపాక, వరస కుదరక మళ్ళీ మా ఊళ్ళోని వాళ్ళ ఇంటికే వచ్చేశారు. తిరిగి వచ్చిన తరువాత వాళ్ళ కి చాలా వరకూ నెల్లూరు యాస వచ్చేసింది. అప్పటికి పదిహేనేళ్ళున్న మా తమ్ముడికి అది వింతగా అనిపించటమే కాక, తప్పుగా అనిపించింది. “ఊరంతా ఒక భాషైఏ వీళ్ళది వేరే యాసా..ఎచ్చులు పోవటం కాకపోతే!” అని వాళ్ళ పిల్లలని వెక్కిరించేవాడు. వాళ్ళూ నెల్లూరు వెళ్ళిన ఐదేళ్ళ లోనూ మా నాన్న పూరిల్లు తీసి డాబా వేశాడు. వెక్కిరించిన మా తమ్ముడికి అవతలి వాళ్ళూ దానిని ఈజీ గా తీసుకోవాలని ఉడేది. కానీ వాళ్ళు దానిని సహజం గానే పెద్ద అవమానం గా భావించేవారు. మా తమ్ముడు వెక్కిరించటం వలన మా పక్క వాళ్ళ పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా నెమ్మదిగా మా పై అసంతృప్తి పెంచుకోసాగారు. కొన్నాళ్ళకి మేము ఏ పని చేసిన వాళ్ళకి చెడ్డ గా కనిపించేది.

రాను రానూ వాళ్ళ ధొరణి చాలా అసఖ్యం గా మారింది. మా అమ్మ ఒక సారి పక్క వాళ్ళ అమ్మాయికి జామ పళ్ళు ఇవ్వబోతే, ఆ అమ్మాయి “మా అమ్మ తీసుకోవద్దని చెప్పింది”, అంది. ఇంకోసారి ఏదో పూజకి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు,”పూజకి పిలిచి మమల్ని సరిగా పలకరించలేదు” అని ఎవరితోనో చెప్పారు. కొన్ని నెలలకి మా డాబా గోడలపైన అంట్లు కడిగిన నీళ్ళూ పొయ్యటం, మా వైపు చెత్త వెయ్యటం మొదలయ్యింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఈ చిన్న చిన గొడవలు ఇరు కుటుంబాలకీ మధ్య సరిహద్దు తగాదాలకి దారితీసింది. ఈ తగాదాలలోకి ఊళ్ళోని రెండు ముఠాల నాయకులూ ప్రవేశించారు. మా పక్క వాడి ప్రవర్తన ఏ మాత్రం క్షమార్హం కాదని మా నాన్న ని సపోర్ట్ చేసిన నాయకుడు చెప్పాడు. మా నాన్న చేత కోర్ట్ కేసులు వేయించాడు. తరువాతి పంచాయతీ ఎన్నికలలో మా కుటుంబం యావత్తూ ఆ నాయకుడికే ఓట్లు వేశాం.ఈ లోపల కోర్ట్ కేసుల్లో డబ్బు వదిలి, ఓ రెండు సెక్షన్లు తెలిసి వచ్చాక మా పక్కింటి వాళ్ళూ మేమూ కాంప్రమైజ్ అయ్యాం..అలా అవటం రెండు పక్షాల నాయకులకీ ఇష్టం లేకపోయినా కూడా! అప్పటికి మా పక్కింటాయన కూడా డాబా ఇల్లు కట్టాడు. వాళ్ళ భాష మళ్ళీ మా ఊరి భాష కి మారిపోయింది.

అదే విధంగా..

యాభైలలో ఉభయ పక్షాలలోనూ, ముఖ్యం గా కమ్యూనిస్ట్లలో విశాలాంధ్ర భావన బలం గా ఉండేది. అయితే,
ఈ రాష్ట్రం ఏర్పడటానికి వ్యవహార పరం గా కారణం “తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి”, అని కాదు. ఆ రోజుల్లో తెలంగాన లో కమ్యూనిస్ట్ ల ప్రాబల్యం ఎక్కువ గా ఉండేది. ఆంధ్ర లో కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిస్ట్ల ప్రాబల్యానికి గండి కొట్టాలనుకొన్న నెహ్రూ ఆంధ్ర తెలంగాన ని కలపటం ద్వారా అది సాధిద్దామనుకొనటమే ఈ రాష్ట్రం ఏర్పడ్టానికి ప్రాక్టికల్ గా ముఖ్య కారణం.
ముస్లిం పరిపాలకుల కాలం లో తెలంగాణ ప్రాంతపు భాషా, సంస్కృతీ చాలా వరకూ ప్రత్యేకత సంతరించుకొన్నాయి. ఒకే రాష్ట్రం గా ఏర్పడినపుడు , ఆంధ్ర సమాజం చదువులోనూ, ప్రసార ప్రచార సాధనాలలోనూ,రాజకీయ సామాజిక వ్యవస్థలలొనూ కొంత ముందు ఉంది. ఆయా రంగాలలో వారి ఆధిపత్యం వలన, తమ భాషే సరైనది అనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఒక వేళ నిజాం తన రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం కంటే ముందుకు ప్రగతి పధం లో నడిపించినట్లైతే, తెలంగాన ప్రాంతపు భాషా, సంస్కృతే నిజమైనవి గా చెలామణి అయ్యేవి. ఉదాహరణకు కేరళలోని తిరువంకూరు (ట్రావంకోర్), కర్నాటక లోని మైసూరు సంస్థానాల భాషే అసలైనది గా అక్కడ చెలామణి అవుతోంది(ఆయా రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏలిన ప్రాంతాలతో పోలిస్తే). ఆయా రాజులు వారి కాలం లో తమ రాజ్యాలలో చేసిన అభివృధ్ధి వలన అది సాధ్యమయింది.

నిజాం ఏలుబడి లో దొరల కింద రైతు పని చేసినా, భూస్వాములు అంతటినీ కబళించే సంస్కృతి ఉండేది. దాని వలన రైతులు “పని చేయటం వలన ఏమి ఉపయోగం?”, అనుకొని నిరాసక్తం గా ఉండేవారు. ఇది అక్కడి సంస్కృతి లో ఒక భాగమైంది. కానీ ఈ ఆధునిక యుగం లో తెలంగాణ లోని యువకులు ఎంతో సమర్ధవంతం గా అని రంగాలలో దూసుకొని పోతున్నారు. ఈ సంస్కృతి వారికి వర్తించదు.

పైకి వెళ్ళిన పక్క వాడిని చూసి అసూయ నో ఈర్ష్యనో కలిగి ఉండటం మానవ సమూహాల్లో సహజం (ఈ విషయాన్ని ఆయా మనుషులలోని సంస్కారం ఒప్పుకోక పోయినప్పటికినీ). ఒక ఎకరమో అరో అమ్ముకొని హైదరాబాదు కి చేరి ఇక్కడ ఓ సైటు కొనుక్కొని, హడావిడి చేసే ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ  వారి లో కూడా ఇలాంటి భావావేశాలను రేకెత్తించటం కూడా అంతే సహజం.హడావిడీ, అజమాయిషీ చేసే వారికి అలా చేయటం చిన్న విషయమే. కానీ అజమాయిషీ చేయించుకొన్న వారికి (తెలంగాణ వారికి) అది సహజం గా సహించరాని విషయం, అనేదానిని ఆంధ్ర వారు గమనించలేదు.

