ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-2

2

కృష్ణా రావు గారిల్లు మంచి సందడి గా ఉంది. వేసవి కాలం సెలవలవడం తో కృష్ణా రావు గారి తమ్ముడు శ్రీనివాస రావూ, శ్రీనివాస రావు భార్య సరోజా, వాళ్ళబ్బాయి రఘూ వచ్చారు.శ్రీనివాస రావు గన్నవరం లో టీచర్ గా పని చేస్తున్నాడు.సరోజ కూడా టీచరే . రఘు వాళ్ళమ్మ బడి లోనే మూడవ తరగతి చదువుతున్నాడు.

కృష్ణా రావు ఒక చిన్నకారు రైతు. ఆయన భార్య చంద్రమ్మ…కృష్ణా రావు కి ఆమె మరదలు కూడా. చంద్రమ్మ కి మూర్ఛ రోగం వుంది…చదువు లేదు..అమాయకురాలు.. అందువల్లే వాళ్ల తాత కి ఆమెను బయటి సంబంధానికి ఇవ్వటం ఇష్టం లేక, కృష్ణా రావు తో చంద్రమ్మ ను పెళ్లి చేసుకొమ్మని చెప్పాడు.తాత మాట కి ఎదురు చెప్పటం అలవాటు లేని కృష్ణా రావు, ఆ విధం గానే ఆమె ను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కవితా శ్రీధర్….కవిత శ్రీధర్ కంటే రెండేళ్ళు పెద్దది.

రఘు రావడం తో శ్రీధర్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. వాడు రఘు ని వెంటేసుకొని ఊరంతా తిరిగి వస్తున్నాడు. పగలంతా వాళ్ళిద్దరూ ఊళ్ళోని పొలాలు, తోటలు, తోపులూ కలియ తిరిగి ఈత కాయలూ, చీమ చింత కాయలూ, ముంజి కాయలూ తిని సాయంత్రం అయ్యే సరికి ఊరి పిల్లలతో బిళ్ళంగోడు ఆట మొదలెట్టారు.

మసక పడటం తో కవిత తమ్ముళ్ళని ఇద్దరినీ పిలుచు కొని వచ్చింది. రఘూ శ్రీధర్ ల తో పాటు ఊళ్ళోని వాళ్ల ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ల వెంటే వచ్చారు. వాళ్లు కవిత తో “కవితక్కా… కవితక్కా.. మరే కతేమన్నా చెప్పవా?” అన్నారు.

కవిత పిల్లలను దగ్గరేసుకొని “కథ కాదు కానీ పొడుపు కథ చెబుతాను” అంటూ మొదలు పెట్టింది.

“అడవి లో పుట్టింది

అడవి లో పెరిగింది

మా ఇంటి కొచ్చింది

తైతక్కలాడింది”

“ఏమిటి అదీ?” కవిత అడిగింది.

రఘు పొడుపు కథ సగం లోనే కవిత తో గొంతు కలిపి కవిత అడగ గానే చెయ్యెత్తి “నాకు తెలుసు…అదీ కవ్వం” అన్నాడు.

కవిత రఘు వైపు మెచ్చుకోలు గా చూసి “నాకు తెలుసు…నువ్వు చెప్తావని” అంది.

ఊరి పిల్లలలో ఒకడు “కవితక్క రఘు కి ముందే చెప్పింది” అని ఆరోపించాడు.

రఘు మూతి ముడిచి “ఏమీ కాదు బాబూ.. మా తెలుగు మాస్టారు చెప్పారు. మా మాస్టారికి ఇంకా బోలెడు కథలు వచ్చు” అన్నాడు.

ఇంతలో శ్రీధర్ అందుకొని ” ఈ పొడుపు కథ కి జవాబు కవ్వమే ఎందుకవ్వాలి, పప్పు గుత్తి కూడా కావచ్చు కదా?” అన్నాడు.

