ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-22

శ్రీధర్ ఎంసెట్ బాగానే రాశాడు. వాడికి మూడొందల ఫైన ర్యాంక్ వచ్చింది.   చంద్రహాస్ కీ మూడు వందలపైన వచ్చింది. కృష్ణా రావు ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళిన మనిషి కాదు. ఆయనకు ఆ నగరం పోవాలంటే ఏదో తెలియని బెరుకు. చంద్రహాస్ వాళ్ళ నాన్న వాళ్ళిద్దర్నీ హైదరాబాద్ తీసుకొని వెళ్తానన్నాడు. శ్రీధర్ వాళ్ళ నాన్న కి చెప్తే ఆయన ఇందుకు ఒప్పుకున్నాడు.
శ్రీధర్ కి హైదరాబాద్ చాలా వింత గా అనిపించింది. తెలుగు రాష్ట్ర రాజధాని లో తెలుగు విస్తృతం గా వాడక పోవటం ఒక వింతైతే, ఆ తెలుగు తను మాట్లాడే తెలుగు కి పూర్తి భిన్నం గా ఉండటం ఇంకో వింత. తాను అప్పటి దాక నిజ జీవితం లో విన్న, సినిమాల్లో  చూసిన, పుస్తకాల్లో చదివిన భాషకి అది చాలా భిన్నం గా ఉంది.  దానితో శ్రీధర్ కి ఆ భాష తప్పనిపించింది. వాడి రిఫరన్స్ ప్లేన్ అనేది వాడి ఊరి భాష. ఆ భాష తో భిన్నం గా ఉన్నదంతా తప్పనిపించింది వాడికి. ఆ భాష మీద వాడికి తాత్కాలికమైన చిన్న చూపు ఏర్పడింది.
కౌన్సెలింగ్ లో శ్రీధర్ కి కాకినాడ ‘జే ఎన్ టీ యూ’లో ఎలెక్ట్రానిక్స్ దొరికితే చంద్రహాస్ కి వరంగల్లు ఆరీసీ లో కంప్యూటర్ సైన్స్ దొరికింది.
***********
ఎన్.టీ. రామా రావు ఎలెక్షన్లలో ఓడి పోయి, తెలుగు దేసం పార్టీ అధికారం లోంచీ దిగి పోయింది. కాంగ్రెస్ లో మొదటి కృష్ణుడు చెన్నా రెడ్డి ని దించటానికి పెద్ద కుట్రే జరిగింది. రెండో కృష్ణుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
**********
శ్రీధర్ ఇంజనీరింగ్ కాలేజీ లో అడ్మిషన్ కి కాకినాడ వెళ్ళాడు. మండల్ కమీషన్ గొడవలు జరిగి అప్పటికి ఎక్కువ కాలం అవ్వకపోవటం వలన, కాలేజీ లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకీ లేని వాళ్ళకీ గొడవలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కాలేజీ  హాస్టల్లో ఉంటే, లేని వాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉంటున్నారు. రిజర్వేషన్స్ ఉన్న సీనియర్స్ లేని ఫ్రెషర్స్ నీ, రిజర్వేషన్స్ లేని సీనియర్స్ ఉన్న ఫ్రెషర్స్ నీ రాగింగ్ చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఉన్నా లేకపోయినా సీనియర్స్ జూనియర్స్ చేత బట్టలు విప్పించటం, బూతు పాటలు పాడించటం, అమ్మాయిలకు “ఐ లవ్ యూ” చెప్పించటం చేస్తున్నారు.
శ్రీధర్ కాకినాడ లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండి రోజూ కాలేజీ కి వెళ్ళి రా సాగాడు. ఉదయంలేచి కాలేజీ కి వెళ్ళాలంటే హడల్ గా ఉండేది శ్రీధర్ కి, రాగింగ్ గుర్తుకొచ్చి.
కాలేజీ గురించి శ్రీధర్ కి నెమ్మది గా విషయాలు తెలియ సాగాయి. కాలేజీ లో గొడవలు  ఎక్కువ. ఆ గొడవలు కులాల ఆధారం గా జరుగుతాయి. కాలేజీ లో వేర్వేరు కులాల విద్యార్ధులు వేర్వేరు ఫ్రెషర్స్ పార్టీ లు పుట్టుకొంటారు. కుల స్పృహ ని అధిగమించే చైతన్యం స్టూడెంట్స్ కి లేదు. ఎక్కడ నుంచీ వస్తుంది చైతన్యం? వాళ్ళ పెద్ద వాళ్ళ కి లేదు ఈ చైతన్యం. టీచర్స్, లెక్చరర్స్ కులాలకు  అతీతం కాదు. క్లాసు లో చెప్పే పాఠాలూ, సినిమాలూ సమాజం లో కులమే లేనట్లు ఎస్కేపిస్టు గా ఉంటాయి. ఊరి లోని జీవితమూ కులాధారితమే.  కాలేజీ  లో కులాల గొడవలు తలలు పగల కొట్టుకొని పోలీసుల కేసుల వరకూ వెళ్తాయి. లెక్చరర్ ల కి గౌరవం ఇవ్వక పోగా, వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ స్కూటర్ సీట్ కవర్ కోయటం లాంటివి అసాధారణమేమీ కాదక్కడ.
శ్రీధర్ దసరా సెలవలకి ఊరెళ్ళినప్పుడు,”కాలేజీ ఎలా ఉంది రా”,  అని అడిగాడు కృష్ణా రవు.
“కాలేజీ మానేస్తాను నాన్నా”, అని కాలేజీ వివరాలన్నీ చెప్పాడు శ్రీధర్.
అదంతా విని, తేలిక గా తీసుకొని నవ్వేసి,”అవన్నీ ఒక నెలలో సద్దుకొని పోతాయి. కాలేజీ మానటానికేనా నువ్వు కష్టపడి చదివి రాంకు తెచ్చుకున్నది?” అన్నాడు.
“ఏం చేస్తాం కాలేజీ లో రాగింగ్ అనే చేదు అనుభవం ఎదురైంది శ్రీధర్కి, కృష్ణా రావు కి కాదు గదా!.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-22”

  1. >>క్లాసు లో చెప్పే పాఠాలూ, సినిమాలూ సమాజం లో కులమే లేనట్లు ఎస్కేపిస్టు గా ఉంటాయి

    నిజం చెప్పారు బాస్. students మధ్య ఎప్పుడైనా ‘కులం-మతం’లాంటివి వస్తేగిస్తే అవి ఛాయ్ తాగేప్పుడు లీడర్లని తిట్టుకోడానికో, వాళ్లను వాళ్లు తిట్టుకోడానికో పనికొస్తాయి.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి