ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-1

1

రోడ్డు పక్కకి వచ్చి ఆగింది మా సాఫ్ట్ వేర్ కంపెనీ బస్సు. బస్సెక్కి రోజూ కూర్చునే సీట్ లో కూర్చున్నాను.పక్క సీటు లో అప్పటి కే కూర్చున్న వెంకట్ అనబడే వెంకట్ రావ్ తెలుగు పేపర్ నమిలేస్తున్నాడు. ఇంకో ఇద్దరు మలయాళీ అమ్మాయిలు పాట పాడినట్లు గా వుండే మలయాళం లో మాట్లాడుకొంటున్నారు. ఎఫ్ ఎం రేడియో లో నుండి కన్నడ సినిమా పాట సందడి గా వినబడుతోంది. ఇంగ్లీషు పేపరు ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతి లో కి మారుతోంది. ఈ మధ్యనే వేడెక్కడం నేర్చిన బెంగళూరు గాలి ఆటో ల పొగలను కలుపుకొని బస్సు కిటికీ ల నుండి లోనికి చొచ్చుకొని వస్తూ వుంది.

“ఏమిటి వెంకట్ ఈ రోజు న్యూస్?” వెంకట్ ను కదిలించాను నేను.

“ఏమి వుంటుంది? ఏ రోజు న్యూస్ అయినా ఒకటే లా వుంటుంది. గవర్నమెంటు వాడు అపోజిషన్ను తిట్టుడూ …. అపోజిషనోడు గవర్నమెంటు ను తిట్టుడూ వగైరా వగైరా… ఇప్పట్నుండీ రెండు సంవత్సరాల తరవాతి న్యూసు కూడా ఇప్పుడే గెస్ చేసి చెప్పొచ్చు. కాని ఈ పేపర్ వాడికి మాత్రం బోరు కొట్టదు”.

“నీకు బోరు కొడితే పేపర్ ఎందుకు కొన్నావు?” నవ్వాను.

”మల్ల పేపర్వాడు ఎట్లా బతుకుతాడు?” వెంకట్ కూడా నవ్వాడు.

“ఈ బతుకు చూస్తుంటే హాయి గా మా పల్లె కి పోయి వ్యవసాయం చేసుడు బెటర్ అనిపిస్తోంది,” అన్నాడు వెంకట్.

“మరి ఆ పనే చెయ్యక పోయావ్?” మెల్ల గా నవ్వుతూ అన్నాన్నేను.

” అదే ఆలోచిస్తున్నాను. ఊళ్ళో వున్నప్పుడు కమ్మ గా అమ్మ చేతి వంట తినే వాడిని. షికార్లూ… ఫ్రెండ్స్ తో బాతాకానీ…ఏమి లైఫ్ లే…అప్పుడు ఒక్క పైసలే వుండేటివి కాదు. ఇప్పుడు పైసలున్నై …కాని లైఫ్ మాత్రం లేదు..టైం అసలే లేదు.”

“ఒక సన్నటి ఇరుకు రోడ్ లో ట్రాఫిక్ లో చిక్కుకొంది మా కాబ్. వెంకట్ బయటకు చూస్తూ సాలోచనగా అంటున్నాడు “ఇక్కడ సిటీ అంతా దుమ్ము…పొగ…క్వాలిటీ అఫ్ లైఫ్ అస్సలు లేదు.”

“ఊళ్ళో ఉండే బాధలు ఇప్పుడు నీకు తెలియవు. అక్కడ ఉండే కష్టాలు అక్కడా వుంటాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళేమో వాళ్ళది ఎదుగూ బొదుగూ లేని జీవితమనే అసంతృప్తి తో ఉంటారు. ఒక్కసారి ‘జాబ్ రాక ముందు మన జీవితం ఎలా వుండేదో గుర్తు తెచ్చుకో !”

బస్సు ఫోరం మాల్ ముందు ఆగింది. మాల్ ముందు అమ్మాయిలూ అబ్బాయిలూ గుంపులు గా వున్నారు. వాళ్ల హెయిర్ స్టైల్ నుండి నెయిల్ స్టైల్ వరకు అంతా మూస పోసినట్లు ఒకే విధం గా ఉంది. బహుశా ఊళ్ళోని బ్యూటీ పార్లర్లు అన్నీ ఒకే కోర్సు ఫాలో అవుతున్నాయేమో…! వాళ్ల హావ భావాలు కూడా అమెరికా లో మాస్ ప్రొడ్యూస్ అయినట్లున్నాయి. అమ్మాయిలయితే, మోహానికీ గోళృకీ జుట్టు కీ పెదాలకూ కళ్ళ చుట్టూ రంగుల తో కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇద్దరమ్మాయిలూ ఇద్దరబ్బాయిలూ మా కాబ్ ఎక్కారు.

“హావ్ యు జాయిన్డ్ న్యూలీ?” వాళ్ళలో ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి ని అడుగుతున్నాడు.

“ఉహు”, ఆ అమ్మాయి నిట్ట నిలువు గా తల ఊపింది. తరువాత కొన్ని సెకన్ల వరకు ఆ తల అలా వూపుతూనే ఉంది. ఆ అమ్మాయి గెస్చర్ కి అమెరికన్ లో అయితే అవును అని అర్థం. తెలుగు లో మాత్రం “అలానా!” అని అర్థం.