తొంభై ల మధ్య నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం లో వచ్చిన మార్పులు, రాష్ట్ర రాజకీయ నాయకత్వం లో తెలంగాణ వారి స్థానాన్ని గణనీయం గా తగ్గించి వేశాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రులను తరచుగా మార్చే విధానానికి స్వస్తి చెప్తే, ఇంకొక పార్టీ ఏక కుటుంబ పాలన కు పరిమితమై పోయింది. దీని వలన తెలంగాన లోని నాయకులు గ్లాస్ సీలింగ్ కు గుద్దుకోవలసి వచ్చింది. కానీ ఈ అంశం మూల కారణాలలో ఒకటి కాదు.

ఈ మూల కారణాల వలన రాష్ట్రం ఏర్పడిన కొత్తలో “మనము” గా ఉన్న భావన అనతి కాలం లోనే “మీరు”, “మేము” గా విడిపోయింది. తెలంగాణ వాదానికి మూల కారణం ఇదే. ఒక్కసారి ఈ వేరు భావన ఏర్పడిన తరువాత ప్రతి విషయాన్నీ అదే ధోరణి లో అనుమానం తో చూడటం వలన (అలా చూడవలసిన పరిస్థితి లేక పోయిన విషయాలలో కూడా) ఎక్కువయింది.ఒక సమయం లో తెలంగాణ ప్రాంతీయులకి జరిగిన పొరపాట్లు (అన్యాయాలు కావు..ఎందుకంటేఅవి కావాలని ద్వేషం తో చేసినవి కావు.అలానే ఆయా పనుల పర్యవసానం దృష్టి లో పెట్టుకొని చేసినవి కావు) వేరొక సమయం లో ఆంధ్ర ప్రాంతానికీ జరిగాయి. కాకపోతే ప్రస్థుతం సమైక్యం అంటున్న ఆంధ్ర ప్రాంతీయులు ఆ పొరపాట్లను పైకి చెప్పటం లేదు. అలా చెప్పితే వాటిని భూతద్దం లో చూపించే ప్రత్యేక వాద రా.నా లు అక్కడా ఉన్నారు. ఈ విబేధాలు మొదట్లో ప్రజలలో నామ మాత్రం గా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం కోరేంత బలం గా లేవు. కానీ అవకాశం కోసం కాచుకొని కూర్చొన “దుర్బుధ్ధి రాజకీయ నాయకులు” విబేధాలకు కారణమైన విషయాలను భూతద్దం తో చూపించి తమ రాజకీయభవిష్యత్తుకు పునాది గా ఉపయోగించుకొన్నారు.మన కు అన్యాయం జరిగిపోతోంది అని మనవాడు గట్టిగా చెప్పినపుడు మనం వెంటనే  ఉత్సాహం తో నమ్మేస్తాం. అన్యాయం జరుగలేదు అని పక్కన ఉన్న ‘మనవాడు కాని వ్యక్తి, నిరూపించాలంటే వాడు దానికి రక రకాల  ప్రూఫ్ లు చూపించినా మనం నమ్మం. వాడి ప్రూఫ్ లను అనుమానం గానే చూస్తాం. కానీ మనవాడికి మాత్రం నమ్మకమనే కన్సెషన్ ఇస్తాం. అందుకనే తెలంగాన లోని విష నాయకులు చెప్పిన దోపిడీ అబధ్ధాలని అక్కడి ప్రజలు ముందూ వెనుకా చూడకుండా వెంటనే నమ్మి ఆవేశం తెచ్చుకొన్నారు. స్వప్రేమా పరద్వేషం మనిషి లక్షణమనుకొంటా!అలానే తెలంగాణ వస్తే స్వర్గం ఊడిపడుతుంది అన్న అక్కడి నేతల మాటలను కూడా ప్రజలు నమ్మినట్లు కనపడుతోంది. ఇక ఆత్మ గౌరవం వంటి మాటల సంగతి చెప్పనక్కర లేదు.

కర్నాటక, మహరాష్ట్ర ల లో ఊపందుకోని ప్రత్యేక భావనలు మన రాష్ట్రం లో ఊపందుకొనటానికి ప్రధాన కారణం, తెలంగాణ పది జిల్లాలతో పెద్దది కావటమే!  మన రాష్ట్రం లో లా, ప్రాంతీయ పరమైన అనేక రాయితీలూ ఆరక్షణలూ మహారాష్ట్ర, కర్నాటకలలో లేవు. అయినా అక్కడ వేర్పాటు వాదం తలెత్తక పోవటానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పరిమితమైన నైజాం జిల్లాలే!

నేను బెంగళూరు లో ఉన్నప్పుడు కన్నడ చానెళ్ళ లో కొన్ని సీరియళ్ళు వచ్చేవి. అవి అల్ప సంఖ్యాకులైన, వెనుకబడిన ఉత్తర కన్నడ జిల్లాల వారి సంస్కృతిని ప్రతిబింబించేవి గా ఉండేవి. అక్కడి పెద్దలు కన్నడ భావాన్ని సజీవం గా ఉంచేందుకు అటువంటి ఇముడ్చుకు పోయే తత్వాన్ని అవలంబించారని అనిపించేది. మనకు ఉన్న మీడియా చానెళ్ళ లో తెలంగాన సంస్కృతి ప్రతిబింబించేవిధం గా ఉన్న ఒక్క సీరియల్ ను కూడా చూసిన గుర్తు లేదు (ఉద్యమం ఉధృతం గా ఉన్నపుడు కూడా). ఆంధ్ర ప్రాంతపు ఆధిపత్య వర్గాల ఈ విధమైన తోలు మందం మనస్థత్వం కూడా తెలంగాన ప్రజలలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. తెలంగాన ఉద్యమ సందర్భం గా కొన్ని ప్రధాన చానళ్ళు,ప్రత్యేక ఉద్యమ కారులు ఎక్కడ తమపై గురి పెడతారో అని తమ విశ్లేషణ ను మాత్రం బంద్ చేశాయి.అంటే వీరు అందరి మంచి కోసం, కలుపుకొనిపోయే, మన సోదరుల సంస్కృతిని చూపించే పాజిటివ్ మనస్థత్వాన్ని కాక, తమ ఆస్థులను రక్షించుకొనే సంకుచితమైన వ్యూహాన్ని అనుసరిస్తారు.

ఇక ఈ విషయం లో ఆంధ్ర ప్రాంతపు రా.నా. లు తక్కువ తినలేదు. ఒక సైధ్ధాంతిక మైన స్టాండ్ తీసుకోవక పోవటం, స్వల్పకాలిక ప్రయోజనాలూ, వోట్లూ ఆశించి తాము ప్రత్యేక వాదానికి అనుకూలమని ప్రకటించుకోవటం, అస్పష్ట విధానాలతో (రెండు కళ్ళ సిధ్ధాంతం) జనాల జీవితాలతో ఆడుకొని ఆత్మహత్యల పాపాన్ని కొంతైనా మూటగట్టొకోవటం వీరి పాపాలు. ప్రత్యేక వాదం తలెత్తిన నాడే, దానికి ధీటుగా, సమైక్య వాదాన్ని ప్రజల లో జాగరూకత చేయకపోవటం,అన్యాయమేదైనా ఉంటే సరి దిద్దటం, సో కాల్డ్ సమైక్య వాదుల లోపం.ప్రత్యేక వాదులు అబధ్ధాలు చెప్పారని, తాము కూడా అబధ్ధాలు చెప్పటం (“దేశ సమగ్రత కు ముప్పు”, లాంటివి) ఇంకో చిల్లర పని. వాళ్ళు నాలుకలు కోస్తాం అంటే, మేము ఆత్మాహుతి చేస్తాం అనటం కూడా భావ్యం కాదు.ప్రత్యేక వాద నాయకులు చేసినట్లుగా, సమైక్య నాయకులు తమా సమైక్య వాదానికి మేధోపరమైన సపోర్ట్ ని కూడగట్టటం లో విఫలమయ్యారు. సమైక్య స్టాండ్ ని తీసుకోవటమే గత్యంతరం లేని పరిస్థితులలో తీసుకొన్నారు.

