ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-25

మా నాన్న వ్యవసాయం మానేసి, పొలం కౌలు కి ఇచ్చాడు. వ్యవసాయం రైతులకి గిట్టుబాటు కావటం లేదు.
“చంద్రబాబు నాయుడు రెండో సారి అధికారం లోకి వచ్చాక రైతు ల కష్టాలు పెరిగాయి”, అంటున్నాడు మా నాన్న.
నా చిన్నప్పటి ఫ్రెండ్ ధడేల్ గాడి గురించి అడిగాను మా నాన్న ని. ధడేల్ గాడే కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరూ లేరంట ఊళ్ళో. అందరూ భుక్తి కోసం హైదరాబాదో మద్రాసో వెళ్ళిపోయారు.
ధడేల్ గాడిని మొన్నే పండక్కి చూశాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పిలుచుకొచ్చాడు నాన్న. ఈ ధడేల్ గాడి కీ, చిన్నప్పటి ధడేల్ గాడికీ పోలికే లేదు. ఆ రోజుల్లో వాడి కళ్ళలో కనిపించే అల్లరి ఏ మాత్రం కనపడటం లేదిప్పుడు. వాడి లో జీవితమంటే ఒక అనాసక్తి కనపడుతోంది. వాడు హైదరాబాద్ లో ఒక సినిమా స్టూడియో లో ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు.
కాసేపు మా పాత రోజులను గుర్తు తెచ్చుకున్నాం. రేవు లో కొట్టిన ఈతలూ,మామిడి తోటల్లో అల్లరీ అన్నీ. ఆ తరువాత వాడి కళ్ళలోకి కొంత కళ వచ్చింది. ఈ లోపు మా అమ్మ నిమ్మ కాయ నీళ్ళు తెచ్చి ఇచ్చింది మా ఇద్దరికీ.
ఊళ్ళోకాలువలు ఎండుతున్నాయి. అయితే కేబుల్ టీవీ లో మాత్రం అన్ని చానల్సూ వస్తున్నాయి. ఇంగ్లీషు,హిందీ,తమిళం..అన్నీ. అయితే ఈ చానల్స్ అన్నీ జనాలను మత్తు లోకి తీసుకెళ్ళే కాలువలే. అసలు కాలువల్లో మాత్రం చుక్క నీరు లేదు.
నన్ను పలకరిద్దామని ఊళ్ళో రైతు పెదబాబు వచ్చాడు. మాటల సందర్భం లో పెదబాబు అంటున్నాడు, “ఈ టీ వీ ఛానళ్ళ తో చావొచ్చిపడింది. రిజర్వాయర్లలో  నీటిమట్టం అని రోజూ చూపిస్తాడు. దీన్ని చూసి తెలంగాణా వాళ్ళు నీటి కోసం కొట్లాడుతున్నారు”
నేను మాత్రం,”ఇది అందరి మంచికీ”, అన్నాను.
పెదబాబు,”జీతం ఏ మాత్రం ఇస్తారేంటి నీకు?”, అన్నాడు.
నేను,” ఏదో అక్కడి ఖర్చులకి సరి పోతుంది లే” అన్నాను. ” ఎక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి. కొన్ని విషయాలలో ఇక్కడే బాగుంటుంది” అన్నాను.
దానికి పెదబాబు,”ఆ ఇక్కడేమింది..పేడా పిడకలూ..నా మొహం..నూతి లో కప్పల్లా బతకతమే ఇక్కడుంటే!”, అన్నాడు.
**********************
ఆరు బయట మంచం వేసుకొని చుక్కల్ని చూస్తూ నెమ్మదిగా ఆలోచనలలో కి జారుకున్నాను. సాయంకాలపు పైర గాలి ఎప్పటి లానే మనసునీ శరీరాన్నీ తాకుతోంది.
