ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-36

శ్రీధర్ తన ఉద్యోగం గురించి తృప్తి గా లేడు. చాలా చాలా ఇంటర్వ్యూలు ల కి వెళ్ళిన తరవాత అతనికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ మారదామనుకొంటుండగా అతని కి వాళ్ళ అమ్మ దగ్గరి నుంచీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కృష్ణా రావు కి ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. అతనికి వెన్ను నొప్పి వచ్చింది.
శ్రీధర్ అన్నాడు,”అమ్మా, నువ్వూ నాన్నా బెంగుళూరు వచ్చేయండి. నేను ఇక్కడ నాన్న గురించి జాగ్రత్త తీసుకొంటాను”.
“మేము అక్కడ ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేము  రా. కాలక్షేపం అవ్వదు మాకు. పైగా సరళ కి అనవసరమైన పని మా వలన”, అంది చంద్రమ్మ.
శ్రీధర్ వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ నాన్న కు వైద్యం చేయిద్దాం అనుకొన్నాడు. ఆఫీస్ లో ఆనంద్ ని లీవ్ అడిగాడు.
“ఇప్పుడు ప్రాజెక్ట్ చాలా కీలకమైన దశ లో ఉంది. ప్రాజెక్ట్  లో నీది ముఖ్యమైన పాత్ర అని నీకు తెలుసు. నీ లీవ్ ని వాయిదా వేసుకో”, అన్నాడు ఆనంద్ ఎప్పటిలానే.
“అనివార్య కారణాల వలన నేను నా సెలవు ని వాయిదా వేయలేక పోతున్నాను. అయినా నీకు మనీషా ఎప్పుడూ దన్ను గా ఉంటుంది కదా?”, అన్నాడు శ్రీధర్ వ్యంగ్యం గా.
సీట్ దగ్గరికొచ్చి, వ్యక్తిగతమైన కారణాలను చూపుతూ, ఆనంద్ కి రెజిగ్నేషన్ మెయిల్ పంపించాడు శ్రీధర్. శ్రీధర్ కి ఆనంద్ మీద ఉన్న కసి అంతా ఆ క్షణం లో తీరి పోయింది.
వాళ్ళ ఊరికి బయలు దేరాడు శ్రీధర్. వాళ్ళ నాన్న కి తగ్గిన తరవాత బెంగుళూరు వచ్చి కొత్త జాబ్ లో జాయిన్ అవుదామనుకొన్నాడు. వెళ్ళే ముందు సరళ వస్తుందేమో అడిగాడు.
దానికి సరళ,”నేను ఎప్పుడూ పల్లెటూరు వెళ్ళలేదు. పైపుల్లో నీళ్ళూ, అటాచ్ బాత్రూం లేని చోట కి నేను రాలేను”, అంది. వాళ్ళిద్దరి మధ్యా మొహమాటాలు చాలా త్వరగా తగ్గిపోతున్నాయి.
***********
కృష్ణా రావు వెన్ను నొప్పిని మందుల తో తగ్గించవచ్చని బందరు లో డాక్టర్ చెప్పాడు. ఓ వారం ఊళ్ళోనే ఉండి, వాళ్ళ నాన్న ని చూసుకొన్నాడు శ్రీధర్.   కృష్ణా రావు కి కొంచెం మెరుగయ్యింది.
అక్షయ్ కోసం ఫోన్ చేశాడు శ్రీధర్ సరళ కి. అప్పుడు చెప్పింది సరళ. శ్రీధర్ చేరబోయే కంపెనీ నుంచీ ఈ మెయిల్ వచ్చిందట. శ్రీధర్ కి ఇచ్చిన ఆఫర్ ఓ ఆరు నెలలు ఆలస్యం చేశారంట. రిసెషన్ రోజులలో వాయిదా అంటే “జాబ్ ఇవ్వక పోవటానికి” ముద్దు పేరు. ఓ రోజల్లా ఏమీ తోచలేదు శ్రీధర్ కి. ఆనంద్ మీద రాయి విసిరి పారిపోదామను కొన్నాడు శ్రీధర్. రాయి విసరటమైతే విసిరాడు. కానీ పారిపోయేటప్పుడే గోతి లో పడ్డాడు, అదీతానే తవ్వుకొన్న దాంట్లో.  ఆనంద్ తెరిచి ఉంచిన తలుపుని తానే మూసేసి వచ్చాడు.