ఒక్కసారి అనుమానం ఏర్పడితే, ప్రతి విషయాన్నీ అనుమానం గానే చూస్తాం,. నీటి దొంగలూ, దోపిడీదారులూ, గుంటనక్కలూ ఇలాంటి ఆత్మ విమర్శ లేని ఆలోచనలన్నీ “మొదట చెడిన నమ్మకం” పునాదిగా పుడతాయి.ఇక్కడ దోపిడీ దారులనే వారు అలా అనటాన్ని ఒక చిన్నవిషయం గా చూసినా, అనిపించుకునే వారిని అది తీవ్రం గా బాధించే విషయమే! అనే వారు “మీరు దోపిడీ చేశారు కాబట్టీ, మేము అనటం లో తప్పేమిటి?” అంటారు.
అనిపించుకొన్న వారు, “మేము దోపిడీ చేయలేదు కాబట్టీ మీరు అనటం తప్పు ” అంటారు.
ఎవరైనా శ్రీకృష్ణ లాంటి మధ్యవర్తి నచ్చచెప్ప చూసినా, “అనుమానం భూతం” ముందు, అవగాహన పలాయన మంత్రం పఠించాలిసిందే! ఇక చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసే రాజకీయ నాయకులు ఎలానూ ఉన్నారు.
ఇంతకీ ఈ ప్రత్యేక వాదం భవిష్యత్తు ఏమంటారా? ఏమో దేవుడికి ఎరుక..నాకైతే మేమూ, మా పక్కింటి వాళ్ళ విషయం లో లానే ప్రత్యేకం విషయం లోకూడా అవుతుందనిపిస్తుంది.

ఇక భాష విషయం..తెలుగు భాష నెమ్మది గా ఒక కలగాపులగమైన భాష గా అవతరించబోతోంది. ఇది అన్ని ప్రాంతాల భాషవిషయం లోనూ నిజం. హిందీ ఇంగ్లీషుని కలుపుకొని, అన్ని ప్రాంతాల పదాలూ చేర్చుకొని, మీడియా సహాయంతో ఈ భాష విస్తరిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలలోని ముఖ్యమైన పట్టణాలలో నూ యువతరం టీవీ చానళ్ళ భాషనూ, సినిమాల భాషనూ ఇంచుమించు గా ఉపయోగిస్తున్నారు. ఇది హైదరాబాదు లో గత యాభై యేళ్ళు గా పుట్టి పెరిగిన నాజూకు భాష. తెలంగాణ వారు “బాబాయ్” అన్నా, కేక రా అన్నా, వెళ్తున్నారా అన్నా ఈ భాష పుణ్యమే! అలానే ఆంధ్ర ప్రాంతం వారు, “టీ వీ  బంద్ చెయ్” అన్నా, షాస్త్రం అన్నా, అనునాసికాలు లేకుండా “వం షం”, అన్నా, ఈ భాష ప్రభావమే! ఈ ప్రభావాన్ని తెలంగాణ ఏర్పడినా ఆపలేరు.

ప్ర: కేంద్ర ప్రభుత్వం లేక చిదంబరం అన్నదమ్ముల వంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారా?
జ : మనకు సిగ్గు లేక కీచులాడుకొని, పై వాడి దగ్గరికి పరిగెత్తితే, వాడి దృష్టి లో తేలిక అవమా? మనలో మనం సిగ్గులేకుండా తన్నుకొని పై వాడిని నిందించటం సరి కాదు.

ఒక సమాజాం మొత్తానికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నపుడు, ఆ ఉద్యమంలో అన్ని రకాల జనాలూ చేరుతారు. నిజాయితీ పరులూ, స్వార్థపరులూ, ఆవేశ పరులూ, కుహనా మేధావులూ, స్వార్థ నేతలూ,బూతులనే కవితలనే కవులూ, తమ బుధ్ధిని మొత్తం తమ విద్వేషాన్ని సమర్ధించటానికే ఉపయోగించే మేధావులూ,అందరూ ఉంటారు. ఏవరో కొందరు వెధవలు కారు కూతలు కూస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకం గా ఉన్న వారు ఆ కూతలు కూసిన వారిని చూపించి ఉద్యమం మొత్తాన్నీ తిడతారు. దానితో ఉద్యమం లో ఉన్న మంచివారికి కూడా కారు కూతలను సమర్ధించవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. అప్పుడు కారు కూతలు కూసిన వాడి కూతలే ఉద్యమానికి ఒక చిహ్నమౌతాయి. ఉద్యమం లోని చెడ్డ వారిని ప్రతి సారీ పేరుపేరునా వేలెత్తి చూపటం కుదరదు . చెడ్డ వారి గురించి చేసిన వ్యాఖ్యలు, మంచి వారు కూడా తమను ఉద్దేశించే అనుకొంటారు. దానితో మంచి వారి మనస్థత్వాలు కూడా బిగిసిపోయి విషపూరితమౌతాయి. ఈ ఎస్కలేషన్ ప్రక్రియ ఇంటర్నెట్ లో చాలా వేగం గా పని చేస్తుంది.అలానే తమ వాదానికి సంబంధించిన నెగటివ్ విషయాలను మరుగు పరుస్తూ లేక తేలిక పరుస్తూ, పాజిటివ్ విషయాలను పెద్దవి చేస్తూ మాట్లాడుతారు. అంటే వీరికి కావలసినది తమ ఉద్యమ వాదం గెలవటం. వాస్తవం గెలవటం కాదు. కానీ ఏ చర్చ లోనైనా వాస్తవం గెలవాలి..! ఇది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల రెండిడిటికీ వర్తిస్తుంది.  కాబట్టీ ఇంటర్నెట్ చర్చల్లో, కొన్ని అభిప్రాయాలూ ద్వేషాలతో, తామే కరక్ట్ అని నిరూపించుకోవటానికో కాకుండా, “చర్చిద్దాం,విభేదిద్దాం, మాది తప్పు అయితే ఒప్పుకొంటాం, ఇరువురం కలిసి ఒక పరిష్కారం కనుగొందాం” అనే స్ఫూర్తి తో సాగితే మంచిది.

ప్రకటనలు

30 thoughts on “తెలంగాణ వాదానికి రూట్ కాజ్..తెలంగాణ వాదానికి మూల కారణం?”