కవిత రెండు చేతులూ ముడిచి “ఒరేయ్…నీ అతి తెలివికో నమస్కారం బాబూ..” అని వ్యంగ్యం గా అంది. దక్షిణపక్క నుంచీ వేప చెట్టు మీదు గా పైర గాలి సాగింది. చల్ల గా నెమ్మది గా వీస్తున్న ఆ గాలి మనసుల్నీ శరీరాలనూ కూడా దూది పింజ లా తేలిక పరుస్తోంది.

సరోజ దీపపు గాజు ని ముగ్గు పిండి తో శుభ్రం చేసి దీపాలు పెడుతోంది. క్రిష్ణారావూ శ్రీనివాస రావూ అరుగు మీద కూర్చొని కాలువల రాక గురించీ గ్రామ రాజకీయాల గురించీ పిచ్చా పాటి గా మాట్లాడుకొంటున్నారు.

రఘు పిల్లలని జనరల్ నాలెడ్జి ప్రశ్నలడగటం మొదలు పెట్టాడు. “మన ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు?”

“ఆ….జ్ఞానీ జెయిల్ సింగ్ “, కవిత చెప్పింది.

” ఈ లోపు కృష్ణారావు గారి అమ్మ సీతమ్మ గారు, ముగ్గు వేయమని కవితకు పురమాయించి సరోజ తో అంటోంది “ఇది ముగ్గులు పొందిక గా వేస్తుంది.” ఆమె కు ముగ్గురు పిల్లల లో కవిత అంటే ఒక్క పిసరు ఇష్టం ఎక్కువ .

శ్రీనివాస రావు అంటున్నాడు కృష్ణారావు తో, “ఎన్ టి రామారావు గెలుస్తాడని ఎవరూ అనుకోలేదు. ఏదో సినిమా వాడిని చూడటానికి జనాలు వస్తున్నార్లే అనుకున్నారు …”

“మన ప్రెసిడెంట్ అప్పుడే తెలుగుదేశం లోకి దూకేశాడు. చూడబోతే ఈ తెలుగు దేశం వాళ్లదీ మూడ్నాళ్ళ ముచ్చట లానే ఉంది.” కృష్ణా రావు అన్నాడు.

తరువాత అన్నదమ్ములిద్దరూ ఊరి అరుగుల మీదికి వెళ్లి అప్పటికే వచ్చి వున్నా గ్రామస్థులతో కబుర్లలో పడ్డారు.

నలభై ఏళ్ళు గా కమ్యూనిస్ట్ లు సాధించలేని పని రామారావు సాధించాడు అంటున్నారు కొందరు. ఇది జనాల సినిమా బలహీనత వలెనే జరిగింది అంటున్నారు ఇంకొందరు. కొత్త సీసా లో పాత సారా లాంటిది, కొన్నాళ్ల తరువాత ఇదీ కాంగ్రెస్ లానే తయారవుతుంది అంటున్నారు మరి కొందరు. ఊరి ప్రెసిడెంట్ అప్పుడే రామారావు జపం మొదలు పెట్టాడు. రాజకీయ చర్చలు వాడి గా సాగుతున్నాయి.

ప్రసూనంబ గారి పాలేరు ఒక చిన్న సంచి నిండా నిమ్మకాయలు తెచ్చాడు. ఈ సంవత్సరం వాళ్ల దొడ్లోని నిమ్మ చెట్టు విరగ కాసింది. సీతమ్మ గారు ఆ నిమ్మ కాయలు తీసుకొని అదే సంచి లో మామిడి పిండాలు పోసి ఆ పాలేరు కిచ్చింది.

