హిపోక్రసీ తప్పదు.. మనిషి ఎప్పుడు మారతాడు?

ఒకప్పుడు వామపక్ష మేధావులు ఆంధ్ర ను ఏలుతూ ఉండే వారు. ఒక రచయిత కు నిబధ్ధత (కమిట్-మెంట్) లేకపోతే తప్పుగా చూసే వారు. శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబ రావు, రావి శాస్త్రి వంటి వారు ఓ కమిట్మెంట్ తో రచనలు సాగించారు. అయితే అప్పట్లో వీరి రచనలే వెలుగు చూసేవి….వీరి వ్యక్తిగత జీవితాలు జనాల కు అంత గా తెలిసేవి కావు. వీరి రచనల ప్రభావం మధ్య తరగతి బుధ్ధిజీవుల పై అపారం. వారి వారి జీవితాల చివరి దశ లో వారి జీవిత వాస్తవాలను తెలిపే పుస్తకాలు ప్రచురితమయ్యాయి. శ్రీ శ్రీ అనంతం లో చాలా నిర్మొహమాటం గా తన జీవిత విశేషాలను బయటపెట్టారు. రావి శాస్త్రీయం వలన, శాస్త్రి గారి జీవితం ఎలా జరిగిందో కొంత అవగాహన వస్తుంది. అలానే కొ.కు లేఖల వలన , ఆయన కూడా మన లాంటి సగటు మధ్య తరగతి జీవిగానే జీవించారని అర్ధమవుతుంది.
వామ పక్ష భావ జాలాన్ని వ్యాప్తి చేయటం వీరి రచనల ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.శ్రీ శ్రీ కవిత్వం చదివి నక్సలైట్ల లో చేరినవారున్నారు. కానీ ఈ వాలుకుర్చీ మేధావులందరూ, మనందరిలానే, పట్టణాలలో సేఫ్ గా, సినిమా పెట్టుబడిదారుల దగ్గరో, పత్రికా కామందుల దగ్గరో ఉద్యోగం చేసుకొంటూ, తమ పిల్లల ఉద్యోగాల కోసం సిఫారసులూ గట్రా చేయించుకొంటూ, సాయంత్రానికి ,ఏ సంగీత కచేరి కో వెళ్ళివస్తూ జీవితాన్ని గడిపారు.
అంటే తాము వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ లోనే ఈదులాడుతూ, ఆ వ్యవస్థ కి వినియోగదారులు గానో, ఉద్యోగులు గానో, ఒక్కోసారి చిన్న చిన్న పెట్టుబడి దారులు గానో సహకరిస్తూ, ప్రజల లో మాత్రం వామ పక్ష భావ జాల వ్యప్తి కి కృషి చేశారు.
దీనిని గురించి ఆ రోజుల్లోనే శ్రీ శ్రీ ని ప్రశ్నిస్తే, ఆయన పొట్ట కూటి కోసం సినిమాల లో పని చేస్తున్నానని చెప్పారు. ఓ కూలివాడు పొట్టకూటి కోసం పని చేస్తున్నానంటె సరే., ఎగువ మధ్యతరగతి జీవితం కొన సాగిస్తూ, కార్ల లో తిరగ గలిగిన వ్యక్తి కూడా పొట్టకూటి కోసమే రాస్తారా? పిల్లల విద్య, ఉద్యోగం, ఇల్లు కట్టుకోవటం వగైరా కూడా పొట్ట కూటికిందికే వస్తాయా? అలా అయితే ఓ పారిశ్రామిక వేత్త కూడా తాను పొట్టకూటికోసమె పరిశ్రమ నడుపుతున్నానని చెప్పవచ్చు. మధ్య తరగతి వాడికి ఇల్లు కట్టుకోవటం లేక కారు కొనుక్కోవటం పొట్ట కూడైతే, ఎగువ తరగతి వాడికి భార్యకి డైమండ్ నెక్లేస్ కొనిపెట్టటం పొట్టకూడు అవుతుంది కదా?లేక ప్రత్యర్ధి కంపెనీ తో పోలిస్తే తన కంపెనీ నే లాభాలలో ముందుండటం, ఓ క్యాపిటలిస్ట్ కి పొట్టకూటి తో సమానం కావచ్చు.
కాపిటలిస్టు తన మానసిక అవసరాలను శ్రామికుల భౌతిక అవసరాలతో (పొట్టకూడు) ఈక్వేట్ చేయటం ఎలా సరి కాదో, మేధావులు తమ సౌకర్యావసరాలను పొట్టకూటి తో equate చేయటం కూడా అలానే సరి కాదు.

వామ పక్ష సాయుధ పోరాటాలలో పాల్గొనని వారు, మిగిలిన జనాలు అలా పాల్గొనేలా ప్రేరేపిస్తూ రచనలు సాగించటం ఎంత వరకూ సబబు? ఇదే ప్రశ్న కొ.కు ని అడిగితే, ఆయన “ఓ పెట్టుబడి దారీ ఫాక్టరీ లో మానేజర్ పని చేయడు..చేయిస్తాడు. అలానే వామ పక్ష మేధావులు భావ వ్యాప్తి మాత్రమే చేయటం లో తప్పేముంది?”, అన్నారు. తాము వ్యతిరేకించే పెట్టుబడి దారి నుంచీ ఓ ఉదాహరణ ని, తమ ను సమర్ధించుకోవటానికి ఉపయోగించటం ఎంత వరకూ సబబు?