తనకు జాబ్ పోయిన సంగతి శ్రీధర్ తన అమ్మా నాన్న లకి చెప్పలేదు. బెంగుళూరు ఆఘ మేఘాల మీద వచ్చేశాడు, వేరే జాబ్ వెతుక్కోవటానికి. ఇంటికెళ్ళగానే సరళ అడిగింది, “మీ నాన్న కి ఎలా ఉంది?”
” మా నాన్న కి ఎలా ఉంటే నీకేంటి? అంతగా ఆయన గురించి శ్రధ్ధ ఉంటే నాతో పాటు వచ్చి అయన గురించి జాగ్రత్త తీసుకోవాల్సింది”, అన్నాడు.
“అప్పుడు నేను కూడా నీ లాగే జాబ్ లేక ఈగలు తోలుకోవాల్సి వచ్చేది”, అందామె అగ్ని కి ఆజ్యం పోస్తూ.
ఆ ఆదివారం సరళ షాపింగ్ కి వెళ్ళాలనుకొంది. ఆమె కి తెలుసు శ్రీధర్ కి షాపింగ్ అంటే ఇష్టం లేదని. అందుకే తోడు రమ్మని అడగలేదు. ఇంట్లో ఉండి అక్షయ్ ని చూసుకోమని చెప్పిందామె శ్రీధర్ కి.  శ్రీధర్ ఆమె ని అడిగాడు, “ఏమి కొనబోతున్నావ్?”
” ఇదీ అని ఏమీ లేదు. వెళ్ళి చూస్తాను. ఏదైనా ఇంటరెస్టింగ్ గా ఉంటే కొంటాను”
శ్రీధర్ అన్నాదు,”ముందు ఏమి కొనాలో కూడా తెలియకుండా, కొనటానికి వెళ్ళటం చాలా విచిత్రం గా ఉంది నాకు”
“శ్రీధర్, కొందామన్నా నీ దగ్గర డబ్బు లేదు. వేరే వాళ్ళని కూడా ఎందుకు అడ్డుకొంటావ్?”,అని విసురు గా వెళ్ళిపోయిందామె, అప్పటికే రెడీ గా ఉన్న ఆటో ఎక్కి.
శ్రీధర్ కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ వాడి మనసు తిట్టింది, “మగాడివై ఏడవటానికి సిగ్గులేదూ?”. అతని మగ జన్మకి ఏడ్చే స్వేచ్చ లేదు.
ఇంతలోఫోన్ మోగింది…వాళ్ళ అమ్మ..”ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. దానితో మన చేను మగతా కి తీసుకొన్న రంగా రావు మామయ్య డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదు. మీ నాన్న మందుల ఖర్చులేమో పెరుగుతున్నాయి. మీ నాన్న గురించి నీకు తెలుసు. ఆయనకి అత్మాభిమానం ఎక్కువ. ఆయకి తెలియనివ్వకుండా …కొంచెం డబ్బు పంపిస్తే అవసరానికి ఉపయోగ పడుతుంది”
షాపింగ్ నుంచీ తిరిగి వచ్చిన తరవాత సరళ ని అడిగాడు,”ఓ ఇరవై వేలుంటే అప్పిస్తావా?”
“శ్రీధర్, ఇప్పుడు హౌస్ లోనూ “ఈ ఎం ఐ” కూడా నేనే కడుతున్నాను.ఇది నీకు తెలుసు. అద్దె నేనే కడుతున్నాను. నా దగ్గరా డబ్బు చాలా తక్కువే ఉంది. అక్షయ్ కోసం కొంత డబ్బు దాచి ఉంచాను. మనకు ఏమైనా అనుకోని ఖర్చులు వస్తే ఉంటాయని.” అని,” అయినా నీకు ఇప్పుడు ఇరవై వేలు ఎందుకు?” అందామె. శ్రీధర్ చెప్పాడు.
“నాల్రోజుల కిందట నువ్వే అన్నావు. నాకు మీ అమ్మా నాన్నలంటే పట్టదని.అవును కరెక్టే నేనెందుకు పట్టించుకోవాలి?”

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s