హిపోక్రసీ తప్పదు.. మనిషి ఎప్పుడు మారతాడు?

ఒకప్పుడు వామపక్ష మేధావులు ఆంధ్ర ను ఏలుతూ ఉండే వారు. ఒక రచయిత కు నిబధ్ధత (కమిట్-మెంట్) లేకపోతే తప్పుగా చూసే వారు. శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబ రావు, రావి శాస్త్రి వంటి వారు ఓ కమిట్మెంట్ తో రచనలు సాగించారు. అయితే అప్పట్లో వీరి రచనలే వెలుగు చూసేవి….వీరి వ్యక్తిగత జీవితాలు జనాల కు అంత గా తెలిసేవి కావు. వీరి రచనల ప్రభావం మధ్య తరగతి బుధ్ధిజీవుల పై అపారం. వారి వారి జీవితాల చివరి దశ లో వారి జీవిత వాస్తవాలను తెలిపే పుస్తకాలు ప్రచురితమయ్యాయి. శ్రీ శ్రీ అనంతం లో చాలా నిర్మొహమాటం గా తన జీవిత విశేషాలను బయటపెట్టారు. రావి శాస్త్రీయం వలన, శాస్త్రి గారి జీవితం ఎలా జరిగిందో కొంత అవగాహన వస్తుంది. అలానే కొ.కు లేఖల వలన , ఆయన కూడా మన లాంటి సగటు మధ్య తరగతి జీవిగానే జీవించారని అర్ధమవుతుంది.
వామ పక్ష భావ జాలాన్ని వ్యాప్తి చేయటం వీరి రచనల ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.శ్రీ శ్రీ కవిత్వం చదివి నక్సలైట్ల లో చేరినవారున్నారు. కానీ ఈ వాలుకుర్చీ మేధావులందరూ, మనందరిలానే, పట్టణాలలో సేఫ్ గా, సినిమా పెట్టుబడిదారుల దగ్గరో, పత్రికా కామందుల దగ్గరో ఉద్యోగం చేసుకొంటూ, తమ పిల్లల ఉద్యోగాల కోసం సిఫారసులూ గట్రా చేయించుకొంటూ, సాయంత్రానికి ,ఏ సంగీత కచేరి కో వెళ్ళివస్తూ జీవితాన్ని గడిపారు.
అంటే తాము వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ లోనే ఈదులాడుతూ, ఆ వ్యవస్థ కి వినియోగదారులు గానో, ఉద్యోగులు గానో, ఒక్కోసారి చిన్న చిన్న పెట్టుబడి దారులు గానో సహకరిస్తూ, ప్రజల లో మాత్రం వామ పక్ష భావ జాల వ్యప్తి కి కృషి చేశారు.
దీనిని గురించి ఆ రోజుల్లోనే శ్రీ శ్రీ ని ప్రశ్నిస్తే, ఆయన పొట్ట కూటి కోసం సినిమాల లో పని చేస్తున్నానని చెప్పారు. ఓ కూలివాడు పొట్టకూటి కోసం పని చేస్తున్నానంటె సరే., ఎగువ మధ్యతరగతి జీవితం కొన సాగిస్తూ, కార్ల లో తిరగ గలిగిన వ్యక్తి కూడా పొట్టకూటి కోసమే రాస్తారా? పిల్లల విద్య, ఉద్యోగం, ఇల్లు కట్టుకోవటం వగైరా కూడా పొట్ట కూటికిందికే వస్తాయా? అలా అయితే ఓ పారిశ్రామిక వేత్త కూడా తాను పొట్టకూటికోసమె పరిశ్రమ నడుపుతున్నానని చెప్పవచ్చు. మధ్య తరగతి వాడికి ఇల్లు కట్టుకోవటం లేక కారు కొనుక్కోవటం పొట్ట కూడైతే, ఎగువ తరగతి వాడికి భార్యకి డైమండ్ నెక్లేస్ కొనిపెట్టటం పొట్టకూడు అవుతుంది కదా?లేక ప్రత్యర్ధి కంపెనీ తో పోలిస్తే తన కంపెనీ నే లాభాలలో ముందుండటం, ఓ క్యాపిటలిస్ట్ కి పొట్టకూటి తో సమానం కావచ్చు.
కాపిటలిస్టు తన మానసిక అవసరాలను శ్రామికుల భౌతిక అవసరాలతో (పొట్టకూడు) ఈక్వేట్ చేయటం ఎలా సరి కాదో, మేధావులు తమ సౌకర్యావసరాలను పొట్టకూటి తో equate చేయటం కూడా అలానే సరి కాదు.

వామ పక్ష సాయుధ పోరాటాలలో పాల్గొనని వారు, మిగిలిన జనాలు అలా పాల్గొనేలా ప్రేరేపిస్తూ రచనలు సాగించటం ఎంత వరకూ సబబు? ఇదే ప్రశ్న కొ.కు ని అడిగితే, ఆయన “ఓ పెట్టుబడి దారీ ఫాక్టరీ లో మానేజర్ పని చేయడు..చేయిస్తాడు. అలానే వామ పక్ష మేధావులు భావ వ్యాప్తి మాత్రమే చేయటం లో తప్పేముంది?”, అన్నారు. తాము వ్యతిరేకించే పెట్టుబడి దారి నుంచీ ఓ ఉదాహరణ ని, తమ ను సమర్ధించుకోవటానికి ఉపయోగించటం ఎంత వరకూ సబబు?

మానేజ్మెంట్ కూడా మేధో శ్రమ అనిగుర్తిస్తే, అది కాపిటలిజం లో అయినా, కమ్యూనిజం లో అయినా సిగ్గుపడవలసిన విషయం కాదు. మానేజ్మెంట్ అనేది ఏ వ్యవస్థ లో అయినా చెడ్డది కాదు. కాపిటలిజం లోని అన్ని విషయాలనూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.hierarchy అనేది కాపిటలిజం కి మాత్రమే సంబంధించినది కాదు (బట్టలు వేసుకోవటం లాగా, వావి వరసల లా..). అది కాపిటలిజం కంటే పురాతనమైనది. కపిటలిజం కూడా ఉత్పాదనా సౌలభ్యం కోసం hierarchy ని ఉపయోగిస్తుంది.  క్యాపిటలిస్ట్ కర్మా గారం లో అయినా, కమ్యూనిస్ట్ కర్మాగారం లో అయినాhierarchy తప్పదు. ఒక పని ఇంకో పని కంటే గౌరవప్రదం అనటమే తప్పు. కానీ ఆయా వ్యవస్థ ల లో ఆయా పనుల కున్న ప్రాముఖ్యతా, లభ్యతలను బట్టి,పనుల్లో ఉందే  రిస్క్ ని బట్టీ,వారి శ్రమని బట్టీ,నిబధ్ధతని బట్టీ,.. ఆ పని చేసే వారికిచ్చే గౌరవం లో కూడా నెమ్మది గా తేడా వస్తుంది.
చిక్కంతా, అడవుల లోకి పోయి గన్ను పట్టటం లాంటి పనులలో ఉండే రిస్క్ కి జడిసో,రిస్క్ చేసేంత ధైర్యం లేకో,రిస్క్ చేసేంత నిస్వార్ధత లేకో , రిస్క్ లేని, “సాహిత్యం సృష్టి” వంటి పనులు చేస్తున్నామని నిజాయితీ గా ఒప్పుకోకపోవటం లో ఉంది.

(ఇక రావి శాస్త్రి గారు, “మేధావులందరి చేతా నిర్బంధ శారీరక శ్రమ చేయిస్తే గానీ వారికి శ్రమ విలువ తెలియదు”, అన్నారు. అంటే, ఆయన కు మేధో శ్రమ కూడా శ్రమే నన్న ఆలోచన ఉన్నట్లు లేదు.)

————————————————————–

ఇక ఇప్పుడు నాణానికి ఆవలి వైపు చూద్దాం. మిగిలిన అందరి లానే ఈ మేధావులు కూడా మన సమాజం లోనే పుట్టారు. సమాజం లోని లోటు పాట్లే వారి ప్రవర్తన లోనూ కనపడుతాయి. (రిక్షావాడిని, “ఏమండీ, మీరు”, అని పిలిచే వా.ప. మేధావిని నేను ఇంతవరకూ చూడ లేదు.) వారి స్నేహితులూ, బంధువులూ ఈ సమాజం లోనే ఉంటారు. వారికి కొంత వయసు వచ్చే సరిలి పెళ్ళి అయ్యి,పిల్లలు పుట్టి, సమాజపు బంధాల నుంచీ అంత తేలిక గా బయట పడే అవకాశం ఉండదు.  ఏ యుక్త వయసు లోనో ఈ భావజాలం వైపు ఆకర్షితులౌతారు. ఎంత భావజాలం నచ్చితే మాత్రం, తట్ట బుట్టా సర్దుకొని సాయుధ పోరాటం లోకి వెళ్ళాలనటం సబబేనా?