మానేజ్మెంట్ కూడా మేధో శ్రమ అనిగుర్తిస్తే, అది కాపిటలిజం లో అయినా, కమ్యూనిజం లో అయినా సిగ్గుపడవలసిన విషయం కాదు. మానేజ్మెంట్ అనేది ఏ వ్యవస్థ లో అయినా చెడ్డది కాదు. కాపిటలిజం లోని అన్ని విషయాలనూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.hierarchy అనేది కాపిటలిజం కి మాత్రమే సంబంధించినది కాదు (బట్టలు వేసుకోవటం లాగా, వావి వరసల లా..). అది కాపిటలిజం కంటే పురాతనమైనది. కపిటలిజం కూడా ఉత్పాదనా సౌలభ్యం కోసం hierarchy ని ఉపయోగిస్తుంది.  క్యాపిటలిస్ట్ కర్మా గారం లో అయినా, కమ్యూనిస్ట్ కర్మాగారం లో అయినాhierarchy తప్పదు. ఒక పని ఇంకో పని కంటే గౌరవప్రదం అనటమే తప్పు. కానీ ఆయా వ్యవస్థ ల లో ఆయా పనుల కున్న ప్రాముఖ్యతా, లభ్యతలను బట్టి,పనుల్లో ఉందే  రిస్క్ ని బట్టీ,వారి శ్రమని బట్టీ,నిబధ్ధతని బట్టీ,.. ఆ పని చేసే వారికిచ్చే గౌరవం లో కూడా నెమ్మది గా తేడా వస్తుంది.
చిక్కంతా, అడవుల లోకి పోయి గన్ను పట్టటం లాంటి పనులలో ఉండే రిస్క్ కి జడిసో,రిస్క్ చేసేంత ధైర్యం లేకో,రిస్క్ చేసేంత నిస్వార్ధత లేకో , రిస్క్ లేని, “సాహిత్యం సృష్టి” వంటి పనులు చేస్తున్నామని నిజాయితీ గా ఒప్పుకోకపోవటం లో ఉంది.

(ఇక రావి శాస్త్రి గారు, “మేధావులందరి చేతా నిర్బంధ శారీరక శ్రమ చేయిస్తే గానీ వారికి శ్రమ విలువ తెలియదు”, అన్నారు. అంటే, ఆయన కు మేధో శ్రమ కూడా శ్రమే నన్న ఆలోచన ఉన్నట్లు లేదు.)

————————————————————–

ఇక ఇప్పుడు నాణానికి ఆవలి వైపు చూద్దాం. మిగిలిన అందరి లానే ఈ మేధావులు కూడా మన సమాజం లోనే పుట్టారు. సమాజం లోని లోటు పాట్లే వారి ప్రవర్తన లోనూ కనపడుతాయి. (రిక్షావాడిని, “ఏమండీ, మీరు”, అని పిలిచే వా.ప. మేధావిని నేను ఇంతవరకూ చూడ లేదు.) వారి స్నేహితులూ, బంధువులూ ఈ సమాజం లోనే ఉంటారు. వారికి కొంత వయసు వచ్చే సరిలి పెళ్ళి అయ్యి,పిల్లలు పుట్టి, సమాజపు బంధాల నుంచీ అంత తేలిక గా బయట పడే అవకాశం ఉండదు.  ఏ యుక్త వయసు లోనో ఈ భావజాలం వైపు ఆకర్షితులౌతారు. ఎంత భావజాలం నచ్చితే మాత్రం, తట్ట బుట్టా సర్దుకొని సాయుధ పోరాటం లోకి వెళ్ళాలనటం సబబేనా?

అందరూ అన్ని పనులూ బాగా చేయలేరు. కొందరి కి గన్ను పట్టటం  గొప్ప గా వస్తే, కొందరికి పెన్ను పట్టి రాయటం గొప్పగా రావచ్చు.  ఎవరికి వచ్చిన పనిని వారు చేయటం మంచిదా , రాని పని లో వేలు పట్టటం మంచిదా?
సరే అడవుల్లోకి వెళ్ళి పెన్ను కు బదులు గా గన్ను పట్టారనుకొందాం. అప్పుడైనా పెట్టుబడి దారి వ్యవస్థ తో పూర్తి గ తెగ తెంపులు సాధ్య మౌతాయా? గన్ను కొనాలంటే డబ్బు కావాలి. ఆయుధాలను చేరవేయాలంటే, బూర్జువా వ్యవస్థ తయారు చేసిన వాహనాలు కావాలి.
ఓ వ్యక్తి నూరు శాతం పె.దా. వ్యవస్థ తో తెగతెంపులు చేసుకోవాలనుకొంటే, ఏ అడవి లోకో వెళ్ళి కందమూలాలు తింటూ, ఆకులు కప్పుకొని బతకాలి…లేక ఎందులో అయినా దూకి చావాలి. చచ్చి సాధించేదేమీ లేదు.బతికి పోరాడితే, ఎప్పటికైనా సోషలిస్టు వ్యవస్థ రావచ్చు.
అడవి లో కూడా ఏ రోగమో వస్తే మళ్ళీ మందు కోసం డబ్బుపెట్టి కొనాల్సిందే! కాబట్టీ పెట్టుబడిదారి లో ఉంటూ, దాని తో పూర్తి గా తెగతెంపులు చేసుకోవటం సాధ్యం కాదు. పెట్టుబ్డి దారి వ్యవస్థే కాదు..,ఏ వ్యవస్థ లో అయినా సరే ఉంటూ,అదే వ్యవస్థ తో తెగ తెంపులు చేసుకోవటం, కాని పని.స్పార్టకస్ బానిస గానే ఉంటూ, బానిస వ్యవస్థ కి వ్యతిరేకం గా పోరాడాడు . బానిస వ్యవస్థ లో ఉండటమంటే, ఆ వ్యవస్థ కి సహకరించినట్లు కాదు. ఇండియన్స్ బ్రిటిష్ వ్యవస్థ లోనే ఉంటూ అ వ్యవస్థ కి వ్యతిరేకం గా పోరాడారు. పురుషాధిపత్యం ఉన్న కుటుంబం లోని స్త్రీ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, స్త్రీ విముక్తి గురించి ఆలోచించవచ్చు. అంత మాత్రాన ఆమె పురుషాధిక్యత కు సహకరించినట్లు కాదు.