 1. మీ కథనం సంయమనంతో ఉంది. రెండు పక్షాలలోని లోటు పాట్లు నిష్పక్షపాతంతో తీసుకువచ్చారు. కాని ఆర్థిక సంపుష్టి కారణంగా తోడయిన అన్ని బలాలతో ఇతర ప్రాంతాలకు ఏ కారణం వల్ల అయినా వలస వెళ్లేవాళ్లు ఆ ప్రాంతాల సాంస్కృతిక జీవన విలువలను తమవిగా చేసుకోవాలి. ఇది దేశాల కయినా, రాష్ట్రాలకయినా జిల్లాలకయినా వర్తించే సూత్రం. హైదరాబాద్‌కు లేదా తెలంగాణా జిల్లాలకు వలస వెళ్లిన మన “ఆంధ్రోళ్లు” రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌గా ఉండు అనే సూత్రాన్ని ఎన్నడైనా వంటబట్టించుకున్నారా? హైదరాబాద్ అంటే మనకు పరాయిదేశం కాకపోవచ్చు. కానీ కేవలం పాతికేళ్లలో హైదరాబాద్‌ను అన్నిరకాలుగా పక్కా ఆంధ్రా నగరంలాగా మార్చేశారు. కట్టు బొట్టు, బాష, పండుగలు, పబ్బాలు, జీవితానికి సంబంధించిన సమస్త ఆచరణలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఆంధ్రా సంస్కృతే రాజ్యమేలుతోంది. తెలంగాణా వాదం ఇంత ఉధృతిగా లేని కాలంలో కూడా నాకు తెలిసిన తెలంగాణా మిత్రులు, పరాయి సంస్కృతి తమ కట్టుబాట్లతో సహా అన్నింటినీ మార్చేస్తోందని, తమ వీధుల్లో అడ్డనిక్కర్ కుర్రాళ్లూ, బాబాయ్ పిలుపులూ వినే రోజులు వస్తాయని కల్లోకూడా అనుకోలేదని నిజంగానే బాధపడేవారు. ఈ ఆంధ్రోళ్లు వచ్చేసి మా పిలగాళ్లను మొత్తంగా గబ్బు పట్టించారని మేధో సెక్షన్లకు చెందిన హైదరాబాదీలే వాపోయారు. కొన్ని కుటుంబాలతో పరిచయం ద్వారా నేను స్వంయంగా విన్నాను కూడా. ఇక భాష విషయంలో చెప్పపనిలేదు. ప్రాంతీయ యాసలను మన తెలుగు సినిమా అవమానించినట్లుగా భారతదేశంలో ఏ భాషా ప్రాంతంలోనూ జరగలేదు. అది రాయలసీమ భాషనైనా సరే, తెలంగాణా బాషనైనా సరే, ఉత్తరాంధ్ర భాషనైనా సరే సినిమా మీడయంపై దశాబ్దాలుగా పట్టు సాధించిన మన ఆంధ్రోళ్లే ‘నీచ’ పాత్రల ద్వారా ఖూనీ చేస్తూ వచ్చారు.

  కట్టుబాట్లు, ఆచారాలు, సంస్కృతి, భాష ఇలా అన్నింట్లో జరుగుతూ వస్తున్న మార్పులు మీరన్నట్లు కావాలని ద్వేషంతో, ఉద్దేశపూర్వకంగా చేసినవి కాకున్నప్పటికీ ఒక ప్రాంత యాసను గౌరవించడం, దాంట్లో మిళితం కావడం చేతకానప్పుడు, మర్చిపోయినప్పుడు లేదా తమ సంస్కృతిని అన్ని రకాలుగా ఆర్భాటంగా ప్రదర్శించినప్పుడు తెలంగాణా ఆంధ్రోళ్లకు ఖచ్చితంగా ఒక ఫీజీ దీవి అవుతుంది. ఇప్పటికే అయింది కూడా..

  ద్వేషంతో, దూషణలతో, బురదజల్లుకోవడంతో కూడా ఏ రాష్ట్రమూ, ప్రాంతమూ ఏర్పడిన చరిత్ర లేదు. తెలంగాణా నేతలు ఇప్పుడు ఈ వైఖరితో ప్రత్యేక రాష్ట్రం తీసుకువస్తారంటే నమ్మవలసిన పనికూడాలేదు. తెలంగాణా కాంగ్రెస్, తెరాసలను నమ్ముకుని ఇంకా ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఎవరయినా కలలు కంటూ ఉంటే ఆ అమాయకత్వాన్ని చూసి మనం ఆశ్చర్యపోవలిసి వస్తుంది. అసలే పుండు అన్నట్లుగా హైదరాబాద్‌లో మే పెట్టుబడులు పెట్టాం కనుక అభివృద్ధి అయింది అని సీమాంధ్ర నేతలు తమకే సాధ్యమైన అహంకారాన్ని ఇంత సంక్షుభిత క్షణాల్లో కూడా ప్రదర్సిస్తున్నారు. వీళ్లను ఎవరు రమ్మన్నారు, ఎవరు వీళ్లను పెట్టుబడులు పెట్టి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళమని చెప్పారు? ఇప్పటికీ ఈ అహంకార ప్రదర్శనలను మానుకోకపోతే.. వీళ్లను ఎవరు నమ్ముతారిక? మొత్తానికి తెలుగు వాళ్లకు చేటుకాలం వచ్చింది.

  మెచ్చుకోండి

 2. ధన్యవాదాలు రాజు గారు,
  హైదరాబాద్ సంస్కృతీ తెలంగాణ సంస్కృతీ ఒకటి కాదు. ఆంధ్ర వారు అక్కడి సంస్కృతిని ప్రభావితం చేయటం తో పాటు, తాము కూడా దాని చేత ప్రభావితం కా బడ్డారు.కాక పోతే ఈ రెండు దిశలలో సమానత్వం లోపించింది. ప్రాంతీయ యాసలను హిందీ సినిమా కూడా తక్కువ గానే చూస్తుంది (ఈ చూడటం తమాషా కోసం. అంతకంటే పెద్ద దురుద్దేశం ఏమీ ఉండదు. కానీ అలా చూపించబడిన వాడికి అది పెద్దవిషయమే!). తమిళ్ సినిమా గురించి మీకు తెలియాలి. గోదావరి యాసను తక్కువ గా చూసినా వారు పట్టించుకోలేదు. ఎందుకంటే సినిమా వాళ్ళలో గోదావరి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కాబట్టీ తెలుగు సినిమా ను వారు బయటిదానిగా చూడక, తమ దానిగానే చూశారు. దాని వలన వారికి కంప్లెయింట్స్ లేవు. సినిమాలలో తెలంగాణ వారు తక్కువ. తెలుగు సినిమా వారికి అంత సొంతం కాదు. దీనికి తోడు రాజకీయ వ్యతిరేక ప్రచారం కూడా చిన్న విషయాన్ని పెద్దది చేసింది.
  మిగిలిన ప్రాంతాల భాషలోకి కూడా తెలంగాణ పదాలు వస్తున్నాయి (బంద్ చేయటం లాంటివి). ఇది మంచికే!
  “హైదరాబాద్‌లో మే పెట్టుబడులు పెట్టాం కనుక అభివృద్ధి అయింది అని సీమాంధ్ర నేతలు తమకే సాధ్యమైన అహంకారాన్ని ఇంత సంక్షుభిత క్షణాల్లో కూడా ప్రదర్సిస్తున్నారు.”వాళ్ళ లాభాలకోసమే పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. కానీ నగరం కూడా మెరుగైన మౌలిక వసతులూ, ఉద్యోగాల (తెలంగాణ వారికి కూడా) రూపం లో అభివృధ్ధి చెందింది. కాబట్టీ నగరం అభివృధ్ధిచెందటం లో వారికి కూడా కొంత పాత్ర ఉందనేది కాదనలేని నిజం. వాళ్ళ కి అహం కారమా కాదా అనేది వాళ్ళ మాటలకి మనం చెప్పే భాష్యాన్ని బట్టి ఉంటుంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. Good attempt but too little too late apart from rivilalizing the issue.

  In 1969, 45 MLA’s across the regional divide issued a statement admitting Telangana suffered under AP but urging unity in common interest. Such an approach could have worked if deployed around 2004. On the contrary, “integrationists” mimicked the aggressive style of the “separatists” burning bridges forever.

  మెచ్చుకోండి

 4. క్షమించాలి. ఏమీ అనుకోకండి. మీ విశ్లేషణని నేను అంగీకరించడం లేదు.

  రాజకీయనాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం తమ స్వార్థం కోసం ఒక శిఖండిగాణ్ణి అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం గత 11 ఏళ్ళనుంచీ సిస్టమేటిక్ గా సృష్టించిన విభేదాలకి సామాన్య ఆంధ్రాప్రజల్ని బాధ్యుల్ని చేస్తున్నారు మీరు. మీరు ఉదాహరించిన ఫిర్యాదులు నేను పదకొండేళ్ళ క్రితం వినలేదు. ఆ తరువాతే వింటున్నాను.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. ఆబ్జెక్టివ్ గా రాశారు. బాగుంది.
  @ఒక సమయం లో తెలంగాణ ప్రాంతీయులకి జరిగిన పొరపాట్లు (అన్యాయాలు కావు..ఎందుకంటేఅవి కావాలని ద్వేషం తో చేసినవి కావు.అలానే ఆయా పనుల పర్యవసానం దృష్టి లో పెట్టుకొని చేసినవి కావు) వేరొక సమయం లో ఆంధ్ర ప్రాంతానికీ జరిగాయి. కాకపోతే ప్రస్థుతం సమైక్యం అంటున్న ఆంధ్ర ప్రాంతీయులు ఆ పొరపాట్లను పైకి చెప్పటం లేదు. అలా చెప్పితే వాటిని భూతద్దం లో చూపించే ప్రత్యేక వాద రా.నా లు అక్కడా ఉన్నారు. ఈ విబేధాలు మొదట్లో ప్రజలలో నామ మాత్రం గా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం కోరేంత బలం గా లేవు. కానీ అవకాశం కోసం కాచుకొని కూర్చొన “దుర్బుధ్ధి రాజకీయ నాయకులు” విబేధాలకు కారణమైన విషయాలను భూతద్దం తో చూపించి తమ రాజకీయభవిష్యత్తుకు పునాది గా ఉపయోగించుకొన్నారు.

  ఇక్కడే ఉంది కీలకమంతా. ఆ పొరపాట్లను హైలైట్ చేసి రాజకీయనాయకులు తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతున్నారు…బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకున్నట్లు సీమాంధ్రులు తెలంగాణాను దోచుకుంటున్నారని చెబుతూ.

  మెచ్చుకోండి

 6. “మీరు ఉదాహరించిన ఫిర్యాదులు నేను పదకొండేళ్ళ క్రితం వినలేదు”
  పదకొండేళ్ళ క్రితం కూడా ఈ ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి కానీ, అప్పుడు మనకు వినిపించేంత గట్టిగా వాటిని వల్లించేవారు లేరనుకొంటా! ఇప్పుడు స్వార్థ నాయకులు రంగం లోకి దిగిన తరువాత, మన చెవులు పగిలేంత గట్టిగా వినిపిస్తున్నారు.

  మెచ్చుకోండి

 7. ఏడ్చినట్లుంది ఈ విశ్లేషణ. అసలుకు రాజకీయ రంగంగురించిన అజ్ఞానమంతా కనిపిస్తూంది. హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించడం నెహ్రూకు ఇష్టమే లేదు. ఈ సంగతి ఆయనే చెప్పుకున్నాడు. పోతే విశాలాంధ్రకోసం వీరావేశంతో విజృంభించింది కమ్యూనిస్టులే; తెలుగుజాతి ఐక్యతకోసం అందరికంటే సంఘటితంగా, అంకిత భావంతో వుద్యమించిందీ వాళ్లే.
  Regional chauvinism of any region is bad and to be condemned. But this chauvinism is now in egregious proportions among separatists (demanding separate Telangana). Hyderabad is not the property of Telangana (i.e. the present 10 districts called Telangana) alone. The real meaning of Telangana is ‘land of Telugus’ and it covers all the 23 districts and even more. Once Hyderabad became the capital city it should be deemed common property of all the residents of the state – cutting across any regional divide. Among all the State Capitals unfortunately it is in our state alone where there is region-based discrimination and now separatists exacerbate it.

  మెచ్చుకోండి

 8. బొందలపాటి గారూ,
  నాదీ మల్లిఖార్జునశర్మగారి అభిప్రాయమే. అసలు విశాలాంధ్రకై ఉద్యమించింది రెండు ప్రాంతాలలో ఉన్న కమ్యూనిస్టులే. ఫజల్ అలీ కమిటి నివేదికను తిరస్కరించి విశాలాంధ్ర-హైదరాబాదు రాష్ట్ర విభజన ప్రధాన అంశంగా ఎన్నికలకు వెళతామని అప్పుడు కమ్యూనిస్టులు చేసిన ఒత్తిడివల్లే ఆనాటి హైదరాబాదు శాసనసభలో హైదరాబాదు రాష్ట్ర విభజనకూ విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల ప్రవేశపెట్టారు. అసలు విశాలాంధ్ర ప్రతిపాదనే సామ్రాజ్యవాదమని నెహ్రూ విమర్శించారు. ఈ సమస్య ఇలా రావణకాష్టములా రగలటానికి సింహభాగం పాపం కాంగ్రెసు పార్టీకే దక్కుతుందనటం అతిశయోక్తికాదు. అలాగే తెలంగాణ అంటే తేలివాహానది (గోదావరికి మరోపేరు) ప్రవహించే ప్రాంతం అని అర్థం. అలాగే తెలంగాణ అనే పదమే పూర్తి తెలుగుపదం అని భాషాశాస్త్రఙ్ఞుల విశ్వాసం. ఆంధ్ర శబ్దం కేవలం సంస్కృత రచనల్లో తెలుగువారిని సంబోధించటానికి వాడిన పదం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 9. ధన్యవాదాలు అచంగ గారు!
  తెలంగాన పదం గురించి ఇంకా రెండు మూడు అర్ధాలను చూశాను…తెలంగ అంటే తెలుగనీ..మాగాణం అంటే భూమి అనీ కాబట్టీ తెలంగాణ అంటే తెలుగు వారి భూమి అనీ.. ఇలా..
  మీరు నెహ్రూ కమ్యూనిస్ట్ల గురించి చెప్పిన దానితో నేనెక్కడ విబేధించాను. విశాలాంధ్ర తో కమ్యూనిస్ట్లు ఎన్నికలకు వెళ్తామన్నారు కాబట్టే, నెహ్రూ వారు వెళ్ళకుండానే, వారి రాబోయే ఆధిపత్యానికి గండి కొట్టటానికి సమైక్యానికి ఒప్పుకొన్నాడు. ఒక ప్రాంతం లో నైనా కాంగ్రెస్ వారు ఎక్కువ ఉన్నారు కాబట్టీ.

  మెచ్చుకోండి

 10. దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు ఈ తొందరపాటు కామెంట్ చూసి.
  మీరు నెహ్రూ కమ్యూనిస్ట్ల గురించి చెప్పిన దానితో నేనెక్కడ విబేధించాను. విశాలాంధ్ర తో కమ్యూనిస్ట్లు ఎన్నికలకు వెళ్తామన్నారు కాబట్టే, నెహ్రూ వారు వెళ్ళకుండానే, వారి రాబోయే ఆధిపత్యానికి గండి కొట్టటానికి సమైక్యానికి ఒప్పుకొన్నాడు. ఒక ప్రాంతం లో నైనా కాంగ్రెస్ వారు ఎక్కువ ఉన్నారు కాబట్టీ.

  మెచ్చుకోండి

 11. |ఈ రాష్ట్రం ఏర్పడటానికి వ్యవహార పరం గా కారణం “తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి”, అని కాదు.| నేను మల్లిఖార్జునశర్మ గారిని సమర్థించినది మీరు చేశిన ఈ వ్యాఖ్య గురించి. ఆనాడు విశాలాంధ్ర భావన తెలంగాణలో చాలా బలంగా ఉండేది. అందుకే కమ్యూనిస్టులు నెహ్రూని సైతం విశాలాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేశారు. విశాలాంధ్ర ఆకాంక్ష బలంగా ఉందనటానికి సాక్ష్యం ఆనాటి ఉద్యమగీతాలే. ‘ముక్కలైన తెలుగునేలను ఒక్కటిగ చేసేస్తాం’ అంటూ సాగే గీతం అప్పట్లో చాలా ప్రముఖమైనది.
  ఏతావాతా ప్రజాభిప్రాయమే విశలాంధ్రకు వ్యతిరేకంగా ఉండుంటే అసలు నెహ్రూ విశాలాంధ్రకు అంగీకరించవలసిన అవసరం ఏమిటీ?

