ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-4

4

నాగులు కి ఇరవై ఏళ్ళు. వాడి కి పదేళ్ళున్నప్పుడు వాళ్ళ నాన్న వీరడు నాగుల్ని కృష్ణా రావు గారింట్లో కమతానికి పెట్టాడు. కృష్ణా రావు  కి అప్పటి నుండీ ఇప్పటి దాకా వాడి వలన ఏ సమస్యా లేదు. ఫైగా అనేక సమస్యలకి నాగులే పరిష్కారం. వాడు చాలా నిదానస్తుడు,పనిమంతుదూ మెతక మనిషీనీ. రెండేళ్ళ క్రితం మాళీ గేదె చనిపోయినప్పుడు వాడు కంట నీరు పెట్టడం ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా గుర్తు చేసుకొంటారు.
రోజూ పది గంటలకి భోజనం పెడుతుంది చంద్రమ్మ. ఇవాళ వాడికి “రాత్రి మిగిలిన చద్దన్నం” పెట్టిందామె. అప్పుడే పొయ్యిమీదనుంచీ దింపిన కూర వేసింది. మంచి ఆకలిమీద వున్న నాగులుకి అది ఏ మూలకీ సరిపో లేదు.
“ఎలా ఉంది రా నాగులూ కూర?” పమిటకి చేతులు తుడుచుకుంటూ అడిగిందామె.
“బెమ్మాండం గా ఉందండి. మీరు చేస్తే బాగోకపోవటమేంటండీ?” చంద్రమ్మ చేత భోజనం ఎలా పెట్టించుకోవాలో నాగులికి బాగా తెలుసు.
చంద్రమ్మ ముఖం వెలిగిపోయింది.కూర మరికొంచం వేసింది. మరి కూరలోకి అన్నం కావాలికదా? అప్పుడే ఎసరు వంచిన అన్నం కూడా పెట్టింది.
భోజనం అయిన తరవాత పొలం లో ఉన్న కృష్ణా రావు కోసం టిఫిన్ బాక్స్ కట్టి, తీసుకొని వెళ్ళమని నాగులు కి ఇచ్చింది చంద్రమ్మ.
నాగులు బయలుదేరుతూ “బాబూ..చేలోకొస్తావా?” అని అడిగాడు శ్రీధర్ ని. కుడి చేత్తో లాగూ ఎగబీక్కొని, ఎడమ చేతిని వెనక్కి తిప్పి కారే ముక్కు తుదుచుకొంటూ నాగులు తో పాటు బయలుదేరాడు వాడు.

ఇద్దరూ పొలాలకి అడ్డు పడి కాసేపూ, పొలాల గట్ల మీద కాసేపూ నడుస్తూ కృష్ణా రావు గారి పొలం వైపుకు పోతున్నారు.  అప్పుడే పాలు పడుతోన్న వరి కంకులు శీతా కాలపు చల్ల గాలికి తలలాడిస్తున్నాయి. దూరం గా మోటారు స్ప్రేయర్ తో పొలాలకి మందు కొడుతోన్న శబ్దం గాలి తో పాటు చెవులను తాకుతోంది. పక్క మాలపల్లి లో పెట్టిన లౌడ్ స్పీకర్ లోంచీ తెలుగు సినిమా పాటలు గాలి వాటం గా, కాసేపు బిగ్గరగా, కాసేపు నెమ్మది గా వినపడుతున్నాయి.
కాలువ గట్టు మీది సర్వీ చెట్లు దెయ్యల్లా గుస గుస లాడుతున్నాయి. కాలువ నిండు గా పారుతోంది. గట్టు మీది టెలిఫోన్ స్తంభాల్లో నుంచీ తీగ మీటినట్లు గా సవ్వడి వస్తోంది. శ్రీధర్  టెలిఫోన్ స్తంభానికి చెవి ఆనించి వినసాగాడు. నాగులు వాడిని “శాక్ కొడుతుంది బాబూ” అని వారించాడు.
ఆ మధ్య వరకూ కాలవ మీద తాటి మాను ఉండేది. కాలవ దాటాలంటే ఆ తాటి మాను మీద గా జాగ్రత్త గా నడుచుకొని వెళ్ళవలసి వచ్చేది. ఎండకీ వాన కీ బుగిలి ఆ తాటి మాను కిందటి వారం విరిగి పోయింది.
నాగులు శ్రీధర్ ని ఎత్తుకుని భుజాలమీద కూర్చోబెట్టుకున్నాడు.నెమ్మది గా కాలవ నీళ్ళ లో నడుచుకుంటూ అవతలి ఒడ్డు చేరి వాణ్ణి నెమ్మది గా కిందికి దించాడు.
నేల మీద దిగుతూ నే శ్రిధర్ వేగంగా పరిగెత్తి,ఒంటి కాలి మీద ఒక సారి ముందుకి దూకి మళ్ళీ పరుగందుకొన్నాడు.