ఓ వ్యవస్థ కి చరమ గీతం పాడే మార్పు ఆ వ్యవస్థ లోంచేవస్తుంది. అలాని ఆ ఆలోచన చేసిన వ్యక్తి హిపోక్రాట్ కాదు.
తెగ తెంపులు అనేది ఆ వ్యక్తి కిమాత్రమే పరిమితమైన మోరల్ డైలమా. ఈ మేధావులు ఎవరూ,కావాలని పెట్టుబడి దారి తో అంట కాగ లేదు. సాధ్యమైతే, పె.దా. వ్యవస్థ తో తెగ తెంపులు చేసుకొని, తన ఆదర్శ వ్యవస్థ లో ఉండాలని అనుకొంటారు. కానీ, అది ప్రాక్టికల్ గా సంభవం కాని విషయం. వ్యవస్థ లో కంట్రోల్ అంతా ధనవంతుల చేతిలోనే ఉంటుంది.   పె.దా వ్యవస్థ లో అధికార వర్గాలు సామాన్య వ్యక్తి కి వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. కాబట్టీ, మేధావులు వ్యవస్థ లోనే ఉంటూ, వ్యవస్థని ప్రశ్నించటం  హిపోక్రసీ లా అనిపించినా, వారికి ఆ  దుస్థితి కల్పించింది మాత్రం పె.దా. వ్యవస్థే. కాబట్టీ ఆ హిపోక్రసీ కి బాధ్యత పె.దా. వ్యవస్థ దే ! (దానిని హిపోక్రసీ అనికూడా అనలేము. తన ఇష్టం తో నే ఓ వ్యవస్థ లోఉంటూ, ఆ వ్యవస్థ ని ఇష్ట పడుతూ, ఆ వ్యవస్థ నే విమర్శిస్తే, దానిని హొపోక్రసీ అనవచ్చు. ఇష్టం లేక పోయినా, తప్పని సరై ఓ వ్యవస్థ లో ఉంటూ, ఆ వ్యవస్థ పట్ల తన అయిష్టాన్ని వ్యక్తపరిస్తే, దానిని హిపోక్రసీ అనరు. ) పెట్టుబడి దారి వ్యవస్థ ని ప్రశ్నించే అర్హత ప్రజలందరికీ ఉంటుంది. ఒక్క పెట్టుబడి దారుకి మాత్రమే ఆ అర్హత ఉండదు. ఈ మేధావులెవరూ పెట్టుబడి దారులు కాదు. వారు లాభాలని ని సృష్టించటం కోసం డబ్బుని వాడటం లేదు. జీతం ద్వారా వచ్చిన డబ్బుని తమ వ్యక్తిగత అవసరాలకోసం వాడుతున్నారు.మార్క్స్ ప్రకారం వీరంతా శ్రామిక వర్గమే! (search Das Capital C-M-C)

అయితే వామపక్ష మేధావులు అడవుల్లోకి వెళ్ళి పోరాటం ఎందుకు చేయ లేదు అనే ప్రశ్న వస్తుంది. అందరికీ ఒకే వీలు ఉండకపోవచ్చు. పీకల్లోతు సంసార సాగరం లో మునిగిన వాడికంటే, పెళ్ళికాని యువకుడికి పోరాటం లోకి వెళ్ళే వీలు ఎక్కువ.
అలానే, కొందరి లో altruistic genes ఉంది త్యాగాలు చేయటం వారికి ఈజీ కావచ్చు.

ఈ వామపక్ష మేధావులు వ్యవస్థ లోనే ఉంటూ, తమ భావజాల వ్యాప్తి కోసం చాలానే కృషీ, త్యాగాలూ చేశారు. దారిన పోయే ప్రతి గన్నయ్య కీ వీరి నిబధ్ధత నీ, నిజాయితీ నీ వేలు చూపే అర్హత ఉండదు. వేలు చూపే ముందు, గన్నయ్య లు తాము ఏం చేశామో ప్రశ్నించుకోవలి. తాను మార్క్సిస్టు ని కానంత మాత్రాన, “మార్క్సిస్టులు అయిన వారిని, సోషలిస్టు విలువలకి శిలువ వేసే హక్కు తమకు ఉంది”, అనుకోవటం గన్నయ్యల వెర్రితనం.