  మెచ్చుకోండి

 12. విశాలాంధ్ర భావన ఆనాడు బలం గా ఉందని నేను అంగీకరిస్తాను. అందుకే “మనము” అనే భావన ముందు ఉంది అని రాశాను. నెహ్రూ అంగీకరించింది ““తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి” అని కాదు. అంగీకరించకపోతే తన గోచి (లేక పోతే టొపీ) ఊడుతుందని అంగీకరించాడు.అందుకే వ్యవహార పరం గా అన్నాను.క్లారిటీ కోసం ఒక వాక్యాన్ని జత చేశాను, చూడండి.

  మెచ్చుకోండి

 13. జరిగిపోయిన చరిత్రను పట్టుకుని వేళ్ళాటం ఇరుప్రాంతాలకూ మంచిది కాదు. షరతులమీద మాత్రమే విశాలాంధ్ర అని తెలంగాణవారు (1969 ఉద్యమం) అయితే షరతుల్లేని విశాలాంధ్ర లేదా ప్రత్యేకాంద్ర అని ఆంధ్రా వారు (1972 తిరుపతి సమావేశం, ఆ తరువాత ఉద్యమం) స్పష్టంగా తేల్చిచెప్పిన విషయం చరిత్రద్వారా మనకు అవగతం అవుతున్నది. దాని పర్యవసానమే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్థితి. 1972లో ఇరుప్రాంతాల నాయకులూ అంగీకరించిన ఆరుసూత్రాల ప్రణాళిక, ఆ తర్వాత జరిగిన రాజ్యాంగ సవరణ ప్రకారమే ఇరుప్రాంతాల మధ్యా వనరుల పంపిణీ, పరిపాలనాదులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణవాదులు కావాలనే మరుగుపరుస్తారు.

  ప్రస్తుత స్థితిలో నిర్ణయించుకోవాల్సింది
  1. విభజనా లేదా సమైక్యరాష్ట్రమా?
  2. విభజనైతే ఎవరి వాటాలేమిటి?
  3. సమైక్యమైతే తప్పులెక్కడ జరుగుతున్నాయి, జరిగాయి అనే సమీక్ష.

  మెచ్చుకోండి

 14. తెలుగు మూలం తెనుగు అనీ, ‘తెన్‌’ అనే మూలద్రవిడం (అంటే దక్షిణం అని) నుండి పుట్టుకొచ్చిన పదమనీ బ్రౌన్‌ మహాశయుడు, మరి అనేకమంది మేధావుల అభిప్రాయం. త్రిలింగ (శ్రీశైలం-దక్షారామం-కాళేశ్వరం) మధ్యప్రాంత భాషే తెలుగు అని, ‘తెలంగాణా’ కూ మూలం అదేననీ మరికొందరి అభిప్రాయం. ఈ ‘ తేలివాహ’ మూలం వాదం మరో మూడవది. ఆంధ్ర అనేది వంశ [లేక తెగ] నామంగా తోస్తుంది. తెలుగుజాతి ఐక్యతే ముఖ్యాంశంగా ఏ పరిష్కారమైనా చేయాలి.

  మెచ్చుకోండి

 15. True the communists supported the concept of Vishalandhra but this was *after* they gained popularity by participating in grass roots struggle. The slogan “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” came up only after they gave up తెలంగాణ సాయుధ పోరాటం. PDF (CPI was banned in Hyderabad) did not fight under this banner in 1951. CPI failed to win a majority in the 1955 Andhra elections inspite of this slogan.

  Contrary to the comrades’s claims, the సాయుధ పోరాటం and their popularity was restricted to three districts only.

  మెచ్చుకోండి

 16. “హైదరాబాద్ సంస్కృతీ తెలంగాణ సంస్కృతీ ఒకటి కాదు.”

  ఏం మాట్లాడుతున్నారు మీరు ? తెలంగాణ కల్చర్ కి ఒక రూపం ఇచ్చిందే హైదరాబాద్. మీ ఆంద్రోళ్ళు తెలుగు సినిమా ల హైదరాబాదీలను చూపాలంటే, హిందువులు మైనారిటీ అన్నట్టు …మొత్తం ముస్లింలే అన్నట్ట్లు చూపిస్తరు..
  మిగతా తెలంగాణ కి హైదరాబాద్ కీ తేడా లేంటొ ?

  మెచ్చుకోండి

 17. మీరు చెప్పినట్లు తెలంగాణ సంస్కృతి పై హైదరాబాదీ తెహజీబ్ ప్రభావం కాదనలేనిది.కానీ ఈ రెండూ ఒకటే కాదనుకొంటా. దే ఆర్ సం వాట్ ఇడెంటికల్, బట్ నాట్ సేం!
  భాషా మతమూ వృత్తులూ కులాలూ వ్యవసాయమూ గ్రామీణ జీవన విధానమూ పాలక వర్గమూ యాభైల ముందున్న చరిత్రా వర్గాలూ నిజామూ అతనిపై పోరాటాలూ, నా మొహమూ ..నా ఇంకా చాలా ఉన్నాయి. అబ్బా ఇప్పుడు దిస్కషన్ పెట్టే ఓపిక లేదు. క్లుప్తం గా మీరు ఈ రెండూ సంస్కృతులూ ఎందుకు ఒకటే అనుకొంటున్నారో చెప్పేయండి.

  మెచ్చుకోండి

 18. సుందరయ్యగారి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ 1946 లోనే వెలువడింది. అంతకుముందు 1911 (లేక 13?) బాపట్ల మొదటి ఆంధ్రమహాసభనాటినుండీ తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండు మొదలై బలపడుతూనే వచ్చింది. ఎక్కువగా మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారి సమస్యకే పరిమితమైనా, నైజాం తెలుగువాళ్లనుకూడ ఐక్యం చేసుకోవాలనే భావన, వాదాలుకూడ వుండినాయి. కుతుబ్షాహీల కాలంలోనూ, నిజాం నవాబుల తొలిదశలోనూ (1760ల దాకా) ఇప్పటి ప్రాంతీయ గిరిగీతలు లేవు. మచిలీపట్నం (బందరు – ఉర్దూ వ్యుత్పత్తి) నిజాం రాష్ట్రంలో పెద్ద లాభసాటి రేవుగా వుండిందికూడ. అలాగే గుంటూరు, గోదావరీ (క్రిష్ణా తోబాటు) జిల్లాలుకూడ [సర్కారులని మొదట ఫ్రెంచివాళ్లకూ, తర్వాత బ్రిటిషువాళ్లకూ కట్టబెట్టేంతదాకా]. సరే, భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం మొదటగా ఉద్యమించిందీ, కాంగ్రెసు నాయకత్వాన్ని ఒప్పించి 1920-21 కే మద్రాసు రాష్ట్రంలోనే వుంటూ ఆంధ్ర కాంగ్రెసు కమిటీకూడ సాధించుకున్నదీ మనమే. కేవలం ఆంధ్ర రాష్ట్రంకోసమే కృషిచేసివుంటే, సైమన్ కమిషన్ కాలంలోనే (1928) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమేకాక మద్రాసుకూడ [కనీసం కూవంకు ఉత్తరభాగం అంటే హైకోర్టు, సెంట్రల్ స్టేషన్, పోర్టు వగైరాలతో ఒక సింహభాగం] మనకు దక్కివుండేది. కానీ ఆ నాడు మన నాయకులు జాతీయోద్యమ దృష్టితో భాషాప్రయుక్త రాష్ట్రాల పాలిసీ కావాలనే డిమాండు చేయడంతో అది అప్పుడు సాధ్యపడలేదు. ‘ సీమాంధ్ర ‘ ప్రాంతంలోని ఆంధ్ర మహాసభ స్ఫూర్తితోనే, నైజాంలో మొదట ఆంధ్రజనసంఘం, ఆనక 1930 జోగిపేట [శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి అధ్యక్షతన] ప్రథమ మహాసభతో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఏర్పాటై ముక్కోటి ఆంధ్రులు ఏకం కావాలనే అంతర్భావనతో పని చేస్తూ వచ్చాయనీ తెలియాలి. (ఇంకా వుంది)

  మెచ్చుకోండి

 19. అన్న మంచిగానే చెప్పినావు కాని నీవ పెద్దమనుషల ఒప్పందం గురించి చెప్పి లేవు.అయింక 6 సూత్రాల పద్కం గురించి ,తర్వాత వచ్చిన 610 జివో గుర్తు ఎర్క లేవు నీవు(ఎరుక లేదా నీకు )??