అందరూ అన్ని పనులూ బాగా చేయలేరు. కొందరి కి గన్ను పట్టటం  గొప్ప గా వస్తే, కొందరికి పెన్ను పట్టి రాయటం గొప్పగా రావచ్చు.  ఎవరికి వచ్చిన పనిని వారు చేయటం మంచిదా , రాని పని లో వేలు పట్టటం మంచిదా?
సరే అడవుల్లోకి వెళ్ళి పెన్ను కు బదులు గా గన్ను పట్టారనుకొందాం. అప్పుడైనా పెట్టుబడి దారి వ్యవస్థ తో పూర్తి గ తెగ తెంపులు సాధ్య మౌతాయా? గన్ను కొనాలంటే డబ్బు కావాలి. ఆయుధాలను చేరవేయాలంటే, బూర్జువా వ్యవస్థ తయారు చేసిన వాహనాలు కావాలి.
ఓ వ్యక్తి నూరు శాతం పె.దా. వ్యవస్థ తో తెగతెంపులు చేసుకోవాలనుకొంటే, ఏ అడవి లోకో వెళ్ళి కందమూలాలు తింటూ, ఆకులు కప్పుకొని బతకాలి…లేక ఎందులో అయినా దూకి చావాలి. చచ్చి సాధించేదేమీ లేదు.బతికి పోరాడితే, ఎప్పటికైనా సోషలిస్టు వ్యవస్థ రావచ్చు.
అడవి లో కూడా ఏ రోగమో వస్తే మళ్ళీ మందు కోసం డబ్బుపెట్టి కొనాల్సిందే! కాబట్టీ పెట్టుబడిదారి లో ఉంటూ, దాని తో పూర్తి గా తెగతెంపులు చేసుకోవటం సాధ్యం కాదు. పెట్టుబ్డి దారి వ్యవస్థే కాదు..,ఏ వ్యవస్థ లో అయినా సరే ఉంటూ,అదే వ్యవస్థ తో తెగ తెంపులు చేసుకోవటం, కాని పని.స్పార్టకస్ బానిస గానే ఉంటూ, బానిస వ్యవస్థ కి వ్యతిరేకం గా పోరాడాడు . బానిస వ్యవస్థ లో ఉండటమంటే, ఆ వ్యవస్థ కి సహకరించినట్లు కాదు. ఇండియన్స్ బ్రిటిష్ వ్యవస్థ లోనే ఉంటూ అ వ్యవస్థ కి వ్యతిరేకం గా పోరాడారు. పురుషాధిపత్యం ఉన్న కుటుంబం లోని స్త్రీ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, స్త్రీ విముక్తి గురించి ఆలోచించవచ్చు. అంత మాత్రాన ఆమె పురుషాధిక్యత కు సహకరించినట్లు కాదు.

ఓ వ్యవస్థ కి చరమ గీతం పాడే మార్పు ఆ వ్యవస్థ లోంచేవస్తుంది. అలాని ఆ ఆలోచన చేసిన వ్యక్తి హిపోక్రాట్ కాదు.
తెగ తెంపులు అనేది ఆ వ్యక్తి కిమాత్రమే పరిమితమైన మోరల్ డైలమా. ఈ మేధావులు ఎవరూ,కావాలని పెట్టుబడి దారి తో అంట కాగ లేదు. సాధ్యమైతే, పె.దా. వ్యవస్థ తో తెగ తెంపులు చేసుకొని, తన ఆదర్శ వ్యవస్థ లో ఉండాలని అనుకొంటారు. కానీ, అది ప్రాక్టికల్ గా సంభవం కాని విషయం. వ్యవస్థ లో కంట్రోల్ అంతా ధనవంతుల చేతిలోనే ఉంటుంది.   పె.దా వ్యవస్థ లో అధికార వర్గాలు సామాన్య వ్యక్తి కి వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. కాబట్టీ, మేధావులు వ్యవస్థ లోనే ఉంటూ, వ్యవస్థని ప్రశ్నించటం  హిపోక్రసీ లా అనిపించినా, వారికి ఆ  దుస్థితి కల్పించింది మాత్రం పె.దా. వ్యవస్థే. కాబట్టీ ఆ హిపోక్రసీ కి బాధ్యత పె.దా. వ్యవస్థ దే ! (దానిని హిపోక్రసీ అనికూడా అనలేము. తన ఇష్టం తో నే ఓ వ్యవస్థ లోఉంటూ, ఆ వ్యవస్థ ని ఇష్ట పడుతూ, ఆ వ్యవస్థ నే విమర్శిస్తే, దానిని హొపోక్రసీ అనవచ్చు. ఇష్టం లేక పోయినా, తప్పని సరై ఓ వ్యవస్థ లో ఉంటూ, ఆ వ్యవస్థ పట్ల తన అయిష్టాన్ని వ్యక్తపరిస్తే, దానిని హిపోక్రసీ అనరు. ) పెట్టుబడి దారి వ్యవస్థ ని ప్రశ్నించే అర్హత ప్రజలందరికీ ఉంటుంది. ఒక్క పెట్టుబడి దారుకి మాత్రమే ఆ అర్హత ఉండదు. ఈ మేధావులెవరూ పెట్టుబడి దారులు కాదు. వారు లాభాలని ని సృష్టించటం కోసం డబ్బుని వాడటం లేదు. జీతం ద్వారా వచ్చిన డబ్బుని తమ వ్యక్తిగత అవసరాలకోసం వాడుతున్నారు.మార్క్స్ ప్రకారం వీరంతా శ్రామిక వర్గమే! (search Das Capital C-M-C)

అయితే వామపక్ష మేధావులు అడవుల్లోకి వెళ్ళి పోరాటం ఎందుకు చేయ లేదు అనే ప్రశ్న వస్తుంది. అందరికీ ఒకే వీలు ఉండకపోవచ్చు. పీకల్లోతు సంసార సాగరం లో మునిగిన వాడికంటే, పెళ్ళికాని యువకుడికి పోరాటం లోకి వెళ్ళే వీలు ఎక్కువ.
అలానే, కొందరి లో altruistic genes ఉంది త్యాగాలు చేయటం వారికి ఈజీ కావచ్చు.

ఈ వామపక్ష మేధావులు వ్యవస్థ లోనే ఉంటూ, తమ భావజాల వ్యాప్తి కోసం చాలానే కృషీ, త్యాగాలూ చేశారు. దారిన పోయే ప్రతి గన్నయ్య కీ వీరి నిబధ్ధత నీ, నిజాయితీ నీ వేలు చూపే అర్హత ఉండదు. వేలు చూపే ముందు, గన్నయ్య లు తాము ఏం చేశామో ప్రశ్నించుకోవలి. తాను మార్క్సిస్టు ని కానంత మాత్రాన, “మార్క్సిస్టులు అయిన వారిని, సోషలిస్టు విలువలకి శిలువ వేసే హక్కు తమకు ఉంది”, అనుకోవటం గన్నయ్యల వెర్రితనం.

అయితే పైకి ఒకటి చెప్పి, వేరే పని చేసే వారంతా సిసలైన సోషలిస్ట్ సానుభూతి పరులా. ఒకప్పుడు జన నాట్య మండలి లో సభ్యుడైన అల్లు రామ లింగయ్య కుటుంబం, తరువాత సినిమా ఇండస్త్రీ మూల స్థంభాలలో ఒకటి గా మారింది. ఇందులో ఏమీ హిపోక్రసీ లేదా?
ఒక వేళ ఆ పాత రోజుల్లో సామ్య వాద వ్యవస్థ వచ్చి ఉంటే, ఇలాంటి వారి ప్రభావం వ్యవస్థ పై ఎలా ఉండేది? వ్యక్తుల ప్రవర్తన ఉన్నతం గా మారనపుడు, సొషలిస్ట్ చట్రం కుంగిపోక తప్పదు. అది రష్యా లో నిరూపించబడినది. మరి వ్యక్తుల ప్రవర్తన ఆదర్శవంతం గా ఎలా మారుతుంది. భావజాల వ్యాప్తి ద్వారా సాధ్యమా? భావజాలం కేవలం ఉపరితల అంశం మాత్రమే. చాలా మంది భావజాలం లో ఉండే భావోద్వేగానికి ఆకర్షితులు కావచ్చు. కానీ, వారి ప్రవర్తన లోని లోపాలు అలానే ఉండ వచ్చు.
ప్రవర్తన మారాలంటే, మామూలు మానవుల్లో (altruistic genes లేని వారి లో) అది మనుగడ ను ప్రభావితం చేయటం ద్వారానే సంభవం. అంటే, మనిషి తన మనుగడ కి సొషలిస్ట్ విలువలు ఉపయోగపడితే వాటిని అనుసరిస్తాడు. లేక పోతే ధనస్వామ్య విలువలు ఉపయోగపడితే వాటిని అనుసరిస్తాడు. ఒకప్పుడు పల్లెలలో సమిష్టి జీవనం చక్క గా ఉండేది. దానికి మూల కారణం కుటుంబాలకి ఒకరి మీద ఒకరికి ఉండే mutual dependency. ఒకరి ఇంట్లో పెళ్ళైతే నలుగురు వచ్చి ఓ చెయ్యేసేవారు. ఎందుకంటే తమ ఇంట్లో పెళ్ళైతే మిగిలిన వారి సహకారం కావాలి కాబట్టీ…  అది ఓ సంస్కృతి గా ఉండేది (“ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు”, అన్న శ్రీ శ్రీ మాట కి దగ్గర గా ఉండేది ఈ సంస్కృతి). కానీ క్రమం గా జనాలు చదువుకొని, ప్రయాణాలు చేసి పట్టణాలకు చేరుకొన్నారు. ఇక్కడ డబ్బుతో అన్ని పనులూ అయిపోతాయి. కాటరింగ్ కి ఇస్తే ఫంక్షన్ జరిగిపోతుంది. పక్కవాడి తో సంబంధం లేదు. ఇక్కడ జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రజలు ఈ సంస్కృతి కి కూడా అలవాటు పడ్డారు. అప్పుడప్పుడూ పాతరోజులు గురించి తలచుకొన్నా, మళ్ళీ పల్లెటూళ్ళకి వెళ్ళటానికి ఎంత మంది సిధ్ధపడతారు? కాబట్టీ మన లో చాలా మంది సోషలిస్ట్ వ్యవస్థ మీది ప్రేమ తో దానిని అనుసరించం. అది మన వ్యక్తి గత అవసరాలను తీర్చినంత కాలం దానిని ఆదరిస్తాం.

