“దేవుడు” కి నిర్వచనం

“దేవుడు” కి నిర్వచనం
“ఉన్నాడూ, లేడూ” అని చెప్పటానికి ముందు ‘దేవుడు’ని నిర్వచించాలి. ‘దేవుడు’ని నిర్వచించటం కుదరకపోతే, ఆయన కి ఉన్న అన్ని లక్షణాలూ అనిర్వచనీయమై ఉండాలి. ఓ పక్క దేవుడు అనిర్వచనీయుడు అంటూనే, “ఆయన దయ గల వాడు,ఆయన గొప్ప శక్తి వంతుడు”, అనటం, ఆయనను “అవకాశాన్ని బట్టి నిర్వచించటం”, కిందికి వస్తుంది.
దేవుడు దయ కలవాడైతే, మనిషి పుట్టుక కి పూర్వం నుంచీ ఉన్న ప్రకృతి విలయాలు ఉండేవి కావు. దేవుడికి ఆ విలయాలను ఆపే శక్తిలేకపోతే ఆయనను సర్వ శక్తిమంతుడనటం పొసగదు.
కొందరు దేవుడు మంచి వాడే కానీ చిక్కంతా మనిషితోనే వచ్చింది అంటారు. వీళ్ళే మనిషిని దేవుడే చేశాడని నమ్ముతారు. మనిషిని దేవుడే సృష్టించినట్లైతే, మనిషి చేసే మంచి చెడులన్నిటికీ దేవుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కొందరు ఆస్తికులు, మనిషి స్వేఛ్ఛాసంకల్పం (free will) ఉంది కాబట్టీ, మనిషి చేసే చెడు పనులకి, దేవుడు బాధ్యత వహించనవసరంలేదంటారు. మనిషి సంకల్పానికి పరిపూర్ణమైన స్వేఛ్ఛ ఉందా అనేది చర్చించవలసిన విషయం. ఎందుకంటే మనిషి సంకల్పం అనేది, అనేక పరిస్థితులూ, ప్రకృతి శక్తుల వల మలచబడుతుంది. ఈ పరిస్థితులూ, ప్రకృతి శక్తులను దేవుడే సృష్టించాడని ఆస్తికుల వాదన. కానీ ఈ ప్రకృతి శక్తులు స్థిరమైన నియమాల ప్రకారం నడుస్తాయి. ఈ నియమాలను దేవుడు మార్చినట్లు/మార్చగలిగినట్లు కనపడదు.
సరే, మనిషి కి స్వేఛ్ఛా స్వేఛ్ఛాసంకల్పం ఉందనుకొందాం! కానీ ఆ స్వేఛ్ఛా సంకల్పం కూడా దేవుడి చేతే ఇవ్వబడినది. మరి తన సంకల్పం తో మనిషి చేసే పనుల కు బాధ్యత కొంత దేవుడి పైన కూడా పడకమానదు.
దేవుడు రాగద్వేషాలకతీతం గా తన పని తను చేసుకొని పోయే ఓ యంత్రాంగం (mechanism)అనుకొంటే,అదిఓభౌతికవస్తువేఅవుతుంది.
“మం చీ, చెడూ”, అనేవాటి నిర్వచనాలు సాపేక్షమూ, పరిస్థితులతో మారేవీ అయి ఉంటాయి. అవి స్థల కాలాలను బట్టి మారుతాయి. “మంచీ, చెడూ”, అనేవి మనిషి పెట్టుకొన్నవి. “దేవుడు” అనే ఆలోచన కన్నా “మంచీ, చెడూ” అనే ఆలోచన లు మనిషికి, ముందు కలిగాయి. ఎందుకంటే మనిషి ముందు మంచిని తెలుసుకొని, తరువాత దానికి ప్రతిరూపం గా దేవుడిని ఊహించుకొ న్నాడు. “ముందు దేవుడిని (తటస్థం గా) ఊహించి. తరువాత మంచి ఏదో తెలుసుకొని దానిని దేవుడికి ఆపాదించటం”, జరగలేదు.అలా జరిందంటే, దానర్ధం “మనిషికి దేవుడి మంచితనం లో ముందు నమ్మకం లేదని”. దేవుడు మంచివాడనే నమ్మకం తరువాత ఏర్పడినదని అర్ధం. కాబట్టీ దేవుడనే ఆలోచన లేకుండా కూడా మనిషికి, “మంచి ఏదో” తెలుసుకొనే సామర్ధ్యం ఉంటుంది. కానీ దైవ భక్తీ, పాపభీతీ మనిషి సన్మార్గం లో ఉండటానికి ఉపకరిస్తాయి.

ప్రకటనలు