మెదడు లో పురుగు

మా ఆఫీసులో ఓ వారం క్రితం జాయినయ్యాడతను. పేరు సుబ్బారావు. చామన ఛాయ గా ఉన్నాడు. అతని చూడగానే నా మైండ్ లో పురుగు తొలవటం ప్రారంభించింది. దానిని ఆపటం కోసం మొదట అతని ముఖ కవళికలు పరిశీలించాను.
..పురుగు ఆగలా..
అతనిభాష సాధారణ హైదరాబాదీ భాషే!
..పురుగు ని ఆపలేకపోయాను..
అతని భాష లో యాస ఏ మాత్రం లేదు
..పురుగు తొలుస్తూనే ఉంది..
“యే జిల్లా నుంచీ మీ పెద్దవాళ్ళొచ్చారు?”, అని అతనిని అడిగాను.
..ఉపయోగం లేదు..
అతని అసలు ఊరి గురించి ఆరా తీశాను..
..ప్చ్.. లాభం లేదు..తొలుస్తూనే ఉంది
లంచ్ టైం లో ఏమితింటాడో గమనించాను
..తొలుస్తూనే ఉంది..
గూగుల్ లో అతని పూర్తి పేరు సెర్చ్ కొట్టాను..,మొదట తెలుగు లో..తరువాత ఇంగ్లిష్ లో..
..ఊహూ..
నాకు తెలిసిన అతని ఫ్రెండ్స్ ని వాకబు చేశాను..
..తొలవటం ఆగలా..
అతని భార్య ఇంటి పేరు తెలుసుకొన్నాను
..పురుగు ని ఆపలేకపోయాను..
ఇక లాభం లేదని పురుగునే చంపటానికి ట్రై చేశాను..
..ఊహూ..నేను చస్తే గానీ ఆ పురుగు చావదు..ఒకసారి పట్టుకొంటే వదిలే పురుగుకాదది..

మొత్తానికి నల్లతోలు సుబ్బారావు వలన నా మైండ్ లోని పురుగు మహిమ మాత్రం తెలిసింది.
ఇంతకీ…. ఆ పురుగేమిటో మీరు గెస్ చేయగలిగారా?
మీరు సరిగ్గా గెస్ చేయగలిగారంటే, ఆ పురుగు మిమ్మల్నీ అప్పుడప్పుడూ తొలుస్తుందని అర్ధం.
సరిగ్గా గెస్ చేయలేకపోతే మీకు గారంటీ గా పురుగుపట్టలేదని అర్ధం.

ప్రకటనలు