అయితే పైకి ఒకటి చెప్పి, వేరే పని చేసే వారంతా సిసలైన సోషలిస్ట్ సానుభూతి పరులా. ఒకప్పుడు జన నాట్య మండలి లో సభ్యుడైన అల్లు రామ లింగయ్య కుటుంబం, తరువాత సినిమా ఇండస్త్రీ మూల స్థంభాలలో ఒకటి గా మారింది. ఇందులో ఏమీ హిపోక్రసీ లేదా?
ఒక వేళ ఆ పాత రోజుల్లో సామ్య వాద వ్యవస్థ వచ్చి ఉంటే, ఇలాంటి వారి ప్రభావం వ్యవస్థ పై ఎలా ఉండేది? వ్యక్తుల ప్రవర్తన ఉన్నతం గా మారనపుడు, సొషలిస్ట్ చట్రం కుంగిపోక తప్పదు. అది రష్యా లో నిరూపించబడినది. మరి వ్యక్తుల ప్రవర్తన ఆదర్శవంతం గా ఎలా మారుతుంది. భావజాల వ్యాప్తి ద్వారా సాధ్యమా? భావజాలం కేవలం ఉపరితల అంశం మాత్రమే. చాలా మంది భావజాలం లో ఉండే భావోద్వేగానికి ఆకర్షితులు కావచ్చు. కానీ, వారి ప్రవర్తన లోని లోపాలు అలానే ఉండ వచ్చు.
ప్రవర్తన మారాలంటే, మామూలు మానవుల్లో (altruistic genes లేని వారి లో) అది మనుగడ ను ప్రభావితం చేయటం ద్వారానే సంభవం. అంటే, మనిషి తన మనుగడ కి సొషలిస్ట్ విలువలు ఉపయోగపడితే వాటిని అనుసరిస్తాడు. లేక పోతే ధనస్వామ్య విలువలు ఉపయోగపడితే వాటిని అనుసరిస్తాడు. ఒకప్పుడు పల్లెలలో సమిష్టి జీవనం చక్క గా ఉండేది. దానికి మూల కారణం కుటుంబాలకి ఒకరి మీద ఒకరికి ఉండే mutual dependency. ఒకరి ఇంట్లో పెళ్ళైతే నలుగురు వచ్చి ఓ చెయ్యేసేవారు. ఎందుకంటే తమ ఇంట్లో పెళ్ళైతే మిగిలిన వారి సహకారం కావాలి కాబట్టీ…  అది ఓ సంస్కృతి గా ఉండేది (“ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు”, అన్న శ్రీ శ్రీ మాట కి దగ్గర గా ఉండేది ఈ సంస్కృతి). కానీ క్రమం గా జనాలు చదువుకొని, ప్రయాణాలు చేసి పట్టణాలకు చేరుకొన్నారు. ఇక్కడ డబ్బుతో అన్ని పనులూ అయిపోతాయి. కాటరింగ్ కి ఇస్తే ఫంక్షన్ జరిగిపోతుంది. పక్కవాడి తో సంబంధం లేదు. ఇక్కడ జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రజలు ఈ సంస్కృతి కి కూడా అలవాటు పడ్డారు. అప్పుడప్పుడూ పాతరోజులు గురించి తలచుకొన్నా, మళ్ళీ పల్లెటూళ్ళకి వెళ్ళటానికి ఎంత మంది సిధ్ధపడతారు? కాబట్టీ మన లో చాలా మంది సోషలిస్ట్ వ్యవస్థ మీది ప్రేమ తో దానిని అనుసరించం. అది మన వ్యక్తి గత అవసరాలను తీర్చినంత కాలం దానిని ఆదరిస్తాం.

ఎవరో altruistic genes ఉన్న వాళ్ళు మాత్రం ఏ వ్యవస్థ లో అయినా సమాజం కోసం తమ జీవితాన్ని ధారపోస్తారు, ఇక ముందు కూడా అలా పోస్తూనే ఉంటారు. సమాజం లో అందరూ ఇలాంటి త్యాగ రాజులే ఉంటే ఆ సమాజం రిస్క్ లో పడుతుంది….
ఓ ఊరికి వరద వచ్చి, కరకట్ట కి గండి పడిందనుకొందాం. ఊళ్ళో కొంతమంది కరకట్టకి అడ్డువేయటానికి ప్రయత్నిస్తారు. అయితే అందులో రిస్క్ ఉంది. వరద సడన్ గా పెద్దదైతే కొట్టుకొని పోతారు. ఊర్లో అందరూ త్యాగరాజులై, అందరూ గండి వద్దకు వెళ్తే, వరద ఉధ్ధృతి సడన్ గా పెరిగితే, ఊరి జనమంతా కొట్టుకొని పోతారు. అదే, కొందరైనా స్వార్ధపరులు ఉంటే , ఆ  కొందరు స్వార్ధపరులు ఊరు విడిచి ఎస్కేప్ అవటం వలన, ఊర్లో కొంతమందైనా మిగులుతారు. అందుకే పరిణామ సిధ్ధాంతం ప్రకారం ఓ జాతి లో స్వార్ధపరులూ, త్యాగధనులు, పిరికివాళ్ళూ, ఇలా అందరూ ఉండాలి. వైవిధ్యం లోనే మనుగడ ఉంది.

వ్యక్తి బుర్ర లోనే కులం, మతం, మత విలువలూ, సామాజిక చట్రాలూ ఉంటాయి. వ్యక్తులెవరూ లేకపోతే సామాజిక చట్రం ఉందదు. కానీ వ్యక్తి  లో సమాజ పరిధిలో లేని అంశాలు ఉనాయి. సమాజం కూడా జీవ జాతుల పరిణామం లోంచే వచ్చింది. మనిషి శరీరం కూడా జీవ పరిణామ ఫలమే. మనిషి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం లాంటి విషయాలు సమాజం పరిధి బయట ఉంటాయి. అలానె మనిషి జనన మరణాలు వ్యక్తిగతమైనవి. ఇవి సమాజంతో పంచుకోలేనివి. అందుకే, మరణానంతర జీవితం, దేవుడు మొదలైన వి షయాలు వ్యక్తిగతం గా ఉంటాయి. సమాజ పరిధి లో లేని అంశాలు వ్యక్తి లో ఇమిడి ఉండటం వలన, సమాజ చట్రాన్ని మార్చటం ద్వారా, మనిషి ప్రవర్తనని పూర్తిగా కంట్రోల్ చేయలేము. అంటే, సమాజం ప్రభావితం చేయగల అంశాలు మనిషిలో కొన్ని మాత్రమే ఉంటాయి. సమజం పరిధి బయట ఉందే ఫిజియాలజీ, జీన్స్ లాంటి అంశాలు మనిషిని ప్రభావితం చేస్తాయి. వ్యక్తిని పూర్తి బుధ్ధిమంతుడి గా చేయటం పూర్తిగా  సొషలిస్ట్ వ్యవస్థ పరిధి లో మాత్రమే ఉందదు.
అయితే మనిషి పరిణామ క్రమం లో, బట్టలు వేసుకోవటం, వావి వరుసలు పాటించటం లాంటి విలువలని అందరూ పాటిస్తున్నారు కదా. అలానే సోషలిస్ట్ విలువలను, మేధావులు ప్రయత్నించగా ప్రయత్నించ గా, జనాలందరూ  కొంత కాలం తరువాత పాటిస్తారేమో?
కుటుంబ వరుసలకూ, బట్టలు వేసుకోవటానికీ…….. మనుగడ కి సంబంధించిన కారణాలూ, మనిషి బ్రెయిన్ కి సంబంధించిన భావోద్వేగ జీన్స్ లో వచ్చిన మార్పులూ, మనిషి కి పెరిగిన మెమరీ, మనుగడకి సంబంధిన కారణాలూ (కుటుంబం విషయం లో), ఉన్నాయి. కానీ సోషలిస్ట్ విలువల విషయం లో, ఇటువంటి మనుగడ సంబంధమైన సపోర్ట్ మనిషికి లేదు. సామ్యవాద వ్యవస్థ ఎల్ల కాలం నిలబడాలంటే, అందరూ నిస్వార్ధ జీవులవ్వాలి.  అలా అన్ని పరిస్థితులలోనూ, కాలాలలోనూ ఉండటం బయలాజికల్ గా altruistic genes ఉన్న వారికి మాత్రమే సాధ్యం. కానీ, వారిశాతం చాలా తక్కువ. కాబట్టీ… సోషలిస్ట్ వ్యవస్థ వచ్చినా అది ఎల్ల వేళ లా నిలబడలేదు. కొంత కాలం, దాని వలన వ్యక్తి కి ఉపయోగం ఉన్నంత వరకూ నిలబడుతుంది. వ్యవస్థ లోని అందరివ్యక్తులూ మంచిగా ఉంటే మాత్రమే నిలబడే చట్రం ఎక్కువ కాలం మనలేదు. అందరూ, అన్ని కాలాలలోనూ నిస్వార్ధం గా ఉండటం ఎంత సంభవమో, ఎల్ల కాలం మనగలిగే సోషలిస్ట్ వ్యవస్థ కూడా అంత సంభవం.

మనిషి మనుగడ ను ప్రభావితం చేసే, శాస్త్ర సాంకేతిక, ఉత్పత్తి రంగా ల లోని మార్పుల వలనే మనిషి లో మార్పు సాధ్యమౌతుంది.
మనిషి లో మెచ్యూరిటీ అనేది ఇవాల్వ్ అవుతూ వస్తుంది.ది సడన్ గా రాదు. ప్రపంచం లోని విప్లవాలన్నిటి ముందూ, కొన్ని శతాబ్దాల పాటు ప్రజలలో క్రమం గా పేరు కొన్న ఆగ్రహమే, సమాజం లో ని అందరి దృష్టినీ ఆకర్షించిన ఒక పాలక వర్గ దుశ్చర్య వలననో, ఓ అన్యాయ విధానం వలననో, ఒక్క సారి పెల్లుబికుతుంది. విప్లవం తరువాత వచ్చిన వ్యవస్థ, ముందున్న వ్యవస్థ కంటే అన్ని వేళల మెరుగు గా ఉందదు. బ్రిటిష్ విప్లవం తరువాత క్రాంవెల్ హయాం, ఫ్రెంచ్ విప్లవం తరువాతి నెపోలియన్8 హయాం, మొన్నటి ఈజిప్ట్ విప్లవం తరువాతి ప్రభుత్వాలే ఇందుకు సాక్ష్యం. అయితే విప్లవాల తో సంబంధం లేకుండా, ప్రజల awareness పెరిగేకొద్దీ ప్రజల హక్కులు మాత్రం మెరుగవుతూ వచ్చాయి .
విప్లవం తరువాత వచ్చే ప్రభుత్వాలు, ప్రజల చైతన్యాన్ని బట్టి ఉంటాయి. ఆ చైతన్య స్థాయి కంటే ఉన్నతం గా ఉన్న వ్యవస్థ వచ్చినా అది విజయవంతం కాలేదు. రష్యా విప్లవం తరువాత, లెనిన్ వలన వచ్చిన సామ్యవాద వ్యవస్థా, ఇండియాలో స్వతంత్రం తరువాత నెహ్రూ భారత ప్రజలకి బహుకరించిన ప్రజాస్వామ్య వ్యవస్థా ఇందుకు ఉదాహరణలు. ప్రజల చైతన్య స్థాయి కంటే చాలా ఉన్నతం గా ఉన్న ఈ వ్యవస్థ లు విజయవంతం కాలేకపోయాయి. ఎవరో ఇవ్వటం వలన వచ్చిన వోటు హక్కు విలువ భారత ప్రజలకు ఇంకా తెలియాల్సి ఉంది. అదే, ఫ్రాన్స్ విప్లవం తరువాత అక్కడి ప్రజలు పోరాడి సాధించుకొన్న వోటు హక్కును, వారు చాలా విజ్ఞత తో ఉపయోగించారు.