  మెచ్చుకోండి

 20. మన రాష్ట్రం లో ప్రతి రెండు జిల్లాలకీ యాస మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఒరిస్సాకి సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలతో పోలిస్తే వైజాగ్ యాస కొంచెం వేరుగా ఉంటుంది. అదే గోదావరి జిల్లాలకు వెల్లేసరికి మరింత మారిపోతుంది. విజయవాడ గుంటూరులకి వేరుగా, రాయలసీమలో వేరుగా, అలాగే హైదరాబాదుకీ ఇతర తెలంగాణ జిల్లాలకీ కూడా వేరుగా విభిన్న యాసలున్నాయి. కాని మనం గమనించాల్సింది ఏమిటంటే వీటిలో ఏదీ గ్రాంధికమైన తెలుగు కాదు. ఉదాహరణకు 1980/90 ల్లోని తెలుగు పుస్తకాల భాష ని ఏ ప్రాంతం వారైనా పూర్తిగా అనుకరిస్తున్నారా? లేదు. కాని తెలుగువారు మాత్రం ఒకరి యాసలని ఒకరు విమర్శించుకుంటున్నారు. ఒకప్పుడు నన్నయ లాంటి కవులు మన భాషని సంస్కరించారు. ఏ భావం వ్యక్తపరచడానికి ఎలాంటి పదాలు పనికొస్తాయో తెలియజెప్పారు. కాని మనం తెలుగు ని సరిగా మాట్లాడటానికి ఇష్టపడం. మనం మాట్లాడే తెలుగు మాత్రమే గొప్పదని భావిస్తాం. ముడ్డిలో కాస్త దురద ఎక్కువైతే ఇతర యాసలవారిని, ప్రాంతాలవారిని అతి గా అవమానిస్తాం. ఇలా విడిపోయిన మనం చివరికి రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోయాం. పరిస్థితి ని ఎంతవరకు తీసుకుపోయామంటే నాయకులు బూతులు తిట్టేసుకొని వాటిని “ఇదే మా సంస్కృతి, ఇదే మా యాస” అనే ముసుగులో సమర్థించుకోడానికి అవకాశమిచ్చాం. ఇలాంటి దరిద్ర భావాల మధ్య పెరిగిన యువత వ్యక్తిత్వం కూడా అంత మంచిగా ఉండదు. అందుకే మన యువత రాష్ట్రం బయటకు వెల్లి పని చేసేటపుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బయట రాష్ట్రాల్లో/దేశాల్లో చీప్ గా పక్కవారిని అవమానించడం సహించరు. అప్పుడు నోటిదురదని అదుపులో పెట్టుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

  అందుకే చెప్తున్నాను యువతరమా, కుళ్ళు జోకులు వేసుకోకుండా మంచి మంచి పుస్తకాలు చదవండి, గొప్ప వ్యక్తుల జీవితాలను ఓసారి గమనించండి. ఎదుటివారితో మన భావాలు స్పష్టంగా వివాదరహితంగా చెప్పడం ఎలాగో, చర్చించే పధ్ధతి ఏమిటో తెలుసుకోండి. మన నాయకులు ఎలాగూ ఉద్యోగాలు కల్పించరు. రేప్పొద్దున్న ఎక్కడికో వెళ్ళి బతకాల్సిందే. ఇప్పుడు మనం చూపించే అతి అక్కడా చూపిస్తే చిరిగిపోయేది మనకే. గుర్తుంచుకోండి.

  మెచ్చుకోండి

 21. సూర్య గారు,
  బూతులు మాట్లాడే వారి వాతావరణం వలన అవి పెద్ద బూతులు అని వారికి అనిపించవు. ఓ ప్రాంతం లో బూతయిన మాట వేరే ప్రాంతం లో మామూలు మాటవుతుంది. మీ కామెంట్ లో నాకు బూతు అనిపించే ఓ phrase రాశారు. రాస్తున్నపుడు మీకు అనిపించకపోవచ్చు. మొత్తం మీద, మీ కామెంట్ భావం తో ఏకీభవిస్తున్నాను.

  మెచ్చుకోండి

 22. తెలంగాణోద్యమ మూలాలను విశ్లేషిస్తూ అంతర్జాలంలో, గత ఐదేళ్ళ కాలంలో మొట్టమొదటిసారిగా కొంత అర్థవంతమయిన చర్చ కనిపించింది.

  మెచ్చుకోండి

 23. మీరు చెప్పింది నిజం. తెలంగాణ అంటెనె తెలుగు అని అర్థం. అక్కదనుందె అసలైన తెలుగువారు వచ్చారు. కనీసం 5 సంవత్సరాలనుంచయినా అందరం కలిసుండాలని రెండు ప్రాంతాలలొని వారు సమైఖ్యత ప్రదర్షించి ఉంటె ఈ సమస్య వచ్చివుండెది కాదు.

