ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-33

శ్రీధర్ కి స్పృహ తప్పిన తరువాత,ఇల్లు శుభ్రం చేయటం కోసం పని మనిషి వచ్చింది.అతను కిందపడి ఉండటం చూసి ఇంటి ఓనర్ ని పిలిచింది. ఓనర్ దగ్గరే ఉన్న హాస్పిటల్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు.
అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అ రోజు సాయంత్రానికి శ్రీధర్ మామూలు అయ్యాడు. సరళ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరళ శ్రీధర్ అమ్మానాన్నలకి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు శ్రీధర్ ని  హాస్పిటల్ నుంచీ ఇంటికి పంపారు.
*********
శ్రీధర్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. పక్కనే కుర్చీ లో సరళ కూర్చొని ఉంది. శ్రీధర్ నాన్న కృష్ణా రావూ,అమ్మ చంద్రమ్మా పక్కనే సోఫా లో కూర్చొని ఉన్నారు. శ్రీధర్ సెల్ తీసుకొని ఆనంద్ కి కాల్ చేసి, “నాకు స్ట్రోక్ వచ్చింది,డాక్టర్ ఓ రెండు వారాలు రెస్ట్ తీసుకొమ్మన్నాడు” అని చెప్పాడు.
ఆనంద్, ” నో ప్రాబ్లం శ్రీ, మనీషా ఉంది కదా. ఆమె చూసుకొంటుంది. ఒక రెండు మూడు రోజుల్లో ఆమె నీకు కాల్ చేసి,నీ దగ్గరి నుంచీ ప్రాజెక్ట్ వివరాలు తెలుసు కొంటుంది” అన్నాడు.
“సరే నేనే ఆమె కి కాల్ చేసి చెప్తాన్లే”, అన్నాదు శ్రీధర్.
“నువ్వు ఆఫీస్ కి రావటం మొదలు పెట్టిన తరువాత,కొన్నాళ్ళు ఆమె కి సాయం చేయ వచ్చు. నువ్వు వచ్చాక మాట్లాడుదాం. టేక్ కేర్!” అని పెట్టేశాడు ఆనంద్.
ప్రాజెక్ట్ గురించిన ఆందోళన ఇంకా శ్రీధర్ మనసు లో ఏ మూలో ఉంది. “నేను ఆఫీస్ కి వెళ్ళిన తరువాత, ప్రాజెక్ట్ లో పని మళ్ళీ యధావిధి గా చెయ్యగలుగుతానా?” అనుకొన్నాడు.
సరళ అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గ్లూకోస్ నీళ్ళు ఇచ్చింది. “నేను లాంగ్ లీవ్ పెట్టి, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను” అంది.
చంద్రమ్మ అంది, “మేమున్నాం కదమ్మా చూసుకోవటానికి. మళ్ళీ నీ ఉద్యోగానికి ఎందుకు సెలవు పెట్టడం?”
సరళ ఏమీ సమాధానం చెప్పకుండా శ్రీధర్ వైపు చూసి,”నేను సోమ వారం నుంచీ సెలవు పెడుతున్నాను”,అంది.
***********
శ్రీధర్ త్వరగానే కోలుకొంటున్నాడు.  కొంచెం సేద తీరినట్లు కనపడుతున్నాడు. అతనికి కావలసిన వాళ్ళంతా ఒక చోట ఉన్నారిప్పుడు మరి. శ్రీధర్ వాళ్ళ అమ్మ అతనికి ఇష్టమైన కూరలన్నీ చేసి పెడుతోంది,  కానీ నూనె లేకుండా. ఓ రోజు సరళ, “దగ్గరే ఉన్న ఓ రెస్టారెంట్ కి వెళ్దాం” అంది. రెస్టారెంట్ లో, శ్రీధర్ ఎవరికి కావలసినవి వాళ్ళకు తెప్పించాడు.చివరిగా బిల్లు వచ్చింది. శ్రీధర్ బిల్లు కట్టి, ఓ రెండు పది నోట్లను ప్లేట్లో వదిలాడు. కృష్ణా రావు ఆ నోట్ల వంక చూసి శ్రీధర్ ని అడిగాడు, “బిల్ ఎంత అయ్యింది రా?”
“అబ్బ.. నీకెందుకు నాన్నా..?” అన్నాడు శ్రీధర్.
“చెప్పొచ్చు కదా..ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో నాకు గూడా తెలుస్తుంది” అన్నాడాయన.
“ఓ ఏదొందల యాభై రూపాయలైంది”.
” బాగానే అయ్యిందే…ఖర్చులు తగ్గించుకో రా. అసలు ఇంతవుతుందని ముందే తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. ఇదే ఇంట్లో వండుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఇదే ఖర్చు తో మన ఊళ్ళో ఒక కుటుంబం నెల మొత్తం బతుకుతుంది”
చంద్రమ్మ “మరే” నన్నట్లు గాతలూపింది.
శ్రీధర్ సరళ వంక చూశాడు. ఆమె మొహం లో ఏ భావమూ కనిపించటం లేదు. ఆమె కి ఏదైనా నచ్చక పోతే ఆమె తన మొహానికీ మనసుకీ మధ్య ఒక షట్టర్ వేసేస్తుంది.
ఇంటికొచ్చాక కృష్ణా రావు డీవీడీ లో కొన్ని పాత పాటలు పెట్టమన్నాడు శ్రీధర్ ని. “ఇది చాలా బాగుంది.మన ఇంట్లో టేప్ రికార్డర్ చెడిపోయింది”, అన్నాడాయన.
“నేను మీకు ఓ డీవీడీ ప్లేయర్ కొంటానులే” అన్నాడు శ్రీధర్.
సరళ పక్క రూం లోకి వెళ్ళీ తలుపు వేసుకొంది. చంద్రమ్మ అటు వైపు చూసి,”సరళ కి ఏమైందో చూడు”, అంది శ్రీధర్ తో.
శ్రీధర్ రూం  లోకి వెళ్ళి అన్నాడు,”ఆర్ యూ ఓకే?”
సరళ అంది,” రెస్టారెంట్ లో డిన్నర్ కంటే, డీవీడీ ప్లేయర్ ఎక్కువ అవ్వుతుందనుకుంటా?” అంది.
ఆ మరుసటి రోజు,కృష్ణా రావూ చంద్రమ్మా వెంకటాపురం బయలుదేరి వెళ్ళారు. శ్రీధర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి పంపించి వచ్చాడు. వాళ్ళ కి ఒక డీవీడీ ప్లేయర్ కొనిచ్చాడు. సరళ తనకి తల నొప్పి అని రాలేదు.
ఇంటికొచ్చినాక సరళ అడిగింది, “డీవీడీ ప్లేయర్ ఎంత అయ్యింది?”
“ఎందుకు?”
” ఇలాంటివి కొనమని అడగటానికి ఇది సరైన సందర్భమేనా?” అందామె.
శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

4 thoughts on “ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-33”

 1. “రెస్టారెంట్ లో డిన్నర్ కంటే, డీవీడీ ప్లేయర్ ఎక్కువ అవ్వుతుందనుకుంటా?”—-

  ““డీవీడీ ప్లేయర్ ఎంత అయ్యింది?”
  “ఎందుకు?”
  ” ఇలాంటివి కొనమని అడగటానికి ఇది సరైన సందర్భమేనా?”””—-

  ఈ సన్నివేశం నిజ జీవితానికి చాలా దగ్గరగా వుంది..నాకు ఇలాంటి అనుభవాలువున్నాయి..
  మీ కధ చాలా బాగుంది…

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s