 

ప్రకటనలు

9 thoughts on “హిపోక్రసీ తప్పదు.. మనిషి ఎప్పుడు మారతాడు?

 1. కమ్యూనిస్టు ప్రభుత్వం గానీ, సోషలిస్టు ప్రభుత్వం గానీ ఒక్క ఉదుటన వచ్చేది కాదు. అవి ఒక స్రవంతి లో భాగంగా రావాల్సిన సమయానికి రావాల్సినవి. మార్క్స్ దాన్ని ముందే ఊహించి గట్టి పునాదులు వెయ్యాటానికి ప్రయత్నించాడు. మర్క్స్ భావాల చేత విపరీతంగా ఆకర్షితులయిన శ్రీ శ్రీ లాంటి వాళ్ళు ఆ ప్రవాహంలో రచనలు చేశారు. కానీ ఈ పోరాటాలు ఏవీ కమ్యూనిజం రావాటాన్ని వేగవంతం చెయ్యలేవు (రష్యా అందుకు ఉదాహరణ) కాని అది రావల్సిన సమయానికి (ప్రస్తుత పెట్టుబడిదారీ విధానం ఒకానొక దశకు చేరుకుని పూర్తిగా saturate అయ్యాక.) ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

  1. గోపీ గారు,ఈ టపా కి నా ముగింపు వాక్యమేమిటంటే, మనుషు అందరూ వ్యక్తిగత ఆస్తిని వదులుకోవటానికి సిధ్ధమైతేనే, సోషలిస్ట్ వ్యవస్థ కొంత కాలం నిలబడుతుందని. మనుషులు అందరూ వ్యక్తిగత ఆస్తి వదులుకొనేలా చేసే శక్తి బాల సోషలిస్ట్ వ్యవస్థలకు లేదని. కాబట్టీ అవి నిలబడాలేవు.
   ఒకవేళ మనుషులు అందరూ త్యాగ మయులైపోతే, అలాంటి వ్యవస్థ వైవిధ్యం లేక మనుగడ సాగించలేదు. అంటే అదరు మనుషులూ మంచోల్లవటం ద్వారా వచ్చిన సోషలిస్ట్ వ్యవస్థ కూడా కొంత కాలం తరువాత శోష వచ్చి పడిపోతుంది. ఎందుకంటే వ్యక్తులు మంచోళ్ళవటం అనేది, వ్యక్తి గతం గా చూస్తే risky behavior. అందరూ మంచోల్లయితే అందరూ రిస్క్లో పడతారు (ప్రకృతి విపత్తుల వంటి సమయల్లో). కాబట్టీ ప్రకృతి సంబంధమైన కారణాల వలన కూడా సోషలిస్ట్ వ్యవస్థ కూలవచ్చు.
   మొత్తం మీద దీర్ఘ కాలం మన గలిగే సోషలిస్ట్ వ్యవస్థ ఎప్పటికీ రాలేదు అని నా అభిప్రాయం.

   మెచ్చుకోండి

 2. హ్మ్మ్ ఏం చెప్పాలి, మొదటి పార్ట్ చూసి అందరూ బాలగోపాల్ గారు, చంద్ర గారిలా (ఇంకెవరున్నారొ తెలిదు) ఉండాలని బెదిరిస్తున్నారేమో అనుకొన్నాను . బెస్ట్ బ్లాగర్స్ లో మొదటి తొమ్మిది స్థానాలు మీకే .

  మెచ్చుకోండి

  1. హా…హా..ఈ టపాని తొమ్మిదిమంది కూడా చదవలేదు. మాలికా, కూడలి లో నా పోస్ట్ లు ఎందుకో రావటం లేదు. కొంపదీసి ఇది పెట్టుబడి దారీ కుట్ర కాదు కదా?! 😦
   మొదటి పార్ట్ లో అడిగిన కొన్ని ప్రశ్నల కి సమాధానాలు రెండో పార్ట్ లో లేవు. అంటె, ఆ విమర్శ లు సరైనవే అనే ఉద్దేశం తో వాటికి సమాధానాలు రెండో పార్ట్ లో ఇవ్వలేదు.

   శ్రీ శ్రీ, “తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వర్?”, అన్న మాట కూడా స్పిరిట్ పరం గా సరైనది అయినప్పటికీ, literal గా అర్ధం పర్ధం లేనిది. తాజమహల్ నిర్మాణానికి ఓ మూడు వేల మంది రాళ్ళెత్తారనుకొందాం, శ్రీ శ్రీ ఉద్దేశం, “ఎల్లయ్యా, పుల్లయ్యా, కిట్టయ్యా, సారమ్మ, సుక్కమ్మా…. 3000వ వ్యక్తి అయిన పెంటయ్యా కట్టిన తాజమహల్”, అనాలనా? అందరి పేర్లూ చెప్పలేం కదా?
   తాజమహల్ నిర్మాణం లోని గొప్పదనం దాని ఆర్కితెక్చర్. కాబట్టీ దాని ఆర్కిటెక్ట్ ని మాత్రం గుర్తించాలనుకొంటాను. అలానే శ్యామలీయం గారు చెప్పినత్లు, “శ్రీ శ్రీ కవిత్వానికి ప్రూఫ్ రీడ్ చేసిన రీడర్ ఎవడోయ్!” అనేది సరేనా? కవిత్వం లో భావం ప్రధానం కాబట్టీ, ప్రూఫ్ రీడర్ కంతె క్రెడిట్ శ్రీ శ్రీ కే దక్కుతుంది.
   అలానే లెనిన్ కమ్యూనిస్ట్ వ్యవస్థ ను తెచ్చాడనుకొందాం. ఆ విప్లవం లో పాల్గొన్న అనేక లక్షల మంది పేర్లు ఎందుకు వెలుగు చూడలేదు? వారంతా పోరాడకుండానే, జీవితాలు త్యాగం చేయకుండానే, ఫిన్లాండ్లో, స్పెయిన్ లో ఉండి లెనిన్ కమ్యూనిస్ట్ వ్యవస్థ ని సాధించాడా? ఇక్కడే uniqueness of leadershp skill అనేది బయల్పడుతుంది. అందరికీ ఉన్న స్కిల్స్ కంటే నాయకత్వ స్కిల్ అరుదు కాబట్టీ లెనిన్ కి పేరొచ్చింది. అందరికీ పేరొచ్చింది అంటె , ఎవరికీ పేరు రానట్లే. పేరు రావటం లోనే ఇతరుల కంటే భిన్నమైన, అరుదైన, గొప్ప పని ఏదో చేశాడనే భావం ఉంది. పేరు రావటం అనేది very unsocialistic thing
   ఓ టపా లో మన ప్రవీణ్ షేర్లు అమ్మి కొంటున్నాడని, కాబట్టీ అతను కాపిటలిస్ట్ అని ఎటాక్ చేశారు. ఇది సినిమా లకి పాటలు రాయటం కంతే భిన్నం కాదు. అతను షేర్ల నుంచీ వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడనేది ముఖ్యం. షేర్ల నుంచీ వచ్చిన డబ్బు ని తన జీవితావసరాలకి ఉపయోగిస్తున్నంత కాలం అతను కాపిటలిస్ట్ కాజాలడు. (షేర్ల వ్యాపారం వలన ఉత్పత్తి అయేది ఏమీ ఉందదనేది వేరే విషయం)

   మెచ్చుకోండి

 3. “తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వర్?”

  అన్న మాట ఏ సందర్భం లో వాద బడిందో అర్ధం చేసికోకుండా వ్యాఖ్యానం చెయ్యబడుతుంది ఈ మధ్య . ఆర్కిటెక్ట్ ని కూడా గుర్తించనవసరం లేదు . అతనుకూడా రాళ్ళెత్తిన కూలీల కోవలోకే వస్తాడు . అది కేవలం షాజహాన్ కీర్తి ని ప్రశ్నించడం మాత్రమె.

  షేర్లు కొనేవారంతా కాపిటలిస్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారా ? ఎవరా అజ్ఞానులు ? నా ఉద్దేశ్యం కాపిటలిస్ట్లు లాంటి వారు కొనే షేర్లు పూర్తిగా గాంబ్లింగ్ తరహాలో ఉంటాయి . అంబాని బ్రదర్స్ కొత్తగా పేరు వదలగానే వెళ్లి కొనేస్తారు . వీళ్ళతో పోలికేంటి.

  షేర్ల వ్యాపారం వలన కూడా ఒకప్పుడు ఉత్పత్తి ఉండేది . ఇప్పటికి కొన్ని కంపెనీల్లో ఆ పరిస్థితి వుంది ఉన్దొచ్చు. లేకపోతె వాల్యూ షేర్లు ఉండవ్ కదా ?

  నేనయితే సంకలునులు చూడనండీ, నా బ్లాగు కూడా మాలిక నుండి తొలగించబడింది అప్పుడెప్పుడో రాంగోపాల్ వర్మ పేరు టపాలో వచ్చినపుడు. కూడల్లో వచ్చే ఉండాలే ?

  అయినా మీకు సంకలునులతో పనేముందీ . ( మరీ తోమ్మిదిమందా , అయితే మీ టపాలు అర్ధం కాని వారు పెరిగిపోతున్నట్లే . బ్లాగుల్ని మించిన రచనలు చేస్తున్నారు )

  మెచ్చుకోండి

  1. కేవలం షాజహాన్ కీర్తి ని ప్రశ్నించడం మాత్రమె.
   >> Agreed. That’s the spiriti in which we need to understaqnd those lines.
   >>తాజమహల్ నిర్మాణం లోని గొప్పదనం దాని ఆర్కితెక్చర్. కాబట్టీ దాని ఆర్కిటెక్ట్ ని మాత్రం అప్పుడెప్పుడో రాంగోపాల్ వర్మ పేరు టపాలో వచ్చినపుడు. కూడల్లో వచ్చే ఉండాలే ?
   >>ఆయన ని అనుకరిస్తూ ఓ స్పూఫ్ బ్లాగ్ నడుపుదామనుకొన్నాను. అది కూదలి లో రాలేదు. మాలిక లో వచ్చింది. కొంపదీసి వర్మ గారు నా బ్లాగ్ ని కూడలి నుంచీ పీకించేశారా ఏమితి 😦 🙂 ?

   మెచ్చుకోండి

 4. @అలానే శ్యామలీయం గారు చెప్పినత్లు, “శ్రీ శ్రీ కవిత్వానికి ప్రూఫ్ రీడ్ చేసిన రీడర్ ఎవడోయ్!” అనేది సరేనా?