  మెచ్చుకోండి

 24. ప్రాంతీయతలూ, అసమానతలూ పాలకులు పెంచుతున్నారా? లేక రాజకీయ నిరుద్యోగులు పెంచుతున్నారా? పెట్టుబడిదారులు పెంచుతున్నారా? అనేది ఇదమిద్ధంగా చెప్పలేని విషయము. మీ చర్చలు అనుకోకుండా వచ్చి ఆసాంతం చదివాను. ప్రాంతాలకు అతీతంగా ప్రజలెప్పుడు అమాయకులే. ఆ అమాయకత్వంలోనే తెంపరితనమూ, అహంభావ ప్రదర్శనమూ వగైరా వగైరా కనిపిస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావానికి ముందు, తరువాత, ప్రస్తుత ఉద్యమ కాలాలను పరిశీలిస్తే ఈ ఉద్యమాలను నడిపిస్తున్నది ఎవరు? ఎందుచేత? అని సుదీర్ఘ ప్రశ్నలను సంధించుకోవలసి వస్తుంది. 1961 తెలంగాణా ఉద్యమం వెనుక రాజకీయ నిరుద్యోగం ఉందంటారు. మరి 1972 జై ఆంధ్ర ఉద్యమం వెనుక అదీ రాజకీయ నిరుద్యోగమే అందామా? తెలంగాణ భాష,యాస ఎంత వెక్కిరింపులకు గురి అయ్యిందో, తెలంగాణాలో కవులే లేరన్న అపవాదును సురవరం వారు గోలకొండ కవుల సంచిక ద్వారా పోగొ్ట్టడానికి ఎలా ప్రయాత్నించారో చరిత్ర తెలిసిన వారికందరికీ సుపరిచయమే. నదీ జలాల విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలలో ఎంత సాగునీరు అందుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణా రైతాంగం ఆరుగాలం కష్టించి వేల అడుగుల లోతులోకి బోరు బావులు తవ్వి అప్పుల పాలవుతున్న విషయం ఏ పత్రికా పతాక శీర్షికన రాయకపోవచ్చు. కానీ అతని వృథా ప్రయాస వెనుక కాలే కడుపున్నదని గమనించండి. నిజంగా సమైక్యమే కోరుకునే మీడియా రంగం నిష్పక్ష పాతంగా అన్ని ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారికి లభిస్తున్న వనరులను, వారు ఉపయోగించుకోలే పోతున్న తీరును బహిరంగ పరిచి చర్చించమనండి. ఆపని ఫోర్త్ ఎస్టేట్ అని డాంబికాలు పలుకుతున్న ఏ మీడియా గానీ, ఏ నాయకుడు గానీ చెయ్యరు. ఒక ప్రాంత ప్రజలు అన్యాయానికి గురి అయ్యాం బాబోయ్ అంటే చెప్పవలసింది శ్రీరంగనీతులు కాదు. ఏవేవో పనికి రాని లెక్కలూ కాదు. ప్రత్యక్ష ఫలితాలు. తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు అని కొందరంటుంటారు. అది నిజమే అయితే 2001 నుంచి ఉద్యమం నడుస్తుంది కదా! అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచకుండా అడ్డుకున్నదెవరు. రైతులకు ఉచితకరెంటు ఎంత కల్లబొల్లి మాటో తెలంగాణా రైతాంగాన్ని అడగండి. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడమే కష్టం అన్న ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టింది. మరిప్పుడు దాని పరిస్థితి ఏమిటి? మొత్తం మీద పాలకులో, ఇంకెవరో కారణంగా తెలంగాణ ప్రజలకు ఎప్పటినుంచే ఉన్న విడిపోదామన్న కాంక్ష బాగా బలపడింది. దాన్ని ఏ కారణం చెప్పి ఆపలేము.
  నిజానికి పెనం మీదనుంచి జారి,
  పోయ్యిలో పడింది సమైక్యం,
  ఎప్పుడో బూడిదయ్యింది ఐక్యం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 25. నెహ్రూ గారి మాటగా (ఉపమానము) అందరూ అంటున్నట్టు , ఆంధ్రా , తెలంగాణకు సంబందించి , అమాయకపు అమ్మాయిని తుంటరి కుర్రాడికి ఇచ్చి పెళ్ళిచేస్తున్నాము , ఎప్పుడైనా ఇద్దరి మధ్య పొసగకపోతే విడిపోవచ్చు.

  ఇప్పుడు యూ.ఫీ.ఏ , కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా, తెలంగాణకు విడాకులు (విభజన) ఇద్దాము అని నిర్ణయించింది. కాని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని , ఆంధ్రా వాళ్ళు 10 సంవత్సరాలు ఇక్కడే వారికి రాజధాని నిర్మాణం , మౌలికవసతులు ఏర్పడే వరకు ఉంటారు అని అంటున్నారు .

  సరే రాష్ట్రాలు , విభజనలో ఇది ఒక భాగం , సరి ఐన సామాన్య విషయం అనుకోవచ్చా?
  పైన పోలికకు సమానంగా , నిజ జీవితంలో ఒక భార్య , తన భర్త తో ఇక నేను కలిసి ఉండలేను అని అంటే , విడాకులు ఇవ్వాలని నిర్ణయించిన పెద్దలు కొన్ని షరతులు అంటే ,
  నువ్వు ఉండే ఇంట్లో నే అతడు ఉంటాడు.
  అతనికి వంట చేసు కోవడం రాదు కాబట్టి , నువ్వే వండిపెట్టాలి .
  అతనికి బట్టలు ఉతుక్కోవడం రాదు కాబట్టీ , నువ్వే ఉతకాలి .
  అతనికి పెళ్ళి చేసు కోవడానికి ఇంకో అమ్మాయి దొరికే వరకు , నీతోనే కాపురం చేస్తాడు .
  ఇలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా , వినే వారికి కూడా అసహ్యంగా ఉండదా.

  మెచ్చుకోండి

 26. చాలా మంచి మాటలు చెప్పావు. నువ్వు రాసే ఉపమానం ఆంధ్రావారికి అర్థంకాక, పాపం తెలంగాణా వారితో కలసి ఉందామనుకొంట్టున్నారు. వ్యవహారాలు ఉపమానాల ఆధారంగా జరిగితే, ఈ పాటికి శ్రీ శ్రీ, గురజాడా ఆంధ్రా ముఖ్యమంత్రులయ్యి ఉంటారు. ఇంతకీ ఏందయ్య నీ గోల? ఆంధ్రవాళ్లు మీ ఊరొదిలిపోవాలా? నువ్వేమి బెంగ పడమాక, సమయంవస్తే ఖాళి చేసి పోతారులే ! నువ్వు ఏ రోజుల్లో ఉన్నావో, కాలం మారింది. ఈ రోజుల్లో అబ్బాయిలందరికి వంట బాగావచ్చు. పెళ్లాం లేకపోతే జీవితంలో వచ్చిన లోటు ఎమీ లేదు. రోటి మాటిక్స్ మెషిన్ కొనుకొని రొట్టెలు చేసుకొని తింటాడు, కుక్కర్లో పడే స్తే రెండు నిముషాలలో అన్నం , వాషింగ్ మిషన్ లో గుడ్డలు ఉతుకొని శుభ్రం చేసుకొంటాడు. మీలాంటి నస పెట్టే భార్యతో ఎలాగైనా కాపురం చేసి, సంసారాన్ని నిలబేట్టుకోవాలని ఎవరు తాపత్రయ పడటం లేదు. కొంచెం ఓపిక పట్టు,మా వాట మేము తీసుకొని మీకు టాటా చెపుతాం.

  మెచ్చుకోండి

 27. Anonymous గారు సెలవిచ్చిన మాట నాకేం బాగాలేదు. అసలు నెహ్రూ ఆ పోలిక
  ఎందుకు తెచ్చాడో తెలియదు గానీ, ఈ తెలంగాణ వాళ్ళు పదే పదే ఉపయోగించడం ఎబ్బెట్టుగా ఉంటుంది. కుటుంబాలతో పోలికలు తెస్తూ, విభజన విషయం మాట్లాడడం అంత శ్రేయస్కరం కాదు. అసలు ప్రాంతీయ అసమానతలు వచ్చాయన్నది జగమెరిగిన సత్యం అయినప్పుడు ఎంచక్కా విడిపోవడం శ్రేయస్కరం. అదవా కలిసుందామన్న మాట ఏ ప్రతిపాదన మీద అడుగుతున్నారు. జాతీయ ఐక్యతకు భంగం కలుగుతుందన్నవారిని చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. అలాగే కలిసుందామంటే అఖండభారతావనిని ఒక్కటిగా చేసి నిరూపిద్దాం. అసలు స్వతంత్రభారతవనిలో రాష్ట్రవిభజనలు, కొత్తరాష్ట్ర ప్రతిపాదనలు తెచ్చింది ఆంధ్రులైనప్పుడు. తోలవెంట తోకఉంటుదని తెలుసుకోలేదా. తెలంగాణలో అయితే ఎడ్లెంట ముడ్లు అనే సామెత వాడతారు. అలాగా ఉందన్న మాట వారి వరుస. దయచేసి ఇకపై తెలంగాణ వారు నెహ్రూ ఇచ్చిన ఉపమానాన్ని ఉపయోగించకండి. సగౌరవంగా మాట్లాడం నేర్చుకుంటే మనకే మంచింది.
  ఆ.ఆనందీశ్వరరెడ్డి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s