అదృశ్యమైన అంకినీడు..ఒక చిన్న కథ..

భుజం మీదినుంచీ పైపంచె తీసి, బల్లమీది లేని దుమ్ము  దులిపి, పంచె పైకి లాగి కూర్చున్నాడు అంకినీడు.
“అమ్మాయ్..! అంకినీడొచ్చాడు రొండు మినపట్లు పెట్టు”, అంది ఆదెమ్మ కోడలితో.
“ఆ..ఊళ్ళో వాళ్ళందరికీ తేర గా పెట్టటానికి ఉందిక్కడ!”, కోడలు గొణుక్కొంది లోలోపల.
ఐదు మిముషాలయ్యింది..పదినిముషాలయ్యింది..పావు గంటయ్యింది..ఆ రెండు మినపట్లూ రాలేదు.
ఆదెమ్మ మళ్ళీ కేకేసింది, “సరితా, మినపట్లు”.
“ఆ మినపట్లంట తగలెయ్యవే!”, అని భార్యను కసిరాడు పక్కనే మంగలి తో గడ్డం చేయించుకొంటున్న చెరువు కాడి చిన్ని గారి వెంకయ్య .
అంకినీడు విసురు గా లేచి పై పంచె దులిపి భుజం మీద వేసుకొని నెమ్మదిగా బయటికి నడవ సాగాడు. ముందు విసురుగానే నడుద్దామనుకొన్నాడు. కానీ కాళ్ళు పట్టివ్వటం లేదు ఈ మధ్య.
ఆదెమ్మ, “అంకినీడూ ఆగయ్యా..!, ఒరే.. ఎంకన్నా..చెప్పేది సరిగా చెప్పొచ్చు గా..మాట పడటం మా కంఠంనీడారి లో అసలు లేదు.” అంది.
“ఆ..లేదు..లేదు..మీ కంఠంనేనారి ముఠా గురించి ఎవరికి తెలవదు..? అయినా ఇన్నేళ్లయినా పుట్టింటాళ్ళ మీద బెమత పోలేదమ్మా నీకు!”
మొత్తానికి అంకినీడు బల్ల మీద కూర్చొని మినపట్లు తిని కాఫీ తాగేదాకా ఊరుకోలేదు ఆదెమ్మ.
******************
అంకినీడు నెమ్మది గా వీధిలోకి వచ్చే సరికి పొద్దెక్కిపొయింది. చెప్పుల్లేని కాళ్ళు ఎండకి కాలుతున్నాయి.వెళ్ళి ఊరి అరుగుల దగ్గర కూర్చొన్నాడు.
“నాలుగు నెల్లు గా మెడ నరాలు ఒకటే పీకటం. కణతలు అదురుతున్నాయి. డాక్టర్ దగ్గరికి పోదామంటే చేతిలో చిల్లి గవ్వకూడా లేదాయే..”
మచ్చల పిల్లి  ఒకటి నీడ లో మాగన్ను గా నిద్ర పోతోంది.పక్కనే ఓ దొడ్లో కాకి కుడితి తొట్టి అంచు మీద కూర్చొని ఎండకి నీళ్ళు కతుకుతోంది.
పది రోజుల గడ్డం తెల్ల గా మాసి ఉంది. మంగలి నాగరత్నం పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అంకినీడు మాసిన గడ్డాన్ని వేళ్ళతో నిమురుకొని,”ఇదుగో నాగరత్నం..కాత్తి గెడ్డం గీత్తా..? చేయించుకొని పది రోజులయ్యింది..”, అన్నాడు.
“మా వాడు సెంటర్లో షాప్ పెట్టాడు అక్కడ గీయించుకో”, సైకిల్ మీద గబ గబా వెళ్ళిపోయాడు నాగరత్నం.

అంకినీడు ఒకప్పుడు బాగానే బతికాడు. నాన్న అంజయ్య. ఆయన ఆదెమ్మ పెదనాన్న కొడుకు.  అంకినీడు చిన్నప్పుడే చనిపోయాడాయన. అమ్మ శేషమ్మ, ఆదెమ్మ కంటే పదిహేనేళ్ళు పెద్దది. అంకినీడు పట్నం పిల్లని పెళ్ళి చేసుకొన్నాడు. కానీ శేషమ్మకు కోడలు తీరు ఏమాత్రం నచ్చలా. “పని తక్కువ షోకులెక్కువ”, అనుకొంది శేషమ్మ.
కోడలికి శేషమ్మ తనని రాచి రంపాన పెడుతున్నట్లనిపించింది.ఊళ్ళోవాళ్ళందరూ, “శేషమ్మ కోడల్ని చెర కట్టనీయదు”, అనుకొన్నారు.