“మా కాబ్ సిల్క్ బోర్డు దాటి బొమ్మనహళ్లి గుండా హోసూరు రోడ్ మీద పోతోంది. రోడ్ మీద ట్రాఫిక్ చుస్తే బెంగళూరు జనాలంతా ప్రాణ భయం తో పారిపోతున్నంత హడావిడి గా ఉంది. కంటి కి కనిపించినంత మేర దుమ్ము తెరలు లేస్తున్నాయి. ఆ గడబిడ లో ఎక్స్ ప్రెస్ వే కోసం వేసిన పిల్లర్లు మాత్రం స్థిరం గా తాపీ గా నుంచొని ఉన్నాయి.

కంపెనీ బస్సు ల వెనక డ్రైవర్ రాష్ గా డ్రైవ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ నంబర్లు రాసి వున్నాయి. కానీ, అన్ని కంపనీ ల బస్సులూ రాష్ గానే పోతున్నాయి. “నోటితో నవ్వి, నొసటి తో వెక్కిరించటం” అంటే ఇదేనేమో..!

మా కంపెనీ బస్సు ఇంకో కారు ని మెల్ల గా డీ కొట్టింది. మా కాబ్ డ్రైవర్ కిందికి దిగి కన్నడం లో బిగ్గర గా అరవడం మొదలు పెట్టాడు. అవతలి కారు లోని వ్యక్తి కి కన్నడం రానట్లుంది. ఏదో కంపెనీ ఎగ్జిక్యూటివ్ లా వున్నాడు. అతను ఇంగ్లీష్ లోనూ అప్పుడప్పుడూ హిందీ లోనూ ఏదో అరుస్తున్నాడు. వెనక ఉన్న కార్లూ బస్సులూ అసహనం గా హారన్ లు మొగించటం మొదలు పెట్టాయి. హాంకింగ్ దెబ్బకి డ్రైవర్ లు ఇద్దరూ సర్దుకొని మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెట్టారు. ఈ సీన్ చుస్తే ఆఫీసు ప్రాజెక్టు లోని రిస్క్ ఆక్తివిటీస్ గుర్తుకు వచ్చాయి. నిజ జీవితం లోని ఈ ‘ఆక్సిడెంట్ రిస్కు’ ఎప్పుడు పోతుందో కదా…! నా సెల్ ఫోన్ రింగ్ అవుతోంది…సెంథిల్ కుమార్ ఫోను….తను రావటం రెండు నిమిషాలు లేటు అవుతుందట …కాబ్ ని బొమ్మనహళ్లి లో తను వచ్చే వరకు ఆపమని. సెంథిల్ వచ్చాక కాబ్ స్టార్ట్ అయింది.

వెంకట్ హోసూర్ రోడ్ ని చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు. “ఇక్కడ రోడ్ లు ఘోరం గా వున్నాయి..గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్త సీఎం రోడ్లు వేయించుతా అంటున్నాడు. కానీ ఈ పొలిటిశియన్ ల ని నమ్మలేం ర భాయి. ఈ రోజు ఒక మాట చెప్తే రేపొక మాట చెప్తారు. ఈ రోజు ఒక పార్టీ ల వుంటే రేపు వేరే పార్టీ కి జంప్ అయితారు.”

“అవునూ …వెంకట్ మొన్న వేరే కంపెనీ లో ఆఫర్ వచ్చిందని అన్నావు. ఎం చేస్తున్నావ్.. జాబు మారతావా…?” వెంకట్ మాటల తో నాకు అతనికి వచ్చిన ఆఫర్ గుర్తుకు వచ్చింది.

“చూడాలె మన కంపెనీ వాడు యూఎస్ పంపించుతా అంటుండు . పంపించక పోతే అప్పుడు రిజైన్ చేస్తా.. .. అన్నట్టూ నువ్వు కూడా సాఫ్ట్వేర్ నుండి వేరే ఫీల్డ్ కి మారుతా అంటున్నావు కదా, దాని సంగతేమయింది ?” నన్నడిగాడు వెంకట్.

“నాకు మారాలనే ఉంది. కాని కుదరక పోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ జాబు పులి మీద స్వారీ లాంటిది. జాబు లో జాయిన్ అయిన కొత్తల్లో చాలా నే డబ్బు కనిపిస్తుంది . నెమ్మది గా ఖర్చులు పెరుగుతాయి. కారు లోను, హౌస్ లోను ఈఎమ్మై కట్టాలి. వాటి కోసం జాబు చేస్తూనే ఉండాలి……నువ్వు ఇప్పుడు యూఎస్ వెళ్తా అంటున్నావ్.. మీ వూరు వెళ్లి వ్యవసాయం చేసే ప్లాన్ మానుకోన్నట్లేనా? ..” అన్నాను వెంకట్ తో.

“అరే….అదో పెద్ద టాపిక్. ఇప్పుడు టైం లేదు. మల్ల సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మాట్లాడుదాం ….”

” ఈ లోగా మా కాబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ లోని మా ఆఫీసు ముందు ఆగింది. వెంకట్ వాన్ దిగి గేటు దగ్గరికి వెళ్లి కార్డు స్వయిప్ చేశాడు . తర్వాత నేనూ స్వయిప్ చేశాను . నా తరవాత చాలా మంది స్వయిప్ చేస్తున్నారు….”కిక్ కీక్……కిక్….కీక్ ” స్వయిప్ మెషిన్ తన పని తాను చేసుకు పోతోంది. నేను నా క్యూబ్ కి వెళ్లి సీట్ లో కుర్చొని సిస్టం ఆన్ చేశాను.

ఇంకా ఉంది…