  శ్యామలీయం గారికి మనం చెప్పెతంతటి వారమా . తాజ్మహల్ ఎవరో కట్టించారు, ప్రస్థానం శ్రీ శ్రీ స్వయంగా వ్రాసారు . అయినా శ్యామలీయం గారి బ్లాగు, అక్కడి మాటలు జనం తో సంబంధం లేకుండా ఉంటాయి. ఏది ఏమయినా ఈ సమస్యని గుర్తించి ఇంత అర్ధవంతమైన వ్యాసం ఇచ్చారు.

  అగ్రిగేటర్స్ లో బ్లాగ్ రాని పక్షం లో ( ఆ అగ్రిగేటర్స్ ని చూసే వాళ్ళు కూడా అంతే తక్కువ వుండివుంటారు లెండి) , ఇప్పుడు వ్రాస్తున్న ముగ్గురు నలుగురు లేదా పది మంది ఎవరి బ్లాగులో వారు వ్రాసుకోవడం కాకుండా, ఒకే మార్గంలో ఆలోచించే నలుగురు బ్లాగర్లు ఎందుకు కలిసి వ్రాయడంలేదు? కొంత వైరుధ్యం ఉండొచ్చు. కాని మీరంతా సరదా కోసమో స్వార్ధం కోసమూ కాక సమాజాన్ని అర్ధం చేసికోవడానికి, మిగిలిన వారికి ఆ సంక్లిష్టతను విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉమ్మడి వేదిక మీదకి ఎందుకు రావడం లేదు ?

  (అప్పుడు జిలేబికి కూడా అక్కడక్కడా వెతుక్కొని ముక్కల్ని అతుక్కోడం కాక ఒక్కచోటే కూర్చిని పుల్లలేరుకోవచ్చును)

  మెచ్చుకోండి

 5. నాకైతే శ్యామలీయం గారి మాతృ భాషా ప్రేమ చాలా చాలా నచ్చుతుంది….
  ఎవరి దాకానో ఎందుకు. మనమిద్దరమే కలిసి టపాలు రాద్దాం. నేను స్త్రీ వాదాన్ని చీల్చి చెండాడతాను, మీరు ఆకాశానికెత్తేయండి (కావాలంతే “ఆకాశం లో సొహం” లాంటి మసాలా పదాలు వేయవచ్చు(సొహం..”సోహం” కాదు))..అన్నట్లు ఇలా రాస్తుంతే నాకో కథ గుర్తుకొస్తోంది..మీకు తెలిసే ఉంటుంది..ఓ ఇద్దరు మిత్ర్లు కలిసి తిరునాళ్ళ లో ఓ చెరుకు రసం స్టాల్ పెట్టారు. పెట్టగా ఓ పది రూపాయలు మిగిలింది. ఆ మిత్రులు ఎంతసేపు నిరీక్షించినా ఎవరూ రసం కొనటానికి రావటం లేదు. ఇంతలో వారిద్దరికీ ఆకలి వేయసాగింది. తనదగ్గర ఉన్న 10 రూపాయలనూ మొదటి వాడు రెండవవాడికిచ్చి, ఓ గ్లాసుడు చెరుకు రసం తాగేశాడు. రెండవ వాదికీ ఆకలి వేస్తొంది కాబట్టీ, వాడు మొదటి వాడికి ఆ పది రూపాయలూ ఇచ్చి తానోక గ్లాసుడు చెరకు రసం తాగేశాడు. మళ్ళీ మొదటి వాడు రెండవ వాది అదే పది ఇచ్చి ఇంకో గ్లాసుడు, తిరిగి రెండవ వాడు మొదటి వాడికిచ్చీ..ఇలా మొత్తం చెరుకు రసం అయ్యిపోయే దాకా తాగినాక వాళ్ళ ఆకలి తీరి బ్రేవ్ మని త్రేంచారు… అలానే….. మనమిద్దరమూ కలిసి రాసుకొంటే చివరికి మనమిద్దరమే ఒకరు రాసింది ఇంకొకరు చవవాలేమో…చివరి ఉన్న టైమంతా చెరుకు రసం అయిపోయినట్లు అయిపోతుంది…..ఇంతకీ చెరుకు రసం కథ లో అదనపు విలువ ఎంతా, ఆ అదనపు విలువ వలన ఎవరు లాభపడ్డారు…..?తింగరోదు తిరణాళ్ళ కెళితే గుడి మెట్లెక్కా దిగా సరిపోయిందట..అలానే… నాలాంటోడు బిజినెస్ పెట్టినా, బ్లాగ్ పెట్టినా ఉపయోగం ఉందదేమో! (ఏదో సరదా కి నాతో పాటు మిమ్మల్ని కూడా ఇరికించాను..ఆటే ఫీలవకుండా అడ్వాన్సుడు సారీ చెప్పేస్తున్నాను..ఏమీ అనుకోవద్దు. 🙂

  మెచ్చుకోండి

 6. హ హ. మీరేవాదాన్ని అయినా ఆకాశానికీ ఎత్తగలరు , లోయలలోను విసరగలరు. చదివి తెల్సుకోడం తప్ప వ్రాసేంత లేదండీ. మొత్తానికి మిమ్మల్ని ఇరికించబొతే బానే బదులిచ్చారు. ఓ పని చెయ్యండి , రమణ గారి బ్లాగులో ఆయన వాదాల్ని చెండాడండి, ఒకచోట వ్రాస్తే చూసే భాగ్యం మాకు కలుగుతుంది, ఇంకోవైపు మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది సంకలినితో పన్లేకుండా మీ బ్లాగు రీడర్షిప్పు ఆకాసాన్నంటుతుంది .

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s