పిల్లాడినెత్తుకొని పుట్టింటి నుంచీ వచ్చిన వెంటనే కోడలికి పనులు పురమాయించటం మొదలు పెట్టింది శేషమ్మ. అంకినీడు కూడా అమ్మని సమర్ధించాడు. దానితో తన తండ్రికి రహస్యం గా ఉత్తరం రాసి, రమ్మంది కోడలు. పిల్లాడిని తీసుకొని, తండ్రితో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రి తో వెళ్ళిన ఆమె తరువాత మళ్ళీ రానేలేదు. అంకినీడూ ఆమె దగ్గరికి పోలేదు.కంఠంనేని వారి అభిమానం అడ్డొచ్చింది అంకినీడు కి. ఊళ్ళో వాళ్ళెవరో అనుకొంటుంటే విన్నాడు, తన భార్య కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేసిందని, ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడనీ.
శేషమ్మ ఉన్నంతకాలం అంకినీడుకి ఇంత ఉడకేసిపెట్టింది. శేషమ్మ పోయేనాటికి పెరిగిన ధరలకి ఉన్న ఎకరం చెక్కా తుడిచిపెట్టుకొని పోయింది. కూలికెళ్దామంటే అప్పటికే వేళ్ళు పట్టివ్వటం మానేశాయి. కాళ్ళు కదలటం లేదు. ఇక అప్పటి నుంచీ ఊళ్ళో అయిన వాళ్ళ దగ్గర తింటూ ఎలాగో రోజులు గడిపేస్తున్నాడు.

బుచ్చియ్య గారి దామోదర రావు చేతి వాచీ చూసుకొంటూ అరుగుల దగ్గరికి వచ్చాడు. అంకినీడు కి ఈ మధ్య చూపు ఆనటం లేదు. కళ్ళు పువ్వులేసినై. కళ్ళపై నుదుటికడ్డం గా చేయ్యి పెట్టి , కళ్ళు చికిలించి పళ్ళు బయటపెట్టి చూశాడు దామోదర రావు వచ్చిన వైపు కి.  దామోదర రావు అంకినీడు ని చూసి ఒక నవ్వు నవ్వి, “ఏం.. పలారం అయ్యిందా..?” అన్నాడు, చేతి వేళ్ళు ఒకటి చేసి నోటి దగ్గర ఊపుతూ.
దామోదర రావు పిల్లలందరూ అమెరికా లో ఉన్నారు. ఇక్కడ ఓ యాభై యెకరాలు ఉంది. అయినా, హైదరాబాదు నుంచీ రావటానికి, కొబ్బరి బొండాల తిరుగు లారీ లో ఫ్రీ గా వస్తాడని చెప్పుకొంటారు ఊళ్ళో జనాలు.
అయిందంటూ తలూపాడు అంకినీడు. “ఎందాకా…?”, దామోదర రావు ని అడిగాడు.
“ఇక్కడకే కొట్టుకి ..మజ్జానం మా ఇంటికి రా రాదూ?”, అన్నాడు దామోదర రావు.
అంకినీడు ని అన్నానికి రమ్మని, ముందు ఆ పనీ ఈ పనీ చేయించుకొని, తరవాత రాత్రి మిగిలిన కూడూ ఇంత పచ్చడీ వేయించటం దామోదర రావుకి అలవాటు. మొదట్లో  చెప్పింది చేసేవాడు, కానీ,ఇప్పుడు తన కాళ్ళూ చేతులూ తన మాట వినటం లేదు.
పిల్లి నెమ్మది గా లేచి జారుకో సాగింది. అంకినీడు దానికేసి చూపించి, “దాన్ని అడుగు ..వస్తందేమో..!”, అన్నాడు దామోదర రావు తో.
“నీకు ఇంకా గీర్వాణం వదలలా..మీ కంఠంనేని వారి ముఠా లోనే ఉందీ టెక్కు”, అని కొట్టు వైపుకి ఏదో కొనటానికి వెళ్ళాడు.
“పొద్దున్నే ఆదెమ్మ మహా తల్లి ఆదుకుంది..ఇక ఈ మజ్జానం ఎట్టా గడుత్తుందో!” అనుకొంటూ పై పంచె భుజం మీద వేసుకొన్నాడు. ఆ పై పంచె కి చిరుగులు పడిఉన్నాయి. ఐనా అంకినీడు దానిని వదలడు. “రైతన్నతరవాత పైపంచె లేకండా ఎలా?”.
నెమ్మది గా కాళ్ళీడ్చుకొంటూ, కాలువ వైపుకి బయలు దేరాడు. ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. “కాత్త ఆ కాలవ కాడైనా చల్ల గా ఉంటంది” అనుకొన్నాడు.
**********
పైన ఎండగా ఉన్నా కాలువ గట్టు మీద చెట్టు కింద చల్ల గానే ఉంది. నీరు స్థిమితం గా పారుతోంది. కాలువకడ్డం గా తాటి మాను ఒకటి వేసి ఉంది. కాలువ గట్టు పచ్చిక తో పిచ్చి మొక్కల తో పచ్చగా ఉంది.
“తన చిన్నప్పటి నుంచీ ఈ కాలవ మాత్రం మారలా..అప్పుట్నుంచీ ఇప్పుది దాకా ఎంత నీరు పారి ఉంటంది దీంట్లో..అయినా ఈ కాలవ మాత్రం మారలా! చిన్నప్పుడు తను అక్కడే తోటి వాళ్ళ తో కలిసి ఈతలు కొట్టాడు. తన తోటి వాళ్ళు అందరూ చాలా వరకూ పై చదువులకెళ్ళారు. తానొక్కడే తన తల్లి శేషమ్మ గారం వలన చెడి పోయాడు. ఏదైనా తన కి ఆయుష్షు ఎక్కువ. తన స్నేహితులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాళ్ళు కూడ చాలా మంది కాలం చేశారు..తను మాత్రం మిగిలున్నాడు..ఇలా…”