ఒక విధం గా చూస్తే మా అమ్మా నాన్నలదే మెరుగైన జీవితం. నా జీవితం తో పోలిస్తే వాళ్ళే కుదురైన బతుకు బతికారనిపిస్తోంది. మా అమ్మ తెలివైనదేమీ కాదు. పైపెచ్చు మూర్ఛ రోగం ఉని. ఇది తెలిసి కూడా మా నాన్న అమ్మని పెళ్ళి  చేసుకున్నాడు. అదే ఈ రోజులలో, ప్రత్యేకం గా పట్టణాలలో అయితే మా అమ్మ లాంటి ఆడ పిల్లలు చాలా కష్టపడవలసి వచ్చేది. మా అక్కనీ నన్నూ కన్న తరువాత మా అమ్మా నాన్నా జీవితాన్ని ఉన్నంత లోనే పొదుపు గా నింపాది గా గడిపారు. మా అమ్మా నాన్నలకి పెద్దవాళ్ళ సలహా ఎప్పుడూ ఉండేది. మా ఇద్దరి ముద్దూ ముచ్చటలు చూసుకోవటం లో వాళ్ళ జీవితం సంతోషం గానే సాగిపోయింది. ఆ పల్లె లో అందరి బతుకులూ దాదాపు ఇలానే గడిచి పోతాయి. కాబట్టీ వేరే వాళ్ళ తో పోల్చుకొని అసూయ పడే అవకాశం కూడా వాళ్ళకి లేదు.
మా నాన్న ఒకరిని చేయి సాచి అడగ లేదు. ఒకరి చేత మాట పడలేదు. మేం చిన్నప్పుడు తిండికి ఎప్పుడూ బాధ పడలేదు. పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఆరోగ్యమైన తింది వేరే ఎక్కడ దొరుకుతుంది? అమెరికా లో కూడా దొరకదు. దీనికి నేను హామీ!
వెనటాపురం లోని విలువల వ్యవస్థ కూ మా అమ్మానాన్న ల విలువల వ్యవస్థ కూ ఘర్షణ లేదు. అందు వలన వాళ్ళు ఎటువంటి డైలమా ఎదుర్కొని ఉండరు.
పల్లెటూళ్ళో నమ్మకం ముఖ్యం. ఒక్కసారి నమ్మకం పోయిందంటే, వాడిని జీవితాంతం నమ్మరు. కాబట్టీ జనం సాధ్యమైనంతవరకూ సమాజం వారిపైన ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోరు. పల్లెటూళ్ళో అన్నీ శాశ్వత సంబంధాలే. సిటీ లోలా తాత్కాలిక సంబంధాలకు చోటు లేదిక్కద, కనీసం మా అమ్మా నాన్న ల తరం లో.
అదృష్టం కొద్దీ మా అమ్మా నాన్న లకు మామూలు ఆరోగ్యానికి ఏమీ కొదవ లేదు. ఇద్దరూ శ్రమ జీవులవటం వలన బీ పీ లూ, సుగర్లూ వాళ్ళ వద్దకి రావటానికి భయపడ్డాయేమో!
తరచి చూస్తే నా జీవితం కంటే వాళ్ళదే  హాపీ లైఫ్ అనిపిస్తోంది. అనిపించటం మాత్రమేనా లేక నిజం గా హాపీ లైఫేనా? దీన్ని కొలవటానికి నా దగ్గర ఏ స్కేలో టేపో లేదు.
నేను చిన్నప్పటి నుంచీ అనేక టెంప్టేషన్లు తట్టుకొని, వళ్ళు దగ్గర పెట్టుకొని  చదువుకున్నదెందుకు? మా నాన్న నన్ను కష్టపడి చదివించిందెందుకు? ఆయనకంటే నాసి రకం జీవితం గడపటానికా? దీనిని గురించి తెలిస్తే ఆయన ఏమనుకొంటాడో?. ఏది ఏమైనా నా బతుకు లో క్వాలిటీ లోపించినట్లుంది.
***********

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s