వంట అవ్వడం తో చంద్రమ్మ మగవాళ్ళ ని ఇద్దరినీ పిలుచుకు రమ్మని’ శ్రీధర్ ని అరుగుల దగ్గరికి పంపించింది. అన్నదమ్ములిద్దరూ ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు.వాళ్ల తో పాటు పిల్లలు ముగ్గురూ కూడా కూర్చున్నారు. చంద్రమ్మ గారూ సరోజా వడ్డించ సాగారు. చంద్రమ్మ విత్తులు తీసిన చీమ తుమ్మ పప్పులతో కూర చేసింది. కూర రుచి గా వుండటం తో అందరూ భోజనాలు త్వర గా నే కానిచ్చారు.మగ వాళ్ల పళ్ళాలు కడిగి ఆడవాళ్ళూ వాటి లో భోజాలు చేయడం మొదలు పెట్టారు.

భోజనాల తరువాత సీతమ్మ గారు ఆరు బయట రెండు చాపలు పక్కపక్కనే వేసి పిల్లల్ని ముగ్గుర్నీ తన చుట్టూ పడుకో పెట్టుకుని భక్త రామదాసు కథ చెప్పా సాగింది. మధ్య మధ్య లో కథను బట్టి పద్యాలు పాదోతోందామే. పిల్లలు ఊఁ కొడుతూ వినసాగారు. కథ మధ్య లో శ్రీధర్ కి ఓ సందేహం వచ్చింది. “నాయనమ్మా! తానీషా కి శ్రీరాముడు కనపడకపోతే రామదాసు ఖైదు లోనే వుండే వాడా?”

“శ్రీ రాముల వారు భక్తజన సంరక్షకుడు. ఆయనే ఏదో ఒక విధం గా రామదాసును విడిపించేవాడు రా నాయనా..!” అంది సీతమ్మ గారు.

పిల్లలందరూ ఒక్కొక్కరే నెమ్మది గా నిద్రలోకి జారు కొన్నారు. పెద్ద వాళ్లందరూ తలవాకిట్లోకి చేరారు. మండువా ఇంటి తలుపులు తెరిచే వున్నాయి. సరోజ అడుగుతోంది కృష్ణారావు ని “బావ గారూ, ఇంటి తలుపులకి తాళాలు వేయరా?”.

“ఆ.. దొంగోడు వచ్చినా ఏమి వున్నయిలే అమ్మా మనింట్లో దోచుకు పోవటానికి,” అని తలుపులు దగ్గర గా వేసి వచ్చి మేను వాల్చాడు కృష్ణా రావు.

****************

మరుసటి రోజు కృష్ణా రావు కి బందరు వెళ్లాల్సిన పనిబడింది. పాత ఆస్తి తగవుల గురించి జిల్లా కోర్టు కు హాజారు కావలసి వచ్చింది ఆయనకు.

ఆయనకు ఓ రెండెకరాల మాగాణీ ఇంకో రెండెకరాల మామిడి తోటా ఉన్నాయి. మాగాట్లో మొదటి పంట గా వరి పండుతుంది. రెండో పంట అపరాలు అవుతాయి. వర్షాకాలం లో మామిడి తోట లో కందులు పండిస్తారు. ఉన్నంత లో నే అప్పు చేయకుండా పొడుపు గా సంసారాన్ని లాక్కొస్తున్నాడాయన. అయితే, రేవు గట్టున వున్న జామ తోట, మూడెకరాలది, దాయాదుల మధ్య కోర్టు కేసు లో నలుగుతోంది. దానికోసమే పట్నం వెళ్ళాల్సి వచ్చింది ఆయనకు.

మాళీ గేదె కు కొత్త గా పుట్టిన తువ్వాయి ని పరిగెత్తిస్తున్న చిన్నూ అనబడే శ్రీధర్ కి కృష్ణా రావు పట్నం వెళ్తున్నాడనే విషయం చెవిన పడనే పడింది. దాంతో తనూ బందరు వస్తానని పట్టుపట్టాడు వాడు. కృష్ణా రావు కి వాడి ని కూడా తీసుకొని వెళ్లక తప్పింది కాదు.

కోర్టూ, అక్కడి బంట్రోతులూ లాయర్లూ కక్షి దారులూ అంతా ఓ వింత లోకం లా అనిపించారు చిన్నూ గాడి కి. బందర్లో ఆర్నెల్ల ముందు విడుదలైన సినిమాలు కాక, రోజూ పత్రికల్లో చూసే “నేడే విడుదల!” సినిమాలు ఆడటం నచ్చింది వాడికి.