ఎవరో altruistic genes ఉన్న వాళ్ళు మాత్రం ఏ వ్యవస్థ లో అయినా సమాజం కోసం తమ జీవితాన్ని ధారపోస్తారు, ఇక ముందు కూడా అలా పోస్తూనే ఉంటారు. సమాజం లో అందరూ ఇలాంటి త్యాగ రాజులే ఉంటే ఆ సమాజం రిస్క్ లో పడుతుంది….
ఓ ఊరికి వరద వచ్చి, కరకట్ట కి గండి పడిందనుకొందాం. ఊళ్ళో కొంతమంది కరకట్టకి అడ్డువేయటానికి ప్రయత్నిస్తారు. అయితే అందులో రిస్క్ ఉంది. వరద సడన్ గా పెద్దదైతే కొట్టుకొని పోతారు. ఊర్లో అందరూ త్యాగరాజులై, అందరూ గండి వద్దకు వెళ్తే, వరద ఉధ్ధృతి సడన్ గా పెరిగితే, ఊరి జనమంతా కొట్టుకొని పోతారు. అదే, కొందరైనా స్వార్ధపరులు ఉంటే , ఆ  కొందరు స్వార్ధపరులు ఊరు విడిచి ఎస్కేప్ అవటం వలన, ఊర్లో కొంతమందైనా మిగులుతారు. అందుకే పరిణామ సిధ్ధాంతం ప్రకారం ఓ జాతి లో స్వార్ధపరులూ, త్యాగధనులు, పిరికివాళ్ళూ, ఇలా అందరూ ఉండాలి. వైవిధ్యం లోనే మనుగడ ఉంది.

వ్యక్తి బుర్ర లోనే కులం, మతం, మత విలువలూ, సామాజిక చట్రాలూ ఉంటాయి. వ్యక్తులెవరూ లేకపోతే సామాజిక చట్రం ఉందదు. కానీ వ్యక్తి  లో సమాజ పరిధిలో లేని అంశాలు ఉనాయి. సమాజం కూడా జీవ జాతుల పరిణామం లోంచే వచ్చింది. మనిషి శరీరం కూడా జీవ పరిణామ ఫలమే. మనిషి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం లాంటి విషయాలు సమాజం పరిధి బయట ఉంటాయి. అలానె మనిషి జనన మరణాలు వ్యక్తిగతమైనవి. ఇవి సమాజంతో పంచుకోలేనివి. అందుకే, మరణానంతర జీవితం, దేవుడు మొదలైన వి షయాలు వ్యక్తిగతం గా ఉంటాయి. సమాజ పరిధి లో లేని అంశాలు వ్యక్తి లో ఇమిడి ఉండటం వలన, సమాజ చట్రాన్ని మార్చటం ద్వారా, మనిషి ప్రవర్తనని పూర్తిగా కంట్రోల్ చేయలేము. అంటే, సమాజం ప్రభావితం చేయగల అంశాలు మనిషిలో కొన్ని మాత్రమే ఉంటాయి. సమజం పరిధి బయట ఉందే ఫిజియాలజీ, జీన్స్ లాంటి అంశాలు మనిషిని ప్రభావితం చేస్తాయి. వ్యక్తిని పూర్తి బుధ్ధిమంతుడి గా చేయటం పూర్తిగా  సొషలిస్ట్ వ్యవస్థ పరిధి లో మాత్రమే ఉందదు.
అయితే మనిషి పరిణామ క్రమం లో, బట్టలు వేసుకోవటం, వావి వరుసలు పాటించటం లాంటి విలువలని అందరూ పాటిస్తున్నారు కదా. అలానే సోషలిస్ట్ విలువలను, మేధావులు ప్రయత్నించగా ప్రయత్నించ గా, జనాలందరూ  కొంత కాలం తరువాత పాటిస్తారేమో?
కుటుంబ వరుసలకూ, బట్టలు వేసుకోవటానికీ…….. మనుగడ కి సంబంధించిన కారణాలూ, మనిషి బ్రెయిన్ కి సంబంధించిన భావోద్వేగ జీన్స్ లో వచ్చిన మార్పులూ, మనిషి కి పెరిగిన మెమరీ, మనుగడకి సంబంధిన కారణాలూ (కుటుంబం విషయం లో), ఉన్నాయి. కానీ సోషలిస్ట్ విలువల విషయం లో, ఇటువంటి మనుగడ సంబంధమైన సపోర్ట్ మనిషికి లేదు. సామ్యవాద వ్యవస్థ ఎల్ల కాలం నిలబడాలంటే, అందరూ నిస్వార్ధ జీవులవ్వాలి.  అలా అన్ని పరిస్థితులలోనూ, కాలాలలోనూ ఉండటం బయలాజికల్ గా altruistic genes ఉన్న వారికి మాత్రమే సాధ్యం. కానీ, వారిశాతం చాలా తక్కువ. కాబట్టీ… సోషలిస్ట్ వ్యవస్థ వచ్చినా అది ఎల్ల వేళ లా నిలబడలేదు. కొంత కాలం, దాని వలన వ్యక్తి కి ఉపయోగం ఉన్నంత వరకూ నిలబడుతుంది. వ్యవస్థ లోని అందరివ్యక్తులూ మంచిగా ఉంటే మాత్రమే నిలబడే చట్రం ఎక్కువ కాలం మనలేదు. అందరూ, అన్ని కాలాలలోనూ నిస్వార్ధం గా ఉండటం ఎంత సంభవమో, ఎల్ల కాలం మనగలిగే సోషలిస్ట్ వ్యవస్థ కూడా అంత సంభవం.

మనిషి మనుగడ ను ప్రభావితం చేసే, శాస్త్ర సాంకేతిక, ఉత్పత్తి రంగా ల లోని మార్పుల వలనే మనిషి లో మార్పు సాధ్యమౌతుంది.
మనిషి లో మెచ్యూరిటీ అనేది ఇవాల్వ్ అవుతూ వస్తుంది.ది సడన్ గా రాదు. ప్రపంచం లోని విప్లవాలన్నిటి ముందూ, కొన్ని శతాబ్దాల పాటు ప్రజలలో క్రమం గా పేరు కొన్న ఆగ్రహమే, సమాజం లో ని అందరి దృష్టినీ ఆకర్షించిన ఒక పాలక వర్గ దుశ్చర్య వలననో, ఓ అన్యాయ విధానం వలననో, ఒక్క సారి పెల్లుబికుతుంది. విప్లవం తరువాత వచ్చిన వ్యవస్థ, ముందున్న వ్యవస్థ కంటే అన్ని వేళల మెరుగు గా ఉందదు. బ్రిటిష్ విప్లవం తరువాత క్రాంవెల్ హయాం, ఫ్రెంచ్ విప్లవం తరువాతి నెపోలియన్8 హయాం, మొన్నటి ఈజిప్ట్ విప్లవం తరువాతి ప్రభుత్వాలే ఇందుకు సాక్ష్యం. అయితే విప్లవాల తో సంబంధం లేకుండా, ప్రజల awareness పెరిగేకొద్దీ ప్రజల హక్కులు మాత్రం మెరుగవుతూ వచ్చాయి .
విప్లవం తరువాత వచ్చే ప్రభుత్వాలు, ప్రజల చైతన్యాన్ని బట్టి ఉంటాయి. ఆ చైతన్య స్థాయి కంటే ఉన్నతం గా ఉన్న వ్యవస్థ వచ్చినా అది విజయవంతం కాలేదు. రష్యా విప్లవం తరువాత, లెనిన్ వలన వచ్చిన సామ్యవాద వ్యవస్థా, ఇండియాలో స్వతంత్రం తరువాత నెహ్రూ భారత ప్రజలకి బహుకరించిన ప్రజాస్వామ్య వ్యవస్థా ఇందుకు ఉదాహరణలు. ప్రజల చైతన్య స్థాయి కంటే చాలా ఉన్నతం గా ఉన్న ఈ వ్యవస్థ లు విజయవంతం కాలేకపోయాయి. ఎవరో ఇవ్వటం వలన వచ్చిన వోటు హక్కు విలువ భారత ప్రజలకు ఇంకా తెలియాల్సి ఉంది. అదే, ఫ్రాన్స్ విప్లవం తరువాత అక్కడి ప్రజలు పోరాడి సాధించుకొన్న వోటు హక్కును, వారు చాలా విజ్ఞత తో ఉపయోగించారు.

 

జపాను అతనూ, ట్రాఫిక్ జామూ, వేదాలూ, జాతక కథలూ…

ఓ సారి ఇండియా వచ్చిన నా జపనీస్ మితృడిని ఓ బుధ్ధిస్ట్ ప్లేస్ కి తీసుకొని వెళ్ళాను. వెళ్ళే దారి లో అతనికి మన సంస్కృతీ, పురాతన ఆధ్యాత్మిక వారసత్వం, ఇండియాలో ఉన్న బుధ్ధిస్ట్ మూలాలూ వగైరాల గురించి చెప్పాను.
బుధ్ధిస్ట్ అయిన అతను, నే చెప్పిన వన్నీ మౌనం గా అయినా జాగ్రత్త గా విన్నాడు.
ఆ ప్రదేశం చూసి మేము తిరిగి వచ్చేటపుడు, ఓక చోట ట్రాఫిక్  జాం అయింది. జనాలు ఆపోజిట్ డైరెక్షన్ లో వాహనాలు నడుపుతున్నారు. కొన్ని బైక్ లు ఫుట్ పాత్ మీది నుంచీ పోతున్నాయి. హారన్ ల శబ్ధం.
“Indians are very creative in making traffic jams, you know”, అని అతని వంక చూస్తూ ఇబ్బంది గా నవ్వాను.
అతను మాత్రం సీరియస్ గానే, “వేదాలకూ, జాతక కూ పుట్టినిల్లైన ఇండియా నుంచీ నేను ఇలాంటి స్థితి ని ఎక్స్-పెక్ట్ చేయలేదు”, అన్నాడు.
నా అహం ఏదో దెబ్బ తింది. “ట్రాఫిక్ జాం లు  చేయమని జనాలకు వేదాలూ, జాతక కథలూ చెప్ప లేదు . అవెప్పుడూ మంచే చెబుతాయి. జనాలు పాటించకపోతే వాటి తప్పా?”, అన్నాను.
“మరి ఇందాక నువ్వు ఇండియన్ల ఫామిలీ విలువల గురించీ, అహింస  గురించీ, పరమత సహనం గురించీ, వాటి పై ప్రాచీన ఆధ్యాత్మిక ప్రభావం గురించీ నాకు వివరించావు. అంటే ఇండియాలో ఉన్న పాజిటివ్ విలువలకు కూడా ప్రాచీన గ్రంధాలు బాధ్యులు కావన్న మాట. జనాలు ఆ విలువలు ఫాలో అవుతున్నారు కాబట్టీ అవి వున్నాయి. ప్రాచీన గ్రంథం చెప్పింది కాబట్టీ అవి ఉన్నాయనటం సరి కాదనుకొంటా?”, అన్నాడు.
సాధారణం గా జపాన్ వాళ్ళు చాలా గౌరవం గా, ఫార్మల్ గా మాట్లాడతారు. కానీ నాకు ఇతని తో ఉద్యోగం లో మూడేళ్ళ పరిచయం. ఇతను నా తో కొంచెం ఫ్రీ అయిపోయాడు.
నేను కొంచెం ఆలోచించి, “ఆచరణ అనేది వేరే విషయం. మత గ్రంధాలు మంచి చెబుతాయి. విన్నామా… మంచిది, వినలేదా.. నీ ఖర్మ. జనాలని ఆచరణ లోకి మళ్ళించాలంటే చట్టాలూ, రాజకీయ అధికారమూ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి  కఠినమైన శిక్షలు వేస్తే, వారే దారిలోకి వస్తారు. కొంత జనాలను కూడా ప్రాక్టికల్ స్థాయి లో ఎడ్యుకేట్ చేయటం అవసరం. కానీ జనాభా ఎక్కువ అవటం వలన మా దేశం లో ఇది కుదరటం లేదు”, అన్నాను.
“జపాన్ లో కూడా జన సాంద్రత ఎక్కువే. కానీ ఇలా ఉందదు అక్కడ…నీకు తెలుసు కదా..”, అన్నాడు.
“సమాజం లోని ని విద్యా, అభివృధ్ధీ వీటిని కూడా చూడాలి కదా”, అన్నాను.
ఏదేమైనా మన జనాల లో క్రమశిక్షణ లేకపోవటానికి మూల కారణం ఏమిటో తెలియలేదు.

పిల్లల పై అస్థిరత్వం ప్రభావం

చానాళ్ళ క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూ లో, రాజీవ్ కనకాల తన చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడాడు.
అతని కుటుంబం అతని బాల్యం లో మద్రాస్ నుంచీ హైదరాబాదు కి మారింది. మారిన కొత్తల్లో, కొత్త స్కూలూ, కొత్త పుస్తకాలూ కొత్త పాఠాల తో ఇమడ లేక చదువు లో వెనుక పడినట్లు  రాజీవ్ చెప్పినట్లు నాకు గుర్తు.
పాత కాలం లో పల్లెటూళ్ళ లో వ్యవసాయ కుటుంబాలు ఒకే ఊళ్ళో జీవితాంతం ఉండేవి. పిల్లలు ఒకే ఇంట్లో ఉంటూ చుట్టుపక్క ల ఊళ్ళలోనే చదివే వారు. ఆ జీవితం లో స్థిరత్వం ఉండేది. ఈ రోజుల్లో ఉద్యోగాల వలన కుటుంబాలు ఊర్లూ, నగరాలూ, ఒక్కోసారి దేశాలూ మారవలసిన పరిస్థితి. కొన్ని సందర్భాలలో పిల్లల అమ్మా నాన్న ల లో ఒకరు చాలా కాలం పాటు పిల్లల కు దూరం గా కూడా ఉండవలసి వస్తుంది.
పెద్ద వాళ్ళ స్థాన చలనాల వలన పిల్లలు బడి మారవలసి వస్తుంది. “ఈ అస్థిరత్వం ప్రభావం పిల్లల మనస్థత్వం పై ఎలా ఉంటుంది?” అనే విషయమై భిన్నాభి ప్రాయాలున్నాయి.
కొంత మంది ఈ అస్థిరత్వం పిల్లల పై ప్రతికూల స్వ భావం చూపుతుందంటే, ఇంకొంతమంది పిల్లలు మార్పుకి చాలా సులువు గా అలవాటు పడి పోతారంటారు. ఉదాహరణ కి అమెరికా నుంచీ వచ్చి ఇండియాలో బామ్మా తాతల దగ్గర పెరిగే పసి పిల్లలు చాలా త్వరగా అలవాటు పడతారు. అదే పిల్లలు పెద్దైన తరువాత, అంత సులువు గా సర్దుబాటు కారు.
ముందు గా స్థిరత్వం అంటే ఏమిటో పరిశీలించి , తరువాత దాని వ్యతిరేక అనుకూల వాదనలను ఆ క్రమం లో పరిశీలిద్దాం.
ఓ మనిషి, ఒక వాతావరణం లో,కొందరు వ్యక్తుల తో కొంత కాలం పెరిగినపుడు, అవన్నీఅతని మానసిక ప్రపంచం లో భాగమౌతాయి. వాటి తో అతని interaction, అతని వ్యక్తిత్వం లో భాగమౌతుంది. అలాంటి ఓ ప్రదేశాన్ని వదిలి వెళ్తున్నాం అంటే, మనలోని ఓ భాగం చనిపోతున్నట్లు అన్న మాట. అందుకే మనకి నచ్చిన స్నేహితులనూ, ఊరినీ వదిలి వెళ్తున్నప్పుడు కొంత దిగాలు గా ఫీల్ అవుతాం.

అలానే ఊళ్ళో, ఓ కమ్యూనిటీ (కమ్యూనిటీ అంటే కమ్యూనికేట్ చేసేది.మనుషులు తమ కష్టం, సుఖం, మంచీ చెడ్డా ఒకరి తో ఒకరు పంచుకొనే సమూహాన్ని కమ్యూనిటీ అనవచ్చు. దీని ప్రకారం మన పట్నాలలోని గేటేడ్ కమ్యూనిటీలు కమ్యూనిటీలే కాదు.  ఎవరికి వారై  పక్క వారెవరో కూడా తెయని దానిని కమ్యూనిటీ అనరాదు.) లో పెరిగినపుడు, ఒక మనిషి సామాజిక, సాంస్కృతిక విలువల కి ఓ ఫ్రేం-వర్క్ ఏర్పడుతుంది. ఒక reference plane తయారవుతుంది. అతని అస్థిత్వం (identity) లో అతని పరిసరాలు ఓ విడతీయరాని భాగం అవుతాయి. మనిషి సమాజం లో ఇమడాలనుకొంటాడు. తనకి ఓ మతమూ, దేశమూ, వగైరా ఉండాలనుకొంటాడు. ఇవి మనిషి యొక్క ఉనికి కి ఓ extension లాంటివి. నా భాష, నా దేశం అనుకోవటం తో మనిషి తన వ్యక్తిగత ఉనికి ని దేశం దాకా విస్తరించుకొని, ఆ మేరకు empower అయినట్లు ఫీలవుతాడు.దేశ, ప్రాంత భావనల పరిధి లో మనిషి తన బ్రతుకు కు కొంత వరకూ అర్ధాన్ని కూడా వెతుకు కొంటాడు. ఏ దేశమూ, భాషా ప్రాంతమూ లేని వాడు faceless గానీ rootless గానీ అవుతాడు. దాని లో కొంత ఒంటరి తనం ఉంటుంది.

ఓ కుటుంబం లేక మనిషి అనేక ప్రదేశాలు మారుతున్నపుడు, అతని పిల్లల పై ఆ అస్థిరత్వం ప్రభావం ఎలా ఉంటుంది?  పిల్లల కు అనేక భాషల తో సంస్కృతుల తో భౌగోళిక విషయాలతో పరిచయం ఏర్పడుతుంది. దీనివలన  పిల్లలు, ముందు ముందు జీవితం లో మనుగడ(survival) కు సంబంధించిన విషయాలలో బలం గా ఉంటారు. పిల్లల cultural framework అనేది విశాలమౌతుంది. చిన్నపుడే అనేక వాతావరణాలు పరిచయమవ్వటం వలన, వాటిలో ఉండే కుదుపులకు పిల్లలు అలవాటవుతారు. సాంస్కృతిక విషయాలను పెద్దగా పట్టించుకోకుండా (అధిగమించి), తమ వ్యక్తి గత మనుగడ కి విలువనిచ్చే మనస్తత్వం వీరికి అలవడవచ్చు.

చిన్న పిల్ల మనసు తెల్ల కాగితం లా ఖాళీ గా(in cultural context) ఉంటుంది. కొత్త వాతావరణం లోని సాంస్కృతిక విషయాల తో ఘర్షించే అంశాలు పిల్లల మనసు లో తక్కువ గా ఉంటాయి. కాబట్టీ పిల్లలు సులువు గా ఇమిడి పోతారు.
కానీ అస్థిరత్వం వలన, పిల్లలు ఓ సంస్కృతితోనో, విలువల తో నో identify కారు. దీనివలన cultural loneliness ఫీలయ్యే అవకాశం ఉంటుంది (వారి లాగే uproot అయిన స్నేహితులు వారికి ఉంటే అప్పుడు వారంతా ఓ సమూహం గా ఏర్పడి దీనిని అధిగమించవచ్చు). మొత్తం మీద rootless, faceless అనే పదాలు జ్ఞప్తికి వస్తాయి. రాజీవ్ కనకాల కు జరిగి నట్లు, కొత్త బడికీ, కొత్త పాఠాలకీ అలవాటు పడలేక పోతే, వీరు చదువు లో వెనుక పడి, తద్వారా జీవితం లో వెనుక పడే అవకాశాలూ ఉంటాయి.ఇతర దేశాలలో శరీర వర్ణం గురించిన, జాతి వివక్ష ఉండనే ఉంది.
ఇప్పుడు స్థిరం గా ఓ ప్రదేశం లో పెరిగిన పిల్ల ల గురించి ఆలోచిద్దాం. వీరికి identityలేక world view విషయం లో ఎలాంటి క్లిష్ట పరిస్థితీ ఎదురు కాకపోవచ్చు. కానీ, మొదటి సారి వెరే కల్చర్ కి expose అయినపుడు, వీరికి సర్దుకోవటం కొంచెం కష్టమవుతుంది. అప్పుడు వారు తమ దృక్పధాన్ని విశాలం చేసుకోవటానికి కష్టపడాల్సి రావచ్చు.  అలానే, వారి ఆలోచనలు తమ స్థిత్వానికి సంబంధించిన విషయాల చుట్టూ ఎక్కువ వెచ్చించబడటం వలన, దానినుంచీ బయటపడి, వారు తమ వ్యక్తిగత మనుగడ గురించి చురుకు గా ఆలోచించే సరికి పుణ్య కాలం కాస్తా గడిచిపోవచ్చు.

పరిమితమైన పరిధి వలన, తమ సమర్ధత పై వీరికి false confidence ఏర్పడి, complacent గా తయారు కావచ్చు. తరువాత బయటి ప్రపంచానికి ఎక్స్-పోస్ అయినపుడు, తమ పరిమితులు తెలిసి, వీరి ఆత్మవిశ్వాసం సన్నగిలే ప్రమాదం ఉంది.

స్థిరత్వం లోని లాభాలు చాలా వరకూ భావోద్వేగ పరమైనవీ మానసికమైనవైతే, అస్థిరత్వం లోని లాభాలు మనుగడకి సంబంచించినవి.

ఇవండీ ఈ స్థిరత్వం గురించిన నా ఆలోచనలు. మన బ్లాగర్లలో చాల మంది ఒకటి రెండు తరాల నుంచే, స్థాన చలనాల తో పరిచయమున్న వారూ, అస్థిరత్వాన్ని ఎదుర్కొన్న వారూ ఉంటారు. బ్యాంకు ఉద్యోగాలూ, పోలీసు నౌకరీ ల లో ట్రాన్స్ఫర్లు సాధారణమే. అస్థిరత్వానికీ – స్థిరత్వానికీ, సంపాదనకీ – నిలకడైన ప్రశాంతతకీ, ప్రస్తుతానికీ- భవిష్యత్తుకీ మధ్య మనం పాటించాల్సిన సమతౌల్యం ఏమిటి?  జీవితం లో అస్థిరత్వం మంచిదా కాదా అనే విషయమై మీ అనుభవాలనూ, అభిప్రాయాలనూ పంచుకోండేం?

మగ వారి ఫిర్యాదులు..కొన్ని సరదాగా..కొన్ని నిజంగా..

ఈ ఫిర్యాదులు అందరి మగవారివీ కావండీ. నాలాంటి మధ్య తరగతి,లేక ఎగువ మధ్య తరగతి కుటుంబ రావులవీ, అందులోనూ పట్టణాలలో ఉండే వారివీ..

1.కుటుంబ రావు ఈ మధ్యే ఉద్యోగం మారాడు. హాఫ్ హ్యండ్స్ షర్ట్ వేసుకొని,మొదటి రోజు కొత్త గా మారిన ఆఫీసులోకి ఎంటరవబోయాడు. సెక్యూరిటీ వాడు కు.రా ని ఆపి “డ్రెస్ కోడ్ వయొలేషన్”, అని ఒక పుస్తకం లో కు.రా, చేత సంతకం చేయించాడు. కు. రా జీతం లోంచీ అప్పుడే కొంత కోత పడిపోయింది. పక్కనుంచే స్లీవ్-లెస్ లు వేసుకొన్న అమ్మాయిలు తమ లో తాము జోకులేసుకొంటూ నిరాటంకం గా ఆఫీసు లోకి వెళ్తున్నారు.

2.కుటుంబ రావు ని ఆఫీసులో బాసు పిలిచాడు. కుటుంబ రావు తో పాటు అతని సహోద్యోగిని అయిన వనిత ను కూడా పిలిచాడు.బాసు కి ఇద్దరి తోనూ పెద్ద చనువు లేదు. కుటుంబ రావు తో,” ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకూ వచ్చిందోయ్ కుటుంబ రావ్?”, అన్నాడు. అదే వనిత తో మాత్రం, “ఆ చెప్పండి “మేడం”, స్టేటస్ ఏమిటి?”, అన్నాడు. …మగ పురుషులారా, ఈ వివక్షని ఖండించండి. ఆడ స్త్రీలు కూడా ఖండిస్తే సంతోషిస్తాం.

3.కుటుంబ రావ్ సాయంత్రం ఇంటికి వచ్చి తెలుగు పేపర్ తిరగవేయటం మొదలుపెట్టాడు.”రేప్ చేసిన మగ పశువు”, హెడింగ్.
యాసిడ్ పోసిన, “మృగాడు”.  రాసిన రిపోర్టర్ మగాడే… పేరు..రామా రావు.
పేజీ తిప్పాడు కుటుంబ రావు. ఒకామె తన ప్రియుడి తో కలిసి తన భర్త ని హత మార్చింది. ఆమె పేరుని శోభా దేవి గానే రాశాడు సదరు రిపోర్టర్. “ఆడ *%$” అని రాయలేదు.

4.కు.రా కొడుకు యశ్వంత్ గదిలోంచీ బయట కి రావటం లేదు. కు.రా తెలుసుకొంటే తేలిందేమంటే,”వారం రోజుల కిందటి ఎంసెట్ సీట్ రాని షాక్ నుంచీ వాడింకా తేరుకోలేదు.” కు.రావు గది లోకి వెళ్ళి కొడుకు తో అన్నాడు, “ఎంసెట్ రాక పోతే ఎడ్-సెట్ రాద్దువు గాని లే!”.
దానికి వాడు,” కిందటి సంవత్సరం అక్క కి నాకంటే నాలుగు వేలు పైన నాసి రాంకు వచ్చింది.మరి అక్కకెందుకు సీట్ వచ్చింది?”.
కు.రా తన కి తెలిసి చదివించటం లో కూతురి పట్ల ఎన్నడూ వివక్ష చూపించలేదు.పై గా కురా కి సహజం గా తండ్రి కి కూతురి పట్ల ఉండే ప్రేమ ఎక్కువ.

5.కు.రావు స్నేహితుడి కూతురు కి అమెరికా సంబంధం కుదిరి, పెళ్ళయాక డిపెండెంట్ వీసా మీద టెక్సాస్ వెళ్ళిపోయింది. భర్త ఆఫీసు కి వెళ్తే, తను ఇండియా లో తల్లితండ్రుల తో ఫోన్ లో కబుర్లు చెబుతూ, ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేది.భర్త కి ఏదో ఓ మాదిరి కంపెనీ లో కాంట్రక్టర్ గా ఉద్యోగం. అక్కడికి వెళ్ళిన నెలరోజుల నుంచీ జంట మధ్య తేడాలు మొదలయ్యాయి. కు.రావు ఫ్రెండు వాళ్ళింటికెళ్ళినపుడు, ఫ్రెండూ భార్యా జరిగిన కథ చెప్పటం మొదలుపట్టారు.”ఆ అబ్బాయి ఒట్టి పీనాసి వాడండీ. రెస్టారెంట్ కి తీసుకెళ్ళడంట. ఇంట్లోనే వండమంటాడంట!”
“అమెరికా లో ప్రతి రోజూ రెస్టారెంటంటే చాలా ఖర్చవుతుంది అనుకొంటా..ఇంట్లో వండక తప్పదేమో!”, అన్నాడు సందేహం గా కు రావు.
“అమ్మాయికి వంట రాదు. కాలేజీ రోజుల్లో హాస్టల్లోనే ఉండేది. ఇంకా మా చిన్నూ గాడైనా చదువుకొనే తపుడు రూముల్లో ఉండి చెయ్యి కాల్చుకొన్నాడు, కానీ అమ్మాయికి అసలు అలవాటు లేదు. మా ఆవిడ కూడా దాని చేత ఎప్పుడూ వంట చేయించలేదు”, అన్నాడు కు.రా. మిత్రుడు.
కురా కి ఏమి సలహా ఇవాలో అర్ధం కాక ఉండిపోయాడు.

6.కురావు పక్కింటాయన బాల్కనీ లో కూర్చొని పేపర్ ముందేసుకొని ఆవేశం తో ఊగి పోతున్నాడు, ” ఈ జంతువులని ఉరి తీసేయాలి. వీళ్ళకి కోర్ట్లూ, విచారణా అనవసరం!”.
“మీరు ఢిల్లీ రేపిస్టుల గురించి ఆవేశపడుతున్నారనుకొంటా!?”, అన్నాడు, కు రా.
“అలాంటి వెధవలు లక్షల్లో ఒకరు ఉంటారు. ఇలాంటి దుస్సంఘటనలు జరిగినపుడల్లా మగవాళ్ళ కి వ్యతిరేకం గా వ్యవస్థీకృతమైన చట్టాల పదును పెంచుతూ పోతే, నా లాంటి అమాయకుల కి ముందు ముందు ఏమౌతుందో. ఓ రకం గా,టెర్రరిస్ట్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ అనే కర్ర తో ఇండియన్ ముస్లిం ల ని కొడుతున్నారు. అలానే హై ప్రొఫైల్ అత్యాచారాలు జరిగినపుడల్లా, వాటిని సాకు గా చూపించి ఇండియన్ మేల్ ని చట్టాలనే కర్ర తో కొడుతున్నారు.”, అనుకొన్నాడు కు.రావు.

7.కురావు కుర్రాడిగా ఉన్నపుడు గృహ హింస గురించీ, వరకంట్న చావు ల గురించీ పత్రిక ల కి వ్యాసాలు ఆవేశం గా రాసేవాడు. కానీ ఈ మధ్య కురావు అనుభవం లోనే ఆ రెండు చట్టాలూ దుర్వినియోగం మూడు సార్లు తటస్థించింది.ఒక కేసు లో బంధువు ల అబ్బాయి జెయిలుకి పోవలసి వస్తే, ఇంకో కేసు లో సహోద్యోగి ని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఆఫీస్ కే నేరు గా వచ్చారు. ఇంకో కేసు స్నేహితుడి బంధువుది. మూడు కేసులూ తప్పుడు కేసులేనని కు.రావు కి ఖచ్చితం గా తెలుసు. మూడు కేసులలోనూ డబ్బు గుంజటం అనేది ప్రధాన ఉద్దేశం. కురావు పేపరు చదవటం తగ్గించి, మారిన సమాజాన్ని అనుమానం గా చూడటం మొదలు పెట్టాదు.

8.కురావూ అతని భార్యా ఇద్దరూ ఉద్యోగస్తులే. కు.రావు భార్య, ఫెమినాలూ గట్రా చదివి ఈకెండు బయటే ఒటేళ్ళలో తిందామని మొరాయించింది. ఈక్-డేస్ ఎలానూ కర్రీ పాయింట్ల కర్రీల తో కడుపు చెడి పో ఉన్న కు.రా.,
తను కూడా మొరాయించాడు, “ఈకెండ్లలో డ్రైవింగ్ చేయననీ, వెచ్చాలు పట్రాననీ, బిల్లులు కట్టననీ”.
కొన్నాళ్ళ కి కురా భార్య కి వేరే ఊరు ట్రాన్స్-ఫర్ అయింది, కురా స్నేహితులు “పలానా మంత్రి గారిని కలవక పోయావా? ట్రాన్స్-ఫర్ ఆపుతారు.”, అని ఉచిత సలహాలు పారేయటం మొదలు పెట్టారు.
కురా,” ఎవరి ట్రాన్స్-ఫర్ వారే ఆపుకోవాలి”, అన్నాడు.
స్నేహితులు, “అదేమిటి? మగ వాళ్ళ పని ఆడ వాళ్ళు ఎలా చేస్తారు?”, అన్నారు.
“పనులలో ఆడ పనులనీ, మగ పనులనీ ఉండవు”, అన్నాడు కురా.

9. సిటీ లో పోష్ ఏరియాలో ఫ్రెండ్ తో కలిసి రోడ్డు పై నడుస్తూంటే, “పక్కనే ఓ యాభై యేళ్ళావిడ బట్టలు తక్కువ గానూ, లిప్-స్టిక్ ఎక్కువ గానూ నడుస్తోంది. కురా గుడ్లు మిటకరించి ఆమె వైపుకి చూశాడు. కురా ఫ్రెండ్, “అలా చూస్తావేమిటి? సంస్కారం లేకుండా!”, అన్నాడు.”
“సంస్కారం లేకుండా బట్టలు వేసుకొంటే లేదు గానీ, చూస్తే తప్పా!”, అన్నాడు కురా.

10.పిల్లలు బయటికి వెళ్ళిన సమయం చూసి, ఇంట్లో ఫ్యాషన్ టీవీ పెట్టాడు కురా. పక్క గది లో,చీరలూనగలూ,అప్పటికే ఎన్నో సార్లు మురిపెం గా ధరించి చూసుకొన్న తన నగలని బీరువా లో పెట్టి, హాల్ లోకి వచ్చింది కురా భార్య.
కురా ఫ్యాషన్ టీవీ చూడటం గమనించి, “చీ, చాలా వల్గర్ గా ఉంది, చానల్ మార్చు”, అంది కురా భార్య.
“ఇప్పటి దాకా నీకు ఇష్టమైన పని నీవు చేశావు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, తప్పేమిటి?”, అన్నాదు కురా.
“ఇంట్లో ఇలాంటివి చేస్తారా ఎక్కడైనా?” అందామె.
“ఎవరికి నచ్చింది వారు  చేయకూడదంటే, ఇంటి విలువలలోనే పక్షపాతముందన్న మాట!”, అన్నాడు కురా.

11.  కురా కంటే అతని భార్యకే జీతం ఎక్కువ వస్తుంది. వారికి ఏ ఇతర ఆస్తులూ పెద్ద గా లేవు.ఓ సుముహూర్తాన కురా ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచీ భార్యాభర్త ల మధ్య కీచులాటలు ఎక్కువయాయి. అప్పటిదాకా కురా ఫ్యామిలీ కోసం పెట్టిన ఖర్చును తను పెట్టటానికి కురా భార్య నిరాకరించింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు, ఇరువురూ విడాకుల వైపుకి ఆలోచించటం మొదలుపట్టారు. ఈలోపు కురా మళ్ళీ ఓ చిన్న ఉద్యోగం లో మునుపటి కంటే బాగా తక్కువ జీతానికి కుదురుకొన్నాడు.విడాకుల గురించి కురా ఓ లాయర్ ని సంప్రదిస్తే, “భార్య కి భరణం ఎంత ఇవ్వాలో చెప్పాడు”, లాయర్. “ఓరి నాయనా, మూలిగే నక్క మీద తాటి పండు పడింది!”

12. కురా కొడుకు కి ఓ గర్ల్-ఫ్రెండ్ ఉంది. ఆమె వాడిని చేతుల తో సున్నితం గా కొడుతూ మురిపెం గా, “స్టుపిడ్”, అని పిలుస్తుంది. ఓ రోజు వాళ్ళిద్దరూ పోట్లాడుకొన్నారు. అదేసమయం లో వాడి మగ ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. వారి లో ఒకడు, “ఏంట్రా మూడ్ బాగున్నట్లు లేదు, నిన్ను మళ్ళీ మూడ్లోకి తెస్తా చూడు!”, అని ఓ “Off the color jOke”, చెప్పాడు. కొంచెం దూరం లో ఉండి ఆ జోక్ విన్న ఉన్న వాడి గర్ల్-ఫ్రెండ్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేసింది, “వాడూ వాడి , మిత్ర బృందం తనను హరాస్ చేస్తున్నారని”. ప్రిన్సిపాల్ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేశాడు.

13.కురా అక్క కొడుకు ఈ మధ్యే పెళ్ళి అయింది.అతనూ, అతని భార్య ఫామిలీ ప్లానింగ్ కొంతకాలం పాటించి తరువాత పిల్లలను కనాలని నిర్ణయించుకొన్నారు. అతని భార్య కి మూడో నెల ఉన్నపుడు అతని తో గొడవ పడింది. తరువాత అతని తో చెప్పకుండా అబార్షన్ చేయించుకొంది.అతని బాధ కి అవధులు లేవు. తాళాలు ఎవరి దగ్గర ఉంటే వారే గదిని మూస్తారు. గర్భధారణ ప్రకృతి ఇచ్చిన ఓ కష్టమైన విషయమైనా, ఆధునిక వైద్యం వలన అది ఓ ఆడవారికే పరిమితమైన హక్కుగా మారింది.

మనలో దాగున్న రేపిస్ట్

నాకు ఓ ఐదేళ్ళ వయసున్నపుడు, ఓ పల్లెటూరి సినిమా హాలు కి వెళ్ళే వాడిని. సినిమా లో, ఏ గిరిబాబో, సత్యనారాయణో హీరో గారి చెల్లిని రేప్ చెసే వాళ్ళు. రేప్ మొదలవ్వగానే హాల్ అంతా ఈలల తో మారు మోగేది. నాకు ఆ వయసు లో, జనాలు ఎందుకు ఈలలు వేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. పాపం విలన్ హీరోయిన్ ని ఆ విధం గా హింసిస్తుంటే, ఈలలు వేసే జనాల మీద కోపం వచ్చేది. అదే జనం,  క్లైమాక్స్ లో విలన్ ని హీరో గారు చితక కొడుతుంటే కూడా ఈలలు వేసే వారు.
సెక్స్ కి ముఖం వాచిన జనాలు అలా చేసే వారా?
ఇంకో సంఘటన. ఓ ఐదేళ్ళ తరువాత ఏదో పట్నం నుంచీ వచ్చిన ఒకావిడ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని వెళ్తోంది. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఆమె శీలం మీద కామెంట్ చేశారు. కానీ వారికి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం తెలియదు.ఆ సమాజం లో అలాంటి జాకెట్ మామూలు ఆడవారు వేసుకోవక పోవటం వలన ఆ కామెంట్ వచ్చిందా?
ఓ ఇరవై యేళ్ళ కిందట మన సమాజం లో వయసొచ్చిన ఆడ  మగ మధ్య స్నేహాలు ఉండేవి కావు. ఇప్పటికీ పల్లెలలో వారికి ఆడ మగా మధ్య “ప్రణయ సంబంధం కాని స్నేహమంటే”, ఏమిటో తెలియదు. వారికి అటువంటి స్నేహం గురించి వివరిస్తే intellectual గా అర్ధం చేసుకోగలరేమో , కానీ అటువంటి స్నేహం లోని భావోద్వేగాల కు వారు relate చేసుకోలేరు. అది వారి తప్పు కాదు.

ఆడ మగా మధ్య interaction తక్కువ గా ఉండటం, ఇంట్లో ఆడ వారు తక్కువ గా ఉండటం వంటి కారణాల వలన, మగ వాళ్ళ కు ఆడ వారి ఆలోచనలూ, భావోద్వేగాలూ తక్కువ గా తెలిసి, ఆడ వారిని సెక్స్ పరం గా objectify చేయటం జరుగుతుంది. మన సినిమాలు కూడా ఒక ఆడ మగా మధ్య సంబంధం లో ఉండే, “పరిచయం, స్నేహం, భావోద్వేగ సంబంధాలూ” మొదలైన స్థాయి లను వదిలి, నేరు గా తడి చీరల పాటలను చూపెట్టటం వలన, ఆడవారిని objectify చేయటం మరింత పెరుగుతుంది.

