బొచ్చు కుక్క..స్వేచ్ఛ..

నేను ఒక బొచ్చుకుక్క ని పెంచుతున్నాను..దాని పేరు పింకీ.. నాజూకు తెరియర్ జాతి బుజ్జి ఆడ కుక్క.. దానిని ఓ సారి మా ఇంటి పక్కనే ఉన్న పార్క్ కి తీసు కెళ్ళాను. దారిలో వీధి కుక్కలు దీన్ని చూసి తోక ఊపుతూ కుయ్..కుయ్ మన్నాయి.

ఇంటికి వచ్చినాక గొలుసు తో కట్టెయ్యబోతే చెవులు రిక్కించి ‘కై’… మని మొరిగి దాని నిరసన ప్రకటించింది. బయటి కుక్కలను స్వేచ్చగా చూసి దీనికి కూడా స్వేచ్ఛ కావాలనిపిస్తుందనుకొంటా…సరే లెమ్మని..గొలుసు కట్టకుండా గేట్ వేసి ..నేను నిద్రపోయాను.

తెల్లారి లేచి చూస్తే..ఒక మూల కుయ్.. కుయ్..మని వణుకుతూ పడుకొని ఉంది..వళ్ళు నాక్కొంటూ ఉంది..చూస్తే వంటి మీద జీరిన గాయాలు…అర్ధమయింది..రాత్రి..ఎత్తు తక్కువగా ఉన్న నా మధ్యతరగతి ఇంటి గేటు దూకి బయటికెళ్లింది..వీధికుక్కలు..మగా..ఆడా కలిపి రక్కేశాయి! దాన్ని మళ్లీ గొలుసు తో కట్టేయాలనిపించలేదు..పైగా జాలి వేసింది.గేటు తెరిచే ఉంచాను..అయినా అది మూలనుంచీ కదల లేదు.రెండు కాళ్ళమధ్య తోక ముడుచుకొని పడుకొంది.

మరుసటి రోజు మునిసిపల్ ఉద్యోగి తో మాట్లాడి..డాగ్ స్క్వాడ్ ని రప్పించి ఆ వీధి కుక్కలని పట్టించాను.

కుక్కలని పట్టినాక డాగ్ స్క్వాడ్ వాన్ ఇంజిన్ చెడిపోయింది. దాన్ని పార్క్ పక్కనే కుక్కలతో సహా వదిలేసి వెళ్లిపోయారు స్క్వాడ్ వాళ్ళు. నేను పింకీ ని గొలుసు తో సహా వాఁకింగ్ కి తీసుకెళ్ళాను.

వాన్ లోపలి కుక్కలను చూడగానే కళ్ళు పైకెత్తి, నుదురు పైకిలాగి తోక ఊపుతూ తన సంతోషాన్ని ప్రకటించింది పింకీ. గట్టిగా నా చేతిలోంచీ గోలుసును లాగి, తప్పించుకొని వాన్ వైపుకి దూసుకెళ్లింది. ముంగాళ్ల గోళ్ళ తో వాన్ ని బరుకుతూ..వాన్ లోని కుక్కల పై ఆగ్రహం ప్రకటించింది. మళ్లీ నా దగ్గరికి వచ్చి,నా పైజామా సందుల నుంచీ, తన పళ్ళ ని బయటపెట్టి వాటికి ఛాలెంజ్ విసిరింది…నా పెంపుడు కుక్క పింకీ!

ప్రకటనలు