ఒక బస్తీ కి రావటం వాడికి అదే మొదటి సారి కావడం తో అక్కడి రోడ్లనీ మనుషుల్నీ శాపు లనీ విచ్చిన కన్నులతో చూశాడు వాడు.కొంత మంది ముస్లిం స్త్రీలు పరదా వేసుకోవడం వాడికి వింత గా అనిపించింది.

మద్యాహ్నం అయ్యే సరికి కోర్ట్ పనులు ముగిశాయి. ఓ హోటల్ కి భోజనాని కి వెళ్ళారు కృష్ణా రావూ చిన్నూ. కృష్ణా రావు చేతులు కడుక్కొంటూ ఉండగా చిన్నూ ఓ కుర్చీ లో కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి ఏం కావాలో చెప్పమన్నాడు. ఏమి ఉన్నాయో చెప్పమన్నాడు చిన్నూ. వెయిటర్ ఉన్న పదార్థాల పేర్లన్నీ వరుస గా, యాంత్రికం గా ఒప్పచెప్పటం మొదలు పెట్టాడు. చాలా తమాషా గా అనిపించింది వాడి కి. ఆ వెయిటర్ ని చూస్తే వాడి కి వాళ్ల బాబాయి

తెచ్చిన “కీ ఇస్తే మోగే కుక్క” గుర్తుకు వచ్చింది. అయితే వాడు అలా పదార్థాల పేర్లు ఒప్పచెప్పటం చూసి చిన్నూ కి కొంచెం దిగులు వేసింది.

“నాకు భోజనం కావాలి ” అన్నాడు చిన్నూవాడితో .

“ప్లేట్ మీల్సా ? ఫుల్ మీల్సా ?” వెయిటర్ వాడిని అడిగాడు.

“అంటే?” వాడన్నది అర్థం కాక అడిగాడు చిన్నూ.

ఇంతలో కృష్ణా రావు వచ్చి వెయిటర్ కి ఆర్డర్ చెప్పాడు చెప్పాడు.

” ప్లేట్ మీల్స్ అంటే ఏమిటి ?” చిన్నూ వాళ్ల నాన్నని అడిగాడు.

“ప్లేట్ మీల్స్ అంటే ఒక ప్లేట్ నిండా మాత్రమే అన్నం ఇస్తారు”

“మరి, ఆకలయ్యి ఇంకా తినాలనిపిస్తే?”

“దానికి ఎక్కువ డబ్బులు కట్టాలి. దాన్నే ఫుల్ మీల్స్ అంటారు”.

ఈ ప్లేట్ మీల్స్ కూడా చిన్నూ దిగులు ను ఎక్కువ చేసింది.

కృష్ణా రావు ఇంటి కి కావలసిన వెచ్చాలు కొని, వెంకటాపురం తిరుగుముఖం పట్టాడు, చిన్నూ తో సహా…

ఇంకా వుంది…

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-2

  1. శ్రీనివాస రావు అంటున్నాడు కృష్ణారావు తో, “ఎన్ టి రామారావు గెలుస్తాడని ఎవరూ అనుకోలేదు. ఏదో సినిమా వాడిని చూడటానికి జనాలు వస్తున్నార్లే అనుకున్నారు …”

    ” నలభై ఏళ్ళు గా కమ్యూనిస్ట్ లు సాధించలేని పని రామారావు సాధించాడు అంటున్నారు కొందరు.”—–

    నిజమేనండి. రామారావు గారితో గ్రామాలలో రాజకీయ అవగాహన బాగ పెరిగింది. ఆంధ్రా లో రాజకీయ విప్లవం వచ్హింది.కొత్తవారికి అధికారాలు వచ్హాయి. గ్రామవ్యవస్థ పూర్తిగ మారింది

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s