మిస్సమ్మ సినిమా కాలం నుంచీ కూడా హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. “ఆడ వారి మాటల కి అర్ధాలే వేరులే!”, అంటాడు. పాత కాలం లో స్త్రీల కి స్వాతంత్ర్యం లేనపుడు, మనసు లోని మాట పై కి నేరు గా వ్యక్తీకరించే వారు కాదేమో! కానీ నేడు ఓ ఆడ పిల్ల, “నో” అన్నదంటే, “కాదనే” అర్ధం. ఈ విషయాన్ని wishful thinking చేసే మగవాళ్ళ కు అర్ధమయ్యేలా చెప్పాలి.
రేప్ అనేది learned behavior అని ఈ మధ్య హిందూ లొ వచ్చిన ఈ ఆర్టికల్ చెప్తుంది:
http://www.thehindu.com/opinion/lead/the-danger-to-women-lurks-within-us/article4242142.ece?homepage=true

ఇది చాలా వరకూ కరక్ట్ కూడా. నేర్చుకొన్న ప్రవర్తనను సరిగ్గా educate చేయటం ద్వారా మార్చ వచ్చు. కానీ కొంతవరకూ రేప్ అనేది బయలాజికల్ గా సంక్రమించిన రోగం కూడా. అనేక జంతువులు రేప్ చేస్తాయి. అలానే కొందరి జీన్స్ లో హింసా, సెక్స్ ఎక్కువ గా ఉంటాయి. అలా అని రేప్ పాపం అలాంటి వారికి అంటకుండా పోదు. తాను బలవంతుడనని పక్క వాడిని కొడితే జైల్లో పెడతారు కదా!

మన దేశం లో “ఆడ మగా మధ్య interaction లేక పోవటం” రేప్ కి ఓ కారణం అయితే(మన దేశం లో ఆడపిల్లల తో మాట్లడ గలిగే సోషల్ స్కిల్ల్స్ ఉన్న మగ వాళ్ళు రేప్ కు తెగబడే అవకాశం తక్కువ), అమెరికా లాంటి దేశాలలో ఈ interaction ఎక్కువై, లవ్ లో రిజెక్ట్ కా బడ్డ వారు కూడా స్త్రీ ద్వేషులు గా మారి రేప్ లు చేస్తున్నారు. బూతు సినిమాలు చూసే వారి వలన కూడా రేప్ లు ఎక్కువవ్తాయని పాశ్చాత్య దేశాలలోని సర్వే లు బయటపెట్టాయి.ఏదేమైనా, ఈ విషయం లో సరైన ప్రవర్తన ఏమిటి (ఆడ మగా ఇరు వైపుల నుండీ) అనేదానికి విస్తృతమైన ప్రచారం కలిపించవలసిన అవసరం ఉంది. అలానే మీడియా, సినిమాలు ప్రచారం చేసే sexist myths లోని డొల్ల తనాన్ని బయట పెట్టాలి.

ఓ మగ వాడు, ఆడ వాళ్ళకి రేప్ గురించి జాగ్రత్తలు చెప్పటం లో ఓ ప్రమాదం ఉంది. ఆడ వారు ముందే అతని ఉద్దేశాలను అనుమానిస్తారు. నమ్మకం లేని చోట మంచి చెప్పినా చెడు అవుతుంది.అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.బహుశా అలాతప్పుపట్టటం, “తమ లో అంతర్లీనం గా ఉండే instincts ను రేపిస్టుల instincts తో ఇడెంటిఫై చేసుకోవటం వలన కూడా అవ్వవచ్చును”. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే విషయం లో మగ వారి స్వరం, ఆడ వారి శ్రేయోభిలాషులు గా ఉంటే పరవాలేదు. “నే చెప్పింది విన్నారా? ఇప్పుడు అనుభవించండి”, అనే విధం గా ఉన్నపుడే సమస్య. రేప్ జరిగిన పరిస్థితుల కి అతీతం గా రేప్ శిక్షార్హమే! అందులో సందేహం లేదు. అయితే రేప్ కి మరణ శిక్ష వేయాలా వద్దా అనేది, అనేక పరిస్థితులనూ, మోటివ్స్ నీ పరిగణన లోకి తీసుకొని నిర్ణయించాలి.
రోడ్ మీద పోయే జనాలలో అన్ని రకాల వారూ ఉంటారు. అందులో మూర్ఖులు ఓ రకం. యువత డేటింగ్ చేయవచ్చు. కానీ public display of affection ని తగ్గించటం మంచిది. ఏ పల్లెటూరి బైతో, “అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చూపించే playful behavior ని తన పై ఎందుకు చూపించదు?”, అనుకోవచ్చు. ఏ కరడు గట్టిన సాంప్రదాయ వాదికో వారి ప్రవర్తన చూసి ఒళ్ళు మండ వచ్చు. వారిలో ని విలువలు వారి లోని జంతుప్రవృత్తి  ని నియంత్రించినంత వరకూ పరవా లేదు. అలా కాకపోతే నే సమస్య. చేసే వెధవ పనుల పర్యవసానాన్ని గురించీ, చట్టమూ శిక్షల గురించీ ఆలోచించని మగవాళ్ళు చాలా మందే ఉంటారు. అందని ద్రాక్షల మీద కసి పెంచుకొనే వారు చాలామందే ఉంటారు. కసి అంటే గుర్తుకొచ్చింది, తెలుగు రొమాంటిక్ పాటలలో ఈ పదం చాలానే ఉపయోగిస్తారు. కానీ కసి అనే పదం లో హింస అనేది కూడా ఉందని ఆయా రచయితలకి తట్టిందో లేదో!

రేప్ ఎంత ఆటవికమో, జనాలు గుంపులు గుంపులు గా రోడ్ పైకి వచ్చి, రేపిస్టులని విచారణ లేకుండా ఉరి తీయాలనటం కూడా అంత ఆటవికమే. శిక్షించటానికి నిపుణులు ఉన్న న్యాయవ్యవస్థ ఉంది.వారే అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఈ విషయం లో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్య సరైనదైతే, ఆయన కొడుకు చేసిన వ్యాఖ్య దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ప్రజల ఆందోళన చాలా వరకూ సమర్ధించతగ్గదే! అలా అని ఆందోళన కారులంతా holy cows కాదు.తమ లోని అరాచకాత్వాన్ని బయట పెట్టటానికి ఈ సంఘటనను ఓ సాకు గా ఉపయోగించుకొనే వారూ, vested interests, భోగస్ స్త్రీ వాదులు,సమస్య ల కోసం కాసుకొని కూర్చునే వామ పక్ష వాదులూ కూడా ఉండవచ్చు. ఏదేమైనా, ఈ ఆందోళనల వలన ప్రభుత్వమూ, అది నియమించిన కమీషన్ సరైన ప్రతిపాదనల తో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

ఢిల్లీ ఘాతుకం లో మరణించిన ఆ యువతి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

బురదగుంట – రేప్ ప్రపంచం..

ఢిల్లీ రేప్ సంఘటన సమాజం లో కావలసిన కదలికనే తెచ్చింది. రేపిస్టులను శిక్షించాల్సిందే. బురదగుంటలొంచీ దోమ వచ్చి కుడితే వెంటనే చంపేస్తాం కదా! అయితే ఆ సంఘటన గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా, రాజకీయ ప్రముఖులను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.
ఆ బురద గుంత ఏర్పడటానికి ఓ ముఖ్య కారణమే ఈ మీడియా, సామాజిక ప్రముఖులు. రేప్ కి సంబంధించిన behavior patterns సమాజం లొ బలపడటానికి ఈ ప్రముఖులు కూడా ఓ కారణం.
ఈ బురద గుంట కి ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది?

తెలుగు లో “ఓలమ్మీ తిమ్మిరెక్కిందా? అని హీరోయిన్ పిల్ల పిర్ర మీద ఓటిచ్చినపుడు” దానితో మొదలైందేమో!

లేకపోతే,”లే లే లే..నా రాజా!” తో మొదలైందేమో! లేక ఇంకా ముందే మొదలైందేమో! నాకు తెలియదు.
“ఓ సీన్ లో ఆకతాయిల కు క్లాస్ పీకి, మరో ఐదు నిమిషాలలో హీరో గారు బూతు పాటలు పాడినపుడు”, ఈ బురద గుంట కంపు అందరికీ అలవాటైపోయి, వాసన గుర్తు తెలీటం లేదని తెలిసింది.
“హీరోయిన్ ని సినిమా మొత్తం, రేప్ చేయటం మినహా, అన్నిరకాల వేధింపులూ చేసిన హీరో గారు”, మాస్ రాజా అయినపుడు, ఈ గుంటకి జనామోదం కూడా లభించిందని తెలిసింది.

సినిమా ఫంక్షన్లలో,”అర్ధ నగ్న ఐటం డాన్సర్ చుట్టూ, పది మంది మగ డాన్సర్లు చొంగ కారుస్తుంటే”, వేదిక కింద కూర్చొన్న హీరో గారు నిర్వికారం గా చప్పట్లు కొడితే తెలిసింది, “మురుగు గుంట ఓ అభినందించవలసిన విషయం” అని

“సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు”, అని ఓ డైరెక్టర్ గారు బుకాయిస్తూంటే తెలిసింది, మురికి గుంట చాలా నిరపాయకరం అని. 

“దిగి దిగు నాగా..” వంటి పాటలు ప్రొడ్యూస్ చేసిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ద్లు లభించినపుడు, ఈ మురికి గుంటకి మానసరోవరం గా అధికారిక శాంక్షన్ కూడా వచ్చేసింది.