పొలం లో కృష్ణా రావు మరి ఇద్దరు కూలీ ల తో కలిసి కలుపు తీస్తున్నాడు. నాగులూ శ్రీధరూ పొలం గట్టు మీద నడుస్తూ ఉంటే, గట్ల పక్క బొరియల్లో కి పీతలు అడ్డం గా నడుచుకొంటూ పోతున్నాయి.
నాగులు కొడవలి తీసుకొని, గేదె ల కోసం గట్టు మీది గడ్డి కోయటం మొదలు పెట్టాడు.
అకస్మాత్తు గా కృష్ణా రావు తన కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకొని అరిచాడు, “ఒరేయ్ నాగులూ ఆ తుండు గుడ్డ ఇటివ్వరా..పాము కరిసింది” నాగులు చేతి లో కొడవలి కింద పడిపోయింది. వాడు పరిగెత్తుకొంటూ వచ్చి  నెత్తి మీది తువ్వాలు తీసి ఆదరా బాదరా గా కృష్ణా రావు మణి కట్టు చుట్టూ కట్టాడు. కృష్ణా రావు తన చేతి పైన అయ్యిన గాయం నుంచీ నోటి తో రక్తాన్ని పీల్చి ఉమ్మేయసాగాడు. “గుమ్మడిత్తుల పింజేరి అనుకుంటా”, నాగులు తో అన్నాడు. ఆయనముఖం లో రంగులు మారసాగాయి. శ్రీధర్ పరిస్థితి చూసి ఏడుపు లంకించుకొన్నాడు.
నాగులు మిగతా కూలీ ల సాయం తో కృష్ణా రావు ని గట్టు మీద పడుకోబెట్టి,ఐదే ఐదు నిమిషాల్లో ఊళ్ళో కెళ్ళి శరభాచారి ని తీసుకొచ్చాడు. శరభాచారి పసరు వేసి పత్యం చెప్పాడు.
నాలుగు రోజులు పత్యం చేసిన తరవాత కృష్ణా రావు మామూలు గానే పొలం వెళ్ళటం మొదలు పెట్టాదు. అయితే శ్రీధర్ కి మాత్రం ప్రాణం మీదికి వస్తే ఎలా వుంటుందో తెలిసింది.
ఇంకా ఉంది ….

*************************

ఊరి అరుగుల మీద రాజకీయ చర్చ  వాడి గా వేడి గా జరుగుతోంది.
“ఈ ‘రెండు రూపాయలకి కిలో బియ్యం’ మనచావుకొచ్చింది” అంటున్నాడు పెద పిచ్చయ్య గారి రత్తయ్య.
“ఈ పధకం రాక ముందు లేబరు నడుం వంచి పని చేశేవాళ్ళు.ఇది వచ్చినాక వీళ్ళకి వళ్ళొంగటం లేదు”, అంటున్నాడు ఇంకో తెల్ల మీసాలాయన.
“కూలి రేట్లు పెంచేశారు”, అంటున్నాడు మరో ఆయన గోచి సవరించుకొంటూ.
“ఏమైనామీ కమ్యూనిస్టు ల కంటే రామా రావే మెరుగు. రాజ గారి భూముల్ని పంచి పెట్టేశాడు” అంటున్నాడు ఈ మధ్యనే తెలుగు దేశం లో కి దూకిన లోకనాథం.
“చల్లపల్లి రాజా భూముల్ని లేబర్ కి పంచి పెడితే మన రైతులకి ఒరిగేదేముంది? ఈ లేబర్ ఇక మన మాట వినరు. ఇక రైతు వ్యవసాయం చేసినట్లే. రాజకీయ పార్తీ లు ఓట్ల కోసం ఏమైనా చేస్తాయి. ప్రజాస్వామ్యం తో వచ్చిన చిక్కే ఇది” అంటున్నాడు మొన్నే కాలేజీ లోంచీ బయతికొచ్చిన ఓ యువకుడు.
“ఓ పక్క సాయిబ్బులు దేశాన్ని దోచేస్తుంటే మనలో మనం కొట్టుకోవటం ఏమీ బాగా లేదు. సాయిబ్బుల జనాభా హిందువుల జనాభా కంటే నాలుగు రెట్లు వేగం గా పెరుగుతోంది”, అని అంటున్నాడు కరణం గారి చిన్నాడు.
“ఆ మీ ఆరెస్సెస్ వాళ్ళు చెప్పే మాట ఎవరు నమ్ముతారు. గోరంతలు కొండంతలు చేయటం లో మొనగాళ్ళు మీరు.” దానికి సమాధానం గా అంటిస్తున్నాడో కుల పెద్ద.

“”ఆ.. మీలా కులం పేరు అద్దుపెట్టుకొని వ్యక్తిగత లబ్ది పొందటం మాకు రాదు లే”, అంటించాడు కరణం గారి చిన్నాడు.
“కరణం మునసబు ఉద్యోగాలు తీసేస్తున్నారంట. ఇంకా ఏమైనా ఉందా? ఊళ్ళలో అరాచకం రాజ్యమేలుతుంది” అంటున్నాడు మునసబు గారి ఏకైక సంతానం.
ఆ లోగా చిట పటా నాలుగు చినుకులు పదటం తో ఎవరిళ్ళకు వాళ్ళూఉ బయలుదేరారు. పక్క వూరి మైకు నుందీ చల్ల గాలిలో తేలి వస్తోంది చిరంజీవి పాట,”వానా వానా వందనం…”.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

One thought on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-4

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s