“ఆ మజ్జ, డాబా రాఘవయ్య గారి అబ్బాయి పెళ్ళి కి పెద్ద కారేత్తే  ఎల్లాడు తను బెజవాడ. అక్కడంతా దిక్కులేనాళ్ళు రోడ్డు పక్కన పడుకోవటమే..తను ఊళ్ళో నే ఉండటం వలన తనకా గతి పట్టలేదు..ఏదో పూరిల్లైనా రేత్రి పడుకోవటానికో ఇల్లుంది తనకు… సరే, పెళ్ళి కెళ్ళాడా.. ఆ పెళ్ళి లో కనపడింది తన పెళ్ళాం. పక్కనే ఉన్నాడు తన కొడుకు. అంతా తన పోలికే! తన బార్యా, తనని చూసి కూడా చూడనట్టే మొగం చాటేసింది. కొడుకుకి చెప్పినట్టు కూడ లేదు…తన్ని విడిచి పెట్టి పోయినపుడు పిల్లాడికి ఉహ కూడా తెలియదు..ఇంకా పిల్లాడు తనని ఎట్టా గుర్తు పడతాడు? తనకి మాత్రం అనిపించింది..ఆడి దగ్గిరికి ఎల్లి “ఒరే! నేను మీ నాన్నని రా!”, అని గుండెలకి అదుంకోవాలని.”

నెమ్మది గా వెళ్ళి తాటి మాను ఎక్కాడు.కంటి కి మాను సరిగా ఆనటం లేదు. పాదం ముందు పాదం పెడుతూ కాలువ మధ్యకి చేరుకొన్నాడు. మాను మీద గొంతుకు కూర్చొని నీళ్ళలోకి చూశాడు. నీళ్ళలో చచ్చిన పావురమొకటి కొట్టుకు పోతున్నట్లుంది.  ఛాతి లో సన్న గా నొప్పి మొదలయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చట్ మని నీళ్ళు శబ్దం చేశాయి. ఆ సాయంత్రానికి ఊరి చివర లాకుల దగ్గర కనపడింది ఊళ్ళో వాళ్ళకి అంకినీడు శవం.

ప్రకటనలు

12 thoughts on “అదృశ్యమైన అంకినీడు..ఒక చిన్న కథ..”

  1. చాలా బాగుంది. కధ అంటే మనుషుల బ్రతుకుని అద్దం పట్టేదంటారు. ఆ వాసనలు ఈ కధలో అచ్చంగా కనిపించాయి.ఒక మనిషి జీవితాన్ని ఎదురుగా కళ్ళకు కట్టినట్టు చూపించారు.

    మెచ్చుకోండి

  2. బొందలపాటిగారూ,
    చాలా బాగుంది. మీరు రేపల్లె యాస ప్రయత్నించినట్టు కనబడిందికానీ అందులోని పరిమళం మాత్రం రాలేదనే చెప్పాలి. నేను స్వయంగా అక్కడే పుట్టి పెరిగాను. ఇంగ్లీషు చదువుల పుణ్యమా అని నాకే ఆ విరుపులు సరిగా రావు.

    ఇక కథ, కథనం ఎందులోనూ తీసిపోవు. బాగా రక్తి కట్టించారు, అభినందనలు.

    మెచ్చుకోండి

    1. అచంగ గారు,
      ధన్యవాదాలు, ఇది రేపల్లె యాస కాదండీ, ఇది కృష్ణా జిల్లా తూర్పు వైపు యాస మోపిదేవి..మొవ్వా గట్రా.. ఆ యాసకైనా ఈ చిన్న కథ లో న్యాయం చేయటం చాలా కష్టం. .ఇప్పటికీ ఆ యాస పల్లెటూళ్ళలో మాట్లాడేవారే దానికి పూర్తి న్యాయం చేయగలరు..

      మెచ్చుకోండి

      1. బొందలపాటి గారు,

        అంకినీడు అనే పేరు మొవ్వ, ఘంటసాల, కూచిపూడి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. యాస కూడా ఈ ప్రాంతాల్లోనిదే. అలాగే కంఠంనేని అనే ఇంటిపేరు కూడా.

        మెచ్చుకోండి

    1. సుప్రియ గారు,
      థాంక్స్! నేను మీ తాతయ్య వాళ్ళ కథని కాపీ కొట్టేశాను! 🙂
      Jokes apart.. ఈ కథ కి దగ్గర గా నిజ జీవితం లో చాలా కథలు ఉండే అవకాశం ఉంది.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s