ముందు పేజీలలో తాము ఎడమపక్క పత్రికలమని కోడై కూసే పత్రికలు, వెనుక పేజీలలో సీ గ్రేడ్ సినిమా యాడ్స్ వేసుకొన్నపుడు, మురికి గుంట కంపు పూదోట కంపుని మింగేసింది.

మెరుగైన సమాజం కోసం పాటుపడే చానళ్ళు, బూతు సినిమాల పై ప్రత్యేక కార్య క్రమాలను ప్రసారం చేసినపుడు, మెరుగైన సమాజం బురద గుంట ఉండగానే వస్తుందని తెలిసింది.

“బూతుసినిమాలూ, సైట్లూ సాధారణమని”, డోకు భాష తార పిల్ల చెప్పినపుడు, “ఓ, మురికి వాసన చూసినపుడు, వమనం చేసికోకూడదని”, తెలిసింది.

రాష్ట్ర స్థాయి నాయకుడు అధినేత్రి మైకం లో, “ఇదో చిన్నవిషయం” అన్నప్పుడు, కొన్నాళ్ళకి మురికి గుంటలో పొర్లిన వాడే నాయకత్వానికి అర్హుడేమో అన్న సందేహం వచ్చింది. అప్పుడు “అదో పెద్ద విషయం” అవుతుంది.

ఊళ్ళోని పెద్ద పెద్ద ఇళ్ళలోంచీ డబ్బు అనే పిల్ల కాలువల ద్వారా ఈ మురుగు గుంట నింపబడుతోంది. జీవిక కోసం ఈ పిల్ల కాలువలను నిర్వహించే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మందిమి చేస్తాం. జీవిక కోసం మనం మౌనం గా ఉంటాం. ఈ మురికి గుంటని పూడ్చి వేయాలని గట్టి గా అడగం. అడిగితే మన జీవిక పోతుంది.

కాబట్టీ ప్రముఖులారా, ధర్మాగ్రహం వ్యక్తం చేయకండి. మీరిచ్చే వినోదం వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ని సెలబ్రేట్ చేసుకోండి.

వాల్ మార్ట్ – సాంకేతిక పరిజ్ఞానం (Technology) – ఉత్పాదకత (productivity) – ప్రయోజనం (Utility) : ఒక పరిశీలన

వాల్-మార్ట్ వలన ఉత్పాదకత (productivity, efficiency) పెరిగి వినియోగదారుడూ, ఉత్పత్తిదారులూ (రైతులూ, పారిశ్రామికులూ) లాభపడతారంటున్నారు. సప్లై చెయిన్ లోని లంకెలు తగ్గిపోయి ధరలు తగ్గుతాయంటున్నారు. గోదాములూ, శీతల గిడ్డంగులూ వచ్చి సంపద ఆదా అవుతుందంటున్నారు.
నాకు ఇండియా లో వాల్ మార్ట్ ప్రవేశం గురించి వ్యతిరేకత లేదు, అనుకూలతా లేదు. ఓపెన్ మైండ్ తో దీని గురించి ఆలోచిద్దామనుకొని, మొదలుపెట్టాను. FDI లూ వాల్-మార్ట్ లూ కొంచెం క్లిష్టమైన విషయాలు కాబట్టీ, నా బుర్ర కి అందేలా ఓ చిన్న ఉదాహరణ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను.

అనగనగా ఓ చిన్న పల్లెటూళ్ళో  ఒకే ఒక భూస్వా మి ఉన్నాడనుకొందాం. అతనికి ఓ ఇరవై యెకరాల వరి పొలం ఉంది అనుకొందాం. అంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం పొలం ఇరవై ఎకరాలు మాత్రమే! ఆ ఊళ్ళోనే ఓ ఇరవై మంది కూలీలు ఉన్నారని కూడా అనుకొందాం. ఆ ఇరవై కూలీల కూ ఈ ఆసామి పొలం లో పంట  కోస్తే తలొక వెయ్య రూపాయలూ గిడతాయనుకొందాం.  మొత్తానికి ఆసామికి ఓ నాలుగు వందల బస్తాల పంట చేతికి వచ్చింది.  కూలీలకు ఆసామి మొత్తం మీద ఇరవై వేలు చెల్లించవలసి వచ్చింది.
ఓ సంవత్సరం ఆసామీ వరికోత యంత్రాన్ని వాడాలని నిశ్చయించుకొన్నాడు.  ఎందుకంటే ఆ యంత్రం ఎనిమిది వేల బాడుగ లో పంట మొత్తాన్నీ కోసేస్తుంది.  ఆ యంత్రాన్ని నడిపిన వ్యక్తికి ఓ రెండు వేలు ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం ఖర్చు పది వేలు. ఇంటికి 400 బస్తాలూ చేరాయి.
ఈ ఉదాహరణ లో ఉత్పాదకత పెరిగిందా? ఆసామి కి చివరికి వచ్చింది 400 బస్తాలే. కానీ ఖర్చు తగ్గి పది వేలు ఆదా అయింది. దీనిని ఉత్పాదకత అనరు. ఆసామి ఇంటికి ఓ 500 బస్తాల ధాన్యం వస్తే దానిని ఉత్పదకత అంటారు. ఆసామి మెషిన్ వాడటం వలన తనకు మిగిలిన పది వేల తో ఆసామి భార్యకి ఏ చెవి పోగులో చేయిస్తాడు.
ఊరి మొత్తానికి కొత్త టెక్నాలజీ వలన వచ్చిన ప్రయోజనం(utility) ఏమిటి? ఇరవై ఉద్యోగాలు పోయాయి. ఒక ఉద్యోగం వచ్చింది ( మెషిన్ డ్రైవర్ ఉద్యోగం). మెషిన్ డ్రైవర్ కి ఎక్కువ జీతం దక్కింది….సంతోషించవలసిన విషయమే..కొన్నాళ్ళకి ఊళ్ళో కూలీలందరూ మెషిన్ ని తోలటం నేర్చుకొన్నారు. కానీ ఊళ్ళొ ఉంది ఒకే ఆసామీ, ఇరవై ఎకరాల పొలం మాత్రమే! మెషిన్ తోలటానికి ఒకడు చాలు.  మెషిన్ తోలటానికి ఇరవై మందీ పోటీ పడితే, ఆసామీ బేరం చేసి  జీతం తగ్గించి దానిని వెయ్యికి కుదించాడు.(ఇదే లాజిక్ ఐటీ రంగానికి కూడా వర్తిస్తుంది. అందరూ కంప్యూటర్లు నేర్చుకొంటే, లేబర్ సప్లై పెరిగి జీతాలు కొన్నాళ్ళకి గుమాస్తా జీతాల స్థాయికి చేరుతాయి.) అంటే జీతం మళ్ళీ మొదటి, తలా ఒక కూలీ కి ఎంత వచ్చిందో అంతే అయ్యింది. ఈ లోపు ద్రవ్యోల్బణం వలన ఆ వెయ్యి రూపాయలకీ వచ్చే సరుకులు కూడా తగ్గిపోయాయి.
అంటే ఊళ్ళో ఉన్న జనాలు మెషిన్ తోలటం నేర్చుకొని (చదువుకొని) కూడా ఉద్యోగాలు లేకుండా తయారయారు. ఉద్యోగం ఉన్న వాడి జీతం తగ్గి, దాని విలువ పడిపోయింది. ఇక్కడ టెక్నాలజీ వలన ఉత్పాదకత ఏమీ పెరగలేదు.మెషిన్ వచ్చాక కూడా 400 బస్తాలే పండాయి. టెక్నాలజీ సహజ వనరులైన ముడి సరుకుల (పొలం లోని పంట) ని వేగం గా సంపద (ధాన్యం) గా మార్చటం లో తోడ్పడటం మాత్రమే  చేసింది. సెమీకండక్టర్, బయో టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి రంగాలలో టెక్నాలజీ నే ప్రధానం. టెక్నాలజీ ఇసుక నుంచీ సెమీకండక్టర్ చిప్స్ ని తయారు చేస్తుంది.ఇక్కడ టెక్నాలజీ లేక పోతే ముడి సరుకైన ఇసుక కి విలువే లేదు.ఉత్పాదన అంతా టెక్నాలజీ వలననే జరుగుతుంది. అలానే, బయోటెక్నాలజీ పంట ని 400 బస్తాల నుంచీ, 600 బస్తాలకు చేరుస్తుంది. (ఉత్పాదకత పెరగటం వలన ధరలు తగ్గుతాయి. కానీ దీనికీ, ఇన్-పుట్ కాస్ట్ తగ్గించి దిగకొట్టబడిన ధరలకీ వ్యత్యాసం చాలా ఉంటుంది.సమాజం పై వాటి ప్రభావం భిన్నం గా ఉంటుంది. ) కానీ, వాల్-మార్ట్ వంటి కంపెనీలు తెచ్చే టెక్నాలజీ వలన ఉత్పాదకత కానీ, ప్రయోజనం కానీ పెరగదు. ఆ సంస్థ,  కొందరు వినియోగదారులకు ఖర్చులను తగ్గించి, తద్వారా తన అదాయాన్ని కూడా పెంచుకొంటుంది.    ఈ ఆదాయం,  తగ్గిన “దళారుల మధ్యవర్తుల, ప్రమేయం”, వలన వచ్చినది. అంటే మధ్యవర్తుల ను బయటికి నెట్టటం ద్వారా ఖర్చు తగ్గించుకొని , తద్వారా లాభ పడి, అందులో కొంత వినియోగ దారులకి విదిలించి, మిగిలిన ఆదాయాన్ని తన దేశానికి తరలించుకుపోతోంది . మొత్తం గా మన సంపద మన దేశం దాటి పోతోంది.

కానీ టెక్నాలజీ ఆధారితమైన ప్రొడక్ట్ కంపెనీ ల వలన  సంపద పెరిగి , ఉత్పాదకత పెరుగుతుంది. వాల్ మార్ట్ వంటి బడా మార్వాడీ బాబుల వలన కాదు.